ముందుగా షరా - నేను పండితుడను కాదు, పాత పద్యాలు - గద్యమే తప్ప కవితలూ-కవిత్వాలూ అస్సలు చదవను. తరువాత వ్రాయబోయేది కేవలము ఒక సామాన్య వ్యక్తిగా నా గమనికలు.
వేటూరి, సిరివెన్నెల ఇద్దరూ అన్ని రకాల సందర్భాలకూ కొన్ని వేల పాటలు వ్రాశారు. అందులో చాలా అద్భుతమైన పాటలున్నాయి. అవన్నీ ఉటంకించి, విశ్లేషించి పోల్చడము కష్టమే. అందుకని కేవలము వారి శైలిలో ఒక సామాన్య శ్రోతగా/చదువరిగా నాకు అనిపించినది చెప్తాను.
అంతకన్నా ముందు ఒక క్రికెట్ ఉవమానం - వేటూరి సచిన్ టెండూల్కరు అయితే సిరివెన్నెల ద్రవిడ్ అన్నమాట. ఎందుకన్నానో చివరికి చెప్తాను.
- ప్రేమ పాటలు -
వేటూరిగారు 70లలో లలిత గీతాలు వ్రాశారు. 80లు, 90ల మధ్యన వరకు వ్రాసినవి ప్రాథమికముగా రెండు రకాలు - పార్కులు - సెట్లలో నాయికానాయకులు స్టెప్పులు వేసే వాణిజ్య యుగళగీతాలు లేదా విశ్వనాథ్ - జంధ్యాల వంటి దర్శకుల కోసము భావుకత ఉన్న పాటలు. వేటూరిగారు రెండు రకాలు అలవోకగా వేగముగా బాణీలకు తగ్గట్టు వ్రాసేశారు. 90 ల చివరికి వేగము తగ్గి, శేఖర్ కమ్ముల, గుణశేఖర్ వంటి అభిరుచి, ప్రత్యేకముగా ఆయనే వ్రాయగలరు అన్న కథలు, సందర్భాలకు వ్రాయించుకుంటే వ్రాశారు.
వాణిజ్య గీతాలలో ఆయన వాడని పదాలు, ఉపమానాలు లేవు - ఇంగ్లీషు పదాలు కూడ వాడారు. హీరో, హీరోయిన్ల పేర్లు, రాగాల పేర్లు, దేశాలు, ఊర్లు, తినే పదార్ధాలు - అన్నీ వాడారు. ఇతర గేయరచయితలు భావుకతకు వాడే ప్రకృతి పదాలను - కొండ, కొమ్మ, కోకిల, ఋతువులు, కాలాలు, వాన, జాబిలి, వెన్నెల – ఆయన వాణిజ్య ప్రేమ గీతాలలోనూ ఆశువుగా వాడారు.
మొదటి రకము - కొట్టండి తిట్టండి లవ్వండీ ప్రేమ, నీమీద నాకు ఇదయ్యో, అచ్చా అచ్చా వచ్చా వచ్చా
రెండవ రకము - లిపిలేని కంటి బాస, చైత్రము కుసుమాంజలి, నిరంతరము వసంతములే
సిరివెన్నెలగారు 87-95 మధ్యన కొన్ని వాణిజ్య యుగళగీతాలు వ్రాసినా ఎక్కువగా వేటూరి శైలినే అనుసరించారు. బహుశా దర్శకులు అలా అడిగి వ్రాయించుకునుంటారు. ఉదాహరణకు బొబ్బిలిరాజా, ధర్మక్షేత్రం. 90 లలో కుటుంబ కథా చిత్రాలు (నిన్నే పెళ్ళాడతా, పవిత్ర బంధం), యూత్/కాలేజి ప్రేమ కథా చిత్రాలు (నువ్వే కావాలి, గులాబీ) వంటి చిత్రాల ట్రెండ్ మొదలయ్యాక సిరివెన్నెల తన కంఫర్టు జోనులోని ప్రేమ గీతాలు వ్రాసే అవకాశం వచ్చింది. ఎలాగో రాఘవేంద్రరావు, శరత్ వంటి వారికి కావలసిన వాణిజ్య గీతాలు ఎక్కువ చంద్రబోస్, భువనచంద్రకు వెళ్ళాయి. అంటే వేటూరిగారి స్థానాన్ని సిరివెన్నెల ఒక్కరే భర్తీ చేయలేకపోయారు. వేటూరి ప్రేమ గీతాలలో ప్రకృతి, భావుకత, ఉపమానాలతో ఒక కవిత్వములాగా ఉంటే సిరివెన్నెల పాటలు ఎక్కువగా ఒక అమ్మాయి/అబ్బాయి తన మనసులో భావాలు మాటలు పాటగా ఒక లవ్ లెటర్ వ్రాసుకున్నట్టుగా ఉండేవి - నా, నీ, నువ్వు, నేను, మనసు, చెప్పనా, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, కనులు, గుండె, గాలి, వయసు, మాయ, కల, నిజము లా అప్పటి యూత్ కి సులువైన పదాలు వాడారు. ప్రకృతిని వాడిన పాటలు తక్కువనే చెప్పచ్చు (లేవని అనను - చెప్పవే చిరుగాలి, కొమ్మా కొమ్మా, మావిచిగురు). వేటూరిగారి భావుకత పాట రెండు మూడు సార్లు చదువుకుంటే గానీ లేదా ఎవరన్నా వివరిస్తేగానీ అర్థముగావు.
వేటూరిగారి ఇంకో బలం - గట్టి గుర్తుండిపోయే పల్లవులు. చరణాలలో కొన్నిసార్లు ఇరికించినట్లున్నా మనకు పల్లవి గుర్తుండిపోతుంది.
- విషాద గీతాలు -
వేటూరి వ్రాసినన్ని వైవిధ్యమైన విషాద గీతాలు సిరివెన్నెల వ్రాయలేదు. సిరివెన్నెల ఎక్కువగా విరహ గీతాలు వ్రాశారు. ఇక్కడ క్లిష్టత విషయములో ప్రేమగీతాలకు రివర్సు. వేటూరిగారి విషాద గీతాలు తేలికగా అర్థమవుతాయి, సిరివెన్నెలవి కొంచెం గాఢముగా ఉంటాయి (శుభలగ్నం పాట). ఇక్కడకూడ వేటూరి ఎక్కువగా ప్రకృతిని వాడారు (పావురానికి పంజరానికి, ఆకాశాన సూర్యుడుండడు, రాలిపోయే పువ్వా)
- ఆవేశ, ప్రబోధ, మార్గదర్సక, జీవిత సంబంధిత గీతాలు -
సిరివెన్నెలకి ఎక్కువ పేరు తెచ్చినవి, అభిమానులు ముందుగా ఉటంకించేవి ఇలాంటి గీతాలే - గాయం, కళ్ళు, గమ్యం, చక్రం, పవిత్రబంధం మొదలగు చిత్రాలలోని గీతాలు. బహుశా తనలోని మధ్యతరగతి కుటుంబ బ్యాక్ గ్రౌండు , 70-80ల యువత భావజాలం (ఆయన యువకుడిగా ఉన్నకాలం) వలన తనలో ఆ ఆవేశం, ఆవేదన సహజముగా ఉన్నది తనలో తాను రమించి, శ్రమించి కాగితాముపై అక్షరాలుగా మలిచారు.
అదే వేటూరిగారు ఆశువుగా పురాణాలు, చరిత్ర, ప్రకృతి, సమాజమును ఉదహరిస్తూ వ్రాశారు - కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, ఈ దుర్యోధన దుశ్సాసన, చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో
- ఐటెం పాటలు -
వేటూరి ఐటం/క్లబ్/వ్యాంప్/శృంగార గీతాలు - జానపద, పల్లె, నగర క్లబ్ - ఇలా అన్ని రకాలకు ఎంత మోతాదులో కావలంటే అంత, అవసరమైతే ద్వంద్వార్థాలు వచ్చేటట్టు ఇచ్చారు. సిరివెన్నెల టైంకు వచ్చేసరికి దర్శకులు నిర్మాతలు వేరే రచయితలపై ఎక్కువ ఆధారపడ్డారు. ఐటం సాంగైనా పాటలో ఒక సందర్భమూ, అర్థమూ ఉండాలి అనుకుంటే, అలాగే దర్శకునికి సిరివెన్నెలతో ఒక వేవ్ లెంగ్త్ ఉన్నట్టైతే (ఉదా వర్మ, కృష్ణవంశీ) అప్పుడు సిరివెన్నెలతో వ్రాయించుకున్నారు.
ఇంతవరకు గీతాల గురించి అంటే ఫైనల్ ప్రోడక్టు గురించి మాట్లాడాను. ఇపుడు వారు ఎలా వ్లాస్తారో చూద్దాము -దీనికే పైనచెప్పిన క్రికెట్ ఉపమానము.
సచినుది సహజ ప్రతిభ. ఎలాంటి ఫార్మాటైనా తేలికగా ఆడగలడు. అన్ని రకాల షాట్లు కొట్టగలడు - కొట్టడానికి కష్టపడినట్టు మనకు చూసేవారికి అనిపించదు. ఆతడులో తనికెళ్ళ భరణి డైలాగులా ఒక పద్ధతి ఉంటుంది. ఒకే బంతికి రెండు మూడు రకాలుగా షాట్ కొడతాడు. తోటి క్రీడాకారులకు ఒక ఆరాధన. అందరికీ తెలుసు అతను వారందరికన్నా ఒక మెట్టు ఎక్కువని. జట్టులో సహకారము లభించకున్నాఒంటిచేత్తో లాక్కురాగలడు.
అదే విధముగా వేటూరిగారు అలవోకగా ఆశువుగా వేగముగా పల్లవులు, చరణాలు ఇచ్చేస్తారు. కానీ ఎక్కడా పట్టు తగ్గదు. ఎలాంటి బాణీ ఇచ్చినా వ్రాసేస్తారు. సంగీత దర్సకుడు తనన తననా అన్నా తానానా అన్నా వ్రాసి ఇస్తారు. ఒకే ట్యూనుకు ప్రేమ గీతమూ, విషాద గీతమూ ఇస్తారు. బాణీ సామాన్యమైనదైనా, చిన్న చిత్రాలైనా వేటూరి గారి సాహిత్యముతోనే హిట్టయిన పాటలున్నాయి.
ద్రవిడుది సహజ ప్రతిభ కాదు. కొన్ని వేల గంటలు ప్రాక్టీసు చేశాడు. ఒక ఇన్నింగ్ బిల్డు చేయడానికి శ్రమిస్తాడు. పరిమిత ఓవర్ల ఫార్మాటులో ఆతనికి పరిమితులున్నాయి. స్లాగ్ చేస్తే మనము చూడలేము. కానీ కొన్ని షాట్లు కొటినపుడు (కవర్ డ్రైవ్) అతనంత సొగసుగా ఎవరూ కొట్లలేరు అనిపిస్తుంది. ఎన్ని మ్యాచులు గెలిపించినా సచిను తర్వాతి స్థానమే.
అలాగే సిరివెన్నెల చాలా పాటలకు ఎన్నో రాత్రులు శ్రమించారు. ఎన్నో వర్షన్ను వ్రాసేవారు. కొన్ని రకాల గీతాలు (కమర్షియల్ గీతాలు, ఐటం పాటలు) వ్రాసేటపుడు ఇబ్బంది పడ్డారు. సచిను నీడలో ద్రవిడులాగా ఎన్ని గొప్ప గీతాలు వ్రాసినా 70ల నుంచి సినిమాల పాటలు వినే తరానికి సిరివెన్నెలది వేటూరి తర్వాతి స్థానమే.
పోలిక బాగుందండి.
రిప్లయితొలగించండినా అభిప్రాయం ఏమిటంటే, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒక రకంగా దురదృష్టవంతులు. ఎందుకంటే ఆయన పాటలు వ్రాయడం మొదలు పెట్టేటప్పటికి మంచి సినిమాలు రావడం తగ్గింది. వచ్చిన కొద్ది పాటి మంచి సినిమాలకి ఆయన న్యాయం చేసారు. వేటూరి గారు వ్రాసేటప్పుడు విశ్వనాథ్ గారు లాంటి గొప్ప దర్శకులు మంచి సినిమాలు తీసేవారు. టి. కృష్ణ గారి సినిమాలకి సిరివెన్నెల గారు పాటలు వ్రాసి ఉంటే ఎంత బాగుండేదో?
నెనర్లు సర్. మంచి, అనే కన్నా ప్రేమ కథా చిత్రాలు ఎక్కువ వచ్చాయి అనవచ్చును. అయినా కృష్ణవంశీ, క్రిష్ మంచి సందర్భాలు ఇచ్చారు
తొలగించండిgood comparison
రిప్లయితొలగించండిథాంక్యూ
తొలగించండిTrue, Veturi was/is matchless in many aspects.
రిప్లయితొలగించండినెనర్లు సర్
తొలగించండి