స్వగతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్వగతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఏప్రిల్ 2024, శుక్రవారం

20 ఇయర్స్ ఇండస్ట్రీ - పార్ట్ 2

*** 20 ఇయర్స్ ఇండస్ట్రీ - పార్ట్ 2 ***

నేటికి నా ఉద్యోగ జీవితం మొదలుపెట్టి 20 సంవత్సరాలు. అపుడే రెండు దశాబ్దాలు అయిపోయినాయా అనిపిస్తుంది. ఇరవయ్యేళ్లు చేశామా, ఇంకెన్నాళ్లు ఈ టెన్షన్లు అని కూడా అనిపిస్తుంది, ఐటీ కెరీరు కదా. 🙂

మరి  ఎందుకు  ఎన్నుకున్నావు? ఐటీ కాకుండా ఇంకేదన్నా ఎందుకు చేసుకోలేదు. ఆ బ్యాంకు జాబ్ చేరి ఉంటే బాగుండేది అనుకున్నావా? 

అంటే నో రిగ్రెట్స్, ప్రోగ్రామింగు జాబ్ కావాలని కోరుకున్నాను, ఇప్పటికీ ఐటీ ఉద్యోగమే ముద్దు. ఎందుకంటే ఇందులో ఓ వైవిధ్యత (వేరీడ్ వర్క్), నవ్యత (నావెల్టీ), ఇంకా చెప్పాలి అంటే ఒక రవితేజ కిక్కులాంటిది ఉంటుంది.

- మూడురోజుల నుండి నలుగురు డెవలపర్లకు అంతు చిక్కని బగ్గును, మీరు పాత్‌లో _ బదులు - పెట్టారు అని పది నిమిషాలలో సాల్వ్ చేస్తే వచ్చే కిక్!

- మూడు నిమిషాలు తీసుకునే సర్వీసును మూడు సెకన్లలో రెస్పాన్స్ తెప్పిస్తే వచ్చే కిక్!

- పది సెకన్లు తీసుకునే ఇరవై టేబుల్స్ జాయిన్ చేసి ఉన్న్ డేటాబేస్ సీక్వెల్ క్వెరీని వంద మిల్లీ సెకన్లకు కుదిస్తే వచ్చే కిక్!

- అమెరికా బోస్టను మెట్రో స్టేషనులో ప్లాట్ఫాంపై ల్యాప్టాప్ తెరచి ఫెయిలవుతున్న రిపోర్టు జాబులను ఫిక్స్ చేస్తే వచ్చే కిక్!

- మూడేళ్ల నుండీ అప్లికేషనులో ఉన్న సమస్యలకు కన్సల్టెంట్ ఆర్కిటెక్టుగా వెళ్లి నెలలో బయటపెట్టి సొల్యూషన్ చెప్తే వచ్చే కిక్!

- ఆదివారం రాత్రి ఆర్టీసి బస్సులో రాజమండ్రి నుండి హైదరాబాదు వస్తూ పాత ప్రాజక్టు మేనేజరు ఏదో బగ్ కోసం ఫోను చేస్తే ఎపుడో ఏడాది కిందట వదిలేసిన ప్రాజక్టులో కోడ్ ఫైల్స్, ఫంక్షను పేర్లతో సహా చెప్పి ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేసినపుడు వచ్చే కిక్!

- డిబగ్గర్, ‌డెవ్ టూల్స్ లేని 19 ఏళ్ల కిందటి రోజులలో ఇంటర్నట్ ఎక్స్ ప్లోరరులో వెబ్ పేజి స్క్రిప్టు బ్రేక్ అయ్యి వస్తున్న ఎర్రర్ ను నోట్ ప్యాడ్లో రెండు వేల లైన్ల క్లాసిక్ ఏఎస్పీ - జావాస్క్రిప్టు మిక్స్ అయిన కోడులో వెతికి పట్టుకుని ఫిక్స్ చేసిన రోజున వచ్చిన కిక్!

- సాయంత్రం ఇంటికి రాగానే, అప్లికేషనులో రిపోర్టులు ఫెయిల్ అయ్యి ఎస్కలేట్ అవుతున్న తరుణంలో ఫోను వస్తే అది ఇంటిజరుగా డిక్లేరు చేసిన ప్రాసెస్ ఐడీ 32768 దాటటం వలన వచ్చిన సమస్య అని ఫోనులో చెప్పి ఫిక్స్ అయితే వచ్చిన కిక్!

ఇలా ప్రతి నెలా కనీసం ఒక కిక్ ఉంటుంది. ఫుట్బాల్ కిక్కులు, నడ్డిమీద పడే కిక్కులు కూడా ఉంటాయనుకోండి. ఈ సందర్భములో అవి వద్దు!

ఐటీలాగా  ఇన్నేళ్లపాటు, ఇలా కన్టిన్యుయస్ గా కిక్ ఇచ్చే కెరీయర్లు తక్కువ!

18, ఏప్రిల్ 2024, గురువారం

ఇరవైయ్యేళ్ల క్రిందట

 ఇరవైయ్యేళ్ల క్రిందట, ఇదే రోజు...

2004 ఏప్రిల్‌ మొదటి వారంలో ఐటీ కంపెనీ నుండి ఆఫరు లెటరు పోస్టులో వచ్చింది వారం రోజుల్లో పూణె లో చేరమని నెలన్నర శిక్షణకు. గేట్ స్కోరుకు అప్లై చేసినవాటికి రెండు ఐఐటీల నుంచి ఇంటర్వూ కాల్ లెటరు వచ్చింది. ఐటీ జాబా , ఐఐటీలో ఎంటెక్‌ నా ఆలోచిస్తుంటే బ్యాంకు నుంచి అపాయింటుమెంటు లెటరు వచ్చింది నెలకు 25,000 జీతం (2004 లో పెద్ద మొత్తమే . ఐటీ కంపెనీలో జీతం 11,000 (టేక్‌ హోం 8,500).

ఒక వారం తర్జనభర్జన తరువాత పుణెకు వెళ్ళి ఐటీ కంపెనీలో ఏప్రిల్‌ మూడవ వారంలో చేరాలి అని డిసైడ్ అయ్యాను.

ముందురోజు ఆదివారమునకు హొటలు వసతి ఇచ్చారు కంపెనీవారు. అప్పట్లో పుణెకి పొద్దునపూటకి చేరే రైలు లేదు, లేదా నాకు బెర్త్ దొరకలేదో. అందుకని నేను, నాన్న ఒక రోజు ముందరే శుక్రవారము పొద్దున గుంటూరులో బయలుదేరి మధ్యాహ్నానికి హైదరాబాదుకు చేరాము. అక్కడ నాన్న నన్ను ఒక్కడినీ పుణె రైలు ఎక్కించారు. ఈ రోజులలోగా హెలికాప్టర్ పేరేంటింగు కాదు కదా, దగ్గరుండి ఆఫీసు దగ్గర దింపి, సాయంత్రము వరకు గేటు ముందు పడిగాపులు కాయడానికి.

శనివారము అర్థరాత్రికి పుణె చేరుతుంది. పొద్దున 7 గంటలకు గుంటూరులో కొచ్చిన్ (తరువాత శబరి అని మార్చారు) ఎక్కి 12 గంటలకు నాంపల్లి వచ్చి, స్టేషనులోనే తిని 2 గంటలకు ముంబై రైలు ఎక్కాను. అందుకని నిద్ర తన్నుకు వస్తుంది. కానీ రైలు పుణె దాటి ముంబై వెళ్లిపోతే? అందుకే నిద్రాపుకుంటూ అర్ధరాత్రి 1-2 మధ్యన పుణె స్టేషనులో ఒక్కడినే దిగాను.

పొద్దునదాకా స్టేషనులోనే కాలక్షేపము చేసి, క్లోక్ రూమ్లో లగేజి పెట్టి చుట్టుపక్కల లాడ్జిలు వెతకడం మొదలుపెట్టా (మొబైలు, గూగూల్ మ్యాప్లు లేని రోజులు). ఒక రెండు గంటలు, ఐదారు కిలోమీటర్లు తిరిగాక ఒక లాడ్జి దొరికింది.

ఇంటికి ఫోను చేసి చెప్పాను. ఆ రోజు టైంపాస్ చేసి మరుసటి రోజు ఉదయము కంపెనీ వాడిచ్చిన హొటలుకు వెళ్లాను. అక్కడ ఇద్దరిద్దరికీ ఒక రూమ్ ఇచ్చారు. లక్కీగా రూమ్మేట్ తెలుగువాడే. పక్క రూమ్లో ఇంకో ఇద్దరు తెలుగువారు పరిచయం అయ్యారు. కలిసి డిన్నరు చేశాము. ఇరవై ఏళ్ల తరువాత ఇప్పటికీ నలుగురమూ టచ్లో ఉన్నాము.

ఉద్యోగ అనుభవాలు రేపు...

31, డిసెంబర్ 2020, గురువారం

2020 రోలర్ కోస్టర్ సవారీ

 2020 సంవత్సరం ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ఎంతో కొంత ప్రభావితం చేసింది. నేను కూడా ఈ సంవత్సరంని నేను, నా కుటుంబము తల్లిదండ్రులతో, అన్నయ్య కుటుంబంతో సహా కోవిడ్ బారినపడకుండా దాటేసినందుకు సంతోషంగానూ కృతజ్ఞతతోనూ ఉన్నాను. కానీ అదే సమయంలో ఈ సంవత్సరం నాకు రోలర్ కోస్టర్ సవారీ లాగా అనిపించింది.

😔జనవరిలో మా పాప పుట్టినరోజుకి ఒక రోజు ముందు అనుకోకుండా సొంత ఊరు వెళ్లాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఎప్పుడూ పుట్టిన రోజు హైదరాబాద్లో జరుపుకొని తర్వాతి రోజు సంక్రాంతి అని గుంటూరు వెళ్తాము. మొదటి పుట్టినరోజు తర్వాత మళ్లీ ఎనిమిదవ పుట్టినరోజుకి మా ఊర్లో జరుపుకోవడానికి కుదిరింది. సాయంత్రం కరెక్ట్గా కేకు తేవటానికి బేకరీ కి బయల్దేరగా మా తాతగారు కిందపడి తలకి దెబ్బ తగిలితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆ రాత్రంతా అక్కడే ఉన్నాను మా పాప కేక్ కటింగ్ కి నేను లేను తను చాలా బాధపడింది.

😔ఫిబ్రవరిలో శివరాత్రి తెల్లవారుజామున మూడింటికి సొంత ఊరు నుంచి ఫోన్ వచ్చింది మా బామ్మ ఇకలేరు అని. వెంటనే కారు ఏసుకుని ఫ్యామిలీ అంతా వెళ్లాం. అంత్యక్రియలకు, పది రోజుల తర్వాత మళ్లీ కార్యక్రమాలకు రెండుసార్లు తిరిగాను హైదరాబాద్ నుంచి.

😐మార్చిలో మొదటి మాసికానికి ఒక్కడిని వెళ్లాల్సి ఉండంగా శుక్రవారం వర్క్ ఫ్రొం హోమ్ కి కావాల్సిన ఏర్పాట్లలో బిజీగా ఉండి వెళ్ళలేకపోయాను. ఆదివారమే జనతా కర్ఫ్యూ, వెంటనే లాక్డౌన్ వచ్చేసాయి. అదృష్టమో, దురదృష్టమో భార్యా పిల్లలు హైదరాబాదులో నేను అక్కడ గుంటూరులో రెండు రాష్ట్రాలలో ఇరుక్కునే ఇబ్బంది తప్పింది. మా బాబాయిలు ముగ్గురు మటుకు అక్కడ మూడు నెలలు ఇరుక్కుపోయారు.

😀 జూన్-జులై నెలల్లో ఈ కరోనా గందరగోళంలోనే, అనుకోకుండా దొరికిన విశ్రాంతి, సమయంతో కెరీర్లో 16 ఏళ్ల తర్వాత మొదటిసారి ఉద్యోగం మారుదాం అనుకున్నాను. ఒక్కటే కంపెనీకి అప్లై చేశాను, ఆరు రౌండ్ల ఇంటర్వ్యూలు పూర్తిచేసి ఇ ఆ కంపెనీ ఆఫర్ తీసుకున్నా.

😐ఈ కరోనా పరిస్థితులలో 250000 టైటానిక్ నుండి 700 బుల్లి పడవకు దూకే తెగువ, దురద బహుశా కొద్దిమందికే ఉంటుందేమో.

 😀 ఈ కొత్త కంపెనీకి మారటం అనేది ఇది సరైన నిర్ణయమా కాదా సమయమే చెబుతుందిగానీ, పాత కంపెనీకి రాజీనామా చేయటం చెత్త నిర్ణయమైతే కాదని ఇవాళ 31 వ తారీకు నా బ్యాంక్ అకౌంట్ కి వచ్చిన మొదటి పూర్తి నెల జీతం రుజువు చేసింది.

😔ఈ డిసెంబర్లో నా పుట్టినరోజునాడు పొద్దున్నే మా ఆవిడ తన పుట్టింటి నుంచి ఫోన్ చేసింది, విషెస్ చెప్పడానికి కాదు మా అత్తగారు ఇక లేరు అని చెప్పడానికి. సరేనని వెంటనే కారు తీసుకుని బయలుదేరాను ఆరోజు రైతుల సమ్మెలో భాగంగా దేశ వ్యాప్త బంద్ అని తెలియక. మూడు ఊళ్ళ దగ్గర బ్రతిమిలాడుకొని తప్పించుకున్నా, సూర్యాపేట దాటాక నాలుగో చోట ఒక బ్రిడ్జి పై ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయా. పొద్దటి నుంచి బ్రేక్ ఫాస్ట్ లంచ్ లేకుండా మధ్యాహ్నం 1:30 కి గంటన్నరపాటు ఒక్కడినే అలా కార్ లో కూర్చున్నా. నా పరిస్థితి తెలియక చుట్టాలూ మిత్రులేమో పుట్టినరోజు విషెస్ కాల్స్ మెసేజెస్ పంపిస్తున్నారు. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు ఇదే. అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే అంత్యక్రియలకు సమయానికి అందుకోలేకపోయాను


😔సెప్టెంబర్ లో పిల్లలు ఇంట్లో ఉండి ఉండీ విసిగిపోయారని మొదటిసారి ధైర్యం చేసి బాగా దగ్గర ఉన్న వాళ్ళ ఇంటికి వేరే ఊరు వెళ్ళాం. అక్కడ ఒక నాలుగు రోజులు ఉండి తిరిగి వచ్చాము నేను తిరిగి వచ్చిన రెండు రోజులకి ఆ వ్యక్తికి కరోనా వచ్చింది. మాకు వస్తుందేమో అని భయం కన్నా అతనికి తగ్గాలి అని టెన్షన్ మాకు ఎక్కువ ఉండింది. అదృష్టవశాత్తు కోలుకున్నాడు.

😐కరోనా సమయంలో ఇద్దరు పిల్లలు (7,3 ఏళ్ళు) తీసుకొని మూడు పెళ్లిళ్లు, ఒక చావు, ఒక బీచ్, ఒక పుణ్యక్షేత్రం తిరిగాను. బాగా ఎక్కువ ఉన్న రోజుల్లో ఒక పెళ్లి, ఒక చావు వెళ్ళటానికి కుదరక ఆగిపోయాను.

😐ఈ డిసెంబర్ లో 40వ వడిలో పడతానని ఈ సంవత్సరం మొదట్లో 6 కిలోలు బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. అనుకోకుండా దొరికిన సమయంతో ఆ మేరకు కృషి చేశాను - యోగా, సూర్యనమస్కారాలు, అన్నిరకాల డైట్లు - జీఎం డైట్, ఇంటర్మిటంట్ ఫాస్టింగ్, మంతెన గారి పచ్చి కూరగాయలు డైటు కూడా చేశాను. మధ్యలో ఒకట్రెండు సార్లు నా -6 కిలోల టార్గెట్ రీచ్ అయినాగానీ ఇవాళ్టికి చూసుకుంటే కేవలం 1.5 కిలోలు మాత్రమే తగ్గాను. సర్లే 9 నెలలపాటు ఇంట్లోనే ఉన్నప్పుడు పెరగకుండా కిలోన్నర తగ్గాను కాబట్టి విజయం కిందే లెక్క.



😀 9 నెలలు అనుకోకుండా వర్క్ ఫ్రొం హోమ్ అవకాశం దొరకడం వలన, అంటే 180 పనిదినాలు ఆఫీస్ కి రాను పోను 140 కిలోమీటర్లు రోజూ డ్రైవింగ్ చేసే పని తప్పింది. 1,600 లీటర్ల డీజిల్ ఆమేర భూమి పైకి ఉద్గారాలు వదలకుండా, అలాగే 27 వేల కిలోమీటర్లు మైలేజీ, కారు అరుగుదల పొదుపు చేశా. పనిలో పని నా శరీరాన్ని నా సమయాన్ని కూడా కాపాడుకున్నా.

😀 ఇక చివరగా కోరా తెలుగులో 100+ సమాధానాలు 100+ వీక్షణలు లు సంపాదించుకున్నా.

పోస్టు మొత్తం చదివినందుకు నెనర్లు. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

14, జూన్ 2020, ఆదివారం

నేను వాడిన వాహనాలు - - కారు కొనాలనుకుంటున్నారా?

నాకు ఊహ తెలిసాక, నేను వాడిన , నాకు కొనబడిన కొత్త వాహనం పెక్కుమందికి లాగా ఒక సైకిల్. 1994లో నా 8వ తరగతిలో నాన్న నాకు కొనిపెట్టారు. అది అప్పటికి అందరికి అందరు వాడే బీఎస్ఏ ఎస్.ఎల్.ఆర్ కాదు, బండ టైర్ల హెర్కులెస్ ఎంటీబీ కాదు - హీరో ఇంపాక్ట్ - స్ట్రయిట్ హ్యాండిల్ బార్, సన్న టైర్లతో భిన్నంగా ఉండేది.

అది 36 ఏళ్ల తరువాత ఇప్పటికీ రన్నింగులో ఉంది. వెళ్లిన్నప్పుడల్లా గాలి కొట్టి, ఆయిల్ వేస్తా. క్రిందిది నేను మొన్న సంక్రాంతికి దిగిన చిత్రం.

నేను కాలేజీలో ఉన్నపుడు, ఉద్యోగంలో చేరినపుడు నాన్న బండి కొనిపెడతన్నారుగాని నేను తిరస్కరించాను. నాకు అప్పుడు గేర్ లెస్ బండ్లు (నాన్న లూనా, స్కూటీలు) నడపడం వచ్చుగాని నా సొంత బండి లోను లేకుండా, పూర్తి వెల డౌన్ పేమెంట్ చేసి కొనుక్కోవాలని కోరిక. ఉద్యోగం వచ్చిన ఏడాదికి 2006లో 46000 పూర్తి డబ్బులు చెల్లించి నడపడం వచ్చిన మిత్రుడిని షోరూమ్ తీసుకు వెళ్లి ఇంటికి తెచ్చుకున్నాను. ఒక వారంపాటు పొద్దున్నే లేచి నడిపి నేర్చుకున్నాను. పనిలో పని కారు డ్రైవింగ్ నేర్చుకొని రెండూ చక్కగా డ్రైవ్ - టెస్ట్ ఆర్టీఓ కార్యాలయంలో చేసి లైసెన్స్ తెచ్చుకున్నా. బండి పేరు 'హీరో హోండా ప్యాషన్ ప్లస్' - బ్లూ/బ్లాక్ (నీలం-నలుపు). ఎందుకంటే నాకు నీలం రంగు ఇష్టం. అప్పటికి హీరో-బజాజ్లో మొదటిదే మన్నికయినది. నాకు స్ప్లేన్డర్ పొట్టి అనిపించింది . ఈ బండి నేను ఇప్పటికి దాని 15వ సంవత్సరంలో వాడుతున్నా.

2011లో రెండుసార్లు అమెరికా వెళ్లివచ్చాక, అక్కడ కూడా కారు నేర్చుకుని తిరిగాక (అక్కడ కారు కొనలేదు), ఇక్కడ కూడా కారు ఉంటే బాగుంటుంది, ఆ ఊరు-ఈ ఊరు తిరగచ్చు అనిపించింది. నాకు వ్యాగన్-ఆర్ కారు కొనుక్కోవాలని కోరిక. ఒక రెండు వారలు హైదరాబాదులోని సెకండ్ హ్యాండ్ షోరూములన్ని తిరిగాను. వాడినది ఎందుకంటే ఒకటి ఇండియాలో డ్రైవింగ్ అలవాటు అవ్వడానికి, రెండు నేను లోనికి వ్యతిరేకం, మొత్తం డబ్బులు ఇచ్చి కొనాలని, మూడు - నేను ఇంకా అద్దె ఇళ్లల్లో తిరుగుతున్నా - రోడ్డుపై పార్కింగ్ చేస్కోవాలి కావున, నాలుగు - మళ్ళీ అమెరికా పంపించచ్చు .

మూడో వారం మా మామయ్యని హైదరాబాద్ రమ్మని కోరాను. ఇద్దరం బీహెచ్ ఈ యల్ నుండి ఎల్బీనగర్ దాక అన్ని షాపులు తిరిగాం. ఏ కారు నచ్చలేదు. ఇంక నన్ను ఎల్బీనగర్ క్రాస్రోడ్డులో దింపి మామయ్య ఊరు వెళతాను అన్నాడు. అక్కడ సిగ్నల్ దగ్గర ఆగినపుడు హ్యుందాయ్ షోరూములో డిస్ప్లేగా ఉంచిన శాంత్రో మామకు నచ్చింది. నాకు వ్యాగన్-ఆర్ఏ కావాలి, శాంత్రో వద్దు అన్న, ముందు చూద్దాం పద అని తీసుకు వెళ్ళాడు. ఆ కారు కండిషన్ చాలా బాగుంది, వేళా సబబుగా ఉంది. అప్పటికి అప్పుడు కొనేశాము. వాడిని సర్వీసింగ్ చేసి తరువాతి రోజు డెలివరీ చేయమన్నాం. ఆలా వ్యాగన్ ఆర్ అని మూడు వారలు తిరిగి ఒక శాంత్రో కొన్నాను.

ఏ మాటకామాట ఆ కారుని నేను పిచ్చి తిప్పుళ్ళు తిప్పాను. లింగంపల్లి నుండి ఘట్కేసర్ సిటీలో నుండి అంటే ఒకవైపు 45+, రెండు వైపులా 100 కిమీ రోజుకి, నెలకి 3000 వేలు తిప్పాను 4 ఏళ్ళపాటు - చక్కగా తిరిగింది ఏ పేచీ పెట్టకుండా . సిటీలో లీటరుకు 15 కిమీ, హైవేపై 20 కిమీ మైలేజ్ ఇచ్చేది. మిత్రులకి, చుట్టాలకి నా కారు బాగా నచ్చింది. ఒకవేళ అమ్మితే వాళ్ళకే ఇమ్మని చాలా మంది అడిగారు.

ఇలా రోజుకి 100 తిరుగుతున్నాను. పైగా ఇక ఆఫీసుకి ఓఆర్ఆర్ పై వెళదాము అనుకున్న - అప్పుడు 140 కిమీ అవుతుంది. ఇందులో ఎయిర్ బ్యాగులు లేవు, ఏబీఎస్ లేదు - అందుకని కొత్త కారు కొందాము అని నిర్ణయించుకున్నా.

నేను కచ్చితంగా 7-సీటర్ కొనాలని నిర్ణయించుకున్నా - ఎందుకంటే మా అన్న కుటుంబం హైదరాబాదు వచ్చినపుడు రెండు కుటుంబాలు + అమ్మ (నలుగురు పిల్లలతో) తిరగడానికి ఇరుకు అనిపించింది. అప్పుడు నాకు ఉన్నవి - ఎర్టిగా, హోండా బీఆర్-వి, మహీంద్రా ఎక్స్యూవీ 500 - అందులో చివరిది మరీ గభేళా అనిపించింది - నా పార్కింగులో పట్టదు. బీఆర్-వి 3 లక్షలు ఎక్కువుండటంతో, దానితో డీసెల్ నా బడ్జెట్ దాటటంతో, అంత సక్సెఫుల్ మోడల్ కాకపోవడం, ఎర్టిగా మైలేజ్ ఎక్కువుండడం, మారుతికి ఉన్న సర్వీస్ నెట్వర్క్ వలన, నాకు నచ్చిన ఎర్టిగావైపు మొగ్గాను. దాంతోపాటు నాకు నచ్చిన నీలం (బ్లూ) రంగు కూడా దొరికింది. 2 ఏండ్లలో దాదాపు 40వేలు తిరిగాను.

ఇక కారు కొనాలనుకునేవారికి నా అభిప్రాయాలు (జీవితంలో ఒక్కసారి కొనాలనుకునే మధ్యతరగతివారికి, 2-3 ఏళ్ళకి కార్లు-బైకులు మార్చేవారికి కాదు) -

  • కొత్త కారు లేదా వాడిన కారు కొనడానికి కార్వేల్, కార్డేఖో లాంటి వెబ్సైట్లు, టీం బిహెచ్పీ లాంటి సైట్లలో మంచి సమీక్షలు, సలహాలు ఉంటాయి. నేను అంతకన్నా చక్కగా వివరించలేను.
  • కారు ఒక డిప్రిషియేటింగ్ వస్తువు - షోరూమ్ గేటు దాటింది అంటే ఒక ఏభైవేల నుండి లక్షన్నర విలువ తగ్గుతుంది. ప్రతి ఏడాది తగ్గుతూనే ఉంటుంది. దానికి తోడు, ప్రతి సంవత్సరం బీమా, సర్వీసింగ్ ఖర్చులు అదనం. అందుకని, మీ నెలవారీ ఉపయోగం అందుకు తగ్గట్టు ఉంటేనే కొనండి. ఊరికే డాబుకి , ప్రదర్శనకు అలంకారప్రాయంగా మాత్రం వద్దు.
  • ఓలా లాంటి క్యాబ్ సౌకర్యాలు వచ్చాక కేవలం సిటీలో తిరగడానికి అయితే కారు అనవసరం.
  • బైకు నడపడానికి, కారు నడపడానికి చాలా తేడా ఉంది. మనము స్టీరింగ్ పట్టుకున్న ప్రతిసారి రోడ్ పై ప్రతి ప్రాణం గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ నడపాలి. అలా నడపగలము అనుకుంటేనే కారుని కొని రోడ్డుపైకి తేవాలి.
  • ఇక పార్కింగ్ సౌకర్యం ఉంటేనే కారు కొనుక్కోండి. నేను అద్దె ఇళ్లలో ఉన్నపుడు చాల ఇబ్బంది పడ్డాను. ఒక గ్రూప్ హౌసులో కింద పార్కింగ్ చూసుకొని, అడ్వాన్స్ ఇచ్చాక - తీరా ఇల్లు మారి కారు తీసుకువెళితే అక్కడ వేరే కారు ఉంది. ఓనరు, "అనుకోకుండా వేరే పోర్షనులోని మా చుట్టాల అబ్బాయి కారు కొన్నాడు, మీది బయట పెట్టుకోండి అన్నాడు ", అలా నా కారుని రోడ్డుపై ఎండావానలకి ఏడాదిపాటు నిలపాల్సి వచ్చింది.

కానీ ఒక్కొక్కసారి కారు ఉంటే ఉపయోగాలు కూడా ఉన్నాయి

  • ఏదన్న అత్యవసరంగ వెళ్లాల్సి ఉంటే కారు ఉపయోగిస్తుంది.
  • మా బామ్మ పోయారని తెల్లవారుజామున 4 గంటలకి ఫోను వస్తే 11 గంటలకల్లా గుంటూరులో అందుకున్నాము.
  • మా పాపకి అర్థరాత్రి 3 గంటలకి ఒక ఆరోగ్య సమస్య వస్తే వెంటనే కారులో హాస్పిటల్కి తీసుకువెళ్లి, వారు రాసిన మందులు వారి ఫార్మసీలో దొరక్కపోతే ఒక గంటపాటు ఒక 10 షాపులు తిరిగి దొరకపుచ్చుకొని 5 గంటలకి ఇంటికి వచ్చాము. అది బండి మీద చేయగలిగే పని కాదు, ఓలా-ఉబర్ ఇప్పటిలా ఉన్న కాలం కాదు. ఇప్పుడైనా ఆ ఆడ్ సమయంలో దొరికేవి కాదేమో.
  • పిల్లలు-పెద్దవారు ఉన్నపుడు దూర ప్రయాణాలు సౌకర్యంగా ఉంటాయి, ఒక్కొక్కసారి రైలు-బస్ కన్నా తక్కువ ఖర్చులో అవుతుంది కూడా.

6, నవంబర్ 2011, ఆదివారం

మొగుడు - నా పాలిటి యముడు


నేను థియేటర్లో సినిమాలు తక్కువగా చూస్తాను. వెళ్ళినా, మిత్రుల-చుట్టాల బలవంతం తప్పితే నా అంతట నేను పనిగట్టుకొని  వెళ్ళేవి చాలా తక్కువ (ఇంతవరకు దూకుడు చూడలేదు). వెళ్ళినా ఒక్కడినీ‌వెళ్ళను. బాగోపోతే సెటైర్లు వేసుకోడానికి ఒక్కరన్నా ఉండాలని. వెళ్ళాను గాబట్టి, అపుడు నోటిదాక వచ్చినవి ఇపుడు వెళ్ళగక్కుతా. మామూలుగా సమీక్షలు రాయనివాడిని(ఎపుడన్నా ఒక లైను  ఫేస్బుక్ అభిప్రాయం తప్పితే), తప్పట్లేదు.

బండి సర్వీసింగుకిచ్చి ఎలా కాలక్షేపం చేద్దామా అని ఆలోచిస్తుంటే పక్కనే 'మొగుడు ' పోస్టర్ కనిపించింది. కృష్ణవంశీది గదాని హాల్లోకెళ్ళి  కూర్చున్నా. అతనికి అభిమానినికాకున్న అతని 'క్రియేటివిటీ' నచ్చుతుంది, ఇప్పటి దర్శకుల్లో అతను చాలా నయమని నా‌అభిప్రాయం. అయినా మధ్యమధ్యన అరుపులు, అనవసరపు లాగుడు ఉంటాయని అంత:పురం తర్వాత అతని సినిమా ఏదీ హాలుకెళ్ళి చూడలేదు. కానీ ఈసారి తప్పలేదు.

సినిమా కథగురించి రాయనుగానీ కొన్ని అంశాలు చాలా నిరాశపరిచాయి -

- సమాధుల దగ్గర శాస్రీయ కూచిపూడి నృత్య ప్రదర్శన ఏంటో?
- టీనేజి అమ్మాయిలమీద చక్కగా తీసిన డయిరీమిల్క్ ప్రకటన విషయాన్ని ఏమాత్రం నప్పని కూచిపూడి అలంకరణలో ఉన్న తాప్సీతో కాపీకొట్టడం ఏంటో?
- కుటుంబ కథాచిత్రమని ప్రచారం చేసుకుంటూ, యూ సర్టిఫికేటిచ్చిన చిత్రంలో ప్రతి పదినిమిషాలకి సెన్సార్ కత్తెరకి సంభాషణలు మూగబోవడం ఏంటో? ఆ మూకీ సంభాషణలకి తెరపైన అందరూ నవ్వుకుంటుంటే మేము (పక్కన కూర్చున్న దూకుడు దొరకని ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు) విరక్తిగా నవ్వుకోవడం ఏంటో?
- తాప్సీ పాత్రని  చూస్తే  కృష్ణవంశీ శశిరేఖ పరిణయం సీక్వెల్ తీశాడా అనిపించింది -అదే మూర్ఖత్వం, అదే మొండితనం, అవే ఏడుపులు, అవే అరుపులు, వగైరా, వగైరా.
- తాప్సీ నటన కూడ జెనీలియాని పదేపదే గుర్తుకు తెచ్చింది.
- డబ్బులన్నీ రాజేంద్రప్రసాదువిగ్గుకి అయిపోవడంతో రోజా మొహానికి రంగులేసినట్లు లేరు, నల్లగా నిగనిగలాడింది. కానీ సహజంగా లేదు.

సరే నచ్చిన విషయాలకొస్తే
- సొంతంగా డబ్బింగు చెప్పుకొనడం అభినందనీయం, సరిత-సవిత-సునీత-చిన్మయి వంటి నస గొంతులనుండి విముక్తి. కానీ కొంచెం దగ్గరుండి డబ్బింగు చెప్పించుకోవాల్సింది.
- నేపథ్య సంగీతం (రీరికార్డింగు) అధ్బుతం - చాలా కాలంతర్వాత ఇందులో‌ఆస్వాదించాను.

శశిరేఖా పరిణయం నిరాశ పరిచినా కృష్ణవంశీ కి ఇంకో అవకాశమిద్దామనుకున్నా. ఈ చిత్రంతో అతనిని ఈ క్రింది దర్శకుల చిట్టాలో చేరుస్తున్నా -

బాలచందర్  - పరవశం, అబధ్దం
 వంశీ - దొంగరాముడు & పార్టీ, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాను
 విశ్వనాథ్ - ఆపద్బాంధవుడు, శుభసంకల్పం
రామ్‌గోపాల్‌వర్మ - రామ్‌గోపాల్‌వర్మకీ ఆగ్, రక్తచరిత్ర
బాపు - రాధాగోపాళం
కృష్ణవంశీ - శశిరేఖా పరిణయం, మొగుడు.

ఈ చిట్టా ఏంటని ఇంకా ఆలోచిస్తున్నారా - ఎన్నో‌ గొప్ప చిత్రాలు తీసినవారి తిరోగమనం ఇలాగే మొదలైంది.ఇపుడు వారి కొత్త సినిమాలు చూడాలంటే కొంచెం, కాదు చాలా‌భయంవేస్తుంది. మధ్యమధ్యన వారి చమక్కులున్నా, మొత్తం మూడు గంటలు వారి కళాఖండాలని హాల్లో చూసే ఓపిక ఇంక నాకులేదు.

**** ౬-౧౧ నాడు‌ కలిపిన ది****




ఇవాళ‌ వాచ్‌మన్‌ మేనల్లుడు‌ లిఫ్ట్‌ అడిగితే బండెక్కించుకున్నా. 'మొగుడు‌' హాలుముందునుండీ‌ వెళ్ళుతుంటే మీరు‌ సినిమాలు‌ చూడరా అన్నా? అని‌ అడిగాడు‌.

ఎందుకు‌ చూడం నాయనా, ఈ 'మొగుడు‌' మొన్ననే బాదించుకున్నాగా అన్నా.

'నేనూ చూశానన్నా, మూడు‌ సార్లు‌'
'అవునా!!!!'
'అవునన్నా! గోపీచంద్‌ ఫ్యానుని‌'
నడుపుతున్న‌ బండీ అప్పటికే‌ అటూఇటూ ఊగుతుంది‌.
'నేను‌ కృష్ణవంశీ అభిమానినిలే'
'హిహ్హీహీ! మొన్న‌ హాల్లో ముందు‌ సీటోడు‌ కృష్ణవంశీ ఫ్యానంటే‌ నవ్వొచ్చింది‌, వాడికీ ఫ్యానులుంటారా' అ.ని

వెంటనే బండి‌ ఆపి‌ వాడిని‌ దిగమన్నా.




*వంశీకి కొంచెం మినహాయింపు. అతని సినిమాలు టీవీలో వచ్చేదాక ఆగలేను.*





16, డిసెంబర్ 2010, గురువారం

అట్లాంటిక్ సూర్యోదయం

బోస్టనులో ఎప్పుడన్నా ఒడ్దు(బీచ్)కి పొద్దున్నే ౬కి వెళ్ళి అట్లాంటిక్ మహాసముద్రంపై సూర్యోదయం చూడాలని కోరిక.
మూడేళ్ళున్నా కుదరలేదు. మొదటి కారణం శనివారం పొద్దున్నే లేవడానికి బద్దకం. రెండవది నాకు కారులేదు. మొదటి ట్రైను ఐదింటికి. వెళ్ళేసరికి ఆరవుతుంది. మనం చలికాలం వెళ్ళలేం, ఎండాకాలంలోనేమో ఐదింటికే తెల్లారుతుంది.

ఇలా కాదని మొన్న అక్టోబరులో ముగ్గురం స్నేహితులం వెళ్ళాం. ఆహా ఏం రోజండి - మబ్బుమబ్బు, మైనస్ డిగ్రీల చలి. క్లికు కొట్టాలంటే, గ్లవ్స్ ఇప్పాలిగా. మొత్తం గంట అయ్యేసరికి వేళ్ళు కొంకురుపోయాయి. కానీ తీసిన ఫోటోలు తర్వాత చూస్కొంటే అన్ని మర్చిపోయా.

అసలు ఆ మహాసముద్రం ముందు నించోని - ఆ చలిలో వణుకుతూ - చెవుల్లో ఇళయరాజా-రహమాన్ స్వరనాట్యం చేస్తుంటే, నింగి-సముద్రం నీలమై, ఇసుకలో ప్రతిబింబిస్తుంటే - కొంగలు, ఫ్లేమింగోలు, విమానాలు - ఆ చలిలో కుక్కలతో చెడ్డీలేసుకొని జాగింగ్ చేస్తున్న అమ్మాయిలు - ఒక అరగంట ఎక్కడికో వెళ్ళోచ్చా.

ఆ తర్వత స్టార్‌‌బక్స్కి వెళ్ళి ఒక లార్జ్ కాఫీ తీస్కుంటే రెట్టింపయ్యింది మా మజా. నా బోస్టన్ జీవితంలో మరచిపోలేని రోజు.

ఫోటోలు నా ఫొటోబ్లాగులో.

29, సెప్టెంబర్ 2010, బుధవారం

నేనూ, నా కజిన్స్ - తరం తరం అంతరం

నిన్న ఊరికినే కబుర్లాడుకుంటుంటే, రూమ్మేట్ భారతీయుడు పాట హమ్ చేస్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో, బళ్ళో ఉండగ చూశా! పది పన్నెండేళ్ళు అయిపోయింది, అప్పుడే అంకులయిపోయానన్నాడా ఇరవయ్యారేళ్ళ కుర్రాడు.

అది వినగానే నా కన్న 7-8 ఏళ్ళూ వయసులో చిన్నైన కజిన్స్ గుర్తొచ్చారు. నేనిలా అన్నా (అప్పుడు క్లుప్తంగా, ఇప్పుడు విపులంగా).

- నాకు ఏడెనిమిదేళ్ళప్పుడు (2-3 తరగతి) వాళ్ళని ఉయ్యాల్లూపేవాళ్ళం (నేనూ, అన్నయ్య).
- నాకు 12 ఏళ్ళప్పుడు (6-7 తరగతి) వాళ్ళు నాలుగైదేళ్ళ బుడంకాయలు - ఆడించేవాణ్ణి. కాగితంతో పడవలు, రాకెట్లు, ఫాన్లు, ఇంకా చాలా చేసిచ్చేవాళ్ళం.
- నాకు 15 వచ్చేసరికి (ఇంటర్ అంటే పెద్దయినట్లే కద), ఏడెనిమెదేళ్ళ పిల్లకాయలమీద కొంచెం దందా చేసేవాడిని. "ఒరేయ్ మంచినీళ్ళు తీసుకురా!" లాంటివి.
- ఇంజినీరింగ్ (21-22) అయిపోయి మనం ఉద్యోగంలో చేరేసరికి వాళ్ళు పది-ఇంటర్. ఇక మనం ఎప్పుడు ఊరెళ్ళినా, మనల్నేమో "వాడిని/దానిని ఏ కాలేజిలో చేర్చను? ఏ కోర్సు మంచిది"లాంటి డౌట్లు, వాళ్లనేమో "చిన్నా/బుజ్జీ! అన్నాయ్ని/బావని అడిగి అదేదొ తెలుసుకోవచ్చుగా" వంటి సతాయింపులు - ఆహా! మనం రాజులం ఎవరింటికెళ్ళినా.

ఇంతవరకు అందరికీ మాములేలేండి. అసలుది ఇప్పుడు.
- వాళ్ళేమో ఇంజినీరింగ్ అయిపోయి సాఫ్ట్‌‌వేర్ కొలువులకొచ్చేశారు. మనమేమో ఇంకా టీమ్‌‌లీడ్ అయ్యి మూడేళ్ళయిపోయినా, ప్రాజెక్ట్ మేనేజర్ కాలేదు. ఇంకా దగ్గర్లో ఊరిస్తుంది. వాళ్ళకీ మనకీ ఒక్క లెవెలే తేడా. వాళ్ళూ నేనూ ఇంక ఒకటే, మనమింకా యూతే అనిపిస్తుందీ. ఇంకేముందీ, మనమింకా 28 ఏళ్ళ బ్రహ్మచారేగా! ఇంకో పక్కేమో అప్పుడే ఏడేళ్ళ యవ్వనం ఈ ఉద్యోగంలో బూడిదయిపోయిందా అనిపిస్తుంది.

ఏమో! ఇంకా యువకుడినే అనుకుంటున్నా! వాళ్ళని (అదే కళ్ళముందు పెద్దయిన కజిన్స్) చూస్తే మటుకు నేనూ అంకుల్ అయిపోయానిపిస్తుంది. 23 ఏళ్ళకే పెళ్ళిళ్ళయిపోయి ఇప్పుడు మూణ్ణాలుగేళ్ళ పిల్లలున్న మా కాలేజి ఆంటీలు మటుకు అంకులే కరెక్టంటారులేండి.

ఏమో! ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళా!

నా కజిన్స్ ఇప్పటికే తెలుగు-ఇంగ్లీషు బ్లాగులు, ఫేస్‌‌బుక్ మొ॥లలో అన్నిచోట్లా వున్నారు. ఇప్పుడు ఎంతో ధైర్యంతో ఈ వ్యాసం ప్రచురిస్తున్నా. కజిన్స్, మీరెవ్వరైనా ఇది చదివి నన్నేమైనా అనాలనుకుంటే ఇక్కడమాత్రం చేయకండి. నాకు మెయిల్/ఫోన్ చేయండి :)