1, నవంబర్ 2010, సోమవారం

కాలేజీ కబుర్లు: 'మీరు చూచిన ఇంజినీరింగు అద్భుతం'

అది ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం. మూడో నెల్లోకొచ్చాం. ఇంగ్లీష్ ప్రొఫెసర్ రెండవ ఇంటర్నల్ దిద్దినపేపర్లు పట్టుకుని వచ్చారు.

అందరిలోను ఆత్రుత, వారిమార్కులే కాదు, క్లాసులో ఒకబ్బాయికి ఎంతొచ్చాయని. ఒక్కక్కరివీ వస్తున్నాయిగానీ అతనిది రావట్లేదు. అందరికీ కొంచెం, ఆ అబ్బాయికి అంతకన్నా ఎక్కువ ఉత్కంఠ. సాధారణంగా ఆ అబ్బాయి మార్కులగురించి అందరిలా ఎక్కువ టెన్షనుపడడు. ఎందుకంటే రాయడంవరకే మనవంతు, మార్కులు దిద్దేవాళ్ళ మూడు, దయ అని అతనిది ఒక మెట్టవేదాంతం. మరి ఆ అబ్బాయి ఎందుకు తపనపడుతున్నాడంటే ఒక నెల వెనక్కి మొదటి ఇంటర్నలుకి వెళ్ళాలి.

**********

ఫ్లాష్‌బాక్లో ఫ్లాష్బాకుకి వెళ్ళితే...

**********
మొదటి ఇంటర్నలు ఫలితాలు ఒక్కొక్క సబ్జెక్టుకిస్తున్నారు. మొదటిసారికాబట్టి అందరిలో ఒక ఆసక్తి, ఎవరికి ఎలా వచ్చాయో, ఎవరు తోపో, ఎవరుకాదో, ఎవరు మనకి పోటీ, ఎవరు మనకి వచ్చే పరీక్షల్లో సాయంచేస్తారో - ఇలా ఒక తహతహ. ఎంసెట్ రాంకుతో కొంచెం అందాజా వెయ్యొచ్చుగానీ, మరి పాలిటెక్నికునించి ఈసెట్ రాంకులు వచ్చినవారుగూడ వున్నారు.

మొదటగ ఇంగ్లీషు మార్కులిచ్చారు. సెంటెన్సు కరెక్షను చేయమని 40 వాక్యాలు ఇచ్చారు (అప్పటికింకా పాఠ్యపుస్తకాలు రాలా). ఈ అబ్బాయికి ఇరవైకి పంతొమ్మిదిన్నర (ఒక్కటే తప్పు) వచ్చాయి. అదే కాలేజీ టాపుస్కోరు. ఇద్దరుముగ్గురికి 12-13 వచ్చాయి (15 పైన ఎవరికీ క్లాసులో వచ్చినట్లు గుర్తులేదు). మిగతావారంతా తప్పారు. ఇంక ఇంగ్లీషుసారు ఆ పేపరుతీసుకుని ప్రతి బ్రాంచిలో ప్రదర్శనకి పెట్టిమరీ అందరినీ తిట్టారు చూసి బుద్ధితెచ్చుకోమని. మొత్తం కాలేజీలో పట్టుమని పదిమంది కూడ పాసవ్వలేదు. కాలేజీలో ఇంకొక్కళ్ళకి 15పై వచ్చినట్టున్నాయి.

దురదృష్టవశాత్తూ ఆ రోజు ఆ అబ్బాయి కాలేజికి రాలేదు. పాపం ఎంతటి అవకాశం పోగోట్టుకున్నాడో. అప్పటివరకూ క్లాసులోనే చాలామందికి తెలియని అతడు ఒక్కసారి కాలేజిమొత్తం పాపులరు అయ్యాడట్లా!

***********
మళ్ళీ ఒక నెల ముందుకు తిరిగితే....

***********
జనాలు ఆ అబ్బాయికెన్నొచ్చాయని ఎదురుచూస్తుండగా...

రెండవ ఇంటర్నలు మార్కులిస్తూ అందరు భాషాధ్యపకులులాగే మావాళ్ళు రాసిన ఉత్తమసమాధానాలూ, కథలూ కాకరకాయలూ బయటికి చదువుతూ అందరినీ నవ్విస్తూ సాగుతున్నారు. అలా అందరివీ అయ్యాక, చివరికి ఆ అబ్బాయిపేపరు తీసారు.

20 మార్కుల పరీక్షలో ఒక 10-12 మార్కుల ప్రశ్న: "మీరు చూసిన ఒక ఇంజనీరింగు అద్భుతం వివరింపుడు"

సారు అతని పేపరు పట్టుకొని, "ఈ అబ్బాయికి పోయినసారి కాలేజిలో ఫస్టుమార్కు. అప్పుడు నేను చాలా ఆనందపడ్డా. హమ్మయ్య, ఈ కాలేజిలో ఒక్కడున్నాడు అని (ఆ అబ్బాయి గాల్లో తేలుతున్నాడు). ఇక ఈసారికొస్తే, మీకు నచ్చిన ఇంజనీరింగు అద్భుతం వ్రాయండయ్యా అంటే ’హౌరా బ్రిడ్జీ - ఒక ఇంజనీరింగు అద్భుతం’ అని హెడింగుపెట్టి ౬ పేజీలు రాశాడు. విషయం చదవడానికి బాగుంది. గ్రామరు బాగుంది. తప్పులేమాత్రంలేవు. ఇంతవరకు బాగుంది, బాగా రాశావు. కానీ చదివేది కంప్యూటరు సైన్సు. ఇంజనీరింగు అద్భుతమంటే కంప్యూటరు గురించి వ్రాస్తావనుకుంటే హౌరా బ్రిడ్జీ, గణపవరం బ్రిడ్జీ (మా కాలేజిపక్కనే ఎన్‌ఎచ్5పై వుంది) ఏంటయ్యా? కనీసం రోబోలగురించి రాయొచ్చుగా. అస్సలు ఇలా రాయొచ్చొనే ఆలోచనెలావచ్చిందంటావ్ నీకు? నువ్వు నిజమైన ఇంజినీరింగు విద్యార్ధివనిపించుకున్నావ్ (ఇలా ఏవిషయమిచ్చినా పేజీలు నింపే సామర్ధ్యం, నేర్పు వాళ్ళకే, వారిలో జేఎన్టీయూవాళ్ళకి, అందులో మా క్లాసు సీఎస్‌ఈవారి సొంతమని నా గట్టి నమ్మకం)."


సారు చెప్పుతున్నంతసేపు ఆ అబ్బాయి నించోని వింటూ చూస్తున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు కలకత్తావెళ్ళి స్తంభాలులేని హౌరా బ్రిడ్జిచూసి నోరెళ్ళబెట్టివచ్చాడు. ఇంజినీరింగద్భుతం అనగానే అదే గుర్తొచ్చింది ఏం చేస్తాడు.

మొదటర్థంకాలా సారు తిడుతున్నాడా, పొగుడుతున్నాడాని. ఆ చివరివాక్యంతో అర్థమయిపోయింది.

ఇక క్లాసులో దృశ్యమేంటో, ఒక రెండుమూడు రోజులపాటు ఆ అబ్బాయికెంత టీజింగెదురయ్యిందో వేరే చెప్పక్కర్లేదనుకుంటా.

ఆ అబ్బాయింకెవరో కాదు ఈ జేబి అంటే నేనేనని ఈపాటికి మీకు తెలిసిపోయుండాలే.

14 కామెంట్‌లు:

  1. బాగుంది. :) మీరు మీ సబ్జెక్ట్ రిలేటెడ్ కాకపోయినా చక్కగా ఏదో ఒక విషయం రాసిచ్చారు. లాస్ట్ ఇంటర్నల్ ఎగ్జాంలో నా స్టూడెంట్ ఒకతను this, that అనే రెండు పదాలతో 6 అడిషనల్స్ రాసి మరీ ఇచ్చాడు. నా పరిస్థితి ఎలా ఉండుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. :)

    రిప్లయితొలగించండి
  2. ఇందులో నాకు అర్ధం కాని తిరకాసు ఏదైనా ఉందా? హౌరా బ్రిడ్జ్ ఒక ఇంజినీరింగ్ అద్భుతం అనే చెప్పుకొనేవారు ఆ కాలంలొ. సస్పెన్షన్ బ్రిడ్జ్ అని నా మిత్రుడొకడు ఓఅరగంట ఉపన్యాసం కూడా ఇచ్చాడు.నేనేదో జోక్ వేస్తే స్లైడు రూలు తీసుకొని నన్ను కొట్టడానికి వచ్చాడు.ఇంగ్లీషు మాష్టారు కి అబ్జెక్షను దేనికో? లేక నా బుర్రలో మట్టి నిండినది అని నిర్ధారణకు వచ్చేస్తారా?

    రిప్లయితొలగించండి
  3. @మంజుగారు, చెప్పాలంటే.... మంజుగారు: అవును కదండీ, మావాళ్ళూ అదే అన్నారు, "You are too intelligent" అని :D

    @శిశిరగారు: మీవిద్యార్ధిలాంటివాళ్ళవి చాలా సాధారణమండీ. మేం (మా క్లాసువాళ్ళం) అర్ధమయ్యే విషయాలతో పేజీలకు పేజీలు నింపేవాళ్ళం. కాకపోతే రాసినదానికీ, అడిగిన ప్రశ్నకీ సంబంధం వెతుక్కోకూడదు. :-)

    @సుబ్రహ్మణ్యంగారు: అంటే, మరి మీయొక్క ఆ కాలంలో చెల్లుతుందిగానీ, మరి క్రొత్త సహస్రాబ్దిలో కంప్యూటర్లూ, రోబోలూ, సెల్‌‌ఫోన్లూ, బోయింగులూ, రాకెట్లూ, మొదలగునవి సాధారణ విషయాలయిపోయాక, ఒక ఇంజినీరింగు విద్యార్ధి చీపుగా హౌరా బ్రిడ్జి భేషుభేషు అంటే ఊరుకుంటారా చెప్పండి. అలా కట్టడాలగూర్చి రాయాలి అంటే ఒక ఈఫిల్ టవరో, ఒక లండన్ మిలేనియం చక్రమో, ఒక న్యూయార్క్ లిబర్టీ స్టాట్యూనో వివరించవలెననీ మా మాస్టారి ఉద్దేశ్యం.

    రిప్లయితొలగించండి
  4. ఇపుడు ఈ-సెట్ వాళ్ళూ రెండవ సంవత్సరంలో వస్తున్నారు. మనం నాలుగేళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకి,నాకు వచ్చిన,నచ్చిన సమాధానాలు రాసి 75 శాతం సంపాదించాను.

    రిప్లయితొలగించండి
  5. హౌరా బ్రిడ్జి ఇంజనీరింగ్ అద్భుతం అనడంలో ఏమాత్రం సందేహం లేదండీ. అందుకే మీరు రాసినది ఆసక్తికరంగా ఉంది అని కూడా ఆయన మెచ్చుకొని ఉంటారు. మీరన్నట్లు మరింత అధునాతనమైనది ఎక్స్పెక్ట్ చేశారేమో.

    శిశిర గారు మీస్టూడెంట్ సూపరండి :-)

    రిప్లయితొలగించండి
  6. @విశ్వనాథ్: ఎవరైనా వచ్చిన, నచ్చిన సమాధానాలే వ్రాస్తారుగా. రానివి, నచ్చనివి ఎలా వ్రాస్తారంటావ్? :-)

    @వేణూ శ్రీకాంత్‌‌గారు: అవునండీ, హౌరా బ్రిడ్జి గురించి ఎవరైనా వ్రాస్తారనీ, అదీ మొదటి ఇంటర్నల్లో టాపరునుండీ ఊహించలా :-)

    రిప్లయితొలగించండి
  7. వేణూ శ్రీకాంత్ గారు,
    అతనిని పిలిచి తిడదామని నేను సెట్టింగ్ అంతా రెడీ చేసుకున్నాప్పటికి "మీరు లెసన్సే కాకుండా మాకు లైఫ్ లో ఉపయోగపడే చాలా విషయాలు చెప్తారు mADam, అందుకే మీరంటే మాకిష్టం" అన్నాడు. ఇంకేం చేయగలను చెప్పండి :)

    రిప్లయితొలగించండి
  8. నా బుఱ్ఱలో కొంచెం మట్టి మిగిలి ఉందేమో నని అనుకునేవాడిని.అబ్బే అంతా శూన్యమే నని తేలిపోయింది. మీరెంత modern era గురించి చెప్పినా సరే కొన్ని కొన్ని path breaking టెక్నాలజీస్ ఉంటాయను కుంటాను.ever green. హౌరా బ్రిడ్జ్ ఆ కోవలోకి వస్తుందనుకుంటాను.ఇప్పటికీ కొలొకొత్తా వెళ్ళిన వారు హౌరా బ్రిడ్జి చూడకుండా రారు.

    రిప్లయితొలగించండి
  9. హ హ శిశిర గారు తనెవరో మహా తెలివైన వాడిలా ఉన్నాడు :-)

    రిప్లయితొలగించండి
  10. అయ్యో, హౌరావంతెన గొప్పదనాన్ని నేనెక్కడ కాదన్నానండి - దాన్ని చూసి నోరెళ్ళబెట్టేకదా, నేను పరీక్షలో రాసిందీ. మీదగ్గర వేరే ఏమున్నాయో నాకు తెలీదుగానీ, నవ్వులు వున్నాయి. అవి మాతో పంచుకుంటూ వుండండీ

    రిప్లయితొలగించండి
  11. @జాబిలిగారు: ఇరవైకి పద్దెనిమిదిన్నర వచ్చాయండి. జెఎన్టీయూ అంత దృశ్యంలేదులేండి, జేఎన్టీయుకింద వున్న రెండొందలకాలేజీల్లో ఆఖరి పదిలో (అప్పట్లో) వున్న ఒక కళాశాల మాది.

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in