18, డిసెంబర్ 2010, శనివారం

సుందోపసుందులు - 5: మీరెప్పుడైనా రైలుని ఆపారా?

మీరు ఎప్పుడైనా స్టేషన్నించి కదులుతున్న రైలుని ఆపారా? అదే ఆపించారా? అహా! గొళ్ళెం(చైను) లాగికాదు, అదేదో సినిమాలో బాలయ్యబాబులా తొడగొట్టికాదూ, ఎర్ర రుమాలు - రక్తంతో తడిపిన చొక్కాతో ఎదురు పరిగెట్టికాదు. మరింకెలా?

బులుసుగారి 'నా చివరి క్షణాలు' చదివాక నేను రైలు ఆపించిన ఈ ఘనకార్యం గుర్తొచ్చింది. ఇప్పుడే 'అన్‌‌స్టాపబుల్' సినిమా చూసివస్తున్నా కాబట్టి వెంటనే రాయాలనిపిస్తోంది (ఆ సినిమాలోలా ఇపుడు నేచెప్పేదానిలో యాక్షన్ దృశ్యాలేమీ లేవు).

**********
టెన్తో, ఇంటరో, ఇంజినీరింగు మొదటి సంవత్సరమో గుర్తురావట్లేదు. ఈసారి అమ్మకిఫోను చేసినపుడు అడగాలి. ఏదో పరీక్షలు అయ్యాక సెలవులు ఖాళీగా గడుపుతున్నా. ఓ రోజు పొద్దున్నే లేచ టిఫినుచేసి ఖాళీగా కూర్చొని ఏం తోచట్లేదు అని నసపెడుతుంటే, "పోనీ నల్లగొండ వెళ్ళి ఆమ్మని(పెద్దమ్మ) చూసిరా" అన్నది అమ్మ. అప్పుడు మా ఆమ్మవాళ్ళు నల్లగొండలో వుండేవాళ్ళు. ఇదేదో బాగుందని అప్పుడే వెళ్తా అన్నా. అపుడు తొమ్మిదిన్నరో పదో అయ్యింది.

ఇప్పుడు 'జన్మభూమి‌‌' అని సికిందరాబాద్-విశాఖ మధ్యన తిరుగుతున్నది అప్పట్లో విజయవాడనించే వుండేది. 'ఇంటర్సిటీ'(నాగార్జున) అని ఇంకో బండి సికిందరాబాద్-నల్లగొండ-గుంటూరు-తెనాలి తిరిగేది. రెండూ కలిపి ఒకే బండి చేశారు. ఈ బండి సికిందరాబాదునుండి పొద్దున 11.30కి గుంటూరు వచ్చి, ఆపై తెనాలి వెళ్ళి మళ్ళీ తిరుగుప్రయాణంలో గుంటూరు 1.20కి వచ్చేది. చాలాసార్లు ఇంకా లేటయ్యేది. మా ఇంటినుంచి స్టేషను పడమర ద్వారం (అరండల్‌‌పేట వైపు) చాల దగ్గర - ఐదు నిమిషాల నడక. అబ్బో ఇంకా చాలా టైముందిగా, పచ్చళ్ళూ-వడియాలూ సర్దుతా తీసుకెళ్ళు అంది అమ్మ.

నేను ఒక సంచిలో రెండు జతలు పడేసుకొని తాపీగా టీవీచూస్తూ కూర్చున్న. తీరిగ్గా ఒక అరగంట భోజనం చేసి టైము చూస్తే పన్నెండున్నర దాటింది. ఇపుడే స్టేషనుకెళ్ళి ఏంచేస్తాం, లేటేమన్నా ఉందేమో కనుక్కుందామని స్టేషనుకి ఫోనుకొట్టా.
"ఇంటర్‌‌సిటీ ఏమన్నా లేటుందాండి?"
"లేటేంటి, బండెపుడో తెనాలినుండొచ్చేసిందమ్మా" అన్నాడు. నాకు షాకు.
"అదేంటండీ రైట్‌‌టైం 1.20 కదండీ?"
"అదేపుడో మారిందిగా. ఇపుడు 12.45కే."

చల్లారి ఇంట్లో కూర్చుంటే నన్ను సుందోపసుందుడు అనెందుకంటారు? అమ్మ చెపుతూనే వుంది. "చూద్దాం, ఇంకా టైముందిగా. దొరికితే దొరికింది లేకపోతే వెనక్కోస్తా" అని సామాను తీసుకొని బయలుదేరా. నా సామాను చెప్పలేదు కదూ - నా బట్టల సంచి (డఫ్ఫల్ బ్యాగంటారు ఇపుడు), రెండు కర్ర సంచీలు (కళానికేతన్/చందనా బ్రదర్సు వాళ్ళిచ్చేవి), ఒక పెద్ద స్టీలుక్యాను.

ఉరుక్కుంటూ స్టేషనుచేరేటప్పటికి "ట్రయిన్ నెం **** ఒకటవ నెంబరు ... బయలుదేరుచున్నది" - ఎనౌన్సరు అరుస్తున్నది. ఈ పిలుపు వచ్చిన వెంటనే డ్రైవురు ఒకసారి హారన్ మోగించి బయలుదేరుతాడన్నమాట. కౌంటరతను, "వెనక్కొస్తే సగమే రిఫండ్!!"నని బెదిరించాడు(అదే హితవు చెప్పచూశాడు). "పర్లేదివ్వండి".

ఇక్కడ గుంటూరు స్టేషనుగురించి ఒక పేద్దవిషయం క్లుప్తంగా. మొత్తం 8 ప్లాట్ఫాంలు. అప్పట్లో 1-4/5కి మధ్యనే సబ్‌‌వే వుండేది. 4/5 కి 8కి మధ్య బ్రిడ్జి. అంటే ముందు ఇదెక్కి దిగి, అది దిగి ఎక్కాలన్నమాట. అయినా ఎంత ధైర్యంగా టిక్కెట్ కొన్నానో. మళ్ళీ రైలు రన్నింగులో ఎక్కేటంత సీనులేదు. బ్రిడ్జిపైకి ఎక్కేసరికి రైలు కూతపెట్టింది. ఇంకేం, అయిపోయింది దొరకనట్లే అనుకున్నా. బ్రిడ్జి దిగా. అనుకున్నట్లే రైలు కదులుతూ కనిపించింది.

అపుడే బుర్రకి ఎక్కడో వెలిగింది. 4వ నెంబరు ప్లాట్ఫాం మొదట్లో రైల్వే పార్సిలు ఆపీసుంటుంది. అక్కడ 4 నుంచి 1కి పట్టాలపై సిమెంటు దారి వుంటుంది - పార్సెలు బళ్ళు లాగటానికి (సికిందరాబాద్ స్టేషనులోనూ వుంది). అటు పరిగెట్టా. ఆ దారిపై ఒకటో ప్లాట్ఫాం దగ్గరికి పరిగెట్టేసరికి ఇంజను, ఒక బోగి అప్పటికే ప్లాట్‌‌ఫాం దాటేశాయి.

రెండవ బోగీ తలుపు దగ్గరున్నవాళ్ళు "ఎక్కేయ్, ఎక్కేయ్" అనరుస్తున్నారు.
నా సామాను చెప్పాగా. అన్ని పట్టుకోని రన్నింగులో ఎలా ఎక్కుతారు, నాకు మాములుగానే రాదు, వచ్చినా ఎక్కను.

సామాను కింద పడేసి ఆ సిమెంటుదారిపై వంగొని, మోకాళ్ళపై చేతులు పెట్టుకొని నిరాశగా వగరుస్తున్నా. అదేదో సినిమా క్లైమాక్సులో (ఒకటేంటి, పదుండుంటాయి) హీరోయిన్ విడిచెళ్లిపోతున్న రైలు మిస్సయి హీరో ఫీలవుతుంటాడుకదా, ఆ రేంజీలోకాకపోయినా, ఆ టైపులో. ఇపుడు ఇంటికెళ్ళితే చివాట్లే, ఆ తర్వాత బండి మళ్ళీ రాత్రి పదకొండింటికి నరసాపూరే! అదెక్కే ఊహేలేదు.

అపుడు జరిగింది ఆ ఊహించని అద్భుతం (అంటే సినిమాల్లో రోటీనే) - రైలు ఆగింది. హీరోయిన్ లేదుగాబట్టి దిగలేదు. :-) ఇంజీనులోంచి డ్రైవరో/అసిస్టెంటు డ్రైవరో చేతులూపుతూ సంజ్ఞలిస్తున్నాడు, "ఎక్కు ఎక్కు" అని. ఈ అబ్బాయి ఇలా 4వ నెంబరు ప్లాట్‌‌ఫాం నుండి ఉరుక్కుంటూ రావడం ఆయన గమనిస్తూనే ఉన్నాడు.

హీరోయినే దొరికిందన్న రేంజిలో మళ్ళీ ముందుకి రాళ్ళపై పరుగెత్తుకెళ్ళి (మూడవ బోగీ ఏసీ) రెండవబోగీ ఎక్కేశా.

అదన్నమాట రైలునే నేను ఆపి(పించి)న అనుభవం. అందుకే ప్రతీ క్షణం, ముఖ్యంగా "చివరి క్షణాల" విలువైనవి :-)

అనేవాళ్ళు అంటారులేండి, నీ గొప్పదనమేముంది, అది ఆ డ్రైవరుగారి దయని. కానీ ఆ డ్రైవరులో ఆ జాలి పుట్టించినది ఎవరు?

నల్లగొండలో దిగాక ఇంజినుదాక నడుచుకెళ్ళి డ్రైవరుగారికి థాంక్స్ చెప్పా!

14 కామెంట్‌లు:

  1. టైటిల్ చూసి తొడ కొట్టావేమో అని అనుకున్నాను,కానీ పడ గొట్టావని అర్థమంది.బాగుంది.
    vishwanath

    రిప్లయితొలగించండి
  2. విశ్వనాథ్: మొదటి పంక్తిలోనే చెప్పానుగా తొడగొట్టికాదనీ. థాంక్స్.

    రిప్లయితొలగించండి
  3. >>>కానీ ఆ డ్రైవరులో ఆ జాలి పుట్టించినది ఎవరు?

    హాహాహ్హ. నేను చెప్పాను కదా. చివరి క్షణాల్లో పన్లు చేసేవారిని ఆ యొక్క శ్రీమన్నారాయణుడు అల్లా కరుణిస్తాడని. ఆయనే డ్రైవరు గారి కళ్ళముందు కనిపించి ఆయొక్క ఆ రైలు ను అల్లా ఆపించాడన్నమాట.

    రిప్లయితొలగించండి
  4. jb garu Mee Blogs Bullets la Dusukuvastunnai

    Kotta Ga Ne start chesaru ga( Past 4months lo Chudaledu Mee Blog lanu. Maa Blog Readers ki Manchi Pani padindi

    రిప్లయితొలగించండి
  5. @బులుసు సుబ్రహ్మణ్యంగారు: హహా. నేను మటుకు 'నేనే' అనే శ్లేషతోనే చెప్పానండి ;-)

    @అజ్ఞాత: మీ అభిమానానికి థాంక్సండి. తెలుగులో మొదలుపెట్టీ ఎనిమిది నెలలయ్యింది. ఇంగ్లీషులో ఐదేళ్ళపైనుండే రాస్తున్నా :-)

    రిప్లయితొలగించండి
  6. Sorry JB sir, I reading ur blogs since from starting..but Last month i start reading ur blogs regulary...
    Rams..

    రిప్లయితొలగించండి
  7. హ హ బాగుందండీ మీ సాహసం.. ఆ డ్రైవర్ గారిని నిజంగా మెచ్చుకోవాలి.

    రిప్లయితొలగించండి
  8. @రాంస్: ఐతే ఓకే :-)
    @వేణూ శ్రీకాంత్‌‌గారు: ఆయన దయా, నా ప్రాప్తం :-)

    రిప్లయితొలగించండి
  9. బాగుందండి,మీ వ్యవహారం.చాలా బాగా రాస్తున్నారు, మీ సుందోపసుందులు సిరీస్ ఇలానే కొనసాగించండి,ఇలాంటి అనుభావాలు చాలానే ఉన్నాయని అనుకుంటున్నాను,:)

    రిప్లయితొలగించండి
  10. @మధుగారు: థాంక్సండి. చాలాకాదు గానీ, ఇంకా కొన్ని ఉన్నాయి, రాస్తాను. ఏమో, భవిష్యత్తులో కొన్ని కొత్తవి కూడా కలవచ్చు, కాకపోతే ఇప్పుడు ఇంతకుముందులా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవట్లేదు :-)

    రిప్లయితొలగించండి
  11. 2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  12. నూతన సంవత్సర శుభాకాంక్షలు జే.బి గారు.

    రిప్లయితొలగించండి
  13. ప్రస్తుతం మీరుంది హైదరాబాద్ అయితే ఇక్కడికి తప్పక రండి
    http://ten.wikipedia.org/wiki/Hyderabad

    రిప్లయితొలగించండి
  14. @సుబ్రహ్మణ్యంగారు: థాంక్సండి.
    @శిశిరగారు: థాంక్సండి.
    @రహ్మానుద్దీన్ షేక్‌‌గారు: నేను ఈ మధ్యనే హైదరాబాదుకి మారానండి. నాకు తెవికీగురించి తెలుసునండి. వికీ అంటే నాకు ఇష్టం. ఈ సదస్సుకి రావడానికి ప్రయత్నిస్తానండి.

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in