31, డిసెంబర్ 2020, గురువారం

2020 రోలర్ కోస్టర్ సవారీ

 2020 సంవత్సరం ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ఎంతో కొంత ప్రభావితం చేసింది. నేను కూడా ఈ సంవత్సరంని నేను, నా కుటుంబము తల్లిదండ్రులతో, అన్నయ్య కుటుంబంతో సహా కోవిడ్ బారినపడకుండా దాటేసినందుకు సంతోషంగానూ కృతజ్ఞతతోనూ ఉన్నాను. కానీ అదే సమయంలో ఈ సంవత్సరం నాకు రోలర్ కోస్టర్ సవారీ లాగా అనిపించింది.

😔జనవరిలో మా పాప పుట్టినరోజుకి ఒక రోజు ముందు అనుకోకుండా సొంత ఊరు వెళ్లాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఎప్పుడూ పుట్టిన రోజు హైదరాబాద్లో జరుపుకొని తర్వాతి రోజు సంక్రాంతి అని గుంటూరు వెళ్తాము. మొదటి పుట్టినరోజు తర్వాత మళ్లీ ఎనిమిదవ పుట్టినరోజుకి మా ఊర్లో జరుపుకోవడానికి కుదిరింది. సాయంత్రం కరెక్ట్గా కేకు తేవటానికి బేకరీ కి బయల్దేరగా మా తాతగారు కిందపడి తలకి దెబ్బ తగిలితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆ రాత్రంతా అక్కడే ఉన్నాను మా పాప కేక్ కటింగ్ కి నేను లేను తను చాలా బాధపడింది.

😔ఫిబ్రవరిలో శివరాత్రి తెల్లవారుజామున మూడింటికి సొంత ఊరు నుంచి ఫోన్ వచ్చింది మా బామ్మ ఇకలేరు అని. వెంటనే కారు ఏసుకుని ఫ్యామిలీ అంతా వెళ్లాం. అంత్యక్రియలకు, పది రోజుల తర్వాత మళ్లీ కార్యక్రమాలకు రెండుసార్లు తిరిగాను హైదరాబాద్ నుంచి.

😐మార్చిలో మొదటి మాసికానికి ఒక్కడిని వెళ్లాల్సి ఉండంగా శుక్రవారం వర్క్ ఫ్రొం హోమ్ కి కావాల్సిన ఏర్పాట్లలో బిజీగా ఉండి వెళ్ళలేకపోయాను. ఆదివారమే జనతా కర్ఫ్యూ, వెంటనే లాక్డౌన్ వచ్చేసాయి. అదృష్టమో, దురదృష్టమో భార్యా పిల్లలు హైదరాబాదులో నేను అక్కడ గుంటూరులో రెండు రాష్ట్రాలలో ఇరుక్కునే ఇబ్బంది తప్పింది. మా బాబాయిలు ముగ్గురు మటుకు అక్కడ మూడు నెలలు ఇరుక్కుపోయారు.

😀 జూన్-జులై నెలల్లో ఈ కరోనా గందరగోళంలోనే, అనుకోకుండా దొరికిన విశ్రాంతి, సమయంతో కెరీర్లో 16 ఏళ్ల తర్వాత మొదటిసారి ఉద్యోగం మారుదాం అనుకున్నాను. ఒక్కటే కంపెనీకి అప్లై చేశాను, ఆరు రౌండ్ల ఇంటర్వ్యూలు పూర్తిచేసి ఇ ఆ కంపెనీ ఆఫర్ తీసుకున్నా.

😐ఈ కరోనా పరిస్థితులలో 250000 టైటానిక్ నుండి 700 బుల్లి పడవకు దూకే తెగువ, దురద బహుశా కొద్దిమందికే ఉంటుందేమో.

 😀 ఈ కొత్త కంపెనీకి మారటం అనేది ఇది సరైన నిర్ణయమా కాదా సమయమే చెబుతుందిగానీ, పాత కంపెనీకి రాజీనామా చేయటం చెత్త నిర్ణయమైతే కాదని ఇవాళ 31 వ తారీకు నా బ్యాంక్ అకౌంట్ కి వచ్చిన మొదటి పూర్తి నెల జీతం రుజువు చేసింది.

😔ఈ డిసెంబర్లో నా పుట్టినరోజునాడు పొద్దున్నే మా ఆవిడ తన పుట్టింటి నుంచి ఫోన్ చేసింది, విషెస్ చెప్పడానికి కాదు మా అత్తగారు ఇక లేరు అని చెప్పడానికి. సరేనని వెంటనే కారు తీసుకుని బయలుదేరాను ఆరోజు రైతుల సమ్మెలో భాగంగా దేశ వ్యాప్త బంద్ అని తెలియక. మూడు ఊళ్ళ దగ్గర బ్రతిమిలాడుకొని తప్పించుకున్నా, సూర్యాపేట దాటాక నాలుగో చోట ఒక బ్రిడ్జి పై ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయా. పొద్దటి నుంచి బ్రేక్ ఫాస్ట్ లంచ్ లేకుండా మధ్యాహ్నం 1:30 కి గంటన్నరపాటు ఒక్కడినే అలా కార్ లో కూర్చున్నా. నా పరిస్థితి తెలియక చుట్టాలూ మిత్రులేమో పుట్టినరోజు విషెస్ కాల్స్ మెసేజెస్ పంపిస్తున్నారు. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు ఇదే. అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే అంత్యక్రియలకు సమయానికి అందుకోలేకపోయాను


😔సెప్టెంబర్ లో పిల్లలు ఇంట్లో ఉండి ఉండీ విసిగిపోయారని మొదటిసారి ధైర్యం చేసి బాగా దగ్గర ఉన్న వాళ్ళ ఇంటికి వేరే ఊరు వెళ్ళాం. అక్కడ ఒక నాలుగు రోజులు ఉండి తిరిగి వచ్చాము నేను తిరిగి వచ్చిన రెండు రోజులకి ఆ వ్యక్తికి కరోనా వచ్చింది. మాకు వస్తుందేమో అని భయం కన్నా అతనికి తగ్గాలి అని టెన్షన్ మాకు ఎక్కువ ఉండింది. అదృష్టవశాత్తు కోలుకున్నాడు.

😐కరోనా సమయంలో ఇద్దరు పిల్లలు (7,3 ఏళ్ళు) తీసుకొని మూడు పెళ్లిళ్లు, ఒక చావు, ఒక బీచ్, ఒక పుణ్యక్షేత్రం తిరిగాను. బాగా ఎక్కువ ఉన్న రోజుల్లో ఒక పెళ్లి, ఒక చావు వెళ్ళటానికి కుదరక ఆగిపోయాను.

😐ఈ డిసెంబర్ లో 40వ వడిలో పడతానని ఈ సంవత్సరం మొదట్లో 6 కిలోలు బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. అనుకోకుండా దొరికిన సమయంతో ఆ మేరకు కృషి చేశాను - యోగా, సూర్యనమస్కారాలు, అన్నిరకాల డైట్లు - జీఎం డైట్, ఇంటర్మిటంట్ ఫాస్టింగ్, మంతెన గారి పచ్చి కూరగాయలు డైటు కూడా చేశాను. మధ్యలో ఒకట్రెండు సార్లు నా -6 కిలోల టార్గెట్ రీచ్ అయినాగానీ ఇవాళ్టికి చూసుకుంటే కేవలం 1.5 కిలోలు మాత్రమే తగ్గాను. సర్లే 9 నెలలపాటు ఇంట్లోనే ఉన్నప్పుడు పెరగకుండా కిలోన్నర తగ్గాను కాబట్టి విజయం కిందే లెక్క.



😀 9 నెలలు అనుకోకుండా వర్క్ ఫ్రొం హోమ్ అవకాశం దొరకడం వలన, అంటే 180 పనిదినాలు ఆఫీస్ కి రాను పోను 140 కిలోమీటర్లు రోజూ డ్రైవింగ్ చేసే పని తప్పింది. 1,600 లీటర్ల డీజిల్ ఆమేర భూమి పైకి ఉద్గారాలు వదలకుండా, అలాగే 27 వేల కిలోమీటర్లు మైలేజీ, కారు అరుగుదల పొదుపు చేశా. పనిలో పని నా శరీరాన్ని నా సమయాన్ని కూడా కాపాడుకున్నా.

😀 ఇక చివరగా కోరా తెలుగులో 100+ సమాధానాలు 100+ వీక్షణలు లు సంపాదించుకున్నా.

పోస్టు మొత్తం చదివినందుకు నెనర్లు. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

25, డిసెంబర్ 2020, శుక్రవారం

జర్నీ - ప్రమాదాలు

 నేను టీనేజిలో ఉన్నప్పుడు, ప్రమాద వార్తలను చదివినప్పుడు / చూసినప్పుడల్లా, ఛా!! ఆ బస్సు / రైలులో నేను ఎందుకు లేను అని అనుకునేవాడిని; నేను అలాంటి బస్సు / రైలులో ప్రయాణిస్తూ ప్రమాదం నుండి అద్భుతంగా తప్పించుకున్నట్టు కలలు కనేవాడిని. కానీ, నేను ఇంజనీరింగు చేరేదాక ఎప్పుడూ జరగలేదు. * దయచేసి, నన్ను శాడిస్ట్ / సైకో / దుర్మార్గుడిగా భావించవద్దు.

ఏడేళ్ళ వయసులో ఒక మోస్తరు ప్రమాదమే జరిగింది - 80ల్లో ఒక రోజు విజయవాడ బెంజి సర్కిల్ దగ్గర, మా స్కూటరుని లారీ గుద్దింది. ముందు నించున్న అన్నయకి, నాన్నకి ఏం కాలేదుగానీ, వెనక కూర్చున్న నేను దొర్లకుంటూ దాదాపు లారి చక్రం దగ్గర పడ్డాను. చుట్టుపక్కలవారు అక్కడే ఉన్న డా|| సమరంగారి హాస్పిటలుకు తీసుకువెళ్ళారు. కొన్ని నెలల తరువాత, నాకు జ్వరం వచ్చినపుడు ఆయన దగ్గరకి తీసుకువెళితే గుర్తు పట్టి అడిగారు.

11 ఏళ్ళ వయసులో, బస్సులో వెనుక కుడి వైపు కిటికీ పక్కన ఒక్కడినీ కూర్చున్నాను, అమ్మ మరియు అన్నయ ముందు సీట్లలో కూర్చున్నారు. దారిలో ఒక గ్రామంలో బిజీగా ఉన్న రహదారిపై, బస్సు ఆగి ఉన్నప్పుడు, ఎదురుగా నుండి వస్తున్న లారీ వెనుక భాగం బస్సును తాకింది మరియు దాని వెనుక-తలుపు గొలుసులు నేను కూర్చున్న చోట కిటికీలో చిక్కుకున్నాయి. అమ్మతో సహా అందరూ భయపడ్డారు, కాని నేను దాన్ని సరదాగా చూస్తున్నాను. కిటికీ కూడా పగులకపోవటంతో థ్రిల్లింగ్గా అనిపించక చాలా బాధపడ్డాను.

ఇంజనీరింగ్ చేరాక ఈ దురద (ప్రమాదం జరగాలి, బతికి బయటపడాలి) విపరీతంగా పెరిగింది. నేను హైవేపై 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళాశాలకు బస్సులో వెళ్లేవాడిని. దాదాపు ప్రతి వారం హైవేపై ప్రమాదాలు చూసేవాడిని. నేను చూసేటప్పుడు వాటిలో ఒక్కటీ ఎందుకు జరగదు? నేను వెళ్తున్న బస్సుకు ఎందుకు జరగదు? ఆ ప్రయాణాల్లో, నేను కొన్ని పెద్ద ప్రమాద దృశ్యాలను చూశాను. మేము వెళ్ళడానికి కొన్ని క్షణాలు ముందూ జరిగినవి ఉన్నాయి - మా బస్సుకు జరిగి ఉండవచ్చు కదా . అలాంటి ప్రమాదాలలో ఒక ప్రైవేట్ బస్సు యొక్క ఒక వైపు పూర్తిగా లేచిపోయి 30 మృతదేహాలను ఆటోలలోకి తరలించారు.

కానీ, నా ఎదురుచూపులు ఒక రోజు ఫలించాయి. మూడవ సంవత్సరంలో, నేను మరియు మరో నలుగురు క్లాస్‌మేట్స్ కాలేజీలో ఎక్స్‌ప్రెస్ బస్సులో ఎక్కాము. 10 నిమిషాల తరువాత, డ్రైవర్ ఒక ఓవర్‌లోడ్ (మిరప బస్తాలు) ట్రాక్టర్ని అధిగమించడానికి ప్రయత్నించాడు - ట్రాక్టర్ హైవే పక్క గుంటలో పడిపోయింది - అదే సమయంలో ఎదురుగా ఉన్న ఒక ట్రక్ మా బస్సును కుడి వైపున ీకొట్టింది. ఎవరూ గాయపడలేదు. మమ్మల్ని మరో బస్సులో పెట్టారు. ఈసారి, నేను డ్రైవర్ పక్కన నిలబడి ఉన్నాను. ప్రయాణంలో ఇరవై నిమిషాల తరువాత, ఒక 18-చక్రాల ట్రక్-ట్రైలర్‌ను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, బస్సు ట్రైలర్‌ను ముందు వైపు తాకింది. ప్రత్యక్ష ప్రమాదం చూడటం మరియు ఒకే ప్రయాణంలో రెండు సంఘటనలు జరగడం - బాగుందిగానీ చాలా త్వరగా అయిపోయింది, చిన్న హిటే అయినందున పూర్తిగా సంతృప్తి చెందలేదు. మళ్ళీ, ఎవరూ గాయపడలేదు.

ఇంకా ఎదురుచూస్తున్నా - కొన్ని నెలల తరువాత, నేనూ, నా స్నేహితుడు LM (వీడు బస్ ఎక్కగానే నిద్ర పోతాడు) కాలేజి తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కాం. నేను చివరి వరుస సీటు తీసుకున్నాను. వాడు ముందు వరుసలో ఉన్నాడు. LM నిద్ర ప్రారంభమైంది; నేను అడ్డంగా పడుకున్న చివరి వరుసలో నిద్రించడానికి ప్రయత్నించాను, కాని పట్టలేదు. కాబట్టి, నేను లేచి ఎడమవైపు కిటికీగుండా చూడటం ప్రారంభించాను; అకస్మాత్తుగా ఒక బ్యాంగ్! మరియు మరొక బ్యాంగ్! మా ముందున్న ఒక లారీ డ్రైవర్ ఆకస్మిక బ్రేక్‌ను కొట్టాడు; మా బస్సు డ్రైవర్ తన ప్రయత్నం చేసాడు, కాని గుద్దడాన్ని ఆపలేకపోయాడు; ముందు అద్దాలు పగిలాయి. అదే సమయంలో, మరొక లారీ మా బస్సును వెనుక నుండి ఢీకొట్టింది; ఇది పాత టాటా లారీ, ఇంజిన్ బయటకు ఉంటుంది. చివరి వరుస కుడి వైపున దెబ్బతిన్న లారీ ఇంజిన్ బస్సులోకి పొడుచుకు వచ్చింది. నేనక్కడే, ఈ గుద్దుకోవడాన్ని చూస్తూ అదే బస్సు చివరి వరుసలో ఎడమ వైపున ఉన్నాను.

లేదు, నేను షాకావ్వలేదు. నాకు గాయాలు కాలేదు. ఆకస్మిక బ్రేక్ కారణంగా బస్సులో చాలా మంది గాయపడ్డారు, ముఖ్యంగా ముందు సీట్లకు నుదుర్లు తగిలాయి. నేను LM ని నిద్ర లేపా - అవును, వాడు ఈ హడావిడిలోనూ ఇంకా నిద్రపోతున్నాడు - కళ్ళు రుద్దుకుంటూ అడిగాడు, “ఏమిటి! గుంటూరు అప్పుడే వచ్చిందా? ” - వాడిని తరువాత కాలేజీలో ఎంత ఏడిపించానో వేరే చెప్పనవసరం లేదు. అతను బస్సులలో నిద్రిస్తున్నప్పుడు జరిగిన వింత అనుభవాలు పూర్తి జవాబు రాయగలను.

వేరే బస్సు ఎక్కి గుంటూరు వచ్చాం. అక్కడ - ఆ క్షణం - నా కల – ఆ రెండో బస్సులోని ప్రతి ఒక్కరూ వివరాలు అడుగుతున్నారు మరియు నేను కథ చెబుతున్నాను - నేను ప్రత్యక్ష ప్రసారం చేసిన ప్రత్యక్ష ప్రమాదం.

ఆ తరువాత గత 17 ఏళ్లుగా హైదరాబాదు-విజయవాడ హైవేపై బస్సులో కొన్ని వందలసార్లు ప్రయాణం, కారులోనూ చాలా సార్లు నడుపుతూ వెళ్ళా - చిన్నచిన్నవి తప్ప ఏమీ జరగలేదు. స్వస్తి!