27, జనవరి 2022, గురువారం

వేటూరి vs సిరివెన్నెల

 ముందుగా షరా - నేను పండితుడను కాదు, పాత పద్యాలు - గద్యమే తప్ప కవితలూ-కవిత్వాలూ అస్సలు చదవను. తరువాత వ్రాయబోయేది కేవలము ఒక సామాన్య వ్యక్తిగా నా గమనికలు.

వేటూరి, సిరివెన్నెల ఇద్దరూ అన్ని రకాల సందర్భాలకూ కొన్ని వేల పాటలు వ్రాశారు. అందులో చాలా అద్భుతమైన పాటలున్నాయి. అవన్నీ ఉటంకించి, విశ్లేషించి పోల్చడము కష్టమే. అందుకని కేవలము వారి శైలిలో ఒక సామాన్య శ్రోతగా/చదువరిగా నాకు అనిపించినది చెప్తాను.

అంతకన్నా ముందు ఒక క్రికెట్ ఉవమానం - వేటూరి సచిన్ టెం‌డూల్కరు అయితే సిరివెన్నెల ద్రవిడ్ అన్నమాట. ఎందుకన్నానో చివరికి చెప్తాను.

 • ప్రేమ పాటలు -

వేటూరిగారు 70లలో లలిత గీతాలు వ్రాశారు. 80లు, 90ల మధ్యన వరకు వ్రాసినవి ప్రాథమికముగా రెండు రకాలు - పార్కులు - సెట్లలో నాయికానాయకులు స్టెప్పులు వేసే వాణిజ్య యుగళగీతాలు లేదా విశ్వనాథ్ - జంధ్యాల వంటి దర్శకుల కోసము భావుకత ఉన్న పాటలు. వేటూరిగారు రెండు రకాలు అలవోకగా వేగముగా బాణీలకు తగ్గట్టు వ్రాసేశారు. 90 ల చివరికి వేగము తగ్గి, శేఖర్ కమ్ముల, గుణశేఖర్ వంటి అభిరుచి, ప్రత్యేకముగా ఆయనే వ్రాయగలరు అన్న కథలు, సందర్భాలకు వ్రాయించుకుంటే వ్రాశారు.

వాణిజ్య గీతాలలో ఆయన వాడని పదాలు, ఉపమానాలు లేవు - ఇంగ్లీషు పదాలు కూడ వాడారు. హీరో, హీరోయిన్ల పేర్లు, రాగాల పేర్లు, దేశాలు, ఊర్లు, తినే పదార్ధాలు - అన్నీ వాడారు. ఇతర గేయరచయితలు భావుకతకు వాడే ప్రకృతి పదాలను - కొండ, కొమ్మ, కోకిల, ఋతువులు, కాలాలు, వాన, జాబిలి, వెన్నెల – ఆయన వాణిజ్య ప్రేమ గీతాలలోనూ ఆశువుగా వాడారు.

మొదటి రకము - కొట్టండి తిట్టండి లవ్వండీ ప్రేమ, నీమీద నాకు ఇదయ్యో, అచ్చా అచ్చా వచ్చా వచ్చా

రెండవ రకము - లిపిలేని కంటి బాస, చైత్రము కుసుమాంజలి, నిరంతరము వసంతములే

సిరివెన్నెలగారు 87-95 మధ్యన కొన్ని వాణిజ్య యుగళగీతాలు వ్రాసినా ఎక్కువగా వేటూరి శైలినే అనుసరించారు. బహుశా దర్శకులు అలా అడిగి వ్రాయించుకునుంటారు. ఉదాహరణకు బొబ్బిలిరాజా, ధర్మక్షేత్రం. 90 లలో కుటుంబ కథా చిత్రాలు (నిన్నే పెళ్ళాడతా, పవిత్ర బంధం), యూత్/కాలేజి ప్రేమ కథా చిత్రాలు (నువ్వే కావాలి, గులాబీ) వంటి చిత్రాల ట్రెండ్ మొదలయ్యాక సిరివెన్నెల తన కంఫర్టు జోనులోని ప్రేమ గీతాలు వ్రాసే అవకాశం వచ్చింది. ఎలాగో రాఘవేంద్రరావు, శరత్ వంటి వారికి కావలసిన వాణిజ్య గీతాలు ఎక్కువ చంద్రబోస్, భువనచంద్రకు వెళ్ళాయి. అంటే వేటూరిగారి స్థానాన్ని సిరివెన్నెల ఒక్కరే భర్తీ చేయలేకపోయారు. వేటూరి ప్రేమ గీతాలలో ప్రకృతి, భావుకత, ఉపమానాలతో ఒక కవిత్వములాగా ఉంటే సిరివెన్నెల పాటలు ఎక్కువగా ఒక అమ్మాయి/అబ్బాయి తన మనసులో భావాలు మాటలు పాటగా ఒక లవ్ లెటర్ వ్రాసుకున్నట్టుగా ఉండేవి - నా, నీ, నువ్వు, నేను, మనసు, చెప్పనా, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, కనులు, గుండె, గాలి, వయసు, మాయ, కల, నిజము లా అప్పటి యూత్ కి సులువైన పదాలు వాడారు. ప్రకృతిని వాడిన పాటలు తక్కువనే చెప్పచ్చు (లేవని అనను - చెప్పవే చిరుగాలి, కొమ్మా కొమ్మా, మావిచిగురు). వేటూరిగారి భావుకత పాట రెండు మూడు సార్లు చదువుకుంటే గానీ లేదా ఎవరన్నా వివరిస్తేగానీ అర్థముగావు.

వేటూరిగారి ఇంకో బలం - గట్టి గుర్తుండిపోయే పల్లవులు. చరణాలలో కొన్నిసార్లు ఇరికించినట్లున్నా మనకు పల్లవి గుర్తుండిపోతుంది.

 • విషాద గీతాలు -

వేటూరి వ్రాసినన్ని వైవిధ్యమైన విషాద గీతాలు సిరివెన్నెల వ్రాయలేదు. సిరివెన్నెల ఎక్కువగా విరహ గీతాలు వ్రాశారు. ఇక్కడ క్లిష్టత విషయములో ప్రేమగీతాలకు రివర్సు. వేటూరిగారి విషాద గీతాలు తేలికగా అర్థమవుతాయి, సిరివెన్నెలవి కొంచెం గాఢముగా ఉంటాయి (శుభలగ్నం పాట). ఇక్కడకూడ వేటూరి ఎక్కువగా ప్రకృతిని వాడారు (పావురానికి పంజరానికి, ఆకాశాన సూర్యుడుండడు, రాలిపోయే పువ్వా)

 • ఆవేశ, ప్రబోధ, మార్గదర్సక, జీవిత సంబంధిత గీతాలు -

సిరివెన్నెలకి ఎక్కువ పేరు తెచ్చినవి, అభిమానులు ముందుగా ఉటంకించేవి ఇలాంటి గీతాలే - గాయం, కళ్ళు, గమ్యం, చక్రం, పవిత్రబంధం మొదలగు చిత్రాలలోని గీతాలు. బహుశా తనలోని మధ్యతరగతి కుటుంబ బ్యాక్ గ్రౌండు , 70-80ల యువత భావజాలం (ఆయన యువకుడిగా ఉన్నకాలం) వలన తనలో ఆ ఆవేశం, ఆవేదన సహజముగా ఉన్నది తనలో తాను రమించి, శ్రమించి కాగితాముపై అక్షరాలుగా మలిచారు.

అదే వేటూరిగారు ఆశువుగా పురాణాలు, చరిత్ర, ప్రకృతి, సమాజమును ఉదహరిస్తూ వ్రాశారు - కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, ఈ దుర్యోధన దుశ్సాసన, చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో

 • ఐటెం పాటలు -

వేటూరి ఐటం/క్లబ్/వ్యాంప్/శృంగార గీతాలు - జానపద, పల్లె, నగర క్లబ్ - ఇలా అన్ని రకాలకు ఎంత మోతాదులో కావలంటే అంత, అవసరమైతే ద్వంద్వార్థాలు వచ్చేటట్టు ఇచ్చారు. సిరివెన్నెల టైంకు వచ్చేసరికి దర్శకులు నిర్మాతలు వేరే రచయితలపై ఎక్కువ ఆధారపడ్డారు. ఐటం సాంగైనా పాటలో ఒక సందర్భమూ, అర్థమూ ఉండాలి అనుకుంటే, అలాగే దర్శకునికి సిరివెన్నెలతో ఒక వేవ్ లెంగ్త్ ఉన్నట్టైతే (ఉదా వర్మ, కృష్ణవంశీ) అప్పుడు సిరివెన్నెలతో వ్రాయించుకున్నారు.


ఇంతవరకు గీతాల గురించి అంటే ఫైనల్ ప్రోడక్టు గురించి మాట్లాడాను. ఇపుడు వారు ఎలా వ్లాస్తారో చూద్దాము -దీనికే పైనచెప్పిన క్రికెట్ ఉపమానము.

సచినుది సహజ ప్రతిభ. ఎలాంటి ఫార్మాటైనా తేలికగా ఆడగలడు. అన్ని రకాల షాట్లు కొట్టగలడు - కొట్టడానికి కష్టపడినట్టు మనకు చూసేవారికి అనిపించదు. ఆతడులో తనికెళ్ళ భరణి డైలాగులా ఒక పద్ధతి ఉంటుంది. ఒకే బంతికి రెండు మూడు రకాలుగా షాట్ కొడతాడు. తోటి క్రీడాకారులకు ఒక ఆరాధన. అందరికీ తెలుసు అతను వారందరికన్నా ఒక మెట్టు ఎక్కువని. జట్టులో సహకారము లభించకున్నాఒంటిచేత్తో లాక్కురాగలడు.

అదే విధముగా వేటూరిగారు అలవోకగా ఆశువుగా వేగముగా పల్లవులు, చరణాలు ఇచ్చేస్తారు. కానీ ఎక్కడా పట్టు తగ్గదు. ఎలాంటి బాణీ ఇచ్చినా వ్రాసేస్తారు. సంగీత దర్సకుడు తనన తననా అన్నా తానానా అన్నా వ్రాసి ఇస్తారు. ఒకే ట్యూనుకు ప్రేమ గీతమూ, విషాద గీతమూ ఇస్తారు. బాణీ సామాన్యమైనదైనా, చిన్న చిత్రాలైనా వేటూరి గారి సాహిత్యముతోనే హిట్టయిన పాటలున్నాయి.

ద్రవిడుది సహజ ప్రతిభ కాదు. కొన్ని వేల గంటలు ప్రాక్టీసు చేశాడు. ఒక ఇన్నింగ్ బిల్డు చేయడానికి శ్రమిస్తాడు. పరిమిత ఓవర్ల ఫార్మాటులో ఆతనికి పరిమితులున్నాయి. స్లాగ్ చేస్తే మనము చూడలేము. కానీ కొన్ని షాట్లు కొటినపుడు (కవర్ డ్రైవ్) అతనంత సొగసుగా ఎవరూ కొట్లలేరు అనిపిస్తుంది. ఎన్ని మ్యాచులు గెలిపించినా సచిను తర్వాతి స్థానమే.

అలాగే సిరివెన్నెల చాలా పాటలకు ఎన్నో రాత్రులు శ్రమించారు. ఎన్నో వర్షన్ను వ్రాసేవారు. కొన్ని రకాల గీతాలు (కమర్షియల్ గీతాలు, ఐటం పాటలు) వ్రాసేటపుడు ఇబ్బంది పడ్డారు. సచిను నీడలో ద్రవిడులాగా ఎన్ని గొప్ప గీతాలు వ్రాసినా 70ల నుంచి సినిమాల పాటలు వినే తరానికి సిరివెన్నెలది వేటూరి తర్వాతి స్థానమే.

7, జనవరి 2022, శుక్రవారం

సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసే ప్రేమ పాటల ప్రత్యేకతలు

సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసే ప్రేమ పాటల ప్రత్యేకతలు-

తెలుగు సినిమాలలో 80లలో ఎక్కువగా కథానాయక ప్రధాన పాటలు వచ్చాయి. ఎక్కువగా పార్కులలో స్టెప్పులేసే సాధారణ డ్యూయట్లే ఉండేవి. కొంతవరకు జంధ్యాల, సింగీతం, బాపు, విశ్వనాథ్, వంశీ చిత్రాల యుగళగీతాలలో కొంత భావుకత ఉండేది. ఆ రెండు రకాలూ వేటూరి అలవోకగా రాసిచ్చేసేవారు. మొదటి రకము ఏదోక పదాలు ఇరికించేసేవారు, రెండో రకములో భావుకత ఎక్కువుండేది - లోతైన భావనలు చెప్పేవారు.

మొదటి రకము - కొట్టండి తిట్టండి లవ్వండీ ప్రేమ, నీమీద నాకు ఇదయ్యో, అచ్చా అచ్చా వచ్చా వచ్చా

రెండవ రకము - లిపిలేని కంటి బాస, చైత్రము కుసుమాంజలి, నిరంతరము వసంతములే

90 దశకము మొదటి సగము ఎక్కువగా కుటుంబ కథాచిత్రాలు ఉండేవి.

పెద్ద హీరోల ప్రేమ చిత్రాలూ 95 తర్వాతే మొదలయ్యాయి - నిన్నే పెళ్ళాడతా, ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, ఇలా

చిన్న హీరోల ప్రేమ కథా చిత్రాల ట్రెండూ అప్పుడే మొదలైంది.

ఈ ఉపోద్ఘాతమంతా, అదే సోదంతా ఎందుకంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ప్రేమపాటల స్రవంతీ అప్పటినుంచే మొదలైంది. ప్రేమను ఎన్ని రకాలుగా చెప్పచ్చే అన్ని రకాలుగా చెప్పేశారు.

దానికి తోడు అభిరుచి ఉన్న వర్మ, కృష్ణవంశీ, వీ ఎన్ ఆదిత్య, దశరథ్, స్రవంతి రవికిశోర్, విజయభాస్కర్, త్రివిక్రం వంటి దర్శక నిర్మాతలు వ్రాయించుకోవడంతో మంచి ప్రేమ పాటలు వచ్చాయి.

ఈ పాటలలో సిరివెన్నెలగారి ప్రత్యేకత ఏమిటంటే చిన్న చిన్న సరళమైన పదాలు వాడేవారు. వచన కవితలాగా ఉండేవి. కాలేజి యువత పాడుకోవడానికి సులువుగా ఉండేవి. అదే వేటూరిగారి పాటలలో భావుకత ఎక్కువ - ఆ కవిత్వము స్థాయి ఎక్కువ. ప్రతి పంక్తి రెండు మూడుసార్లు అర్థము చేసుకోవాలి. సిరివెన్నెలగారి పాటలు 80లలో అలాంటి శైలే ఉన్నా గులాబీ - మనసంతా నువ్వే - నువ్వేకావాలి తరానికి తగ్గట్టు శైలిని మార్చుకున్నారు -

నా, నీ, నువ్వు, నేను, మనసు, చెప్పనా, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, కనులు, గుండె, గాలి, వయసు, మాయ, కల, నిజము లా అప్పటి యూత్ కి సులువైన పదాలు వాడి ఎన్నో పాటలు వ్రాశారు - కానీ బోరు కొట్టకుండా వైవిధ్యముగా ఉండేలా చూసుకున్నారు.

 • ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు
 • నా మనసుకేమయ్యిందీ నీ మాయలో పడింది
 • నువ్వేం మాయ చేశావో
 • కనులు మూసినా కనులు తెరిచినా కలలు ఆగవేలా
 • నీ నవ్వు చెప్పింది నాతొ నేనెవ్వరో ఏమిటో
 • గుండె నిండా గుడిగంటలూ
 • ఉన్నమాట చెప్పనీవు
 • చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.
 • గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
 • చెప్పవే చిరుగాలి, చల్లగా ఎదగిల్లీ

అలాగే చంద్రబోసు, అనంత శ్రీరాంలా ఉపమాలంకారములు ఎక్కువ వాడలేదు.

5, జనవరి 2022, బుధవారం

2021పుస్తక ప్రదర్శన

2021డిసెంబరు హైదరాబాదు పుస్తక ప్రదర్శనకు  మొదటి రోజే వెళ్ళాము - ఖాళీగా ఉన్నది. తీరికగా అన్ని స్టాల్సు కొవిడ్ భయం లేకుండా, ఒక్కో ర్యాక్ చూసుకుంటూ వెళ్ళాము.

వెళ్ళాము అని అన్నిసార్లు ఎందుకన్నానంటే ఈ సారి ముఖ్యోద్దేశం మూడవ తరగతి చదువుతున్న మా పాపకు పరిచయం చేయడం కోసం. తనూ కాళ్ళు నొప్పులు అనకుండా నాతో గంట పైన తిరగడం, సొంతముగా కొన్ని పుస్తకాలు తిరగేసి ఎంపిక చేసుకోవడం సంతృప్తినిచ్చినది.

ఒకటవ తరగతి చివర నుండి ఇప్పుడు మూడవ తరగతి చివరి దాకా దాదాపు రెండేళ్ళు ఇంట్లోనే ఆన్లైను చదువులు కావడముతో అయితే క్లాసులు, లేదా పార్కుకు పోయి ఆడుకోవడము, మిగిలిన సమయము టీవీ. ఇంకా టైం మిగిలితే రంగులు వేసుకుంటుంది. ఈనాడు ఆదివారం అనుబంధంలో పజిల్స్ చేయించేవాడిని కానీ ఒక రెండు నెలల తరవాత తనకు బోరు కొట్టేసింది - అవే ప్యాటర్ను కదా. కూర్చోపెట్టించి కథల పుస్తకాలు చదివించడము మాకూ కష్టముగా ఉండేది. ఇంకో ఛాలెంజ్ సూపర్ మార్కెట్లలో మంచి కథల పుస్తకాలు లేకపోవడమూ, ఉన్నా ₹150 పెడితే ఆ పుస్తకములో గట్టిగా 10 కథలూ ఉండకపోవడమూ.

పుస్తక ప్రదర్శన ఈ సమస్యలన్నీ తీర్చినది -

 • పాప వెతికి తనకు నచ్చినవి కొనుక్కున్నది.
 • సెకండ్ హ్యాండులో ₹20 లకే మంచి కథలూ, పజిల్సూ ఉన్న పుస్తకాలు నాకు దొరికాయి.
 • ఒక స్కూలు అట్లాస్ కొన్నాను. గూగూల్ మ్యాప్స్ తనకు ఆల్రేడీ తెలుసు - కానీ అన్నిసార్లూ మొబైలులో చూస్తానంటే ఎలా. బోరు కొట్టినపుడు చూస్తుందిలే అని.

మార్కెట్టులో మ్యాజిక్ పాట్ (Magic Pot) అని మలయాళ మనోరమ వారి పిల్లల పక్ష పత్రిక వస్తుంది. కానీ మా ప్రాంతములోని పుస్తకాల షాపులో ఠంచనుగా రాదు. ఈ పుస్తక ప్రదర్శనలో వారి స్టాలులో 6 నెలల చందా డిస్కౌంటులో దొరికింది. వారు ఇంటికి సరిగ్గా పంపిస్తే రెన్యువల్ చేస్తాను.

తెచ్చిన మర్నాడు పొద్దున్నే లేవగానే రాత్రి కొన్న పుస్తకాలు ఏవి అని చూసుకుని, అందులో ఒక పుస్తకము తీసి పజిల్స్ మొదలుపెట్టింది. గత రెండు వారాలలో నాలుగు కథలు తనంతట తను చదివింది. ఇదో గొప్ప ప్రారంభము. ఎంతవరకు చదవడముపై ఆ ఆసక్తి ఉంటుందో గానీ.

ఇక నా విషయానికి వస్తే ఎప్పటి నుంచో కొనాలనుకున్న సిరా కొన్నాను. ముళ్ళపూడి వారి కోతికొమ్మచ్చి సిరీస్ ఏళ్ళ కిందట అప్పు తీసుకుని చదివినా, ఇప్పుడు ఇంట్లో ఉంచుదామని తీసుకున్నా. ఇంకా కొన్నవి - శప్తభూమి, పున్నాగపూలు.

ఇక విదేశాలకు వెళ్ళే సందర్భాలు రాకపోవచ్చు (ఆలోచనలు ఎలాగూ లేవు) అని మళ్ళీ పుస్తకాలు పేరుద్దామనుకుంటున్నాను.

4, జనవరి 2022, మంగళవారం

సిరా నవల

 గమనిక – ఇది పుస్తక సమీక్ష కాదు - నాకు అలాంటివి వ్రాయడమూ రాదు, చదవడమూ అలవాటులేదు. కేవలము సిరా అనే పుస్తకముపై నా అభిప్రాయము.

సిరా పుస్తకము ఎందుకు కొన్నాను?

గత కొన్నేళ్ళుగా ఆన్లైనులో ఈ-పుస్తకాలు చదవడమే తప్ప చేతిలో పుస్తకము పెట్టుకొని చదివినవి చాలా తక్కువ. నిజము చెప్పాలంటే అలా కొని చదవాలి అని నాకనిపించిన కొత్త పుస్తకాలు లేవనే చెప్పాలి. అలాంటిది ఒక రెండేళ్ళ కిందట సిరా అనే పుస్తకము గురించి ఆ పుస్తకాన్ని రచించిన సీనీ దర్శకుడు రాజ్ మాదిరాజ్ గారి ఫేస్బుక్ గోడపై 2019 లో పరిచయమయ్యాక, ఇంటర్మీడియట్ విద్యార్థుల చైనా తరహా కాలేజీల గురించి ఈ పుస్తకము అని తెలిసాక, కొని చదవాలి అని ఆసక్తి కలిగింది. ఈ ఏడు హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు మొదట రోజే వెళ్ళాను. ఆ సాయంత్రము నేను తిరుగుతున్నప్పుడు అన్వీక్షికి వారి స్టాలు తెరవలేదు. నేను అన్ని స్టాల్సు ఒక రెండు గంటలు తిరిగాక, అప్పుడు ఫేస్బుక్ లో బుక్ ఫెయిర్ వారి పేజీపై స్టాలు నంబరు తీసుకుని వెతుక్కుని వెళ్ళాను. అప్పుడే అట్ఠపెట్టెలలోంచి తీసి సర్దుతున్నారు. వెంకట్ సిద్దారెడ్డి గారు అక్కడే ఉన్నారు. ఫేస్బుక్ లో అంతకుముందు ఉన్న ఆఫరు ఇస్తాన్నారుగానీ నా బడ్జట్ అప్పటికే వేరే పుస్తకాలపై పెట్టేశాను. ఇంక సిరా ఒక్కటి కొన్నాను.

కథాంశము

ఈ పుస్తకములో రెండు థ్రెడ్లు ఉన్నాయి - మన రాష్ట్రములలో ఇంటర్మీడియట్ విద్యనందించే ఒక కళాశాలల సంస్థ నిర్వాకాలు, అందులోని విద్యార్థుల ఆలోచనలు, ఆవేశాలు. రెండవది ఒక విజయవంతమైన పెద్ద లాయరును ఆదర్శముగా తీసుకుని అతనిలా సక్సెస్ఫుల్ అవుదామని అభీలాషించే ఒక న్యాయ విద్యార్థి. కొన్ని సంఘటనల వలన ఈ రెండు థ్రెడ్లు కలిసి ఈ జూ. లాయరు ఆ సంస్థపైనా, దాని తరపున నిలబడిన గురువుగారు కోర్టులో తలపడడము.రచనా శైలి

శనివారము ఈ పుస్తకము కొంటే ఆదివారము రాత్రీ పదిన్నరకు తెరిచాను. మొదటి గంటా నెమ్మదిగా గడిచింది - పిల్లల గొడవ, అంత చిన్న అక్షరాలు అందులోనూ తెలుగు ఆఫ్లైను (వార్తాపత్రిక కాకుండ) చదవడమూ అలవాటు తప్పుట ముఖ్యకారణాలు అయినా, ఇంకో కారణము - ఆంగ్ల లిపిలో చాలా సంభాషణలు ఉండటమూ పంటి కింది రాయిలా తగిలాయి. తెలుగు లిపిలో ఆంగ్ల పదాలూ, వాక్యాలు కూడా ఈ తరానికి తగ్గట్టు అలవాటే కానీ (ఉదా హౌ ఆర్యూ టుడే), తెలుగు మధ్యమధ్యన ఆంగ్ల లిపి వాడడము ఇబ్బంది పెట్టింది. చాప్టరు శీర్షికలూ ఆంగ్ల లిపిలోనే ఉన్నాయి.

మొదటి మూడు నాలుగు చాప్టర్లూ క్యారక్టర్ల పరిచయానికే సరిపోవడమూ కొంచం అనాసక్తముగా చదివించింది. అంత డీటెయిలింగు అవసరములేదేమో.

కానీ కథా, కథనమూ, కాన్ఫ్లిక్టూ, వేగము పుచ్చుకున్నాయి. గంట తర్వాత 11.30కునిద్ర పోదాము అనుకున్న నన్ను అర్ధరాత్రి ఒంటి గంట దాకా కూర్చోబెట్టి చదివించింది.

పాత్రలూ, పాత్రల ఆలోచనా వ్యవహార తీరూ యండమూరీగారి శైలి ఫ్రభావముంటే, మొదలులోని కళాశాల, ప్రేమ సంభాషణలు యండమూరీ - త్రివిక్రమ్ గార్ల మిశ్రమ శైలిగా అనిపించింది. లాయరు మూర్తి ఎదిగిన తీరు, ఆ క్రమములో అతని ఆలోచనాతీరు, వ్యవహార శైలి కొంత ఫౌంటెయిన్ హెడ్ ను గుర్తుకు తెస్తే చివరిలోని కోర్టు డ్రామా సిడ్నీ షెల్డన్ నవలలు జ్ఞప్తికి తెచ్చింది. అంటే రచయిత రాజ్ గారి శైలి ఎక్కడా లేదా అంటే - కాదు. అలా అనిపించడం ఆయన రాసేటప్పుడు ఆ రచనల ప్రభావము ఉండడము కావచ్చు, లేదా నాకు ఆ చదివినవి గుర్తుకు రావటము వలన కావచ్చు. నాకు సినిమాలు చూసేటప్పుడు అలాంటి సన్నివేశాలూ, ఇంటి సెట్లూ వగైరా ఇంతకుముందు వేరే సినిమాలలో చూసుంటే గుర్తోస్తాయి. గత రెండు ఏళ్ళుగా రాజ్ గారి ఫేస్బుక్ పోస్టులు చదువుతున్నా కాబట్టి వారి శైలీ కొంత తెలుసు - అది ఈ పుస్తకములో కనిపించింది.

నా అభిప్రాయము - వ్యక్తిగత అనుభవము

ఈ నవలలోని కార్పోరేటు కాలేజి మొదలైన 90వ దశకములోని పరిస్థితులు నాకు బాగా పరిచయము. ఇప్పటి చైనా బ్యాచీలకన్నా ముందే గుంటూరులో అలాంటి కాలేజీలు మొగ్గ తొడిగి విజ్ఞానముతో వికసించి కొత్త భాష్యాలు చెప్పి విద్వాన్సులను చేయడము కొంత దగ్గరగానే చూశాను. ర్యాంకుల కోసము సొంత మెటీరియల్ తయారుచేయడమూ, ర్యాంకు గుర్రాలకు ప్రత్యేక సెక్షన్లు లేదా ప్రత్యేక క్యాంపస్లు , కొత్త బంగారు లోకం సినిమాలో చూపినట్లు వైరు కుర్చీలు - లావు కర్రలతో స్టడీ అవర్లూ - చాలా చూశాను. నాకు బాగా కావలసినవారు అలాంటి కాలేజీలలో చేరి పడ్డ ఇబ్బందులు వారం వారం వారిని కలవడానికి వెళ్ళినపుడు చూశాను. నేను 97 లో ఇంటర్మీడియట్ చేరేటపుడు మా నాన్నగారికి చెప్పేశాను - నేను అలాంటి కార్పోరేటు కాలేజీలో చేరనని, అలాంటి చదువు చదవలేనని. వెళ్ళి ప్రభుత్వ జూనియరు కాలేజీలో చేరాను. నా జీవితములో నేను తీసుకున్న మంచి నిర్ణయమది, ఒప్పుకున్న మా నాన్నగారి గొప్పదనము. అలా చేరడము నాకు ఎంసెట్లో తగిన ర్యాంకు రాకపోయినా నేను కోల్పోనిదే ఎక్కువ అని అనుకుంటా. నేను మా ప్రభుత్వ లెక్చరరు దగ్గర ఫిజిక్స్ ఎంసెట్ ట్యూషనుకు చేరాను. ఆయనకు సమయము కుదరక మమ్మల్ని ఆయన చెపుతున్న కార్పోరేటు కాలేజికి వచ్చివారి క్లాసులో కూర్చుని వినమనేవారు. అక్కడి విద్యార్థులను కలిసి మాట్లాడేటప్పుడు, వారి మొహాలు చూస్తే ఏదో తెలియని బాధ ఖైదీలతో మాట్లాడుతున్నట్టు అనిపించేది. మేమేమో సరదాగా ఉండేవారం. ఆ గంటవ్వగానే ఇంటికో, సినిమాకో పోతాము కాబట్టి.

అందుకని ఈ పుస్తకములోని కథనము కళ్ళకు కట్టినట్టు కనిపించింది, నాకు వ్యక్తిగతముగా తాకినది.

కానీ కార్పోరేటు కాలేజీలు, తల్లిదండ్రులను ఒకే కోణములో చూపించడమూ, విద్యార్థులంతా అమాయకులుగా చెప్పడము ఏకపక్షము అనిపించింది. అందరూ టెండూల్కర్లూ, నానీలూ అవ్వలేరు. టాలెంటు ఉంది అనుకుంటారు కానీ నిజముగా ఉండకపోవచ్చు. ఉన్నా ఆ టాలెంటు వాడుకుని విజయము సాధించే నిబద్ధత, ఓపికా, అవకాశాలూ ఉండకపోవచ్చు. కావున వారి శక్తికి మించి చదివించే మధ్యతరగతి తల్లిదండ్రులు సేఫ్ పాథ్ చూసుకోవడములో తప్పులేదు. కవిత్వము, ఫోటోగ్రఫీ, సినిమా, చిత్రలేఖనం వంటివి బీటెక్ తర్వాతా చేసుకోవచ్చు - ఎంత మంది లేరు అలా చేసి విజయవంతమైన వారు. అందుకే నాకు త్రీ ఇడియట్స్ లాంటి సినిమా నాకు అంతగా కనెక్టు కాలేదు.