2, నవంబర్ 2020, సోమవారం

ఐటీ ఆర్కిటెక్చర్

 

ఐటీ ఆర్కిటెక్చర్‌లో ఎన్ని విభాగాలు ఉంటాయి?

ఐటి ఆర్కిటెక్చర్ కూడా ఇంటి ఆర్కిటెక్చర్ లాంటిదే . ఇక్కడ కూడా డిజైన్ చేసే సాఫ్ట్వేర్ సైజు కాంప్లెక్సిటీనీ బట్టి వివిధ రకాల ఆర్కిటెక్ట్లు ఉంటారు.

ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ -

మన ఇంటికే కాదు ఒక ఊరికి కూడా ఆర్కిటెక్ట్ కావాలి. వారిని మనం టౌన్ప్లానింగ్ అంటాము . వారు వీధులు ఎలా ఉండాలి, డ్రైనేజీ సిస్టం ఎలా ఉండాలి, చెత్త ఊరికి ఏ దిక్కులో పడేయాలి వంటివి ప్లాన్ చేస్తారు. ఎన్ని అంతస్తుల కి అనుమతి ఇవ్వవచ్చు, విదేశాల్లో అయితే ఫుట్పాత్ వెడల్పు ఎంత ఉండాలి, కాంపౌండ్ వాల్ ఎంత ఎత్తు ఉండాలి, కంచెకి ఎలాంటి మెటీరియల్ వాడొచ్చు, ఫ్లోర్ ఇండెక్స్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. అలాగే ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్లు ఒక సంస్థకి చెందిన ఆర్కిటెక్చర్ని ప్లానింగ్ చేస్తారు. ఉదాహరణకి ఫౌండేషన్ ప్రిన్సిపుల్స్, ప్లాట్ఫామ్లు, మోడళ్లు, స్టాండర్డ్స్, అలాగే టెక్నాలజీ రోడ్డు మ్యాప్ తయారు చేయటం వంటివి. వీరికి అధారిటీ ఎక్కువుంటుంది సీ.ఎక్స్.ఓ లెవెల్ ఎగ్జిక్యూటివ్ అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం ఉంటుంది.

సిస్టం ఆర్కిటెక్ట్ లేదా అప్లికేషన్ ఆర్కిటెక్ట్ -

ఒక ఇంటిని డిజైన్ చేసే ఆర్కిటెక్ట్ కిటికీలు, తలుపులు ఎన్ని ఉండాలి, తలుపులు ఎటువైపు ఉండాలి, ఒక గది విస్తీర్ణం ఎంత ఉండాలి, నడవాలు ఎంత వెడల్పు ఉండాలి వంటివన్నీ ప్లాన్ చేస్తారు. అలాగే ఫ్లోరింగ్ - సీలింగ్ వంటి వాటికి ఎలాంటి మెటీరియల్ వాడాలి, వంటివి కూడా చెప్తారు, దగ్గరుండి చేయిస్తారు. అలాగే ఒక సిస్టంని బిల్డు చేయటానికి దానికి కావాల్సిన ఆర్కిటెక్చర్ ప్రతిపాదించడానికి, టెక్నాలజీ స్టాక్ ఎంపిక చేయడం, దాన్ని డెవలప్మెంట్ సహాయం చేయటానికి సిస్టం ఆర్కిటెక్ట్ లేదా అప్లికేషన్ ఆర్కిటెక్ట్ తోడ్పడతాడు. ఇతనికి ఆ సిస్టం లో వాడే టెక్నాలజీలు అన్ని తెలియాలి.

సొల్యూషన్ ఆర్కిటెక్ట్ -

వీరు ఒకరి కన్నా ఎక్కువ సిస్టమ్స్ తయారు చేయడానికి, వాటి మధ్య కనెక్షన్స్ అలాగే వివిధ పార్టీల మధ్య కమ్యూనికేషన్ నిర్వహించడం, బిజినెస్ డిస్కషన్స్ చేస్తారు . బిజినెస్ తో చర్చలు జరిపి వారి రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని వారికి కావాల్సిన విధంగా ఒక సొల్యూషన్ తయారుచేస్తారు. ఆ సొల్యూషన్లో ఏ ప్లాట్ఫారాలు, ఎలాంటి టెక్నాలజీలు వాడాలి, ఇంటిగ్రేషన్ ఎలా ఉండాలి వంటివి వీరు నిర్వచిస్తారు. అప్లికేషన్ ఆర్కిటెక్ట్ ఒక ఇంటి స్థాయి అయితే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఒక అపార్టుమెంట్ ఒక గేటెడ్ కమ్యూనిటీ స్థాయి అనుకోవచ్చు.

టెక్నాలజీ ఆర్కిటెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ -

వీరు బ్రిడ్జిలు కట్టే ఆర్కిటెక్ట్లులా, అలానే పెద్ద పెద్ద బిల్డింగ్ ల లో వైరింగ్ ప్లంబింగ్ ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ప్లానింగ్ చేసే ఆర్కిటెక్ట్లు లాంటివారు. వీరు నెట్వర్కింగ్ , ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్లు, డేటాబేస్ ఈరోజుల్లో క్లౌడ్ ఇన్ఫ్రాని ఆర్కిటెక్ట్ చేయటం డిఫైన్ చేయటం చేస్తారు.

డేటా ఆర్కిటెక్ట్ -

వీరు ఒక సంస్థకు సంబంధించిన డేటా ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా నిల్వ చేయాలి, డేటా ఫ్లో ఎలా జరగాలి, ఆర్కైవ్ ఎలా చేయాలి - ఇలా డేటా కి సంబంధించిన మొత్తం నిర్వచిస్తారు . ఇందులోనే ఇప్పుడు కొత్తగా ఎనలిటిక్స్ (విశ్లేషణ) కూడా చేరాయి.

ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ -

వీరు డేటా ఆర్కిటెక్ట్ వంటి వారే. కాకపోతే వీరు కేవలం అప్లికేషన్ల డేటా అనే కాకుండా , సంస్థకు సంబంధించిన మొత్తం సమాచారం అనగా ఫైల్స్, డాక్యుమెంట్లు, ఫార్మ్స్ వంటివి ఎలా నిర్వహించాలి, కంప్లయన్స అంటే గవర్నమెంట్ రెగ్యులెటరీ పాలసీలు, నియమాలను పాటిస్తున్నారా లేదా ఎలా చేయాలి వంటివి నిర్వచిస్తారు.

ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్ ప్రొడక్ట్ ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్ -

వీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ నిష్ణాతులై ఆ ప్రొడక్ట్స్ ని బిజినెస్ కి కావాల్సినటు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ,ఉన్న సిస్టమ్స్ కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి , వంటివి నిర్వహిస్తారు ఉదాహరణకు సేల్స్ ఫోర్స్ ఆర్కిటెక్ట్, ఎస్ఏపి ఆర్కిటెక్ట్, సర్వీస్ నౌ ఆర్కిటెక్ట్, పెగా ఆర్కిటెక్ట్ వంటివారు. అలాగే వివిధ ప్రోడక్ట్ కంపెనీలు వాటి ప్రొడక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి నియమించుకున్న ఆర్కిటెక్ట్స్. వీరు మన వాషింగ్ మెషిన్, ఏసీ, వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ ఇంజినీర్ల వంటివారు.

సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ - వీరు సంస్థకు చెందిన వివిధ అప్లికేషన్ యొక్క సెక్యూరిటీని నిర్వహిస్తారు.

పెర్ఫామెన్స్ ఆర్కిటెక్ట్ - వీరు పర్ఫామెన్స్ పెరామీటర్లు డిఫైన్ చేయటం, అప్లికేషన్ పర్ఫామెన్స్ ని టెస్ట్ చేయడం ఇంప్రూవ్ చేయటం వంటి వాటిలో పాల్గొంటారు.

బిజినెస్ / డొమైన్ ఆర్కిటెక్ట్లు -

వీరు సంస్థకు చెందిన బిజినెస్ అనాలసిస్ చేయడం, వాటి మధ్య గ్యాప్లు, ఫ్యూచర్ స్ట్రాటజీ (భవిష్యత్ ప్రణాళిక), అలాగే ఫ్యూచర్ రోడ్ మ్యాప్ వంటివి తయారు చేస్తారు. ఉదాహరణకి ఇన్సూరెన్స్ కంపెనీలో ఆర్కిటెక్ట్ అయితే తయారుచేసే పాలసీ ఎడ్మిన్ సిస్టంలో ఎలాంటి ఫీచర్లు ఉండాలి వంటివి నిర్వచిస్తారు.

యూఐ / యూఎక్స్ ఆర్కిటెక్ట్లు - వీరు అప్లికేషన్ల ఫ్రంట్ ఎండ్ని నిర్వచిస్తారు ఇంటీరియర్ డెకరేటర్లులాగన్నమాట.

ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీల కి తగ్గట్టు క్లౌడ్ ఆర్కిటెక్ట్లు, ఆర్.పి.ఏ (రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్) ఆర్కిటెక్ట్లు, డేవ్ ఆప్స్ ఆర్కిటెక్ట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఆర్కిటెక్ట్లు, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్ట్లు వస్తున్నారు.