20, అక్టోబర్ 2010, బుధవారం

సుందోపసుందులు - 2 : గుంటూరు-కాకినాడ బస్సుయాత్ర - 2

క్రిందటి భాగంకి కొనసాగింపు


...అలా బయలుదేరిన రావులపాలెం బైపాస్ ఎక్స్‌ప్రెస్ రామవరప్పాడు రింగురోడ్డు దాటి విజయవాడ బయటపడేసరికి మూడయ్యింది. అది ఇంకా ఎండలు పూర్తిగా తగ్గని రోజులు. మన ప్రయాణమేమో గుంటూరు, బెజవాడ, ఇలా. ఉన్నదేమో మిట్టమధ్యాహ్నం హైవేపై బస్సులో. ఇంక ఒక్కటే ఉక్క. నాకేమో ప్రయాణాల్లో నిద్రపట్టదు. రాత్రి రెండిటికి కూడా కిటికీలోకి తలపెట్టి చూస్తుంటా. అందుకే నాకు వోల్వో ఇష్టముండదు. ముందురాత్రి కొంచెంకూడ నిద్రలేపోటానికి అదీ ఒక కారణం. మావాడేమో నాకు పూర్తి విరుద్ధం. వాడదృష్టవంతుడు. ఇలా పిలవగానే, వుహూఁ అసలు పిలవకుండానే అలా నిద్రాదేవి కరుణిస్తుంది.

గుంటూరు బస్టాండులో బస్సెక్కితే చిలకలూరిపేట కాలేజిగేటు ముందు మేం కదిపిలేపేవరకు హాయిగా పడుకుంటాడు. ఒకసారి అలాగే పేటలో ఎక్కి పడుకుని విజయవాడలో కండక్టర్ ’బాబూ లేమ్మా, ఇదే లాస్ట్ స్టాపు’ అంటే లేచి, ’అరే ఇదేంటీ, గుంటూరు బస్టాండులా లేదే’ అనాశ్చర్యపోయి అదే బస్సులో తిరిగొచ్చాడు. వాడి నిద్రగురించి ఒక పూర్తి టపా కేటాయించాలి తీరికున్నపుడు.

సరే వాడేమో అలా హాయిగా ఊహాలోకాల్లో విహరిస్తుంటే, నేనేమో పొలాలని, వెనక్కి పరిగెడుతున్న లారీలు, చెట్లు, ఊళ్ళు, ఊళ్ళ బోర్డులు, మైలురాళ్ళు, ఇలా చూసుకుంటూ - మరి అవి ఐపాడ్లుకాదు కదా, పామాట ఆడుకోవడానికి సెల్ఫోను కూడా లేనిరోజులు. ఇంతలో డ్రైవరుకి టీ తాగాలనిపించిందో, మరి ఆ క్యాంటీనువాడితో అండర్స్టాండిగో హనుమాన్ జంక్షను బస్టాండులో ఆపాడు. అలా టిఫినీలు, కాఫీలు, టీలు అయ్యి మళ్ళీ రోడ్డెక్కేసరికి నాలుగు.

అలా ఏలూరు బైపాస్ జంక్షన్లు రెండూ (మొదటిది దింపడానికి, రెండవది ఎక్కించుకోవడానికి: మరి బైపాస్ ఎక్స్‌ప్రెస్ కదా, ఊళ్ళోకి పోదట), తాడేపల్లిగూడెం బైపాస్ జంక్షను దాటామ్. ఈలోపు గడియారంలో చిన్నముల్లు ఐదు దాటింది. అప్పటికి మావాడు లేచి, ఏరా ఇంకా రాలేదా? మూడుగంటల్లో వెళ్ళిపోతామన్నావ్. నాక్కాలిందిగానీ, మళ్ళీ వాడు పడుకుంటాడేమో, నాకెవ్వరూ దొరకరు కాలక్షేపం చేయడానికి అని ఊరుకున్నా.

సర్లేండి, మరీ బోరుకొట్టిస్తున్నా, ఇలాంటి ప్రయాణాలు అందరికీ వుండేవేగా అనుకుంటుండుంటారు. కొంచెం "మధ్యలో డ్రైవరుగారు తణుకులోకి బస్సుతిప్పి ఇచ్చిన్న ఝలక్ వదిలేస్తే", ఎట్టకేలకు ఆరు-ఆరున్నరకి రావులపాలెం చేరాం.

అబ్బా బయటపడ్డాంరా బాబూ అని దిగిచూస్తే కాకినాడకి బస్సులేదు. కడుపులోనేమో కాలుతుంది. ఎదురుచూసే జనాలేమో చాలామంది. తిండానికి వెళ్ళితే బస్సుపోతుందేమో, లేదా సీటు దొరకదేమోనని. ఒక్క పదినిమిషాలు చూసి కాఫీ తెచ్చుకున్నాం. అలా ఒక్క గుక్క తాగామోలేదో బస్సొచ్చింది. కాఫీగ్లాసులు పడేసి దాడిచేసి ఆఖర్న ఒక రెండు సీట్లు సంపాదించాం. ఇంకప్పుడు ఫోన్లు మొదలుపెట్టాం, కాకినాడలో ఎక్కడ దిగాలి, ఎవరు వస్తారు మమ్మలి మండపం తీసుకెళ్ళడానికి. నాకు లేదన్నాగానీ, మావాడిదగ్గరలేదని చెప్పలేదుగా. ఆ మాత్రం ఏర్పాట్లు, జాగ్రత్తలు లేకుండ నేను కొత్త చోటుకి వెళ్ళనుగా.

ఇంక ఈ కాకినాడ బస్సువాళ్ళు (డైవరు-కండక్టరు) బైపాస్ ఎక్స్‌ప్రెస్సువాళ్ళకి పోటీ - బహుశా ఒకే డిపోనేమో. వాళ్ళు టిక్కెట్లు కొట్టడానికి రావులపాలెం బయట, మండపేట, రామచంద్రాపురం బస్టాండు, కాకినాడ ఊరిబయట మూడు స్టాపులు ఆపుకుంటూ - బయటేమో చీకటి, మావాళ్ళు చెప్పిన స్టాపు దాటేసేమోనని డౌట్లు. మిత్రుల ఫోన్లు రెస్పాన్సులేదు. ఇంకేం టెన్షన్లు. టౌనులోకొచ్చాక ఎక్కడో ఒకచోట దిగేశాం.

అప్పుడు ఫ్రెండుకి ఫోను చేస్తే వాడు ’అక్కడెందుకు దిగార్రా’ అని తిట్టి వచ్చి తీసుకెళ్ళాడు. పెళ్ళిమండపంకి ఎంటరవ్వగానే సీదా భోజనాల ఫ్లోరుకి తీసుకెళ్ళాడు. మా గ్యాంగు అక్కడ - హాయిగా కబుర్లు చెప్పుకుంటూ - మరి కాలేజీ నించి ఎవరి దారిన వాళ్ళెళ్ళిపోయాక ఏడాదికి కలుసుకున్నారుగా. అన్నీ వడ్డిస్తున్నారు. అరే, అదేంటిరా క్రింద పెళ్ళికెళ్ళొద్దాంరా అంటే ఒక్కసారిగా నవ్వడం మొదలు. మరప్పుడేమో ఎనిమిదవుతుంది, ముహూర్తం ఏడున్నరకి. సరే ఇంతలో కృష్ణ వచ్చి వాళ్ళక్కాబావల్ని (పెళ్ళి జంట) పరిచయం చేస్తా అని తీసుకెళ్ళాడు. చూశారా, పెళ్ళికూతురుగానీ, పెళ్ళికొడుకుగానీ తెలీకుండానే ఎగేసుకొని వెళ్ళిపోయాం.

మండపంలోకెళ్తే పట్టుచీరలు-సెంటువాసనలు: మనమేమో తుక్కుబట్టలూ-చెమటకంపులు. సరే అభినందనలు చెప్పి పైకొచ్చాం. అక్కడ షాకు - విజయవాడలో ధైర్యంచేసి స్టేషనుకి పరిగెట్టిన మావాడు కిరణ్ - హుషారుగా కబుర్లు చెప్తూ. నోరెళ్ళబెట్టిన మమ్మల్ని చూసి, ఆ రైలు లేటురా, దొరికింది, ఆరింటికే వచ్చానన్నాడు. ఏం చేస్తాం. మీరెలా వచ్చార్రా అని అడిగాడు. అదో పెద్ద కథలేరా, ఇప్పుడు చెప్పే ఓపికలేదులే.

ఇంక మిత్రులు భోజనాలు వడ్డిచడం మొదలుపెట్టారు. ఆకలితో నకనకలాడుతున్నా అందరం చాలా కాలానికి కలిసాం, కలిసి తిందాం అని ఆగీఆగి పదింటికి పూర్తి చేశాం.

ఇంతవరకు జరిగినది మాకు చాలా మామూలు అనుభవమే - అసలు ఘనకార్యం ఆ రాత్రికి చేశాం.

(సశేషం)

6 కామెంట్‌లు:

 1. పాపం అనిపించిందండి. ఒకో సారి ప్లాన్లు అలా మిస్ ఫైర్ అవుతుంటాయి.

  రిప్లయితొలగించు
 2. వేణూ శ్రీకాంత్‌‌గారు, మాకిలాంటివి అలవాటేలేండీ :-) అసలు మాస్టర్ డెసిషన్లు, వాటి ఫెయిల్యూర్లు ఆ రాత్రికి, తరవాతరోజూ జరిగాయి.

  రిప్లయితొలగించు
 3. జే.బి గారూ ! నమస్కారం
  మందాకినీ గారి బ్లాగ్ లో తెలుగు మీద మీ అభిప్రాయాన్ని చూసాను.నా నాలోకం బ్లాగ్ లో కూడా ఇదే విషయం మీద రెండు వ్యాసాలు పెట్టాను.ఒక్కసారి చూసి మీ స్పందన తెలియచేయమని మనవి.మీ ఈ బ్లాగ్ చిసి నేను ణా స్పందన తెలియచేస్తాను. http://karlapalem-hanumantharao.blogspot.com

  రిప్లయితొలగించు
 4. ప్లిచ్,ప్లిచ్, ఏం చేస్తాం,చెప్పు,తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాను.

  రిప్లయితొలగించు
 5. It is good to ponder over the olden stupid ways and have a laugh! Thanks for getting the sweet memories back to

  JB sir, write about the night journey Hyd - Gnt in general compartment (Deccan Passenger)

  Also right about our big and only trekking program...

  రిప్లయితొలగించు
 6. ఆ డక్కనురాత్రి కథ, కొండవీడుది త్వరలో వ్రాస్తా. వాటికన్న ముందు రాయాల్సినది కొంజేటి గుర్నాధం & సన్స్ (గుర్తుందా) కథ.

  రిప్లయితొలగించు

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in