11, జనవరి 2023, బుధవారం

తాతయ్య - ఒక ఏడాది జ్ఞాపకము

 సంక్రాంతికి ఊరికి ఇంటికి వెళ్ళి అమ్మ ఇచ్చిన మంచినీళ్ళు తాగేటప్పటికి ముందు వసారా నుండి టక్ టక్ శబ్దము వచ్చేది. పక్క పోర్షను గదిలో (మావి రెండు వాటాల అగ్గిపెట్టె గదులు ఇల్లు) పడుకునో, పేపరు చదువుతూనో ఉండేవాడు ఎలా తెలిసేదో వచ్చేవాడు. పిల్లలను కూడా తీసుకువస్తే కళ్ళు వెలిగిపోయేవి. లేదా ఎపుడు వస్తారు అని అడిగేవాడు. ఆ టక్ టక్ ఆయన చేతి కర్ర నుండి.

పోద్దున్నే ఆరున్నరకు అటుపక్కనుండి ఈటీవి అన్నదాత మోగేది. ఆ టీవీ సౌండుకు ఎవరి నిద్రన్నా ఎగిరిపోవాల్సిందే. దొర్లుకుంటూ వినేవారము. ఆ తరువాత ఏడున్నర దాకా వార్తలు చూసేవాడు.

ఆయనే మా తాతయ్య, 97 ఏళ్లు. మా ఇంటికి మారాక నాన్న చూసుకోవడం మొదలుపెట్టాక గత ఎనిమిదేళ్ళుగా దాదాపు ఇదే రొటీను.


తాతయ్యతో నా మొదటి జ్ఞాపకము ఆరు ఏడేళ్ళ వయసులో విజయవాడ నుండి గుంటూరులో బామ్మ వాళ్లింటికి సెలవులకు రావడము. తాతయ్య, బాబాయిలు ఒక షాపు నడిపేవారు. అప్పటికే పెద్దవారైనా (యాభై పైనే), ఎపుడన్నా బాబాయికి కుదరనపుడు సైకిలు క్యారేజిపై కూర్చోపెట్టుకుని షాపుకు తీసుకుపోయేవాడు.

1990 తుఫాను అనుభవము బాగా గుర్తు - అది రేకుల ఇల్లు. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉండేవి. రాత్రంతా భయముగా గడిపాము.

అదే ఏడాది మేము గుంటూరుకు మారాక కొంత దగ్గర్లోనే ఉండేవారము. నేను కొంత పెద్దయ్యాక, 1995 (తొమ్మిదవ తరగతి)లో సైకిలు కొనుక్కున్నాక దాదాపు ప్రతి వారము వెళ్లి పలకరించేవాడిని. ఉద్యోగము వచ్చి హైదరాబాదుకు మారినా నెలకోసారన్నా గుంటూరు ఇంటికి వెళ్ళేవాడిని. తాతయ్య వాళ్లింటికి కూడా పోయి పలకరించేవాడిని.

నేను వెళ్ళగానే ముందు వంటగది రేకుల పైకెక్కి దొడ్డోని జామ చెట్టు కొమ్మలను వంచి కాయలు కోసేవాడు. ఆ వీధి అంతా ఆ జామకాయలు ఫేమస్. నా స్నేహితులలోనూ దీనికి ఫాన్సున్నారు. ఎంత రుచిగా ఉంటాయంటే నేను చాలా అరుదుగా బయట బజార్లో జామకాయలు కొంటాను, మా తాత పెరటి జామలు తిన్నాక బజారువి సహించవు.

2011 లో నేను అమెరికా నుండి తిరిగి వచ్చి వెళ్లితే అప్పటికే 80 పైబడిన ఆయన టపా టపా రేకులెక్కి జామకాయలు కోసిచ్చాడు, మా బామ్మ తిడుతున్నా.

నేను వెళ్లినపుడల్లా నాకోసం కొంత పని అట్టి పెట్టేవాడు - ఫలానా షాపు నుండి మందులు తేవడము, ఊళ్లో ఎక్కడో దూరంగా ఉన్న ఒక కొట్టు నుండి నెయ్యి తేవడము. ఫలానా బండి వాడి దగ్గరే గారెలు, ఇంకో బండివాడి దగ్గరే చపాతీ - ఇలా ఆయన కొంచెం పర్టికులరుగా ఉండేవాడు. ఇంకో చోటనుండి తీసకువెళితే తేడా కనిపెట్టేసేవాడు.

ఎపుడూ ఏదో ఒకటి రిపేరు చేయడము, పని కల్పించుకుని కెలకడము ఆయనకు అలవాటు (తోచుబడి) అనవచ్చు. ఈ అలవాటు నాకూ ఉంది. ఒక సూటుకేసు,ఒక ట్రంకు పెట్టె నిండా పాత బోల్టులు, నట్లు, పనిముట్లు, గొట్టాలు ఇలా చాలా సరంజామా ఉండేది. ఏ ఫ్యానునో, కూలరునో ఊడబీకేవాడు. అయితే వయసు మీదపడి బలంలేక కొంత, కళ్లు అగుపించక కొంత మధ్యలో ఆగిపోయేది. నేను వెళ్ళాక బయటకు తీసేవాడు. ఇద్దరమూ కలిసి కుస్తీ పడేవాళ్ళము. మా బామ్మ తిట్టేది - మనవడు ఏదో చూద్దామని వస్తే చెమటలు కార్పిస్తావు - వాడు ఇపుడు పెద్దోడు అయ్యాడు, హైదరాబాదులో లక్షలు ఉద్యోగము చేస్తున్నాడు, నీ పాత కూలరు అమ్మితే రెండొందలు కూడా రావు. ఇలా…2019 లోకూడా పడక్కుర్చీ రిపేరు చేసి పెట్టాను.

70 ఏళ్లదాకా తాంబూలం అలవాటుండేది. దానికి సినిమాల్లో చూపించినట్టు ఓ సత్తు పెట్టె ఉండేది. అందులో ఒక మినీ కిళ్ళీకొట్టుండేది - ఆకు, వక్క, జాజికాయలు, యాలకులు, ఇంకేవో నాకు తెలీనివి. ఇంకా పొగాకు ఉండేది. చుట్టలు తాగేవాడు. చుట్టలు చుట్టుకోవడానికి బద్దకించినపుడు బీడీలు తాగేవాడు. అవి లేకపోతే నాచేతే తెప్పించేవాడు. ఇంక సిగరెట్లు నాకు ఊహ తెల్సినపుడు నుండీ ఉండేది. ఈయన బ్రాండు చార్మినారు.

సిగరెట్టు విషయం వచ్చింది కాబట్టి నా ఇంకో తాతయ్యతో (మాతామహులు ) ఈయన అనుబంధం, మా అనుభవాలు చెప్పుకోవాలి. మా అమ్మమ్మ మా తాతయ్యకు అక్క – అంటే ఇద్దరూ బావ బావమరుదులు - బావా బావా అని పిలుచుకునేవారు. ఇద్దరూ సిగరెట్లు కాల్చేవారు (ఈయన చార్మినారు అయితే ఆయన సిజర్స్), ఇద్దరికీ పేకాట బాగా అలవాటు, క్రికెట్ వీరాభిమానులు.

మా పాత పోర్టబుల్ బ్లాక్ అండ్ వైటు టీవీలో అందులోనూ దూరదర్శను ప్రసారములో అసలే బొమ్మ కనిపించదంటే, ఇద్దరూ నోట్లో సిగరెట్టు వెలిగించుకుని, టీవీ ముందు చెరో పడక్కుర్చీ వేసుకుని అందులో మొహము పెట్టేవారు. ఏరా స్కోరెంతరా అనడిగేవారు, ఏమో మీ తలకాయులు జరిపితే కనిపిస్తుంది తాతయ్యలూ అనేవాళ్లము నేను అన్నయ్యా. మనవాళ్ళు ఎలాగో సరిగా ఆడేవాళ్లు కాదు కాబట్టి మనవాళ్ళని, బాగా ఆడుతున్నందుకు అవతలి జట్టువాళ్లనీ ”అచ్చ” భాషలో తిట్టేవాళ్లు.

అలా 1990 లనుండీ 2011 దాకా ఓ పదిహేనేళ్లు ఎనిమిది మనవళ్లలలో ఆయనతో ఎక్కువ సమయము గడిపినదీ నేనే, ఆయనకు ఇష్టమైన మనవడిని నేను కాకున్నా.

రేపు సంక్రాంతికి ఊరు వెళ్లితే టక్ టక్ శబ్దాలు ఉండవు, అన్నదాత కార్యక్రమాలు ఉండవు. అరేయ్, అరేయ్ అనే పిలుపులూ ఉండవు. గత ఏడాదిగా ఇలా ఊరు వెళ్నినపుడల్లా ఇల్లంతా ఏదో నిశ్సబ్దముగా అనిపించేది.

నేటికి ఏడాది - ఆయన గతించి.

ఆయనకు వివిధ సమయాలలో కిళ్లీ, సిగరెట్, బీడీ, చుట్ట (మందు లేదు) అలవాట్లున్నా 90 దాటాడు. చివరి మూడేళ్లు చిన్న చిన్న సమస్యలున్నా ఆఖరి రోజు దాకా ఆవకాయ తిన్నాడు, గారెలు తిన్నాడు, కారప్పూస నోట్లో నాన్చి అయితేనేమీ తినేవాడు, నడుస్తూనే ఉన్నాడు. ఢిసెంబరు 2021లో కూడా అన్నాడు 100 దాటతాను ఇంకో మూడు నాలుగేళ్లు అని. తెలుగు సంవత్సరాలు లెక్కన అయితే ఆయనకు అప్పటికి 99 అనుకుంటున్నాము. ఆ జీవించాలనే తపన, తనకి కూడా అరవై - డెబ్బై వచ్చినా చివరి దాకా సపర్యలు మా నాన్న ఓపిక అయితేనేమీ ఒక పూర్ణ జీవితము చూశాడనవచ్చు.

ఆయనకు ఎనభై దాటిన తరువాత కూడా ఊళ్లు తిరగాలి అనీ, గుళ్లు చూడాలనీ ఉండేది. తీసుకుపోయేవారం కానీ 2017లో ఒకసారి ఒక ప్రముఖ గుళ్లో ఈయన (తొంభైలకు దగ్గర్లో ఉన్నారు) దగ్గు ఆపుకోలేకపోతే అక్కడి పూజారులు మమ్మలను తిట్టారు - వాళ్ల గుడి మూసేయాల్సి వస్తుందని.

నేను 2018 లో కారు మార్చి పెద్ద కారు కొన్నా - వేసుకుని ఊరు వెళ్లినపుడల్లా కారు తడిమి చూసి అడిగేవాడు గుంటూరుకు దగ్గర్లో విజయవాడ హైవేపై కడుతున్న ఒక ప్రముఖ గుడికి తీసుకువెళ్ళమని. మొదట్లోకుదరలేదు. ఇంతలో కరోనా వచ్చింది. పెద్దవారిని అస్సలు రానీయట్లేదు. అలా ఆ ఆఖరి కోరిక మటుకు నేను తీర్చలేకపోయా.