30, మే 2020, శనివారం

నా జీవితాన్ని ప్రభావితం చేసిన ఒక ప్రయాణం

ముందు మాట - 'ఎవడే  సుబ్రహ్మణ్యం' సినిమాలాంటి ఆత్మ శోథన వగైరా అనుభవాలైతేలేవు ఇందులో. 
---
అవి 2003లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, వారానికి ఒకసారి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్లి వివిధ కంపెనీల వెబ్సైట్లకి రెజ్యుమే  ఎక్కించి, వాడు రాత పరీక్షకి  పిలుస్తారేమో అని ఎదురు చూస్తున్న రోజులు.  నాకు ఇష్టం లేకున్నా బ్యాంకు ఉద్యోగం విరమణ చేసిన నాన్నగారికోసం ఒక జాతీయ బ్యాంకుకి కూడా అప్లై చేశాను.
మూడు-నాలుగు నెలలు ఎదురుచూసినా  పిలుపులు లేకపోవడంతో,  ఒక ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగంకి వెళ్ళితే ఎదురైన ఒక చేదు అనుభవంతో  (అది కూడా ఈ  ప్రశ్నకి జవాబుగా వ్రాయవచ్చు, గానీ  ఇపుడు వ్రాసేది ఇంకా పెద్ద అనుభవం) ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని   - విజయవాడలో మా అన్నయ హౌస్-సర్జన్ చేస్తుంటే వాళ్ల  గదిలోకి మారి  అక్కడ గేట్ కోచింగుకి చేరాను. 

అలా రోజూ  కోచింగు క్లాసులకి వెళుతూ అలవాటు పడుతుండగా ఎప్పుడో అప్లై చేసిన ఆ జాతీయ బ్యాంకు  రాత పరీక్ష వచ్చే వారమే  చెన్నైలో అని ఉత్తరం వచ్చింది. నాకు బ్యాంకు ఉద్యోగం చేయాలని లేదు. పైగా క్లాసులు పోతాయి. కానీ అన్నయ-నాన్న ఊరికే ఒక అనుభవం వస్తుంది వెళ్ళిరా అన్నారు.  ఇద్దరికీ నాకు తోడు రావడానికి కుదరలేదు. అయినా అప్పటికే నేను కొన్ని ఒంటరి ప్రయాణాలు  చేసి ఉన్నాను, కానీ రాష్ట్రం దాటి ఒంటరిగా వెళ్ళలేదు ఎప్పుడూ. 

సరేనని ఒక బ్యాగు పట్టుకొని పరీక్ష  ముందురోజు పొద్దున్నే ఐదింటికి సిటీబస్ ఎక్కి రైల్వేస్టేషనుకి వెళ్ళాను. ఆరింటికి పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కాను.  ఏడు  గంటలు ఒంటరి ప్రయాణం చేసి చెన్నై సెంట్రల్ లో దిగాను. తెలుగు-తమిళం (అప్పటికి నాకు ఒక స్కూలు మిత్రుడి చలవతో తమిళ లిపి  చదవడం వచ్చు, చూసిన  సినిమాల ప్రభావంతో కొంచెం అర్థం అవుతుంది )  కలిపి వారినీ -వీరినీ  అడిగి పరీక్షా కేంద్రమున్న తేయనంపేటకి బస్సు కనుక్కొని ఎక్కాను.  అక్కడి దిగి నెమ్మదిగా వెతుక్కుంటూ ఒక అరగంట నడచి వెళ్లి పరీక్షాకేంద్రం పట్టుకున్నా.  అప్పుడు ఆకలి మొదలయింది  పొద్దున్న అయిదింటి నుండి తిరుగుతున్నా కదా.

ఏమన్నా  తిందామని చూస్తే ఒక్క మెస్-టిఫిన్ సెంటర్ లాంటిది కనిపించట్లేదు. మొత్తం పోష్ ఏరియా . మన బంజారా హిల్స్  నయమనిపించింది. ఆలా వెతకగా ఎప్పుడో మూడున్నరకి ఒక చిన్న రోడ్ సైడ్  స్టాల్ కనిపించింది. అక్కడ తిన్నాక వారినే అడిగాను దగ్గరలో లాడ్జి లాంటివి ఉన్నాయేమో అని అడిగాను. (ఇవన్నీ మొబైల్ , గూగుల్ మ్యాప్స్ లేని రోజులు). టీ నగర్ వెళ్లామన్నారు. ఒకటో రెండో  కిమీలు  నడిచి టీ  నగర్ లో ఒక లాడ్జి పట్టుకున్నాను. 
 
క్రింద డబ్బులు కట్టి పైకి వెళ్లి చూసితె సినిమాకనిపించింది. అక్కడ గదులు లేవు. ప్లైవుడ్ తో పార్టిషన్లు. ఒక్క దానిలో ఒకటే మంచం పట్టేంత స్థలం. కామన్ బాత్రూమ్.  సరే ఒక్క రాత్రికే కదాని అనుకున్నా. స్నానం  చేసి ఏమన్నా  తిందామని రోడ్డుపైకి వెళ్ళాను . 

అది దీపావళి ముందు వీకెండ్. తమిళులకు ముఖ్య పండగ కాబట్టి టీ  నగర్ షాపింగ్ సెంటర్ కాబట్టి కిటకిటలాడుతోంది. చిన్నప్పుడు  కలకత్తా - చెన్నై వెళ్ళినపుడు జనాలని  చూసినా -  అంత మంది జనం ఒక సముద్రంలో ఎప్పుడూ  చూడలేదు  -  ఎంతైనా మహానగరంకదా - తరువాత ఢిల్లీ, న్యూయార్క్, హైదరాబాదు చార్మినారులో చూసాను. 

అప్పుడు నా  మనస్సు నిండా చాలా  ఆలోచనలు. ఈ ప్రపంచంలో, ఈ జనసంద్రంలో నేనేంటి, నేను ఏమి సాధించాలి, ఆ షాపింగులో అన్ని మత, ఆర్థిక వర్గాల కుటుంబాలు చూసి నా  జీవితం గురించి . అయినా అప్పటికే నేను "లోన్ థింకర్"ని - ఈ ఆలోచనలు ఎప్పుడూ ఉండేవే, కాకపోతే ఆ రోజు కొంచెం ఎక్కువైనాయి. 

ఒక ఎస్టీడీ బూత్  చూసుకొని, ఇంటికి ఫోన్ చేసి చెప్పాను  - చేరాను, రూము తీసుకున్నానని.  ఒక దోశ  తిని రూముకి (అదే తడికలు) వచ్చాను. అక్కడ ఒంటరిగా ఉంటున్న చిరుద్యోగులని చూసాక చాలా ఆలోచనలు మళ్ళీ . 

మరుసటి రోజు పొద్దున్నే తయారయి, మళ్ళీ  రెండు కిమీలు  నడిచి పరీక్షా కేంద్రం చేరుకున్నా. అక్కడ కొందరు తెలుగువారు పరిచయం అయ్యారు. వారంతా డిగ్రీ-పీజీవారు . నేను ఇంజనీరింగ్ అని చెప్పా. బీటెక్ లు కూడా మాకు పోటీ వస్తే ఎలాగండి అని దాదాపు గొడవ పెట్టుకున్నారు. ఇది 2003లో, ఇప్పటిలా అందరూ  పీఓలు అయ్యే రోజులు కావు. 

పరీక్ష వ్రాసి, రూముకి వచ్చి ఖాళీచేసి మళ్ళీ  సిటీబస్సు ఎక్కి చెన్నై సెంట్రల్ కి వెళ్ళాను. అక్కడ, గుంటూరు వెళ్లే హైదరాబాద్ ఎక్స్ప్రెస్ నాలుగు గంటలకి. టిఫిన్ చేసి, టిక్కెట్ కొనుక్కొని ప్లాట్ఫారంకి చేరాను. ఒక పోర్ట్రర్ వచ్చి సీటు కావాలా (జనరల్ బోగీలో) , 50రూ  ఇవ్వమన్నాడు.  వద్దని చెప్పా. రైలు రాగానే 3-4 పోర్తర్లు రన్నింగులో ఎక్కి పత్రికలతో సీట్లు ఆపారు. నేను ఎక్కి, వాడితో గొడవ పెట్టుకొని, వాడి పేపరు పక్కన పడేసి కూర్చున్నా. 

రాత్రి ఒంటిగంటకు గుంటూరులో దిగి, ఇంటికి నడుచుంటూ వెళ్ళాను . 
అదండీ, నా జీవితాన్ని ప్రభావం చేసిన ప్రయాణం.  అంతకు ముందూ , ఆ తరువాతా చాలా  ఒంటరి, ఛాలెంజింగ్ ప్రయాణాలు చేశానుగానీ, ఈ ప్రయాణం ముందు అన్నీ దిగదుడుపే . 

పీ.ఎస్. : ఆ పరీక్షలో గెలిచి, ఫిబ్రవరి 2004లో గేట్  వ్రాసిన వారం  రోజులకి బెంగుళూరులో ఒక 6-7 మంది ప్యానెల్ ముందు ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేశాను (ఆ అనుభవం ఇంకో ప్రశ్నకి జవాబుగా వ్రాస్తాను) . అప్పటికి అదృష్టం కలిసి రావడమో, ఐటీ  పరిస్థితి మెరుగవ్వడమో, ఒక ప్రముఖ ఐటీ  సంస్థనుండి రాత  పరీక్షకి పిలుపు వచ్చింది. అదీ , ముఖ పరీక్ష పూర్తి చేసాను.  గేట్ లో ర్యాన్కు వచ్చింది . 
ఏప్రియల్ 2004లో నా ముందు మూడు  దారులు ఉన్నాయి.  ఐటీ  సంస్థలో ఉద్యోగం, బ్యాంకు పీఓ ఉద్యోగం, 2-3 ఐఐటీ ఇంటర్వ్యూ పిలుపులు. వెళ్లి ఐటీ  సంస్థలో చేరి, అక్కడనే అదే సంస్థలో 16 సంవత్సరాలుగా పని చేస్తున్నా.