1, అక్టోబర్ 2020, గురువారం

నా పదవ తరగతి పరీక్షలు - గ్రూపిజం

 పరీక్ష గురించి చెప్పేముందు మా స్కూల్ గురించి కొంచెం చెప్పాలి పదవ తరగతి క్లాస్ లో మేము ఐదుగురు మాత్రమే మా స్కూల్ స్టూడెంట్స్ మొత్తం 100-120 నే. మా అన్నయ్య చదివినప్పుడు అయితే వాళ్లు ఇద్దరు మాత్రమే క్లాసులో.

ఈ ఐదుగురిలో తమిళనాడు నుంచి వచ్చిన కవలలైన ఒక అన్న , చెల్లి. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ అంజి. ఇక ఐదవ మెంబరు మా నాన్నగారి సంగీతం గురువుగారి చెల్లెలు.

తొమ్మిదవ తరగతిలో జరిగిన ఒక సంఘటన వలన ఏడాది చివరి మార్చిలో మా ప్రిన్సిపాల్ని తీసేశారుఒక ఇబ్బందికర జ్ఞాపకం. ఆయన మాకు మ్యాథ్స్, ఫిజిక్స్ చెప్పేవారు. అప్పటికే ఆయనతో గొడవ పడి అన్నాచెల్లెళ్ళు ఒక సారు దగ్గర ట్యూషను చేరారు. అలా ఆయన అర్థాంతరంగా వెళ్ళిపోవడంతో మా పాత మేడమ్ ఒకరు ప్రిన్సిపాలుగా వచ్చారు. నేను, అంజి సొంతంగా చదువుకొని పరీక్షలు వ్రాశాం.

పదవ తరగతికి వచ్చేసరికి వాళ్ళ ట్యూషన్ సారుని మాకు సైన్సు టీచరుగా తెచ్చారు. ఆయన, ఆయన తీసుకొచ్చిన మ్యాథ్సు సారు వారిపై పక్షపాతం చూపించేవారు. ఇంగ్లీషు, సోషల్ చెప్పే ప్రిన్సిపాలు పాత విద్యార్థులమని మాపై పక్షపాతం చూపిస్తుందని ఆ అన్నాచెల్లెళ్ళ ఆరోపణ.

ఉన్న ఐదుగురిలో ఎప్పుడూ నాకే మొదటి ర్యాంకు వచ్చేది. ఆ అన్న, చెల్లి కూడ బాగా చదివేవారు కానీ, వారు మ్యాథ్సులో వీకు. నాకు ఎప్పుడూ నూటికి నూరు వస్తాయి, దానితో కవరు చేసేవాడిని. వారు చాలా కాంపిటీటివ్గా ఉండేవారు. మొదటి ర్యాంకు కొట్టాలని ఎనిమిదవ తరగతి నుంచి తెగ ప్రయత్నించేవారు. వారి సారు వచ్చాక కూడా నేనే నెగ్గుకొస్తుండేసరికి కొంచెం రోషపడుతుండేవారు. టీచరు పేపర్లు దిద్దేటపుడు, మార్కులు ఇచ్చేటపుడు చూడాలి - అడ్డంగా నించునేవారు. అంజినేమో టీచరు చేయి తిప్పేదానిబట్టి గెస్ చేసి చెప్పి వారిని ఉడికించేవాడు.

ఇక ఫిబ్రవరి వచ్చి, సిలబస్ పూర్తి అయ్యేటప్పటికి వాళ్ళు ముగ్గురూ మళ్ళీ గొడవ పెట్టుకొని స్కూలుకి రావడం మానేశారు. నేను, అంజి మటుకు చివరి దాక వెళ్ళి రివిజను చేశాం.


ఇక అసలు పరీక్షలు మొదలయ్యాయి. మేమిద్దరం అర కిలోమీటరు నడిచి వెళ్ళి, సిటీబస్ ఎక్కి పది నిమిషాలు ప్రయాణించి సెంటరుకి వెళ్ళాం. రోజూ అలా సొంతంగానే వెళ్లేవారం. ఈ రోజుల్లో ఇంటరు-ఇంజనీరుంగు పరీక్షలకీ, ఉన్న ఊళ్ళో మొదటి రోజు ఉద్యోగం చేరడానికీ ఫ్యామిలీ మొత్తం వచ్చి దింపడం చూస్తుంటే నవ్వొస్తుంది.

సరే అక్కడ వారు ముగ్గురూ కనిపించారుగానీ మాతో మాట్లాడలేదు. రెండవ రోజు తెలిసిందీ,ఆ అన్నాచెల్లెళ్ళకీ - నెంబర్ 5కి కూడ గొడవ అయ్యిందని.

అలా ఉన్న ఐదుగురం మూడు వర్గాలు అయ్యామన్నమాట.

ఇంగ్లీషు పరీక్షకి, గ్రామరు కోసం ఆ నెంబర్ 5 మాతో పూర్తిగా మాట కలిపింది. చెప్పాను కదండీ, అన్నాచెల్లెళ్ళు మ్యాథ్సులో వీకు అని - మ్యాథ్సు పరీక్షకి మాట కలిపారు.

అలా చివరికి అందరం కలిసిపోయాం.


పరీక్షలు ఎలా రాశామంటే - నాకు గుర్తున్నంతవరకు పరీక్షా సమయం ఉ|| 10.00 – 1.00 మ|| వరకు. ఆరింటికి లేచి, ఒక గంట పుస్తకాలు తిప్పేవాడిని. 9 కల్లా బయలుదేరి, సెంటరుకి వెళ్ళేవారం. పరీక్షయ్యాక ఇంటికొచ్చి, అన్నం తిని నిద్రపోయేవాడిని. 4కి లేచి, అంజివాళ్ళింటికి పొయ్యేవాడిని. క్రికెట్ ఆడి చీకటి పడ్డాక ఇంటికొచ్చేవాడిని. 7–7.30 కి పుస్తకాలు తీసేవాడిని. ఒక 9–9.30 దాక చదివి, అన్నం తిని నిద్రపోయేవాడిని. మళ్ళీ ఉ|| 6కే లేవడం. అతిసయోక్తి అనుకోపొతే నేనేప్పుడూ తెల్లవారి లేచి చదవలేదు. ఇంజనీరింగులోనూ, కొన్ని (5–6) ఫైనల్ పరీక్షలకి మటుకు రాత్రి 11.30 వరకు చదివాను, పొద్దునే 7.30కి బస్ ఎక్కి వేరే ఊరు వెళ్ళి వ్రాయాలి కాబట్టి.


అలా ఆడుతూ పాడుతూ వ్రాసిన నాకు 488/600 (81.3%) వచ్చాయి. మ్యాథ్సులో 98 వచ్చాయి. హిందీలో 50 చిల్లర వచ్చాయి. ఆ రోజుల్లో (1990లు) పదిలో 500 దాటితే తెలివైనవారిగా చూసేవారు. కొంచెం శ్రద్ధ పెట్టుంటే 500 దాటేవిగా అనిపించింది అప్పట్లో.