31, డిసెంబర్ 2020, గురువారం

2020 రోలర్ కోస్టర్ సవారీ

 2020 సంవత్సరం ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ఎంతో కొంత ప్రభావితం చేసింది. నేను కూడా ఈ సంవత్సరంని నేను, నా కుటుంబము తల్లిదండ్రులతో, అన్నయ్య కుటుంబంతో సహా కోవిడ్ బారినపడకుండా దాటేసినందుకు సంతోషంగానూ కృతజ్ఞతతోనూ ఉన్నాను. కానీ అదే సమయంలో ఈ సంవత్సరం నాకు రోలర్ కోస్టర్ సవారీ లాగా అనిపించింది.

😔జనవరిలో మా పాప పుట్టినరోజుకి ఒక రోజు ముందు అనుకోకుండా సొంత ఊరు వెళ్లాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఎప్పుడూ పుట్టిన రోజు హైదరాబాద్లో జరుపుకొని తర్వాతి రోజు సంక్రాంతి అని గుంటూరు వెళ్తాము. మొదటి పుట్టినరోజు తర్వాత మళ్లీ ఎనిమిదవ పుట్టినరోజుకి మా ఊర్లో జరుపుకోవడానికి కుదిరింది. సాయంత్రం కరెక్ట్గా కేకు తేవటానికి బేకరీ కి బయల్దేరగా మా తాతగారు కిందపడి తలకి దెబ్బ తగిలితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆ రాత్రంతా అక్కడే ఉన్నాను మా పాప కేక్ కటింగ్ కి నేను లేను తను చాలా బాధపడింది.

😔ఫిబ్రవరిలో శివరాత్రి తెల్లవారుజామున మూడింటికి సొంత ఊరు నుంచి ఫోన్ వచ్చింది మా బామ్మ ఇకలేరు అని. వెంటనే కారు ఏసుకుని ఫ్యామిలీ అంతా వెళ్లాం. అంత్యక్రియలకు, పది రోజుల తర్వాత మళ్లీ కార్యక్రమాలకు రెండుసార్లు తిరిగాను హైదరాబాద్ నుంచి.

😐మార్చిలో మొదటి మాసికానికి ఒక్కడిని వెళ్లాల్సి ఉండంగా శుక్రవారం వర్క్ ఫ్రొం హోమ్ కి కావాల్సిన ఏర్పాట్లలో బిజీగా ఉండి వెళ్ళలేకపోయాను. ఆదివారమే జనతా కర్ఫ్యూ, వెంటనే లాక్డౌన్ వచ్చేసాయి. అదృష్టమో, దురదృష్టమో భార్యా పిల్లలు హైదరాబాదులో నేను అక్కడ గుంటూరులో రెండు రాష్ట్రాలలో ఇరుక్కునే ఇబ్బంది తప్పింది. మా బాబాయిలు ముగ్గురు మటుకు అక్కడ మూడు నెలలు ఇరుక్కుపోయారు.

😀 జూన్-జులై నెలల్లో ఈ కరోనా గందరగోళంలోనే, అనుకోకుండా దొరికిన విశ్రాంతి, సమయంతో కెరీర్లో 16 ఏళ్ల తర్వాత మొదటిసారి ఉద్యోగం మారుదాం అనుకున్నాను. ఒక్కటే కంపెనీకి అప్లై చేశాను, ఆరు రౌండ్ల ఇంటర్వ్యూలు పూర్తిచేసి ఇ ఆ కంపెనీ ఆఫర్ తీసుకున్నా.

😐ఈ కరోనా పరిస్థితులలో 250000 టైటానిక్ నుండి 700 బుల్లి పడవకు దూకే తెగువ, దురద బహుశా కొద్దిమందికే ఉంటుందేమో.

 😀 ఈ కొత్త కంపెనీకి మారటం అనేది ఇది సరైన నిర్ణయమా కాదా సమయమే చెబుతుందిగానీ, పాత కంపెనీకి రాజీనామా చేయటం చెత్త నిర్ణయమైతే కాదని ఇవాళ 31 వ తారీకు నా బ్యాంక్ అకౌంట్ కి వచ్చిన మొదటి పూర్తి నెల జీతం రుజువు చేసింది.

😔ఈ డిసెంబర్లో నా పుట్టినరోజునాడు పొద్దున్నే మా ఆవిడ తన పుట్టింటి నుంచి ఫోన్ చేసింది, విషెస్ చెప్పడానికి కాదు మా అత్తగారు ఇక లేరు అని చెప్పడానికి. సరేనని వెంటనే కారు తీసుకుని బయలుదేరాను ఆరోజు రైతుల సమ్మెలో భాగంగా దేశ వ్యాప్త బంద్ అని తెలియక. మూడు ఊళ్ళ దగ్గర బ్రతిమిలాడుకొని తప్పించుకున్నా, సూర్యాపేట దాటాక నాలుగో చోట ఒక బ్రిడ్జి పై ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయా. పొద్దటి నుంచి బ్రేక్ ఫాస్ట్ లంచ్ లేకుండా మధ్యాహ్నం 1:30 కి గంటన్నరపాటు ఒక్కడినే అలా కార్ లో కూర్చున్నా. నా పరిస్థితి తెలియక చుట్టాలూ మిత్రులేమో పుట్టినరోజు విషెస్ కాల్స్ మెసేజెస్ పంపిస్తున్నారు. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు ఇదే. అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే అంత్యక్రియలకు సమయానికి అందుకోలేకపోయాను


😔సెప్టెంబర్ లో పిల్లలు ఇంట్లో ఉండి ఉండీ విసిగిపోయారని మొదటిసారి ధైర్యం చేసి బాగా దగ్గర ఉన్న వాళ్ళ ఇంటికి వేరే ఊరు వెళ్ళాం. అక్కడ ఒక నాలుగు రోజులు ఉండి తిరిగి వచ్చాము నేను తిరిగి వచ్చిన రెండు రోజులకి ఆ వ్యక్తికి కరోనా వచ్చింది. మాకు వస్తుందేమో అని భయం కన్నా అతనికి తగ్గాలి అని టెన్షన్ మాకు ఎక్కువ ఉండింది. అదృష్టవశాత్తు కోలుకున్నాడు.

😐కరోనా సమయంలో ఇద్దరు పిల్లలు (7,3 ఏళ్ళు) తీసుకొని మూడు పెళ్లిళ్లు, ఒక చావు, ఒక బీచ్, ఒక పుణ్యక్షేత్రం తిరిగాను. బాగా ఎక్కువ ఉన్న రోజుల్లో ఒక పెళ్లి, ఒక చావు వెళ్ళటానికి కుదరక ఆగిపోయాను.

😐ఈ డిసెంబర్ లో 40వ వడిలో పడతానని ఈ సంవత్సరం మొదట్లో 6 కిలోలు బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. అనుకోకుండా దొరికిన సమయంతో ఆ మేరకు కృషి చేశాను - యోగా, సూర్యనమస్కారాలు, అన్నిరకాల డైట్లు - జీఎం డైట్, ఇంటర్మిటంట్ ఫాస్టింగ్, మంతెన గారి పచ్చి కూరగాయలు డైటు కూడా చేశాను. మధ్యలో ఒకట్రెండు సార్లు నా -6 కిలోల టార్గెట్ రీచ్ అయినాగానీ ఇవాళ్టికి చూసుకుంటే కేవలం 1.5 కిలోలు మాత్రమే తగ్గాను. సర్లే 9 నెలలపాటు ఇంట్లోనే ఉన్నప్పుడు పెరగకుండా కిలోన్నర తగ్గాను కాబట్టి విజయం కిందే లెక్క.



😀 9 నెలలు అనుకోకుండా వర్క్ ఫ్రొం హోమ్ అవకాశం దొరకడం వలన, అంటే 180 పనిదినాలు ఆఫీస్ కి రాను పోను 140 కిలోమీటర్లు రోజూ డ్రైవింగ్ చేసే పని తప్పింది. 1,600 లీటర్ల డీజిల్ ఆమేర భూమి పైకి ఉద్గారాలు వదలకుండా, అలాగే 27 వేల కిలోమీటర్లు మైలేజీ, కారు అరుగుదల పొదుపు చేశా. పనిలో పని నా శరీరాన్ని నా సమయాన్ని కూడా కాపాడుకున్నా.

😀 ఇక చివరగా కోరా తెలుగులో 100+ సమాధానాలు 100+ వీక్షణలు లు సంపాదించుకున్నా.

పోస్టు మొత్తం చదివినందుకు నెనర్లు. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

4 కామెంట్‌లు:

  1. మీరు బోస్టన్ నుండి మన దేశానికి తిరిగొచ్చేసారా?

    మొత్తం సంవత్సరంలో మీ జీవితంలో జరిగినవి బాగా సమరైజ్ చేశారు. ఒడిదుడుకులే కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎనీవే ఆ సంవత్సరం ముగిసింది. కొత్త సంవత్సరం ఇంతకన్నా సాఫీగా నడుస్తుందని ఆశిద్దాం. మీకు, మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. అవునండి. 2011లో తిరిగొచ్చాను. 2012లో మళ్లీ బోస్టన్ వెళ్ళొచ్చాను, 2014-15ల్లో మిన్నిసోట వెళ్ళొచ్చాను అండి. ఇక అప్పట్నుంచి వెళ్ళను బాబూ అని తప్పించుకుంటున్నా

    రిప్లయితొలగించండి
  3. // " ఇక అప్పట్నుంచి వెళ్ళను బాబూ అని తప్పించుకుంటున్నా" // హ్హ హ్హ understandably so 😀.

    మిన్నెసోటా రాష్ట్రానికి వెళ్ళొచ్చారా? నేనూ ఒకసారి వెళ్ళాను. "Land of 10,000 lakes" అని nickname. బాగుంటుంది. ముఖ్యంగా నాకు బాగా నచ్చినది డులుత్ లో (Duluth అనే ఊరు) ఉన్న Lake Superior. ఎంత పెద్ద మంచినీళ్ళ సరస్సు! (మినియాపోలిస్ సిటీ నుండి రెండు-రెండున్నర గంటల కారుప్రయాణం). మీరూ చూసే ఉంటారు. Awesome lake 👌.

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in