17, ఏప్రిల్ 2010, శనివారం

మేమూ పాట పాడాము (పాడామా?) !

నా తెలుగు బ్లాగు ఒక బాల్య జ్ఞాపకంతో మొదలు పెడుతా. మా  అద్భుత గానంతో ఎలా మా స్కూలికి వన్నె తెచ్చామో చదివి (నవ్వొస్తే) నవ్వుకోండి.
***************
స్కూల్లో ఉండగా నేను, అన్నయ్య బృంద గానము, నాటకములు మొదలగు సాంస్కృతిక కార్యక్రమలాలో కొంచెం ఉత్సాహంగానే పాల్గోనేవారం. ఇదంతా మా స్కూలు ప్రిన్సిపాల్ శ్రీ బి.కే.విశ్వేశ్వరరావు గారి చొరవ. ఆయన గుంటూరు బాలానందం కార్యక్రమాల్లో 80-90 లలో ముఖ్య పాత్ర పోషించేవారు. అందుకని ప్రతి సంవత్సరం బాలానంద కేంద్రం లో జరిగే పోటీలకు మమ్మల్ని తీస్కు వెళ్ళేవారు. అలా బాగానే అయిదు, ఆరు, ఏడు తరగతుల్లో నాటకాలు వేశాం, పాటలు పాడాం, బొమ్మలు గీశాం, కోలాటాలు ఆడాం - రెండు మూడు బహుమతులు కొట్టాము కూడా.

ఇక ఎనిమిదవ తరగతిలో ఉండగా మళ్లీ బాలానందం పోటీలకి పిలుపొచ్చింది. అంటే మా ప్రిన్సిపాల్ గారు నిర్వాహకుల్లో ఒకరు కదా.

ఇక్కడ మా స్కూలు గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకోవాలి. మాది కాన్వెంటుకి తక్కువ, ట్యూషను సెంటరుకి ఎక్కువ. ఏ ఏడాది మొత్తం విద్యార్ధుల సంఖ్య వంద దాటలేదు. కాని మరీ వీధిబడి కాదులెండి. మంచి గురువులు ఉండేవారు, మేమూ శ్రద్ధగా చదువుకునేవారం. నా తరగతి లో పది మందికి పైగా విద్యార్ధులు ఎప్పుడూ లేరు. ఇప్పుడర్ధం అయ్యుండాలి నాకు అవకాశాలు ఎలా వచ్చాయో.

సరే విషయానికి వస్తే మా స్కూలి నించి  బృంద గానంకి ఎంట్రీ పంపించాలి. మా ప్రిన్సిపాల్ గారి అమ్మాయి మా సంగీతం-నృత్యం టీచర్. పాపం మాకు ఐదవ తరగతి నించి సరళీస్వరాలూ నేర్పడానికి తెగ ప్రయత్నించేవారు. ఎనిమిదవ, తొమ్మిదవ తరగతుల్లో ఉన్న ఎనిమిది-తొమ్మిది మంది మగ పిల్లలం ఆ టీచర్ దగ్గరకి వెళ్లి మాకు ఒక కొత్త పాట నేర్పించి ఆ పోటీలకి పంపించాలని అడిగాం (అయినా మేమూ తప్ప ఎవరున్నారు స్కూల్లో). కానీ టీచర్ అందరికి న్యాయం చెయ్యాలని, ఉన్న ముగ్గురు ఆడపిల్లలని కూడా జట్టులో కలిపారు. మంచి ఊపున్న ఒక దేశభక్తి గీతం నేర్పించి పోటీలకి పంపారు.

అసలు కామెడీ పోటీల్లో జరిగింది. పోటీల రోజున మా స్కూలు పేరు పిలవగానే వేదికా మీదకి దూసుకుపోయి క్షణం ఆలస్యం లేకుండా ఒక ఉరుములాంటి గర్జనతో పాడడం (అరవడం అనాలేమో?) మొదలు పెట్టాం. రెండో నిమిషం కరెంటు పోయింది. అందరు మేము ఆపుతామేమో అనుకున్నారు. కానీ మా గాన ప్రవాహం రెట్టించిన శబ్దంతో సాగింది. అప్పుడే బాల్య దశ నుండి కౌమారములోకి అడుగిడుతున్న మగ పిల్లల గొంతులు ఎలా ఉంటాయో చెప్పాలా, అదీ ఒకేసారి అట్లాంటి ఎనిమిదిమంది అబ్బాయిలు ఆ గొంతులు వేస్కొని పాడితే ఆ సభా ప్రాంగణం ఊహించుకోండి. మైకులు బద్దలవ్వాల్సిందే! ఏడు నిమిషాల పాటని మూడు నిమిషాలలో ఊదిపారేశాం.

ఎంత వేగంతో వచ్చామో అంతే వేగంగా నిష్క్రమించాం. ఇక చూస్కోండి, ప్రేక్షకుల, ముఖ్యంగా నిర్ణేతల మొహాలు చూడాలి. బాలకృష్ణ సినిమా చుసిన మొహాల్లో కూడా అలాంటి హావ భావాలు చూడలేదు. వెంటనే మా వాడొక్కడికి వెలిగింది మేము ఏం తప్పు చేసామో (పాడడం కాదులెండి, మా మీద మాకు చాలా మంచి అభిప్రాయం). వెంటనే మీకు దగ్గరకి పోయి, "ఇప్పుడు మేము పాడింది 'ఎయ్ దెశో ఎయ్ మటి' అనే ప్రముఖ ఒరియా దేశభక్తి గీతం!" అని ప్రకటించాడు. ఇక చూస్కోండి - ఆడిటోరియం అంతా నవ్వులే నవ్వులు. మేము ఒకసారి ప్రిన్సిపాల్ గారిని, సంగీతం టీచర్ గారిని చూసాం. ఆడిటోరియం చివరి వరుసలలో ఉన్నా మా ఫ్రెండ్స్ దగ్గరికి పరిగెత్తాం. మా ఫ్రెండ్స్, పక్కన కూర్చున్న వాళ్ళంతా "అన్ని గ్రూపుల్లో మీ పాట ఒకటే మాకు వినిపించింది - అర్థం కాలేదు కానీ బాగానే పాడారు మీరు" అని మెచ్చుకున్నారు.

మర్నాడు మా సంగీతం టీచర్ స్కూల్లో - మాకు మామూలుగా పూజ చేసి, తరువాత కళ్ళనీళ్ళు పెట్టుకొని (నిజంగా) - ఇక మా స్కూలు మగ పిల్లలకి సంగీతం పాఠాలు చెప్పను అని ఒక నిర్ణయం తీస్కున్నారు.

ఆ పాట కొంత వరకు గుర్తుంది.

||ప||
ఎయ్ దెశో ఎయ్ మటి
మొమతమొయీ మాటి ||2||

సెబరెతరో జిబానొదెబా ||2||
రొఖిబో తారొనాతి  ||ఎయ్||

||చ||
 జొహి ఝొరనో జొహి జాయే
జొహి కొయిలీ కూహు గాయె

సుజలాం సుఫల సస్యశ్యామలాం
సుజలాం సుఫల సస్యశ్యామలాం
ఆమొయే జొన్మ మాటి. ||ఎయ్||
 
||చ||
 చిరు  మళయొ జారొ పబనో
చిరు తనన జారొ కననో |2||
సగర జొహరో రత్న బొందారొ ||2||
ఆమొయే జొన్మమాటి

ps: తెలుగులో రాయల్సినది ఆలోచించడం తేలిక,  టైపు చేయడం కష్టము - ఇంగ్లీషులో టైపు చేయడం తేలిక గానీ ఆలోచించడం కొంచెం కష్టం.

6 కామెంట్‌లు:

  1. పాడే ఉంటారులే,అందుకే మీ టీచర్ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.

    బాగుంది నీ గానామృత భరిత గాధ.

    రిప్లయితొలగించండి
  2. బావుంది మీ పాట
    ఇప్పటికి గుర్తుపెట్టుకోవడం చాలా బావుంది

    రిప్లయితొలగించండి
  3. @విశ్వనాథ్ : కృతజ్ఞతలు. పాడమనే మెమూ అనుకుంటున్నం.
    @హరే కృష్ణ గారు: కృతజ్ఞతలండి. చిన్నప్పుడు నెర్చుకున్నవి, విన్నవి సాధరనంగా అందరికీ గుర్తుంటాయి - స్కూల్లో పాటలు, స్కూలు ప్రార్ధన, అప్పుడు విన్న సినిమా పాటలు మొదలగునవి.

    రిప్లయితొలగించండి
  4. మీరు పాడారు JB గారూ!.. పాడారు..దానికి సాక్ష్యం మీ సంగీతం టీచరుగారి (అనంద)భాష్పాలు.. :)

    రిప్లయితొలగించండి
  5. రవికిరణ్‌గారు: నేను ఇప్పటికీ పాడాననే అనుకుంటున్నానండీ :-)
    కృష్ణప్రియగారు: ధన్యవాదాలు :-)

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in