10, సెప్టెంబర్ 2011, శనివారం

మంజీర రవళులతో


కాకి, పిచ్చుక, చిలుక, కోకిల, కొంగ, కోడి, నెమలి , ఇంకొన్నుండచ్చు- ఇవి నేను కళ్ళారా చూసిన కొన్ని పక్షులు. బెంగుళూరు, విదేశాల్లో‌ఉన్న నా ఫోటోగ్రఫీ మిత్రులు పెట్టే వివిధ రకాల పక్షి చిత్రాలు చూసి, ఆహా ఓహో అనుకోవడం తప్పితే నిజజీవితంలో‌అలాంటి పక్షులనునేనూ చూడాలి, ఫోటోలు తీయాలి అనుకుంటుండేవాడిని.

అలాగే 2009లో‌భువనగిరి సాహసం తర్వాత అమెరికా వెళ్ళడంతో  ఆగిపోయిన ఉత్సాహం 2011లో  స్వదేశానికి తిరిగి వచ్చాక  మళ్ళీ ఏదోక పర్యటన చేయాలనిపించింది. అలా అనుకొని,అనుకొనీ చివరికి గత జులైలో మంజీర ఆనకట్టకి  వెళ్ళివచ్చాం.

మంజీర ఆనకట్ట (బ్యారేజి)హైదరాబాదుకి  ముఖ్యమైన నీటి సరఫరా కేంద్రం. కేవలం ఆనకట్టేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన పక్షిసంరక్షణా కేంద్రాల్లో‌ఒకటి.

బిఎచ్‌ఈఎల్ సర్కిల్ నుండి ముంబాయిరోడ్డుపై ౩౫ కి.మీ.లు పోతే సంగారెడ్డి క్రాస్^రోడ్డు వస్తుంది (కారులో వెళ్ళితే టోల్ కట్టాలి, బైకయితే అక్కరలేదు). ఇక్కడ కుడిపక్కకి తిరిగితే సంగారెడ్డి పట్టణం వస్తుంది. పట్టణంలో పెట్రోల్ బంకు దాటాక, ఒక రెండు కి.మీ.వెళ్ళాక ఎడమవైపు ఒక సమాధి కనిపిస్తుంది (జాగ్రత్తగా గమనించాలి). ఇక్కడ ఎడమవైపు తిరిగితే మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం ఉంటుంది. ఈ రోడ్డులో‌ఒక కి.మీ. వెళ్ళితే ఒక మసీదుగోడ కనిపిస్తుంది. ఇక్కడ కుడివైపు తిరగాలి. ఈ దారి చాలా జాగ్రత్తగా గుర్తులు పెట్టుకొంటూ‌వెళ్ళాలి. గూగుల్ పటాలు కొంతవరకే తోడ్పడాయి.

ఒక శనివారం పొద్దునే నేనూ, ధర్మేన్ నా బైకుపై  బయలుదేరి  పొద్దునే తొమ్మిది కల్లా అక్కడికి చేరాం. మళ్ళీ మా అదృష్టం కొద్దీ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఎండలేకుండ ఉంది.బ్యారేజి గేటు దగ్గర ఒక ఆఫీసుగదిలో ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటనడిగారు? ఇలా చూడటానికి వచ్చాం అనడిగాం. ఒక నవ్వు నవ్వారు. సరే, ఈ పుస్తకంలో‌సంతకం పెట్టి, గేటు బయట బండి పెట్టి వెళ్ళమన్నాడు.

ఆ వాతావరణం చూడగానే కొంచెం బెరుకొచ్చింది. మేమిద్దరం తప్పితే ఎవరూ లేరు అక్కడ. ఫోటోలు తీసుకోవచ్చో, తీసుకోకూడదో తెలియలేదు. కుడిపక్కకి మొసళ్ళ కేంద్రం అని ఉంటే అటు నడవటం మొదలుపెట్టాం. ఆ దారిలో చెట్టుపైనున్న   ఒక నెమలి మమ్మల్ని చూసి భయపడి ఎగిరి వెళ్ళిపోయింది. కెమెరా చేతిలో‌పెట్టుకోనందుకు తిట్టుకున్నాం. ఒక పది నిమిషాలు ఎదురు చూసినా ఆ నెమలి బయటకి రాలేదు. సరేనని ముందుకెళ్ళాం. మొసళ్ళకేంద్రానికి తాళం పెట్టుంది, అవి ఉండాల్సిన నీటిగుంట ఎండిపోయుంది, మొసళ్ళున్న ఆనవాళ్ళేం కనిపించలేదు.

బ్యారేజిపైకి వెళ్ళుదామంటే ప్రవేశం నిషిద్ధం అనుంది. సరే అక్కడ ఒక వెయ్యేళ్ళ శివాలయం ఉందంటే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాం.అది ఇంకా నిరాశ కలిగించింది. దానికి రంగులేసి ఉండటంతో‌మామూలు గుడిలాగుంది. ఇంకేం చేద్దామా అనుకుంటే అపుడు నెమ్మది నెమ్మదిగా వివిధ రకాల పక్షులు కనిపించడం మొదలుపెట్టాయి.

అలా చాలా చిత్రాలు తీయగా చాలా కొద్దిమాత్రమే పంచుకోదగినవి వచ్చాయి. కొన్ని  నా చేతకానితనం వల్లయితే, ఉన్నట్టుండి వచ్చిన ఎండ వల్ల ఇంకొంచెం. తీసినవన్నీ‌నా  "నా కనులతో..." బ్లాగులో మంజీర అన్న  లేబుల్ కింద పెట్టాను. చూసి ఆనందించండి.

ఇంతలో‌ అటవీ సంరక్షణాధికారి జీపు వచ్చింది. సర్లే మనదగ్గర విలువైన కెమరా ఉంది, ఎందుకొచ్చిన గొడవని దిగి వెనక్కి రావడం మొదలుపెట్టాం. వెనక్కి వస్తుంటే నెమ్మనెమ్మదిగా జనాలు రావడం కనిపించింది. మమ్మల్ని పంపించలేదుగానీ, వాళ్ళల్లో చాలా మంది మాత్రం చక్కగా బ్యారేజి మెట్లు ఎక్కుతూ కనిపించారు. కొందరు బళ్లు కూడ వేసికొని లోపలికొచ్చారు. చాలా ప్రేమపక్షులూ కనిపించాయి. అప్పటికే పదకొండు అవ్వడంతో మళ్ళీ బ్యారేజివైపు వెళ్ళాలనిపించలేదు. ఆ నెమలికోసం మళ్ళీ ఎదురుచూశాం.అరుపులు వినిపించాయిగానీ, ఈ  జనాల  అలికిడితో గంటసేపుచూసినా అది బయటకిరాలేదు. ఆ నెమలిని చూడకపోవడమొక్కటే మా పర్యటనలో‌చిన్న లోపం.

విసుగొచ్చి ఇంక తిరుగుముఖం పట్టాం. సంగారెడ్డి జంక్షన్ దాటంగానే హైదరాబాదు దారిలో‌వరుసగా  ఫ్యామిలీ  ధాబాలున్నాయి.పేరు గుర్తులేదుగానీ కొంచెం హంగామా తక్కువున్న ఒకదానిలోకి వెళ్ళాం. ఆ‌ప్రదేశాని ఆ ధరలు కొంచెం ఎక్కువైన మేము తీసుకున్న ఉత్తరభారతీయ వంటకాలు చాలా బాగున్నాయి.

8 కామెంట్‌లు:

  1. సంగారెడ్డి దగ్గర పక్షి సంరక్షణ కేంద్రం ఉందని కూడా నాకు తెలియదు. ఒక దశాబ్దం క్రితం సంగారెడ్డి (అనే అనుకుంటాను. గుర్తులేదు) చుట్టుపక్కల నర్సరీస్ చూడడానికి వెళ్ళాను ఒక మిత్రుడితో.

    మీ అనుభవాలు చదివిన తరువాత ఆ ప.సం.కే చూడక పోయినా ఫరవాలేదనిపిస్తోంది.

    తార గారు వచ్చే లోపు నేను జంప్ అవడం మంచిది. లేకపోతే ఇంకేమి అబ్జెక్షన్ పెడతారో ఆయన. ... దహా

    రిప్లయితొలగించండి
  2. బాగుంది. నేనూ అసలు ఈ ఆనకట్ట గురించి, చుట్టు పక్కల ప్రదేశాల గురించి విననే లేదు.

    రిప్లయితొలగించండి
  3. @తార: మీ వ్యాఖ్యకోసం ఎదురుచూస్తున్నానండి.

    @బులుసు సుబ్రహ్మణ్యంగారు: మానవ నిర్మితాలైన ఆనకట్ట, శివాలయం, మొసళ్ళ కేంద్రం వదిలేస్తే ప్రకృతిలో భాగమైన అరుదైన పక్షులు చూడటానికి వెళ్ళచ్చండీ! ఇది నా బ్లాగు. తార గురించి ఆలోచించక్కర్లేదు, నిరభ్యంతరంగా మీ అభిప్రాయాలు పెట్టచ్చండి.

    @కృష్ణప్రియగారు: ధన్యవాదాలు. ఇంకా ముందుకు వెళ్ళితే సింగూరు ఆనకట్ట కూడా వస్తుందండి. సమయంలేక, బైకు సరైన స్థితిలో ఉండకపోవడంవలన మేము వెళ్ళలేకపోయాం. కారు అయితే రెండూ‌ ఒకే రోజు చుట్టేయచ్చు.

    రిప్లయితొలగించండి
  4. అబ్బాయి ప్రతి బ్యారేజీ పైనకి ఎక్కకూడదు అన్నది రూలే, కానీ ఎవరూ పట్టించుకోరు, నీళ్ళు ఎక్కువ ఉన్నా లేదా పై ఆఫీసర్ వస్తే తప్ప.

    మొసళ్ళు ఏమైయ్యాయో మరి, ఆ.టి.ఐ. పెట్టికనుక్కోవాలేమో.

    ఉప్పలపాడు నేను ఎప్పుడూ పోలేదు, ఉప్పలపాడు పక్షి కేంద్రం నుంచి గట్టిగా కేకేస్తే మా ఊరికి వినపడుతుంది ఐనా..

    బులుసు గారు, నేను మీ ఆంధ్ర దురహంకారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా

    రిప్లయితొలగించండి
  5. నాగార్జునసాగర్ ఆనకట్ట చూసాను కాని ఇంకెం చూడలేదు.. మీరు చెప్పిన వివరాలు బాగున్నాయి..

    Nestam

    రిప్లయితొలగించండి
  6. @తార: మరి విజయవాడ ప్రకాశం బ్యారేజిమీదకి పోనిస్తారు గదండీ!

    @Nestam గారు: ధన్యవాదాలు. నేను చిన్నపుడెపుడో ఎండిపోయినపుడు చూశా. త్వరలో చూడాలని ప్రయత్నిస్తున్నా

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in