16, జూన్ 2020, మంగళవారం

హంపీ యాత్ర - పాత జ్ఞాపకాలు

చిన్నప్పుడు అమ్మా-నాన్నలతో నగరాలు-పల్లెటుళ్ళు-తీర్ధయాత్రలు చాలా తిరిగాను. అలాగే నా ఉద్యోగంలో భాగంగా దేశంలోని విభిన్న నగరాలు, అమెరికా వెళ్ళినప్పుడు అక్కడి ముఖ్య ప్రదేశాలు బాగానే తిరిగాను. స్నేహితులతో, అలాగే పెళ్ళయ్యాక వేసిన ట్రిప్పులు చాలానే ఉన్నాయి. ఇవన్నీ తృప్తి కలిగించినవే.

కానీ అన్నిటికన్నా సంతృప్తి కలిగించినదీ, ఇప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చినదీ 2006లో మా కుటుంబం - అమ్మా-నాన్నా-అన్న-నేను మాత్రమే చేసిన హంపీ యాత్ర.

అవి నేను అన్నయ్య ఉద్యోగంలో చేరి రెండు ఏళ్ళు నిండిన రోజులు. ఇద్దరం ఎక్కడికయినా వెళ్ళాలి అనుకున్నాం. అన్నయ్యకి బొమ్మలు అంటే ఇష్టం కాబట్టి అజంతా-ఎల్లోరా వెళ్ళలి అనుకున్నాం. కానీ అక్కడ చాలా దూరం నడవాల్సి ఉంటుంది - అమ్మా-నాన్న నడవలేరేమోనని, ఇంకెక్కడికి అని ఆలోచించి హంపీ నిర్ణయించాం. మా నాన్నగారు, నేను ఇంక పెద్దయిపోయాను రాలేను మీరెళ్ళండీ అన్నారు. ఒక నెలపాటు ఫోన్లు చేసి ఒప్పించాల్సి వచ్చింది.

గుంటూరు నుండి హోస్పేట్‌కి రైలులో వెళ్ళాం. అక్కడ ఒక హోటల్లో రూము తీసుకొని రెండు రోజులు హంపీ మొత్తం తిర్గాము. అమ్మకి విరూపాక్షుడు నచ్చాడు, అన్నయకి బొమ్మలు గీసుకోవడనికి నచ్చింది, నేను నాకు నచ్చిన ఫొటోలు తీసుకున్నా. నాన్న అప్పటికే దేశం మొత్తం చాలా గుళ్ళు చూసారు కావున అయనకి అంత కొత్తగా లేదు కానీ, హంపీ మొదటిసారి కావడంతో కొంచెం ఆసక్తి ప్రదర్శించారు.

అక్కడ నడిచీ నడిచీ అలసిపోవటంతో ఇంక లేపాక్షికిలాంటివి పక్కకు తోసి ఇంటికి వచ్చాం.

హంపీ విశేషాలు ఇక్కడ వ్రాసి విసిగించను - కొన్ని ఫొటోలు మటుకు పెడతాను. ఇవన్నీ మామూలు పీ&ఎస్ కెమెరాతో తీసినవి.

ఇద్దరం పెద్దయ్యాక, మా డబ్బులతో - మా కుటుంబం వరకే - అమ్మా-నాన్నలని అలా తిప్పాము - అదే అత్యంత తృప్తికరమైన సంతోషకరమైన అనుభవం-జ్ఞాపకం.

విరూపాక్ష దేవాలయం

అన్నయ్య కూడా వీళ్ళలాగా కూర్చొని బొమ్మ గీశాడు. ఆయన బొమ్మలు మీరు చూడాలనుకొంటే - ఆయన ఎఫ్బీ పేజీ: Srini yeturi

నేను అమ్మా-నాన్నలతో -

14, జూన్ 2020, ఆదివారం

నేను వాడిన వాహనాలు - - కారు కొనాలనుకుంటున్నారా?

నాకు ఊహ తెలిసాక, నేను వాడిన , నాకు కొనబడిన కొత్త వాహనం పెక్కుమందికి లాగా ఒక సైకిల్. 1994లో నా 8వ తరగతిలో నాన్న నాకు కొనిపెట్టారు. అది అప్పటికి అందరికి అందరు వాడే బీఎస్ఏ ఎస్.ఎల్.ఆర్ కాదు, బండ టైర్ల హెర్కులెస్ ఎంటీబీ కాదు - హీరో ఇంపాక్ట్ - స్ట్రయిట్ హ్యాండిల్ బార్, సన్న టైర్లతో భిన్నంగా ఉండేది.

అది 36 ఏళ్ల తరువాత ఇప్పటికీ రన్నింగులో ఉంది. వెళ్లిన్నప్పుడల్లా గాలి కొట్టి, ఆయిల్ వేస్తా. క్రిందిది నేను మొన్న సంక్రాంతికి దిగిన చిత్రం.

నేను కాలేజీలో ఉన్నపుడు, ఉద్యోగంలో చేరినపుడు నాన్న బండి కొనిపెడతన్నారుగాని నేను తిరస్కరించాను. నాకు అప్పుడు గేర్ లెస్ బండ్లు (నాన్న లూనా, స్కూటీలు) నడపడం వచ్చుగాని నా సొంత బండి లోను లేకుండా, పూర్తి వెల డౌన్ పేమెంట్ చేసి కొనుక్కోవాలని కోరిక. ఉద్యోగం వచ్చిన ఏడాదికి 2006లో 46000 పూర్తి డబ్బులు చెల్లించి నడపడం వచ్చిన మిత్రుడిని షోరూమ్ తీసుకు వెళ్లి ఇంటికి తెచ్చుకున్నాను. ఒక వారంపాటు పొద్దున్నే లేచి నడిపి నేర్చుకున్నాను. పనిలో పని కారు డ్రైవింగ్ నేర్చుకొని రెండూ చక్కగా డ్రైవ్ - టెస్ట్ ఆర్టీఓ కార్యాలయంలో చేసి లైసెన్స్ తెచ్చుకున్నా. బండి పేరు 'హీరో హోండా ప్యాషన్ ప్లస్' - బ్లూ/బ్లాక్ (నీలం-నలుపు). ఎందుకంటే నాకు నీలం రంగు ఇష్టం. అప్పటికి హీరో-బజాజ్లో మొదటిదే మన్నికయినది. నాకు స్ప్లేన్డర్ పొట్టి అనిపించింది . ఈ బండి నేను ఇప్పటికి దాని 15వ సంవత్సరంలో వాడుతున్నా.

2011లో రెండుసార్లు అమెరికా వెళ్లివచ్చాక, అక్కడ కూడా కారు నేర్చుకుని తిరిగాక (అక్కడ కారు కొనలేదు), ఇక్కడ కూడా కారు ఉంటే బాగుంటుంది, ఆ ఊరు-ఈ ఊరు తిరగచ్చు అనిపించింది. నాకు వ్యాగన్-ఆర్ కారు కొనుక్కోవాలని కోరిక. ఒక రెండు వారలు హైదరాబాదులోని సెకండ్ హ్యాండ్ షోరూములన్ని తిరిగాను. వాడినది ఎందుకంటే ఒకటి ఇండియాలో డ్రైవింగ్ అలవాటు అవ్వడానికి, రెండు నేను లోనికి వ్యతిరేకం, మొత్తం డబ్బులు ఇచ్చి కొనాలని, మూడు - నేను ఇంకా అద్దె ఇళ్లల్లో తిరుగుతున్నా - రోడ్డుపై పార్కింగ్ చేస్కోవాలి కావున, నాలుగు - మళ్ళీ అమెరికా పంపించచ్చు .

మూడో వారం మా మామయ్యని హైదరాబాద్ రమ్మని కోరాను. ఇద్దరం బీహెచ్ ఈ యల్ నుండి ఎల్బీనగర్ దాక అన్ని షాపులు తిరిగాం. ఏ కారు నచ్చలేదు. ఇంక నన్ను ఎల్బీనగర్ క్రాస్రోడ్డులో దింపి మామయ్య ఊరు వెళతాను అన్నాడు. అక్కడ సిగ్నల్ దగ్గర ఆగినపుడు హ్యుందాయ్ షోరూములో డిస్ప్లేగా ఉంచిన శాంత్రో మామకు నచ్చింది. నాకు వ్యాగన్-ఆర్ఏ కావాలి, శాంత్రో వద్దు అన్న, ముందు చూద్దాం పద అని తీసుకు వెళ్ళాడు. ఆ కారు కండిషన్ చాలా బాగుంది, వేళా సబబుగా ఉంది. అప్పటికి అప్పుడు కొనేశాము. వాడిని సర్వీసింగ్ చేసి తరువాతి రోజు డెలివరీ చేయమన్నాం. ఆలా వ్యాగన్ ఆర్ అని మూడు వారలు తిరిగి ఒక శాంత్రో కొన్నాను.

ఏ మాటకామాట ఆ కారుని నేను పిచ్చి తిప్పుళ్ళు తిప్పాను. లింగంపల్లి నుండి ఘట్కేసర్ సిటీలో నుండి అంటే ఒకవైపు 45+, రెండు వైపులా 100 కిమీ రోజుకి, నెలకి 3000 వేలు తిప్పాను 4 ఏళ్ళపాటు - చక్కగా తిరిగింది ఏ పేచీ పెట్టకుండా . సిటీలో లీటరుకు 15 కిమీ, హైవేపై 20 కిమీ మైలేజ్ ఇచ్చేది. మిత్రులకి, చుట్టాలకి నా కారు బాగా నచ్చింది. ఒకవేళ అమ్మితే వాళ్ళకే ఇమ్మని చాలా మంది అడిగారు.

ఇలా రోజుకి 100 తిరుగుతున్నాను. పైగా ఇక ఆఫీసుకి ఓఆర్ఆర్ పై వెళదాము అనుకున్న - అప్పుడు 140 కిమీ అవుతుంది. ఇందులో ఎయిర్ బ్యాగులు లేవు, ఏబీఎస్ లేదు - అందుకని కొత్త కారు కొందాము అని నిర్ణయించుకున్నా.

నేను కచ్చితంగా 7-సీటర్ కొనాలని నిర్ణయించుకున్నా - ఎందుకంటే మా అన్న కుటుంబం హైదరాబాదు వచ్చినపుడు రెండు కుటుంబాలు + అమ్మ (నలుగురు పిల్లలతో) తిరగడానికి ఇరుకు అనిపించింది. అప్పుడు నాకు ఉన్నవి - ఎర్టిగా, హోండా బీఆర్-వి, మహీంద్రా ఎక్స్యూవీ 500 - అందులో చివరిది మరీ గభేళా అనిపించింది - నా పార్కింగులో పట్టదు. బీఆర్-వి 3 లక్షలు ఎక్కువుండటంతో, దానితో డీసెల్ నా బడ్జెట్ దాటటంతో, అంత సక్సెఫుల్ మోడల్ కాకపోవడం, ఎర్టిగా మైలేజ్ ఎక్కువుండడం, మారుతికి ఉన్న సర్వీస్ నెట్వర్క్ వలన, నాకు నచ్చిన ఎర్టిగావైపు మొగ్గాను. దాంతోపాటు నాకు నచ్చిన నీలం (బ్లూ) రంగు కూడా దొరికింది. 2 ఏండ్లలో దాదాపు 40వేలు తిరిగాను.

ఇక కారు కొనాలనుకునేవారికి నా అభిప్రాయాలు (జీవితంలో ఒక్కసారి కొనాలనుకునే మధ్యతరగతివారికి, 2-3 ఏళ్ళకి కార్లు-బైకులు మార్చేవారికి కాదు) -

  • కొత్త కారు లేదా వాడిన కారు కొనడానికి కార్వేల్, కార్డేఖో లాంటి వెబ్సైట్లు, టీం బిహెచ్పీ లాంటి సైట్లలో మంచి సమీక్షలు, సలహాలు ఉంటాయి. నేను అంతకన్నా చక్కగా వివరించలేను.
  • కారు ఒక డిప్రిషియేటింగ్ వస్తువు - షోరూమ్ గేటు దాటింది అంటే ఒక ఏభైవేల నుండి లక్షన్నర విలువ తగ్గుతుంది. ప్రతి ఏడాది తగ్గుతూనే ఉంటుంది. దానికి తోడు, ప్రతి సంవత్సరం బీమా, సర్వీసింగ్ ఖర్చులు అదనం. అందుకని, మీ నెలవారీ ఉపయోగం అందుకు తగ్గట్టు ఉంటేనే కొనండి. ఊరికే డాబుకి , ప్రదర్శనకు అలంకారప్రాయంగా మాత్రం వద్దు.
  • ఓలా లాంటి క్యాబ్ సౌకర్యాలు వచ్చాక కేవలం సిటీలో తిరగడానికి అయితే కారు అనవసరం.
  • బైకు నడపడానికి, కారు నడపడానికి చాలా తేడా ఉంది. మనము స్టీరింగ్ పట్టుకున్న ప్రతిసారి రోడ్ పై ప్రతి ప్రాణం గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ నడపాలి. అలా నడపగలము అనుకుంటేనే కారుని కొని రోడ్డుపైకి తేవాలి.
  • ఇక పార్కింగ్ సౌకర్యం ఉంటేనే కారు కొనుక్కోండి. నేను అద్దె ఇళ్లలో ఉన్నపుడు చాల ఇబ్బంది పడ్డాను. ఒక గ్రూప్ హౌసులో కింద పార్కింగ్ చూసుకొని, అడ్వాన్స్ ఇచ్చాక - తీరా ఇల్లు మారి కారు తీసుకువెళితే అక్కడ వేరే కారు ఉంది. ఓనరు, "అనుకోకుండా వేరే పోర్షనులోని మా చుట్టాల అబ్బాయి కారు కొన్నాడు, మీది బయట పెట్టుకోండి అన్నాడు ", అలా నా కారుని రోడ్డుపై ఎండావానలకి ఏడాదిపాటు నిలపాల్సి వచ్చింది.

కానీ ఒక్కొక్కసారి కారు ఉంటే ఉపయోగాలు కూడా ఉన్నాయి

  • ఏదన్న అత్యవసరంగ వెళ్లాల్సి ఉంటే కారు ఉపయోగిస్తుంది.
  • మా బామ్మ పోయారని తెల్లవారుజామున 4 గంటలకి ఫోను వస్తే 11 గంటలకల్లా గుంటూరులో అందుకున్నాము.
  • మా పాపకి అర్థరాత్రి 3 గంటలకి ఒక ఆరోగ్య సమస్య వస్తే వెంటనే కారులో హాస్పిటల్కి తీసుకువెళ్లి, వారు రాసిన మందులు వారి ఫార్మసీలో దొరక్కపోతే ఒక గంటపాటు ఒక 10 షాపులు తిరిగి దొరకపుచ్చుకొని 5 గంటలకి ఇంటికి వచ్చాము. అది బండి మీద చేయగలిగే పని కాదు, ఓలా-ఉబర్ ఇప్పటిలా ఉన్న కాలం కాదు. ఇప్పుడైనా ఆ ఆడ్ సమయంలో దొరికేవి కాదేమో.
  • పిల్లలు-పెద్దవారు ఉన్నపుడు దూర ప్రయాణాలు సౌకర్యంగా ఉంటాయి, ఒక్కొక్కసారి రైలు-బస్ కన్నా తక్కువ ఖర్చులో అవుతుంది కూడా.