3, సెప్టెంబర్ 2011, శనివారం

భువనగిరి సాహసం


2009లో వరుసగా వారాంతాలు నిస్సారంగా గడుస్తున్న  రోజుల్లో నేనూ, సహనివాసి (రూమ్మేట్)వెంకటేశన్ వీలున్న ప్రతి వారాంతం బండి వేసుకొని ఎటోఒకవైపు వెళ్ళాలని నిర్ణయించాం. హైదరాబాదు చుట్టుపక్కలన  100 కి.మీ.లలో ఏమున్నాయా అని వెతుకుతుండగా భువనగిరి కోట గురించి తట్టింది.ఈ కోటని ఎపుడు హైదరాబాదు-గుంటూరు రైల్లోవెళ్ళినా చూస్తుంటాను (బీబీనగర్ తర్వాత ఎడమవైపున కనిపిస్తుంది).

భువనగిరి  హైదరాబాదు-వరంగల్ రహదారి (ఎన్.ఎచ్.202)మార్గంపైనా, సికిందరాబాద్-కాజీపేట  రైలుమార్గంపైనా తగులుతుంది. ఉప్పల్ నుండి దాదాపు 35 కి.మీ., గచ్చిబౌలినుండి 65 కి.మీ. ఉంటుంది.

ఒక శనివారం పొద్దున్నే 6.30 కి గచ్చిబౌలి నుండి బయలుదేరాం.మెహదీపట్నం, లిబర్టీ, నారాయణగూడ బాగానే దాటాం. ఆ తర్వాతనే దారి తప్పాం. వారినీ,వీరినీ అడుగుతూ 8కి ఉప్పల్ రింగురోడ్డు చేరాం. అక్కడ ఫలహారం చేసి మళ్ళీ బయలుదేరాం. అప్పటికి ఇన్ఫోసిస్ లేకపోవడం, విస్తరణ పనులు లేకపోవడం వలన, ఎటువంటి రద్దీ,ఆటంకములు లేకుండా 8.45 కల్లా వెళ్ళిపోయాం. అంతకు ముందురోజే వర్షం పడటం వల్ల, ఎండలేకుండా మబ్బుగా-చల్లగా ఉండటం వల్ల, బైకు ప్రయాణం చాలా ఆహ్లాదంగా జరిగింది. భువనగిరి చేరాక, కొండ ప్రవేశము ఎక్కడో అంత చిన్న ఊరైనా చెప్పలేకపోయారు :-( ఎలాగో కనుక్కొని వెళ్ళితే తొమ్మిదయితేగానీ గేటు తెరవరని ఎదురుగున్న కొట్టువాడు చెప్పాడు. అదృష్టంకొద్ది వాడు తొమ్మిదికల్లా వచ్చాడు. మేము తప్ప పర్యాటకులు ఎవరూ కనిపించలా. వాడు మమ్మల్ని అదోలా చూసి టిక్కెట్లిచ్చాడు.

గేటుతీసి లోపలికి వెళ్లగానే 'సర్దార్ సర్వాయి పాపన్న' విగ్రహం ఒక వాలు గుట్టకింద కనిపించింది. గుట్టపైన ఒక కోటలాగుంది. అరే, ఇంత క్రిందకున్నదేంటిది అని బాధపడ్డాం ఇద్దరం. పైగా రైల్లోంచి చూస్తే చాలా ఎత్తులో ఉందిగదా అని అనుకున్నాం.
***చిత్రం పెద్దదిగా కనిపించడానికి దానిపై నొక్కండి***
  అలా ఏటవాలుగా ఎక్కుతుంటే అదేదో పాత శోభన్‌బాబు సినిమా క్లైమాక్స్ గుర్తొచ్చింది.


ఇలా పైకి ఆవేశంగా ఎక్కాక, అక్కడింక దారిలేదు. పక్కన మెట్లు కనిపించాయి. ఎక్కడమైతే ఎక్కానుగానీ, దిగడానికి భయమేసిందండోయ్!


ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్లితే మేము చూసింది బురుజు మాత్రమేనని, కోటపైనెక్కడో ఉందని తేలింది.

బురుజుమీదనుండి భువనగిరి బస్టాండు -

ఈ బురుజు దగ్గరనుండి ఇంక మెట్లు కనిపించలేదు.మళ్ళీ ఒకటే గుట్టలాగ కనిపించింది.


ఆ గుట్టకూడ ఆవేశంగా ఎక్కాక, అక్కడ కొన్ని ఫిరంగులు కనిపించాయి. ఇంక అక్కడ నుండి కోటకి దారి చూశాక అప్పుడు చుక్కలు కనిపించాయి.

మొదట ధైర్యం చాల్లేదు. ఎందుకంటే అక్కడ మెట్లు సరిగాలేవు. కానీ పట్టుకోవడానికి  ఒకరెయిలింగు మాత్రం ఉంది. వెళ్ళాలా వద్దా. ఇక్కడ నుండి పడిపోతే ఏమన్నా ఉందా, మనవాళ్ళకి కబురు పంపేవాళ్లుకూడ ఉన్నట్లు లేరు అని అనుకున్నాం.

ఇంతలో ఒక మనిషి పైకెక్కుతూ‌కనిపించాడు. సరేనని మేమూ ధైర్యం చేశాం. ఈలోపు ఇంకో ఇద్దరు మాలాగా బండిపై వచ్చినవాళ్ళు కలిసారు. వారూ మావెనకే బయలుదేరారు.


తీరా అంత కష్టపడి పైకి వెళ్ళితే అక్కడ నాలుగు గోడలు తప్పితే కోటలాగ ఏమి అనిపించలేదు. కానీ బీ.ఎస్.ఎన్.ఎల్ వాడి టెలిఫోను టవరు మాత్రం ఉంది. మేము చూసిన వ్యక్తి అక్కడ పనిచేస్తాడట. రోజూ పైకెక్కుతాడంట. అతని ఉద్యోగం చూశాక నా ఉద్యోగంలో ఉన్న కష్టాలన్నీ మరిచిపోయాను.


కోట నిరుత్సాహపరిచినా, అక్కడినుండి కనిపించిన ప్రకృతి దృశ్యాలు మటుకు మా శ్రమనంతా మరిచిపోయేటట్లు చేశాయి.



అలా పైన ఒక గంట గడిపాక నెమ్మదిగా మిగతా పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. పర్లేదు, ఒక ఇరవై మందిదాక కనిపించారు. ఇక క్రిందకి దిగడం మొదలుపెట్టి పదకొండున్నరకల్లా  బైకుదగ్గరకి చేరాం.

అనుకోకుండా మొదలుపెట్టినా మాకు చాలా ఆనందాన్ని కలిగించిన ప్రయాణం. ఆ తర్వాత అలాంటి ప్రయాణాలు మళ్ళీ మళ్ళీ చేయాలనుకున్నాం గానీ నేను అమెరికా ఇంకోసారి వెళ్ళాల్సిరావడంతో కుదరలేదు.:-(




భువనగిరి గురించి ఇంటర్నెట్లో వెతుకుతుంటే శరత్‌కాలంగారి బ్లాగు కనిపించి చదవడం మొదలుపెట్టి, అక్కడినుండి మిగతావారివి చదువుతూ నెమ్మదిగా తెలుగుబ్లాగులకి అతుక్కుపోయా.

16 కామెంట్‌లు:

  1. అదృష్టవంతులండీ మీరు.. భాగ్యనగరానికొచ్చి పుష్కరం దాటిపోయినా, చుట్టుపక్కలసంగతి ఆవతల ఉంచి ఊరి నడిబొడ్డున ఉన్న ప్లానెటోరియం కూడా చూడ్డం అవలేదు,పిల్లలు ఎంత గోడవ చేస్తున్నా.. :(

    కానీ, ఒక మినహాయింపు మాత్రం ఉందండోయ్!.. చార్మినార్ చాలాసార్లు చూసాను. అంటే దానిమీద ప్రత్యేక అభిమానం అని కాదూ.. పక్కనే ఉండే ముత్యాల కొట్టులకి.. శ్రీమతితో..! :D

    రిప్లయితొలగించండి
  2. నేను ఎట్టా మిస్ అయ్యాను, హైదరాబాదునుంచి రైల్లో బోలెడు సార్లు వచ్చానే గుంటూరు, ఈ సారి చూడాలి, బీబీ నగర్ దాటాక ఎడమ వైపు అంటే హైదరాబాదు నుంచి వస్తున్నప్పుడేగా?

    అబ్బాయా 2009లో మొదలెటావ్ 2012 వచ్చేస్తున్నది, ఎన్ని కబుర్లు చెప్పాలో మాకు.. త్వరత్వరగా చెప్పేసేయి.
    బహుశా ఏ గొడవలు, ఇబ్బందులూ లేకుండా వెళ్ళాం అని చెప్పిన మొడటి టపా ఇదే అనుకుంటా.

    రిప్లయితొలగించండి
  3. మీరు చూసింది భువనగిరి కాదు, భోంగిర్ అందుకే ఆ కోట అలా ఏడిచివుంటుంది. :)) ;)

    రిప్లయితొలగించండి
  4. చాలా సార్లు రైల్లోంచి చూసి.. ఈసారి ఎప్పుడైనా ఎక్కాలి అనుకుంటూ ఉంటాం.. కానీ ఎప్పుడూ కుదరలేదు.
    మంచి వ్యాసం!

    రిప్లయితొలగించండి
  5. @శరత్‌గారు: మనం చిన్నప్పటినుండి చూసిందే, వీడెవడు కొత్తగా ఫొటోలు పెట్టి గొప్పగా చెప్పుకుంటున్నాడురాని ఒక :-) పెట్టారా? ;-)

    @Snkr: :D

    @తారగారు: అవునండీ, హైదరాబాదునుండి వచ్చేటపుడు ఎడమవైపున దూరంగా కనిపిస్తుంది. వరంగల్ దారైతే రైలయినా, రోడ్డయినా ఊరే తగులుతుంది.

    @రవికిరణ్^గారు: ఈ ఊళ్ళో నక్షత్రశాల నేనూ చూడలేదండి, చిన్నపుడు కలకత్తాలో చూసేయడంతో తర్వాత ఆసక్తి కలగలేదు. చార్మినార్ ఏడేళ్ళల్లో రెండుసార్లు మాత్రమే వెళ్ళాను. :-)

    @కృష్ణప్రియగారు: కృతజ్ఞతలు. బెంగుళూరులో నంది హిల్స్ వెళ్ళారా? అదికూడ బాగుంటుందని విన్నా. బెంగళూరు వెళ్ళినపుడు కుదిరించుకొని వెళ్ళాలి.

    రిప్లయితొలగించండి
  6. 1999 లో వీరావేశం తో బురుజు దాకా ఎక్కాం నేను మా శ్రీమతి కూడా. ఆపైన ధైర్యం చేయలేకపోయాము. అప్పుడు అక్కడ ఎవరు లేరు. టికెట్ తీసుకున్న గుర్తు లేదు. ఈ మధ్యన నెట్ లో కధలు చూసి ఏదో మిస్ అయిపోయాం అనుకున్నాను. పెద్దగా ఏమి మిస్ కాలేదని ఇప్పుడు తెలిసింది.

    రిప్లయితొలగించండి
  7. @బులుసుగారు: అవునండి. అక్కడ పెద్దగా ఏమిలేదుగానీ, బురుజునుండి ఆ పైకి మెట్లు లేకుండ ఎక్కడం కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. ఈ మధ్యన పర్వతారోహక సంఘాల(హైకింగ్ క్లబ్బులు)వాళ్ళు కొంచెం హడావిడి చేస్తున్నారులేండి.

    రిప్లయితొలగించండి
  8. మిక్కిలి ధన్యవాదాలు.

    అక్కడికి నలభై నిమిషాల దూరంలో పెరిగి, ఆ ట్రెయిన్స్ లోంచి ఆ కోటని, కొన్ని వందల సార్లు చూస్తూ వెళ్ళిన వాణ్ణి, నేనిప్పటి వరకీ చూడలేదు. మొన్న ఇండియా వెళ్ళినప్పుడు జైపూర్, ఆగ్రా, ఢిల్లీ, ఫతేపూర్-సిక్రీ కోటలన్నీ చూసి ఇంటికెళ్తూన్నప్పుడు కార్ విండోలోంచి చూసినప్పుడు అనిపించింది, ఇంటికింత దగ్గర్లో ఉంది ఇదెప్పుడన్నా చూడాలీ అని.

    ఏమో, ఇప్పుడంత లేదనుకోండి :-)))

    పోతే, ఖిల్లా వరంగల్ చూసారా. దాని కోసం స్పెషల్ గా ట్రిప్ వేసేంత కాదు కానీ, వేయి స్థంబాల గుడీ, ఓరుగల్లు కోట ఒకే రోజులో చూసి, మళ్ళీ రాత్రికల్లా హైదరాబాదు వెళ్ళిపోవచ్చు. రామప్ప గుడి కూడా కలుపుకోవచ్చు కావలిస్తే, కాని ఒక్కరోజులో కుదరదనుకుంటా.

    రిప్లయితొలగించండి
  9. @బులుసుగారు

    టికెట్ తీసుకున్న గుర్తు లేదు.
    ...

    అందుకు కదూ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వచ్చింది, అమ్మో అమ్మో, తెలంగాణా సంపద మొత్తం ఇట్టాకదూ దోచేస్తున్నది, మీరు తక్షణం టికెట్టు డబ్బులని యం.ఒ. చెయ్యాలని డిమాండ్ చేస్తున్నా.

    @SNKRగారు

    భోంగిర్ అంటే టికెట్టు 10రూ. అదే భువనగిరి అంటే 100రూ., (ముక్కోడి డవిలాగ్ కాపీ)

    రిప్లయితొలగించండి
  10. @Kumarnగారు:
    కొన్ని అంతేలేండి. గుంటూరులో‌ పుట్టి-పెరిగి, నాలుగేళ్ళనుండి ఎసెల్లార్ కెమెరా చేతిలో పెట్టుకొని పక్కనే ఉన్న ఉప్పలపాడు పక్షి కేంద్రానికి వెళ్ళడానికి కుదరలేదు. వరంగల్ చిన్నపుడు చూశానండి, కెమెరాతో మళ్ళీ వెళ్ళాలి - కుదరట్లేదు.

    @తారగారు: విదేశీయులకి వేరే ధరలు విన్నాగానీ, పక్కరాష్ట్రీయులకి కూడానా? ;-)

    రిప్లయితొలగించండి
  11. @తార గారు,

    టికెట్ తీసుకొన్న గుర్తు లేదు అన్నాను కానీ తీసుకోలేదు అని అనలేదు అని గమనించాలి. నేను అనని విషయం నాకు ఆపాదించడాన్ని ఖండిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  12. భువనగిరి ప్రయాణం గురించి బాగా రాశారు .. విదేశీ ప్రయాణాల గురించి గొప్పగా చెప్పుకొనే మన వాళ్ళు స్థానికంగా ఉన్న వాటిని కూడా చూడలేక పోతున్నారు. నేను భువనగిరి కోట ఎక్కాను. అయితే నేను మొదట ఉద్యోగం చేసింది మెదక్ జిల్లాలోనే అయిన మంజీర బ్యారేజ్ వద్దకు వెళ్లి పక్షులను చూడాలనే ఆలోచన రాలేదు

    రిప్లయితొలగించండి
  13. బుద్దా మురళిగారు, థాంక్సండి. స్వదేశీ ప్రయాణాలు‌ అంటే సాధారణంగా‌ తీర్థయాత్రయైనా‌ అవుతుంది‌, లేదా‌ ఏదన్నా ప్రముఖ‌ కట్టడం‌ ముందు‌ ఒక‌ నాలుగు‌ ఫోటోలు‌ తీసుకోవడం అవుతుంది.

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in