13, ఆగస్టు 2020, గురువారం

ప్రపంచ ఎడమచేతివాటంవారి దినం - ఆగస్టు 13

ఈరోజు, ఆగస్టు 13, ప్రపంచ ఎడమచేతివాటంవారి దినం. మాకంటూ ప్రత్యేకంగా ఒక రోజు ఉందని కూడా మాలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే, మాలో చాలా మందిని చిన్నపుడే బలవంతంగా కుడి చేయి వాడటానికి మార్చేస్తారు కాబట్టి.
కానీ ఎడమ చేతివాటం అంటే - కేవలం ఎడమ చేత్తో వ్రాయడం, ఎడమ చేత్తో బంతి విసరడం కాదు.
ఒక్కసారి మీ రోజువారి జీవితంలోకి తొంగిచూసి ఎన్ని పనులు మీరు కుడి-చేయి బదులు ఎడమ చేత్తో చేయగలరో చూడండి, ఎన్ని వస్తువులు/ఉపకరణాలు కుడి చేతివారికి డిజైన్ చేయబడి ఉన్నాయో చూడండీ -
వాష్ బేసిన్ నల్లా (త్యాప్) ఎడమ చేత్తో తిప్పండి. ఫ్రిజ్ తలుపు ఎడమ చేత్తో తీయండి. పాల ప్యాకెట్ కత్తెరతో కత్తిరించడానికి ఎడమ చేయి వాడండి. పొయ్యి బర్నరు, గ్యాస్ రెగులాటర్ ఎడమ చేత్తో తిప్పండి. కుక్కరుపైన మూత ఎడమ చేత్తో తిప్పండి. పీలరుతో తొక్క తీయండి. మీ చాకుకి ఒకవైపే పదును ఉంటె అదీ తెగదు. సీసా/డబ్బా మూతలు ఎడమ చేత్తో తిప్పండి.
ఫ్లష్ ట్యాంక్ నాబ్ ఎటు వైపు ఉంది? టీవీ రిమోటు ఆన్/ఆఫ్ బటన్ ఎక్కడుంది? కుడివైపు పై అంచున (టాప్ రైట్). చాలా ఇళ్ళల్లో, ప్లగ్ సాకెట్ ఎడమ వైపు, దాని స్విచ్ కుడి వైపు ఉంటాయి. బీరువా/అల్మరా తలుపుల హ్యాండిల్స్ కుడి చేత్తో తీయడానికి ఉంటాయి.
మీ చొక్కా బొత్తాలు (బటన్లు) ఒకసారి కేవలం ఎడమ చేత్తో పెట్టుకోండి, తీయండి. పాంట్ జిప్ ఎడమ చేత్తో పైకి లాగండి. జేబులో పెన్/చిల్లర ఎడం చేత్తో తీయండి.
ఎవరికన్నా ఆ డబ్బులు ఎడమ చేత్తో ఇవ్వండి. ఏటియంలో కార్డు ఎడమ చేత్తో పెట్టి, పిన్ ఎడమ చేత్తో కొట్టండి. ఫోను పవర్/వాల్యూం బటన్లు సాధారణంగా ఎటు వైపు ఉంటాయి?

స్కూల్లో/కాలేజిలో: జెల్ పెన్, లేదా స్కెచ్‌పెన్‌తో గీయండి. పెన్సిల్ ఎడమ చేత్తో, షార్పెనర్ కుడి చేత్తో పట్టుకుని చెక్కండి. జామెట్రీ తరగతిలో స్కేలు (రూలర్) కుడి చేతిలో, పెంచిల్ ఎడమ చేత్తో పట్టుకొని 5 సెం.మీ. గీత గీయండి. 0-5 చూస్కొని గీసారా? స్కేలు తిప్పి లేదా 15-10 గీసారా? ఇంజనీరింగు కాలేజిలో ద్రాఫ్టరు ఎడమ చేత్తో వ్రాసేవారికి ఎంత కష్టమో ఎపుడన్నా ఆలోచించారా?
చెక్కు పుస్తకంలో, పిల్లల డయరీలలో, ఆఫీసు అటెండెన్సు రిజిస్టరులో, కొరియరు అబ్బాయి ఇచ్చే బిల్లు కాగితంపై సంతకం ఎడమ చేత్తో పెట్టండి. - ఆ సంతకం పెట్టే కాలం ఎప్పుడూ పుస్తకం/కాగితం కుడి చేతి అంచున ఉంటుంది.
ఇక కేవలం చేతివాటమే కాదు, కాలివాటం-కన్నువాటం కూడా ఉంటాయి. వారు ఎడమ కాలుతో ఫుట్బాల్ ఆడతారు. ఉదాహరణకి కెమెరాలోకి ఎడమ కన్నుతో చూస్తారు. నాకు డీఎసెలార్ కెమెరాను వాడేటపుడు నా ఎడమ చెంపకున్న జిడ్డంతా ఆ కెమెరాకే ఉంటుంది - కేవలం, కెమెరాని కుడి చేత్తో పట్టుకొని, కుడి కన్నుతో చూసి, కుడి వేలితో షట్టర్ బటన్ నొక్కడనికి డిజైన్ చేయబడినవి.
ఇపుడు మీకు అర్ఠం అయి ఉంటుంది, మా పెడసరి-పుఱ్ఱెచేతి వాటం వాళ్ళ రోజువారి జీవితాలు. అది ఒక జీవన శైలి. మాకు మీకులాగా నాతురల్గా రానిది, మేము నెమ్మదిగా అలవాటు చేస్కునేవి. మేము చాలా వరకు చిన్నప్పటి నుండి అలవాటు చేస్కుంటాం. కానీ నాచురల్గా లేచే ఎడమ చేయి ఊరుకోడుగా - అప్పుడప్పు అదే కుడి చేయి కన్నా ముందు లేస్తూ ఉంటుంది.
అందుకే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరన్నా ఎడమ చేతివాటం లక్షణలు చూపిస్తూ ఉంటే, దయ చేసి వారిని హేళన చేయటం, ఎడమ చేయి మెలేసి, "అమ్మా/నాన్నా/తీచర్/సార్!, చేయి నొప్పుడుతుంది" అన్నా బలవంతాన కుడి చేత్తో వ్రాయించడం , అన్ని పనులు కుడి చేత్తో చేయించడం లాంటివి చేయమాకండి. వారికి ఏ చేయి వీలయితే అది వాడనివ్వండి. లేకపోతే వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

చివరిగా - ఎడమ చేతివారు క్రియేటివ్, ఎమోషనల్, అనలిటికల్ - వగైరా కొన్ని భావనలు ఉన్నాయి, కొన్ని థియరీలు ఉన్నాయి. ఇవి ఇంకా పుర్తిగా శాస్త్రీయంగా/వైద్యపరంగా నిరూపించబడలేదు.