ముందుగా రామభక్తులకు ఆలస్యముగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే ఈ సుందోపసుందులు (అనగా నేనూ-అన్నయ్య- మా బ్యాచి) ఒకానొక సంవత్సరం ఇల్లు(ళ్ళు) పీకి (శ్రీరామనవమి) పందిరి వేసిన జ్ఞాపకం కళ్ళముందుకొస్తుంది.
అవి నేను, అంజి ఏడవ తరగతి పరీక్షలు అయిపోయాయి అని సంబరాలు చేసుకుంటుండగా (నాకు చదవడానికి ఆసక్తిగా, పరీక్షకి చిరాగ్గా అనిపించే) సోషలు పేపరు లీకవడంతో పరీక్ష రద్దు చేసి ఒక వారం రోజుల్లో రీ-ఎక్జాం అని ప్రభుత్వం ప్రకటించిన రోజులు. అన్నయ్యకి, అంజీ వాళ్ళన్నయిన మా క్రికెట్ నాయకుడు ప్రసాదుకీ కూడా పరీక్షలు అయిపోయినట్లు గుర్తు.
పొద్దునా-సాయంత్రాలు ఆడే క్రికెట్ కాక, ఉడుం, కబడ్డీ, అష్టాచెమ్మా, అచ్చంగిల్లాలు, పిక్కలాట, గోలీలు, నేల-బండ, కుందుళ్లు, బ్యాడ్మింటన్, చెస్, క్యారంబోర్డు, పిన్‌బోర్డు, బిజినెస్ (మోనోపలీ) వంటి స్వదేశీ-విదేశీ ఆటలన్నీంటినీ మా శాయశక్తులా పోషించినా సమయం మిగిలిపోయేది.ఏంతోచట్లేదని మిత్రబృందమంతా ఒక రాత్రి కరెంటుపోయినపుడు ఆలోచిస్తుండగా ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది. అదే శ్రీరామనవమికి పందిరి వేయడం. సాధారణంగా సీతారామకల్యాణము గుళ్ళల్లో లేదా గుళ్ళముందర పందిళ్ళు వేసి జరుపుతారు. అంతేగానీ వినాయక చవితిలా వీధుల్లో చేయడముండదు. కానీ మేమెవరం (తెలియకపోతే శీర్షిక చూడుడు)? అంజీవాళ్ళే చేస్తున్నారమ్మా, మా దేంలేదు కొంచెం సాయం చేయడమే అని మా ఇంట్లో, ఇదే ముక్క, అదే మేము చేస్తున్నాం, వాళ్ళదేంలేదని వాళ్ళింట్లో వాళ్ళూ - ముందు చెప్పి, ఆ తర్వాత బ్రతిమాలి అనుమతులు తెచ్చుకున్నాం.
అవ్విధముగా మా వానరసైన్యం సీతారాముల కల్యాణం చేయబూనింది. మరి పందిరివేయాలంటే ముందు డబ్బులు కావాలిగా. ఒక నోటుపుస్తకం పట్టుకొని పేటలో తెలిసిన ప్రతిఒక్కరి ఇంటిపై దాడి చేశాము.భయభక్తులతో (మాపైకాదు, రాముడిపై) కొందరూ, పిల్లలపై (అంటే మేమే) ప్రేమతో మరికొందరూ , చిరాకుపడుతూ ఇంకొందరూ భూరిగాకాదు, ఒక మోస్తరుగా చందాలిచ్చారు. కానీ మేము పిడుగులముని తెలిసిన చాలామంది ముందుకురాలేదు. దాంతో మాది ఫైనాన్సర్లు చేయిచ్చిన లోబడ్జెట్ నిర్మాతల పరిస్థితైంది.
పండగ తెల్లారేసరికి అంజీ వాళ్ళింటుముందు తాటాకు పందిరేయించాం. బడ్జెటు తక్కువకాబట్టి మా ఇంట్లో టేపురికార్డరు, లవకుశ-ఘంటసాల భక్తిగీతాల క్యాసెట్లు వేదికపైకి చేరాయి.అంజీ వాళ్ళ నాన్నగారే పురోహితులుకాబట్టి ఆ ఖర్చులేదు. వాళ్ళింటి యజమానులు పీటలపై కూర్చోడానికి అంగీకరించారు.
సాయంత్రము పిల్లాపాపలకి ఆటాపాట పోటీలు పెట్టి చిన్న చిన్న బహుమతులిచ్చాం. ఇక చీకటిపడేసరికి అంజీవాళ్ళ బుజ్జి డయనోరా నలుపు-తెలుపు టీవీ లో సినిమాలు వేద్దామని వీసీఆర్ తెచ్చాం.
అసలు విషయం, నేనీ టపా రాయడానికి ముఖ్యకారణం అప్పుడు మొదలైంది. నేనేమో ముందర మనీ-మనీ సినిమా వేయాలనీ, అంజీనేమో ఇంకేదో సినిమా వేయాలనీ వంతులేస్కున్నాం. మాటామాటా పెరిగింది. అన్నయ్యలిద్దరూ సర్దిచెప్పబోయారు. ఉహూ. ఎవ్వరం తగ్గలా. చివరికీ నేను అలిగి ఇంటికెళ్లిపోయా. ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరం మాట్లాడుకోలేదు.సోషలు రీ-ఎక్జాం వచ్చెళ్లిపోయింది. మేము సెలవులకి ఊళ్ళు తిరిగొచ్చాం.అయినా మళ్లీ కలుసుకోలేదు. మావల్ల అన్నయ్యలు క్రికెట్ ఆడట్లేదు (అప్పటికి మా ఇద్దరి మధ్యనే ఎక్కువ స్నేహం, మేము సహాధ్యాయులం కాబట్టి). వాళ్ళు కలపడానికి ప్రయత్నించారు. అబ్బే! ఇద్దరం మొండివాళ్ళమే. ఇక చూడలేక మా అమ్మలుకూడ రంగంలో దిగారు. అప్పటికి మాది రెండేళ్ల స్నేహం లో అదే మొదటి గొడవమరి. అయినా లాభంలేదు. గొడవ చినికిచినికి గాలివానయ్యింది.
అలా కొన్ని రోజులు చాలా రోజులయ్యాక కారణము గుర్తులేదు, వాళ్ళింటికెళ్ళిపోయా {బహుశా వాళ్ళ పెద్దన్నయ్య వాడికి సైకిలు తెచ్చిపెట్టాడని తెలిసో, మార్కులు తెచ్చుకోవడానికో :-) }. ఇద్దరం ఒకసారి గట్టిగ నవ్వేసుకొని కలిసిపోయాం.
అంతే ఆ తర్వాత మేమెప్పుడూ గొడవపడిందీ, మా మధ్యన అభిప్రాయభేదాలు వచ్చిందీ లేదు. ఆ విధముగా గాలివానకి తట్టుకున్న రెండేళ్ళ స్నేహం మానుండి మా అన్నయ్యలకీ, ఆ తర్వాత మా అమ్మలిద్దరూ వదిన-వదినా అని పిలుచుకునేదాక వేళ్ళూనుకొని ఈ రెండు దశాబ్దాలలో పెద్దవృక్షమయ్యింది. ఎంతగా అంటే బయటివాళ్ళకి మా రెండు కుటుంబాల పరిచయం వలన మేమిద్దరం మిత్రులయ్యామనుకుంటారు. నా అన్నయ్య తర్వాత నా బెస్ట్ ఫ్రెండంటే అంజీ!
కొ.మె.: ఆ సోషలు పరీక్షలోనా జీవితంలోకెల్లా తక్కువ మార్కులు వచ్చాయి. అది నేను నేర్చుకున్న జీవిత పాఠం.
అం.వ్యా: సుందోపసుందులు శీర్షికకి మేము చేసిన ఘనకార్యం సరదాగా రాద్దామనుకొని, మొత్తం గుర్తొచ్చి, కొంచెం సెంటిమెంటల్ అయ్యి ఒక పెద్ద జ్ఞాపకం రాశాను, క్షమించండి.
బాల్య స్మృతులు ఎప్పటికైనా మధురంగానే ఉంటాయి. స్నేహితులతో గిల్లికజ్జాలైనా తరువాత గుర్తుకు వస్తే ఆహ్లాదం గా ఉంటాయి. బాగుంది టపా.
రిప్లయితొలగించండిసుబ్రహ్మణ్యంగారు: ధన్యవాదాలు
రిప్లయితొలగించండిఇలాంటి అనుభవమే నాకూ ఉందని చెప్పుకోడానికి గర్వ పడుతున్నానండీ..
రిప్లయితొలగించండిచాలా గొప్ప పనులే చేసేవారన్నమాట మీరు. చాలా అందంగా ఉన్నాయి మీ జ్ఞాపకాలు. )
రిప్లయితొలగించండి@నెమలికన్ను మురళిగారు: మీ బ్లాగులో అలాంటి అనుభవం చదివినట్లు గుర్తులేదండి. త్వరలో రాయగలరా? మీరు జ్ఞాపకాలు బాగా రాస్తారు.
రిప్లయితొలగించండి@శిశిరగారు: :-)
ఏమైపోయవైయ్యా కమ్యూనిష్టు కురు వృద్ధుడా, గుంటూరోల్లే కనిపించడంలేదు బ్లాగుల్లో, ఎంత మిస్ అవుతున్నామో "నీ జీవనయాన" కబుర్లని.
రిప్లయితొలగించండితారగారు: ఏమైపోలేదండీ, వీలైనప్పుడల్లా బ్లాగులోకంలో విహరిస్తూనే ఉన్నాను. పని ఒత్తిడి ఎక్కువవడంతో రాయడంకాదు కదా, వ్యాఖ్యానించడానికికూడ సమయం చిక్కట్లేదు. సరుకుకి కొదవలేదు. పైగా రాయాలంటే సృజనా రసాలు (అదే క్రియేటివ్ జ్యూసెస్), సమయం కలిసిరావాలి, కుదురుగా ఒక అరగంటన్నా కూర్చోగలగాలి. అప్పటికీ నా "నాకనులతో..."ని తరచుగా నింపుతూనే ఉన్నానండి. :-)
రిప్లయితొలగించండి>>> కమ్యూనిష్టు కురు వృద్ధుడా
ష్!!! :-)