22, అక్టోబర్ 2023, ఆదివారం

#కృష్ణారామా

 #కృష్ణారామా - ఈ సినిమా మలయాళం డబ్బింగుగా ఆహాలోనో ప్రైమ్ లోనో వచ్చుంటే ఈ పాటికి నా ఫేస్బుక్ ఫీడ్లో రివ్వ్యూలు నిండిపోయేవి.

సినిమా ఆహ్లాదంగా సకుటుంబంగా చూసేట్టు ఉంది, ఒక్క డైలాగు తప్ప. ఈ మధ్యన సకుటుంబంగా ఓటీటీ సినిమాలు చూడాలి అంటే చేతిలో రిమోటు పట్టుకోవాల్సి వస్తుంది. ఆ అవసరము ఈ సినిమాకు రాలేదు. ఏ సినిమా ఆసక్తిగా చూడని మా పదేళ్ల పాపకి కూడా నచ్చింది.
టీజరు చూసి రంగమార్తాండ, శతమానంభవతి టైపు పిట్లలకు రెక్కలొచ్చి ఎగిరిపోయిన గూడు కథేమో అనుకున్నా.
ట్రైలరు చూశాక లేదు, కొంత అడ్వాన్స్డుడ్ కథ, రాజేంద్రప్రసాదు ఏదైనా వెరైటీ సొల్యూషను కనుక్కుంటాడేమో అని అనుకున్నా. కానీ కథ తల్లిదండ్రులూ - ఎన్నారై పిల్లల సంబంధం కన్నా సోషలు మీడీయాను ఎక్కువ టచ్ చేసి కొంత రొటీనుకు భిన్నంగా వెళ్లింది. దానితో మెలోడ్రామా తగ్గి సీన్లు నూతనంగా అనిపించాయి. డైలాగులైతే దర్శకుడు రాజ్ మాదిరాజ్ గారి ఫేస్బుక్ పోస్టులు చదువుతున్నట్టే కొంత సరదాగా, కొంత సెటైరిక్గా భలే అనిపించాయి.
రాత్రి మామా మశ్చీంద్ర , ఈ రోజు కృష్ణారామా చూశాము - ఇంట్లో వారి వోట్లన్నీ #కృష్ణారామా కే పడ్డాయి.
పీ.ఎస్.
మొదటి సీన్లో 49వ వార్శికోత్సవానికి రాత్రి వెళ్లగానే కృష్ణా కళ్లు రామా మూయగానే మా ఇంటావిడ చార్మినార్ అని గెస్ చేసింది. 49 ఏళ్లు అయినా ఇంకా చూడలేదా అన్నది. 49 ఏళ్లుగా చూస్తూన్నదే అని రాజ్ గారి డైలాగు వెరైటీ.
పీ.ఎస్. 2
చివర్లో నాలుగు గంటలని సమయం చెప్పినప్పుడు యాంటిక్ గడియారాలు చూపించినపుడు వాటి గురించి వాకబు చేస్తూ రాజ్ మాదిరాజ్ గారు పెట్టిన పోస్టు గుర్తుకువచ్చింది. కానీ మా ఇంట్లో డబ్బా గడియారము ఒక్క క్షణము పాటు కనిపిస్తుందని ఊహించలేదు, ఏదో పోస్టు పెట్టారని నేను ఆయనను కన్స్టల్టు చేసి, 4కె అడిగారని నా పాడైపోయిన రెడ్మీ తీసి, అవసరమైతే గ్రాఫిక్సుతో తుడిపేసుకుంటారని గోడ పైనుండి తీసి బ్లూ కప్ బోర్డు బ్యాక్ గ్రౌండుతో రికార్డు చేసి పంపించానే గానీ ఎక్స్ప్ పెక్టేషన్ను ఏమీ పెట్టుకోలేదు. ఎలాగో ఎడిటింగులో మిస్ అయ్యి మా కప్ బోర్డుపై మావాడు చేసిన మరకలతో సహ తెరలోకెక్కింది. హహ్హాహా. థాంక్యూ డైరెక్టరు గారు.


8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

తేజ సినిమా - ఒక నిరాశ

 తేజ -

హీరో తరుణ్, నేనూ దాదాపు సమవయస్కులము. 80 ల చివర, 90 ల మొదలులో అంజలి, ఆదిత్య 369 వంటి చిత్రాలతో నచ్చాడు. ఉషాకిరణ్ మూవీస్ చిత్రాలు బాగుండేవి. అలాగే తేజ సినిమా థియేటర్లో చూశాను - నా వయసువాడు అలా టకటకా చెప్తుంటే, కంప్యూటరు - రోబో ఆపరేట్ చేస్తుంటే, వాడికంటూ గాడ్జట్సుతో సొంత గది అంటే భలే అనిపించింది. ఆ చివరిలో విలనును తిప్పలు పెట్టే క్లైమాక్సు వావ్ అనిపించింది.

కానీ ఆ చిత్రాన్ని మళ్లీ ఎపుడూ చూడలేదు - ఈటీవి వాడు ఆ చిత్రాన్ని మళ్లీ వేయలేదు, వేసినా అతి తక్కువసార్లు నాకు తెలియని సమయాలలో వేసి ఉంటాడు. ఉషాకిరణ్ వారిది కనుకా పైరేటెడ్ కూడా రాలేదు, యూట్యూబులోనూ కనిపించలేదు. ఈ మధ్యన వేరే ఏదో పాట కోసం ఈటీవి విన్ యాప్లో వెతుకుతుంటే కనిపించింది. 500 పెట్టి చందా కట్టి చూడడం మొదలు పెట్టాను.

నిజం చెప్పొద్దు, తేజ అక్క - ప్రియుడి మధ్యన మొదటి పాట చూడగానే నిరాశ కలిగింది - స్విమ్ సూట్, లిప్ లాక్ ముద్దు - ఇదేమి పిల్లల సినిమా అనిపించింది. రెండవ పాట కూడా కె.రా.రా శైలిలో ఉన్నది.😒

తేజ తెలివితేటలు చూపించినది మొదటి అరగంటలో ఒక నాలుగైదు సన్నివేశాలు మాత్రమే. ప్రేమ కథ ఎక్కువైంది. నేను ఊహించుకున్న - ఇంట్లో చిక్కుకుని విలనును తన తెలివితేటలతో ఎదురుకునే సీన్లు చివరి పది ఇరవై నిమిషాలు మాత్రమే. కొంత హోమ్ ఎలోను సినిమాతో ఇన్స్పైరు అయినవి.

దాదాపు ముప్పై ఏళ్లు ఎదురుచూసిన చిత్రము ఇలా నిరాశ కలిగించినది.19, జులై 2023, బుధవారం

శ్రీరమణ గారు

 90 లలో ఆంధ్రప్రభ వీక్లీ ఇంటికి రాగానే కార్టూన్లు అన్నీ చదివేశాక ఆ తర్వాత మొదటి చదివే శీర్షిక శ్రీ ఛానల్. వ్యంగ్యం అంటే పరిచయమైనది అప్పుడే. కొన్నేళ్లు ఈయనకు ముళ్ళపూడి రమణ గారికి మధ్యన తికమక పడేవాడిని. ఆ తర్వాత ఒక మలయాళం అవార్డు సినిమా చూస్తున్నప్పుడు దాని మాతృక ఒక తెలుగు కథ అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ కథ మిథునం అని ఈయన రాసినదే అని తెలిశాక గౌరవం, అభిమానం  పెరిగినది. వెంటనే బాపు గారి చేతిరాతతో ప్రింట్ చేసిన పెద్ద సైజు మిథునం కథ పుస్తకం కొన్నాను అప్పుడే పుస్తక ప్రదర్శనలో శ్రీ ఛానల్ పుస్తకం కనబడితే  కొనుక్కొని మళ్లీ మళ్లీ చదివి ఆస్వాదించాను. దేశాలు ఊర్లో తిరగడంలో చాలా పుస్తకాలు కోల్పోయిన దాచిపెట్టుకున్న అతి కొద్ది పుస్తకాలలో ఇది ఒకటి.

ఈరోజు శ్రీరమణ గారి విషయం తెలిశాక కొంత బాధగా ఉంది. 🙏😢

23, జూన్ 2023, శుక్రవారం

పరీక్షల్లో ఎదురైన విచిత్రమైన అనుభవం

ఈ  రెండూ  మొదటిసారి పబ్లిక్ పరీక్షలు వ్రాసిన ఏడవ తరగతిలో జరిగింది. మాది ప్రయివేటు బడి కావడంతో ఒక ప్రభుత్వ బడిలో కేంద్రం ఇచ్చారు.

అప్పటికి జంబ్లింగ్ పధ్ధతి లేదు. అందుకని అన్ని పరీక్షలు ఒకే గది , ఒకే బల్లపై  వ్రాసాను. ఇన్విజిలేటరు కూడా దాదాపు ఒక్కరే వచ్చారు (ఇది ముఖ్యం).

**** 1 ****
ఇక మొదటి అనుభవం  సైన్సు పరీక్ష  రోజు జరిగింది. అప్పట్లో మెయిన్ పేపర్ 2 గంటలు. ఆఖరి 30 నిముషాలు ఉందనగా బిట్ పేపర్ ఇచ్చేవారు. నేను ఎప్పటిలాగానే గంటన్నరలో ఛాయిస్  ప్రశ్నలతో సహా వ్రాసేసి, అలంకారాలు (హెడింగ్ అండర్లైన్లు  వగైరా) చేసేసి గోళ్లు గిల్లుకుంటున్నా.  ఇన్విజిలేటరు  సారు వచ్చారు.

"ఏరా ! అన్ని రాసేసేవా? గోళ్లు గిల్లుకుంటున్నావ్" (ఆయన నాలుగు రోజులనుండి నన్ను చూస్తున్నాడు కావున, తెలుసు నేను బాగా రాస్తున్నానని)

"అవునా సార్!"

"ఏదీ  చూపీ " అని పేపర్లు తీసుకున్నారు. ఆయనకి నేను గీసిన మూత్రపిండాలు (కిడ్నీ) బొమ్మ బాగా నచ్చింది.  వెంటనే ఆ ఒక్క పేపరు తీసుకుని వెనక వరుసల్లో ఎవరో విద్యార్థికి ఇచ్చేశాడు చూచి గీసుకోమని. బహుశా ఆయనకి తెలిసినవాడు అనుకుంటా .  ఎం చేస్తాం బిక్క మొహం వేయటం మినహా .

నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నాకేమో 12 ఏళ్ళు, అవి మొదటి పబ్లిక్ పరీక్షలు.

బిట్ పేపర్ గంటకి ఇంకా 10 నిముషాలు ఉందనగా, నా  పేపరుతోపాటు  వాడి ఆన్సర్ షీట్  తెచ్చారు. "వాడికి గీయడం  రావడంలేదుగానీ  నువ్వే గీసిచ్చేయ్" అన్నారు.

ఇది లోకంతో , వ్యవస్థతో మొదటి పరిచయం :)

*** 2 ***
ఇది ఇప్పుడు చూసుకుంటే పెద్ద విచిత్రం కాదుగానీ , అప్పుడుం మా పన్నెండేళ్ల  వయసుకి పెద్ద వింత.

తరువాతి పరీక్ష సోషల్ ఇక ఆ రోజు అన్నాక పేపరు లీకయింది.  అదే ఆ తరువాత 3-4 ఏళ్ళు  వరుస లీకులకి ప్రారంభం. నాకేమో సోషల్ కష్టమైన సబ్జెక్టు  - మ్యాథ్స్-సైన్స్ కుమ్మేవాడినిగానీ.

ఏప్రిల్లో అయిపోవాల్సిన పరీక్ష, మేము ఉగాది-శ్రీరామనవమి గడిపాక, 2-3 గాలి దుమారాలు, ఎండాకాలం  క్రికెట్లు అయ్యాక మేలో పెట్టారు.  ఈ  శ్రీరామనవమికి నాకు, నా  బెస్ట్ ఫ్రెండ్కి ఒక గొడవ. వీటన్నింటితో చదువు అటకెక్కి, ఆ ఒక్క పరీక్షకి వెళ్లడం కొత్తయినది. అదే 'వింత' అనుభవం .  బెస్టు ఫ్రెండుతో గొడవ పెట్టుకునందుకో ఏమో  నాకు మొదటిసారి ఒక పరీక్షలో 60 కన్నా తక్కువ వచ్చాయి.

ఆ శ్రీరామనవమి గొడవ ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ - https://jb-jeevanayanam.blogspot.com/2011/04/blog-post.html