28, మే 2023, ఆదివారం

ఫ్రెషర్లకు నెక్స్ట ఏమిటీ?

ఈ ఏప్రిల్ నా సాఫ్టువేరు కెరియరులో ఇరవై సంవత్సరము మొదలైనది. ఈ ఏడాది ఐటీ స్లో డౌను వలన గత ఏడెనిమిదేళ్లుగా ఉన్నంతగా క్యాంపస్ సెలక్షన్స్ జరగట్లేదు. దానితో కొందరు కజిన్సు, స్నేహితులు (అదే వారి పేరెంట్సు ) కొంత ఆందోళనలో, అయోమయంలో ఉన్నారు. వారితో మాట్లాడిన వాటి సారాంశం - 

ఫ్రెషర్స్ అయినా అనుభవజ్ఞులకు అయినా ఉద్యోగ అవకాశాలకు రెండు ముఖ్యమైనవి కావాలి - 1. అవకాశము 2. వచ్చిన అవకాశాన్ని వాడుకుని ఉద్యోగం సంపాదించి స్థిరపరచుకునే నైపుణ్యము.

1. అవకాశము

మనం ఎంత బాగా చదివేవారమైనా, ఎంత విద్య ఉన్నా అవకాశము దొరనిదే మనకు నిరూపించుకునే వేదిక దొరకదు. ప్రతి సంవత్సరము లక్షలమంది ఇంజనీరింగు పూర్తి చేసి వస్తున్నప్పుడు ఆ లక్షలలో ఒకరైన మనకు ఎంపిక పరీక్ష (వ్రాత/ముఖ) అవకాశము ఎలా వస్తుంది.

  • అదృష్టవశాత్తూ ఒకప్పటిలా ఫైలు పట్టుకుని తిండి మానేసి చెప్పులరిగేలా నగరములోని ఆఫీసులన్నీ ఎక్కిదిగే రోజులు కావు. చక్కగా మంచి రెజ్యూమె తయారు చేసుకుని అన్ని సంస్థల వెబ్ సైట్లలో అప్లై చేయండి.
  • ఫ్రెషర్స్ ఉద్యోగాలు ప్రకటనలు పంచుకునే వాలంటరీ, వాణిజ్య వెబ్సైట్లు, పేజీలు ఎఫ్బీ, టెలిగ్రామ్ లలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు - Frontlines Media
  • నెట్వర్కింగు - ఆల్రడీ మీ రంగములో మీ సీనియర్లు, చుట్టాలు, కుటుంబ స్నేహితులు ఉంటే రిఫరెన్ను అడగండీ. టిప్సు తీసుకోండి. తెలియనవారు అయినా లింక్డిన్, కోరా, రె‌డిట్, మీడియమ్ లాంటి వేదికలపై పరిచయాలు పెంచుకోండి. ఏమీ ఆశించకుండా మాట సాయం చేసేవారు ఇంకా ఈ ప్రపంచములో ఉన్నారు.
  • ప్రోఫైల్ బిల్డ్ - గిట్ హబ్, టాప్ కోడర్, లింక్డిన్ లాంటి చోట్ల ప్రోఫైల్ బిల్డ్ చేసుకోండి

2. నైపుణ్యము

అవకాశము దొరికడము సులువే, దాన్ని అంది పుచ్చుకొని ఎంపిక అవ్వడము, ఉద్యోగములో నిరూపించుకుని తరువాత స్థాయికి పోవడము అంతే ముఖ్యము.

నైపుణ్యములో ముందుగా కావలసినది ప్రోగ్రామింగు -

ఇంజనీరింగు మొదటి మూడేళ్లు పూర్తిగా ఎంజాయ్ చేశాక ఏడో సెమ్ లోనో, నాలుగవ సంవత్సరములోనో జ్ఞానోదయము వస్తుంది. అపుడు అమీరుపేటలోనో బెంగుళూరూలోనో ఏదో కోర్సు చేసి, సర్టిఫికేటు తెచ్చుకుంటే ఉద్యోగము వచ్చేస్తుంది అనుకుంటారు.

ఇలాంటి చాలా సంస్థలలోకోర్సులలో ఏ ప్రోగ్రాము కోర్సు అయినా చెప్పేది సింటాక్సు మాత్రమే. పూర్తి చేస్తే హలో వరల్డ్ వ్రాయడము వస్తుంది, ప్రోగ్రామింగు రాదు. ప్రోగ్రామింగు అంటే సింటాక్సు, లాజిక్ వ్రాయడము మాత్రమే కాదు - ప్రాబ్లం అర్థం చేసుకుని ఒక ఎఫిసియంట్ సొల్యూషన్ ఇవ్వగలగాలి - అనలిటికల్ ఎబిలిటీ ఉండాలి, డిజైన్ కాన్సెప్టులు తెలియాలి, అల్గారిథమ్స్, వాటిని ఆప్టిమైజ్ చేయడము తెలియాలి, డేటా స్ట్రక్చర్సును వాడుకోవడము రావాలి, క్రియేటివ్ థింకింగు ఉండాలి. ఇవన్నీ చాలా మంది నేర్పరు. వారు ఇచ్చే సర్పిఫికేటు మీ రెజ్యూమె షార్టు లిస్టు చేయడానికి ఉపయోగపడచ్చు, కానీ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి, ఉద్యోగములో మీ పనికి ఉపయోగపడదు.

మిమ్మల్ని ఇండస్ట్రీ రెడీ చేస్తాము, మూడు నెలలు - రెండేళ్ళ కోర్సులు అని కొత్తగా కొందరు మొదలుపెట్టారు. ఎన్ఎసార్, నాస్కామ్ వంటి వారితో టై అప్ అని చెప్పుకుంటారు. ఇంగ్లీషు కోరాలాంటి చోట్ల ఫేకు రివ్యూలు ఇప్పించుకుంటారు. జాబ్ గ్యారంటీ, వచ్చాక రెండు నెలల జీతం, సీటీసిలో పది శాతం, ఇలా వ్రాయించుకుంటారు. వీటిలో 90 శాతము ఫేక్. నమ్మకండి.

మీకు ప్రోగ్రామింగు బాగా రావాలంటే మీరు చేయాల్సినవి -

  • ఏదైనా ప్రాబ్లం తీసుకోండి - జోసెఫస్ ప్రాబ్లం , ఎయిట్ క్వీన్స్ చెస్ పజిల్ లాగా సాఫ్టువేరు కావచ్చు లేదా కాలిక్యులేటరు, ఏదన్నా చిన్న యాప్, గేమ్ కావచ్చు - మొదలు పెట్టి, డిజైను చేసి, లాజిక్ వ్రాస్తే మీకు ప్రోగ్రామింగు స్కిల్స్ పెరుగుతాయి.
  • హ్యాకర్ ర్యాంక్, కోడ్ షెఫ్ లాంటి సైట్లలో రిజిస్టరు చేసుకుని ప్రోగ్రామింగు ప్రాబ్లంస్, పజిల్సు, ఎసైన్మంట్లు చేయండి. లింక్డిన్ స్కిల్ ఎసైన్మంట్లు కూడా వ్రాయచ్చు.
  • గిట్ హబ్ లాంటి చోట్ల ఓపెన్ సోర్సు ప్రోగ్రామింగు కోడ్ ఉంటుంది. చదివి మంచి కోడు ఎలా వ్రాస్తారో తెలుసుకోండి.

మెటా, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు కొంత అడ్వాన్స్డ్ కోడింగు ప్రశ్నలు అడుగుతాయి. ఇన్ఫోసిస్, విప్రో లాంటి సర్వీసు ప్రోవైడరు కంపెనీలు ప్రోగ్రామింగుతో పాటు వ్రాత పరీక్షలో అనలిటికల్ ప్రశ్నలు, ఇంగ్లీషు గ్రామరు అడుగుతాయి.

ఇంగ్లీషు గ్రామరుతో పాటు, ఇంగ్లీషు స్పీకింగు, సాఫ్టు స్కిల్స్ కూడా ముఖ్యమే. గ్రూపు డిస్కషన్స రావాలి. వీటికి మీరు ఇంజనీరింగులో ఉండగానే తయారు అవ్వడము మొదలుపెట్టాలి.

మీరు కోర్సులే చేయాలి అనుకుంటే - ప్రస్తుతము మూడు స్ట్రీములు హాట్గా నడుస్తున్నాయి -

  • ఫుల్ స్టాక్ డెవలపరు (ఫ్రంట్ ఎండ్ అంటే హెచ్టీఎమెల్, జావా స్క్రిప్టు, ఏంగులర్, వ్యూ వంటివి, బ్యాక్ ఎండ్ అంటే డాట్నెట్, జావా, పైథాను లలో ఏదో ఒక భాషలో రెస్టు ఏపీఐలు వ్రాయడము, డేటాబేసులో లిన్క్యూ, సీక్వెల్ లలో క్వెరీలు, స్టోర్డు ప్రోసీజర్లు వ్రాయగలగాలి),
  • ఏఐ – ఎంఎల్ (పైథాన్/ఆర్, స్టాటిస్టికల్ మోడల్స్),
  • డేటా సైన్స్(స్టాటిస్టికల్ మోడల్స్, క్వెరీలు, బిగ్ డేటా, ట్రెండ్ ఎనాలసిస్)

పై మూడింటిలో ఏదోక స్ట్రీము ఎంచుకుంటే మీకు ఆన్లైనులో చాలా లర్నింగు ప్లాట్ఫాంలు ఉన్నాయి - కొన్ని ఫ్రీ, కొన్ని డబ్బులకు - ప్లూరల్ సైట్, కోర్స్ ఎరా, యూడెమీ లాంటి వాటిలో ఏదోకటి చూసుకుని చేయవచ్చును. అమీరుపేట దాకా వెళ్లాలని లేదు.

కానీ పైన చెప్పినట్లు, పై మూడు కోర్సులు మొదలుపెట్టే ముందర ప్రోగ్రామింగు నైపుణ్యము ముఖ్యము.

నైపుణ్యము పెంచుకుని మనం రెడీగా ఉంటే అవకాశము వచ్చినపుడు నిరూపించుకోవచ్చు.

https://qr.ae/pGzMrC

21, మే 2023, ఆదివారం

రాజ్ (కోటి)

 --రాజ్--

నేను మొదటిసారి వీసీఆర్ లో వీడియో చూసిన సినిమా చిరంజీవి యముడికి మొగుడు ఏడేళ్ళ వయసులో 1988లో - గుంటూరు బామ్మ వాళ్లింట్లో మధ్యగదిలోని పాత డయనోరా టీవీలో వేస్తే వసారా దాటి ముందు ఖాళీ స్థలంలోనూ ఖాళీ లేకుండ నించొని జనాలు చూశారు. అపుడు పాటలు ఒకటికి రెండు సార్లు అందరూ ఆసక్తిగా చూశారు. అపుడు అందరినీ బాగా ఆకట్టుకున్న పాట అందం హిందోళం - చిరంజీవి అంటే బ్రేక్ - అందులో రాధతో పోటిపడి రోడ్డుపై వేశాడు. మా సెకండ్ క్లాస్లో కూడా ఆ పాటే హిట్. నాకు అపుడే రాజ్ - కోటి తెెలిసింది (పోస్టర్లు చూసేవారం కదా)

అప్పటి 80 యముడికి మొగుడు, ఖైది 786 (గువ్వ గోరింక), శతృవు (అమ్మ సంపంగిరేకు), కొదమసింహం నుండి రాజా విక్రమార్క, ముఠామేస్త్ర్రీ , బంగారు బుల్లోడు, గోవిందా గోవిందా, హలో బ్రదర్ ల మీదుగా 1995 వరకు ఏ సినిమా పాట అయినా వైవిధ్యముగా ఉండేవి. హైస్కూల్లో పాటలపై ఒక టేస్టు ఏర్పరచుకుంటున్న సమయములో పెద్ద సినిమాలన్నీ అయితే కీరవాణి లేదా రాజ్ - కోటి. కీరవాణివి ఎక్కువగా మెలడీగా వినిపిస్తే రాజ్-కోటివి బీట్ + రిథమ్ + మెలడీ గా అనిపించేవి. రహమానువి ఏడాదికి రెండు మూడు డబ్బింగు సినిమాలు. ఇళయరాజా పేరు 92 తరవాత తెలుగులో తక్కువే.ఆయన సంగీతం గురించి నాకు ఎక్కువ తెలిసినది ఈటీవి, తేజ టీవీల్లో 80ల క్లాసిక్సు చూశాకనే.

క మేము కేబుల్ టీవీలో తెగ చూసిన లో బడ్జట్ కామెడీ సినిమాలు జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడి పంబ, పేకాట పాపారావు, పరుగో పరుగు, పెద్దరికం వంటి చిత్రాలకూ వీరే సంగీత దర్శకులు. అలా ఒక క్రేజ్ ఉండేది



90 ల మధ్యలో వారిద్దరూ విడిపోయినపుడు చాలా మంది బాధ పడ్డారు, నేను రాజ్ క్లిక్ అవ్వాలి అని కోరుకున్నా. కోటి ఎక్కువగా ఈవీవీ సినిమాలు చేసేవాడు. అందుకని పెద్దగా చూడలేదు. అందులోనూ అల్లుడా మజాకా తరవాత చిరాకేసింది. బీట్ ఎక్కువ ఉండేది, వాయిద్యాలు సాదాగా అనిపించేవి అందుకనీ నాకు ఎక్కువగా కోటి పాటలు నచ్చలేదు.

సిసింద్రీలో చిన్నితండ్రీ పాట, హలో గురూ టైమెంతయిందో పాటలు విన్నప్పుడు కొత్తగా అనిపించాయి. మెలడీ, స్పీడ్ రెండూ ఉండేవి. రాముడొచ్చాడు కూడా బాగుండేది. ఏమయ్యిందో తెలియదు, తరువాత ఇంకెక్కువ చేయలేదు. చాలా బాధ పడ్డాను.

పెద్దయ్యాక టీవీల్లో, యూట్యూబ్ ఛానెల్స్లో ఇంటర్వూలలో రాజె పెద్దగా కనిపించేవాడు కాదు. కోటినే ఎక్కువగా కనిపించేవాడు - బాణీలన్నీ ఎక్కువ భాగము తనవేనని, ఆర్కెస్ట్రయిజేషను కూడా తన ఐడియాలు ఎక్కువని, రాజ్ కేవలము కండక్టింగు, రికార్డింగు చేసేవాడు అని చెప్పుకునేవాడు. అందులో నిజముండవచ్చు (నేను చూడలేదు, పూర్తి వివరాలు లేవు కాబట్టి) నాకెందుకో పూర్తి నిజమనిపించేది కాదు.

ఇంకొన్నేళ్ళ తరువాత కోటి మార్కెట్ పూర్తిగా పడిపోయాక ఇద్దరూ కలిసి టీవీల్లో, యూట్యూబ్ ఛానెల్స్లో ఇంటర్వూలకు వచ్చేవారు. వాటిలో బాడీ లాంగ్వేజ్ గమనిస్తే కోటి ఎక్స్‌ట్రోవర్టు (ఇది చాలా మందికి తెలుసు), రాజ్ ఇంట్రోవర్టు అని అనిపించింది.

అందువలనే రాజ్ తనను తాను సెల్ చేసుకోలేక లేదా ఇనీషియేటివ్ తీసుకోక కొత్త అవకాశాలు తెచ్చుకోలేదు, కోటి అల్లుకుని అన్ని రకాల చిత్రాలకు చేసి ముందుకు వెళ్లిపోతే, రాజ్ అక్కడే ఆగిపోయాడు అనిపించింది.

---

స్వతాహాగా ఇంట్రోవర్టు అయిన నాకు, ఈ విషయము కొంత ఆలోచన కలిగించినది, సచిన్ నీడలో ఉండిపోయిన ద్రవిడ్ కెరీయరులాగా ఇతని కెరియరు కూడా కోటి నీడలో ఉండిపోయిన రాజ్ అనిపించి, నా కెరీయరు ఆలోచనలకు, తీసుకున్న నిర్ణయాలకు కొంత ఇన్ఫ్లూయన్స్ కలిగించినది. టీమ్వర్కున్న చోట వేరేవారి పనికి క్రెడిట్ తీసుకునేందుకు చాలా మంది ఉంటారు.

అందుకే మామూలుగా ఏ వ్యక్తి మరణానికి, జన్మదినానికి పోస్టు పెట్టని నాకు ఇవాళ ఎందుకో రాజ్ వార్త తెలిశాక వ్రాయాలనిపించినది.

1, మే 2023, సోమవారం

కార్మిక దినం - లేబర్ వెల్ఫేర్

 గుంటూరులో మా ఇంటికి కూతవేటు దూరంలో ఉన్నది, ఉండేది ఈ లేబర్ వెల్ఫేర్ ఆఫీసు.

ప్రభుత్వ ఆఫీసు కాబట్టి పొద్దున్న పదకొండు అయినా తెరిచేవారు కాదు, సాయంత్రం మూడున్నర, నాలుగుకు ఖాళీ అయిపోయేది. మిగతా సమయం మేము క్రికెట్ ఆడుకునేవారము. కొందరు పెద్దవాళ్ళు కర్రా గిల్లి ఆడేవారు. ఎండా కాలం సెలవులలో ఒకేసారి నాలుగైదు మ్యాచులు జరిగేవి. సోడా బండ్లు, ఐస్క్రీం బండ్లు ఈ కుడివైపు చెట్టు కింద ఉండేవి.

ఏప్రిల్ చివరికి మా పరీక్షలు అయిపోయే సమయానికి ఇక్కడ కార్మికులకు పోటీలు మొదలయ్యేవి. వాలీబాల్, కబడ్డీ, టెన్నికాయిట్ (రింగ్), బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్ - అన్నీ ఖర్చు తక్కువ ఆటలు.

మాచర్ల కేసీపీ సిమెంట్, నెల్లూరు నిప్పో బ్యాటరీలు, గుంటూరు ఐటీసీ - ఇలా మూడు జిల్లాల కార్మికులు వచ్చేవారు. ఇరవై నుండి అరవై దాకా అన్ని వయసుల వారు మంచి కసితో పోటాపోటీగా ఆడేవారు, గుంటూరు ఎండలు మండుతున్నా. మేడే కు బహుమతులు ఇచ్చేవారు.

మాకు మంచి టైంపాస్. పొద్దున్నే ఎనిమిది నుండి సాయంత్రం ఏడున్నర దాకా అక్కడే వేలాడేవారం. వాళ్ళకు చప్పట్లు కొట్టి, బాల్స్ అందించి, తర్వాతి వాలీబాల్ గేమ్ ఆడాల్సినవారు లోపల చెస్ ఆడుతుంటే వెళ్లి చెప్పి పిలుచుకుని రావడం, ఇలా వాళ్ల వెనక తిరిగేవారము. వాళ్ళూ మాతో సరదాగా ఉండేవారు.

ఒక కొత్త సైకిల్ కొన్న ఎండాకాలం నేను తెచ్చాననుకుని, అన్నయ్య, వాడు తెచ్చడానుకుని నేను అక్కడే మర్చిపోయాం. రాత్రికి గేటు తాళం వేసేటపుడు లోపల పెడదామని చూస్తే సైకిల్ లేదు. రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లారగానే పొద్దున ఆరింటికి ఆ ఆఫీసు ఇంచార్జ్ ఇంటికి పరిగెత్తాము, దగ్గరే - పాపం మంచాయన రాత్రి ఆఫీస్ లోపల పెట్టించాడు అట. రోజూ చూసే మొహాలే కాబట్టి తిరిగి ఇచ్చేశాడు. 30ఏళ్ల తర్వాత ఇవాళ పొద్దున కూడా మా వాడిని ముందు కడ్డిపై కూర్చోపెట్టుకుని ఈ సైకిల్ తొక్కుతుంటే పైన వ్రాసినది అంతా గుర్తుకు వచ్చింది.

వెళ్లి చూస్తే ఆఫీస్ ఫోటోలో చూపించినట్లు శిథిలావస్థకు చేరింది. పిచ్చి చెట్లు పెరిగి దారి కూడా లేదు, పిల్లలు ఆడుకునే గ్రౌండ్లా లేదు. ఇక కార్మికుల పోటీలు ఏమీ జరుగుతాయి.

రిక్షా యూనియన్లు, ఆటో యూనియన్లు పొద్దున్నే ఆర్ నారాయణమూర్తి పాటలు పెట్టి వీధి వీధికి జెండాలు ఎగరేసేవారు. ఇపుడు బయట ఏ సందడి లేదు. పొద్దున్నే షాపులు అన్నీ తెరచి ఉన్నాయి.

ఐటీ కూలీలు, వైట్ కాలరు వర్కర్లం ఇంకో లాంగ్ వీకెండ్ తీసుకుని ట్రిప్పులు వేసుకుంటున్నాము. 

#కార్మికదినోత్సవం #mayday #మేడే