18, డిసెంబర్ 2010, శనివారం

సుందోపసుందులు - 5: మీరెప్పుడైనా రైలుని ఆపారా?

మీరు ఎప్పుడైనా స్టేషన్నించి కదులుతున్న రైలుని ఆపారా? అదే ఆపించారా? అహా! గొళ్ళెం(చైను) లాగికాదు, అదేదో సినిమాలో బాలయ్యబాబులా తొడగొట్టికాదూ, ఎర్ర రుమాలు - రక్తంతో తడిపిన చొక్కాతో ఎదురు పరిగెట్టికాదు. మరింకెలా?

బులుసుగారి 'నా చివరి క్షణాలు' చదివాక నేను రైలు ఆపించిన ఈ ఘనకార్యం గుర్తొచ్చింది. ఇప్పుడే 'అన్‌‌స్టాపబుల్' సినిమా చూసివస్తున్నా కాబట్టి వెంటనే రాయాలనిపిస్తోంది (ఆ సినిమాలోలా ఇపుడు నేచెప్పేదానిలో యాక్షన్ దృశ్యాలేమీ లేవు).

**********
టెన్తో, ఇంటరో, ఇంజినీరింగు మొదటి సంవత్సరమో గుర్తురావట్లేదు. ఈసారి అమ్మకిఫోను చేసినపుడు అడగాలి. ఏదో పరీక్షలు అయ్యాక సెలవులు ఖాళీగా గడుపుతున్నా. ఓ రోజు పొద్దున్నే లేచ టిఫినుచేసి ఖాళీగా కూర్చొని ఏం తోచట్లేదు అని నసపెడుతుంటే, "పోనీ నల్లగొండ వెళ్ళి ఆమ్మని(పెద్దమ్మ) చూసిరా" అన్నది అమ్మ. అప్పుడు మా ఆమ్మవాళ్ళు నల్లగొండలో వుండేవాళ్ళు. ఇదేదో బాగుందని అప్పుడే వెళ్తా అన్నా. అపుడు తొమ్మిదిన్నరో పదో అయ్యింది.

ఇప్పుడు 'జన్మభూమి‌‌' అని సికిందరాబాద్-విశాఖ మధ్యన తిరుగుతున్నది అప్పట్లో విజయవాడనించే వుండేది. 'ఇంటర్సిటీ'(నాగార్జున) అని ఇంకో బండి సికిందరాబాద్-నల్లగొండ-గుంటూరు-తెనాలి తిరిగేది. రెండూ కలిపి ఒకే బండి చేశారు. ఈ బండి సికిందరాబాదునుండి పొద్దున 11.30కి గుంటూరు వచ్చి, ఆపై తెనాలి వెళ్ళి మళ్ళీ తిరుగుప్రయాణంలో గుంటూరు 1.20కి వచ్చేది. చాలాసార్లు ఇంకా లేటయ్యేది. మా ఇంటినుంచి స్టేషను పడమర ద్వారం (అరండల్‌‌పేట వైపు) చాల దగ్గర - ఐదు నిమిషాల నడక. అబ్బో ఇంకా చాలా టైముందిగా, పచ్చళ్ళూ-వడియాలూ సర్దుతా తీసుకెళ్ళు అంది అమ్మ.

నేను ఒక సంచిలో రెండు జతలు పడేసుకొని తాపీగా టీవీచూస్తూ కూర్చున్న. తీరిగ్గా ఒక అరగంట భోజనం చేసి టైము చూస్తే పన్నెండున్నర దాటింది. ఇపుడే స్టేషనుకెళ్ళి ఏంచేస్తాం, లేటేమన్నా ఉందేమో కనుక్కుందామని స్టేషనుకి ఫోనుకొట్టా.
"ఇంటర్‌‌సిటీ ఏమన్నా లేటుందాండి?"
"లేటేంటి, బండెపుడో తెనాలినుండొచ్చేసిందమ్మా" అన్నాడు. నాకు షాకు.
"అదేంటండీ రైట్‌‌టైం 1.20 కదండీ?"
"అదేపుడో మారిందిగా. ఇపుడు 12.45కే."

చల్లారి ఇంట్లో కూర్చుంటే నన్ను సుందోపసుందుడు అనెందుకంటారు? అమ్మ చెపుతూనే వుంది. "చూద్దాం, ఇంకా టైముందిగా. దొరికితే దొరికింది లేకపోతే వెనక్కోస్తా" అని సామాను తీసుకొని బయలుదేరా. నా సామాను చెప్పలేదు కదూ - నా బట్టల సంచి (డఫ్ఫల్ బ్యాగంటారు ఇపుడు), రెండు కర్ర సంచీలు (కళానికేతన్/చందనా బ్రదర్సు వాళ్ళిచ్చేవి), ఒక పెద్ద స్టీలుక్యాను.

ఉరుక్కుంటూ స్టేషనుచేరేటప్పటికి "ట్రయిన్ నెం **** ఒకటవ నెంబరు ... బయలుదేరుచున్నది" - ఎనౌన్సరు అరుస్తున్నది. ఈ పిలుపు వచ్చిన వెంటనే డ్రైవురు ఒకసారి హారన్ మోగించి బయలుదేరుతాడన్నమాట. కౌంటరతను, "వెనక్కొస్తే సగమే రిఫండ్!!"నని బెదిరించాడు(అదే హితవు చెప్పచూశాడు). "పర్లేదివ్వండి".

ఇక్కడ గుంటూరు స్టేషనుగురించి ఒక పేద్దవిషయం క్లుప్తంగా. మొత్తం 8 ప్లాట్ఫాంలు. అప్పట్లో 1-4/5కి మధ్యనే సబ్‌‌వే వుండేది. 4/5 కి 8కి మధ్య బ్రిడ్జి. అంటే ముందు ఇదెక్కి దిగి, అది దిగి ఎక్కాలన్నమాట. అయినా ఎంత ధైర్యంగా టిక్కెట్ కొన్నానో. మళ్ళీ రైలు రన్నింగులో ఎక్కేటంత సీనులేదు. బ్రిడ్జిపైకి ఎక్కేసరికి రైలు కూతపెట్టింది. ఇంకేం, అయిపోయింది దొరకనట్లే అనుకున్నా. బ్రిడ్జి దిగా. అనుకున్నట్లే రైలు కదులుతూ కనిపించింది.

అపుడే బుర్రకి ఎక్కడో వెలిగింది. 4వ నెంబరు ప్లాట్ఫాం మొదట్లో రైల్వే పార్సిలు ఆపీసుంటుంది. అక్కడ 4 నుంచి 1కి పట్టాలపై సిమెంటు దారి వుంటుంది - పార్సెలు బళ్ళు లాగటానికి (సికిందరాబాద్ స్టేషనులోనూ వుంది). అటు పరిగెట్టా. ఆ దారిపై ఒకటో ప్లాట్ఫాం దగ్గరికి పరిగెట్టేసరికి ఇంజను, ఒక బోగి అప్పటికే ప్లాట్‌‌ఫాం దాటేశాయి.

రెండవ బోగీ తలుపు దగ్గరున్నవాళ్ళు "ఎక్కేయ్, ఎక్కేయ్" అనరుస్తున్నారు.
నా సామాను చెప్పాగా. అన్ని పట్టుకోని రన్నింగులో ఎలా ఎక్కుతారు, నాకు మాములుగానే రాదు, వచ్చినా ఎక్కను.

సామాను కింద పడేసి ఆ సిమెంటుదారిపై వంగొని, మోకాళ్ళపై చేతులు పెట్టుకొని నిరాశగా వగరుస్తున్నా. అదేదో సినిమా క్లైమాక్సులో (ఒకటేంటి, పదుండుంటాయి) హీరోయిన్ విడిచెళ్లిపోతున్న రైలు మిస్సయి హీరో ఫీలవుతుంటాడుకదా, ఆ రేంజీలోకాకపోయినా, ఆ టైపులో. ఇపుడు ఇంటికెళ్ళితే చివాట్లే, ఆ తర్వాత బండి మళ్ళీ రాత్రి పదకొండింటికి నరసాపూరే! అదెక్కే ఊహేలేదు.

అపుడు జరిగింది ఆ ఊహించని అద్భుతం (అంటే సినిమాల్లో రోటీనే) - రైలు ఆగింది. హీరోయిన్ లేదుగాబట్టి దిగలేదు. :-) ఇంజీనులోంచి డ్రైవరో/అసిస్టెంటు డ్రైవరో చేతులూపుతూ సంజ్ఞలిస్తున్నాడు, "ఎక్కు ఎక్కు" అని. ఈ అబ్బాయి ఇలా 4వ నెంబరు ప్లాట్‌‌ఫాం నుండి ఉరుక్కుంటూ రావడం ఆయన గమనిస్తూనే ఉన్నాడు.

హీరోయినే దొరికిందన్న రేంజిలో మళ్ళీ ముందుకి రాళ్ళపై పరుగెత్తుకెళ్ళి (మూడవ బోగీ ఏసీ) రెండవబోగీ ఎక్కేశా.

అదన్నమాట రైలునే నేను ఆపి(పించి)న అనుభవం. అందుకే ప్రతీ క్షణం, ముఖ్యంగా "చివరి క్షణాల" విలువైనవి :-)

అనేవాళ్ళు అంటారులేండి, నీ గొప్పదనమేముంది, అది ఆ డ్రైవరుగారి దయని. కానీ ఆ డ్రైవరులో ఆ జాలి పుట్టించినది ఎవరు?

నల్లగొండలో దిగాక ఇంజినుదాక నడుచుకెళ్ళి డ్రైవరుగారికి థాంక్స్ చెప్పా!

16, డిసెంబర్ 2010, గురువారం

అట్లాంటిక్ సూర్యోదయం

బోస్టనులో ఎప్పుడన్నా ఒడ్దు(బీచ్)కి పొద్దున్నే ౬కి వెళ్ళి అట్లాంటిక్ మహాసముద్రంపై సూర్యోదయం చూడాలని కోరిక.
మూడేళ్ళున్నా కుదరలేదు. మొదటి కారణం శనివారం పొద్దున్నే లేవడానికి బద్దకం. రెండవది నాకు కారులేదు. మొదటి ట్రైను ఐదింటికి. వెళ్ళేసరికి ఆరవుతుంది. మనం చలికాలం వెళ్ళలేం, ఎండాకాలంలోనేమో ఐదింటికే తెల్లారుతుంది.

ఇలా కాదని మొన్న అక్టోబరులో ముగ్గురం స్నేహితులం వెళ్ళాం. ఆహా ఏం రోజండి - మబ్బుమబ్బు, మైనస్ డిగ్రీల చలి. క్లికు కొట్టాలంటే, గ్లవ్స్ ఇప్పాలిగా. మొత్తం గంట అయ్యేసరికి వేళ్ళు కొంకురుపోయాయి. కానీ తీసిన ఫోటోలు తర్వాత చూస్కొంటే అన్ని మర్చిపోయా.

అసలు ఆ మహాసముద్రం ముందు నించోని - ఆ చలిలో వణుకుతూ - చెవుల్లో ఇళయరాజా-రహమాన్ స్వరనాట్యం చేస్తుంటే, నింగి-సముద్రం నీలమై, ఇసుకలో ప్రతిబింబిస్తుంటే - కొంగలు, ఫ్లేమింగోలు, విమానాలు - ఆ చలిలో కుక్కలతో చెడ్డీలేసుకొని జాగింగ్ చేస్తున్న అమ్మాయిలు - ఒక అరగంట ఎక్కడికో వెళ్ళోచ్చా.

ఆ తర్వత స్టార్‌‌బక్స్కి వెళ్ళి ఒక లార్జ్ కాఫీ తీస్కుంటే రెట్టింపయ్యింది మా మజా. నా బోస్టన్ జీవితంలో మరచిపోలేని రోజు.

ఫోటోలు నా ఫొటోబ్లాగులో.

14, డిసెంబర్ 2010, మంగళవారం

నా కనులతో...

నా కనులతో... అని ఒక కొత్త ఫోటోబ్లాగు ఆరంభించా. ఇది పెట్టాలా వద్దా అని ఒక రెణ్నల్లపైగా ఆలోచించా. ఎందుకంటే నాకు ఇప్పటికే ఒక ఫొటోబ్లాగు ఉంది. కానీ అందులో నేను తీసినవాటిలో అత్యుత్తమైనవి మాత్రమే పెడుతున్నా. మిగతావి నా కంప్యూటరులో మగ్గిపోతున్నాయి. అందులో ఒక తొంభై పూల చిత్రాలున్నాయి.

నా మొదటి బ్లాగుకున్న ఇంకో పరిమితి చిత్రం సైజ్. ప్రతి చిత్రాన్ని రీసైజ్ చేయాలంటే కష్టం. అదే బ్లాగుస్పాటుకైతే పికాసనుండి సీదా ఎక్కించచ్చు.

నా దృశ్యబ్లాగుని కూడ చూసి ఆనందించగలరు.

నా కనులతో...

13, డిసెంబర్ 2010, సోమవారం

ఒక ఇబ్బందికర జ్ఞాపకం

జీవితంలో ఎదురయ్యే కొన్నికొన్ని సంఘటనలు ఇబ్బందికర పరిస్థితులు కలిపిస్తాయి. నా చిన్నప్పుడు జరిగిన అలాంటి సంఘటనొకటి, శిశిరగారి బ్లాగులో ఈ క్రింది వాక్యాలు చదివినపుడు గుర్తొచ్చింది.


ఉపాధ్యాయులకి ప్రవర్తనా నియమావళి పెడుతున్నారట. అందులో పిల్లలతో అసభ్యంగా వ్యవహరించకూడదనీ, లైంగిక వేధింపులు చేయకూడదనీ, ఉత్తమ గురువులుగా ఉండాలని, తోటి వారితో కలిసి మెలిసి మెలగాలని చెప్తారట. ఏమిటి? ఇవన్నీ ఆచరించడానికేనా? ఆచరించాలా? అని కొందరు గురువులు బెంగపడుతున్నారట. ఒకప్పుడు ఇవన్నీ గురువులు పిల్లలకి చెప్పేవారు. ఇప్పుడు గురువులకే చెప్పాల్సొస్తూంది. ఇప్పటికైనా అర్థమవుతుందో, లేదో నోట్లో వేలు పెట్టినా కొరకలేని కొందరు అమాయక గురువులకి.

తొమ్మిదో తరగతి - మార్చి నెల - ఒంటిపూట బళ్ళు. 8కి బడి అంటే మేము (నేనూ, నా ఆప్తమిత్రుడు అంజి) సాధారణంగా ఇంట్లో హడావిడి చేసి ఏడున్నరకే వెళ్ళిపోతాం. ఆ రోజు ఆలస్యమై 8కి వెళ్ళాం హడావిడిగా. వెళ్ళేసరికి రోజూ జరగాల్సిన ప్రేయర్ అసెంబ్లీ జరగట్లేదు. అంతా గందరగోళంగా, ఉద్రిక్తంగా వుంది. ప్రిన్సిపల్ రూం నిండా ఎవరెవరో వున్నారు. మేం క్లాసుకి వెళ్ళాం. ఆయా లక్ష్మి వచ్చి సుజాత టీచర్ మిమ్మల్నిద్దరినీ ప్రిన్సిపాల్ రూంకి రమ్మన్నారని చెప్పింది. అక్కడికి వెళ్ళేసరికి ప్రిన్సిపాల్ ఒక పక్క సోఫాలో ముభావంగా కూర్చొని వున్నారు. సుజాత టీచరు ప్రిన్సిపాల్ కుర్చీలో వున్నారు. టీచర్లందరూ సీరియస్‌‌గా వున్నారు.
అక్కడేం జరుగుతుందో, మమ్మల్నెందుకు పిలిచారో అర్థంకాలేదు.

సుజాత టీచరు "మీరీరోజు స్కూలుకు ఎన్నింటికొచ్చార?"ని అడిగారు.
"ఇప్పుడేం వచ్చాం మే'మ్".
"నిజం చెప్పండి, రోజూ ముందే వస్తారుగా?"
"నిజం మే'మ్, ఈ రోజు లేటయ్యింది."

*************************
ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. మొదట మా స్కూలు గుంటూరులో వీధికొకటి వుండే బుల్లిబుల్లి కాన్వెంట్లనబడు బళ్ళల్లో ఒకటి. ట్యూషనుకి ఎక్కువ, స్కూలికి తక్కువ. మొత్తం విద్యార్ధుల సంఖ్య 150, మా తరగతిలో ఐదుగురం. టెన్తులో ఒక్కడు, మార్చికాబట్టి పరీక్షలురాయడానికెళ్ళాడు. అంతకుముందు మా అన్నయ్య ఏడు నుండి పదివరకు ఒకేఒక్కడిలా చదివి వెళ్ళిపోయాడు.

రెండవది ఆ స్కూలు బ్యాంకుద్యోగుల పిల్లలకోసం పెట్టినదిగనుక, మా నాన్నగారు బ్యాంకాఫీసరుగనుక మేము అక్కడ చేరాము. ఐతే బ్యాంకువాళ్ళ పిల్లలు తక్కువ, మిగతావారు ఎక్కువ వుండేవారు. మా నాన్నగారు ఆ స్కూలుని పెంచాలని అప్పుడప్పుడు వెళ్ళి సలహాలు ఇచ్చేవారు. ఒక తడవ కార్యదర్శిగా చేశారు.
*************************

సుజాత టీచరు, "సరే! వెళ్ళి అన్ని క్లాసులు మానిటరు చేయండి. మేం ముఖ్యమైన మీటింగులో వున్నాం" అన్నారు.

వెనక్కి వచ్చాం. మిగతా క్లాస్మేట్లు ముగ్గురూ స్కూలుకి రావట్లేదు. వాళ్ళు స్కూలు బయట ట్యూషనుకు వెళ్తున్నారని మా ప్రిన్సిపాల్కి , వాళ్ళ తల్లిదండ్రులకి గొడవయ్యింది.

క్లాసులు మెయింటెయిన్ చేస్తున్నాం. మధ్యమధ్యన ఆఫీసుగదిలోకి తొంగిచూస్తున్నాం. పెద్దగానే వాదించుకుంటున్నారు. ఒకావిడ మా ప్రిన్సిపాలుని, స్కూలుని బూతులు తిడుతుంది. ఆయన ఏదో చేశాడని అర్థం అయ్యింది, ఏమిటన్నది అని తెలియలేదు. ఒక టీచరు బయటకి వచ్చి, "ఇవాల్టికి ఇంక స్కూలు లేదు, అందరినీ జాగ్రత్తగా ఇళ్ళకి పంపించండి" అన్నారు. అటెండరు - రిక్షా అబ్బాయి అయిన తిరుపాల్ వచ్చి ఒక్కొక్క ట్రిప్పువాళ్ళని తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. తిరుపాల్ని అడిగాం "ఏమయ్యింద"ని. చెప్పలేదు. ఆయా లక్ష్మిని అడిగాం, తిడుతుందిగానీ (మమ్మల్నికాదు), ఏం చెప్పదు.

మాకు టెన్షను, అయోమయం, ఆసక్తి అన్నిరకాల ఎమోషన్లు మొదలయ్యాయి.

కాసేపటికి స్కూలు బయట జనం పెరిగారు. ప్రిన్సిపాల్ని ఉతకబాదుడు బాదుతూ రోడ్డుపై తన్నుకుంటూ తీసుకెళ్ళుతున్నారు. సుజాత టీచరుకూడ వెళ్ళారు. ఇంక ఆగలేక మాకు కొంచెం క్లోజైన ఎల్కేజీ టీచరుని అడిగాం. అప్పుడు చెప్పారు, ఎవ్వరికీ చెప్పొద్దంటూ. మా ప్రిన్సిపాల్ ఒక ఎల్కేజీ అమ్మాయిని అత్యాచారయత్నమో, నిజంగా అత్యాచారమో చేశాడట. పోలీసు స్టేషనుకి తీసుకెళ్ళారట.
**********************
అందరినీ ఇళ్ళ దగ్గర దిగబెట్టాం. కానీ ఇప్పుడే ఇంటికి వెళ్ళితే ఏం చెప్పాలి. అందుకే మా క్లాస్మేట్ల (ఇద్దరు అన్నాచెళ్ళెల్లు) ఇంటికి వెళ్ళాం. విషయం చెప్పాం. ఆంటీ పొంగిపోయారు, మమ్మల్ని అన్నందుకు వాడికి తగిన శాస్తి జరిగిందని కాసేపు తిట్టారు. అక్కడ టైంపాస్ చేసి సాయంత్రం ఏమి జరగనట్లు ఇంటికెళ్ళిపోయాం.

**********************
అప్ప్ట్లట్లో మా నాన్నగారు కాలికి ఏక్సిండెంట్ అవ్వటంతో ఇంట్లోనే చాలా రోజుల నుండి విశ్రాంతి తీసుకుంటున్నారు. స్కూల్లో సంఘటన జరిగిన రెండుమూడు రోజులకి మా స్కూలు సెక్రటరీ (ఎవరో ఒక బ్యాంకు ఆఫీసరు వుంటారు కార్యదర్శిగా) నాన్నని పరామర్శించడానికి ఇంటికి వచ్చారు. మాటల సందర్బంలో ఇలా అయ్యింది, ప్రిన్సిపాల్ని అరెస్టు చేసారు, సుజాత టీచరుని ప్రిన్సిపాల్ చేశాం అని చెప్పారు. వెంటనే నాన్న నన్ను పిలిచారు, ఇంత జరిగితే చెప్పనేలేదేంటి అనడిగారు. నాన్న దగ్గర నాకు సాధారణంగా చనువు వుంది - చిన్నప్పటినుంచి ఒక మిత్రుడిలాగే పెంచారు. కానీ ఇలాంటి విషయం ఎలా చెప్తాం - కొంచెం ఇబ్బందిగా (ఎంబరాసింగ్) అనిపించింది.

*********************
తర్వాత, అమ్మో ఆ రోజు మనం స్కూలికి అలవాటుగా తొందరగా వెళ్లుంటే? అని చాన్నాళ్ళు భయంగా అనిపించింది. భయమేందుకంటే, ఆ సంఘటనకి వారం రోజుల ముందు, మా వీధి చివర స్కూల్లో టెన్త్ స్పెషలు క్లాసులని పెట్టి ఒక అమ్మాయికి మత్తుమందిచ్చి ఒక టీచరు (ఆ స్కూలు మహిళా ప్రిన్సిపాల్ కొడుకు), ఇద్దరు విద్యార్ధులు అత్యాచారం చేశారని గొడవయ్యింది. వారంకే మా స్కూల్లో. మమ్మల్నీ అనేవారేమోనని భయం.

కానీ మేమెళ్ళుంటే మేమున్నామనైనా ఆయన ఆ పని చేసేవాడుగాదేమో (నిజంగా చేసుంటే), ఆ అమ్మాయి రక్షించబడేది అని తర్వాత అనిపించేది.

*********************
పీకేసిన ప్రిన్సిపాల్ మాకు మా౨థ్స్, ఫిజిక్స్ చెప్పేవారు. సిలబస్ చాలా మిగిలుంది అప్పటికి. పరీక్షలకి నెలముందే కావడంతో కొత్త టీచరు దొరకలేదు. పబ్లిక్ పరీక్షలకి ఆ రెండు సబ్జెక్టులు మేమిద్దరం సొంతంగా చదువుకొని, ట్యూషను పెట్టించుకొన్న మిగతా ముగ్గురికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాం - అది మాపై మాకు నమ్మకాన్ని పెంచి భవిష్యత్తులో బాగా ఉపయోగించింది.
**********************

ఆ ప్రిన్సిపాల్ ఇల్లు మాకు తెలుసుగనక, పదవ తరగతిలో వుండగా ఒకసారి వెళ్ళి కలిసాం. ఆ పని ఆయన చేయలేదు అని చెప్పారు. ఎలా బయటపడ్డారో తెలియదుగానీ, రైల్వేలో ఉత్తరాంధ్రవైపు అసిస్టెంటు స్టేషనుమాస్టరు ఉద్యోగం వచ్చిందని చెప్పారు. తరువాత ఎప్పుడూ కలవలేదు.

4, డిసెంబర్ 2010, శనివారం

సుందోపసుందులు 4: ’డెల్టా’ తంటా

సమయం: ఎండాకాలం రాత్రి 1-4 మధ్య
స్థలం: ప్యాసింజరు బండి, జనరల్ కంపార్టుమెంటు
ఇతర పాత్రలు: నిండుగా కాలుపెట్ట చోటులేనంత జనం - కూర్చొని నిద్రపోయేవారు-నించోని జోగేవారు. వారి స్టేషను దగ్గరపడితే కనులు మూస్తూ తెరుస్తూ దిక్కులు చూసేవారు. మధ్యమధ్యలో సమోసాలు-మసాలాలు, టీ-కాఫీలు అమ్మువారు.

కథానాయకులు:

1.జేబీ (అంటే నేను) - ఒళ్ళో 1000 పేజీల బండ పుస్తకం, చేతిలో మార్కరు/హైలైటరు
2. మనో - ఒళ్ళో 1500 పేజీల దిండు పుస్తకం, చేతుల్లో నోటుబుక్ మరియు పెన్సిల్.

నమ్మట్లేదు కదూ? వీళ్ళు కొంచెం ఎక్స్‌ట్రాలు చెయ్యట్లా?

నటించట్లేదు. తరువాత క్లియరు చేసిన సర్టిఫికేషనుపైనొట్టు, నిజ్జంగా చదివాం.

ఎందుకిలా? ఈ సుందోపసుందులు ఏ ఘనకార్యం చేయుటవలన ఇన్ని అవస్థలూ-నీలాపనిందలు పడుతున్నారు?

ఒక ఇరవై రోజులు వెనక్కి వెళ్ళితే...
***************

ఈ జేబీ అనబడు నేను, ఒక వారాంతం పొద్దునే (అనగా పదికి) హిందూ పేపరు చదువుతుండగా ఒక వార్త ఆకర్షించినది. సికిందరాబాదు-రేపల్లె మధ్యన వయా గుంటూరు డెల్టా పాసింజరని కొత్తగా రైలు వేసారట. వార్త చదివి సంతోషం తట్టుకోలేక ఆవేశం ఆపుకోలేక రిజర్వేషను ఆఫీసుకెళ్ళిపోయా. లైన్లో నించొని మనోకి ఫోనుకొట్టా, "నీక్కూడా చేయించనా"ని. వచ్చే శుక్రవారంరాత్రికి చేయించేశా, ఆహో మనక్కూడా దొరికాయే అని పొంగిపోతూ.

***************

ఎనిమిదిముప్పావుకి రైలు సమయమైతే అలవాటుప్రకారం ఏడింటికి చేరుకున్నా. అప్పటికే కొంచెం సాఫ్ట్వేరు కళలు కొన్ని వచ్చాయికాబట్టి చెవుల్లో ఎంపీ౩-వీపున బ్యాక్‌ప్యాక్-టీ-షర్టు-ఫీలా కాజువల్ షూస్-చేతిలో ఒక ఇంగ్లీషు పత్రిక-ఇంకో చేతిలో రియల్ జ్యూస్ - ఇప్పుడు శుక్రవారం రాత్రి స్టేషను నిండా ఈగల కన్నా మా జాతే ఎక్కువుంటారుగానీ మరి 2004-05ల్లో గోదావరి-గౌతమి వంటి రైళ్ళ ప్లాట్ఫాంలపై ఓ పదిమంది తప్పితే ఎక్కువ కనిపించేవారు కాదు (నాకు). అందులోనూ మాది ప్యాసింజరు బండి.

వీడెవడ్రా బాగా వేషాలేస్తున్నాడు (అదే స్టైలుకొడుతున్నాడు) అని జనాలు అనుకుంటుంటుండగా ప్లాట్‌ఫాంపై అటు ఇటు తిరుగుతూ మావాడికోసం ఎదురుచూస్తున్నా. నేనంటే టోలీచౌకీనుండి రావాలిగానీ, మావాడుండేది కవాడీగూడ, చక్కగా నడుచుకుంటూ రావచ్చు. ఫోనుకొడితే ఎనిమిదికి ముందు బయలుదేరేది లేదన్నాడు.

భారత రైల్వేల ఆచారం ప్రకారం కాకుండ ఎనిమిదిన్నరకి, అంటే పావుగంట ముందే బండి పెట్టేశారు (ఇప్పుడు 9.30 అవ్వాలి). ఒక్కసారి కలకలం చెలరేగి ఉరుకులు-పరుగులు మొదలయ్యయి. మనం రిజర్వేషను కదా - దర్జాగా నించున్న. మనకీ కొంచెం మంచి అలవాట్లుండటంవల్ల, నెమ్మదిగా భోగీ తలుపుదగ్గరికెళ్ళి ఛార్టులో పేర్లు రూడీచేసుకుందామని వెతకటం మొదలుపెట్టా. అప్పుడు చిన్న షాకు. మన పేర్లులేవు. రెండుమూడుసార్లు చూశా. ఉహూఁ! లేవు. టిక్కెట్టు మళ్ళీ చూశా - ఆఁ అప్పుడు తగిలింది. మనం తేదీలో ఒక నెలెక్కువేశాం అని. హహ్హహ్హహా! ఛీఛ్చిఛీఛీ - కొన్ని తలలు తిరిగాయి అటువైపు, (అంటే మనవైపు) వీడికేమయ్యిందని.

అప్పుడు పరిస్థితిని సమీక్షించగా కర్తవ్యం గుర్తొచ్చింది. మనోకి ఫోనుకొట్టా, "ఏరా ఎక్కడున్నావ్?"
వాడు "వచ్చేసినట్లే- ఫైవ్ మినిట్స్. రైలొచ్చేసిందా?"
చేసిన ఘనకార్యం చెప్పా.
వాడు "ఇప్పుడేం చేయాలిరా?".
"నువ్వెక్కడున్నావ్?"
"ఇప్పుడే భోయిగూడ చేరుతున్నా!"
"ఒహో! ఐతే నువ్వు సీదా ఒకటో ప్లాట్ఫాంకిపోయి (అప్పటికి భోయిగూడ కౌంటరులేదన్నట్లు గుర్తు) రెండు టికెట్లు పట్టుకురా. నేనెళ్ళి రెండు సీట్లాపుతా". స్లీపరుబోగీలన్నీ దాటి ఆఖరునున్న జనరల్‌కి పరిగెట్టా. రెండు సీట్లు ఏదోవిధంగా సంపాదించా.

మనో కూడ పాపం లగేజితో స్టేషను ఈమూలనించీ ఆ మూలకి పరిగెట్టి, లైన్లో నించొని ఎలాగోలా టిక్కెట్లు తీసుకొచ్చాడు.

***************

సరే ఇలాంటి టికెట్ల గూఫులు అందరికీ ఎప్పుడోప్పుడుండేవేలే అని సరిపెట్టుకున్నాం. అక్కడితో కథ ముగిస్తే మరి మా ప్రత్యేకత ఏముంది...

**************

రైలు బయలుదేరింది. మేం ప్రత్యక్షంగా కలుసుకొని చాలా రోజులు అయ్యింది. ప్యాసింజరు బండీ, ఘట్కేసరు చేరేసరికి రాత్రి పదిమాత్రమే అయ్యింది. కాలక్షేపం ఎలా అవుతుంది? దాంతో బాతాఖానీ మొదలుపెట్టాం. ఇద్దరు సాఫ్ట్వేరుగాళ్ళు కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారు - అదే జరిగింది. మొదటి గంట ప్రాజెక్టుల గురించీ, ఒక అరగంట కంపెనీలగురించీ, ఆ తరువాత ఒక గంటన్నరా-రెండు గంటలు.

"పదకొండున్నరయ్యింది బాబులూ, మీరు కాస్త కబుర్లు ఆపితే మేం కాసేపు పడుకుంటాం" పాపం పక్కవాళ్ళు. మాకూ కొంచెం విశ్రాంతి కావాలి అనిపించింది. చెవుల్లో పాటల ప్లగ్గులు పెట్టుకున్నాం. మా వాడు పుస్తకాలు బయటికి తీసాడు. పరీక్షలట. వాడు దూరవిద్యలో ఏవో పైచదువులు వెలగబెడుతున్నాడు అప్పుడు. పది నిమిషాలు భారంగా గడిచాయి. ఇంతకుముందటి వ్యాసాల్లో చెప్పినట్లు నాకు ప్రయాణాల్లో నిద్రరాదు, మావాడేమో ఎప్పుడుకావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు. హమ్మా! వాడు పడుకుంటే నా పరిస్థితేంటీ? ఎండాకాలం, పెట్టె నిండా జనం, ఉక్కపోత నాకు తోడు.

దాంతో మళ్ళీ ముచ్చట్లు మొదలుపెట్టా. "అరే, పన్నెండవుతుంది, రైలు మూడున్నరకల్ల గుంటూరెళ్తుంది -ఈలోపు ఏం పడుకుంటాం చెప్పు" . ఈ సారి మాసోదంతా పూర్తి సాంకేతికం - వాడి సబ్జెక్ట్లపై. కొంచెం తెలుగు, చాలా ఇంగ్లీషు.

మిగతావారు ఒక్కొక్కరు కళ్ళు తెరిచీ చూడటం, పడుకోవటం. కాసేపు చూసి పక్కనున్న ఒక పెద్దాయన ముందు కోరాడు, తర్వాత ఒక వార్నింగిచ్చాడు, "గమ్మునుంటారా, తలుపులోంచి తోసెయ్యనా". మాక్కూడ - నిద్ర రాలేదు, జాలివేసింది.

దాంతో నేనూ సంచీలోంచి ఒక పెద్ద సాంకేతిక గ్రంధం తీసా - అప్పట్లో ఒక సర్టిఫికేషనుకి తయారవుతున్నా.

అవ్విధంగా ఆ దృశ్యమెట్టిదనగా, అర్ధరాత్రి 1-4 మధ్యన, రైల్లో చదువుతూ || మొదటి పేరా చదువుకొనుడు||.

కొ.మె.: ఇలాంటి టిక్కెట్టు గడబిడలు అదే మొదటిసారికాదూ, ఆఖరిసారికాదూ.