30, నవంబర్ 2011, బుధవారం

తెలుగు‌ బ్లాగులు‌ - గూగులమ్మ‌ బొమ్మలు‌


మీరు‌ ఇంటర్నెట్‌లో విహరిస్తుండగా‌ ఏదో‌ ఒ క‌ మంచి‌ కధనో, సినీసమీక్ష‌నో, కవిత‌నో కనిపించింది‌. చదువుతుంటే‌ ఇంతకుముందే‌ అది‌ ఎక్కడో చదివినట్లనిపిస్తుంది‌. తరచి‌ చూస్తే‌ అది‌ మీరు స్వయంగా‌ రచించినది‌. మీ విలువైన‌ నిమిషాలు‌/గంటలు‌/రోజుల తపన‌.

అపుడు మీ మనస్స్థితేంటీ? ఆ విషయాన్ని‌ మీరెలా తీసుకుంటారు? పోనీలే‌ అతనికి‌/ఆమెకి‌ నచ్చి పెట్టుకున్నారు‌లే‌ అ ని‌తేలికగా‌ తీసుకుంటారా‌?‌ రగిలిపోతారా? గొడవ‌ చేస్తారా?

తెలుగు‌ బ్లాగు‌ల్లో ఏ విషయం‌ పై వ్రాసినా సందర్భానుసారంగా బొమ్మ లు‌ పెట్టడం‌, వాటిని‌ చదువర్లు‌ మెచ్చుకోవడం సాధారణం.గా కొన్నిసార్లు‌ ముచ్చటగా‌ ఉంటుంది‌ కూడా. అయితే‌ ఈ బొమ్మలు‌ సొంతంవి‌గాకుండా‌ (ఆత్రేయ‌గారులాంటివారు‌తప్ప) నెట్లోంచి ప‌(కొ‌)ట్టుకొచ్చినవే! దాన్నే‌ ముద్దుగా గూగుల‌మ్మ‌ అప్పిచ్చింది‌ అని రాసుకుంటున్నా‌రు.

ఏ తప్పు‌కైనా ఉండేటట్లు ఇలా బొమ్మలు‌ తెచ్చుకోవడానికీ‌ రెం డు కోణాలున్నాయి‌.

మొదటిది‌ నైతికత‌ (ఎథికల్‌) - పైన‌ చెప్పిన‌ట్లు‌ మన‌ది‌ వేరేవాళ్ళు‌ కొట్టేస్తే‌ మనకి‌ బాధ‌/కోపం అయితే మనం వేరేవాళ్ళవి‌ వాళ్ళ‌ అనుమతి‌లేకుండ‌ వాడుకోకూడదు.

రెండవది‌ చట్టబధ్ద త (లీగల్‌) - కొందరు‌ అనుమతి‌ తీసుకోకున్న‌, ఆ బొమ్మ‌ మూలం‌ (ఎక్కడినుండి‌ సేకరించిందో)‌ పెడితే సరిపోతుందనుకుంటారు‌. కానీ కొన్ని‌సైట్స్ అలా వాడడానికి ఒప్పుకోకపోవచ్చు. వారు‌ మీపై‌ చట్టప్రకారం చర్యలు‌ తీసుకోవచ్చు‌. మనం వారి‌ బొమ్మ‌ డౌ న్లోడు చేస్తే‌ వారికెలా‌ తెలుస్తుందా? దా‌నికి చాలా‌ మార్గాలున్నాయి‌. అతి‌ తేలికైన‌ మార్గం‌ రివర్స్ ఇమేజింగ్‌ టెక్నిక్‌ .

అయితే‌ అసలు‌ బొమ్మలు‌ పెట్టుకోలేమా? ఏవి‌ కాపీరైట్‌ లే నిబొమ్మలు? వాటిని‌ ఎలా వెతక‌డం?
  • ప్రతి‌ సెర్చ్ ఇంజిన్‌లో ఈ అవకాశం ఉంటుంది- గూగు‌ల్లో అయితే‌ ఎడ్వాంస్‌డ్ సెర్చ్ కి వెళితే‌ 'యూసేజ్‌ రైట్స్' అ నిఉంటుంది‌.
  • ఆ బొమ్మ‌ ఉన్న‌ సైట్లో కాపీరైట్‌ ఏమి‌ చెప్తుందో చూడండి.

మరి‌ మన‌ బొమ్మలు‌, మన‌ రచనలకి‌ కాపీరైట్‌ ఎలా పెట్టుకోవడం? దీనికోసం‌  క్రియేటివ్ కామన్స్ లాంటివి‌ కొన్ని లైసెన్సులు నిర్వచించాయి‌. ఉదాహరణకి‌ నా బ్లాగుకింద చూడండి‌ -  క్రియేటివ్ కామన్స్ యాట్రిబ్యూషన్-నోడిరైవ్స్ ౨.౫ ఇండియా లైసెన్స్కింద నమోదుచేయబడినది.క్లుప్తంగా మీరు నా రచనని ఉన్నదున్నట్లుగా (అంటే మార్చకుండ) లాభాపేక్షలేకుండ వ్యక్తిగత వాడుకకు నా పేరు‌ చెప్పుకొని‌ ఇతరులతో పంచుకోవచ్చును.


ఏదన్నా బ్లాగులో బొమ్మలుంటే నాకు నచ్చకపోవడానికి నైతిక‌, న్యాయ‌ కారణాలుగాకుండ‌ ఇతర కారణాలు కూడ‌ ఉన్నాయి‌ -
  • బ్లాగు‌ లోడ్‌ అవడానికి‌ (ముఖ్యంగా ఇండియాలో) సమయమెక్కువ‌ పడుతుంది.
  • మొబైల్‌ ఫోన్లలో పేజీ సరిగా చూపబడదు.
  • టకటకా చదవడానికి‌ అడ్డమొస్తుంటూంది.

తెలిసీ చేసేవారికి (! ఎవడు‌ చూసొచ్చాడులే, మనం బొమ్మ‌ ప(కొ)ట్టుకొచ్చుకుంటే ఎవడికి తెలుస్తుందిలే‌, తెలిసినా ఏం చేయగలరులే‌ అనుకునేవారికి‌) నేనేం చెప్పను‌. తెలియని‌వారి‌కి‌ అవగాహన‌ కోసం ఈచిన్ని‌ ప్రయత్నం. ఎవరినీ నొప్పించడానికి‌ కాదు.

ఇతరుల‌ మేధోహక్కులని‌ గౌరవించండి. కనీసం మూలం (సోర్స్ లింక్) ఇవ్వండి.

6, నవంబర్ 2011, ఆదివారం

మొగుడు - నా పాలిటి యముడు


నేను థియేటర్లో సినిమాలు తక్కువగా చూస్తాను. వెళ్ళినా, మిత్రుల-చుట్టాల బలవంతం తప్పితే నా అంతట నేను పనిగట్టుకొని  వెళ్ళేవి చాలా తక్కువ (ఇంతవరకు దూకుడు చూడలేదు). వెళ్ళినా ఒక్కడినీ‌వెళ్ళను. బాగోపోతే సెటైర్లు వేసుకోడానికి ఒక్కరన్నా ఉండాలని. వెళ్ళాను గాబట్టి, అపుడు నోటిదాక వచ్చినవి ఇపుడు వెళ్ళగక్కుతా. మామూలుగా సమీక్షలు రాయనివాడిని(ఎపుడన్నా ఒక లైను  ఫేస్బుక్ అభిప్రాయం తప్పితే), తప్పట్లేదు.

బండి సర్వీసింగుకిచ్చి ఎలా కాలక్షేపం చేద్దామా అని ఆలోచిస్తుంటే పక్కనే 'మొగుడు ' పోస్టర్ కనిపించింది. కృష్ణవంశీది గదాని హాల్లోకెళ్ళి  కూర్చున్నా. అతనికి అభిమానినికాకున్న అతని 'క్రియేటివిటీ' నచ్చుతుంది, ఇప్పటి దర్శకుల్లో అతను చాలా నయమని నా‌అభిప్రాయం. అయినా మధ్యమధ్యన అరుపులు, అనవసరపు లాగుడు ఉంటాయని అంత:పురం తర్వాత అతని సినిమా ఏదీ హాలుకెళ్ళి చూడలేదు. కానీ ఈసారి తప్పలేదు.

సినిమా కథగురించి రాయనుగానీ కొన్ని అంశాలు చాలా నిరాశపరిచాయి -

- సమాధుల దగ్గర శాస్రీయ కూచిపూడి నృత్య ప్రదర్శన ఏంటో?
- టీనేజి అమ్మాయిలమీద చక్కగా తీసిన డయిరీమిల్క్ ప్రకటన విషయాన్ని ఏమాత్రం నప్పని కూచిపూడి అలంకరణలో ఉన్న తాప్సీతో కాపీకొట్టడం ఏంటో?
- కుటుంబ కథాచిత్రమని ప్రచారం చేసుకుంటూ, యూ సర్టిఫికేటిచ్చిన చిత్రంలో ప్రతి పదినిమిషాలకి సెన్సార్ కత్తెరకి సంభాషణలు మూగబోవడం ఏంటో? ఆ మూకీ సంభాషణలకి తెరపైన అందరూ నవ్వుకుంటుంటే మేము (పక్కన కూర్చున్న దూకుడు దొరకని ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు) విరక్తిగా నవ్వుకోవడం ఏంటో?
- తాప్సీ పాత్రని  చూస్తే  కృష్ణవంశీ శశిరేఖ పరిణయం సీక్వెల్ తీశాడా అనిపించింది -అదే మూర్ఖత్వం, అదే మొండితనం, అవే ఏడుపులు, అవే అరుపులు, వగైరా, వగైరా.
- తాప్సీ నటన కూడ జెనీలియాని పదేపదే గుర్తుకు తెచ్చింది.
- డబ్బులన్నీ రాజేంద్రప్రసాదువిగ్గుకి అయిపోవడంతో రోజా మొహానికి రంగులేసినట్లు లేరు, నల్లగా నిగనిగలాడింది. కానీ సహజంగా లేదు.

సరే నచ్చిన విషయాలకొస్తే
- సొంతంగా డబ్బింగు చెప్పుకొనడం అభినందనీయం, సరిత-సవిత-సునీత-చిన్మయి వంటి నస గొంతులనుండి విముక్తి. కానీ కొంచెం దగ్గరుండి డబ్బింగు చెప్పించుకోవాల్సింది.
- నేపథ్య సంగీతం (రీరికార్డింగు) అధ్బుతం - చాలా కాలంతర్వాత ఇందులో‌ఆస్వాదించాను.

శశిరేఖా పరిణయం నిరాశ పరిచినా కృష్ణవంశీ కి ఇంకో అవకాశమిద్దామనుకున్నా. ఈ చిత్రంతో అతనిని ఈ క్రింది దర్శకుల చిట్టాలో చేరుస్తున్నా -

బాలచందర్  - పరవశం, అబధ్దం
 వంశీ - దొంగరాముడు & పార్టీ, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాను
 విశ్వనాథ్ - ఆపద్బాంధవుడు, శుభసంకల్పం
రామ్‌గోపాల్‌వర్మ - రామ్‌గోపాల్‌వర్మకీ ఆగ్, రక్తచరిత్ర
బాపు - రాధాగోపాళం
కృష్ణవంశీ - శశిరేఖా పరిణయం, మొగుడు.

ఈ చిట్టా ఏంటని ఇంకా ఆలోచిస్తున్నారా - ఎన్నో‌ గొప్ప చిత్రాలు తీసినవారి తిరోగమనం ఇలాగే మొదలైంది.ఇపుడు వారి కొత్త సినిమాలు చూడాలంటే కొంచెం, కాదు చాలా‌భయంవేస్తుంది. మధ్యమధ్యన వారి చమక్కులున్నా, మొత్తం మూడు గంటలు వారి కళాఖండాలని హాల్లో చూసే ఓపిక ఇంక నాకులేదు.

**** ౬-౧౧ నాడు‌ కలిపిన ది****
ఇవాళ‌ వాచ్‌మన్‌ మేనల్లుడు‌ లిఫ్ట్‌ అడిగితే బండెక్కించుకున్నా. 'మొగుడు‌' హాలుముందునుండీ‌ వెళ్ళుతుంటే మీరు‌ సినిమాలు‌ చూడరా అన్నా? అని‌ అడిగాడు‌.

ఎందుకు‌ చూడం నాయనా, ఈ 'మొగుడు‌' మొన్ననే బాదించుకున్నాగా అన్నా.

'నేనూ చూశానన్నా, మూడు‌ సార్లు‌'
'అవునా!!!!'
'అవునన్నా! గోపీచంద్‌ ఫ్యానుని‌'
నడుపుతున్న‌ బండీ అప్పటికే‌ అటూఇటూ ఊగుతుంది‌.
'నేను‌ కృష్ణవంశీ అభిమానినిలే'
'హిహ్హీహీ! మొన్న‌ హాల్లో ముందు‌ సీటోడు‌ కృష్ణవంశీ ఫ్యానంటే‌ నవ్వొచ్చింది‌, వాడికీ ఫ్యానులుంటారా' అ.ని

వెంటనే బండి‌ ఆపి‌ వాడిని‌ దిగమన్నా.
*వంశీకి కొంచెం మినహాయింపు. అతని సినిమాలు టీవీలో వచ్చేదాక ఆగలేను.*

10, సెప్టెంబర్ 2011, శనివారం

మంజీర రవళులతో


కాకి, పిచ్చుక, చిలుక, కోకిల, కొంగ, కోడి, నెమలి , ఇంకొన్నుండచ్చు- ఇవి నేను కళ్ళారా చూసిన కొన్ని పక్షులు. బెంగుళూరు, విదేశాల్లో‌ఉన్న నా ఫోటోగ్రఫీ మిత్రులు పెట్టే వివిధ రకాల పక్షి చిత్రాలు చూసి, ఆహా ఓహో అనుకోవడం తప్పితే నిజజీవితంలో‌అలాంటి పక్షులనునేనూ చూడాలి, ఫోటోలు తీయాలి అనుకుంటుండేవాడిని.

అలాగే 2009లో‌భువనగిరి సాహసం తర్వాత అమెరికా వెళ్ళడంతో  ఆగిపోయిన ఉత్సాహం 2011లో  స్వదేశానికి తిరిగి వచ్చాక  మళ్ళీ ఏదోక పర్యటన చేయాలనిపించింది. అలా అనుకొని,అనుకొనీ చివరికి గత జులైలో మంజీర ఆనకట్టకి  వెళ్ళివచ్చాం.

మంజీర ఆనకట్ట (బ్యారేజి)హైదరాబాదుకి  ముఖ్యమైన నీటి సరఫరా కేంద్రం. కేవలం ఆనకట్టేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన పక్షిసంరక్షణా కేంద్రాల్లో‌ఒకటి.

బిఎచ్‌ఈఎల్ సర్కిల్ నుండి ముంబాయిరోడ్డుపై ౩౫ కి.మీ.లు పోతే సంగారెడ్డి క్రాస్^రోడ్డు వస్తుంది (కారులో వెళ్ళితే టోల్ కట్టాలి, బైకయితే అక్కరలేదు). ఇక్కడ కుడిపక్కకి తిరిగితే సంగారెడ్డి పట్టణం వస్తుంది. పట్టణంలో పెట్రోల్ బంకు దాటాక, ఒక రెండు కి.మీ.వెళ్ళాక ఎడమవైపు ఒక సమాధి కనిపిస్తుంది (జాగ్రత్తగా గమనించాలి). ఇక్కడ ఎడమవైపు తిరిగితే మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం ఉంటుంది. ఈ రోడ్డులో‌ఒక కి.మీ. వెళ్ళితే ఒక మసీదుగోడ కనిపిస్తుంది. ఇక్కడ కుడివైపు తిరగాలి. ఈ దారి చాలా జాగ్రత్తగా గుర్తులు పెట్టుకొంటూ‌వెళ్ళాలి. గూగుల్ పటాలు కొంతవరకే తోడ్పడాయి.

ఒక శనివారం పొద్దునే నేనూ, ధర్మేన్ నా బైకుపై  బయలుదేరి  పొద్దునే తొమ్మిది కల్లా అక్కడికి చేరాం. మళ్ళీ మా అదృష్టం కొద్దీ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఎండలేకుండ ఉంది.బ్యారేజి గేటు దగ్గర ఒక ఆఫీసుగదిలో ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటనడిగారు? ఇలా చూడటానికి వచ్చాం అనడిగాం. ఒక నవ్వు నవ్వారు. సరే, ఈ పుస్తకంలో‌సంతకం పెట్టి, గేటు బయట బండి పెట్టి వెళ్ళమన్నాడు.

ఆ వాతావరణం చూడగానే కొంచెం బెరుకొచ్చింది. మేమిద్దరం తప్పితే ఎవరూ లేరు అక్కడ. ఫోటోలు తీసుకోవచ్చో, తీసుకోకూడదో తెలియలేదు. కుడిపక్కకి మొసళ్ళ కేంద్రం అని ఉంటే అటు నడవటం మొదలుపెట్టాం. ఆ దారిలో చెట్టుపైనున్న   ఒక నెమలి మమ్మల్ని చూసి భయపడి ఎగిరి వెళ్ళిపోయింది. కెమెరా చేతిలో‌పెట్టుకోనందుకు తిట్టుకున్నాం. ఒక పది నిమిషాలు ఎదురు చూసినా ఆ నెమలి బయటకి రాలేదు. సరేనని ముందుకెళ్ళాం. మొసళ్ళకేంద్రానికి తాళం పెట్టుంది, అవి ఉండాల్సిన నీటిగుంట ఎండిపోయుంది, మొసళ్ళున్న ఆనవాళ్ళేం కనిపించలేదు.

బ్యారేజిపైకి వెళ్ళుదామంటే ప్రవేశం నిషిద్ధం అనుంది. సరే అక్కడ ఒక వెయ్యేళ్ళ శివాలయం ఉందంటే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాం.అది ఇంకా నిరాశ కలిగించింది. దానికి రంగులేసి ఉండటంతో‌మామూలు గుడిలాగుంది. ఇంకేం చేద్దామా అనుకుంటే అపుడు నెమ్మది నెమ్మదిగా వివిధ రకాల పక్షులు కనిపించడం మొదలుపెట్టాయి.

అలా చాలా చిత్రాలు తీయగా చాలా కొద్దిమాత్రమే పంచుకోదగినవి వచ్చాయి. కొన్ని  నా చేతకానితనం వల్లయితే, ఉన్నట్టుండి వచ్చిన ఎండ వల్ల ఇంకొంచెం. తీసినవన్నీ‌నా  "నా కనులతో..." బ్లాగులో మంజీర అన్న  లేబుల్ కింద పెట్టాను. చూసి ఆనందించండి.

ఇంతలో‌ అటవీ సంరక్షణాధికారి జీపు వచ్చింది. సర్లే మనదగ్గర విలువైన కెమరా ఉంది, ఎందుకొచ్చిన గొడవని దిగి వెనక్కి రావడం మొదలుపెట్టాం. వెనక్కి వస్తుంటే నెమ్మనెమ్మదిగా జనాలు రావడం కనిపించింది. మమ్మల్ని పంపించలేదుగానీ, వాళ్ళల్లో చాలా మంది మాత్రం చక్కగా బ్యారేజి మెట్లు ఎక్కుతూ కనిపించారు. కొందరు బళ్లు కూడ వేసికొని లోపలికొచ్చారు. చాలా ప్రేమపక్షులూ కనిపించాయి. అప్పటికే పదకొండు అవ్వడంతో మళ్ళీ బ్యారేజివైపు వెళ్ళాలనిపించలేదు. ఆ నెమలికోసం మళ్ళీ ఎదురుచూశాం.అరుపులు వినిపించాయిగానీ, ఈ  జనాల  అలికిడితో గంటసేపుచూసినా అది బయటకిరాలేదు. ఆ నెమలిని చూడకపోవడమొక్కటే మా పర్యటనలో‌చిన్న లోపం.

విసుగొచ్చి ఇంక తిరుగుముఖం పట్టాం. సంగారెడ్డి జంక్షన్ దాటంగానే హైదరాబాదు దారిలో‌వరుసగా  ఫ్యామిలీ  ధాబాలున్నాయి.పేరు గుర్తులేదుగానీ కొంచెం హంగామా తక్కువున్న ఒకదానిలోకి వెళ్ళాం. ఆ‌ప్రదేశాని ఆ ధరలు కొంచెం ఎక్కువైన మేము తీసుకున్న ఉత్తరభారతీయ వంటకాలు చాలా బాగున్నాయి.

3, సెప్టెంబర్ 2011, శనివారం

భువనగిరి సాహసం


2009లో వరుసగా వారాంతాలు నిస్సారంగా గడుస్తున్న  రోజుల్లో నేనూ, సహనివాసి (రూమ్మేట్)వెంకటేశన్ వీలున్న ప్రతి వారాంతం బండి వేసుకొని ఎటోఒకవైపు వెళ్ళాలని నిర్ణయించాం. హైదరాబాదు చుట్టుపక్కలన  100 కి.మీ.లలో ఏమున్నాయా అని వెతుకుతుండగా భువనగిరి కోట గురించి తట్టింది.ఈ కోటని ఎపుడు హైదరాబాదు-గుంటూరు రైల్లోవెళ్ళినా చూస్తుంటాను (బీబీనగర్ తర్వాత ఎడమవైపున కనిపిస్తుంది).

భువనగిరి  హైదరాబాదు-వరంగల్ రహదారి (ఎన్.ఎచ్.202)మార్గంపైనా, సికిందరాబాద్-కాజీపేట  రైలుమార్గంపైనా తగులుతుంది. ఉప్పల్ నుండి దాదాపు 35 కి.మీ., గచ్చిబౌలినుండి 65 కి.మీ. ఉంటుంది.

ఒక శనివారం పొద్దున్నే 6.30 కి గచ్చిబౌలి నుండి బయలుదేరాం.మెహదీపట్నం, లిబర్టీ, నారాయణగూడ బాగానే దాటాం. ఆ తర్వాతనే దారి తప్పాం. వారినీ,వీరినీ అడుగుతూ 8కి ఉప్పల్ రింగురోడ్డు చేరాం. అక్కడ ఫలహారం చేసి మళ్ళీ బయలుదేరాం. అప్పటికి ఇన్ఫోసిస్ లేకపోవడం, విస్తరణ పనులు లేకపోవడం వలన, ఎటువంటి రద్దీ,ఆటంకములు లేకుండా 8.45 కల్లా వెళ్ళిపోయాం. అంతకు ముందురోజే వర్షం పడటం వల్ల, ఎండలేకుండా మబ్బుగా-చల్లగా ఉండటం వల్ల, బైకు ప్రయాణం చాలా ఆహ్లాదంగా జరిగింది. భువనగిరి చేరాక, కొండ ప్రవేశము ఎక్కడో అంత చిన్న ఊరైనా చెప్పలేకపోయారు :-( ఎలాగో కనుక్కొని వెళ్ళితే తొమ్మిదయితేగానీ గేటు తెరవరని ఎదురుగున్న కొట్టువాడు చెప్పాడు. అదృష్టంకొద్ది వాడు తొమ్మిదికల్లా వచ్చాడు. మేము తప్ప పర్యాటకులు ఎవరూ కనిపించలా. వాడు మమ్మల్ని అదోలా చూసి టిక్కెట్లిచ్చాడు.

గేటుతీసి లోపలికి వెళ్లగానే 'సర్దార్ సర్వాయి పాపన్న' విగ్రహం ఒక వాలు గుట్టకింద కనిపించింది. గుట్టపైన ఒక కోటలాగుంది. అరే, ఇంత క్రిందకున్నదేంటిది అని బాధపడ్డాం ఇద్దరం. పైగా రైల్లోంచి చూస్తే చాలా ఎత్తులో ఉందిగదా అని అనుకున్నాం.
***చిత్రం పెద్దదిగా కనిపించడానికి దానిపై నొక్కండి***
  అలా ఏటవాలుగా ఎక్కుతుంటే అదేదో పాత శోభన్‌బాబు సినిమా క్లైమాక్స్ గుర్తొచ్చింది.


ఇలా పైకి ఆవేశంగా ఎక్కాక, అక్కడింక దారిలేదు. పక్కన మెట్లు కనిపించాయి. ఎక్కడమైతే ఎక్కానుగానీ, దిగడానికి భయమేసిందండోయ్!


ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్లితే మేము చూసింది బురుజు మాత్రమేనని, కోటపైనెక్కడో ఉందని తేలింది.

బురుజుమీదనుండి భువనగిరి బస్టాండు -

ఈ బురుజు దగ్గరనుండి ఇంక మెట్లు కనిపించలేదు.మళ్ళీ ఒకటే గుట్టలాగ కనిపించింది.


ఆ గుట్టకూడ ఆవేశంగా ఎక్కాక, అక్కడ కొన్ని ఫిరంగులు కనిపించాయి. ఇంక అక్కడ నుండి కోటకి దారి చూశాక అప్పుడు చుక్కలు కనిపించాయి.

మొదట ధైర్యం చాల్లేదు. ఎందుకంటే అక్కడ మెట్లు సరిగాలేవు. కానీ పట్టుకోవడానికి  ఒకరెయిలింగు మాత్రం ఉంది. వెళ్ళాలా వద్దా. ఇక్కడ నుండి పడిపోతే ఏమన్నా ఉందా, మనవాళ్ళకి కబురు పంపేవాళ్లుకూడ ఉన్నట్లు లేరు అని అనుకున్నాం.

ఇంతలో ఒక మనిషి పైకెక్కుతూ‌కనిపించాడు. సరేనని మేమూ ధైర్యం చేశాం. ఈలోపు ఇంకో ఇద్దరు మాలాగా బండిపై వచ్చినవాళ్ళు కలిసారు. వారూ మావెనకే బయలుదేరారు.


తీరా అంత కష్టపడి పైకి వెళ్ళితే అక్కడ నాలుగు గోడలు తప్పితే కోటలాగ ఏమి అనిపించలేదు. కానీ బీ.ఎస్.ఎన్.ఎల్ వాడి టెలిఫోను టవరు మాత్రం ఉంది. మేము చూసిన వ్యక్తి అక్కడ పనిచేస్తాడట. రోజూ పైకెక్కుతాడంట. అతని ఉద్యోగం చూశాక నా ఉద్యోగంలో ఉన్న కష్టాలన్నీ మరిచిపోయాను.


కోట నిరుత్సాహపరిచినా, అక్కడినుండి కనిపించిన ప్రకృతి దృశ్యాలు మటుకు మా శ్రమనంతా మరిచిపోయేటట్లు చేశాయి.అలా పైన ఒక గంట గడిపాక నెమ్మదిగా మిగతా పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. పర్లేదు, ఒక ఇరవై మందిదాక కనిపించారు. ఇక క్రిందకి దిగడం మొదలుపెట్టి పదకొండున్నరకల్లా  బైకుదగ్గరకి చేరాం.

అనుకోకుండా మొదలుపెట్టినా మాకు చాలా ఆనందాన్ని కలిగించిన ప్రయాణం. ఆ తర్వాత అలాంటి ప్రయాణాలు మళ్ళీ మళ్ళీ చేయాలనుకున్నాం గానీ నేను అమెరికా ఇంకోసారి వెళ్ళాల్సిరావడంతో కుదరలేదు.:-(
భువనగిరి గురించి ఇంటర్నెట్లో వెతుకుతుంటే శరత్‌కాలంగారి బ్లాగు కనిపించి చదవడం మొదలుపెట్టి, అక్కడినుండి మిగతావారివి చదువుతూ నెమ్మదిగా తెలుగుబ్లాగులకి అతుక్కుపోయా.

14, ఏప్రిల్ 2011, గురువారం

సుందోపసుందులు: పందిళ్ళు - అలుగుళ్ళు - బతిమాళ్ళు

ముందుగా రామభక్తులకు ఆలస్యముగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే ఈ సుందోపసుందులు (అనగా నేనూ-అన్నయ్య- మా బ్యాచి) ఒకానొక సంవత్సరం ఇల్లు(ళ్ళు) పీకి (శ్రీరామనవమి) పందిరి వేసిన జ్ఞాపకం కళ్ళముందుకొస్తుంది.

అవి నేను, అంజి ఏడవ తరగతి పరీక్షలు అయిపోయాయి అని సంబరాలు చేసుకుంటుండగా (నాకు చదవడానికి ఆసక్తిగా, పరీక్షకి చిరాగ్గా అనిపించే) సోషలు పేపరు లీకవడంతో పరీక్ష రద్దు చేసి ఒక వారం రోజుల్లో‌ రీ-ఎక్జాం అని ప్రభుత్వం ప్రకటించిన రోజులు. అన్నయ్యకి, అంజీ వాళ్ళన్నయిన మా క్రికెట్ నాయకుడు ప్రసాదుకీ కూడా పరీక్షలు అయిపోయినట్లు గుర్తు.

పొద్దునా-సాయంత్రాలు ఆడే క్రికెట్ కాక, ఉడుం, కబడ్డీ, అష్టాచెమ్మా, అచ్చంగిల్లాలు, పిక్కలాట, గోలీలు, నేల-బండ, కుందుళ్లు, బ్యాడ్మింటన్, చెస్, క్యారంబోర్డు, పిన్‌బోర్డు, బిజినెస్ (మోనోపలీ) వంటి స్వదేశీ-విదేశీ ఆటలన్నీంటినీ మా శాయశక్తులా పోషించినా సమయం మిగిలిపోయేది.ఏంతోచట్లేదని మిత్రబృందమంతా ఒక రాత్రి కరెంటుపోయినపుడు ఆలోచిస్తుండగా ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది. అదే శ్రీరామనవమికి పందిరి వేయడం. సాధారణంగా సీతారామకల్యాణము గుళ్ళల్లో లేదా గుళ్ళముందర పందిళ్ళు వేసి జరుపుతారు. అంతేగానీ వినాయక చవితిలా వీధుల్లో చేయడముండదు. కానీ మేమెవరం (తెలియకపోతే శీర్షిక చూడుడు)? అంజీవాళ్ళే చేస్తున్నారమ్మా, మా దేంలేదు కొంచెం సాయం చేయడమే అని మా ఇంట్లో, ఇదే ముక్క, అదే మేము చేస్తున్నాం, వాళ్ళదేంలేదని వాళ్ళింట్లో వాళ్ళూ - ముందు చెప్పి, ఆ తర్వాత బ్రతిమాలి అనుమతులు తెచ్చుకున్నాం.

అవ్విధముగా మా వానరసైన్యం సీతారాముల కల్యాణం చేయబూనింది. మరి పందిరివేయాలంటే ముందు డబ్బులు కావాలిగా. ఒక నోటుపుస్తకం పట్టుకొని పేటలో తెలిసిన ప్రతిఒక్కరి ఇంటిపై దాడి చేశాము.భయభక్తులతో (మాపైకాదు, రాముడిపై) కొందరూ, పిల్లలపై (అంటే మేమే) ప్రేమతో మరికొందరూ , చిరాకుపడుతూ ఇంకొందరూ భూరిగాకాదు, ఒక మోస్తరుగా చందాలిచ్చారు. కానీ మేము పిడుగులముని తెలిసిన చాలామంది ముందుకురాలేదు. దాంతో మాది ఫైనాన్సర్లు చేయిచ్చిన లోబడ్జెట్ నిర్మాతల పరిస్థితైంది.

పండగ తెల్లారేసరికి అంజీ వాళ్ళింటుముందు తాటాకు పందిరేయించాం. బడ్జెటు తక్కువకాబట్టి మా ఇంట్లో టేపురికార్డరు, లవకుశ-ఘంటసాల భక్తిగీతాల క్యాసెట్లు వేదికపైకి చేరాయి.అంజీ వాళ్ళ నాన్నగారే పురోహితులుకాబట్టి ఆ ఖర్చులేదు. వాళ్ళింటి యజమానులు పీటలపై కూర్చోడానికి అంగీకరించారు.

సాయంత్రము పిల్లాపాపలకి ఆటాపాట పోటీలు పెట్టి చిన్న చిన్న బహుమతులిచ్చాం. ఇక చీకటిపడేసరికి అంజీవాళ్ళ బుజ్జి డయనోరా నలుపు-తెలుపు టీవీ లో సినిమాలు వేద్దామని వీసీఆర్ తెచ్చాం.

అసలు విషయం, నేనీ టపా రాయడానికి ముఖ్యకారణం అప్పుడు మొదలైంది. నేనేమో ముందర మనీ-మనీ సినిమా వేయాలనీ, అంజీనేమో ఇంకేదో సినిమా వేయాలనీ వంతులేస్కున్నాం. మాటామాటా పెరిగింది. అన్నయ్యలిద్దరూ సర్దిచెప్పబోయారు. ఉహూ. ఎవ్వరం తగ్గలా. చివరికీ నేను అలిగి ఇంటికెళ్లిపోయా. ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరం మాట్లాడుకోలేదు.సోషలు రీ-ఎక్జాం వచ్చెళ్లిపోయింది. మేము సెలవులకి ఊళ్ళు తిరిగొచ్చాం.అయినా మళ్లీ కలుసుకోలేదు. మావల్ల అన్నయ్యలు క్రికెట్ ఆడట్లేదు (అప్పటికి మా ఇద్దరి మధ్యనే ఎక్కువ స్నేహం, మేము సహాధ్యాయులం కాబట్టి). వాళ్ళు కలపడానికి ప్రయత్నించారు. అబ్బే! ఇద్దరం మొండివాళ్ళమే. ఇక చూడలేక మా అమ్మలుకూడ రంగంలో దిగారు. అప్పటికి మాది రెండేళ్ల స్నేహం లో అదే మొదటి గొడవమరి. అయినా లాభంలేదు. గొడవ చినికిచినికి గాలివానయ్యింది.

అలా కొన్ని రోజులు చాలా రోజులయ్యాక కారణము గుర్తులేదు, వాళ్ళింటికెళ్ళిపోయా {బహుశా వాళ్ళ పెద్దన్నయ్య వాడికి సైకిలు తెచ్చిపెట్టాడని తెలిసో, మార్కులు తెచ్చుకోవడానికో :-) }. ఇద్దరం ఒకసారి గట్టిగ నవ్వేసుకొని కలిసిపోయాం.

అంతే ఆ తర్వాత మేమెప్పుడూ గొడవపడిందీ, మా మధ్యన అభిప్రాయభేదాలు వచ్చిందీ లేదు. ఆ విధముగా గాలివానకి తట్టుకున్న రెండేళ్ళ స్నేహం మానుండి మా అన్నయ్యలకీ, ఆ తర్వాత మా అమ్మలిద్దరూ వదిన-వదినా అని పిలుచుకునేదాక వేళ్ళూనుకొని ఈ రెండు దశాబ్దాలలో పెద్దవృక్షమయ్యింది. ఎంతగా అంటే బయటివాళ్ళకి మా రెండు కుటుంబాల పరిచయం వలన మేమిద్దరం మిత్రులయ్యామనుకుంటారు. నా అన్నయ్య తర్వాత నా బెస్ట్ ఫ్రెండంటే అంజీ!

కొ.మె.: ఆ సోషలు పరీక్షలో‌నా జీవితంలోకెల్లా తక్కువ మార్కులు వచ్చాయి. అది నేను నేర్చుకున్న జీవిత పాఠం.

అం.వ్యా: సుందోపసుందులు శీర్షికకి మేము చేసిన ఘనకార్యం సరదాగా రాద్దామనుకొని, మొత్తం గుర్తొచ్చి, కొంచెం సెంటిమెంటల్ అయ్యి ఒక పెద్ద జ్ఞాపకం రాశాను, క్షమించండి.

12, ఫిబ్రవరి 2011, శనివారం

వసంతరాయపురం వెటరన్స్

అమెరికా బోస్టనులో అక్కడి కాలమానం ప్రకారం శుక్రవారం పొద్దున 4కి బయలుదేరి న్యూయార్క్,అక్కడినుండి దుబాయిమీదుగా మొత్తం౩౦ గంటల (18 గంటల ప్రయాణం + 12 గంటల ఎదురుచూపులు) తర్వాత హైదరాబాదు భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఎనిమిదింటికి దిగి, కస్టమ్స్ వారిని దాటి ఇంటికిచేరేసరికి పదకొండు. అన్నయ్య నాకోసం విమానాశ్రయానికి వచ్చాడు. మళ్ళీ పన్నెండింటికి బయలుదేరి ఆదివారం పొద్దున పదింటికి గుంటూరు ఇంటికి చేరామిద్దరం.

మధ్యాహ్నం భోజనంచేసి కూర్చోగానే మిత్రులు ప్రసాద్, అంజి వచ్చారు. మనంవచ్చాం కదా, క్రికెట్ ఆడదాం అన్నారు. పదండి అన్నా.అమ్మ తిట్టింది (మరి సంవత్సరన్నర తరవాత కనిపించాగా). అన్నయ్య జెట్లాగ్ (ప్రయాణ బడలిక) లేదా అనడిగాడు. ఇప్పటికెన్నిసార్లు దిగినరోజే ఆఫీసుకెళ్ళలేదూ - అయినా ఎన్నాళ్ళో వేచిన ఈ రోజు ఎలా పోగొట్టుకుంటామన్నా.

మూడయ్యేసరికి మైదానంలో నేనూ, అన్నయ్య, ప్రసాద్, అంజి, ఇంకో నలుగురు చేరాం. వారిలో‌ ఒకరు కొంచెం పెద్దాయన, ముప్పై ఐదు ఉంటాయేమో - మా టీం కాదు, కానీ ప్రసాదువాళ్ళ బాస్ తమ్ముడు, ఆయనా వారం క్రిందటే అమెరికా నించి వచ్చాట్ట. మా అందరికీ గత పదిహేనేళ్ళుగా కెప్టెన్, నిర్వాహకుడు అన్నీ ప్రసాదే. ఒకప్పటి పెప్సీ ప్రకటనలో చెప్పినట్లు క్రికెటే తిండి, క్రికెటే నిద్ర, క్రికెటే జీవితం అన్నమాట. మిగతావన్నీ ఆ తరువాతే. అంటే మేమందరం తక్కువ కాదులేండి,అతను కొంచెం ఎక్కువ.

మాలో మేం సరదాగా తలా ఒక ఓవరు వేసుకుంటూ ఆడుకుంటున్నాం, ఇంకెవరైనా మా వాళ్ళు వస్తారేమోనని. అప్పటికి మూడు నాలుగు నెలలనుండి వర్షాలవల్ల సరిగా ఆడట్లేదట. నేనొచ్చానని ఆ రోజే మళ్ళీ మొదలుపెట్టారట.
పక్క పిచ్`పై పదిహేను-పదహారేళ్ళ కుర్రాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళనాయకుడొచ్చి 'ప్రసాదన్నా, మ్యాచి ఆడదామన్నా!' అన్నారు. ఇంకేం, మావాడికి ఉత్సాహం పెల్లుబుకింది. మమ్మల్ని అడిగాడు.


"వాళ్ళు మనతో ఏం ఆడుతారు. పాపం వదిలేసేయ్"
"మనం మనం అయితే ఇలాఎంతసేపాడతాం. ఎండలో ఎవరు పరిగెడతారు. మ్యాచ్ అయితే పదిహేను ఓవర్లు కూర్చోవచ్చును"
"మనల్ని చూశావా? ఒక్కొక్కళ్ళం బ్యాటు పట్టుకొని నెలలు అయ్యింది. మ్యాచు ఏం ఆడతాం"
"అయినా, వాళ్ళని చూడు, మనల్ని చూడు " (చిన్నా-పెద్దా బొజ్జలు చూపిస్తూ)
"మనం పదకొండుమందిమి లేముగా!"
బాసు తమ్ముడు , "నేను పిలుస్తా, నా ఫ్రెండ్సుని"
"సరే‌పదండి"

పోటీకి సై అన్నాం.
"మ్యాచెంతన్నా?"
"వంద!"
కుర్రాళ్ళు షాక్. "మనిషికి వందన్నా? మేం వెయ్యిలేంది ఆడం"
ఈసారి మేం షాక్.అంటే మాకు ఆటరాదని కాదు, కానీ‌ సరదగా ఆడేదానికి అంత డబ్బు వృధా చేయడం మాలో ఎవ్వరికీ ఇష్టంలేదు.
చివరికి ఐదొందలకి పందెం వేశాం. ప్రసాద్ టాస్ గెలిచాడు.
"హుర్రే! మొదటి బ్యాటింగ్ మనదే. పదిహేను ఓవర్లు కూర్చోవచ్చును".

ఐదు ఓవర్లు అయ్యేసరికి టాప్ ఆర్డరు కూలింది. కేవలం మా గంభీర్ మాత్రమే మిగిలాడు. మా అమెరికా దోస్తుకేసి చూశాం - ముగ్గురు ఫారిన్ ఆటగాళ్ళేరని. ఫోన్‌లు కొట్టగా ఇంకో ఐదు ఓవర్లకి వాళ్ళు దిగారు. తీరా వాళ్ళు ఎవరంటే, వాళ్ళు ప్రొఫెషనల్సుగా ఆడినపుడు మేం బాల్‌బాయిస్మి. కానీ వారు ఇపుడు రిటైరైపోయిన కపిల్‌దేవులు కదా! మా కన్నా ఘోరం , వాళ్ళు మటుకు ఏం చేస్తారు పాపం. ముక్కుతూ మూలుగుతూ పదిహేను ఓవర్లలో‌ 50 దాటించాం. బంగ్లాదేశ్^చేతిలో ఓడుతున్న భారత్‌లాగావుంది మాపరిస్థితి.

ఇంక బౌలింగు మొదలుపెట్టాం. మా వీరోచిత బౌలింగు-ఫీల్డింగులతో కేవలం ఆరు ఓవర్లలో‌వారిని కొట్టనించి, వారిని తృప్తిపరచాం. ఏదోలేండి, పిల్లకాయలు - మాపై గెలిచామన్నది వారికి వారిపై విశ్వాసం కలిగిస్తుందని జాలిపడ్డామన్నమాట! కానీ‌ ఆమాత్రం కృతజ్ఞతన్నాలేకుండ ఆ పిల్లకాయలు మమ్మల్ని చూసి నవ్వడం మొదలు పెట్టారు.

మ్యాచ్ అనంతర విశ్లేషణ:
"అహా!మనం సచిన్‌లాంటివారం. మనం బ్యాటు పట్టుకున్నపుడు వీళ్ళు పుట్టనుకూడ వలేదు. ఇపుడంటే ప్రాక్టీసులేదు, ఫాంలో లేముగానీ మనం మొన్నటిదాకా మంచి ప్లేయర్లమేగా!"
నేను: "కొందరికి పెళ్ళిళ్ళయిపోయినాయి.కొందరం రేపోమాపో చేసుకోబోతులున్నాం. బొజ్జలుకూడవచ్చాయి. ఇంకెన్నాళ్ళాడతాం (ఇలా ఇంకెన్నాళ్ళులే,ఇంకెన్నాళ్ళులే అంటూనే ఐదారేళ్ళనించీ ఆడుతున్నాములేండీ). ఐపీల్‌ జట్లలా మనకీ ఒక పేరుండాలి. ఇకనుండి మనం 'వసంతరాయపురం వెటరన్స్'!" (వసంతరాయపురం మా పేటలేండి.)

"ఛీ మనం వెటరన్స్ ఏంటి, యూతైతే. మనం వసంతరాయపురం వారియర్సుమి."
"అవును కదా!"

20, జనవరి 2011, గురువారం

విరామం తర్వాత...

హమ్మయ్య! కొద్ది విరామం తర్వాత మళ్ళీ ఈ బ్లాగు ప్రపంచంలోకి వచ్చే వీలు కొంత చిక్కిందండి. నన్ను గుర్తుపెట్టుకొని నాకు శుభాకాంక్షలు చెప్పిన బులుసు సుబ్రహ్మణ్యంగారికి, శిశిరగారికి, మరికొందరికి, మరియు నా బ్లాగుకి వచ్చివెళ్ళివారినందరికీ కృతజ్ఞతలు.

ఇంతకీ ఈ విరామానికి కారణమేమిటంటే నేను బోస్టన్ నుండి హైదరాబాదుకి ఈ నూతన సంవత్సరం తిరిగి వచ్చేశానండి. ఆ తర్వాత కొత్త సంవత్సరం, సంక్రాంతి ఇంట్లో జరుపుకొనే సంతోషంలో కావాలని ఈ మిథ్యా ప్రపంచానికి కొంచెం దూరంగున్నా. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాదులో ఉద్యోగం, ఇల్లు వెతుక్కునే గొడవలో {ఇంకా దొరకలేదండి :-( } పడిపోయాను. కుదురుగా కూర్చొని బ్లాగు రాయడానికి, మీ బ్లాగులు చదవడానికి ఇంకొన్ని రోజులు పట్టవచ్చును.

అప్పటిదాకా వుంటానండి.