21, మే 2023, ఆదివారం

రాజ్ (కోటి)

 --రాజ్--

నేను మొదటిసారి వీసీఆర్ లో వీడియో చూసిన సినిమా చిరంజీవి యముడికి మొగుడు ఏడేళ్ళ వయసులో 1988లో - గుంటూరు బామ్మ వాళ్లింట్లో మధ్యగదిలోని పాత డయనోరా టీవీలో వేస్తే వసారా దాటి ముందు ఖాళీ స్థలంలోనూ ఖాళీ లేకుండ నించొని జనాలు చూశారు. అపుడు పాటలు ఒకటికి రెండు సార్లు అందరూ ఆసక్తిగా చూశారు. అపుడు అందరినీ బాగా ఆకట్టుకున్న పాట అందం హిందోళం - చిరంజీవి అంటే బ్రేక్ - అందులో రాధతో పోటిపడి రోడ్డుపై వేశాడు. మా సెకండ్ క్లాస్లో కూడా ఆ పాటే హిట్. నాకు అపుడే రాజ్ - కోటి తెెలిసింది (పోస్టర్లు చూసేవారం కదా)

అప్పటి 80 యముడికి మొగుడు, ఖైది 786 (గువ్వ గోరింక), శతృవు (అమ్మ సంపంగిరేకు), కొదమసింహం నుండి రాజా విక్రమార్క, ముఠామేస్త్ర్రీ , బంగారు బుల్లోడు, గోవిందా గోవిందా, హలో బ్రదర్ ల మీదుగా 1995 వరకు ఏ సినిమా పాట అయినా వైవిధ్యముగా ఉండేవి. హైస్కూల్లో పాటలపై ఒక టేస్టు ఏర్పరచుకుంటున్న సమయములో పెద్ద సినిమాలన్నీ అయితే కీరవాణి లేదా రాజ్ - కోటి. కీరవాణివి ఎక్కువగా మెలడీగా వినిపిస్తే రాజ్-కోటివి బీట్ + రిథమ్ + మెలడీ గా అనిపించేవి. రహమానువి ఏడాదికి రెండు మూడు డబ్బింగు సినిమాలు. ఇళయరాజా పేరు 92 తరవాత తెలుగులో తక్కువే.ఆయన సంగీతం గురించి నాకు ఎక్కువ తెలిసినది ఈటీవి, తేజ టీవీల్లో 80ల క్లాసిక్సు చూశాకనే.

క మేము కేబుల్ టీవీలో తెగ చూసిన లో బడ్జట్ కామెడీ సినిమాలు జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడి పంబ, పేకాట పాపారావు, పరుగో పరుగు, పెద్దరికం వంటి చిత్రాలకూ వీరే సంగీత దర్శకులు. అలా ఒక క్రేజ్ ఉండేది90 ల మధ్యలో వారిద్దరూ విడిపోయినపుడు చాలా మంది బాధ పడ్డారు, నేను రాజ్ క్లిక్ అవ్వాలి అని కోరుకున్నా. కోటి ఎక్కువగా ఈవీవీ సినిమాలు చేసేవాడు. అందుకని పెద్దగా చూడలేదు. అందులోనూ అల్లుడా మజాకా తరవాత చిరాకేసింది. బీట్ ఎక్కువ ఉండేది, వాయిద్యాలు సాదాగా అనిపించేవి అందుకనీ నాకు ఎక్కువగా కోటి పాటలు నచ్చలేదు.

సిసింద్రీలో చిన్నితండ్రీ పాట, హలో గురూ టైమెంతయిందో పాటలు విన్నప్పుడు కొత్తగా అనిపించాయి. మెలడీ, స్పీడ్ రెండూ ఉండేవి. రాముడొచ్చాడు కూడా బాగుండేది. ఏమయ్యిందో తెలియదు, తరువాత ఇంకెక్కువ చేయలేదు. చాలా బాధ పడ్డాను.

పెద్దయ్యాక టీవీల్లో, యూట్యూబ్ ఛానెల్స్లో ఇంటర్వూలలో రాజె పెద్దగా కనిపించేవాడు కాదు. కోటినే ఎక్కువగా కనిపించేవాడు - బాణీలన్నీ ఎక్కువ భాగము తనవేనని, ఆర్కెస్ట్రయిజేషను కూడా తన ఐడియాలు ఎక్కువని, రాజ్ కేవలము కండక్టింగు, రికార్డింగు చేసేవాడు అని చెప్పుకునేవాడు. అందులో నిజముండవచ్చు (నేను చూడలేదు, పూర్తి వివరాలు లేవు కాబట్టి) నాకెందుకో పూర్తి నిజమనిపించేది కాదు.

ఇంకొన్నేళ్ళ తరువాత కోటి మార్కెట్ పూర్తిగా పడిపోయాక ఇద్దరూ కలిసి టీవీల్లో, యూట్యూబ్ ఛానెల్స్లో ఇంటర్వూలకు వచ్చేవారు. వాటిలో బాడీ లాంగ్వేజ్ గమనిస్తే కోటి ఎక్స్‌ట్రోవర్టు (ఇది చాలా మందికి తెలుసు), రాజ్ ఇంట్రోవర్టు అని అనిపించింది.

అందువలనే రాజ్ తనను తాను సెల్ చేసుకోలేక లేదా ఇనీషియేటివ్ తీసుకోక కొత్త అవకాశాలు తెచ్చుకోలేదు, కోటి అల్లుకుని అన్ని రకాల చిత్రాలకు చేసి ముందుకు వెళ్లిపోతే, రాజ్ అక్కడే ఆగిపోయాడు అనిపించింది.

---

స్వతాహాగా ఇంట్రోవర్టు అయిన నాకు, ఈ విషయము కొంత ఆలోచన కలిగించినది, సచిన్ నీడలో ఉండిపోయిన ద్రవిడ్ కెరీయరులాగా ఇతని కెరియరు కూడా కోటి నీడలో ఉండిపోయిన రాజ్ అనిపించి, నా కెరీయరు ఆలోచనలకు, తీసుకున్న నిర్ణయాలకు కొంత ఇన్ఫ్లూయన్స్ కలిగించినది. టీమ్వర్కున్న చోట వేరేవారి పనికి క్రెడిట్ తీసుకునేందుకు చాలా మంది ఉంటారు.

అందుకే మామూలుగా ఏ వ్యక్తి మరణానికి, జన్మదినానికి పోస్టు పెట్టని నాకు ఇవాళ ఎందుకో రాజ్ వార్త తెలిశాక వ్రాయాలనిపించినది.

2 కామెంట్‌లు:

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in