10, సెప్టెంబర్ 2011, శనివారం

మంజీర రవళులతో


కాకి, పిచ్చుక, చిలుక, కోకిల, కొంగ, కోడి, నెమలి , ఇంకొన్నుండచ్చు- ఇవి నేను కళ్ళారా చూసిన కొన్ని పక్షులు. బెంగుళూరు, విదేశాల్లో‌ఉన్న నా ఫోటోగ్రఫీ మిత్రులు పెట్టే వివిధ రకాల పక్షి చిత్రాలు చూసి, ఆహా ఓహో అనుకోవడం తప్పితే నిజజీవితంలో‌అలాంటి పక్షులనునేనూ చూడాలి, ఫోటోలు తీయాలి అనుకుంటుండేవాడిని.

అలాగే 2009లో‌భువనగిరి సాహసం తర్వాత అమెరికా వెళ్ళడంతో  ఆగిపోయిన ఉత్సాహం 2011లో  స్వదేశానికి తిరిగి వచ్చాక  మళ్ళీ ఏదోక పర్యటన చేయాలనిపించింది. అలా అనుకొని,అనుకొనీ చివరికి గత జులైలో మంజీర ఆనకట్టకి  వెళ్ళివచ్చాం.

మంజీర ఆనకట్ట (బ్యారేజి)హైదరాబాదుకి  ముఖ్యమైన నీటి సరఫరా కేంద్రం. కేవలం ఆనకట్టేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన పక్షిసంరక్షణా కేంద్రాల్లో‌ఒకటి.

బిఎచ్‌ఈఎల్ సర్కిల్ నుండి ముంబాయిరోడ్డుపై ౩౫ కి.మీ.లు పోతే సంగారెడ్డి క్రాస్^రోడ్డు వస్తుంది (కారులో వెళ్ళితే టోల్ కట్టాలి, బైకయితే అక్కరలేదు). ఇక్కడ కుడిపక్కకి తిరిగితే సంగారెడ్డి పట్టణం వస్తుంది. పట్టణంలో పెట్రోల్ బంకు దాటాక, ఒక రెండు కి.మీ.వెళ్ళాక ఎడమవైపు ఒక సమాధి కనిపిస్తుంది (జాగ్రత్తగా గమనించాలి). ఇక్కడ ఎడమవైపు తిరిగితే మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం ఉంటుంది. ఈ రోడ్డులో‌ఒక కి.మీ. వెళ్ళితే ఒక మసీదుగోడ కనిపిస్తుంది. ఇక్కడ కుడివైపు తిరగాలి. ఈ దారి చాలా జాగ్రత్తగా గుర్తులు పెట్టుకొంటూ‌వెళ్ళాలి. గూగుల్ పటాలు కొంతవరకే తోడ్పడాయి.

ఒక శనివారం పొద్దునే నేనూ, ధర్మేన్ నా బైకుపై  బయలుదేరి  పొద్దునే తొమ్మిది కల్లా అక్కడికి చేరాం. మళ్ళీ మా అదృష్టం కొద్దీ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఎండలేకుండ ఉంది.బ్యారేజి గేటు దగ్గర ఒక ఆఫీసుగదిలో ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటనడిగారు? ఇలా చూడటానికి వచ్చాం అనడిగాం. ఒక నవ్వు నవ్వారు. సరే, ఈ పుస్తకంలో‌సంతకం పెట్టి, గేటు బయట బండి పెట్టి వెళ్ళమన్నాడు.

ఆ వాతావరణం చూడగానే కొంచెం బెరుకొచ్చింది. మేమిద్దరం తప్పితే ఎవరూ లేరు అక్కడ. ఫోటోలు తీసుకోవచ్చో, తీసుకోకూడదో తెలియలేదు. కుడిపక్కకి మొసళ్ళ కేంద్రం అని ఉంటే అటు నడవటం మొదలుపెట్టాం. ఆ దారిలో చెట్టుపైనున్న   ఒక నెమలి మమ్మల్ని చూసి భయపడి ఎగిరి వెళ్ళిపోయింది. కెమెరా చేతిలో‌పెట్టుకోనందుకు తిట్టుకున్నాం. ఒక పది నిమిషాలు ఎదురు చూసినా ఆ నెమలి బయటకి రాలేదు. సరేనని ముందుకెళ్ళాం. మొసళ్ళకేంద్రానికి తాళం పెట్టుంది, అవి ఉండాల్సిన నీటిగుంట ఎండిపోయుంది, మొసళ్ళున్న ఆనవాళ్ళేం కనిపించలేదు.

బ్యారేజిపైకి వెళ్ళుదామంటే ప్రవేశం నిషిద్ధం అనుంది. సరే అక్కడ ఒక వెయ్యేళ్ళ శివాలయం ఉందంటే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాం.అది ఇంకా నిరాశ కలిగించింది. దానికి రంగులేసి ఉండటంతో‌మామూలు గుడిలాగుంది. ఇంకేం చేద్దామా అనుకుంటే అపుడు నెమ్మది నెమ్మదిగా వివిధ రకాల పక్షులు కనిపించడం మొదలుపెట్టాయి.

అలా చాలా చిత్రాలు తీయగా చాలా కొద్దిమాత్రమే పంచుకోదగినవి వచ్చాయి. కొన్ని  నా చేతకానితనం వల్లయితే, ఉన్నట్టుండి వచ్చిన ఎండ వల్ల ఇంకొంచెం. తీసినవన్నీ‌నా  "నా కనులతో..." బ్లాగులో మంజీర అన్న  లేబుల్ కింద పెట్టాను. చూసి ఆనందించండి.

ఇంతలో‌ అటవీ సంరక్షణాధికారి జీపు వచ్చింది. సర్లే మనదగ్గర విలువైన కెమరా ఉంది, ఎందుకొచ్చిన గొడవని దిగి వెనక్కి రావడం మొదలుపెట్టాం. వెనక్కి వస్తుంటే నెమ్మనెమ్మదిగా జనాలు రావడం కనిపించింది. మమ్మల్ని పంపించలేదుగానీ, వాళ్ళల్లో చాలా మంది మాత్రం చక్కగా బ్యారేజి మెట్లు ఎక్కుతూ కనిపించారు. కొందరు బళ్లు కూడ వేసికొని లోపలికొచ్చారు. చాలా ప్రేమపక్షులూ కనిపించాయి. అప్పటికే పదకొండు అవ్వడంతో మళ్ళీ బ్యారేజివైపు వెళ్ళాలనిపించలేదు. ఆ నెమలికోసం మళ్ళీ ఎదురుచూశాం.అరుపులు వినిపించాయిగానీ, ఈ  జనాల  అలికిడితో గంటసేపుచూసినా అది బయటకిరాలేదు. ఆ నెమలిని చూడకపోవడమొక్కటే మా పర్యటనలో‌చిన్న లోపం.

విసుగొచ్చి ఇంక తిరుగుముఖం పట్టాం. సంగారెడ్డి జంక్షన్ దాటంగానే హైదరాబాదు దారిలో‌వరుసగా  ఫ్యామిలీ  ధాబాలున్నాయి.పేరు గుర్తులేదుగానీ కొంచెం హంగామా తక్కువున్న ఒకదానిలోకి వెళ్ళాం. ఆ‌ప్రదేశాని ఆ ధరలు కొంచెం ఎక్కువైన మేము తీసుకున్న ఉత్తరభారతీయ వంటకాలు చాలా బాగున్నాయి.

3, సెప్టెంబర్ 2011, శనివారం

భువనగిరి సాహసం


2009లో వరుసగా వారాంతాలు నిస్సారంగా గడుస్తున్న  రోజుల్లో నేనూ, సహనివాసి (రూమ్మేట్)వెంకటేశన్ వీలున్న ప్రతి వారాంతం బండి వేసుకొని ఎటోఒకవైపు వెళ్ళాలని నిర్ణయించాం. హైదరాబాదు చుట్టుపక్కలన  100 కి.మీ.లలో ఏమున్నాయా అని వెతుకుతుండగా భువనగిరి కోట గురించి తట్టింది.ఈ కోటని ఎపుడు హైదరాబాదు-గుంటూరు రైల్లోవెళ్ళినా చూస్తుంటాను (బీబీనగర్ తర్వాత ఎడమవైపున కనిపిస్తుంది).

భువనగిరి  హైదరాబాదు-వరంగల్ రహదారి (ఎన్.ఎచ్.202)మార్గంపైనా, సికిందరాబాద్-కాజీపేట  రైలుమార్గంపైనా తగులుతుంది. ఉప్పల్ నుండి దాదాపు 35 కి.మీ., గచ్చిబౌలినుండి 65 కి.మీ. ఉంటుంది.

ఒక శనివారం పొద్దున్నే 6.30 కి గచ్చిబౌలి నుండి బయలుదేరాం.మెహదీపట్నం, లిబర్టీ, నారాయణగూడ బాగానే దాటాం. ఆ తర్వాతనే దారి తప్పాం. వారినీ,వీరినీ అడుగుతూ 8కి ఉప్పల్ రింగురోడ్డు చేరాం. అక్కడ ఫలహారం చేసి మళ్ళీ బయలుదేరాం. అప్పటికి ఇన్ఫోసిస్ లేకపోవడం, విస్తరణ పనులు లేకపోవడం వలన, ఎటువంటి రద్దీ,ఆటంకములు లేకుండా 8.45 కల్లా వెళ్ళిపోయాం. అంతకు ముందురోజే వర్షం పడటం వల్ల, ఎండలేకుండా మబ్బుగా-చల్లగా ఉండటం వల్ల, బైకు ప్రయాణం చాలా ఆహ్లాదంగా జరిగింది. భువనగిరి చేరాక, కొండ ప్రవేశము ఎక్కడో అంత చిన్న ఊరైనా చెప్పలేకపోయారు :-( ఎలాగో కనుక్కొని వెళ్ళితే తొమ్మిదయితేగానీ గేటు తెరవరని ఎదురుగున్న కొట్టువాడు చెప్పాడు. అదృష్టంకొద్ది వాడు తొమ్మిదికల్లా వచ్చాడు. మేము తప్ప పర్యాటకులు ఎవరూ కనిపించలా. వాడు మమ్మల్ని అదోలా చూసి టిక్కెట్లిచ్చాడు.

గేటుతీసి లోపలికి వెళ్లగానే 'సర్దార్ సర్వాయి పాపన్న' విగ్రహం ఒక వాలు గుట్టకింద కనిపించింది. గుట్టపైన ఒక కోటలాగుంది. అరే, ఇంత క్రిందకున్నదేంటిది అని బాధపడ్డాం ఇద్దరం. పైగా రైల్లోంచి చూస్తే చాలా ఎత్తులో ఉందిగదా అని అనుకున్నాం.
***చిత్రం పెద్దదిగా కనిపించడానికి దానిపై నొక్కండి***
  అలా ఏటవాలుగా ఎక్కుతుంటే అదేదో పాత శోభన్‌బాబు సినిమా క్లైమాక్స్ గుర్తొచ్చింది.


ఇలా పైకి ఆవేశంగా ఎక్కాక, అక్కడింక దారిలేదు. పక్కన మెట్లు కనిపించాయి. ఎక్కడమైతే ఎక్కానుగానీ, దిగడానికి భయమేసిందండోయ్!


ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్లితే మేము చూసింది బురుజు మాత్రమేనని, కోటపైనెక్కడో ఉందని తేలింది.

బురుజుమీదనుండి భువనగిరి బస్టాండు -

ఈ బురుజు దగ్గరనుండి ఇంక మెట్లు కనిపించలేదు.మళ్ళీ ఒకటే గుట్టలాగ కనిపించింది.


ఆ గుట్టకూడ ఆవేశంగా ఎక్కాక, అక్కడ కొన్ని ఫిరంగులు కనిపించాయి. ఇంక అక్కడ నుండి కోటకి దారి చూశాక అప్పుడు చుక్కలు కనిపించాయి.

మొదట ధైర్యం చాల్లేదు. ఎందుకంటే అక్కడ మెట్లు సరిగాలేవు. కానీ పట్టుకోవడానికి  ఒకరెయిలింగు మాత్రం ఉంది. వెళ్ళాలా వద్దా. ఇక్కడ నుండి పడిపోతే ఏమన్నా ఉందా, మనవాళ్ళకి కబురు పంపేవాళ్లుకూడ ఉన్నట్లు లేరు అని అనుకున్నాం.

ఇంతలో ఒక మనిషి పైకెక్కుతూ‌కనిపించాడు. సరేనని మేమూ ధైర్యం చేశాం. ఈలోపు ఇంకో ఇద్దరు మాలాగా బండిపై వచ్చినవాళ్ళు కలిసారు. వారూ మావెనకే బయలుదేరారు.


తీరా అంత కష్టపడి పైకి వెళ్ళితే అక్కడ నాలుగు గోడలు తప్పితే కోటలాగ ఏమి అనిపించలేదు. కానీ బీ.ఎస్.ఎన్.ఎల్ వాడి టెలిఫోను టవరు మాత్రం ఉంది. మేము చూసిన వ్యక్తి అక్కడ పనిచేస్తాడట. రోజూ పైకెక్కుతాడంట. అతని ఉద్యోగం చూశాక నా ఉద్యోగంలో ఉన్న కష్టాలన్నీ మరిచిపోయాను.


కోట నిరుత్సాహపరిచినా, అక్కడినుండి కనిపించిన ప్రకృతి దృశ్యాలు మటుకు మా శ్రమనంతా మరిచిపోయేటట్లు చేశాయి.



అలా పైన ఒక గంట గడిపాక నెమ్మదిగా మిగతా పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. పర్లేదు, ఒక ఇరవై మందిదాక కనిపించారు. ఇక క్రిందకి దిగడం మొదలుపెట్టి పదకొండున్నరకల్లా  బైకుదగ్గరకి చేరాం.

అనుకోకుండా మొదలుపెట్టినా మాకు చాలా ఆనందాన్ని కలిగించిన ప్రయాణం. ఆ తర్వాత అలాంటి ప్రయాణాలు మళ్ళీ మళ్ళీ చేయాలనుకున్నాం గానీ నేను అమెరికా ఇంకోసారి వెళ్ళాల్సిరావడంతో కుదరలేదు.:-(




భువనగిరి గురించి ఇంటర్నెట్లో వెతుకుతుంటే శరత్‌కాలంగారి బ్లాగు కనిపించి చదవడం మొదలుపెట్టి, అక్కడినుండి మిగతావారివి చదువుతూ నెమ్మదిగా తెలుగుబ్లాగులకి అతుక్కుపోయా.