23, జూన్ 2023, శుక్రవారం

పరీక్షల్లో ఎదురైన విచిత్రమైన అనుభవం

ఈ  రెండూ  మొదటిసారి పబ్లిక్ పరీక్షలు వ్రాసిన ఏడవ తరగతిలో జరిగింది. మాది ప్రయివేటు బడి కావడంతో ఒక ప్రభుత్వ బడిలో కేంద్రం ఇచ్చారు.

అప్పటికి జంబ్లింగ్ పధ్ధతి లేదు. అందుకని అన్ని పరీక్షలు ఒకే గది , ఒకే బల్లపై  వ్రాసాను. ఇన్విజిలేటరు కూడా దాదాపు ఒక్కరే వచ్చారు (ఇది ముఖ్యం).

**** 1 ****
ఇక మొదటి అనుభవం  సైన్సు పరీక్ష  రోజు జరిగింది. అప్పట్లో మెయిన్ పేపర్ 2 గంటలు. ఆఖరి 30 నిముషాలు ఉందనగా బిట్ పేపర్ ఇచ్చేవారు. నేను ఎప్పటిలాగానే గంటన్నరలో ఛాయిస్  ప్రశ్నలతో సహా వ్రాసేసి, అలంకారాలు (హెడింగ్ అండర్లైన్లు  వగైరా) చేసేసి గోళ్లు గిల్లుకుంటున్నా.  ఇన్విజిలేటరు  సారు వచ్చారు.

"ఏరా ! అన్ని రాసేసేవా? గోళ్లు గిల్లుకుంటున్నావ్" (ఆయన నాలుగు రోజులనుండి నన్ను చూస్తున్నాడు కావున, తెలుసు నేను బాగా రాస్తున్నానని)

"అవునా సార్!"

"ఏదీ  చూపీ " అని పేపర్లు తీసుకున్నారు. ఆయనకి నేను గీసిన మూత్రపిండాలు (కిడ్నీ) బొమ్మ బాగా నచ్చింది.  వెంటనే ఆ ఒక్క పేపరు తీసుకుని వెనక వరుసల్లో ఎవరో విద్యార్థికి ఇచ్చేశాడు చూచి గీసుకోమని. బహుశా ఆయనకి తెలిసినవాడు అనుకుంటా .  ఎం చేస్తాం బిక్క మొహం వేయటం మినహా .

నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నాకేమో 12 ఏళ్ళు, అవి మొదటి పబ్లిక్ పరీక్షలు.

బిట్ పేపర్ గంటకి ఇంకా 10 నిముషాలు ఉందనగా, నా  పేపరుతోపాటు  వాడి ఆన్సర్ షీట్  తెచ్చారు. "వాడికి గీయడం  రావడంలేదుగానీ  నువ్వే గీసిచ్చేయ్" అన్నారు.

ఇది లోకంతో , వ్యవస్థతో మొదటి పరిచయం :)

*** 2 ***
ఇది ఇప్పుడు చూసుకుంటే పెద్ద విచిత్రం కాదుగానీ , అప్పుడుం మా పన్నెండేళ్ల  వయసుకి పెద్ద వింత.

తరువాతి పరీక్ష సోషల్ ఇక ఆ రోజు అన్నాక పేపరు లీకయింది.  అదే ఆ తరువాత 3-4 ఏళ్ళు  వరుస లీకులకి ప్రారంభం. నాకేమో సోషల్ కష్టమైన సబ్జెక్టు  - మ్యాథ్స్-సైన్స్ కుమ్మేవాడినిగానీ.

ఏప్రిల్లో అయిపోవాల్సిన పరీక్ష, మేము ఉగాది-శ్రీరామనవమి గడిపాక, 2-3 గాలి దుమారాలు, ఎండాకాలం  క్రికెట్లు అయ్యాక మేలో పెట్టారు.  ఈ  శ్రీరామనవమికి నాకు, నా  బెస్ట్ ఫ్రెండ్కి ఒక గొడవ. వీటన్నింటితో చదువు అటకెక్కి, ఆ ఒక్క పరీక్షకి వెళ్లడం కొత్తయినది. అదే 'వింత' అనుభవం .  బెస్టు ఫ్రెండుతో గొడవ పెట్టుకునందుకో ఏమో  నాకు మొదటిసారి ఒక పరీక్షలో 60 కన్నా తక్కువ వచ్చాయి.

ఆ శ్రీరామనవమి గొడవ ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ - https://jb-jeevanayanam.blogspot.com/2011/04/blog-post.html

22, జూన్ 2023, గురువారం

పసి పిల్లలకు ఆహారము

1-2 వయసున్న పిల్లలకి పళ్ళు పూర్తిగా రావు. ఒకవేళ వచ్చినా వారికి నమలడం తెలియదు. అందుకని వారికి కొంచెం జావలాగా ఉండే ఆహారం పెట్టాలి. కొంచెం పొడిగా (డ్రై) ఉన్న వారు మింగలేరు. 

నేను వైద్యుడినిగానీ , ఆహార నిపుణుడినిగానీ, డైటీషియన్ని కాదు. ఇంట్లో పెద్దల సలహాలు, మా పిడియాట్రిషియన్ని సంప్రదించి  ఈ  క్రిందివి మా పిల్లలకి ఆ వయసులో పెట్టాం. ఇది కేవలం నా  అనుభవం మాత్రమే.  మీరు మీ సొంతంగా నిర్ణయించుకొని ఆచరించుకోండి  -

 • పొద్దున్నే పాలల్లో ఇడ్లి - రుచికి పటిక బెల్లం పొడి. పంచదార జలుబు చేస్తుంది. 
 • మధ్యాహ్నం-రాత్రి భోజనానికి : బియ్యం, పెసరపప్పు, కందిపప్పు కడిగి ఆరబోసి, మర బట్టించి (మిక్సీలో వేసుకోవచ్చు) - బాగా నీరు పోసి మెత్తగా ఉడికించాలి. ఈ  మధ్యన కొందరు ఇది హాఫుడ్ లాగా అమ్ముతున్నారు కూడా - బాదాం పప్పులు, జీడీ పప్పులు లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి - కానీ పిల్లల అరుగుదలని  బట్టి అవన్నీ నెమ్మదిగా వేసుకోవచ్చు. 
 • పెద్దవుతున్న కొద్దీ - అన్నం మెత్తగా వండి అందులో పప్పు కట్టు (పప్పు వండేటప్పుడు పైపైన నీరు తియ్యాలి - అది చాలా  బలం), చారు , రసం, పెరుగు కలిపి పెట్టాము.
 • నెయ్యి బాగా దట్టించాలి  
 • సెరిలాక్ లాంటివి అత్యవసరం మాత్రమే - అనగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు, తీరికగా పెట్టె సమయం-ఓపిక లేనప్పుడు, లేదా ఎప్పుడన్నా సాయంత్రం స్నాక్ లాగా . 
 • సాయంత్రం: అరటి పండు గుజ్జు, మామిడి పండు గుజ్జు, సపోటా గుజ్జు , యాపిల్ ఉడకపెట్టి మిక్సీవేసి ఆ గుజ్జు - ఇలా మార్చి మార్చి .  దీనినికూడా ఇప్పుడు ప్రాసెస్డ్చేసి అమ్ముతున్నారు. ప్రయాణాల్లో ఇలాంటి డబ్బాలు పెట్టుకునేవారం - కానీ అరటిపళ్ళు లాంటివి దొరక్కపోతేనే ఇవి  - 
  gerber baby fruit కోసం చిత్ర ఫలితం
 • శాకాహారి కానట్లయితే గుడ్డు తినెట్లయితే ఉడకబెట్టి తెలుపు పెట్టచ్చు. మా పక్కింటివారు ఆ తెలుపుని మిక్సీలో వేసి అన్నంలో కలిపేసి పెట్టేవారు. 
ఇవి కాకుండా నా  సొంత అభిప్రాయాలు -పైత్యం :-
 • మనము భోజనం చేసేటప్పుడు పిల్లలు మన చుట్టూ తిరుగుతారు - మనం తినేవన్నీ వారికీ నాలికపై రాస్తూఉండాలి - అప్పుడు వారికీ అన్ని రుచులు తెలుస్తాయి. మా పిల్లలిద్దరికి నేను ఏడో  నెలలోనే ఆవకాయ నాలుకపై రాశాను. పెద్దది కారం  తింటుంది. అలాగే చిన్న చిన్న చపాతీ-అట్టు ముక్కలు ఏడాదిన్నర తరువాత పెడుతూ ఉండచ్చు.  పిల్లలిద్దరూ రెండు నిండేలోపే అన్ని కూరలు - పచ్చిగా రుచి చూశారు . 
 • అన్నం వండేటప్పుడు అందులోనే క్యారట్ తురుము, రుబ్బిన  పాలకూర, వాము-జీలకర్ర పొడి లాంటివి వేయచ్చు - బలం, వారికి  రుచులు వస్తాయి. జీర్ణ శక్తి పెరుగుతుంది.  
కొన్ని చేయకూడనివి -
 • ఊరికే ఖాళీగా ఉంటారు కదాని  బిస్కట్లు ఇస్తారు - బిస్కట్లు ఎక్కువ మైదాతో ఉంటాయి. త్వరగా అరగవు - ఆకలి మందగిస్తుంది. 
 • చిప్స్, లాలిపాప్స్, వంటివి వారానికి ఒక్కసారి కన్నా ఇవ్వకూడదు. 


ఇవి 

17, జూన్ 2023, శనివారం

ఏబీసీడీ ఉద్యోగులు

ఏబీసీడీ ఉద్యోగులు --------------------- ప్రస్తుతము నడుస్తున్న క్వైట్ క్విట్టింగు గురించి నాన్నతో ఫోనులో మాట్లాడుతుంటే తొంభైలలో ఆయన బ్యాంకు ఆఫీసరుగా ఉన్నప్పుడు ఉద్యోగులు పని ఎలా ఎగ్గొడతారో చెబుతూ వీళ్ళు ఏబీసీడీ అని నాలుగు రకాలన్నారు. ఏ – ఎవాయిడ్ - మనం కౌంటరు దగ్గరకు పోగానే మనల్ని తప్పించుకోవాలని చూస్తుంటారు. మేనేజరుకు, ఆఫీసరుకు దొరక్కుండా తిరుగుతుంటారు. బీ - బ్లేమ్ - ఏదన్నా పని అవ్వకపోతే పక్కవాడిపైనో, సిస్టం పైనో తోయడం - సర్వరు డౌను అయ్యింది, హెడ్డాఫీసు పంపించలేదు, ఇలా.. సీ - కన్ఫ్యూజ్ - పని కోసం వచ్చిన సహోద్యోగిని, కస్టమరును తికమక పెట్టడం - ఈ కాగితం లేదు, ఇది ఈ సెక్షనులో కాదు, వేరే చోట ఇలా. డీ - డీలే - కావాలని నానుస్తారు. విసుగొచ్చి బాసే చేసుకుంటాడు. కస్టమరు అర్జంటు కాకుంటే ఇంకోసారి వద్దాములే అని వెళ్ళిపోతారు. నాన్న ఏ బ్యాంకో వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా:-)