1, ఫిబ్రవరి 2021, సోమవారం

మనసును కదిలించిన పాటలు

 విన్నపము- మీరు సున్నిత మనస్కులు(వీక్ హార్టెడ్) అయినట్లైతే ఈ పోస్టు చదవద్దు, పాట వీడియో చూడద్దు - ఆడియో సాహిత్యం వరకు వినండి.

నాకు ఎమోషన్సు తక్కువ - ఉప్పొంగడాలూ-కుంగిపోవడాలూ రెండూ లేవు. చాలా గట్టి హృదయం నాది.

అలాంటి నా మనసును కదిలించిన, కుదిపేసిన పాట ఒకటుంది - భిక్షాందేహని వేడుతున్నా అని నేను దేవుడిని చిత్రంలోని ఇళయరాజా ఎప్పటిలాగే అద్భుతంగా స్వరపరిచి, మధు బాలకృష్ణన్ ఆర్ద్రతతో పాడి, అంతే సహజంగా హృద్యంగా దర్శకుడు బాల చిత్రీకరించిన పాట. తెలుగులో వనమాలి చాలా అర్థముతో వ్రాశారు.

నాకు నందా, పితామగన్ (శివపుత్రుడు) సినిమాల నుంచి బాల దర్శకత్వం నచ్చేది. 2009లో నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ నేను దేవుడిని తమిళ మాతృక నాన్ కడవుల్ వచ్చింది. అఘోరాల సినిమా అని ఆసక్తిగా చూడడం మొదలుపెట్టా. కాశీలో హీరో ఆర్య అఘోరగా బాగానే మొదలైంది - ఆ శవాలు కాల్చడం అవీ.

అసలు కథ తమిళనాడుకి హీరో సొంత ఊరికి వచ్చాక - అక్కడి గుడి దగ్గర ఒక బిచ్చగాళ్ల మాఫియా చిన్న పిల్లలను, అనాథలను బలవంతంగా బిచ్చమెత్తిస్తుంటారు. ఆ నేపథ్యంలో ఈ పాట వస్తుంది.

సినిమాలో ఈ పాట రాగానే నన్ను కుదిపేసింది. ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది. పాట మళ్ళీ మళ్ళీ చూశాను. శివపుత్రుడులో ఇలాగే శ్మశాన నేపథ్యంలో ఇళయరాజా అద్భుతమైన పాట (ఒకటే జననం ఒకటే మరణం ) నాకు నచ్చి అప్పటికి నా ఫోన్లో (2006లోనే నా దగ్గర MP3 పాటలు వినిపించే మొబైల్ ఉండేదిhttp://jb-jeevanayanam.blogspot.com/2010/06/2.html ) అరుగుతున్నా, ఈ పాటంతగా నన్ను వెంటాడలేదు.

తరువాత తెలుగులో డబ్బింగు అయ్యాక, సాహిత్యం కూడ నచ్చింది.

మనం జీవితాన్ని ఎంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటామో ఈ పాట చూసినపుడల్లా విన్నపుడల్లా కలుక్కుమని గుర్తు చేస్తుంటూంది.

నాకు ఈ పంక్తులు బాగా తగులుకొని మదిలో ఎపుడూ మెదులుతుంటాయి, నాకు దైవంపై నమ్మకం లేకపోయినా -

రక్తం మాంసం ఎముకలు మలముతో

మలచిన దేహపు జోలెలతో...

***

మన్నుకు మరలిడు దేహమే

మరబొమ్మని తెలియక మర్మమునెరియగ

***

ఇది వలయా నీమాయా
మనిషిని నీవలే మార్చవయా
సిరులను వెతకగ తనువును స్వార్థము తరిమెనా.


భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే…పూర్తి సాహిత్యం -

భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే…
రక్తం మాంసం ఎముకలు మలముతో
మలచిన దేహపు జోలెలతో...
భిక్షాందేహని వేడుతున్నాచెంతనే నీ చెంతనే
రక్తం మాంసం ఎముకలు మలముతో
మలచిన దేహపు జోలెలతో...
భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే
శాపము తీరని విషమా
గత జన్మల కర్మల దోషమా
శాపము తీరని విషమా
గత జన్మల కర్మల దోషమా
మన్నుకు మరలిడు దేహమే...
మన్నుకు మరలిడు దేహమే
మరబొమ్మని తెలియక మర్మమునెరియగ
భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే
భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే
సంపదలున్నవి నీదరిలో చెయ్యి చాపేది వేడుక అందరిలో
సంపదలున్నవి నీదరిలో చెయ్యి చాపేది వేడుక అందరిలో
సుడిగాలిలో దీపమే మాబ్రతుకే
నడిపించక మానవు ఆ చితికే
ఒకపరియా మరిమరియా
జన్మలు ఎన్నని తెలుపవయా.
ఇది వలయా నీమాయా
మనిషిని నీవలే మార్చవయా
సిరులను వెతకగ తనువును స్వార్థము తరిమెనా.
నీ కరుణకు నోచని మనసున అలజడి రేగెనా...
దయగనరా దేవరా
దయచేసీ కావరా.
మా మొరలని వినమని వెతలను కనమని.
భిక్షాందేహని వేడుతున్నాచెంతనే నీ చెంతనే
రక్తం మాంసం ఎముకలు మలముతో
మలచిన దేహపు జోలెలతో...
భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే...


ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా
బ్రతుకే గగనం ఇది నీ పయనం తెలుసా మనసా
ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా
పయనం ముగియు ఈ చోటే కన్ను తెరిచావే
ఉదయం పంచు వెలుగుల్లో నిన్ను తెలిపావే
తోడు ఎవరులేక పుడమి ఒడి చేరినావే
ఎంత తెగువ తోటి ఈ వరము కోరినావే
తోటలో విరబూసిన అది మాలగా అలరించినా
పూలనీ అవి పూవులే తమ పేరునే అవి మార్చునా
పూరిగుడిసెలైనా పసిడి మేడలైనా నిన్ను మార్చునా
చివరి యాత్రలన్నీ కదిలే నిన్నుచేరుకోగా
చితిని పేర్చుతుంటే అన్ని నీకొక్కటేగా
పుడమిలో శ్రీమంతులు తమ పదవిలో పలు నేతలు
చెరగనీ తలరాతలు ఘనకీర్తులు నిరుపేదలు
భేదమెంత వున్నా బుగ్గిపాలు చేసే కర్మయోగివే