29, సెప్టెంబర్ 2024, ఆదివారం

సుందోపసుందులు - కొట్టులో ఒక సాయంత్రము (మా ప్రాజక్టు రిపోర్టు కష్టాలు)

సగం 2011 లో వ్రాసి, ఇవాళ పూర్తి చేసిన పోస్టు ----

ఐదు నెల్లక్రితం పెద్ద బజారులో ఒక ఫేమస్ కంగన్ హాల్ కొట్టులోకి అడుగుపెట్టాను. ఈ మధ్యన పెళ్ళిళ్ళ పనులతో (నావి కాదు, అన్నయ్యది, మిత్రులవి, కజిన్స్‌వి) ఈ కొట్టుకి తెగ తిరుగుతున్నా. గుంటూరులో పెళ్ళికి కావల్సిన అన్ని వస్తువులు దొరికే పట్నంబజారు-లాలాపేటల్లో ప్రసిద్ధిపొందినది ఈ కొట్టు. ఇప్పుడంటే మాల్స్ వచ్చాయిగానీ, పెళ్ళి వస్తువులేకాదు, పిన్నీసునుండి చాపలుదాకా ఆ కొట్టులో దొరకనిదంటూ లేదు. సరే విషయానికొస్తా.

అలా ఆ కొట్టులో అడుపెట్టగానే అక్కడి సూపర్‌వైజర్ నన్ను చూసి నవ్వాడు. నన్ను గుర్తుపట్టాడా? మనం ఈ కొట్టుకొచ్చి ఎనిమిదేళ్ళైపోయిందికదాని సందేహమొచ్చింది. అం గుబులు ఎందుకయ్యా అంటే కొన్నేళ్ళు వెనక్కిపోవాలి.

******

అవి ఇంజినీరింగు చివరి సంవత్సరం (2003). మాకేమో హైదరాబాదో, విజయవాడో వెళ్ళి ఏదొక ప్రాజెక్టు కొట్టుకొచ్చి (కొని), అక్కడే రిపోర్ట్లు కొట్టేయించుకు రావడం ఇష్టంలేదు. నాలుగు నెలలు కష్టపడి ప్రాజెక్టు ఏదో చేశాం అనిపించాం. ఇపుడు మా శ్రమని ఒక పుస్తకంగా (ప్రాజక్టు రిపోర్టు) అచ్చేయించి మా హెచ్..డీ. (ఆవిడకి అంట సీనులేదు, గానీ ప్రాజెక్టుకోసం పిలవకతప్పదు) మొహాన కొట్టడమనే బృహత్కార్యం మిగిలింది.

మాదే మా కళాశాలలో మొదటి బ్యాచ్ కాబట్టి, అప్పట్లో జిల్లాకి నాలుగైదు కాలేజీలు తప్ప ఇప్పటిలా కుప్పలు తెప్పలు లేవుగాబట్టి మాకు ఈవిషయంలో మార్గదర్శనం చేసేవాళ్ళు కనపడలే. మా లెక్చరర్ల్నడగాలంటే వాళ్ళకి ఈ వివరాలు పెద్దాగా తెలీదని అర్థమైపోయింది. అంతా తమిళనాడు, కర్ణాటకల్లో ఏదోకటి చేసొచ్చినోళ్ళు, లేడా హైదరాబాదులో కొనుక్కొచ్చినవాళ్ళు.

సరేనని గుంటూర్లో ఉన్న నేనూ, విజయ్ (పేరు మార్చాను) స్వయంకృషి మొదలుపెట్టాం. మేమిద్దరం రెండు వేరువేరు ప్రాజక్టు బ్యాచీలకి నాయకులం. నలుగురు విద్యార్థులను ఒక బ్యాచీ చేస్తారు. ఇక రంగంలో దిగి వివరాలు కనుక్కుంటే మొత్తం (టైపు చేయడం, ప్రింటు తీయడం, బట్టర్ పేపరుతో మంచి బైడు చేయించడం) కలిపి టోకున చేసేవాళ్ళు దొరికారుగానీ కొంచెం ఎక్కువడిగారనిపించింది. ఛీఛీ - కంపు.సైన్సు విద్యార్థులమై ఆ మాత్రం చేసుకోలేమానిపించింది.

పక్క ఇంజినీరింగు కాలేజి లైబ్రరీ (గ్రంథాలయం)లోకి ఒక రోజు దూరి అక్కడి పాత బ్యాచోళ్ళ రిపోర్ట్లు చూసి, వాటికి మా సొంత పైత్యం జోడించి రిపోర్టు ఎలా ఉండాలనేది నిర్ణయించాం. అదేంటంటే మేమే కంటెంట్ ప్లానింగు, ఫాంట్ల సెలక్షన్లతో సహా టైపు చేసుకుని, మామూలు పుస్తకంలా బైండు చేయించి, అట్ట పైన ఒక డిజైను పేపరు (శుభలేఖలు అచ్చేసేవిలాంటివి) బంగారు (రంగుమాత్రమే🙂) అక్షరాలతో వేయంచి ఒక కవరు తొడగడం.

మేమీ వెతకడాలు, ప్రాజక్టు పనులన్నీ పూర్తి చేసేసరికి రిపోర్ట్లు కాలేజీలో ఇవ్వలిన గడువుకి రెండు రోజులు మాత్రమే మిగిలింది.

మొదటిరోజు పైఅట్టకి కావల్సిన డిజైన్ కాగితంకోసం కొట్టుకి పోయాం. దేని కోసమని అడీగాడు. మా దగ్గరున్న పాత రిపోర్టు (బట్టరు పేపరు కవరు) చూపించి మా ప్లాను చెప్పాం.

"అరే, ఇవన్నీ ఎందుకండి, మేమే మొత్తం రిపోర్టు చేసిస్తామండి" అన్నాడు. (గోడౌను కథ – వాళ్ళంతవరకూ చేయలేదు, మేమే మొదట).

"అలా కాదులేండీ, మాకు తెలుసు, మేము చేసుకుంటాము, మీరు డిజైను కాగితం ఇస్తే చాలు" అన్నాము.

అలాక్కాదు, మీకు ఇక్కడ ఎవ్వరూ గోల్డులో ప్రింటు చేయరు, కంప్యూటరు ప్రింటింగులో మీకు ఎంబాసింగు రాదు, మాకు ప్రింటింగు ఉన్నది, మేము చేయిస్తాము అన్నారు. అలాగే మాక్కావలసిన డిజైనులో పేపరు కూడా దొరకలేదు, రేపు రండి ఇస్తాము అన్నారు. మేము బుట్టలో పడ్డాము.

ఒక రోజంతా (రాత్రికూడా) కూర్చొని ఎవరింట్లో వారి రెపోర్ట్లను వాళ్ళము టైపు చేసికొన్నాం.

*** గడువు ముందురోజు ***-

ఒక ఫ్లాపీలొ /* అంటే ఏంటని అడగమాకండి :-) */ ప్రాజక్టు వర్డు డాక్యుమెంటును పెట్టుకొని లాలాపేటలో శుభలేఖలు బల్కు-ప్రింటింగు చేసేవాళ్ళ దగ్గరికి పోయాం.

సాయంత్రము రండి అయిపోతుంది అన్నారు.

సాయంత్రము నాలుగింటికి ప్రెస్సుకు వెళ్లాము. అప్పట్లో మాకు బైకులేమీ లేవు. పనుంది అంటే గుంటూరు అంతా, ఇటు ఆటోనగరు నుండి అటు ఏటీ అగ్రహారము, పైన సంగడిగుంట నుండి కింద గుజ్జనగుండ్ల దాకా సైకిళ్ళపైనే తిరిగేవారము.

తెలిసిందే కదా, మనం పక్కనుంటేగానీ పనిచేయరు. అందులో కాలేజీ కుర్రాళ్ళము, లోకువ. సరే పక్కనుండి, గొడవపెట్టుకుని మొత్తాని ఇంకో గంటలో ప్రింటింగు అయ్యింది. ఆ ప్రింటవుట్లు పట్టుకుని బైండింగు షాపులో ఇచ్చి, కొంగు కొట్టుకు పోయాము.

మీవి ప్రింటింగు అవుతుంది, ఇంకో గంటలో వస్తాయి అన్నాడు. మేము మళ్లీ ఎక్కడికి పోతాము, ఇక్కడే ఉంటాము అన్నాము.

గంటయినా కవరు పేజీలు రావే. షాపువాడేమో మీరిక్కడ అడ్డముగా ఉన్నారు, మా బిజినేసుకు అడ్డము అంటాడు. మేమేమో రేప్పొద్దున ప్రాజక్టు రిపోర్టు సబ్మిటు చేయాలి. మీరిస్తే మేము ఇంకా బైండింగు చేయించుకోవాలి. మాకు వేరే పనేమీలేదు, మీరిస్తే పోతాము అంటాము.

ఈలోపు ఏదో సరుకు వస్తే లోపల పెట్టడానికి సాయం చేశాము.🥴

ఏడున్నరయ్యింది. ఇలాకాదు, మీ ప్రింటింగు ప్రెస్సు ఎక్కడో చెప్పండి, మేము పోతాము అని చెప్పాము. ఈలోపు పొద్దుననగా పోయి ఇంకా ఇంటికి రాలేదు అని వెతుక్కుంటూ బెస్ట్ ఫ్రెండ్ అంజి కొట్టుకి వచ్చాడు (సెల్ఫోన్లు లేని రోజులు).

కాసేపు నసిగాక అడ్రసు చెప్పాడు, ఎక్కడో సంగడిగుంటలో ఏదో లైనులో.

విజయ్ ను షాపులో పెట్టి నేనూ, అంజి ప్రింటింగు ప్రెస్సుకు సైకిళ్ళేసుకుని పోయాము. అప్పట్లో అది ఊరి బయటే. వీథిలైట్లులేని, కుక్కలు తిరుగుతున్న భయానక కాలనీ. వెతుక్కుంటూ, ఆ ప్రెస్సుకు పోయాము. పోయి చూస్తే అప్పటికి మా పని ఇంకా మొదలుపెట్టలేదు. మాకన్నాముందు వేరేవి ఉన్నాయి అంటాడు. ముందు బ్రతిమలాడాము, తర్వాత వాదించాము, ఆ తర్వాత బెదిరించాము. నువ్వు ఇవ్వనిది, నువ్వు కదలవూ, మేము కదలము అన్నాము.

ఇలా కాదని ఆ ప్లెస్సునుండీ షాపు ల్యాండులైనుకి ఫోను చేయించి, మావాడికి విషయం చెప్పాము. వాడు కొట్టు శేటు చేత చెప్పించాడు. చివరికి పని మొదలుపెట్టించి (స్క్రీను ప్రింటింగు పెద్ద పని - ముందు అక్షరాలు స్టెన్సిలుతో వరసపెట్టుకుని, లోగోతో సహా ఒక టెంప్లేటు చేసి, ప్రింటు తీయాలి, అందులో ఒక్కో ప్రింటుపైన ఒక్కో టీంమేటు పేరుండాలి) చేయించేసరికి తొమ్మిది దాటింది.

ఈలోపు కొట్టులో మా విజయికి ఇంకో టైపు అనుభవాలు. ఆ గుమాస్తా మావాడిని ఇంజనీరింగు స్టూడెంటు అని బిల్లింగు దగ్గర టోటల్స్ లెక్క కట్టడానికి కాసేపు వాడుకున్నాడు. ఇంకాసేపు ఫ్యాన్సీ వస్తువులు అమ్మే కౌంటరులో కూర్చోబెట్టి టిఫిను, టీకి పోయాడు.

అలా తొమ్మిదిన్నరకు వచ్చి ప్రింటింగు చేసిన డిజైను కవర్లు చూపించాము. ఆ షాపు ఓనరు ఆశ్చర్యపోయాడు - కళ్లల్లో కొత్త బిజినెసు ఐడియా కనిపించింది - మరి అన్నీ వాళ్ల చేతుల్లో ఉన్నవే - డిజైను పేపరు, ప్రింటింగు, కవర్లు, అన్నీ.

ఆ తొమ్మిదిన్నరకు అవన్నీ పట్టుకుని బైండింగు షాపుకు పోయాము. మావి బైండింగు ఇంకా అవ్వలేదు. అక్కడే పదిదాకా కూర్చుని, అయ్యాక, వాటికి కవరు పేజీలు అంటించి, ఇంటికి తీసుకపోయాము. ఆరబెట్టి, పొద్దున్నే లేచి, వాటిని మళ్ళీ ఇంకో బైండింగు షాపులో కట్ చేయించి, కవర్లు తొడిగి మధ్యాహ్నానికి కాలేజికి పోయి సబ్మిట్ చేశాము.

అలా ఆ షాపువాడికి మేమిద్దరం బాగా నోటు అయ్యామన్నమాట. తిరిగి ప్రస్తుతానికి, అంటే 2011లో పోయినపుడు, ఓనరు గుర్తు పట్టలేదుగానీ, గుమాస్తా బాగా గుర్తుపట్టాడు. దేజావూ...😁😁😁


22, సెప్టెంబర్ 2024, ఆదివారం

డైరీ డే

 నిన్న (సెప్టెంబరు 21) డైరీ (దినచర్య) డే అంట. ఫేస్బుక్ మిత్రుల పోస్టులతో తెలిసింది. ఇంజనీరింగులో (2001) ఒక పది రోజులు వ్రాసినా, పూర్తి అయ్యాక గేట్ కోచింగుకు పోయి ఒంటరిగా రూములో ఉన్న రోజుల్లో (2003) తరచుగా డైరీ వ్రాయడము మొదలుపెట్టా. బ్రహ్మచారిగా ఉన్నన్ని రోజులూ వ్రాశాను.

శనివారం వారాంతము సెలవు కావడముతో గుర్తుకు వచ్చి ఆ పాత డైరీలు అన్నీ తీసి ముందేసుకుని కూర్చున్నా - ఎపుడో 20 ఏళ్ళ కిందటి ఆలోచనలూ, అప్పటి అనుభవాలూ, అప్పటి ఫిలాసఫీలూ ఇప్పుడు నెమరేసుకుంటే భలే అనిపించింది.


గేటు కోచింగు సమయములో పీజీనా, ఉద్యోగమా, ఏదోకటి సాధించాలి - ఇలా కొంత స్ట్రెస్ ఫీలయ్యేవాడిని. జాబులో చేరాక గొడవలు, తమిళ రూమ్ మేట్లతో సమస్యలూ, డెవలప్మెంటు నుండి తీసి డొక్కు మెయింటెనెన్సు ప్రాజక్టులో వేసినపుడు పడ్డ నిరాశలూ, చికాకులూ, అమెరికాలో క్లయింట్ల దగ్గర ఎదురైన ఛాలెంజీలూ… .

అన్నీ నెగటివ్లే కాదు - మొదటి జీతము అందుకున్న రోజూ, పొదుపు చేసుకున్న డబ్బులతో బైకు కొన్న రోజూ (2006), అమెరికా పోయిన రోజూ, మొదటి ప్రమోషను వచ్చిన రోజూ - ఇలా చాలా మధురానుభూతులూ…

15-30 వయసులో ఉండే టీనేజీ, యువకులకు డైరీ వ్రాసుకోమని సలహా. మీ అనుభవాలూ, అనుభూతులనూ రికార్డు చేసుకోండి.

ఇలా డైరీ జ్ఞాపకాలన్నీ చదివి రాత్రికి ఫేస్బుక్ తెరవగానే ఇంకో మిత్రుడు సాఫ్టువేరు ఉద్యోగాలలో స్ట్రెస్ గురించి వ్రాసిన అద్భుతమైన పోస్టు కనిపించింది. 22-27 ఏళ్ళ మధ్యన నా మొదటి ఐదేళ్ళ కెరియరులో నేను అనుభవించిన స్ట్రెస్, చూసిన రాజకీయాలూ, మోసాలూ, ఎలా ఎదుర్కున్నాను, అన్నీ రీలు తిరిగాయి. ఏ రంగమైనా ధైర్యముగా నిలబడితేనే ఎదగకపోయినా, కుంగిపోకుండా ముందుకు పోగలము.


19, ఏప్రిల్ 2024, శుక్రవారం

20 ఇయర్స్ ఇండస్ట్రీ - పార్ట్ 3

 *** 20 ఇయర్స్ ఇండస్ట్రీ - పార్ట్ 3 ***

ఐటీలో ఇరవై ఏళ్లు ఏం చేశాను అంటే స్వదేశ్ షారూఖ్ లాగా పెద్ద నాసా ప్రోగ్రాములు వ్రాయలేదు. కనీసం ప్రజలు వాడే బ్యాంకు యాప్ లాంటివి చేయలేదు. అలాగనీ పదహారు ఏళ్లు  అందరూ బాడీ షాపింగు అని చిన్నచూపు చూసే సర్వీసు కంపెనీలో చేశాను కదాని అన్నీ చిల్లర ప్రాజక్టులు చేయలేదు.

ముందు భాగములో చెప్పినట్టు వైవిధ్యత, నవ్యత ఉన్న పని చేసే అవకాశాలు లభించాయి - అది డొమైన్ అయినాగానీ, టెక్నాలజీ అయినాగానీ -  పేరుకు బ్యాంకింగ్ - ఇన్సూరెన్స్ - లైఫ్ సైన్సెస్ డొమైను అయినా  - మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు, గవర్నెన్స్, రిస్క్, కంప్లయన్స్, లోన్ ట్రాకింగు, స్పెషాలిటి ఇన్సూరెన్స్, బాండ్స్, స్పెషాలిటీ ఫార్మా, ఇన్ఫూజన్ - ఇలా వైవిధ్యమైన కొత్త రకమైన ఏరియాలలో పని చేశాను.

కాలేజీలో (1999-2003) ఉన్న రోజుల్లో మాకు విజువల్ బేసిక్, విజువల్ సీ++ మాత్రమే ఉండేవి. డాట్‌నెట్ 1.0 ఇంకా అంత ప్రాచుర్యం పొందలేదు. ఒక మిత్రుడు హైదరాబాదు నుండి మైక్రోసాఫ్టు ప్రెస్ పుస్తకం తీసుకువస్తే  డాట్‌నెట్ 1.0 (విజువల్ స్టూడియో 2002) కొంత నేర్చుకున్నా.

2004లో ఉద్యోగంలో చేరాక నా మొదటి ప్రాజక్టులో డాట్‌నెట్ 1.0 (విజువల్ స్టూడియో 2002) , డాట్‌నెట్ 1.1 (విజువల్ స్టూడియో 2003) మీద పని చేశా. ఇందులో కంటెంటు మేనేజిమెంటు కూడా ఉంది. ఆ ప్రాజక్టు ఒక అమెరికా టాప్ 1 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీకి వెబ్సైటు. ఊరికి పోయి ఫ్రెండ్సుకి, నాన్నకి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరులో వెబ్సైటు తెరిచి మనం డెవలప్ చేసిన వెబ్‌పేజీలు చూపించడం (2004లో) - ఆ అనుభవం నభూతో నభవిష్యత్. ఈ ప్రాజక్టుకోసం AMFI (Association of Mutual Funds in India ) సర్టిఫికేషను చేశాను.

2005లో డాట్‌నెట్ 2.0 (విజువల్ స్టూడియో 2005)లో ఒక అమెరికా టాప్ 3 బ్రోకరేజి సంస్థకు ఒక పేమెంటు సిస్టం ప్రాజక్టుపని చేశా. ఇక్కడ SQL Server 2000 ఉంది.

2005లోనే లక్ష మంది ఉద్యోగులున్న మా సంస్థలో పెద్ద తలకాయలు (CXO, ఎస్వీపీలు) పోటీదారుల సమాచారాన్ని చూసే ఒక డ్యాష్ బోర్డుకు డిజైన్, ఆర్కిటెక్చరు చేశాను. అపుడు నాకూ, ఇంటర్నల్ అప్లికేషను టీమ్ ఆర్కిటెక్టుకు ఒక డేటాబేస్ టేబుల్ డిజైనుపై తేడాలు వచ్చాయి. జూనియర్ అయిన నా డిజైను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని తీసుకోలేదు. నేను వేరే ప్రాజక్టుకు పోయాను. ఒక రెండు నెలల తరువాత పర్ఫార్మెన్స్ ఇష్యూలు వచ్చి మళ్లీ నా డిజైనుకు మారారు.

2007లో ఒక అమెరికా టాప్ 3 ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు సంస్థకు రెండు మూడు రిపోర్టింగు అప్లికేషన్లు, క్యాలండర్ స్కెడ్యూలర్ తయారు చేశాం. ఇందులో Oracle 10g డేటాబేస్. నేనే ప్రాజక్టు లీడ్, ఆర్కిటెక్ట్ - ఎస్టిమేషన్, ప్రాజక్ట్ మేనేజ్మెంట్ నాదే.

2008లో అదే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు సంస్థకు ఒక డాట్‌నెట్ అప్లికేషన్ (డాట్‌నెట్ 2.0 (విజువల్ స్టూడియో 2005), క్లాసిక్ ఏఎస్‌పీ, సైబేస్) సపోర్టు, ఎన్హాన్స్‌మెంట్లు చేశాము. ఈ అప్లికేషనును ఆ సంస్థ సబ్సిడియరీలు అయిన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు, బ్రోకరేజి, పర్సనల్ ఇన్వెస్టింగు, బిజినెస్ ఇన్వెస్టింగు, ఇంకా చాలామంది వాడేవారు. ఈ అప్లికేషను రిపోర్టులు ఆ సబ్సిడియరీల CxOలు, ప్రెసిడెంట్లు వాడేవారు. దీనికోసం నేను అమెరికా వెళ్ళాను. అప్పుడప్పుడు వారితో మాట్లాడేవాడిని. రెండు మూడు సార్లు వారి ట్రేడింగు ఫ్లోరుకి కూడా వెళ్ళాను రిక్వైరుమెంట్లు తీసుకోవడానికి. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు, ట్రేడింగు గురించి చాలా నేర్చుకున్నా.

ఇదే ట్రేడింగు ఫ్లోరు -

2010-12 ల మధ్యన GRC (Governance, Risk & Compliance) లో ఒక ప్రోడక్టుకు సపోర్టు, కష్టమైజేషన్ చేశా. డాట్‌నెట్ 2.0 (విజువల్ స్టూడియో 2005) డాట్‌నెట్ 3.5 (విజువల్ స్టూడియో 2008), సైబేస్, ఓరకిల్, SQL సర్వరు, డాక్యుమెంటం - ఇలా అన్నీ ఉన్నాయి. ఇందులో రిస్కు ప్రొసీడ్యరు, పాలసీలు, కంప్లయన్సు ఎందుకు, మనీ లాండరింగు (AML), ఇలా చాలా తెలుసుకున్నా. ఆ ప్రాడక్టు సేల్స్ మేనేజరు, మా క్లయింటు వీపీలే నన్ను సీఫుడ్ రెస్టారెంటుకు లంచ్ తీసుకుపోయేవారు.🙂

2013-14 ల మధ్యన ఒక పెద్ద అమెరికా బ్యాంకుకు చెందిన ఒక ఇన్సూరెన్స్ సబ్సిడియరీకి ఒక ఇన్సూరెన్స్ ట్రాకింగు అప్లికేషనుకు టెక్నికల్ మేనేజరుగా చేశా. అమెరికాలో హోం లోను తీసుకునే ప్రతి ఇంటికి బీమా తప్పనిసరి. కానీ చాలా మంది రెండవ సంవత్సరం నుండి బీమా ఎగ్గొడతారు. మా అప్లికేషను రోజూ బ్యాంకులనుండి కొన్ని లక్షల లోను డేటా, బీమా సంస్థలనుండి లక్షల బీమా డేటా తెచ్చి ట్యాలి చేస్తుంది. తేడాలున్నవారికి ఫోన్లు చేయడం, లెటర్లు పంపించడం చేసి బలవంతాన బీమా అంటగడతారు. డాట్‌నెట్ 3.5, 4.x (విజువల్ స్టూడియో 2008, 2010, 2012) వాడేవారం. సపోర్టు, మైనరు ఎన్హాన్సుమెంట్లు, ఫుల్ ఫ్రం స్క్రాచ్ డెవలప్మెంటు ఉండేది. నాకు 45 మంది రిపోర్టు చేసేవారు.

ఆ ప్రాజక్టు మేనేజ్మంటు విసుగుపుట్టిన సమయంలో 2014లో అమెరికాలో టాప్ బీమా సంస్థకి ఆర్కిటక్టుగా ప్రాజక్టు వచ్చింది. ఇది మామూలు వ్యక్తిగత, ఆస్తి (Property & Casualty) బీమా కాదు, వాహన (Auto) బీమా కాదు. స్పెషాలిటీ బీమా - అంటే ఒక కంపెనీ డైరెక్టర్లు, సీఈఓలు కిడ్నాపుకు గురయితే? ఒక వైద్యుడిపై ఎవరన్నా కేసు పెడితే? ఒక ఆర్టిస్టుపై కాపీరైటు కేసు వస్తే? ఐడీ ఫ్రాడు? ఇలాంటివాటికి బీమా ఇస్తుంది మా క్లయింటు. వైవిధ్యమైన టెక్నాలజీలున్న చాలా అప్లికేషన్లున్నాయి. అన్నింటినీ ఎసెస్ చేసి, వాటిని క్లౌడు (PCF, AWS, Azure) , Containerization (Docker) లలోకి మార్చడానికి స్ట్రాటజీ, ఆర్కిటెక్చరు చేశాము. డాట్‌నెట్‌ 4.x, కోర్ (విజువల్ స్టూడియో 2015, 2017, 2019) వాడాను.

2016 నుండి 2020 దాకా ఎమర్జింగ్ టెక్నాలజీ టీమ్లో పని చేశాను. అంటే కొత్త కొత్త టెక్నాలజీలు, ప్రోడక్టులు ట్రై చేసి, పీఒసీలు చేసి బిజినెస్ కు రికమెండ్ చేయాలి. 2016లోనే మైక్రో సర్వీసెస్, క్లౌడ్ చేశాము, 2017లో నోకోడ్ ప్లాట్ఫాములు, 2018లో ఒక కోడ్ అనలైజరు, జెన్కిన్స్ - యూసీడీ - డాకర్ వాడి సీఐ-సీడీ పైప్లైన్, 2019లో ఒక చాట్ బాట్ - ఇలా అన్నీ ఒక స్టెప్ ముందరే.

2020లో ఒక చిన్న సంస్థకి (టైటానిక్ నుంచి లాంచీకి) మారాను. ఇక్కడ 5-6 డొమైన్ల క్లయింట్లకు సంబంధించిన ప్రాజక్టులు సమీక్ష చేశాను, 2-3 క్లయింట్లు ఇచ్చారు.

2021లో ఫార్మాసీలకు ప్రొడక్టు తయారు చేసే ఒక అమెరికా కంపెనీలో చేరాను. హెల్త్‌కేరు, ఫార్మా డొమైను గురించి నేర్చుకుంటున్నా. ఇక్కడ జీసీపీ, పీసీఎఫ్, అజూర్ పై పని చేశాను.

అలా బ్యాంకింగు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు, రిస్కు, గవర్నన్సు, కంప్లయన్సు, బ్రోకరేజి, ఇన్సూరెన్స్ ట్రాకింగు, స్పెషాలిటీ బీమా, ఇన్సూరెన్సు,హెల్త్‌కేరు, ఫార్మా డొమైన్లలో పని చేశాను, నేర్చుకున్నా.

క్లాసిక్ ASP, VB6, .Net 1.0, 1.1, 2.0, 3.5, 4 to .Net 4.x & Core - VS, VS Interdev to VS 2002, 2003, 2005, 2008, 2010, 2013, 2015, 2017, 2019, 2020, 2022, Visual Code, AWS, Azure, PCF, Kubernetes - ఇలా పేరుకు డాట్‌నెట్‌ అయినా 20 ఏళ్ళుగా చాలా వర్షన్లు నేర్చుకోవాలిసి వచ్చింది. అజూర్, ఎడబ్ల్యూ ఎస్, జీసీపీ, పీసీఎఫ్ - అన్ని క్లౌడు నేర్చుకున్నా.

కానీ ప్రోగ్రామింగు, కోడింగు, ఎనాలిసిస్ మారవు. కేవలం సింటాక్సులు, టూల్స్ మారుతాయి.


ఇపుడు ఫుల్ స్టాక్ డెవలపర్లు అని ప్రత్యేకముగా అంటున్నారు గానీ ఆ రోజుల్లో మేమే ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్టు, డాట్ నెట్ కోడ్, స్టోర్డ్ ప్రోసీజర్లు వ్రాశాము. సీఐ/సీడీ లేని రోజుల్లో ప్రోడక్షన్లో కోడ్ డిప్లాయ్ చేశాను.


డెవలపరుగా, లీడ్ గా, ప్రాజక్టు మేనేజరుగా, ఆర్కిటెక్టుగా, ఇండివిడ్యుయల్ కాంట్రిబ్యూటరుగా,  - అన్ని పాత్రలు చేశాను.

డెవలప్మెంట్, ప్రోడక్షన్ సపోర్టు, కన్సల్టింగు, మెయింటేనెన్సు, ప్రోడక్టు డెవలప్మెంట్ - అన్ని రకాల ప్రాజక్టులు చేశాను. 

కాకుంటే చెప్పుకోదగ్గ స్కేలులో ఏమీ చేయలేదు. పెద్ద అవార్డులూ- రివార్డులూ లేవు. ఎందుకో నేనే మొదటి పదేళ్లలో చేసినంత ఫుల్ పొటెన్షియల్‌తో రెండో దశకంలో చేయలేదు అనుకుంటాను.


20 ఇయర్స్ ఇండస్ట్రీ - పార్ట్ 2

*** 20 ఇయర్స్ ఇండస్ట్రీ - పార్ట్ 2 ***

నేటికి నా ఉద్యోగ జీవితం మొదలుపెట్టి 20 సంవత్సరాలు. అపుడే రెండు దశాబ్దాలు అయిపోయినాయా అనిపిస్తుంది. ఇరవయ్యేళ్లు చేశామా, ఇంకెన్నాళ్లు ఈ టెన్షన్లు అని కూడా అనిపిస్తుంది, ఐటీ కెరీరు కదా. 🙂

మరి  ఎందుకు  ఎన్నుకున్నావు? ఐటీ కాకుండా ఇంకేదన్నా ఎందుకు చేసుకోలేదు. ఆ బ్యాంకు జాబ్ చేరి ఉంటే బాగుండేది అనుకున్నావా? 

అంటే నో రిగ్రెట్స్, ప్రోగ్రామింగు జాబ్ కావాలని కోరుకున్నాను, ఇప్పటికీ ఐటీ ఉద్యోగమే ముద్దు. ఎందుకంటే ఇందులో ఓ వైవిధ్యత (వేరీడ్ వర్క్), నవ్యత (నావెల్టీ), ఇంకా చెప్పాలి అంటే ఒక రవితేజ కిక్కులాంటిది ఉంటుంది.

- మూడురోజుల నుండి నలుగురు డెవలపర్లకు అంతు చిక్కని బగ్గును, మీరు పాత్‌లో _ బదులు - పెట్టారు అని పది నిమిషాలలో సాల్వ్ చేస్తే వచ్చే కిక్!

- మూడు నిమిషాలు తీసుకునే సర్వీసును మూడు సెకన్లలో రెస్పాన్స్ తెప్పిస్తే వచ్చే కిక్!

- పది సెకన్లు తీసుకునే ఇరవై టేబుల్స్ జాయిన్ చేసి ఉన్న్ డేటాబేస్ సీక్వెల్ క్వెరీని వంద మిల్లీ సెకన్లకు కుదిస్తే వచ్చే కిక్!

- అమెరికా బోస్టను మెట్రో స్టేషనులో ప్లాట్ఫాంపై ల్యాప్టాప్ తెరచి ఫెయిలవుతున్న రిపోర్టు జాబులను ఫిక్స్ చేస్తే వచ్చే కిక్!

- మూడేళ్ల నుండీ అప్లికేషనులో ఉన్న సమస్యలకు కన్సల్టెంట్ ఆర్కిటెక్టుగా వెళ్లి నెలలో బయటపెట్టి సొల్యూషన్ చెప్తే వచ్చే కిక్!

- ఆదివారం రాత్రి ఆర్టీసి బస్సులో రాజమండ్రి నుండి హైదరాబాదు వస్తూ పాత ప్రాజక్టు మేనేజరు ఏదో బగ్ కోసం ఫోను చేస్తే ఎపుడో ఏడాది కిందట వదిలేసిన ప్రాజక్టులో కోడ్ ఫైల్స్, ఫంక్షను పేర్లతో సహా చెప్పి ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేసినపుడు వచ్చే కిక్!

- డిబగ్గర్, ‌డెవ్ టూల్స్ లేని 19 ఏళ్ల కిందటి రోజులలో ఇంటర్నట్ ఎక్స్ ప్లోరరులో వెబ్ పేజి స్క్రిప్టు బ్రేక్ అయ్యి వస్తున్న ఎర్రర్ ను నోట్ ప్యాడ్లో రెండు వేల లైన్ల క్లాసిక్ ఏఎస్పీ - జావాస్క్రిప్టు మిక్స్ అయిన కోడులో వెతికి పట్టుకుని ఫిక్స్ చేసిన రోజున వచ్చిన కిక్!

- సాయంత్రం ఇంటికి రాగానే, అప్లికేషనులో రిపోర్టులు ఫెయిల్ అయ్యి ఎస్కలేట్ అవుతున్న తరుణంలో ఫోను వస్తే అది ఇంటిజరుగా డిక్లేరు చేసిన ప్రాసెస్ ఐడీ 32768 దాటటం వలన వచ్చిన సమస్య అని ఫోనులో చెప్పి ఫిక్స్ అయితే వచ్చిన కిక్!

ఇలా ప్రతి నెలా కనీసం ఒక కిక్ ఉంటుంది. ఫుట్బాల్ కిక్కులు, నడ్డిమీద పడే కిక్కులు కూడా ఉంటాయనుకోండి. ఈ సందర్భములో అవి వద్దు!

ఐటీలాగా  ఇన్నేళ్లపాటు, ఇలా కన్టిన్యుయస్ గా కిక్ ఇచ్చే కెరీయర్లు తక్కువ!

18, ఏప్రిల్ 2024, గురువారం

ఇరవైయ్యేళ్ల క్రిందట

 ఇరవైయ్యేళ్ల క్రిందట, ఇదే రోజు...

2004 ఏప్రిల్‌ మొదటి వారంలో ఐటీ కంపెనీ నుండి ఆఫరు లెటరు పోస్టులో వచ్చింది వారం రోజుల్లో పూణె లో చేరమని నెలన్నర శిక్షణకు. గేట్ స్కోరుకు అప్లై చేసినవాటికి రెండు ఐఐటీల నుంచి ఇంటర్వూ కాల్ లెటరు వచ్చింది. ఐటీ జాబా , ఐఐటీలో ఎంటెక్‌ నా ఆలోచిస్తుంటే బ్యాంకు నుంచి అపాయింటుమెంటు లెటరు వచ్చింది నెలకు 25,000 జీతం (2004 లో పెద్ద మొత్తమే . ఐటీ కంపెనీలో జీతం 11,000 (టేక్‌ హోం 8,500).

ఒక వారం తర్జనభర్జన తరువాత పుణెకు వెళ్ళి ఐటీ కంపెనీలో ఏప్రిల్‌ మూడవ వారంలో చేరాలి అని డిసైడ్ అయ్యాను.

ముందురోజు ఆదివారమునకు హొటలు వసతి ఇచ్చారు కంపెనీవారు. అప్పట్లో పుణెకి పొద్దునపూటకి చేరే రైలు లేదు, లేదా నాకు బెర్త్ దొరకలేదో. అందుకని నేను, నాన్న ఒక రోజు ముందరే శుక్రవారము పొద్దున గుంటూరులో బయలుదేరి మధ్యాహ్నానికి హైదరాబాదుకు చేరాము. అక్కడ నాన్న నన్ను ఒక్కడినీ పుణె రైలు ఎక్కించారు. ఈ రోజులలోగా హెలికాప్టర్ పేరేంటింగు కాదు కదా, దగ్గరుండి ఆఫీసు దగ్గర దింపి, సాయంత్రము వరకు గేటు ముందు పడిగాపులు కాయడానికి.

శనివారము అర్థరాత్రికి పుణె చేరుతుంది. పొద్దున 7 గంటలకు గుంటూరులో కొచ్చిన్ (తరువాత శబరి అని మార్చారు) ఎక్కి 12 గంటలకు నాంపల్లి వచ్చి, స్టేషనులోనే తిని 2 గంటలకు ముంబై రైలు ఎక్కాను. అందుకని నిద్ర తన్నుకు వస్తుంది. కానీ రైలు పుణె దాటి ముంబై వెళ్లిపోతే? అందుకే నిద్రాపుకుంటూ అర్ధరాత్రి 1-2 మధ్యన పుణె స్టేషనులో ఒక్కడినే దిగాను.

పొద్దునదాకా స్టేషనులోనే కాలక్షేపము చేసి, క్లోక్ రూమ్లో లగేజి పెట్టి చుట్టుపక్కల లాడ్జిలు వెతకడం మొదలుపెట్టా (మొబైలు, గూగూల్ మ్యాప్లు లేని రోజులు). ఒక రెండు గంటలు, ఐదారు కిలోమీటర్లు తిరిగాక ఒక లాడ్జి దొరికింది.

ఇంటికి ఫోను చేసి చెప్పాను. ఆ రోజు టైంపాస్ చేసి మరుసటి రోజు ఉదయము కంపెనీ వాడిచ్చిన హొటలుకు వెళ్లాను. అక్కడ ఇద్దరిద్దరికీ ఒక రూమ్ ఇచ్చారు. లక్కీగా రూమ్మేట్ తెలుగువాడే. పక్క రూమ్లో ఇంకో ఇద్దరు తెలుగువారు పరిచయం అయ్యారు. కలిసి డిన్నరు చేశాము. ఇరవై ఏళ్ల తరువాత ఇప్పటికీ నలుగురమూ టచ్లో ఉన్నాము.

ఉద్యోగ అనుభవాలు రేపు...

24, జనవరి 2024, బుధవారం

బస్సు డ్రైవర్సు డే

ఆర్టీసీ డ్రైవర్స్ డే సందర్భముగా

పిల్లలలో ఎక్కువ శాతం మందికి బస్సులు, రైళ్లు అంటే ఒక ఫాసినేషన్ ఉండటం సాధారణమే. నాకు కూడా.

డ్రైవరు గేరు రాడు మారుస్తుంటే, స్టీరింగు తిప్పుతుంటే ఆరాధనగా చూడటం, కండక్టరు చేతిలోనే, ఒక మెటల్ ర్యాక్కో పెట్టుకున్న రంగు రంగుల టికెట్లు పంచు చేసి, లేదా చేతితో చించి ఇస్తే (మిలెనియల్స్కు టిమ్స్ మెషిన్లు తెలుసు) వాటిని దాచిపెట్టుకోవడం - సెలవుల్లో బస్సాట ఆడేటపుడు మడత కుర్చీలో తిరిగి కూర్చుని స్టీరింగులా ఊహించుకుంటూ హవాయి చెప్పులు తిరగదిప్పి బ్రేక్ యాక్సిలరేటరు లాగా తొక్కడము, దాచిపెట్టుకున్నటికెట్లను పెన్నుతో గుచ్చి ఇవ్వడము - అబ్బో అదో నోస్టాల్జియా.

ఉద్యోగములో చేరాక హైదరాబాదు నుండి గుంటూరుకు తరచుగా వెళ్లేవాడిన దాదాపు ప్రతి వారము వెళ్లిన రోజులున్నాయి. శుక్రవారము రాత్రి గుంటూరుకు, ఆదివారము రాత్రికి రిటర్ను.

నాకు ప్రయాణాలలో నిద్ర పట్టదు. అందుకని బస్సు అర్థరాత్రి టీ కోసం ఆపినప్పుడు దిగుతాను. డ్రైవరుతో సంభాషిస్తూ ఉంటాను. వారు చాలా సంతొషిస్తారు. ఎందుకంటే వారు నాలుగైదు రాత్రులు వరసగా డ్రైవింగు చేసి, రెండు రోజులు ఆఫ్ తీసుకుంటారట. హైదరాబాదు వస్తే భెల్ లోనో, కూకట్పల్లిలోనో బస్సు పెట్టి అక్కడే పడుకుంటారు. మియాపూర్ డిపో అయితే మటుకు పడుకోవడానికి మంచాలు ఉంటాయట. విజయవాడ, గుంటూరు బస్టాండులు అయితే డార్మిటరీలు ఉంటాయి. ఆ నాలుగు రోజులు వాళ్లే వండుకుంటారు. మీరు చూస్తే డ్రైవరు వెనక క్యాబినులో వారి బ్యాగు ఉంటుంది. ఆ డ్యూటీ రోజులు వారితో మాట్లాడేవారు కూడా ఉండరు. ఇపుడంటే వాట్సాపులు, అన్లిమిటెడ్ కాలింగు ఉన్నాయి, నేను చెప్పేది ఆరేడేళ్ల కిందటి వరకు. అందుకని మనం పలకరిస్తే ఎక్కువమంది సంతోషిస్తారు. వారు కూడా ఒంటరిగా ఫీలవరు.

కసారి రామోజీ ఫిల్మ సిటీ దాటాక పెద్ద జామ్ అయ్యి అక్కడే రెండు గంటలు ఇరుక్కుపోయాము. నేను ఒక అరగంట తరువాత వెనక సీటు నుండి క్యాబినుకు పోయి డ్రైవరుగారితో ముచ్చట పెట్చాను. మామూలుగయితే రెండు, రెండున్నరకి మిర్యాలగూడ చేరి టీ తాగాలి. కానీ అక్కడే ఫస్టు గేరులో నడపడము వలన డ్రైవరుకి నిద్ర వచ్చేసింది. ట్రాఫిక్ నుండి బయటపడ్డాక నార్కెట్ పల్లిలోనే ఆపేయించి టీ తాపించాను. ఆయన చాలా సంతోషించాడు.

వారికి ఉండే ఇంకో తలనెప్పి డ్రైవింగు చేస్తూనే రిజర్వేషను టిక్ కొట్టుకోవడమూ, ఎస్ఎమ్మెస్లు చూడడము, ట్రాఫిక్ జామ్ అయితే వచ్చే ఫోన్ల వరదను డ్రైవింగు చేస్తూనే ఎత్తి వారిని కన్విన్సు చేయడం, ఎవరన్నా టైముకు రాకపోతే వారికి చేస్తూ, ట్రాఫిక్ పోలీసుతో తిట్లు తింటూ - వెనక సీట్లో కూర్చుని రాని టీవీ గురించి తిట్టుకునేవారికి తెలియదు.

ఇక విజయవాడ – నెల్లూరు లైన్లో తిరిగే కండక్టరు లెస్ సర్వీసులు పెట్టాక డ్రైవర్ల కష్టాలు మామూలు కావు. ఒక చేత్తో స్టీరింగు తిప్పుతూ, ఇచ్చిన ఛార్జీ లెక్కపెట్టాలి, టిమ్స్లో టికెట్ కొట్టాలి, వారధి/బైపాస్ లాంటి చోట్ల ముందే దిగేవారికి చిల్లర లెక్క తీర్చాలి.

అస్సలు ఆర్టీసితో నా అనుబంధం కాలేజి రోజులది.

90ల చివర్లో నేను చేరిన ఇంజనీరింగు కాలేజి గుంటూరుకు నలభై కిమీ దూరములో మద్రాసు హైవేపై ఉండేది. చిలకలూరిపేట ఆర్డినరీ ఎర్ర బస్సులు (ఇపుడు పల్లెవెలుగు) తో పాటు నెల్లూరు, తిరుపతి పోయే ఎక్సప్రెస్లు కూడా ఎక్కేవారము.

ఒక ఆరు నెలల తరువాత కాలేజి బస్సు వేశారు - ఒక రెండు నెలలు పోయాక మళ్లీ ఆర్టీసికి మారిపోయాము. స్టూడెంట్ పాస్ తీసకుని ఎక్కువ శాతం ఎర్ర బస్సుకే పోయేవారం. ఎపుడన్నా అవసరమైతే ఎక్సప్రెస్లు ఎక్కేవారము.

అలా నాలుగేళ్లు తిరగడముతో చిలకలూరిపేట డిపో డ్రైవర్లు, కండక్టర్లు కొందరు బాగా పరిచయమయ్యారు. పలకరించేవారు. ఇంజనీరింగు కెరీరు గురించి అడిగేవారు. చివరి రో సీట్లలో కూర్చుని అంత్యాక్షరి లాంటివి ఆడుతుంటే ఎవరన్నా గొడవని కంప్లయింటు చేస్తే నవ్వి కుర్రాళ్లు కదా వదిలేయండి అనేవారు. మేము కాలేజీ నుండి హైవే పై స్టాపుకు పరిగెట్టడము చూస్తే బస్ ఆపేవారు, స్టాప్ లేకున్నా.

బస్ పాస్ 35 కిమీర్లకే ఇచ్చేవారు. అందుకని మిగతా 6 కిమీలకు ₹4 ల టికెట్ తీసుకునేవారం. నేను రూపాయి తగ్గుతుంది అని క్యాట్ కార్డు కూడా తీసుకున్నా 🙂 అయితే ఈ టికెెట్ కాలేజి దగ్గర ఎక్కగానే ఇవ్వరు - ఆ ఊరి స్టాపు వచ్చినపుడు కండక్టరుకు డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. ఒక్కోసారి బస్సు రష్ ఉన్నప్పుడు, ముందున్న కండక్టరు దగ్గరకు పోవడానికి కుదరదు. అందుకని మధ్యలో వారి ద్వారా ఇచ్చేవారం, లేదా ఎక్కేటపుడే డబ్బులు ఇచ్చేసేవారము, లేదా పంచ్ చేసి వారి దగ్గర పెట్టుకుంటే దిగేటపుడు ఇచ్చేవారం. ఒక్కోసారి మేము నిద్రపోతే, వాళ్ళే వెనక్కి వచ్చి పలకరించి పంచ్ చేసి వెళ్లేవారు.

మా సబ్ - జూనియర్ల నుండి ఎక్కువ కాలేజి బస్సులలోనే వెళ్లేవారు. అందుకని మా బ్యాచే ఎక్కువ అనుబంధం వారికి.

నా దగ్గర నాలుగేళ్ళ టికెట్ కట్ట ఉండేది. చాలా ఏళ్లు దాచాను, ఒక కజిన్ పిల్ల అడిగితే ఇచ్చేశాను. లేకుంటే ఇప్పటి టిమ్స్  రోజుల్లో nostalgic గా ఉండేది.

నేను అమెరికాలో ఆఫీసుకు బస్సులోనే వెళ్లేవాడిని. అక్కడ డ్రైవరుకి బాగా గౌరవము ఇస్తారు. వారు మనం ఎక్కగానే విష్ చేస్తారు. అక్కడా నేను రెగ్యులరుగా ఎక్కే రూట్ డ్రైవర్లతో చక్కటి రిలేషన్ ఉండేది.

పెళ్లయ్యాక మా శ్రీమతి వైపు దగ్గరి చుట్టాలు ఆర్టీసిలో కంట్రోలరు, డ్రైవర్లు. అందుకని ఇంకా ఆర్టీసితో నా అనుబంధం పెరిగింది. వారి కష్టాలు, ఇబ్బందులు ఇంకా దగ్గర నుండి తెలుసుకున్నాను.

అందుకని సాధ్యమైనంతవరకూ నేను ప్రైవేటు బస్సులకన్నా ఆర్టీసిలోనే ప్రయాణిస్తాను వారితో సంభాషించడమూ, సమయాని కన్నా ముందరే నా స్టాపు దగ్గర నించోవడం చేస్తుంటాను. వారి మైండు ప్రశాంతముగా ఉంచితే వారు మనల్ని గమ్యస్థానానికి చేరుస్తారు.

రాత్రంతా నిద్రపోకుండా మనం పదింటికి బస్సు ఎక్కి పడుకుంటే, తెల్లారాసేరికి మన ఊర్లో దించేవారే డ్రైవర్లు.