1, జులై 2022, శుక్రవారం

మంచి రెజ్యూమె అంటే...

 మంచి రెజ్యూమె ఎలా ఉండాలో చెప్పుకునే ముందు అసలు రెజ్యూమె అవసరము ఎందుకో చూద్దాం.

కొన్ని దశాబ్దాల కిందట బయోడేటా ఇస్తే సరిపోయేది - అంటే పేరు, చదువు, అనుభవము ఉంటే ఒక రెండు లైన్లు, చిరునామా.

కానీ ఈ రోజుల్లో చాలా ఉద్యోగాలకు ఒక్క బయోడేటా సరిపోదు. పై వ్యక్తిగత, చదువు వివరాలతో పాటు మన నైపుణ్యాలు ఏమిటో, వాటిని ఎలా ఉపయోగించాము, మన ఎచీవ్మెంట్లు, మనము సంస్థకు ఎలా ఉపయోగపడగలము, అన్నీ చెప్పగలగాలి.

రెజ్యూమె ఉపయోగాలు -

• రిక్రూటర్లు చూసి వారి దగ్గరున్న ఖాళీలకు నప్పుతాయో లేదో తెలుసుకోవడానికి - మ్యానువల్ తనిఖీ కావచ్చు

• టూల్సుతో వెతికినా, ఫిల్టరు చేసినా ఎంపిక అవ్వడానికి

• రెజ్యూమె మొదటి స్టెప్పు మాత్రమే కాదు, అంటే మీకు ఇంటర్వ్యూ అవకాశము కల్పించడానికే కాదు. ఇంటర్వ్యూ చేసేవారికి కావల్సిన సమాచారము ఇవ్వడానికి, ఇంప్రెస్ అవ్వడానికి కూడా

ఈ రోజుల్లో ప్రతి రెజ్యూమె టెంప్లేటు ఒకేలా ఉంటుంది - ఆబ్జక్టివ్, చదువు, నైపుణ్యాలు, సంస్థ/ ప్రాజక్టు అనుభవాలు (పేరు, తేదీలు, భాద్యతలు), వ్యక్తిగత వివరాలు, డిక్లరేషను. నేను గత 15 ఏళ్లుగా ఇంటర్వ్యూలు చేస్తున్నా - ఒక వేయిపైనే రెజ్యూమెలు చూసుంటా - ఈ టెంప్లేటు వరస అంతగా మారలేదు.


టెంప్లేటు రంగులు, ఫాంట్లు మారినా కూర్పు, అందులో సరుకు ఒకేలా ఉంటున్నది.

మంచి రెజ్యూమె ఎలా ఉండాలి -

  • ఆబ్జక్టివ్ / గోల్ సాధారణముగా ఇంటర్వ్యూయర్లు చదవరు. కానీ మీరేమన్నా డాంబికాలకు పోయి అసాధారణముగా వ్రాస్తే మటుకు చిక్కిపోతారు. ఉదాహరణకు, మీరు సీనియరు డెవలపరు స్థానానికి అప్లై చేస్తూ ఎంట్రప్రేన్యూర్ అవ్వడము లక్ష్యము అని వ్రాసినా. అలా అని రొడ్డకొట్టు "contribute for the growth of the organization” లాంటివి వ్రాయకండి - సంస్థకుండే వందల / వేల ఉద్యోగులలో మీరొకరు.
  • అలంకరణ ఒక్కటే సరిపోకపోయినా కనీస అలంకరణ – మీకు వర్డ్, డాక్యుమెంటేషను వచ్చని, అలాగే తప్పులు లేకుండా ఉండటం - మీకు attention to detail ఇష్టమని తెలుపుతుంది.
  • అలంకరణ అతి చేయకండి, సింపులుగా ఉండేలా చూసుకోండి.
  • సంస్థ/ ప్రాజక్టు అనుభవాలు - అందరిలా అదే ప్రాజక్టు పేరు, రోలు, మీ పాత్ర కాకుండా విభిన్నముగా చూపించవచ్చేమో చూడండి. చివరన నా రెజ్యూమె ఉదాహరణ ఇచ్చాను చూడండి.
  • అన్ని సంస్థ/ ప్రాజక్టు అనుభవాలు వ్రాసి పేజీలు నింపకుండా క్లుప్తముగా ముఖ్యమైనవి మాత్రమే తెలపండి - ఇంటర్వ్యూ చేసేవారికి ఒక్కోక్కసారి మీ రెజ్యూమె ఇంటర్వ్యూకు ఐదు నిమిషాలు ముందు, ఒక్కోసారి ఇంటర్వ్యూలో మాత్రమే చూసే అవకాశము దొరుకుతుంది. వారికున్నఆ కొద్ది సమయములో ముఖ్యమైనవి అని మీరనుకున్నవి వారి కంటపడాలి అంటే ఏమి చేయాలో ఆలోచించుకోండి.
  • ఫిల్టరు చేసే టూల్సుకు చిక్కడానికి అవసరమైన కీ - వర్డ్సు ఉండేలా చూసుకోండి.
  • అలా అనీ అబద్ధాలు వ్రాయకండి. ఇంటర్వ్యూ చేసేవారికి చాలా సులువుగా తెలిసిపోతుంది.
  • మీరు అప్లై చేసే రోల్ బట్టి విడి విడి రెజ్యూమె తయారుచేసుకోండి. ఉదాహరణకు, పదేళ్ల అనుభవానికి కొన్ని సంస్థలలో సీనియర్ డెవలపరు, కొన్ని చోట్ల లీడ్, ఇంకొన్ని చోట్ల ఆర్కిటెక్టు ఇలా వేరే ఉంటాయి.
  • మీరు పని చేసిన సంస్థల, క్లయింటుల పేర్లు, కాన్ఫిడెన్షియల్ సమాచారము మీ ప్రాజక్టులలో లేకుండా చూసుకోండి.
  • మంచి, బలమైన పదాలు వాడండి. అలాగని థారూరును ఆదర్శముగా తీసుకోవద్దు.
  • అనవసర విషయాలు తీసివేయండి - ఉదాహరణకు Watching movies, Playing cricket, పాస్పోర్టు నెంబరు, కమ్యూనికేషను అడ్రస్ (ఊరు పేరు చాలు)

నేను నా రెజ్యూమె తయారుచేసుకునేటప్పుడు రెండు పేజీలలో 16 ఏళ్ళ అనుభవము, నైపుణ్యాలు పట్టించడము పెద్ద ఛాలెంజి అయ్యింది. అపుడు కిందలా ఒక గ్రాఫిక్, ఒక టేబుల్ పెట్టాను. చాలా సమాచారము సులువుగా, అదే సమయములో నా ఇంటర్వ్యూయర్లకు కొట్టోచ్చేలా పెట్టగలిగాను. ఒక ఆర్కిటెక్టుగా గ్రాఫిక్స్, పవర్ పాయింట్లలో నైపుణ్యము ఉండాలి కాబట్టి అది కూడ పనిలోపని కవరు అయ్యింది.



30, జూన్ 2022, గురువారం

నాకు నచ్చిన విషాద గీతాలు

 నాకు యుగళ గీతాల (డ్యూయెట్లు ) కన్నా విషాద / విరహ గీతాలు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఈ పాటల్లో కొంచెం ఆర్ద్రత (melancholy) వినిపిస్తుంది. అదే డ్యూయెట్ల లో డ్యాన్సు స్టెప్పులకి కావల్సిన రిథమ్ పైన దృష్టి ఉంటుంది .

నా ప్లేలిస్టులో ఎప్పుడూ అభినందన , మహర్షి , గీతాంజలి వంటివి చూసి మితృలు 20లలో ఉన్నప్పుడు కొందరు విసుక్కునేవారు - నీకు ప్రేమ మీద నమ్మకం లేదు కదా ఎప్పుడూ భగ్న ప్రేమికుడు లా ఆ ఏడుపు గొట్టు పాటలేందని .

ఐతే మనకి విషాద గీతాలంటే ప్రేమ విఫలమైనవి , దూరమైనవి , విరహ గీతాలు మాత్రమే అనుకుంటారు. కానీ ఎవరన్నా పోయినపుడు ( ఒక్కడై రావడం ఒక్కడై పోవడం , చుక్కల్లో ఉన్నాడు చందురుడు - వైయస్ పోయినపుడు పెట్టారు. ) , లేదా మోస పోయినప్పుడు ( ఎవరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి , అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ) , ఒక ప్రదేశంలో సమస్య వచ్చినప్పుడు (బొంబాయి ధీమ్ , కడసారిది వీడ్కోలు - అమృత ) ఇలా చాలా రకాలున్నాయి.

ఇక నచ్చిన విషాద గీతాలు అంటే చాలా పెద్ద చిట్టా అవుతుంది- అది జీనా యహా మర్నా యహా లా పాత హిందీ పాటలు, దేవదాసు , మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, ప్రేమనగర్ వంటి పాత తెలుగు సినిమాలు - ఘంటసాల విషాద గీతలా క్యాసెట్టు మా ఫిలిప్స్ టూఇన్వన్ లో అరగ్గొట్టాము, ఆ తరువాత బాలు సుశీల జానకి జేసుదాస్ చిత్ర పాడిన 70 - 90 ల్లోనివి - చివరగా 2000–2010లలో కె.కె., షాన్, సోనూనిగమ్ లాంటివారు పాడినవి కూడా నచ్చాయి.

ఒక ఐదు ఎన్నుకోవాలి అంటే నా కారులో, ఫోనులో, అంతకుముందు మ్యూజిక్ ప్లేయరులో బాగా అరిగినవి. వయోలిన్ (నాకిష్టమైన వాయిద్యం) విషాదాన్ని బాగా పలికిస్తుంది. అందుకేనేమో నాకు నచ్చిన పాటలలోనూ వయోలినుదే ముఖ్యపాత్ర -

  1. హృదయం నుండి ’పూలతలే పూచెనమ్మ’ - ముఖ్యంగా ’ నిను కన్నతల్లైనా నువు కోరకుండ పీటేసి బ్రతిమాలి వడ్డించదంటా ’, ’ పెదవులు తెరవందే చేరవు భావాలు, పిరికోళ్ళ ప్రేమలన్నీ మూగోళ్ళ పాటలులే ’ - రాజశ్రీ గారి తర్వాత అంత మంచి డబ్బింగు సాహిత్యం రాలేదు. బాలు - ఇళయరాజా గురించి చెప్పేది ఏముంది. ఈ సినిమాలో హృదయమా హృదయమా పాట కూడా చాలా ఇష్టం. ఈ సినిమా హీరో మురళిది ’ వెన్నెలలో వేకువలో చూశానే ప్రేమ ’ అనే పాట కూడా చాలా బాగుంటుంది.
  2. కోకిల సినిమాలో ’ ఆకాశము మేఘాలే తాకే వేళల్లో ’ పాట - వయోలిన్, స్ట్రింగ్స్ బాగుంటాయి - ఇళయరాజా - చిత్ర.
  3. విచిత్ర సోదరులులో ’ నిను తలచి మైమరచా ’ - కమల్ - ఇళయరాజా - సింగీతం - రాజశ్రీ - ఇంతకన్నా చెప్పక్కర్లేదు.
  4. చిరంజీవి ఆరాధన లో ’ అరె ఏమైందీ ’ - ముందు జానకమ్మకోసం
  5. అమృత సినిమాలో కడసారిది వీడ్కోలు - ఈ పాట చాలా కదిలిస్తుంది. కాకపోతే సాహిత్యం అంతగా ఎక్కలేదు.

హిందీలో దిల్ చాహ్తా హై లోని తన్హాయి పాట చాలా ఇష్టం.

https://www.youtube.com/watch?v=frOM1_BpwZc

28, జూన్ 2022, మంగళవారం

ఇళయరాజా - రహమన్ - నాకు అనిపించిన తేడాలు

 ఇళయరాజా!

నా ముందు, తర్వాతి తరమువారికంటే నేను దాదాపుగా ఇద్దరి కెరీరు పీక్‌లో పాటలు విన్నాను. ఇది కేవలం ఒక శ్రోతగా నా పరిశీలన, అభిప్రాయం. ప్రామాణికమైన వ్యాసంగా భావించి ఎవరి మనోభావాలు గాయపరుచకోవద్దు.

వేరు వేరు తరాలలోని కళాకారులను, ఆటగాళ్ళను సాధారణముగా పోల్చకూడదు. ఎందుకంటే సాంకేతికత అభివృధ్ధి చెందుతుంది. అందులోనూ సినిమాలు, పాటలు అప్పటి ప్రేక్షకుల అభిరుచులకనుగుణముగా రూపొందిస్తున్నప్పుడు ఆ తయారైన ఎండ్ ప్రోడక్టు యొక్క నాణ్యత కాకుండా శైలిని బట్టి, విజయము/ పాపులారిటీ / అవార్డులను బట్టి ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అని తేల్చడము సరి కాదు. పాటలు వ్యక్తిగత అభిరుచి - అలాగే సంగీత దర్శకులు, గాయనీగాయకులు. కొందరికి ఘంటసాల, ఇంకొందరికి బాలు, చిత్ర, మరికొందరికి కెకె, కార్తీక్, వేరొకరికి కిశోర్ కుమార్, రఫీ, లతాజీ.

మరి నా దృష్టిలో ఎందుకని ఇళయరాజా రహమన్ కన్నా ఎందుకని మెరుగైన స్వరకర్త?

ఏ కళనైనా, క్రీడనైనా మనం రేటిఫై చేసేటప్పుడు ముఖ్యముగా రెండు అంశాలు చూస్తాం -

  1. ఎండ్ ప్రోడక్టు - అరే ఈ బొమ్మ, ఫోటో, శిల్పము, పాట ఎంత బాగుందో/అద్భుతముగా ఉందో? మ్యాచ్ విన్నింగు సెంచరీ, గెలిచిన ట్రోఫీలు, వగైరా - ఇందులో మనం చూసేవి నాణ్యత, వైవిధ్యత, హీట్ / విజయం, తోటివారికన్నా ఎంత పై స్థాయిలో ఉన్నారు, అలాగే క్వాంటిటీ
  2. వర్కింగు స్టైలు - ఆ కళను ప్రదర్శిస్తున్నప్పుడు, వాడుతున్నప్పుడు - అరే, వాడు షాటు కొడితే కొట్టినట్టే ఉండదు, ఎవరి బొమ్మైనా నిమిషములో గీసేస్తాడు, నిమిషములో బాణీ ఇస్తాడు, వగైరా - ఇందులో మనం చూసేవి శైలి, వేగము, సొగసు, ప్రతిభ / నైపుణ్యము

ముందుగా ఎండ్ ప్రోడక్టు చూద్దాము - ఒక సినిమా పాటలో ఉండేది - బాణీ (ట్యూను), వాయిద్యాలు (ఆర్కెస్ట్రైజేషను).

బాణీలు -

ఇళయరాజా ఇచ్చినన్ని వైవిధ్యమైన బాణీలు, ప్రయోగాలు రహమన్ చేయలేదు. ఎవ్వరూ వాడని రాగాలు వాడడము, విషాదానికి నప్పే రాగాలను శృంగార రసానికి వాడి మెప్పించడం, తమిళ జానపద, గ్రామీణ బాణీలకు పాశ్చాత్య వాయిద్యాలు మేళవించినా న్యాచురుల్గా వినిపించేలా చేయడం, సమకాలీకుల కన్నా ఒక మెట్టు ఎక్కువలో ఉండడము వంటివి ఇళయరాజా చేశాడు. క్రికెట్లో వివ్ రిఛర్డ్సులాగన్నమాట.

రహమన్ పాటలు 90 – 96 వరకు (రోజా - భారతీయుడు) వరకు వైవిధ్యముగా అనిపించేవి. ఆ తర్వాత అదే క్వాలిటీతో కాకున్నా అలాంటి బాణీలు హారిస్ జైరాజ్, సందీప్ చౌతా, మణిశర్మ వంటివారు ఇచ్చారు. కేవలము అర్కేస్ట్రా ఎంపిక, ప్రోగ్రామింగులోనే రహమన్ వైవిధ్యత కనిపించేది.

వాయిద్యాలు (ఆర్కెస్ట్రైజేషను / ప్రోగ్రామింగు) -

ఒక పాటకు బాణీ ఎంత ముఖ్యమో ఆర్కెస్ట్రైజేషను అంత ముఖ్యము. 1960ల వరకు మంచి బాణీలు (ఎక్కువ రాగాధారితము) ఉన్నా ఆర్కెస్ట్రైజేషను మొనాటనసుగా ఉండేది. అవే పియానో, విషాదమైతే వీణ / సితార్, వెనక రిథమ్ కు తబలా లేదా మృదంగం. అందుకే మనం పాటలు బాణీ నచ్చి పాడుకుంటాము, రేడియోలో వింటానికి బాగుంటాయి గానీ, స్టీరియోలో, హెడ్ఫోన్లలో అంత ఆస్వాదించలేము. కెవి మహదేవన్, విశ్వనాధన్లు 70లలో ప్రయోగాలు చేసి కొంత వైవిధ్యత తెచ్చినా సినిమా పాట తీరు మార్చినవాడు ఇళయరాజా. పల్లవి - చరణం - పల్లవి - చరణం ఆర్డరు మార్చాడు - ఒక ప్రీలూడ్ (సాకీకి), మొదటి పల్లవి తరువాత, చరణాల మధ్యన వేరు వేరు ఇంటర్లూడ్లు వాడడం చేశాడు.

ఒకే పాటలో పల్లవికి తబలా రిథమ్ లేదా హార్మోనియం, చరణాలకు గిటారు లేదా వెస్ట్రన్ డ్రమ్స్, జాజ్, వాడడము అప్పటికి (80లు) నభూతో. కరెక్టుగా చెప్పాలంటే ఈ ప్రయోగం నాకు తెలిసీ ఆ తర్వాత రహమన్ కూడ చేయలేదు. అలా చేసి కూడా అదేదో ఫ్యూజనులాగ అనిపించకుండా ఒకే పాటనిపించి సీమ్‌లెస్ గా శ్రోత ఆస్వాదించేలా విజయవంతం అయ్యాడు.

ఉదాహరణలు:

అమావాస్య చంద్రుడు లో కళకే కల ఈ అందము - బాలు గొంతు వెనక తబల/ కాంగో, మధ్యలో ఇంటర్లుడ్స్ వెస్టర్న్. అలాగే ప్రేమించు పెళ్ళాడులో ఈ చైత్ర వీణ, కొంతవరకు అబ్బ నీ తియ్యని దెబ్బ, ప్రేమించు పెళ్లాడులో గోపెమ్మ చేతిలో గోరుముద్ద - వెస్ట్రన్ తో మొదలయ్యి ఇండియన్ రిథమ్ కు వస్తుంది - పల్లవి వెస్ట్రన్, చరణాలు ఇండియన్ . ఛాలెంజ్ లో ఇందువదన కుందరదన, మంత్రిగారి వియ్యంకుడు లో మనసా శిరసా, సూర్య ఐపీఎస్ లో ఓం నమో నమ యవ్వనమా, అమావాస్య చంద్రుడు లో వయొలిన్ కన్సర్ట్

ఒక పాటలో ఎక్కడ ఏ వాయిద్యము ఏ నోటు వాయించాలో ఇళయరాజాకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదని చెప్పవచ్చును. రహమన్ తప్ప ఇతర సంగీత దర్శకులు ఇక్కడే తేలిపోయేవారు. అద్భుతమైన బాణీలు పేలవమైన ఆర్కేస్ట్రాతో పోయేవి - మణిశర్మ, కీరవాణి పాటలలో ఎక్కువ శాతము నాకందుకే నచ్చవు. పాట మధురముగా ఉండాలంటే వాయిద్యాల మధ్యన హార్మనీ ఉండాలి, అపుడే ఆ పాట ఎక్కువమందికి చేరుతుంది. ఈ విషయములో గ్రామీణ పాటలు, విషాద గీతాలలో రహమన్ బాణీలు బాగున్నా ఆర్కెస్ట్రైజేషను తేలిపోతుంది.

అలాగే కౌంటరు పాయింటు ఇళయరాజా చేసినట్లు రహమన్ చేయలేదు.

85 నుండి ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వాయిద్యాలు (కీబోర్డు, ఎలక్ట్రిక్ గిటారు, ఢ్రమ్స్, జాజ్) వినియోగం పెరిగింది. ఇళయరాజా వాయిద్యాలు వాడినా, ప్రోగ్రామింగు ఎక్కువ చేయలేదు, డిఫాల్ట్ లూపులు ఎక్కువగా వాడలేదు. వెస్ట్రన్ సంగీతములో తనకున్న పట్టు వలన తనకు కావల్సిన రిథమ్స్, లూప్స్ ఎక్కువ భాగం తనే తయారుచేసుకునేవాడు. రాజ్- కోటి, కీరవాణి వంటి కొత్త సంగీత దర్శకులు కీబోర్డులో వచ్చిన లూపులు వాడుకున్నారు. 90లో రహమన్ అవే లూపులు వాడినా, ప్రోగ్రామింగు కొత్తగా చేశాడు. మిగతా సంగీత దర్షకులతో పోలిస్తే తన జీనియస్ అక్కడ బయటపడింది. ఏ వాయిద్యము ఎలా మిక్సు చేయాలి అన్నదానిలో అతని బ్రిలియన్స్ ఉన్నది. ఇక్కడే హారిస్ జయరాజ్, దేవిశ్రీ, తమన్ కన్నా రహమన్ ఒక మెట్టు ఎక్కువ.

ఇక వర్కింగు స్టైలు కొద్దాము -

ఇళయరాజా వేగముగా బాణీలు ఇస్తాడు, పూర్తి నోటేషను వాయిద్యకారులకు ఇస్తాడు. సిట్యుయేషనుకు తగ్గట్టు, ప్రాంతానికి తగ్గట్టు, ఒక్కోక్కసారి హీరోకు తగ్గట్టు పాటలు వేగముగా ఇచ్చేశాడు.

అదే రహమన్ సమయం తీసుకుంటాడు. ఒక్కో పాటను చెక్కుతాడు. పది ట్రాకులు పాడించి ప్రతి ట్రాకులోంచి మంచి లైన్లు తీసి కలిపేవాడు. ట్రాకులు ఓవర్లాపు చేసేవాడు (ఉదాహరణకు ప్రేమదేశంలో నను నేను మరచినా నీ తోడు). ఇది నా దృష్టిలో డీఎస్ఎలార్ లో 20 షాట్లు కొట్టి, మ్యాక్లో ఫోటోషాపులోనో లైటురూములోనో ప్రాసెసింగు చేసినట్లు. ఇది తప్పా అంటే కాదు. తీసినవి గొప్ప ఫోటోలు కాకుండా పోతాయా అంటే గొప్పవే, అబ్బురపరచేవే. కానీ పది నిమిషాల్లో ట్యూను కట్టి, ఒకటి రెండు రిహార్సల్సులతో లైవు రికార్డింగు చేసి మెప్పించడమూ, అలాంటి పాటలు రోజుకు పదీ పదిహేను రికార్డు చేయడము, నాలుగు భాషలలో హిట్లు కొట్టడము వేరే లెవెల్.

కాన్వాస్ పై ఆయిల్ పెయింటింగునూ, కంప్యూటరులో డిజిటల్ ట్యాబూ, టూల్సు వాడి గీయడము ఒకటి కాదు కదా.

ఇళయరాజా సంగీతము వలన ఊరు పేరులేని హీరోలు, కొత్త దర్షకులతోనూ (మురళీ, కార్తీక్, మోహన్) తీనిన సినిమాలు హిట్ అయ్యాయి. సినిమాలు ఫ్లాపు అయ్యినా పాటు హిట్ అయ్యినవి చాలా ఉన్నాయి. ఆయన సంగీతము వలన పెద్ద హీరోల సినిమాలు (చిరంజీవి, కమల్, రజినీ) ఇంకోంత సూపర్ హిట్ అవ్వడానికి దోహదం చేశాయి. ఈ విషయములో రహమన్ కొంత వెనకబడ్డాడనే చెప్పచ్చు. ఆడియో హిట్ అయ్యిన సినిమాలు ఎక్కువశాతం మణిరత్నం, శంకర్, వర్మ, సుభాష్ ఘై వంటి పెద్ద దర్శకులతోనే. కేవలం తన ఆడియో వలన సినిమా హిట్ అయ్యినవి తక్కువే.

ఇళయరాజా కంపోజిషను శైలి -

https://www.youtube.com/watch?v=EMTI4FpjZa8&list=WL&index=27

రహమన్ కంపోజిషను శైలి -

https://www.youtube.com/watch?v=aL1zz-zGw1A&list=WL&index=28

చివరిగా ఈ క్రింది వీడియోలు చూడండి - ఇలాంటివి ఇళయరాజా తప్ప వేరేవరూ చేయలేరు.

విచిత్రసోదరులు సినిమాలో రాజా చెయ్యివేస్తే పాట - ముందు ఒక తమిళ డైలాగులకు డప్పు రిథమ్, ఆ తర్వత పాట మొదలవ్వగానే డ్రమ్స్ రిథమ్ -

https://youtu.be/cwh25b2WG-o

వాయిద్యాల హార్మనీ ఎందుకు ముఖ్యము -

https://youtu.be/38grie58lEo

ఆదిత్య 369లో సురమోదము పాటలో శాస్త్రీయ నృత్యమునుండి రాక్ ఎన్ రోల్ కు సీమ్లెస్గా తీసుకువెళతాడు -

https://www.youtube.com/watch?v=dDOCDj8xbUw

కౌంటరు పాయింటు -

https://www.youtube.com/watch?v=iZqWFe1-kqo

26, జూన్ 2022, ఆదివారం

సంగీతములో కౌంటరుపాయింట్, ఇళయరాజా

 ఒకటి కన్నా ఎక్కువ స్వరాలు (నోట్లు) కలిపి వినిస్తే హార్మనీ అంటారు. ఆంటే స్వరాలు పరస్పరం సామరస్యములో ఉండాలి. లేకపోతే కాకిగోల లాగా అ(వి)నిపించచ్చు.

మనం మెలడీ అంటే శ్రావ్యమైన సంగీతము అనే అర్థములో వాడతాము. పాశ్చాత్య సంగీతము ప్రకారము కొన్ని నోట్లు కలిపితే ఒక మెలడీ. పాశ్చాత్య సంగీతములో స్ట్రింగ్స్ (వయోలిన్, సెల్లో) ఒక మెలడీ వాయిస్తే, విండ్ వాయిద్యాలు (ట్రంపెట్, బ్రాస్) ఇంకో మెలడీ, గిటార్, కీబోర్డు వాయిద్యాలవారు వారి మెలడీ వాయిస్తారు.

పెర్కూషన్ వాయిద్యాలు (డ్రమ్స్), బేస్ గిటారు రిథమ్ ను ఇస్తాయి.

హార్మనీ, మెలడీ, రిథమ్ పాశ్చాత్య సంగీతములో ముఖ్య పాత్ర వహిస్తాయి.

ఇపుడు కౌంటరు పాయింట్ అంటే ఒకటి కన్నా వేరు వేరు మెలడీలు కలిపి వాయించడం - ఆ మెలడీలు విడివిడిగా విన్నా బాగుండాలి - అక్కడే హార్మనీకు మెలడీకు తేడా.

ఇలాంటి సంగీతాంశాలు పేరాలు వ్రాసేకన్నా ఆడియో - వీడియోలు రూపములో చెప్పడము తేలిక, క్రింద వీడియోలు చూడండి.

సాధారణముగా పాశ్చాత్య సంగీతములో కౌంటరుపాయింటుకు గిటారు - వోకల్ / కోరస్, పియానో - గిటారు, గిటారు - స్ట్రింగ్స్, వాయిస్తారు.

1960ల వరకు తెలుగు పాటలలో ఆర్కెస్ట్రైజేషను మోనోగా ఉండేది - వీణ, సితారు, పియానో లాంటివి నోట్లు వాయిస్తుంటే వెనక రిథమ్ కు తబలా లేదా మృదంగం. 70లలో విశ్వనాధన్ లాంటివారు వెస్ట్రన్ సంగీతము తెచ్చినా నోట్లకు గిటారు, వెనక రిథమ్ కు పెర్కూషన్, డ్రమ్స్ తెచ్చినా మెలడీలు మోనోనే - అంటే ముందర పియానో కొన్ని స్వరాలు, తరవాత గిటారు కొన్ని స్వరాలు ఆలా.

ఇళయరాజా వచ్చి ఇలా వేరు వేరు మెలడీలు కలిపి వినిపించడము మొదలుపెట్టాడు. అప్పుడే కౌంటరుపాయింటును ప్రవేశపెట్టాడు. ఇళయరాజా గొప్పతనమేంటంటే కౌంటరుపాయింటుకు ఎలాంటి వాయిద్యాలు వాడాలి అని - రెండు గిటార్లు (అకౌస్టిక్, బేస్), వయోలిన్ - వయోలిన్, గిటారు - ఫ్లూట్, గిటారు - శాక్సో - కోరస్ - ఇలా చాలా కాంబినేషన్లు సినిమాలో ఎలాంటి సిట్యుయేషనుకు వాడాలి అన్నది బాగా తెలుసు.

రహమాన్ కూడా కౌంటరుపాయింటు బాగా వాడతా‌డు - కాకపోతే సింథసైజర్, కీబోర్డు ఎక్కువ ఉంటాయి. ఇళయరాజా 1995 తర్వాత చేసిన పాటలు కూడా (టైం, నిను చూడక నేనుండలేను కాలం నుండి) కొంత ఇలాగే ఉండి అంత ప్రాచుర్యం పొందలేదు. ఇవి తక్కువ వాడిన అంతఃపురము, పితామగన్, లాంటివే హిట్ అయ్యినాయి.

నేను ఒక సంగీత అభిమానినే గానీ నిపుణుడను కాదు. పైన సమాధానములో తప్పులుండచ్చు. క్రింది వీడియోలు, బ్లాగులు చూడండి.

కౌంటరుపాయింటుకు సింపుల్ నిర్వచనము పియానోపై -



ఇళయరాజా కౌంటరుపాయింటును వివరిస్తున్నాడు - 1.45 నుంచి



ఇళయరాజా పాటలలో కౌంటరుపాయింటు - అభిమాని వీడియో



ఒక అభిమాని బ్లాగులో -

http://geniusraja.blogspot.com/2008/08/counterpoint-with-guitar.html


13, జూన్ 2022, సోమవారం

రైటర్ (2022) సినిమా - అజండా

నిన్న రైటర్ తమిళ డబ్బింగు సినిమా చూశాను. ఫేస్బుక్లో చాలా మంది పొగిడినట్లే మొదటి పది పదిహేను నిమిషాలు నచ్చింది - కింది స్థాయి పోలీసుల కష్టాలు, వారికి యూనియను ఉండడము కోసము ప్రధాన పాత్రధారి రైటరు / హెడ్ కానిస్టేబుల్ సముద్రఖని ప్రయత్నాలు - బాగుంది.

ఆ తర్వాత తిరుచ్చికి బదిలీ అయ్యాక అనుకోకుండా ఒక పీ హెచ్డీ విద్యార్థిని అక్కడి డీసీపీ స్థాయి అధికారి ఒక కేసులో ఇరికించడం, తనకు తెలీకుండా ఈ సముద్రఖని అందులో పాత్రధారి కావడము వరకు బాగుంది. ఇదేదో విశారణై లాగా, అంకురంలాగా ఒక సామాన్యుడి గురించి అనుకున్నా.

ఆ విద్యార్థిని కన్వర్టెడ్ గా, తన ఊరిలో వివక్ష అనుభవించినట్టు చూపించడము, కొన్ని సంభాషణలు కూడా ఓకే - ఇంకా అక్కడక్క‌డ ఊళ్ళల్లో పోలేదు కదా.

మొదటిసారి ఆ విద్యార్థి గదిలో కేసులో ఇరికించడానికి నక్సల్ సాహిత్యం, సింబల్స్ పెట్టినపుడు సందేహము కలిగింది. తమిళనాడులో నక్సలిజం నాకు తెలిసీ ఒక్క కర్ణాటక-కేరళ-తమిళనాడు సరిహద్దులలో తప్ప మిగతా చోట్ల అంత ప్రభావవంతముగా లేదు, అందులోనూ 2021లో. తిరుచిరాపల్లిలో నాకు తెలిసీ అసలే లేదు.

ఉత్తరాన్నించి వచ్చిన ఐపీఎస్ గా (కోపము వచ్చినపుడు హిందీలో మాట్లాడుతాడు) చూపించిన డీసీపీ పేరు త్రివేది శర్మ అని పెట్టారు. త్రివేది, శర్మ రెండూ విడిగా ఇంటిపేర్లు కానీ, రెండు కలిపి ఎవరూ పెట్టుకోరు. ఆ పోలీసు స్టేషను ఎస్సై పేరు పెరుమాళ్ (అగ్ర కులం) - ఎప్పుడూ గుళ్లు తిరుగుతున్నట్టు చూపించారు.

ఇక సముద్రఖని పాత్ర పేరు తంగరాజు నాకు తెలిసి తమిళనాడులో ఆధిపత్య కులాలు పెట్టుకునే పేరు కాదు. ఆ విద్యార్థికి ఆర్టీఐ కు సాయంచేసిన పాత్ర పేరు అన్వరు.

//స్పాయిలరు ఎలర్టు //

ఆ అమ్మాయి చచ్చిపోవడానికి కారణము ఆ డీసీ శర్మకు తక్కువ కులమైన ఆ అమ్మాయి గుర్రపు స్వారీ చెేయడము ఇష్టము లేకపోవడం అని చూపిస్తారు. అలాంటి ఉక్రోషము రాజపుత్లకు, క్షత్రియులకు ఉంటుంది కానీ బ్రాహ్మిణ్ కు ఎందుకుంటుంది?

ఒక నిస్సహాయ పోలీసు ఎంకటస్వామి కథ, లేదా ఒక అంకురం లాంటి కథ కాస్త చూస్తున్న కొద్దీ అలా కులవివక్ష అజండా సినిమాగా కనిపించసాగింది.

చివరి పేర్లలో (ఎండ్ క్రెడిట్స్) బైబిలోగ్రఫీ అని ’రామచంద్రన్ నాయర్’ అని పేరు వేశారు. నిర్మాత పా.రంజిత్ అని కనిపించింది. వెంటనే సినిమా మొత్తము చాలా డాట్లు కనెక్టు అయ్యాయి.

రామచంద్రన్ నాయర్’ పేరు గూగుల్లో వెతికాను. ఎపుడో 1970లలో కేరళలో వర్ఘీసు అనే నక్సలైటును రామచంద్రన్ నాయరు అనే హెడ్ కానిస్టేబుల్ పై అధికారి బలవంతముపై కాల్చిన సంఘటనను 2022లోకి తెచ్చి, వారికి కావల్సిన అజండా కలిపి, అసలు టాపికు అయిన పోలీసు యూనియనును ముందర ఒక పది నిమిషాలు, చివరన ఒక పది నిమిషాలు కలివి వార్చిన పా.రంజిత్ కళాఖండము. ఇది అంతకు ముందు కమల్ తెలివిగా కమర్షియల్ సినిమాల్లో ఇరికిస్తే గత పదేళ్ల్ఘుగా డైరెక్టుగా తమిళ సినిమాల్లో వస్తుంది.

మనకు తెలీకపోతే అద్భుతమైన సినిమా అనుకుని అందులో మునిగిపోతాము. నాని కొత్త సినిమాలు కూడా అతనికి తెలిసో తెలీకో ఇదే దారిలో వెళ్లుతున్నాయి.

పైది నా వ్యక్తిగత పరిశీలన, అభిప్రాయము. మీకు నచ్చకపోతే ఇగ్నోరు చేసి తరువాతి పోస్టుకు వెళ్ళవచ్చును. నా అభిప్రాయము తప్పైతే ఎందుకో ఒక్కటే వ్యాఖ్య పెట్టి వెళ్ళవచ్చును. కానీ నానుండి రిప్లై ఆశించద్దు. నేను నా సమయాన్ని ఎటువంటి డిబేటుకు వృధాచేయను.

 https://www.hindustantimes.com/india/ex-police-chief-sentenced-for-40-yr-old-naxal-murder-case/story-ucSXAKRNpfzyR20nj2FsZO.html

23, ఏప్రిల్ 2022, శనివారం

జానకి గానములో విశిష్టత

నాకు ఇష్టమైన గాయని ఎస్. జానకి గారు. జానకిగారిలాగా రాగయుక్తంగా, సంగతులతో, సంగీతపరంగా తప్పులు లేకుండా, శ్రావ్యంగా, మధురంగా పాడేవారు, కొన్ని విషయాలలో ఆవిడ కన్నా మెరుగ్గా ఉన్న గాయనీగాయకులు ఉండచ్చు, ఉన్నారు కూడాను.

కానీ కొన్ని విషయాలలో ఆవిడ వైవిధ్యత, విశిష్టత కనపడతాయి - తోటి గాయకులు, సంగీత దర్శకులు గుర్తించారు, మనమూ గమనించవచ్చు. అవి:

  • వివిధ వయసువారికి గొంతు మార్చి పాడడం , పిల్లల పాటలు ఎక్కువమందికి తెలిసిందే.
  • హావభావాలు (expressions) - ఒక పాట చిత్రీకరణ జరగడానికి ముందే ఆ పాటలో నటీనటుల హావభావాలు వీరు పలికించాలి.

ఈ కింది శ్రీవారి శోభనం చిత్రం పాటలో - పెళ్ళి చూపులకి వచ్చిన నాయకుడికి (నరేశ్) కోపం తెప్పించిన నాయకి (అనిత) నాయనమ్మ వంకతో అతనిని తప్పు కాయమంటూ, మన్నించమంటూ, మధ్యలో ముసిముసి నవ్వులతో, కొంచెం బెట్టుతో పాట. చెవులు మూసుకుని విన్నా ఈ ఎక్స్ప్రెషన్లన్నీ మనకు వినిపిస్తాయి. వేరే ఏ గాయనీ ఈ పాటను ఇలా పాడలేరు.

https://www.youtube.com/watch?v=IDKwGCeaDr8

ఇలాంటి సిట్యుయేషన్ మం త్రిగారి వియ్యంకుడు సినిమాలోనూ ఉందీ (1–40 గమనించండి) -

https://www.youtube.com/watch?v=MCkmrnrzIQk

  • ఒక విధమైన ఆక్రోశం, ఆవేదన నిండిన పాటలు - సితారలో వెన్నెల్లో గోదారి అందం, ప్రతిఘటనలో ఈ దుర్యోధన దుశ్సాసన, ఆలాపనలో ఆవేదనంతా, రేపటి పౌరులులో టైటిల్ సాంగ్, అంతఃపురంలో సూరీడు పువ్వా, మౌన పోరాటం
 
https://www.youtube.com/watch?v=Lrxx-Lqjmjs

  • పాటలో ఎంత పొడవున్న బిట్ అయినా ఒకే దమ్ములో మధ్యన మనకు ఊపిర్లు వినపడకుండా బిగి సడలకుండా పాడి ఒక ఫీల్ తేవడం. ఆటో ట్యూనింగుతో బిట్లు బిట్లుగా పాడుతున్న ఈ రోజుల్లో శృతి, సంగతులు తప్పకుండా అలా పాడడం ఆ రోజుల్లో కన్సిస్టంటుగా చేసింది జానకిగారే. మీరు కొన్ని చిత్రగారి పాటలు ఇయరుఫోన్లతో వింటే ఊపిరి వినిపిస్తుంది.

జగదేకవీరుడు అతిలోకసుందరిలో యమహోని యమా యమా పాట చరణాలు,

పైన ఉదహరించిన వెన్నెల్లో గోదారి, అమ్మ కదే, సితారలో జిలిబిలి పలుకుల చరణాలు

https://youtu.be/q3GUz_RHqHM?t=138

https://youtu.be/cPgSbfzgLrE?t=214

ఆలాపన, హమ్మింగు, నవ్వులు - సామాన్యులు పాటలో అక్కడక్కడ ఇవ్వగలరేమోగానీ పాట బాణీకు, శ్రతి తగ్గట్టు, టైమింగుతో నవ్వడం లైవ్ రికార్డింగుల్లో, ఆటో ట్యూను లేని రోజుల్లో చాలా క్లిష్టమైన పని - చాలా తేలికగా చేశారు ఆవిడ.

అభిలాషలో నవ్వింది మల్లెచెండు, జ్యోతిలో సిరిమల్లే పువ్వల్లే నవ్వు, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, మహర్షిలో సుమం ప్రతిసుమం, ఆలాపనలో ప్రియతమా తమా, శివలో సరసాలు చాలు, అభినందనలో రంగులలో కలవో. పూర్తి చిట్టా - http://www.sjanaki.net/balu-sings-janaki-hums

https://www.youtube.com/watch?v=6bGOWqQOycM

 

5, ఫిబ్రవరి 2022, శనివారం

దర్శకుడు వంశీ పాటల విలక్షణత

నాకేగాదు, దర్శకుడు వంశీగారి పాటలంటే చాలామంది ప్రేక్షకులకు విభిన్నముగా, ఆకర్షణీయముగా, తమాషాగా, విలక్షణముగా అ(క)నిపిస్తాయి.

ముందుగా అలా అనిపించే తేడాలు -

  1. హీరో, హీరోయిన్లు ఎపుడూ పరిగెడుతుంటారు (గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, సితార, అన్వేషణ, మహర్షి)
  2. కట్లు/షాట్లు ఎక్కుువుంటాయి - చిత్రము నిలకడగా ఉండదు.
  3. తమాషా మేకప్, కాస్ట్యూమ్లు - నల్ల బొట్టు (ఔను వాళ్ళిద్దరూ.., ప్రేమించు పెళ్ళాడు, గోపి గోపిక గోదావరి), స్టిక్కర్లూ (చెట్టు కింద ప్లీడరు), సెట్లు/ప్రాప్స్, - మహర్షి అనుమానాస్పదం
  4. ట్రాలీ, క్రేను షాట్లు

ఇందులో 1,2 – వంశీగారితో మొదలవలేదు. వారి గురువు భారతీరాజా తీసిన పాటలలో (ఉదా సీతాకోకచిలక, ఆరాధన (తమిళ్ మాతృక భారతీరాజా)) గమనించవచ్చును. గురువుగారి ప్రభావము కచ్చితముగా ఉన్నది.

3 – రాఘవేంద్రరావుగారు సెట్లు/ప్రాప్స్ తో ఇంకా ఎక్కువగానే ప్రయోగాలు చేశారని తెలిసిందేగా - ఫ్యాన్లు, టీవీలు, బిందెలు, పళ్ళు, పూలు.

4 – జంధ్యాల కూడా ట్రాలీ, క్రేను షాట్లను బాగా వాడారు.

మరి వంశీ పాటలు ఎందుకు విభిన్నముగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి!

  • హీరో, హీరోయిన్లు ఊరికే పరిగెట్టరు - బాణీ రిథమ్‌కు తగ్గట్టు పరిగెడుతుంటారు. అందులోనూ ఇళయరాజాని అడిగి అలాంటి బాణీలు చేయించుకున్నారు.
  • కట్లు/షాట్లు కూడా బాణీకి తగ్గట్టు ఉంటాయి. ఉదాహరణకు అన్వేషణ లో కీరవాణి పాట, ముఖ్యముగా చరణాలలో చూడండి. పాటలో ప్రతి లైను - పదముకు ఒక షాటు ఉంటుంది.
  • మేకప్, కాస్ట్యూమ్లు కేవలము వ్యానిటీ అనే గాకుండ, ఒక సృజనాత్సకత, ఒక టేస్టు ఉంటాయి. ఉదాహరణకు, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు లో హీరోయునుకు నలుపు, హీరోకు తెలుపు ఇష్టము, ఇంటి సెట్ నలుపు-తెలుపులో సెట్ చేశారు, ఏకముగా ఒక పాటే ఉంటుంది దీనిపై.
  • ట్రాలీ, క్రేను షాట్లు ఏదో హడావిడికి ఉండవు. ట్రాలీ క్రేనూ ట్యూనుకు తగ్గట్టు కదులుతాయి - పైన చెప్పిన కీరవాణి పాట, ఇంకా చాలా వంశీ పాటలలో గమనించవచ్చును. ఇవి కాకుండా ఆయన తను అనుకున్న షాటుకోసం ఎంతకైనా ప్రయత్నం చేస్తారు. ఆయన వ్రాస్తున్న ’ఏవో కొన్ని గుర్తుకోస్తున్నాయి’ సిరీసులో కొన్ని చెప్పారు - సితార కుకుకూ పాటలో కోటపైన స్థలంలో ఎంత ట్రాలీ పడుతుందీ, దాని విడి భాగాలు కింద నుంచి పైకి ఎలా తీసుకువెళ్ళాలి చెప్పారు. అలాగే అన్వేషణ లో ఎదలో లయ పాటలో ఎక్కడో అ‌డవి మధ్యన ఉయ్యాల – ఇలా.. ఇంకా చెప్పాలంటే వంశీ కెమెరాతోనూ కొరియోగ్రఫీ చేయిస్తారు.
  • చివరిగా ఒక రచయితగా, ఎన్నో ప్రపంచ సినిమాలతో ఇన్స్పైరు అయ్యి ఉండడము చేత ఆయన ప్రతి పాట చాలా క్రియేటివుగా ఆలోచించి పెట్టుకుంటారు. చాలా ప్లాన్టుగా ఉంటారు. ఏ బిట్టుకు ఎన్ని షాట్లు అన్నది ఆయనకు ఊహ ఉంటుందనుకుంటాను. ఉదాహరణకు శ్రీ కనకమహాలక్ష్మీ రికార్జింగు డ్యాన్సు ట్రూప్ లో తెలిసిందిలే పాట గంటలో తీశారు.

ఇపుడు ఇలాంటి పాటలు ఎవరూ ఎందుకు అనుసరించడంలేదు?

  • ఇళయరాజాలాగా అలాంటి రిథమిక్ పాటలు ఇచ్చే సంగీత దర్శకులు లేరు. కీరవాణి వైప్ ఆఫ్ వి వరప్రాసాద్ లో , చక్రి కొన్ని సినిమాలలో ప్రయత్లించినా పూర్తిగా ఆకట్టుకోలేకపోయారు.
  • ఆ కాలానికి (80లు) విభిన్న కాస్ట్యూమ్లు వెరైటీగా ఉన్నా 90ల జోకరు, వైప్ ఆఫ్ వి వరప్రాసాద్ సమయానికే ట్రెం‌డు మారింది. అతిగా, ఎబ్బెట్టుగా అనిపించకుండా తీయడము కొంత కష్టమే. నాస్టాల్జియాగా బాగుంటాయిగానీ ఇపుడు 70 ఫ్యాషను ఎవరన్నా వేస్తే చూడగలమా.
  • ట్రాలీ, క్రేను షాట్లు కూడా 80లలో నావెల్టీగానీ, 2000లలో స్టడీక్యాములూ, ఇంకా అడ్వాన్స్డ్ చూశాక కొంత విసుగు వస్తుంది. నాకు గోపి-గోపిక-గోదావరి, అనుమానాస్పదం టైముకే విసుగనిపించింది, సరదాగా కాసేపు సినిమాలో చిరాకెత్తింది. ఎం.వి. రఘు లాగా ట్యాలెంటూ, ఓపిక ఉన్న కెమెరామ్యాన్లు ఇప్పుడు లేరు.
  • కట్లు/షాట్లు కూడా - 80ల పార్కు పాటలలో లైనుకు ఒక స్టెప్పు ఉన్నరోజులలో వెరైటీ. డిస్కో, బ్రేక్, పబ్ పాటలొచ్చాక స్పీడ్ కట్స్ కామన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ 2010 తర్వాత వస్తున్న సినిమాలలో ఈ స్పీడ్ కట్ ఎడిటింగు 2 గంటల సినిమా అంతటా ఉండి, కళ్ళు ఊరికే అలసిపోతున్నాయు. అనిల్ మల్నాడ్ లాంటి ఎడిటర్లు లేరు.

వంశీ పాటలకు ఇళయరాజా, ఎం.వి. రఘు, అనిల్ మల్నాడ్ లాంటి టీం కంట్రిబ్యూషను మర్చిపోకూడదు.

అసలూ ఎవరూ అనుసరించలేదా అంటే, ఆయన వంశీ శైలి అనుసరించలేదుగానీ వెరైటీగా తీయాలని తపించి ప్రయత్నించిన వ్యక్తి - రవిబాబు - ఆయన సినిమాలూ, పాటలూ ఒక టోను, ఒక కాన్సెప్టులో ఉంటాయి. బాణీలు విభిన్నముగా ఉంటాయి. ఉదాహరణకు అల్లరి, అమ్మాయిలు-అబ్బాయిలు, నువ్విలా, మనసారా, పార్టీ పాటలు చూడవచ్చును - విభిన్నముగా ఉంటాయి. ఈ పార్టీ సినిమాలో బట్టలు చూడండీ - సాఫ్టువేరు ఇంజనీర్లు ఎక్కడన్నా వేసుకుంటారా ఇలాంటి సూట్లు?

వంశీ గారి రాతల్లో -

కిన్నెరసాని వచ్చిందమ్మా పాట -

ఆ తర్వాతరోజునించీ ‘‘కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ’’ అంటా ఈ జాతరలో కలతిరిగిన రాజు, కోకిలా ఆ గోదారి వెన్నెల్లో పాడుకునే పాట. ఈ పాటని నిజంగా కిన్నెరసాని వాగు దగ్గర తీద్దామని చాలా అనిపించింది గానీ, ఆ వాగు మా రాజమండ్రి క్యాంప్‍కి చాలా దూరంగా ఎక్కడో కొత్తగూడెం దగ్గరుంది. ఎక్కడున్నా గోదావరి గోదావరే గదా అని సర్దేసుకుని షూట్‍ మొదలెట్టేసేం. ఇది కూడా రఘుకి పేరుతెచ్చిపెట్టే డే ఫర్‍ నైట్‍ సాంగే.

కుకుకూ పాట -

ఊరికి చివరున్న ఒక బిల్డింగ్‌ వెనక క్రికెట్‌ పిచ్‌ చాలా బాగా మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారని తెలీడంతో ‘‘ఎలాగా వచ్చాంగదా దాన్నికూడా చూసిపోదాం’’ అనుకుంటా బయల్దేరాం అక్కడికి. ఆ పిచ్‌ ఉండే ప్లేస్‌ తాలూకు ఎంట్రీ, కోటలాగ బాగుంది.

డోర్‌ తెరుచుకుని లోపలికెళ్తే ఒక పిచ్‌ తప్ప ఇంకేం లేదు. ముందున్న ఉడెన్‌ స్పైరల్‌ స్టైర్‌కేస్‌మీంచి పైకెక్కితే నాలుగుపక్కలా బురుజులు.

కుకుకూ పాటలో కొన్ని షాట్స్‌ ఇక్కడ తియ్యొచ్చు అనిపించి రఘుకి చెప్పాకా, నాతోపాటు తెచ్చుకున్న మినీ టేప్‌రికార్డర్లో కుకుకూ పాట వింటుంటే దాంట్లో ఒక షాట్‌ అనిపించి రఘుకి చెప్పేను.

‘‘దీనికి రౌండ్‌ ట్రాలీ కావాలి గదా?’’ అని రఘు అంటే విన్న తరణి డిస్కషన్లోకి దిగి ఎందుకన్నా మంచిదని రౌండ్‌ ట్రాలీ ఆ బురుజుల మధ్య పట్టేలా కొలతలు తీసుకున్నాడు.

ఈ బిల్డింగ్‌ బయట సినిమాలో కోట ఎక్స్‌టీరియర్‌ అనుకుందాం. మరి ఇంటీరియర్‌

కోట బయట తియ్యాల్సిన కుకుక్కూ సాంగ్‍లో తియ్యాల్సిన ముఖ్యమైన షాట్‍కోసం చేయించిన రౌండ్‍ ట్రాలీని పైకి తీసుకెళ్ళి బురుజుల మధ్యలో మౌంట్‍ చేస్తుంటే చూస్తున్న తరణి ‘‘బాగుంది. ఎక్కడ చేయించారు?’’ అన్నాడు.

2

‘‘భరణీ స్టూడియో ముందున్న వర్క్ షాపులో’’ అన్నారు నాగేశ్వర్రావుగారు.

‘‘ఎంతైందీ?’’

‘‘ఏడువేల ఐదొందలు.’’

‘‘చేసిన మనిషి నటరాజన్‍ కదూ? నాకు తెలుసతను’’ అంటా చెక్క మెట్లు దిగెళ్ళిపోయేడు.

ఇళయరాజాగారు చేసిన ఆ అద్భుతమైన ఆ ప్రేమగీతంలో షాట్స్ తియ్యడం పూర్తయ్యేటప్పటికి సాయంత్రమయ్యింది.

ఎదలో లయ పాట -

ఈ కామెడీ షోని చాలా సీరియస్‍గా చెపుతుంటే విన్న నేను ‘‘మీదీవూరేనా సుబ్రమణ్యం?’’ అన్నాను.

‘‘ఔనండీ. ఏంటి సంగతీ?’’

‘‘అసలు తలకోన అన్న పేరెలాగొచ్చిందీ అడవికీ?’’

‘‘అడవి నడిమధ్యలో చాలా ఎత్తైన కొండ ఉంటది. అది శివుడుండే చోటంట. దాని మీదనించెప్పుడూ నీళ్ళు కారతా ఉంటాయి. దాని పేరే తలకోన. ఇన్నాళ్ళనించి షూటింగ్‍ చేస్తా అక్కడికెళ్ళకపోడం ఏంటి మీరు?’’ అన్నాడు.

‘‘చాలా దూరమంటగదా సుబ్రమణ్యం?’’

‘‘మరీ అంత దూరమేం కాదుగాని, అడవిలో నడిచెళ్ళాలి. కానీ చీకటిపడక ముందే వచ్చెయ్యండి అడవిలో పులి తిరుగుతుంది గదా .’’

ఎదలో లయ పాట బిగినింగ్ అక్కడ తీద్దామని నడిచి బయల్దేరామా మర్నాడు.

కొండలూ, గుట్టలూ కటిక చీకటిగా ఉన్న పొదలూ దాటుతున్నాం.

అలా నానా అవస్థలూ పడతా లేస్తా వెళ్ళిన మేం ఆ తలకోనని చూసేక అన్నీ మరిచిపోయేం. సాక్షాత్తూ శివుడి శిరస్సుమీంచి జారుతున్నట్టే ఉన్న జలాన్ని చూస్తా రఘుని పిల్చి అక్కడున్న చాలా ఎత్తైన చెట్టు చూపించి ‘‘దాని చివరి కొమ్మమీదికెక్కగలవా?’’ అన్నాను.

తల పైకెత్తి చూస్తా వుండిపోయిన రఘూ ‘‘ట్రై చేద్దాం’’ అంటా కెమెరా వాళ్ళని పిలుస్తుంటే సెట్‍బాయ్‍ నగేష్‍ని రమ్మని ఆ పై కొమ్మకి ఉయ్యాల తాళ్ళు కట్టాలి’’ అన్నాను.

సరే సారంటా దురై అనే ఇంకొకడ్ని తోడు తీసుకెళ్ళిన ఆ నగేష్‍ నేచెప్పిన చోట తాళ్ళు కట్టి ఆ ఎత్తైన ఎర్రటి రాళ్ళమధ్యలోంచి వాటి కిందున్న నీళ్ళు కాళ్ళకి తగిలేంత పొడుగ్గా దించి ఉయ్యాల కట్టేక, హీరోయిన్నందులో కూర్చోబెట్టేం. ఈలోగా పై కొమ్మమీది కెక్కేసిన

వైడ్‍ యాంగిల్‍ లెన్స్ వేసి వ్యూ ఫైండర్లోంచి చూస్తే సరసరి లెన్స్ లోంచి కాళ్ళు బయటికొచ్చిన ఎఫెక్ట్. ‘‘ఎదలో లయా ఎగసే లయా’’ అన్న ఆ పాటలో మొట్టమొదటి లైన్‍ తీసి కిందికి దిగేటప్పటికి లంచ్‍ టైమయ్యింది.






 

27, జనవరి 2022, గురువారం

వేటూరి vs సిరివెన్నెల

 ముందుగా షరా - నేను పండితుడను కాదు, పాత పద్యాలు - గద్యమే తప్ప కవితలూ-కవిత్వాలూ అస్సలు చదవను. తరువాత వ్రాయబోయేది కేవలము ఒక సామాన్య వ్యక్తిగా నా గమనికలు.

వేటూరి, సిరివెన్నెల ఇద్దరూ అన్ని రకాల సందర్భాలకూ కొన్ని వేల పాటలు వ్రాశారు. అందులో చాలా అద్భుతమైన పాటలున్నాయి. అవన్నీ ఉటంకించి, విశ్లేషించి పోల్చడము కష్టమే. అందుకని కేవలము వారి శైలిలో ఒక సామాన్య శ్రోతగా/చదువరిగా నాకు అనిపించినది చెప్తాను.

అంతకన్నా ముందు ఒక క్రికెట్ ఉవమానం - వేటూరి సచిన్ టెం‌డూల్కరు అయితే సిరివెన్నెల ద్రవిడ్ అన్నమాట. ఎందుకన్నానో చివరికి చెప్తాను.

  • ప్రేమ పాటలు -

వేటూరిగారు 70లలో లలిత గీతాలు వ్రాశారు. 80లు, 90ల మధ్యన వరకు వ్రాసినవి ప్రాథమికముగా రెండు రకాలు - పార్కులు - సెట్లలో నాయికానాయకులు స్టెప్పులు వేసే వాణిజ్య యుగళగీతాలు లేదా విశ్వనాథ్ - జంధ్యాల వంటి దర్శకుల కోసము భావుకత ఉన్న పాటలు. వేటూరిగారు రెండు రకాలు అలవోకగా వేగముగా బాణీలకు తగ్గట్టు వ్రాసేశారు. 90 ల చివరికి వేగము తగ్గి, శేఖర్ కమ్ముల, గుణశేఖర్ వంటి అభిరుచి, ప్రత్యేకముగా ఆయనే వ్రాయగలరు అన్న కథలు, సందర్భాలకు వ్రాయించుకుంటే వ్రాశారు.

వాణిజ్య గీతాలలో ఆయన వాడని పదాలు, ఉపమానాలు లేవు - ఇంగ్లీషు పదాలు కూడ వాడారు. హీరో, హీరోయిన్ల పేర్లు, రాగాల పేర్లు, దేశాలు, ఊర్లు, తినే పదార్ధాలు - అన్నీ వాడారు. ఇతర గేయరచయితలు భావుకతకు వాడే ప్రకృతి పదాలను - కొండ, కొమ్మ, కోకిల, ఋతువులు, కాలాలు, వాన, జాబిలి, వెన్నెల – ఆయన వాణిజ్య ప్రేమ గీతాలలోనూ ఆశువుగా వాడారు.

మొదటి రకము - కొట్టండి తిట్టండి లవ్వండీ ప్రేమ, నీమీద నాకు ఇదయ్యో, అచ్చా అచ్చా వచ్చా వచ్చా

రెండవ రకము - లిపిలేని కంటి బాస, చైత్రము కుసుమాంజలి, నిరంతరము వసంతములే

సిరివెన్నెలగారు 87-95 మధ్యన కొన్ని వాణిజ్య యుగళగీతాలు వ్రాసినా ఎక్కువగా వేటూరి శైలినే అనుసరించారు. బహుశా దర్శకులు అలా అడిగి వ్రాయించుకునుంటారు. ఉదాహరణకు బొబ్బిలిరాజా, ధర్మక్షేత్రం. 90 లలో కుటుంబ కథా చిత్రాలు (నిన్నే పెళ్ళాడతా, పవిత్ర బంధం), యూత్/కాలేజి ప్రేమ కథా చిత్రాలు (నువ్వే కావాలి, గులాబీ) వంటి చిత్రాల ట్రెండ్ మొదలయ్యాక సిరివెన్నెల తన కంఫర్టు జోనులోని ప్రేమ గీతాలు వ్రాసే అవకాశం వచ్చింది. ఎలాగో రాఘవేంద్రరావు, శరత్ వంటి వారికి కావలసిన వాణిజ్య గీతాలు ఎక్కువ చంద్రబోస్, భువనచంద్రకు వెళ్ళాయి. అంటే వేటూరిగారి స్థానాన్ని సిరివెన్నెల ఒక్కరే భర్తీ చేయలేకపోయారు. వేటూరి ప్రేమ గీతాలలో ప్రకృతి, భావుకత, ఉపమానాలతో ఒక కవిత్వములాగా ఉంటే సిరివెన్నెల పాటలు ఎక్కువగా ఒక అమ్మాయి/అబ్బాయి తన మనసులో భావాలు మాటలు పాటగా ఒక లవ్ లెటర్ వ్రాసుకున్నట్టుగా ఉండేవి - నా, నీ, నువ్వు, నేను, మనసు, చెప్పనా, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, కనులు, గుండె, గాలి, వయసు, మాయ, కల, నిజము లా అప్పటి యూత్ కి సులువైన పదాలు వాడారు. ప్రకృతిని వాడిన పాటలు తక్కువనే చెప్పచ్చు (లేవని అనను - చెప్పవే చిరుగాలి, కొమ్మా కొమ్మా, మావిచిగురు). వేటూరిగారి భావుకత పాట రెండు మూడు సార్లు చదువుకుంటే గానీ లేదా ఎవరన్నా వివరిస్తేగానీ అర్థముగావు.

వేటూరిగారి ఇంకో బలం - గట్టి గుర్తుండిపోయే పల్లవులు. చరణాలలో కొన్నిసార్లు ఇరికించినట్లున్నా మనకు పల్లవి గుర్తుండిపోతుంది.

  • విషాద గీతాలు -

వేటూరి వ్రాసినన్ని వైవిధ్యమైన విషాద గీతాలు సిరివెన్నెల వ్రాయలేదు. సిరివెన్నెల ఎక్కువగా విరహ గీతాలు వ్రాశారు. ఇక్కడ క్లిష్టత విషయములో ప్రేమగీతాలకు రివర్సు. వేటూరిగారి విషాద గీతాలు తేలికగా అర్థమవుతాయి, సిరివెన్నెలవి కొంచెం గాఢముగా ఉంటాయి (శుభలగ్నం పాట). ఇక్కడకూడ వేటూరి ఎక్కువగా ప్రకృతిని వాడారు (పావురానికి పంజరానికి, ఆకాశాన సూర్యుడుండడు, రాలిపోయే పువ్వా)

  • ఆవేశ, ప్రబోధ, మార్గదర్సక, జీవిత సంబంధిత గీతాలు -

సిరివెన్నెలకి ఎక్కువ పేరు తెచ్చినవి, అభిమానులు ముందుగా ఉటంకించేవి ఇలాంటి గీతాలే - గాయం, కళ్ళు, గమ్యం, చక్రం, పవిత్రబంధం మొదలగు చిత్రాలలోని గీతాలు. బహుశా తనలోని మధ్యతరగతి కుటుంబ బ్యాక్ గ్రౌండు , 70-80ల యువత భావజాలం (ఆయన యువకుడిగా ఉన్నకాలం) వలన తనలో ఆ ఆవేశం, ఆవేదన సహజముగా ఉన్నది తనలో తాను రమించి, శ్రమించి కాగితాముపై అక్షరాలుగా మలిచారు.

అదే వేటూరిగారు ఆశువుగా పురాణాలు, చరిత్ర, ప్రకృతి, సమాజమును ఉదహరిస్తూ వ్రాశారు - కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, ఈ దుర్యోధన దుశ్సాసన, చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో

  • ఐటెం పాటలు -

వేటూరి ఐటం/క్లబ్/వ్యాంప్/శృంగార గీతాలు - జానపద, పల్లె, నగర క్లబ్ - ఇలా అన్ని రకాలకు ఎంత మోతాదులో కావలంటే అంత, అవసరమైతే ద్వంద్వార్థాలు వచ్చేటట్టు ఇచ్చారు. సిరివెన్నెల టైంకు వచ్చేసరికి దర్శకులు నిర్మాతలు వేరే రచయితలపై ఎక్కువ ఆధారపడ్డారు. ఐటం సాంగైనా పాటలో ఒక సందర్భమూ, అర్థమూ ఉండాలి అనుకుంటే, అలాగే దర్శకునికి సిరివెన్నెలతో ఒక వేవ్ లెంగ్త్ ఉన్నట్టైతే (ఉదా వర్మ, కృష్ణవంశీ) అప్పుడు సిరివెన్నెలతో వ్రాయించుకున్నారు.


ఇంతవరకు గీతాల గురించి అంటే ఫైనల్ ప్రోడక్టు గురించి మాట్లాడాను. ఇపుడు వారు ఎలా వ్లాస్తారో చూద్దాము -దీనికే పైనచెప్పిన క్రికెట్ ఉపమానము.

సచినుది సహజ ప్రతిభ. ఎలాంటి ఫార్మాటైనా తేలికగా ఆడగలడు. అన్ని రకాల షాట్లు కొట్టగలడు - కొట్టడానికి కష్టపడినట్టు మనకు చూసేవారికి అనిపించదు. ఆతడులో తనికెళ్ళ భరణి డైలాగులా ఒక పద్ధతి ఉంటుంది. ఒకే బంతికి రెండు మూడు రకాలుగా షాట్ కొడతాడు. తోటి క్రీడాకారులకు ఒక ఆరాధన. అందరికీ తెలుసు అతను వారందరికన్నా ఒక మెట్టు ఎక్కువని. జట్టులో సహకారము లభించకున్నాఒంటిచేత్తో లాక్కురాగలడు.

అదే విధముగా వేటూరిగారు అలవోకగా ఆశువుగా వేగముగా పల్లవులు, చరణాలు ఇచ్చేస్తారు. కానీ ఎక్కడా పట్టు తగ్గదు. ఎలాంటి బాణీ ఇచ్చినా వ్రాసేస్తారు. సంగీత దర్సకుడు తనన తననా అన్నా తానానా అన్నా వ్రాసి ఇస్తారు. ఒకే ట్యూనుకు ప్రేమ గీతమూ, విషాద గీతమూ ఇస్తారు. బాణీ సామాన్యమైనదైనా, చిన్న చిత్రాలైనా వేటూరి గారి సాహిత్యముతోనే హిట్టయిన పాటలున్నాయి.

ద్రవిడుది సహజ ప్రతిభ కాదు. కొన్ని వేల గంటలు ప్రాక్టీసు చేశాడు. ఒక ఇన్నింగ్ బిల్డు చేయడానికి శ్రమిస్తాడు. పరిమిత ఓవర్ల ఫార్మాటులో ఆతనికి పరిమితులున్నాయి. స్లాగ్ చేస్తే మనము చూడలేము. కానీ కొన్ని షాట్లు కొటినపుడు (కవర్ డ్రైవ్) అతనంత సొగసుగా ఎవరూ కొట్లలేరు అనిపిస్తుంది. ఎన్ని మ్యాచులు గెలిపించినా సచిను తర్వాతి స్థానమే.

అలాగే సిరివెన్నెల చాలా పాటలకు ఎన్నో రాత్రులు శ్రమించారు. ఎన్నో వర్షన్ను వ్రాసేవారు. కొన్ని రకాల గీతాలు (కమర్షియల్ గీతాలు, ఐటం పాటలు) వ్రాసేటపుడు ఇబ్బంది పడ్డారు. సచిను నీడలో ద్రవిడులాగా ఎన్ని గొప్ప గీతాలు వ్రాసినా 70ల నుంచి సినిమాల పాటలు వినే తరానికి సిరివెన్నెలది వేటూరి తర్వాతి స్థానమే.

7, జనవరి 2022, శుక్రవారం

సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసే ప్రేమ పాటల ప్రత్యేకతలు

సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసే ప్రేమ పాటల ప్రత్యేకతలు-

తెలుగు సినిమాలలో 80లలో ఎక్కువగా కథానాయక ప్రధాన పాటలు వచ్చాయి. ఎక్కువగా పార్కులలో స్టెప్పులేసే సాధారణ డ్యూయట్లే ఉండేవి. కొంతవరకు జంధ్యాల, సింగీతం, బాపు, విశ్వనాథ్, వంశీ చిత్రాల యుగళగీతాలలో కొంత భావుకత ఉండేది. ఆ రెండు రకాలూ వేటూరి అలవోకగా రాసిచ్చేసేవారు. మొదటి రకము ఏదోక పదాలు ఇరికించేసేవారు, రెండో రకములో భావుకత ఎక్కువుండేది - లోతైన భావనలు చెప్పేవారు.

మొదటి రకము - కొట్టండి తిట్టండి లవ్వండీ ప్రేమ, నీమీద నాకు ఇదయ్యో, అచ్చా అచ్చా వచ్చా వచ్చా

రెండవ రకము - లిపిలేని కంటి బాస, చైత్రము కుసుమాంజలి, నిరంతరము వసంతములే

90 దశకము మొదటి సగము ఎక్కువగా కుటుంబ కథాచిత్రాలు ఉండేవి.

పెద్ద హీరోల ప్రేమ చిత్రాలూ 95 తర్వాతే మొదలయ్యాయి - నిన్నే పెళ్ళాడతా, ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, ఇలా

చిన్న హీరోల ప్రేమ కథా చిత్రాల ట్రెండూ అప్పుడే మొదలైంది.

ఈ ఉపోద్ఘాతమంతా, అదే సోదంతా ఎందుకంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ప్రేమపాటల స్రవంతీ అప్పటినుంచే మొదలైంది. ప్రేమను ఎన్ని రకాలుగా చెప్పచ్చే అన్ని రకాలుగా చెప్పేశారు.

దానికి తోడు అభిరుచి ఉన్న వర్మ, కృష్ణవంశీ, వీ ఎన్ ఆదిత్య, దశరథ్, స్రవంతి రవికిశోర్, విజయభాస్కర్, త్రివిక్రం వంటి దర్శక నిర్మాతలు వ్రాయించుకోవడంతో మంచి ప్రేమ పాటలు వచ్చాయి.

ఈ పాటలలో సిరివెన్నెలగారి ప్రత్యేకత ఏమిటంటే చిన్న చిన్న సరళమైన పదాలు వాడేవారు. వచన కవితలాగా ఉండేవి. కాలేజి యువత పాడుకోవడానికి సులువుగా ఉండేవి. అదే వేటూరిగారి పాటలలో భావుకత ఎక్కువ - ఆ కవిత్వము స్థాయి ఎక్కువ. ప్రతి పంక్తి రెండు మూడుసార్లు అర్థము చేసుకోవాలి. సిరివెన్నెలగారి పాటలు 80లలో అలాంటి శైలే ఉన్నా గులాబీ - మనసంతా నువ్వే - నువ్వేకావాలి తరానికి తగ్గట్టు శైలిని మార్చుకున్నారు -

నా, నీ, నువ్వు, నేను, మనసు, చెప్పనా, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, కనులు, గుండె, గాలి, వయసు, మాయ, కల, నిజము లా అప్పటి యూత్ కి సులువైన పదాలు వాడి ఎన్నో పాటలు వ్రాశారు - కానీ బోరు కొట్టకుండా వైవిధ్యముగా ఉండేలా చూసుకున్నారు.

  • ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు
  • నా మనసుకేమయ్యిందీ నీ మాయలో పడింది
  • నువ్వేం మాయ చేశావో
  • కనులు మూసినా కనులు తెరిచినా కలలు ఆగవేలా
  • నీ నవ్వు చెప్పింది నాతొ నేనెవ్వరో ఏమిటో
  • గుండె నిండా గుడిగంటలూ
  • ఉన్నమాట చెప్పనీవు
  • చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.
  • గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
  • చెప్పవే చిరుగాలి, చల్లగా ఎదగిల్లీ

అలాగే చంద్రబోసు, అనంత శ్రీరాంలా ఉపమాలంకారములు ఎక్కువ వాడలేదు.

5, జనవరి 2022, బుధవారం

2021పుస్తక ప్రదర్శన

2021డిసెంబరు హైదరాబాదు పుస్తక ప్రదర్శనకు  మొదటి రోజే వెళ్ళాము - ఖాళీగా ఉన్నది. తీరికగా అన్ని స్టాల్సు కొవిడ్ భయం లేకుండా, ఒక్కో ర్యాక్ చూసుకుంటూ వెళ్ళాము.

వెళ్ళాము అని అన్నిసార్లు ఎందుకన్నానంటే ఈ సారి ముఖ్యోద్దేశం మూడవ తరగతి చదువుతున్న మా పాపకు పరిచయం చేయడం కోసం. తనూ కాళ్ళు నొప్పులు అనకుండా నాతో గంట పైన తిరగడం, సొంతముగా కొన్ని పుస్తకాలు తిరగేసి ఎంపిక చేసుకోవడం సంతృప్తినిచ్చినది.

ఒకటవ తరగతి చివర నుండి ఇప్పుడు మూడవ తరగతి చివరి దాకా దాదాపు రెండేళ్ళు ఇంట్లోనే ఆన్లైను చదువులు కావడముతో అయితే క్లాసులు, లేదా పార్కుకు పోయి ఆడుకోవడము, మిగిలిన సమయము టీవీ. ఇంకా టైం మిగిలితే రంగులు వేసుకుంటుంది. ఈనాడు ఆదివారం అనుబంధంలో పజిల్స్ చేయించేవాడిని కానీ ఒక రెండు నెలల తరవాత తనకు బోరు కొట్టేసింది - అవే ప్యాటర్ను కదా. కూర్చోపెట్టించి కథల పుస్తకాలు చదివించడము మాకూ కష్టముగా ఉండేది. ఇంకో ఛాలెంజ్ సూపర్ మార్కెట్లలో మంచి కథల పుస్తకాలు లేకపోవడమూ, ఉన్నా ₹150 పెడితే ఆ పుస్తకములో గట్టిగా 10 కథలూ ఉండకపోవడమూ.

పుస్తక ప్రదర్శన ఈ సమస్యలన్నీ తీర్చినది -

  • పాప వెతికి తనకు నచ్చినవి కొనుక్కున్నది.
  • సెకండ్ హ్యాండులో ₹20 లకే మంచి కథలూ, పజిల్సూ ఉన్న పుస్తకాలు నాకు దొరికాయి.
  • ఒక స్కూలు అట్లాస్ కొన్నాను. గూగూల్ మ్యాప్స్ తనకు ఆల్రేడీ తెలుసు - కానీ అన్నిసార్లూ మొబైలులో చూస్తానంటే ఎలా. బోరు కొట్టినపుడు చూస్తుందిలే అని.

మార్కెట్టులో మ్యాజిక్ పాట్ (Magic Pot) అని మలయాళ మనోరమ వారి పిల్లల పక్ష పత్రిక వస్తుంది. కానీ మా ప్రాంతములోని పుస్తకాల షాపులో ఠంచనుగా రాదు. ఈ పుస్తక ప్రదర్శనలో వారి స్టాలులో 6 నెలల చందా డిస్కౌంటులో దొరికింది. వారు ఇంటికి సరిగ్గా పంపిస్తే రెన్యువల్ చేస్తాను.

తెచ్చిన మర్నాడు పొద్దున్నే లేవగానే రాత్రి కొన్న పుస్తకాలు ఏవి అని చూసుకుని, అందులో ఒక పుస్తకము తీసి పజిల్స్ మొదలుపెట్టింది. గత రెండు వారాలలో నాలుగు కథలు తనంతట తను చదివింది. ఇదో గొప్ప ప్రారంభము. ఎంతవరకు చదవడముపై ఆ ఆసక్తి ఉంటుందో గానీ.

ఇక నా విషయానికి వస్తే ఎప్పటి నుంచో కొనాలనుకున్న సిరా కొన్నాను. ముళ్ళపూడి వారి కోతికొమ్మచ్చి సిరీస్ ఏళ్ళ కిందట అప్పు తీసుకుని చదివినా, ఇప్పుడు ఇంట్లో ఉంచుదామని తీసుకున్నా. ఇంకా కొన్నవి - శప్తభూమి, పున్నాగపూలు.

ఇక విదేశాలకు వెళ్ళే సందర్భాలు రాకపోవచ్చు (ఆలోచనలు ఎలాగూ లేవు) అని మళ్ళీ పుస్తకాలు పేరుద్దామనుకుంటున్నాను.

4, జనవరి 2022, మంగళవారం

సిరా నవల

 గమనిక – ఇది పుస్తక సమీక్ష కాదు - నాకు అలాంటివి వ్రాయడమూ రాదు, చదవడమూ అలవాటులేదు. కేవలము సిరా అనే పుస్తకముపై నా అభిప్రాయము.

సిరా పుస్తకము ఎందుకు కొన్నాను?

గత కొన్నేళ్ళుగా ఆన్లైనులో ఈ-పుస్తకాలు చదవడమే తప్ప చేతిలో పుస్తకము పెట్టుకొని చదివినవి చాలా తక్కువ. నిజము చెప్పాలంటే అలా కొని చదవాలి అని నాకనిపించిన కొత్త పుస్తకాలు లేవనే చెప్పాలి. అలాంటిది ఒక రెండేళ్ళ కిందట సిరా అనే పుస్తకము గురించి ఆ పుస్తకాన్ని రచించిన సీనీ దర్శకుడు రాజ్ మాదిరాజ్ గారి ఫేస్బుక్ గోడపై 2019 లో పరిచయమయ్యాక, ఇంటర్మీడియట్ విద్యార్థుల చైనా తరహా కాలేజీల గురించి ఈ పుస్తకము అని తెలిసాక, కొని చదవాలి అని ఆసక్తి కలిగింది. ఈ ఏడు హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు మొదట రోజే వెళ్ళాను. ఆ సాయంత్రము నేను తిరుగుతున్నప్పుడు అన్వీక్షికి వారి స్టాలు తెరవలేదు. నేను అన్ని స్టాల్సు ఒక రెండు గంటలు తిరిగాక, అప్పుడు ఫేస్బుక్ లో బుక్ ఫెయిర్ వారి పేజీపై స్టాలు నంబరు తీసుకుని వెతుక్కుని వెళ్ళాను. అప్పుడే అట్ఠపెట్టెలలోంచి తీసి సర్దుతున్నారు. వెంకట్ సిద్దారెడ్డి గారు అక్కడే ఉన్నారు. ఫేస్బుక్ లో అంతకుముందు ఉన్న ఆఫరు ఇస్తాన్నారుగానీ నా బడ్జట్ అప్పటికే వేరే పుస్తకాలపై పెట్టేశాను. ఇంక సిరా ఒక్కటి కొన్నాను.

కథాంశము

ఈ పుస్తకములో రెండు థ్రెడ్లు ఉన్నాయి - మన రాష్ట్రములలో ఇంటర్మీడియట్ విద్యనందించే ఒక కళాశాలల సంస్థ నిర్వాకాలు, అందులోని విద్యార్థుల ఆలోచనలు, ఆవేశాలు. రెండవది ఒక విజయవంతమైన పెద్ద లాయరును ఆదర్శముగా తీసుకుని అతనిలా సక్సెస్ఫుల్ అవుదామని అభీలాషించే ఒక న్యాయ విద్యార్థి. కొన్ని సంఘటనల వలన ఈ రెండు థ్రెడ్లు కలిసి ఈ జూ. లాయరు ఆ సంస్థపైనా, దాని తరపున నిలబడిన గురువుగారు కోర్టులో తలపడడము.



రచనా శైలి

శనివారము ఈ పుస్తకము కొంటే ఆదివారము రాత్రీ పదిన్నరకు తెరిచాను. మొదటి గంటా నెమ్మదిగా గడిచింది - పిల్లల గొడవ, అంత చిన్న అక్షరాలు అందులోనూ తెలుగు ఆఫ్లైను (వార్తాపత్రిక కాకుండ) చదవడమూ అలవాటు తప్పుట ముఖ్యకారణాలు అయినా, ఇంకో కారణము - ఆంగ్ల లిపిలో చాలా సంభాషణలు ఉండటమూ పంటి కింది రాయిలా తగిలాయి. తెలుగు లిపిలో ఆంగ్ల పదాలూ, వాక్యాలు కూడా ఈ తరానికి తగ్గట్టు అలవాటే కానీ (ఉదా హౌ ఆర్యూ టుడే), తెలుగు మధ్యమధ్యన ఆంగ్ల లిపి వాడడము ఇబ్బంది పెట్టింది. చాప్టరు శీర్షికలూ ఆంగ్ల లిపిలోనే ఉన్నాయి.

మొదటి మూడు నాలుగు చాప్టర్లూ క్యారక్టర్ల పరిచయానికే సరిపోవడమూ కొంచం అనాసక్తముగా చదివించింది. అంత డీటెయిలింగు అవసరములేదేమో.

కానీ కథా, కథనమూ, కాన్ఫ్లిక్టూ, వేగము పుచ్చుకున్నాయి. గంట తర్వాత 11.30కునిద్ర పోదాము అనుకున్న నన్ను అర్ధరాత్రి ఒంటి గంట దాకా కూర్చోబెట్టి చదివించింది.

పాత్రలూ, పాత్రల ఆలోచనా వ్యవహార తీరూ యండమూరీగారి శైలి ఫ్రభావముంటే, మొదలులోని కళాశాల, ప్రేమ సంభాషణలు యండమూరీ - త్రివిక్రమ్ గార్ల మిశ్రమ శైలిగా అనిపించింది. లాయరు మూర్తి ఎదిగిన తీరు, ఆ క్రమములో అతని ఆలోచనాతీరు, వ్యవహార శైలి కొంత ఫౌంటెయిన్ హెడ్ ను గుర్తుకు తెస్తే చివరిలోని కోర్టు డ్రామా సిడ్నీ షెల్డన్ నవలలు జ్ఞప్తికి తెచ్చింది. అంటే రచయిత రాజ్ గారి శైలి ఎక్కడా లేదా అంటే - కాదు. అలా అనిపించడం ఆయన రాసేటప్పుడు ఆ రచనల ప్రభావము ఉండడము కావచ్చు, లేదా నాకు ఆ చదివినవి గుర్తుకు రావటము వలన కావచ్చు. నాకు సినిమాలు చూసేటప్పుడు అలాంటి సన్నివేశాలూ, ఇంటి సెట్లూ వగైరా ఇంతకుముందు వేరే సినిమాలలో చూసుంటే గుర్తోస్తాయి. గత రెండు ఏళ్ళుగా రాజ్ గారి ఫేస్బుక్ పోస్టులు చదువుతున్నా కాబట్టి వారి శైలీ కొంత తెలుసు - అది ఈ పుస్తకములో కనిపించింది.

నా అభిప్రాయము - వ్యక్తిగత అనుభవము

ఈ నవలలోని కార్పోరేటు కాలేజి మొదలైన 90వ దశకములోని పరిస్థితులు నాకు బాగా పరిచయము. ఇప్పటి చైనా బ్యాచీలకన్నా ముందే గుంటూరులో అలాంటి కాలేజీలు మొగ్గ తొడిగి విజ్ఞానముతో వికసించి కొత్త భాష్యాలు చెప్పి విద్వాన్సులను చేయడము కొంత దగ్గరగానే చూశాను. ర్యాంకుల కోసము సొంత మెటీరియల్ తయారుచేయడమూ, ర్యాంకు గుర్రాలకు ప్రత్యేక సెక్షన్లు లేదా ప్రత్యేక క్యాంపస్లు , కొత్త బంగారు లోకం సినిమాలో చూపినట్లు వైరు కుర్చీలు - లావు కర్రలతో స్టడీ అవర్లూ - చాలా చూశాను. నాకు బాగా కావలసినవారు అలాంటి కాలేజీలలో చేరి పడ్డ ఇబ్బందులు వారం వారం వారిని కలవడానికి వెళ్ళినపుడు చూశాను. నేను 97 లో ఇంటర్మీడియట్ చేరేటపుడు మా నాన్నగారికి చెప్పేశాను - నేను అలాంటి కార్పోరేటు కాలేజీలో చేరనని, అలాంటి చదువు చదవలేనని. వెళ్ళి ప్రభుత్వ జూనియరు కాలేజీలో చేరాను. నా జీవితములో నేను తీసుకున్న మంచి నిర్ణయమది, ఒప్పుకున్న మా నాన్నగారి గొప్పదనము. అలా చేరడము నాకు ఎంసెట్లో తగిన ర్యాంకు రాకపోయినా నేను కోల్పోనిదే ఎక్కువ అని అనుకుంటా. నేను మా ప్రభుత్వ లెక్చరరు దగ్గర ఫిజిక్స్ ఎంసెట్ ట్యూషనుకు చేరాను. ఆయనకు సమయము కుదరక మమ్మల్ని ఆయన చెపుతున్న కార్పోరేటు కాలేజికి వచ్చివారి క్లాసులో కూర్చుని వినమనేవారు. అక్కడి విద్యార్థులను కలిసి మాట్లాడేటప్పుడు, వారి మొహాలు చూస్తే ఏదో తెలియని బాధ ఖైదీలతో మాట్లాడుతున్నట్టు అనిపించేది. మేమేమో సరదాగా ఉండేవారం. ఆ గంటవ్వగానే ఇంటికో, సినిమాకో పోతాము కాబట్టి.

అందుకని ఈ పుస్తకములోని కథనము కళ్ళకు కట్టినట్టు కనిపించింది, నాకు వ్యక్తిగతముగా తాకినది.

కానీ కార్పోరేటు కాలేజీలు, తల్లిదండ్రులను ఒకే కోణములో చూపించడమూ, విద్యార్థులంతా అమాయకులుగా చెప్పడము ఏకపక్షము అనిపించింది. అందరూ టెండూల్కర్లూ, నానీలూ అవ్వలేరు. టాలెంటు ఉంది అనుకుంటారు కానీ నిజముగా ఉండకపోవచ్చు. ఉన్నా ఆ టాలెంటు వాడుకుని విజయము సాధించే నిబద్ధత, ఓపికా, అవకాశాలూ ఉండకపోవచ్చు. కావున వారి శక్తికి మించి చదివించే మధ్యతరగతి తల్లిదండ్రులు సేఫ్ పాథ్ చూసుకోవడములో తప్పులేదు. కవిత్వము, ఫోటోగ్రఫీ, సినిమా, చిత్రలేఖనం వంటివి బీటెక్ తర్వాతా చేసుకోవచ్చు - ఎంత మంది లేరు అలా చేసి విజయవంతమైన వారు. అందుకే నాకు త్రీ ఇడియట్స్ లాంటి సినిమా నాకు అంతగా కనెక్టు కాలేదు.