18, డిసెంబర్ 2010, శనివారం

సుందోపసుందులు - 5: మీరెప్పుడైనా రైలుని ఆపారా?

మీరు ఎప్పుడైనా స్టేషన్నించి కదులుతున్న రైలుని ఆపారా? అదే ఆపించారా? అహా! గొళ్ళెం(చైను) లాగికాదు, అదేదో సినిమాలో బాలయ్యబాబులా తొడగొట్టికాదూ, ఎర్ర రుమాలు - రక్తంతో తడిపిన చొక్కాతో ఎదురు పరిగెట్టికాదు. మరింకెలా?

బులుసుగారి 'నా చివరి క్షణాలు' చదివాక నేను రైలు ఆపించిన ఈ ఘనకార్యం గుర్తొచ్చింది. ఇప్పుడే 'అన్‌‌స్టాపబుల్' సినిమా చూసివస్తున్నా కాబట్టి వెంటనే రాయాలనిపిస్తోంది (ఆ సినిమాలోలా ఇపుడు నేచెప్పేదానిలో యాక్షన్ దృశ్యాలేమీ లేవు).

**********
టెన్తో, ఇంటరో, ఇంజినీరింగు మొదటి సంవత్సరమో గుర్తురావట్లేదు. ఈసారి అమ్మకిఫోను చేసినపుడు అడగాలి. ఏదో పరీక్షలు అయ్యాక సెలవులు ఖాళీగా గడుపుతున్నా. ఓ రోజు పొద్దున్నే లేచ టిఫినుచేసి ఖాళీగా కూర్చొని ఏం తోచట్లేదు అని నసపెడుతుంటే, "పోనీ నల్లగొండ వెళ్ళి ఆమ్మని(పెద్దమ్మ) చూసిరా" అన్నది అమ్మ. అప్పుడు మా ఆమ్మవాళ్ళు నల్లగొండలో వుండేవాళ్ళు. ఇదేదో బాగుందని అప్పుడే వెళ్తా అన్నా. అపుడు తొమ్మిదిన్నరో పదో అయ్యింది.

ఇప్పుడు 'జన్మభూమి‌‌' అని సికిందరాబాద్-విశాఖ మధ్యన తిరుగుతున్నది అప్పట్లో విజయవాడనించే వుండేది. 'ఇంటర్సిటీ'(నాగార్జున) అని ఇంకో బండి సికిందరాబాద్-నల్లగొండ-గుంటూరు-తెనాలి తిరిగేది. రెండూ కలిపి ఒకే బండి చేశారు. ఈ బండి సికిందరాబాదునుండి పొద్దున 11.30కి గుంటూరు వచ్చి, ఆపై తెనాలి వెళ్ళి మళ్ళీ తిరుగుప్రయాణంలో గుంటూరు 1.20కి వచ్చేది. చాలాసార్లు ఇంకా లేటయ్యేది. మా ఇంటినుంచి స్టేషను పడమర ద్వారం (అరండల్‌‌పేట వైపు) చాల దగ్గర - ఐదు నిమిషాల నడక. అబ్బో ఇంకా చాలా టైముందిగా, పచ్చళ్ళూ-వడియాలూ సర్దుతా తీసుకెళ్ళు అంది అమ్మ.

నేను ఒక సంచిలో రెండు జతలు పడేసుకొని తాపీగా టీవీచూస్తూ కూర్చున్న. తీరిగ్గా ఒక అరగంట భోజనం చేసి టైము చూస్తే పన్నెండున్నర దాటింది. ఇపుడే స్టేషనుకెళ్ళి ఏంచేస్తాం, లేటేమన్నా ఉందేమో కనుక్కుందామని స్టేషనుకి ఫోనుకొట్టా.
"ఇంటర్‌‌సిటీ ఏమన్నా లేటుందాండి?"
"లేటేంటి, బండెపుడో తెనాలినుండొచ్చేసిందమ్మా" అన్నాడు. నాకు షాకు.
"అదేంటండీ రైట్‌‌టైం 1.20 కదండీ?"
"అదేపుడో మారిందిగా. ఇపుడు 12.45కే."

చల్లారి ఇంట్లో కూర్చుంటే నన్ను సుందోపసుందుడు అనెందుకంటారు? అమ్మ చెపుతూనే వుంది. "చూద్దాం, ఇంకా టైముందిగా. దొరికితే దొరికింది లేకపోతే వెనక్కోస్తా" అని సామాను తీసుకొని బయలుదేరా. నా సామాను చెప్పలేదు కదూ - నా బట్టల సంచి (డఫ్ఫల్ బ్యాగంటారు ఇపుడు), రెండు కర్ర సంచీలు (కళానికేతన్/చందనా బ్రదర్సు వాళ్ళిచ్చేవి), ఒక పెద్ద స్టీలుక్యాను.

ఉరుక్కుంటూ స్టేషనుచేరేటప్పటికి "ట్రయిన్ నెం **** ఒకటవ నెంబరు ... బయలుదేరుచున్నది" - ఎనౌన్సరు అరుస్తున్నది. ఈ పిలుపు వచ్చిన వెంటనే డ్రైవురు ఒకసారి హారన్ మోగించి బయలుదేరుతాడన్నమాట. కౌంటరతను, "వెనక్కొస్తే సగమే రిఫండ్!!"నని బెదిరించాడు(అదే హితవు చెప్పచూశాడు). "పర్లేదివ్వండి".

ఇక్కడ గుంటూరు స్టేషనుగురించి ఒక పేద్దవిషయం క్లుప్తంగా. మొత్తం 8 ప్లాట్ఫాంలు. అప్పట్లో 1-4/5కి మధ్యనే సబ్‌‌వే వుండేది. 4/5 కి 8కి మధ్య బ్రిడ్జి. అంటే ముందు ఇదెక్కి దిగి, అది దిగి ఎక్కాలన్నమాట. అయినా ఎంత ధైర్యంగా టిక్కెట్ కొన్నానో. మళ్ళీ రైలు రన్నింగులో ఎక్కేటంత సీనులేదు. బ్రిడ్జిపైకి ఎక్కేసరికి రైలు కూతపెట్టింది. ఇంకేం, అయిపోయింది దొరకనట్లే అనుకున్నా. బ్రిడ్జి దిగా. అనుకున్నట్లే రైలు కదులుతూ కనిపించింది.

అపుడే బుర్రకి ఎక్కడో వెలిగింది. 4వ నెంబరు ప్లాట్ఫాం మొదట్లో రైల్వే పార్సిలు ఆపీసుంటుంది. అక్కడ 4 నుంచి 1కి పట్టాలపై సిమెంటు దారి వుంటుంది - పార్సెలు బళ్ళు లాగటానికి (సికిందరాబాద్ స్టేషనులోనూ వుంది). అటు పరిగెట్టా. ఆ దారిపై ఒకటో ప్లాట్ఫాం దగ్గరికి పరిగెట్టేసరికి ఇంజను, ఒక బోగి అప్పటికే ప్లాట్‌‌ఫాం దాటేశాయి.

రెండవ బోగీ తలుపు దగ్గరున్నవాళ్ళు "ఎక్కేయ్, ఎక్కేయ్" అనరుస్తున్నారు.
నా సామాను చెప్పాగా. అన్ని పట్టుకోని రన్నింగులో ఎలా ఎక్కుతారు, నాకు మాములుగానే రాదు, వచ్చినా ఎక్కను.

సామాను కింద పడేసి ఆ సిమెంటుదారిపై వంగొని, మోకాళ్ళపై చేతులు పెట్టుకొని నిరాశగా వగరుస్తున్నా. అదేదో సినిమా క్లైమాక్సులో (ఒకటేంటి, పదుండుంటాయి) హీరోయిన్ విడిచెళ్లిపోతున్న రైలు మిస్సయి హీరో ఫీలవుతుంటాడుకదా, ఆ రేంజీలోకాకపోయినా, ఆ టైపులో. ఇపుడు ఇంటికెళ్ళితే చివాట్లే, ఆ తర్వాత బండి మళ్ళీ రాత్రి పదకొండింటికి నరసాపూరే! అదెక్కే ఊహేలేదు.

అపుడు జరిగింది ఆ ఊహించని అద్భుతం (అంటే సినిమాల్లో రోటీనే) - రైలు ఆగింది. హీరోయిన్ లేదుగాబట్టి దిగలేదు. :-) ఇంజీనులోంచి డ్రైవరో/అసిస్టెంటు డ్రైవరో చేతులూపుతూ సంజ్ఞలిస్తున్నాడు, "ఎక్కు ఎక్కు" అని. ఈ అబ్బాయి ఇలా 4వ నెంబరు ప్లాట్‌‌ఫాం నుండి ఉరుక్కుంటూ రావడం ఆయన గమనిస్తూనే ఉన్నాడు.

హీరోయినే దొరికిందన్న రేంజిలో మళ్ళీ ముందుకి రాళ్ళపై పరుగెత్తుకెళ్ళి (మూడవ బోగీ ఏసీ) రెండవబోగీ ఎక్కేశా.

అదన్నమాట రైలునే నేను ఆపి(పించి)న అనుభవం. అందుకే ప్రతీ క్షణం, ముఖ్యంగా "చివరి క్షణాల" విలువైనవి :-)

అనేవాళ్ళు అంటారులేండి, నీ గొప్పదనమేముంది, అది ఆ డ్రైవరుగారి దయని. కానీ ఆ డ్రైవరులో ఆ జాలి పుట్టించినది ఎవరు?

నల్లగొండలో దిగాక ఇంజినుదాక నడుచుకెళ్ళి డ్రైవరుగారికి థాంక్స్ చెప్పా!

16, డిసెంబర్ 2010, గురువారం

అట్లాంటిక్ సూర్యోదయం

బోస్టనులో ఎప్పుడన్నా ఒడ్దు(బీచ్)కి పొద్దున్నే ౬కి వెళ్ళి అట్లాంటిక్ మహాసముద్రంపై సూర్యోదయం చూడాలని కోరిక.
మూడేళ్ళున్నా కుదరలేదు. మొదటి కారణం శనివారం పొద్దున్నే లేవడానికి బద్దకం. రెండవది నాకు కారులేదు. మొదటి ట్రైను ఐదింటికి. వెళ్ళేసరికి ఆరవుతుంది. మనం చలికాలం వెళ్ళలేం, ఎండాకాలంలోనేమో ఐదింటికే తెల్లారుతుంది.

ఇలా కాదని మొన్న అక్టోబరులో ముగ్గురం స్నేహితులం వెళ్ళాం. ఆహా ఏం రోజండి - మబ్బుమబ్బు, మైనస్ డిగ్రీల చలి. క్లికు కొట్టాలంటే, గ్లవ్స్ ఇప్పాలిగా. మొత్తం గంట అయ్యేసరికి వేళ్ళు కొంకురుపోయాయి. కానీ తీసిన ఫోటోలు తర్వాత చూస్కొంటే అన్ని మర్చిపోయా.

అసలు ఆ మహాసముద్రం ముందు నించోని - ఆ చలిలో వణుకుతూ - చెవుల్లో ఇళయరాజా-రహమాన్ స్వరనాట్యం చేస్తుంటే, నింగి-సముద్రం నీలమై, ఇసుకలో ప్రతిబింబిస్తుంటే - కొంగలు, ఫ్లేమింగోలు, విమానాలు - ఆ చలిలో కుక్కలతో చెడ్డీలేసుకొని జాగింగ్ చేస్తున్న అమ్మాయిలు - ఒక అరగంట ఎక్కడికో వెళ్ళోచ్చా.

ఆ తర్వత స్టార్‌‌బక్స్కి వెళ్ళి ఒక లార్జ్ కాఫీ తీస్కుంటే రెట్టింపయ్యింది మా మజా. నా బోస్టన్ జీవితంలో మరచిపోలేని రోజు.

ఫోటోలు నా ఫొటోబ్లాగులో.

14, డిసెంబర్ 2010, మంగళవారం

నా కనులతో...

నా కనులతో... అని ఒక కొత్త ఫోటోబ్లాగు ఆరంభించా. ఇది పెట్టాలా వద్దా అని ఒక రెణ్నల్లపైగా ఆలోచించా. ఎందుకంటే నాకు ఇప్పటికే ఒక ఫొటోబ్లాగు ఉంది. కానీ అందులో నేను తీసినవాటిలో అత్యుత్తమైనవి మాత్రమే పెడుతున్నా. మిగతావి నా కంప్యూటరులో మగ్గిపోతున్నాయి. అందులో ఒక తొంభై పూల చిత్రాలున్నాయి.

నా మొదటి బ్లాగుకున్న ఇంకో పరిమితి చిత్రం సైజ్. ప్రతి చిత్రాన్ని రీసైజ్ చేయాలంటే కష్టం. అదే బ్లాగుస్పాటుకైతే పికాసనుండి సీదా ఎక్కించచ్చు.

నా దృశ్యబ్లాగుని కూడ చూసి ఆనందించగలరు.

నా కనులతో...

13, డిసెంబర్ 2010, సోమవారం

ఒక ఇబ్బందికర జ్ఞాపకం

జీవితంలో ఎదురయ్యే కొన్నికొన్ని సంఘటనలు ఇబ్బందికర పరిస్థితులు కలిపిస్తాయి. నా చిన్నప్పుడు జరిగిన అలాంటి సంఘటనొకటి, శిశిరగారి బ్లాగులో ఈ క్రింది వాక్యాలు చదివినపుడు గుర్తొచ్చింది.


ఉపాధ్యాయులకి ప్రవర్తనా నియమావళి పెడుతున్నారట. అందులో పిల్లలతో అసభ్యంగా వ్యవహరించకూడదనీ, లైంగిక వేధింపులు చేయకూడదనీ, ఉత్తమ గురువులుగా ఉండాలని, తోటి వారితో కలిసి మెలిసి మెలగాలని చెప్తారట. ఏమిటి? ఇవన్నీ ఆచరించడానికేనా? ఆచరించాలా? అని కొందరు గురువులు బెంగపడుతున్నారట. ఒకప్పుడు ఇవన్నీ గురువులు పిల్లలకి చెప్పేవారు. ఇప్పుడు గురువులకే చెప్పాల్సొస్తూంది. ఇప్పటికైనా అర్థమవుతుందో, లేదో నోట్లో వేలు పెట్టినా కొరకలేని కొందరు అమాయక గురువులకి.

తొమ్మిదో తరగతి - మార్చి నెల - ఒంటిపూట బళ్ళు. 8కి బడి అంటే మేము (నేనూ, నా ఆప్తమిత్రుడు అంజి) సాధారణంగా ఇంట్లో హడావిడి చేసి ఏడున్నరకే వెళ్ళిపోతాం. ఆ రోజు ఆలస్యమై 8కి వెళ్ళాం హడావిడిగా. వెళ్ళేసరికి రోజూ జరగాల్సిన ప్రేయర్ అసెంబ్లీ జరగట్లేదు. అంతా గందరగోళంగా, ఉద్రిక్తంగా వుంది. ప్రిన్సిపల్ రూం నిండా ఎవరెవరో వున్నారు. మేం క్లాసుకి వెళ్ళాం. ఆయా లక్ష్మి వచ్చి సుజాత టీచర్ మిమ్మల్నిద్దరినీ ప్రిన్సిపాల్ రూంకి రమ్మన్నారని చెప్పింది. అక్కడికి వెళ్ళేసరికి ప్రిన్సిపాల్ ఒక పక్క సోఫాలో ముభావంగా కూర్చొని వున్నారు. సుజాత టీచరు ప్రిన్సిపాల్ కుర్చీలో వున్నారు. టీచర్లందరూ సీరియస్‌‌గా వున్నారు.
అక్కడేం జరుగుతుందో, మమ్మల్నెందుకు పిలిచారో అర్థంకాలేదు.

సుజాత టీచరు "మీరీరోజు స్కూలుకు ఎన్నింటికొచ్చార?"ని అడిగారు.
"ఇప్పుడేం వచ్చాం మే'మ్".
"నిజం చెప్పండి, రోజూ ముందే వస్తారుగా?"
"నిజం మే'మ్, ఈ రోజు లేటయ్యింది."

*************************
ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. మొదట మా స్కూలు గుంటూరులో వీధికొకటి వుండే బుల్లిబుల్లి కాన్వెంట్లనబడు బళ్ళల్లో ఒకటి. ట్యూషనుకి ఎక్కువ, స్కూలికి తక్కువ. మొత్తం విద్యార్ధుల సంఖ్య 150, మా తరగతిలో ఐదుగురం. టెన్తులో ఒక్కడు, మార్చికాబట్టి పరీక్షలురాయడానికెళ్ళాడు. అంతకుముందు మా అన్నయ్య ఏడు నుండి పదివరకు ఒకేఒక్కడిలా చదివి వెళ్ళిపోయాడు.

రెండవది ఆ స్కూలు బ్యాంకుద్యోగుల పిల్లలకోసం పెట్టినదిగనుక, మా నాన్నగారు బ్యాంకాఫీసరుగనుక మేము అక్కడ చేరాము. ఐతే బ్యాంకువాళ్ళ పిల్లలు తక్కువ, మిగతావారు ఎక్కువ వుండేవారు. మా నాన్నగారు ఆ స్కూలుని పెంచాలని అప్పుడప్పుడు వెళ్ళి సలహాలు ఇచ్చేవారు. ఒక తడవ కార్యదర్శిగా చేశారు.
*************************

సుజాత టీచరు, "సరే! వెళ్ళి అన్ని క్లాసులు మానిటరు చేయండి. మేం ముఖ్యమైన మీటింగులో వున్నాం" అన్నారు.

వెనక్కి వచ్చాం. మిగతా క్లాస్మేట్లు ముగ్గురూ స్కూలుకి రావట్లేదు. వాళ్ళు స్కూలు బయట ట్యూషనుకు వెళ్తున్నారని మా ప్రిన్సిపాల్కి , వాళ్ళ తల్లిదండ్రులకి గొడవయ్యింది.

క్లాసులు మెయింటెయిన్ చేస్తున్నాం. మధ్యమధ్యన ఆఫీసుగదిలోకి తొంగిచూస్తున్నాం. పెద్దగానే వాదించుకుంటున్నారు. ఒకావిడ మా ప్రిన్సిపాలుని, స్కూలుని బూతులు తిడుతుంది. ఆయన ఏదో చేశాడని అర్థం అయ్యింది, ఏమిటన్నది అని తెలియలేదు. ఒక టీచరు బయటకి వచ్చి, "ఇవాల్టికి ఇంక స్కూలు లేదు, అందరినీ జాగ్రత్తగా ఇళ్ళకి పంపించండి" అన్నారు. అటెండరు - రిక్షా అబ్బాయి అయిన తిరుపాల్ వచ్చి ఒక్కొక్క ట్రిప్పువాళ్ళని తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. తిరుపాల్ని అడిగాం "ఏమయ్యింద"ని. చెప్పలేదు. ఆయా లక్ష్మిని అడిగాం, తిడుతుందిగానీ (మమ్మల్నికాదు), ఏం చెప్పదు.

మాకు టెన్షను, అయోమయం, ఆసక్తి అన్నిరకాల ఎమోషన్లు మొదలయ్యాయి.

కాసేపటికి స్కూలు బయట జనం పెరిగారు. ప్రిన్సిపాల్ని ఉతకబాదుడు బాదుతూ రోడ్డుపై తన్నుకుంటూ తీసుకెళ్ళుతున్నారు. సుజాత టీచరుకూడ వెళ్ళారు. ఇంక ఆగలేక మాకు కొంచెం క్లోజైన ఎల్కేజీ టీచరుని అడిగాం. అప్పుడు చెప్పారు, ఎవ్వరికీ చెప్పొద్దంటూ. మా ప్రిన్సిపాల్ ఒక ఎల్కేజీ అమ్మాయిని అత్యాచారయత్నమో, నిజంగా అత్యాచారమో చేశాడట. పోలీసు స్టేషనుకి తీసుకెళ్ళారట.
**********************
అందరినీ ఇళ్ళ దగ్గర దిగబెట్టాం. కానీ ఇప్పుడే ఇంటికి వెళ్ళితే ఏం చెప్పాలి. అందుకే మా క్లాస్మేట్ల (ఇద్దరు అన్నాచెళ్ళెల్లు) ఇంటికి వెళ్ళాం. విషయం చెప్పాం. ఆంటీ పొంగిపోయారు, మమ్మల్ని అన్నందుకు వాడికి తగిన శాస్తి జరిగిందని కాసేపు తిట్టారు. అక్కడ టైంపాస్ చేసి సాయంత్రం ఏమి జరగనట్లు ఇంటికెళ్ళిపోయాం.

**********************
అప్ప్ట్లట్లో మా నాన్నగారు కాలికి ఏక్సిండెంట్ అవ్వటంతో ఇంట్లోనే చాలా రోజుల నుండి విశ్రాంతి తీసుకుంటున్నారు. స్కూల్లో సంఘటన జరిగిన రెండుమూడు రోజులకి మా స్కూలు సెక్రటరీ (ఎవరో ఒక బ్యాంకు ఆఫీసరు వుంటారు కార్యదర్శిగా) నాన్నని పరామర్శించడానికి ఇంటికి వచ్చారు. మాటల సందర్బంలో ఇలా అయ్యింది, ప్రిన్సిపాల్ని అరెస్టు చేసారు, సుజాత టీచరుని ప్రిన్సిపాల్ చేశాం అని చెప్పారు. వెంటనే నాన్న నన్ను పిలిచారు, ఇంత జరిగితే చెప్పనేలేదేంటి అనడిగారు. నాన్న దగ్గర నాకు సాధారణంగా చనువు వుంది - చిన్నప్పటినుంచి ఒక మిత్రుడిలాగే పెంచారు. కానీ ఇలాంటి విషయం ఎలా చెప్తాం - కొంచెం ఇబ్బందిగా (ఎంబరాసింగ్) అనిపించింది.

*********************
తర్వాత, అమ్మో ఆ రోజు మనం స్కూలికి అలవాటుగా తొందరగా వెళ్లుంటే? అని చాన్నాళ్ళు భయంగా అనిపించింది. భయమేందుకంటే, ఆ సంఘటనకి వారం రోజుల ముందు, మా వీధి చివర స్కూల్లో టెన్త్ స్పెషలు క్లాసులని పెట్టి ఒక అమ్మాయికి మత్తుమందిచ్చి ఒక టీచరు (ఆ స్కూలు మహిళా ప్రిన్సిపాల్ కొడుకు), ఇద్దరు విద్యార్ధులు అత్యాచారం చేశారని గొడవయ్యింది. వారంకే మా స్కూల్లో. మమ్మల్నీ అనేవారేమోనని భయం.

కానీ మేమెళ్ళుంటే మేమున్నామనైనా ఆయన ఆ పని చేసేవాడుగాదేమో (నిజంగా చేసుంటే), ఆ అమ్మాయి రక్షించబడేది అని తర్వాత అనిపించేది.

*********************
పీకేసిన ప్రిన్సిపాల్ మాకు మా౨థ్స్, ఫిజిక్స్ చెప్పేవారు. సిలబస్ చాలా మిగిలుంది అప్పటికి. పరీక్షలకి నెలముందే కావడంతో కొత్త టీచరు దొరకలేదు. పబ్లిక్ పరీక్షలకి ఆ రెండు సబ్జెక్టులు మేమిద్దరం సొంతంగా చదువుకొని, ట్యూషను పెట్టించుకొన్న మిగతా ముగ్గురికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాం - అది మాపై మాకు నమ్మకాన్ని పెంచి భవిష్యత్తులో బాగా ఉపయోగించింది.
**********************

ఆ ప్రిన్సిపాల్ ఇల్లు మాకు తెలుసుగనక, పదవ తరగతిలో వుండగా ఒకసారి వెళ్ళి కలిసాం. ఆ పని ఆయన చేయలేదు అని చెప్పారు. ఎలా బయటపడ్డారో తెలియదుగానీ, రైల్వేలో ఉత్తరాంధ్రవైపు అసిస్టెంటు స్టేషనుమాస్టరు ఉద్యోగం వచ్చిందని చెప్పారు. తరువాత ఎప్పుడూ కలవలేదు.

4, డిసెంబర్ 2010, శనివారం

సుందోపసుందులు 4: ’డెల్టా’ తంటా

సమయం: ఎండాకాలం రాత్రి 1-4 మధ్య
స్థలం: ప్యాసింజరు బండి, జనరల్ కంపార్టుమెంటు
ఇతర పాత్రలు: నిండుగా కాలుపెట్ట చోటులేనంత జనం - కూర్చొని నిద్రపోయేవారు-నించోని జోగేవారు. వారి స్టేషను దగ్గరపడితే కనులు మూస్తూ తెరుస్తూ దిక్కులు చూసేవారు. మధ్యమధ్యలో సమోసాలు-మసాలాలు, టీ-కాఫీలు అమ్మువారు.

కథానాయకులు:

1.జేబీ (అంటే నేను) - ఒళ్ళో 1000 పేజీల బండ పుస్తకం, చేతిలో మార్కరు/హైలైటరు
2. మనో - ఒళ్ళో 1500 పేజీల దిండు పుస్తకం, చేతుల్లో నోటుబుక్ మరియు పెన్సిల్.

నమ్మట్లేదు కదూ? వీళ్ళు కొంచెం ఎక్స్‌ట్రాలు చెయ్యట్లా?

నటించట్లేదు. తరువాత క్లియరు చేసిన సర్టిఫికేషనుపైనొట్టు, నిజ్జంగా చదివాం.

ఎందుకిలా? ఈ సుందోపసుందులు ఏ ఘనకార్యం చేయుటవలన ఇన్ని అవస్థలూ-నీలాపనిందలు పడుతున్నారు?

ఒక ఇరవై రోజులు వెనక్కి వెళ్ళితే...
***************

ఈ జేబీ అనబడు నేను, ఒక వారాంతం పొద్దునే (అనగా పదికి) హిందూ పేపరు చదువుతుండగా ఒక వార్త ఆకర్షించినది. సికిందరాబాదు-రేపల్లె మధ్యన వయా గుంటూరు డెల్టా పాసింజరని కొత్తగా రైలు వేసారట. వార్త చదివి సంతోషం తట్టుకోలేక ఆవేశం ఆపుకోలేక రిజర్వేషను ఆఫీసుకెళ్ళిపోయా. లైన్లో నించొని మనోకి ఫోనుకొట్టా, "నీక్కూడా చేయించనా"ని. వచ్చే శుక్రవారంరాత్రికి చేయించేశా, ఆహో మనక్కూడా దొరికాయే అని పొంగిపోతూ.

***************

ఎనిమిదిముప్పావుకి రైలు సమయమైతే అలవాటుప్రకారం ఏడింటికి చేరుకున్నా. అప్పటికే కొంచెం సాఫ్ట్వేరు కళలు కొన్ని వచ్చాయికాబట్టి చెవుల్లో ఎంపీ౩-వీపున బ్యాక్‌ప్యాక్-టీ-షర్టు-ఫీలా కాజువల్ షూస్-చేతిలో ఒక ఇంగ్లీషు పత్రిక-ఇంకో చేతిలో రియల్ జ్యూస్ - ఇప్పుడు శుక్రవారం రాత్రి స్టేషను నిండా ఈగల కన్నా మా జాతే ఎక్కువుంటారుగానీ మరి 2004-05ల్లో గోదావరి-గౌతమి వంటి రైళ్ళ ప్లాట్ఫాంలపై ఓ పదిమంది తప్పితే ఎక్కువ కనిపించేవారు కాదు (నాకు). అందులోనూ మాది ప్యాసింజరు బండి.

వీడెవడ్రా బాగా వేషాలేస్తున్నాడు (అదే స్టైలుకొడుతున్నాడు) అని జనాలు అనుకుంటుంటుండగా ప్లాట్‌ఫాంపై అటు ఇటు తిరుగుతూ మావాడికోసం ఎదురుచూస్తున్నా. నేనంటే టోలీచౌకీనుండి రావాలిగానీ, మావాడుండేది కవాడీగూడ, చక్కగా నడుచుకుంటూ రావచ్చు. ఫోనుకొడితే ఎనిమిదికి ముందు బయలుదేరేది లేదన్నాడు.

భారత రైల్వేల ఆచారం ప్రకారం కాకుండ ఎనిమిదిన్నరకి, అంటే పావుగంట ముందే బండి పెట్టేశారు (ఇప్పుడు 9.30 అవ్వాలి). ఒక్కసారి కలకలం చెలరేగి ఉరుకులు-పరుగులు మొదలయ్యయి. మనం రిజర్వేషను కదా - దర్జాగా నించున్న. మనకీ కొంచెం మంచి అలవాట్లుండటంవల్ల, నెమ్మదిగా భోగీ తలుపుదగ్గరికెళ్ళి ఛార్టులో పేర్లు రూడీచేసుకుందామని వెతకటం మొదలుపెట్టా. అప్పుడు చిన్న షాకు. మన పేర్లులేవు. రెండుమూడుసార్లు చూశా. ఉహూఁ! లేవు. టిక్కెట్టు మళ్ళీ చూశా - ఆఁ అప్పుడు తగిలింది. మనం తేదీలో ఒక నెలెక్కువేశాం అని. హహ్హహ్హహా! ఛీఛ్చిఛీఛీ - కొన్ని తలలు తిరిగాయి అటువైపు, (అంటే మనవైపు) వీడికేమయ్యిందని.

అప్పుడు పరిస్థితిని సమీక్షించగా కర్తవ్యం గుర్తొచ్చింది. మనోకి ఫోనుకొట్టా, "ఏరా ఎక్కడున్నావ్?"
వాడు "వచ్చేసినట్లే- ఫైవ్ మినిట్స్. రైలొచ్చేసిందా?"
చేసిన ఘనకార్యం చెప్పా.
వాడు "ఇప్పుడేం చేయాలిరా?".
"నువ్వెక్కడున్నావ్?"
"ఇప్పుడే భోయిగూడ చేరుతున్నా!"
"ఒహో! ఐతే నువ్వు సీదా ఒకటో ప్లాట్ఫాంకిపోయి (అప్పటికి భోయిగూడ కౌంటరులేదన్నట్లు గుర్తు) రెండు టికెట్లు పట్టుకురా. నేనెళ్ళి రెండు సీట్లాపుతా". స్లీపరుబోగీలన్నీ దాటి ఆఖరునున్న జనరల్‌కి పరిగెట్టా. రెండు సీట్లు ఏదోవిధంగా సంపాదించా.

మనో కూడ పాపం లగేజితో స్టేషను ఈమూలనించీ ఆ మూలకి పరిగెట్టి, లైన్లో నించొని ఎలాగోలా టిక్కెట్లు తీసుకొచ్చాడు.

***************

సరే ఇలాంటి టికెట్ల గూఫులు అందరికీ ఎప్పుడోప్పుడుండేవేలే అని సరిపెట్టుకున్నాం. అక్కడితో కథ ముగిస్తే మరి మా ప్రత్యేకత ఏముంది...

**************

రైలు బయలుదేరింది. మేం ప్రత్యక్షంగా కలుసుకొని చాలా రోజులు అయ్యింది. ప్యాసింజరు బండీ, ఘట్కేసరు చేరేసరికి రాత్రి పదిమాత్రమే అయ్యింది. కాలక్షేపం ఎలా అవుతుంది? దాంతో బాతాఖానీ మొదలుపెట్టాం. ఇద్దరు సాఫ్ట్వేరుగాళ్ళు కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారు - అదే జరిగింది. మొదటి గంట ప్రాజెక్టుల గురించీ, ఒక అరగంట కంపెనీలగురించీ, ఆ తరువాత ఒక గంటన్నరా-రెండు గంటలు.

"పదకొండున్నరయ్యింది బాబులూ, మీరు కాస్త కబుర్లు ఆపితే మేం కాసేపు పడుకుంటాం" పాపం పక్కవాళ్ళు. మాకూ కొంచెం విశ్రాంతి కావాలి అనిపించింది. చెవుల్లో పాటల ప్లగ్గులు పెట్టుకున్నాం. మా వాడు పుస్తకాలు బయటికి తీసాడు. పరీక్షలట. వాడు దూరవిద్యలో ఏవో పైచదువులు వెలగబెడుతున్నాడు అప్పుడు. పది నిమిషాలు భారంగా గడిచాయి. ఇంతకుముందటి వ్యాసాల్లో చెప్పినట్లు నాకు ప్రయాణాల్లో నిద్రరాదు, మావాడేమో ఎప్పుడుకావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు. హమ్మా! వాడు పడుకుంటే నా పరిస్థితేంటీ? ఎండాకాలం, పెట్టె నిండా జనం, ఉక్కపోత నాకు తోడు.

దాంతో మళ్ళీ ముచ్చట్లు మొదలుపెట్టా. "అరే, పన్నెండవుతుంది, రైలు మూడున్నరకల్ల గుంటూరెళ్తుంది -ఈలోపు ఏం పడుకుంటాం చెప్పు" . ఈ సారి మాసోదంతా పూర్తి సాంకేతికం - వాడి సబ్జెక్ట్లపై. కొంచెం తెలుగు, చాలా ఇంగ్లీషు.

మిగతావారు ఒక్కొక్కరు కళ్ళు తెరిచీ చూడటం, పడుకోవటం. కాసేపు చూసి పక్కనున్న ఒక పెద్దాయన ముందు కోరాడు, తర్వాత ఒక వార్నింగిచ్చాడు, "గమ్మునుంటారా, తలుపులోంచి తోసెయ్యనా". మాక్కూడ - నిద్ర రాలేదు, జాలివేసింది.

దాంతో నేనూ సంచీలోంచి ఒక పెద్ద సాంకేతిక గ్రంధం తీసా - అప్పట్లో ఒక సర్టిఫికేషనుకి తయారవుతున్నా.

అవ్విధంగా ఆ దృశ్యమెట్టిదనగా, అర్ధరాత్రి 1-4 మధ్యన, రైల్లో చదువుతూ || మొదటి పేరా చదువుకొనుడు||.

కొ.మె.: ఇలాంటి టిక్కెట్టు గడబిడలు అదే మొదటిసారికాదూ, ఆఖరిసారికాదూ.

25, నవంబర్ 2010, గురువారం

ఈ-వ్యర్ధం

ఈ ప్రక్క చిత్రం చూడండి. ఒక వైర్లచుట్ట కనిపిస్తుందా? ఇవి నా దగ్గరున్న వైర్లల్లో మూడోవంతుకూడ కాదు. నా గది ఒక వైర్ల ప్రపంచం. రెండు లాపుటాపులు (ఒకటి నాది, మరోకటి సంస్థది - మూడోది వుండేది క్లైంటుది, ఇప్పుడు లేదు), వాటి ఛార్జర్లు, ఇంకా ఎంపీ౩, మొబైల్ (ఇవీ రెండు - ఒకటి నాది, రెండోది సంస్థది), ఎస్.ఎల్.ఆర్ కెమెరా, బ్లూటూత్ - వీటన్నిటికీ ఛార్జర్లు,
 
కనెక్టు చేయుటకు యూఎస్‌బీ కేబుళ్ళు, రీఛార్జబుల్ బ్యాటరీలు, ... - అంతులేని కథ. చిత్రములోనివికాక ఇక్కడ ఒక సంచినిండా, ఇంకొన్ని స్వదేశంలో. ఇంటికెళ్ళినపుడు ఇవన్నీ హాలునిండా పరిచి అమ్మచే తిట్లు తింటూంటా. మరన్నీ కావాల్సినవే, ఛార్జింగు చేయాల్సినవే.

పర్యవరణానికి నావంతుగా ఇలా హానీ కలిగించడం నాకు అప్పుడప్పుడు బాధ కలిగిస్తుంటుంది. కానీ ఏంచేస్తాం ఆసక్తులని ఆపుకోలేంగదా. నేనేకాదు ఎవ్వరూకూడ. ఐతే నన్ను నేను సమర్ధించుకోవడం లేదు, నేను చెయ్యగలిగేవి నేను చేస్తూనే వుంటా. కాకపోతే మనం నివారించగలిగేవి కొన్నుంటాయి.

ఏ ఫోనైనా, కేబులైనా, బ్యాటరీయైనా అందులో ప్లాస్టిక్, ప్రమాదకర లోహములుండటం సాధారణం.

ఆర్నెల్లొకకసారి మొబైలు మారుస్తున్నాం - అది పాడయిపోవటంవలన కావచ్చు, కొత్త మోడళ్ళపై మోజో, ఏదైన కావచ్చు. మా ఇంట్లోనే దాదాపు పది మొబైల్సు కొనుంటాం. మరి ఆ పాత ఫోన్లు, ఛార్జర్లు ఏమైతున్నాయి?

గడియారం, గోడ గడియారం, పిల్లల ఆటవస్తువులు, టీవీ రిమోట్లు, టార్చిలైట్లు - ఇలాంటివాటన్నిట్లో వాడే బ్యాటరీలు ఏమవుతున్నాయి?

చెత్తబుట్టలోకి పోతున్నాయి. రోబో సినిమాలోలా ఈ-వ్యర్ధం గుట్టలు. అది ఎంత ప్రమాదకరం?

సాంకేతిక విప్లవంలో కొట్టుకుపోయీ, అవగాహనలేమివలనా ఈ ప్రమాద తీవ్రతను మనలో చాలామంది గుర్తించుటలేదు.

పెద్దపెద్ద ఐటీ సంస్థల్లో కొంతవరకు పనికిరాని ఈ-చెత్తని సేకరించి రీసైకిలు చేస్తున్నారు. కానీ అక్కడ కూడ ఉద్యోగులు అంత శ్రద్ధ చూపిస్తున్నట్లు లేదు. అంతెందుకు ఇక్కడి మా అమెరికా కార్యాలయంలో కాగితం-ప్లాస్టిక్-ఎలక్ట్రానిక్ ఇలా మూడురకాల డబ్బాలున్న, అన్నీ కలిపేసేవారు పెక్కుమంది.అంటే శ్రద్ధచూపేవారు లేరనికాదు.

మీరు మీ పాత ఛార్జర్లు, ఫోన్లు ఏంచేస్తున్నారు?

నోకియా కేర్ సెంటరులో వెయ్యండి. వారే రీసైకిలు చేస్తారు. purti మిగతా మొబైలు తయారీదారులు, షాపింగుమాలుల్లోనూ నాకు తెలిసి సేకరిస్తారు.

ఇవన్నీసరేగానీ మొబైలు తయారీదారులు అందరూ ఒకేలాంటి ఛార్జర్లు ఎందుకు చేయరు. నోకియా అయితే ఇదివరకు పెద్ద పిన్‌తో, ఇప్పుడు చిన్న పిన్‌తో చేస్తుంది. కొత్త ఫోనుకొంటే మళ్ళీ ఒక కొత్త ఛార్జరు. నికానువాడు ఎస్‌డీ కార్డువాడితే, సోనీ మెమొరీ స్టిక్, ఇంకొకరు మైక్రో ఎస్‌డీ - ఒకే టెక్నాలజీ ఎందుకు వాడరు? నా ఆలోచనలకి తగ్గట్టే ఎవరో ఈ క్రింది వీడియో చేశారు.

తయారీదారులు అందరూ ఒకే ప్రమాణాలు పాటిస్తే కొంతవరకూ ఈ వ్యర్ధము కొంత తగ్గుతుంది కదా!


21, నవంబర్ 2010, ఆదివారం

పెసరట్టు + అల్లప్పచ్చడి + బ్రూ కాఫీ

భాస్క్రర్ రామరాజుగారు వారాంతంలో ఉల్లిపెసర కుమ్మారంట, బొమ్మలు చూపించి నోరూరించారేగానీ ఎలా చెయ్యాలో చెప్పలా. అహా! నాకు రాదనికాదు, ఇంటర్నెట్లో దృశ్యాలు దొరకవనికాదు; తోటి గుంటూరువాడికి స్థానిక పద్ధతిలో చెప్తారని.

అందుకే, నేను ఇవాళ పొద్దునే (పదకొండుకి) లేచి చేసేశా. పనిలోపని అల్లప్పచ్చడి కూడా చేశా. పెసరట్లు కుమ్మాక చిక్కటి కాఫీ గొంతులో పడితేనేగా మజా. ఫిల్టరు కాఫీ లేదు, ఏం చేస్తాం, బ్రూ కాఫీతో సరిపుచ్చా.

బ్రహ్మచారి ఒక్కడే అమెరికాలో చీజ్ పిజ్జాలు- వెజ్ బర్గరులు తినలేక కష్టపడుతున్నాడని పాపం ఇంట్లోవాళ్ళు తల్లడిల్లుతుంటారు, మనం ఇక్కడ రోజూ కుమ్ముతున్నామని చెప్పినా నమ్మట్లా. అందుకే వాళ్ళకోసం, నోరూరించి నాలో పౌరుషం+పట్టుదల రగిలించిన భాస్కర్‌‌గారి కోసం ఈ క్రింది చిత్రము.

 
Posted by Picasa

1, నవంబర్ 2010, సోమవారం

కాలేజీ కబుర్లు: 'మీరు చూచిన ఇంజినీరింగు అద్భుతం'

అది ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం. మూడో నెల్లోకొచ్చాం. ఇంగ్లీష్ ప్రొఫెసర్ రెండవ ఇంటర్నల్ దిద్దినపేపర్లు పట్టుకుని వచ్చారు.

అందరిలోను ఆత్రుత, వారిమార్కులే కాదు, క్లాసులో ఒకబ్బాయికి ఎంతొచ్చాయని. ఒక్కక్కరివీ వస్తున్నాయిగానీ అతనిది రావట్లేదు. అందరికీ కొంచెం, ఆ అబ్బాయికి అంతకన్నా ఎక్కువ ఉత్కంఠ. సాధారణంగా ఆ అబ్బాయి మార్కులగురించి అందరిలా ఎక్కువ టెన్షనుపడడు. ఎందుకంటే రాయడంవరకే మనవంతు, మార్కులు దిద్దేవాళ్ళ మూడు, దయ అని అతనిది ఒక మెట్టవేదాంతం. మరి ఆ అబ్బాయి ఎందుకు తపనపడుతున్నాడంటే ఒక నెల వెనక్కి మొదటి ఇంటర్నలుకి వెళ్ళాలి.

**********

ఫ్లాష్‌బాక్లో ఫ్లాష్బాకుకి వెళ్ళితే...

**********
మొదటి ఇంటర్నలు ఫలితాలు ఒక్కొక్క సబ్జెక్టుకిస్తున్నారు. మొదటిసారికాబట్టి అందరిలో ఒక ఆసక్తి, ఎవరికి ఎలా వచ్చాయో, ఎవరు తోపో, ఎవరుకాదో, ఎవరు మనకి పోటీ, ఎవరు మనకి వచ్చే పరీక్షల్లో సాయంచేస్తారో - ఇలా ఒక తహతహ. ఎంసెట్ రాంకుతో కొంచెం అందాజా వెయ్యొచ్చుగానీ, మరి పాలిటెక్నికునించి ఈసెట్ రాంకులు వచ్చినవారుగూడ వున్నారు.

మొదటగ ఇంగ్లీషు మార్కులిచ్చారు. సెంటెన్సు కరెక్షను చేయమని 40 వాక్యాలు ఇచ్చారు (అప్పటికింకా పాఠ్యపుస్తకాలు రాలా). ఈ అబ్బాయికి ఇరవైకి పంతొమ్మిదిన్నర (ఒక్కటే తప్పు) వచ్చాయి. అదే కాలేజీ టాపుస్కోరు. ఇద్దరుముగ్గురికి 12-13 వచ్చాయి (15 పైన ఎవరికీ క్లాసులో వచ్చినట్లు గుర్తులేదు). మిగతావారంతా తప్పారు. ఇంక ఇంగ్లీషుసారు ఆ పేపరుతీసుకుని ప్రతి బ్రాంచిలో ప్రదర్శనకి పెట్టిమరీ అందరినీ తిట్టారు చూసి బుద్ధితెచ్చుకోమని. మొత్తం కాలేజీలో పట్టుమని పదిమంది కూడ పాసవ్వలేదు. కాలేజీలో ఇంకొక్కళ్ళకి 15పై వచ్చినట్టున్నాయి.

దురదృష్టవశాత్తూ ఆ రోజు ఆ అబ్బాయి కాలేజికి రాలేదు. పాపం ఎంతటి అవకాశం పోగోట్టుకున్నాడో. అప్పటివరకూ క్లాసులోనే చాలామందికి తెలియని అతడు ఒక్కసారి కాలేజిమొత్తం పాపులరు అయ్యాడట్లా!

***********
మళ్ళీ ఒక నెల ముందుకు తిరిగితే....

***********
జనాలు ఆ అబ్బాయికెన్నొచ్చాయని ఎదురుచూస్తుండగా...

రెండవ ఇంటర్నలు మార్కులిస్తూ అందరు భాషాధ్యపకులులాగే మావాళ్ళు రాసిన ఉత్తమసమాధానాలూ, కథలూ కాకరకాయలూ బయటికి చదువుతూ అందరినీ నవ్విస్తూ సాగుతున్నారు. అలా అందరివీ అయ్యాక, చివరికి ఆ అబ్బాయిపేపరు తీసారు.

20 మార్కుల పరీక్షలో ఒక 10-12 మార్కుల ప్రశ్న: "మీరు చూసిన ఒక ఇంజనీరింగు అద్భుతం వివరింపుడు"

సారు అతని పేపరు పట్టుకొని, "ఈ అబ్బాయికి పోయినసారి కాలేజిలో ఫస్టుమార్కు. అప్పుడు నేను చాలా ఆనందపడ్డా. హమ్మయ్య, ఈ కాలేజిలో ఒక్కడున్నాడు అని (ఆ అబ్బాయి గాల్లో తేలుతున్నాడు). ఇక ఈసారికొస్తే, మీకు నచ్చిన ఇంజనీరింగు అద్భుతం వ్రాయండయ్యా అంటే ’హౌరా బ్రిడ్జీ - ఒక ఇంజనీరింగు అద్భుతం’ అని హెడింగుపెట్టి ౬ పేజీలు రాశాడు. విషయం చదవడానికి బాగుంది. గ్రామరు బాగుంది. తప్పులేమాత్రంలేవు. ఇంతవరకు బాగుంది, బాగా రాశావు. కానీ చదివేది కంప్యూటరు సైన్సు. ఇంజనీరింగు అద్భుతమంటే కంప్యూటరు గురించి వ్రాస్తావనుకుంటే హౌరా బ్రిడ్జీ, గణపవరం బ్రిడ్జీ (మా కాలేజిపక్కనే ఎన్‌ఎచ్5పై వుంది) ఏంటయ్యా? కనీసం రోబోలగురించి రాయొచ్చుగా. అస్సలు ఇలా రాయొచ్చొనే ఆలోచనెలావచ్చిందంటావ్ నీకు? నువ్వు నిజమైన ఇంజినీరింగు విద్యార్ధివనిపించుకున్నావ్ (ఇలా ఏవిషయమిచ్చినా పేజీలు నింపే సామర్ధ్యం, నేర్పు వాళ్ళకే, వారిలో జేఎన్టీయూవాళ్ళకి, అందులో మా క్లాసు సీఎస్‌ఈవారి సొంతమని నా గట్టి నమ్మకం)."


సారు చెప్పుతున్నంతసేపు ఆ అబ్బాయి నించోని వింటూ చూస్తున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు కలకత్తావెళ్ళి స్తంభాలులేని హౌరా బ్రిడ్జిచూసి నోరెళ్ళబెట్టివచ్చాడు. ఇంజినీరింగద్భుతం అనగానే అదే గుర్తొచ్చింది ఏం చేస్తాడు.

మొదటర్థంకాలా సారు తిడుతున్నాడా, పొగుడుతున్నాడాని. ఆ చివరివాక్యంతో అర్థమయిపోయింది.

ఇక క్లాసులో దృశ్యమేంటో, ఒక రెండుమూడు రోజులపాటు ఆ అబ్బాయికెంత టీజింగెదురయ్యిందో వేరే చెప్పక్కర్లేదనుకుంటా.

ఆ అబ్బాయింకెవరో కాదు ఈ జేబి అంటే నేనేనని ఈపాటికి మీకు తెలిసిపోయుండాలే.

25, అక్టోబర్ 2010, సోమవారం

సుందోపసుందులు - ౩ : పోస్తానా? పొయ్యనా?

క్రిందటి భాగానికి కొనసాగింపు.

... పెళ్ళయిపోయింది, భోజనాలయిపోయాయి, అంటే వచ్చిన పనయిపోయింది. ఇప్పుడేం చేయాలి ఇంతరాత్రి - వెనక్కి పోవాలా? రాత్రికెక్కడుండాలి? అని ఆలోచించుస్తుంటే చల్లని కబురు చెప్పారు - మర్నాడు పొద్దున నాలుగున్నరకి మొదటి రైలుందీ, అయినా లాడ్జిలో రూము బుక్ చేశాము, హ్యాపీగా రాత్రంతా ఎంజాయ్ చేద్దాం అన్నారు. వాళ్ళ సంగతి తెలిసిందే అయినా, సరేనని బయలుదేరాం. మాకు వేరే ఛాయిస్ ఏముందిగనక.

మండపంనుండి బయలుదేరి రాత్రి పదకొండుకి ముచ్చట్లు (అదే సొల్లు) చెప్పుకుంటూ లాడ్జికి చేరాం. అక్కడ రెండు గదులు తీసుకున్నారట. ఒక గదిలో మీరు తాగుతారో, ఏం చేసుకుంటారో (వాళ్ళకి వేరే ఆలోచనలుకూడా వున్నట్లు సందేహమొచ్చింది) మీ ఇష్టంఅని, నేనూ, రాం, కిరణ్, ఇంకా శీను ఒకగదిలో దూరాం. గది చాలా దారుణంగా వున్నా, అలసిపోయున్నాంగా వెంటనే నిద్ర పట్టింది. ఇలా పడుకున్నామోలేదో వెంటనే మావాళ్ళు తలుపులుబాదటం మొదలుపెట్టారు. అరే, లాడ్జివాడు ఖాళీ చేయమంటున్నాడు, పదండిరా అని. అర్థమయిందేంటంటే వాళ్ళు పిచ్చగా తాగి గొడవ చేసిందిచాలక ఇంకో వెధవ పనిక్కూడా ప్రయత్నించారని. ఓనర్కి, వీళ్ళకి మాటామాటా పెరిగి, ఇంక ఊళ్ళో లాడ్జీలేలేవా అని మమ్మల్నీ బయటికి లాక్కొచ్చారు మమ్మల్ని ఓనరుతో మాట్లాడనీకుండా.

ఫుల్లుగా తాగి రోడ్డుపై గట్టిగా మాట్లాడుతూ ముందువాళ్ళు, కొంచెం దూరంలో వెనక మేము నలుగురం. ఏం చేస్తాం, వాళ్ళు లోకల్, మేం ఊరికి కొత్త. వాళ్ళు తిప్పే రోడ్లే అర్థంకావట్ల, ఇంక లాడ్జిలెక్కడో ఏం తెలుసు. ప్రతీ లాడ్జీలో లేదు అనిపించుక్మ్టూ (వీళ్ళని చూసి ఎవరిస్తారు), సగం నిద్రతో హూనమైన ఒళ్ళుతో కాళ్ళీడూస్తూ అలా అర్ఠరాత్రి గంటసేపు తాగుడు బ్యాచితో కాకినాడ ఊరేగాక, ’రక్షక్’లో పోలీసుమామలెదురయ్యారు. మావాళ్ళని కొంచెం గమ్మునుండమని, వారికేదో చెప్పి తప్పించుకున్నాం. ఆ దెబ్బకి ఇక నావల్ల కాదు, దీనికన్నా రైల్వేస్టేషను నయం, హాయిగా వెయిటింగురూములో కూర్చోవచ్చు, నేవెళ్తున్నా ఎవరైనా వస్తారా అనడిగా - రాం, కిరణ్, శీను బయలుదేరారు.

అలా ఒంటిగంటకి కాకినాడ స్టేషనుకి వెళ్ళితే అక్కడ అసలు షాకులు.

స్టేషను బాగుచేస్తున్నారంటా, మొత్తం గుంటలూ, గొట్టాలు. మొత్తం చిమ్మచీకటి. కనీసం రిక్షాలు, ఆటోలు కూడా లేవు. ఎలాగో తారాడుకుంటూ, స్టేషను బిల్డింగుకి చేరితే, బుకింగు కౌంటరు తప్ప అన్ని రూములు బందు రిపేర్లకి. ఓవర్ బ్రిడ్జీకి కంచెలు. సిమెంటు బెంచీలు మళ్ళీ కొత్తగా కట్టడంతో పచ్చిపచ్చిగా. ప్లాట్ఫామంతా సిమెంటూ, ఇసక. పట్టాలు దాటి రెండో ప్లాట్ఫాం చివరదాక నడుచుకుంటూ వెళ్ళితే అక్కడ ఒక్క బెంచీ దొరికింది. హమ్మయ్యా అని దానిపై సెటిలయ్యాం. చలీ, దోమలు తట్టుకుంటూ నెమ్మదిగా నిద్రపట్టుతుంది అనుకుంటుండగానే ఒక గూడ్సు రైలు పేద్ద శబ్దంతో పోర్టు స్టేషన్నిండి వచ్చి రెండో ప్లాట్ఫాంపై వచ్చి ఆగింది.

ఇంక మాకు టెన్షను. మరి ఫుట్‌బ్రిడ్జి మూసుందిగా. దానికింద నుండి దూరదాం అంటే అదెప్పుడు బయలుదేరుతుందో తెలీదు. ఇద్దరేమో దాని కింద నుండి దూరారు. నేనూ, శీను ఫుట్‌బ్రిడ్జీ కంచె దూకి పైకెక్కి మళ్ళీ ఇవతలి ప్లాట్ఫాంకి వచ్చాం. ఈ ఫీటులో శీను కాలికి దెబ్బ తగిలించుకున్నాడు. కిరణ్దగ్గర ఒక దుప్పటి వుందని అప్పుడు గుర్తొస్తే దాన్ని పరిచి ఇద్దరు కూర్చున్నారు. నేను, ఇంకోడూ ప్లాట్ఫాంపై. ఉద్యోగంలో కొచ్చాక మొట్టమొదటిసారి రెండువేలు పెట్టి కొనుక్కున్న పీటర్ ఇంగ్లాండ్ జత - ఒక్కసారే వేసుకున్నా - అలా ప్లాట్ఫాంపై సిమెంటూ-ఇసకలతో. అప్పుడే కాదు, ఇప్పటికీ ఆజత వేసుకున్నపుడల్లా బాధే.

అలా అర్థరాత్రి చిమ్మచీకటిలో, బ్రాండెడ్ దుస్తులతో మేము నలుగురం ఆ కాకినాడ ప్లాట్ఫాంపై పొర్లుతూ దోమలతో కుస్తీ పడుతూ జోగుతుంటే ప్లాట్ఫాంపై కలకలం మొదలయ్యింది. లేచి చూస్తే మూడున్నరయ్యింది. జనాలు వస్తున్నారు. మేం నెమ్మదిగా లేచి టిక్కెట్లు కొనుక్కొచ్చుకున్నాం. మర్చిపోయా, ఈ మధ్యలో, శీను ఈ బాధ భరించలేక బస్టాండుకి వెళ్ళిపోయాడు, హైదరాబాదుకి ఫస్టు బస్సులో పోతాని.

నాలుగున్నరకి రైలంటే నాలుగిరవైకి చూడాలి, ప్లాట్‌ఫాంపై కాలు పెట్టేచోటు కూడాలేదు. పోర్టు స్టేషన్నుండి రావాల్సిన రైలు ఐదయితేగానీ రాలేదు, మమ్మల్ని గంటసేపు నిల్చోబెడుతూ. ఏదో మాకిరణ్ రన్నింగులో రైలెక్కి సీట్లాపాడు కాబట్టి బతికిపోయాం. ఇక చూస్కోండి విజయవాడకి వచ్చేవరకు లేవకూడదని చెప్పి పడుకున్నాం.

అన్నీ అనుకున్నట్లు జరిగితే నేను ఒక టపా ఎందుకు రాస్తాను. ఎనిమిదో, ఎనిమిదిన్నరకో రాజమండ్రిలో స్వామిజీ వేషంలో ఒకాయనెక్కాడు. నేను గోదావరిచూసి పడుకుందాంలే అని లేచా. మేం కూర్చున్న ఐదుసీట్ల చెక్కపై కూర్చున్నాడు. ఎదురుకూర్చున్న ఒకావిడని మీది ఫలాన ఊరు కదా, ఫలానఫలాన కదా అని మొదలుపెట్టాడు. ఆవిడకూడా మొహం వెలిగిపోయింది, భలే చెప్పారండీ, తమరు ఫలానావారింటికి వచ్చారుగదా అని ఆయన్ను గుర్తుపట్టింది. ఇక తన జ్యోతిషవిద్య చూపించడం మొదలుపెట్టాడు. నేను కళ్ళుమూస్తూ తెరుస్తూ గమనిస్తున్నా.

ఈ గురూజీ పక్కన ఒక పల్లెటూరి యువకుడు, పదహారుకన్నా వుండవు కూర్చున్నాడు. ఆ అబ్బాయి కూడా ఇవన్నీ వింటూ, "గురూగారూ, మీరు జరగబోయేవన్నీ చెప్పగలరా? ఐతే నాకు ఏం జరుగుతుందో చెప్పండీ" అనడిగాడు.
ఆ గురూజీ అతన్ని తేరిపారజూసి నేను చెప్పినా నీకు వినగలిగే యోగ్యతలేదు నాయనా అన్నాడు. అతను "ఎందుకండీ? నేను ఇలా పల్లెటూరివాడిలా కనిపిస్తున్నా; మీకు డబ్బులివ్వలేను; ఆవిడయితే బాగా డబ్బులిస్తుందనేగా" అని అడిగాడు. గురూజీకి దబ్బున కోపమొచ్చింది. మాటామాటా పెరిగాయి. వాదించుకోవడం మొదలుపెట్టారు.

ఇక ఆ అబ్బాయికి సపోర్టుగా కొందరూ, ఈయనకి సపోర్టూగా కొందరు, వినోదంచూస్తూ మరికొందరు. మా రాంలా వారి ఊహాలోకాల్లో హాయిగా విహరిస్తూ కొందరు. నాలా, కిరణ్లా, నిద్ర చెడిపోయి తిట్టుకుంటూ అతి తక్కువమంది.

కాసేపట్కి కుర్రాడు ఆవేశంతో ఊగిపోతూ, "మీరన్ని చెప్పగలరు కదా? ఐతే నేనిప్పుడు ఉచ్చపోస్తానా పొయ్యనా చెప్పండి" అని సవాలు విసిరాడు"? ఎదురుకూర్చున్నావిడ ఇక తిట్లు(బూతులతో) మొదలుపెట్టిందీ - సచ్చినోడా! పెద్దాయన్ని పట్టుకుని ఏంటా మాటలు అని. ఆ పిల్లాడిని సపోర్టు చేసేవాళ్ళేమో, "తప్పేంటండీ? ఆయనకి అన్నీ తెలిస్తే చెప్పమనండీ, పోస్తాడో పొయ్యడో". కుర్రోడేమో "మీరు పోస్తావంటే, నేను పొయ్యను - మీరు పొయ్యనంటే నేనిప్పుడే వెళ్ళిపోస్తా" అని. ఆ గురూజీ ఏదో డొంకతిరుగుడు సమాధానాలివ్వడం, వీడు "అవన్నీ ఎందుకండీ? నేను పోస్తానా పొయ్యనా జెప్పండి" సూటిగా చెప్పండని.

ఈ దెబ్బకి మా రాం. బస్సులు ఏక్సిడెంట్లవుతున్నా చలించనివాడు, నిద్రలేచి, "ఏంట్రా, పోస్తానా పొయ్యనా అంటూన్నాడూ. ఏంటిరా ఈ గొడవ" అని ప్రశ్నలు మొదలుపెట్టాడు. వాడికి మొత్తంచెప్పా.

ఈ లెక్కన నూజివీడు దాటేవరకు గొడవజరుగుతూనే వుంది. ఇంక నిద్రెక్కడపోయేది. విజయవాడ స్టేషను బయట సిగ్నల్కోసమో, క్రాసింగుకోసమో గంటపైనే పడేశాడు. ఎదురు పెద్దావిడ చూసిచూసి, "గురువుగారితో గొడవకోసం నువ్వెందుకు ఆపుకుంటావు, వస్తేపోసిరావచ్చుగా" అనింది. నాకువచ్చినప్పుడే నాకు నచ్చినప్పుడే పోసివస్తా? అయినా ఈయన్ని చెప్పమనండీ, నేను నా జాతకం ప్రకారం ఇప్పుడుపోస్తానో, పొయ్యనో అని.

మాకు సహనం నశించీ, ఆకలితో కృశించీ నీరసంతో పడిపోయే దశకి చేరుకున్నాం. ఇంతలో రైల్వేవారు దయతలచి మమ్మల్ని నిజయవాడకి చేర్చగా, ఇంక ప్రయోగాలు చాలని అక్కడి నుండి డైరెక్టు బస్టాండుకి చేరి బస్సుపట్టుకొని మధ్యాహ్నం రెండిటికి గుంటూరులో ఎవరిళ్ళకి వారు చేరుకున్నాం.


ఇలా వుంటాయి మా ఆలోచనలూ-తెలివితేటలూ, వాటితో మా నిర్వాకాలు. అప్పుడప్పుడేలేండి ఏదో ఆవేశంతో, లేకపోతే మేము చాలా ఆర్గనైజ్డ్.

20, అక్టోబర్ 2010, బుధవారం

సుందోపసుందులు - 2 : గుంటూరు-కాకినాడ బస్సుయాత్ర - 2

క్రిందటి భాగంకి కొనసాగింపు


...అలా బయలుదేరిన రావులపాలెం బైపాస్ ఎక్స్‌ప్రెస్ రామవరప్పాడు రింగురోడ్డు దాటి విజయవాడ బయటపడేసరికి మూడయ్యింది. అది ఇంకా ఎండలు పూర్తిగా తగ్గని రోజులు. మన ప్రయాణమేమో గుంటూరు, బెజవాడ, ఇలా. ఉన్నదేమో మిట్టమధ్యాహ్నం హైవేపై బస్సులో. ఇంక ఒక్కటే ఉక్క. నాకేమో ప్రయాణాల్లో నిద్రపట్టదు. రాత్రి రెండిటికి కూడా కిటికీలోకి తలపెట్టి చూస్తుంటా. అందుకే నాకు వోల్వో ఇష్టముండదు. ముందురాత్రి కొంచెంకూడ నిద్రలేపోటానికి అదీ ఒక కారణం. మావాడేమో నాకు పూర్తి విరుద్ధం. వాడదృష్టవంతుడు. ఇలా పిలవగానే, వుహూఁ అసలు పిలవకుండానే అలా నిద్రాదేవి కరుణిస్తుంది.

గుంటూరు బస్టాండులో బస్సెక్కితే చిలకలూరిపేట కాలేజిగేటు ముందు మేం కదిపిలేపేవరకు హాయిగా పడుకుంటాడు. ఒకసారి అలాగే పేటలో ఎక్కి పడుకుని విజయవాడలో కండక్టర్ ’బాబూ లేమ్మా, ఇదే లాస్ట్ స్టాపు’ అంటే లేచి, ’అరే ఇదేంటీ, గుంటూరు బస్టాండులా లేదే’ అనాశ్చర్యపోయి అదే బస్సులో తిరిగొచ్చాడు. వాడి నిద్రగురించి ఒక పూర్తి టపా కేటాయించాలి తీరికున్నపుడు.

సరే వాడేమో అలా హాయిగా ఊహాలోకాల్లో విహరిస్తుంటే, నేనేమో పొలాలని, వెనక్కి పరిగెడుతున్న లారీలు, చెట్లు, ఊళ్ళు, ఊళ్ళ బోర్డులు, మైలురాళ్ళు, ఇలా చూసుకుంటూ - మరి అవి ఐపాడ్లుకాదు కదా, పామాట ఆడుకోవడానికి సెల్ఫోను కూడా లేనిరోజులు. ఇంతలో డ్రైవరుకి టీ తాగాలనిపించిందో, మరి ఆ క్యాంటీనువాడితో అండర్స్టాండిగో హనుమాన్ జంక్షను బస్టాండులో ఆపాడు. అలా టిఫినీలు, కాఫీలు, టీలు అయ్యి మళ్ళీ రోడ్డెక్కేసరికి నాలుగు.

అలా ఏలూరు బైపాస్ జంక్షన్లు రెండూ (మొదటిది దింపడానికి, రెండవది ఎక్కించుకోవడానికి: మరి బైపాస్ ఎక్స్‌ప్రెస్ కదా, ఊళ్ళోకి పోదట), తాడేపల్లిగూడెం బైపాస్ జంక్షను దాటామ్. ఈలోపు గడియారంలో చిన్నముల్లు ఐదు దాటింది. అప్పటికి మావాడు లేచి, ఏరా ఇంకా రాలేదా? మూడుగంటల్లో వెళ్ళిపోతామన్నావ్. నాక్కాలిందిగానీ, మళ్ళీ వాడు పడుకుంటాడేమో, నాకెవ్వరూ దొరకరు కాలక్షేపం చేయడానికి అని ఊరుకున్నా.

సర్లేండి, మరీ బోరుకొట్టిస్తున్నా, ఇలాంటి ప్రయాణాలు అందరికీ వుండేవేగా అనుకుంటుండుంటారు. కొంచెం "మధ్యలో డ్రైవరుగారు తణుకులోకి బస్సుతిప్పి ఇచ్చిన్న ఝలక్ వదిలేస్తే", ఎట్టకేలకు ఆరు-ఆరున్నరకి రావులపాలెం చేరాం.

అబ్బా బయటపడ్డాంరా బాబూ అని దిగిచూస్తే కాకినాడకి బస్సులేదు. కడుపులోనేమో కాలుతుంది. ఎదురుచూసే జనాలేమో చాలామంది. తిండానికి వెళ్ళితే బస్సుపోతుందేమో, లేదా సీటు దొరకదేమోనని. ఒక్క పదినిమిషాలు చూసి కాఫీ తెచ్చుకున్నాం. అలా ఒక్క గుక్క తాగామోలేదో బస్సొచ్చింది. కాఫీగ్లాసులు పడేసి దాడిచేసి ఆఖర్న ఒక రెండు సీట్లు సంపాదించాం. ఇంకప్పుడు ఫోన్లు మొదలుపెట్టాం, కాకినాడలో ఎక్కడ దిగాలి, ఎవరు వస్తారు మమ్మలి మండపం తీసుకెళ్ళడానికి. నాకు లేదన్నాగానీ, మావాడిదగ్గరలేదని చెప్పలేదుగా. ఆ మాత్రం ఏర్పాట్లు, జాగ్రత్తలు లేకుండ నేను కొత్త చోటుకి వెళ్ళనుగా.

ఇంక ఈ కాకినాడ బస్సువాళ్ళు (డైవరు-కండక్టరు) బైపాస్ ఎక్స్‌ప్రెస్సువాళ్ళకి పోటీ - బహుశా ఒకే డిపోనేమో. వాళ్ళు టిక్కెట్లు కొట్టడానికి రావులపాలెం బయట, మండపేట, రామచంద్రాపురం బస్టాండు, కాకినాడ ఊరిబయట మూడు స్టాపులు ఆపుకుంటూ - బయటేమో చీకటి, మావాళ్ళు చెప్పిన స్టాపు దాటేసేమోనని డౌట్లు. మిత్రుల ఫోన్లు రెస్పాన్సులేదు. ఇంకేం టెన్షన్లు. టౌనులోకొచ్చాక ఎక్కడో ఒకచోట దిగేశాం.

అప్పుడు ఫ్రెండుకి ఫోను చేస్తే వాడు ’అక్కడెందుకు దిగార్రా’ అని తిట్టి వచ్చి తీసుకెళ్ళాడు. పెళ్ళిమండపంకి ఎంటరవ్వగానే సీదా భోజనాల ఫ్లోరుకి తీసుకెళ్ళాడు. మా గ్యాంగు అక్కడ - హాయిగా కబుర్లు చెప్పుకుంటూ - మరి కాలేజీ నించి ఎవరి దారిన వాళ్ళెళ్ళిపోయాక ఏడాదికి కలుసుకున్నారుగా. అన్నీ వడ్డిస్తున్నారు. అరే, అదేంటిరా క్రింద పెళ్ళికెళ్ళొద్దాంరా అంటే ఒక్కసారిగా నవ్వడం మొదలు. మరప్పుడేమో ఎనిమిదవుతుంది, ముహూర్తం ఏడున్నరకి. సరే ఇంతలో కృష్ణ వచ్చి వాళ్ళక్కాబావల్ని (పెళ్ళి జంట) పరిచయం చేస్తా అని తీసుకెళ్ళాడు. చూశారా, పెళ్ళికూతురుగానీ, పెళ్ళికొడుకుగానీ తెలీకుండానే ఎగేసుకొని వెళ్ళిపోయాం.

మండపంలోకెళ్తే పట్టుచీరలు-సెంటువాసనలు: మనమేమో తుక్కుబట్టలూ-చెమటకంపులు. సరే అభినందనలు చెప్పి పైకొచ్చాం. అక్కడ షాకు - విజయవాడలో ధైర్యంచేసి స్టేషనుకి పరిగెట్టిన మావాడు కిరణ్ - హుషారుగా కబుర్లు చెప్తూ. నోరెళ్ళబెట్టిన మమ్మల్ని చూసి, ఆ రైలు లేటురా, దొరికింది, ఆరింటికే వచ్చానన్నాడు. ఏం చేస్తాం. మీరెలా వచ్చార్రా అని అడిగాడు. అదో పెద్ద కథలేరా, ఇప్పుడు చెప్పే ఓపికలేదులే.

ఇంక మిత్రులు భోజనాలు వడ్డిచడం మొదలుపెట్టారు. ఆకలితో నకనకలాడుతున్నా అందరం చాలా కాలానికి కలిసాం, కలిసి తిందాం అని ఆగీఆగి పదింటికి పూర్తి చేశాం.

ఇంతవరకు జరిగినది మాకు చాలా మామూలు అనుభవమే - అసలు ఘనకార్యం ఆ రాత్రికి చేశాం.

(సశేషం)

19, అక్టోబర్ 2010, మంగళవారం

సుందోపసుందులు - 1 : గుంటూరు-కాకినాడ బస్సుయాత్ర

చూసిరమ్మంటే కాల్చివచ్చే రకం నేనూ, అన్నయ్య, మా మిత్రులు. బయటికెళ్ళి అలాంటి ఘనకార్యం ఏదోకటి చేసుకొచ్చి ఇంటికి రాగానే అమ్మగానీ, ఆమ్మగానీ వేసే మొదటి పరామర్శ, ’ఈసారేం చేసుకొచ్చారు సుందోపసుందులు?’ అలాంటి మా ఘనకార్యాలు, ఎదురైన వింతనుభవాలు ఈ ’సుందోపసుందులు’:

ఇలాంటి ఘనకార్యాల్లో నాతో ఎక్కువసార్లున్నది ఇంజినీరింగ్ మిత్రుడు రామ్ (పేరు మార్చబడింది). అవి ఇద్దరం హైదరాబాదుకి వచ్చి ఉద్యోగం చేస్తున్న రోజులు, కలవడానికెళ్ళా. తన రూమ్మేట్, కామన్‍ఫ్రెండ్ మా కాలేజివాడయిన కృష్ణ కాకినాడలొఏ శనివారం రాత్రి వాళ్ళక్క పెళ్ళని పిలిచాడు. సరే, వస్తామని మాటిచ్చాం.

మొదటడ్డంకి ఏంటంటే శనివారమ్ పొద్దున రామ్‍కి గుంటూరులో పనివుంది, అయ్యెసరికి ఎంతవుతుందో తెలీదు. అందుకని, రిజర్వేషనులాంటివేం చేసుకోలేదు. ఇద్దరం శుక్రవారంరాత్రి బయలుదేరి గుంటూరు వెళ్ళాం. ఆ రాత్రిక నిద్ర సరిగాలేదు. ఎందుకో తరచూ హైదరాబాదునించి శుక్రవారంరాత్రులు ఇంటికి బస్సుల్లో వెళ్ళేవారికందరికీ తెలుసు ఆ నరకం. భెల్ లింగంపల్లిలో తొమ్మిదికి మొదలయితే, కోఠీ పదకొండుకు, వనస్థలిపురంలో ఒంటిగంటకి బయటపడితె మళ్ళీ గుంటూరులో ఐదున్నరకల్లా దింపేస్తాడు.

శనివారం పన్నెండయ్యింది రాం పనిపూర్తయ్యేసరికి. పెళ్ళి ముహూర్తమేమో రాత్రి ఏడున్నరకి కాకినాడలో. అప్పుడాలోచించాం మొదలుపెట్టాం అసలు వెళ్ళాలా వద్దా, వెళ్ళితే ఎలా వెళ్ళాలా అని? అదే పెళ్ళికి వెళ్తున్న వేరే ఫ్రెండ్ కిరణ్కి ఫోన్చేస్తే రెండింటికి విజయవాడలో రైలుంది, నేనూ గుంటూరు బస్టాండుకి వస్తా వెళ్దామన్నాడు. వాడు నరసరావుపేటనున్డి రావాలి. వాడికోసం ఎదురుచూస్తుంటే రెండు, మూడు బస్సులెళ్ళిపోయినాయి. తీరా వాడు వచ్చాక ఒక్క బస్సూ లేదు. మామూలుగా అయితే ప్రతినిమిషమూ విజయవాడ-గుంటూరు మధ్య బస్సుండాల్సిందే. ఏం చేస్తాం, అప్పుడుకూడా ఊహించలా ముందుముందు ఏంరాబోతున్నాయో?

బస్సుదొరికి విజయవాడ చేరేసరికి ఒకటీముప్పావయ్యింది. ఇంకేం పరిగెడతాం బస్టాండ్ నుండీ రైల్వేస్టేషన్కి, ఆ రైలు దొరకదులే అని. ఇక్కడొక విషయం - మా ముగ్గురంలో ఎవ్వరం విజయవాడదాటి ఆపైకి వైజాగ్‌వైపు వెళ్ళలేదు. కిరణేమో, ఏమైతే అదైందిరా స్టేషన్కే వెళతానన్నాడు.

కళ్ళముందు రావులపాలెం బస్సు బయలుదేరింది. అప్పుడు నేను నా జాగ్రఫీ తెలివితేటలు చూపించా. అరే, మనం రావులపాలెం పోతే అక్కడినుంచి కాకినాడ వెళ్ళొచ్చురా అన్నా. కండక్టర్ని అడిగాం రావులపాలెమెళ్ళేసరికి ఎంతవుతుంది, అక్కడ్నించి కాకినాడ ఎంతసేపని. అతను ఇది బైపాస్ ఎక్స్‌ప్రెస్, మీకెందుకు ౩ గంటల్లో వెళ్ళిపోతారు, అక్కడినించి గంటన్నర.

ఇంకేం ఆరున్నరకల్లా కాకినాడలో వుంటామని మావాడిని నాతో బస్సెక్కించా.

(సశేషం)

15, అక్టోబర్ 2010, శుక్రవారం

నాన్న - ఒక జ్ఞానతృషితుడు

ఇంజినీరింగు కాలేజీ నుండి క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా డైరెక్ట్ ఐటీజాబ్లోకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యి ఒక రెండు మూడేళ్ళు ఎంజాయ్ చేశాక చాలామందికి ఒకరకమైన అసహనం మొదలవ్వవుతుంది. అదే పాతికేళ్ళకి జనాల్లో పుట్టే క్వార్టర్లీ లైఫ్ క్రైసిస్ (QLC).

"థూ సాఫ్ట్వేర్ జీవితం"; "మనమేం చదివాం, ఏం చేస్తున్నాం, దీనికన్నా ఊరికెళ్ళిపోయి ఆటో తోలుకుంటం నయం";"ట్యూషన్లు చెప్పుకున్నా ప్రశాంతంగా వుంటుంది" అని డైలాగులు కొడతారు. అందరూ కాదులేండి. కొందరు మటుకు వట్టి బీటెక్ ఏంటి, ఒక ఎంబీయేనో, ఎంటెక్కో చేయాలి అని తపిస్తుంటారు. క్యాట్ రాస్తా, జీమాట్ రాస్తా అంటారు.

కారణం ఏదైనా కావచ్చు - జ్ఞానం, డబ్బు, కెరీర్, ఉద్యోగాభివృద్ధి,ఏదైనా.

కానీ ఇలాంటివాళ్ళల్లో చాలామంది మాటలతోనే ఆగిపోతారు. ఏంటయ్యా అంటే బిజీ, టైం లేదు అంటారు. అలాంటివాళ్ళల్లో నేనూ ఒక్కణ్ణి ఒక్కప్పుడు.
అసలు ముఖ్యకారణం మటుకు చిత్తశుద్ధిలోపించడం.

కానీ మా నాన్నకి కొడుకుగా నేనలా అనగూడదు.

ఎందుకంటారా? ఒక్కసారి మా నాన్నగారి నేమ్‌‌ప్లేట్‌‌గానీ, విజిటింగ్ కార్డుగానీ చూడాలి.

వై.భాస్కర్ M.A(History), M.A.(English Lit.), L.L.B, B.Com, D.B.M, D.P.M.,D.I.M, A.D.I.M, C.A.I.I.B

మొన్నామధ్యనే యాబయ్యేదేళ్ళ వయస్సులో ఎంఏ హిస్టరీకి నాగార్జున విశ్వవిద్యాలయంలో గోల్డ్మెడల్ (బంగారు పతకం) సాధించారు. పైవికాకుండ, 1987లోనే పిజిడిసిఏ చేశారు. బ్యాంక్లో వుండగా, ఫాక్స్ప్రో ప్రోగ్రామింగ్, బ్యాంక్ మాస్టర్లలో కమాండ్ సంపాదించారు. బ్యాంకు వుద్యోగంలో చేరెటప్పటికి డిగ్రీలేదు, టైపిస్టుగా చేరారు. తర్వాత సాయంత్రం కళాశాలకి రోజూ 20 కిమీ సైకిల్ తొకక్కుంటూ వెళ్ళి బీకాం చేశారు.

రెండు పీజీలు, లా యాబైల్లోకి వచ్చాకే చేసినవి.

విజువల్ బేసిక్, ఎచ్టీఎమ్ఎల్, జావాస్క్రిప్ట్ లలో మంచి ప్రవేశంవుంది. ఇప్పుడు పిఎచ్పీ, ఎక్స్‌‌ఎమ్‌ఎల్‌‌లతో ప్రయోగాలు చేస్తున్నారు.

ఇక బ్లాగులకి వస్తే ఆయనకి 20 పైనే వున్నాయి. వాటిల్లో ఇంగ్లీషు వ్యాకరణం రామాయణం, మహాభారతం, వివేకానందుకడు, భర్తృహరి సుభాషితాలు, భారత ఆర్ధికం, భారత కరంట్ అఫైర్స్, ఆయుర్వేదం, వంటలు మొదలగునవి ముఖ్యమైనవి. ఏ అంశం అయినా ఆయన దగ్గర సమాచారముంటుంది. లేకపోతే తెలుసుకోవాలనుకుంటారు.

సంస్కృతం నేర్చుకున్నారు - కావ్యాలనీ, వేదాలనీ అధ్యయనం చేయడానికి.

వారనికొకటి అయినా ఆయన వ్యాసం 'వార్త‌' పత్రికలో మూడవపుటలో ప్రచురించబడుతుంది. ఈనాడులో ఇదివరకు వచ్చేవి, ఇప్పుడు పంపించడం ఆపేశారు. నా చిన్నప్పుడు విదేశీమారకద్రవ్యం (ఫారిన్ ఎక్స్ఛేంజి) మీద ఆయన వ్రాసిన వ్యాసాలు హిందూ,ఇండియన్ ఎక్స్‌‌ప్రెస్ పత్రికల్లో వచ్చేవి.

ఇంక సంగీతం: నేను పుట్టకముందు తబ్లా, హార్మోనియం కొంత నేర్చుకొన ప్రయత్నించి బాధ్యతలవలన వదిలేశారు. తరువాత సితార్ (ఇప్పటికీ వుంది), ఇప్పుడు వేణువు (ఫ్లూట్) నేర్చుకొని రోజుకి కనీసం మూణ్ణాలుగు గంటలు వాయిస్తున్నారు.

చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు, కొంచెం గర్వపడేది ఏంటంటే, ఎప్పుడన్నా గుంటూరింటికి వెళ్ళినప్పుడు - ఎవరైనా మాయింటికి వస్తే నేనేమో కింద గదిలో టీవీలో ఏదో చెత్త చూస్తూ, మా నాన్నగారేమో పైన గదిలో ఏదోకటి వ్రాస్తూనో, చదువుతూనో కనిపిస్తాం.

మరి ఏం మాయరోగం - ఏదోకటి చదువడమో, నేర్చుకోవడమో చెయ్యొచ్చుగా అంటారా? సర్లేండి. నేను చాలా బిజీ. ఇప్పుడు (రాత్రి పన్నెండున్నర) ఇండియా టీంకి కాల్ చేయాలి, రేప్పొద్దున్నే ఎనిమిదింటికి క్లైంట్ మీటింగు - మధ్యలో తెలుగు బ్లాగులు, ఇంగ్లీషు బ్లాగులు, ఫేస్బుక్, ట్విట్టర్, క్రికెట్, ఎన్నని. అస్సలు టైంలేదండి బాబూ.

చివర్గా ఒక్క కోరిక - ఎప్పటికైనా నా పిల్లలు (భవిష్యత్తులో పెళ్లై పుట్టినప్పుడు) నన్ను ఒక తండ్రిగాకన్నా, ఒక వ్యక్తిగా నన్ను ఆరాధించాలి - ఎలాగైతే మా నాన్నని చూసి మేమనుకుంటామో.

L.L.B - Law
D.B.M - Diploma in Business Management
D.P.M.- Diploma in Personnel Management
D.I.M.- Diploma in Management
A.D.I.M. - Advanced Diploma in Management
C.A.I.I.B. - Certified Associate of the Indian Institute of Bankers

పి.ఎస్: నాన్నగారి బ్లాగులన్నీ ఆయన ప్రొఫైల్లో వున్నాయి: http://www.blogger.com/profile/13635995478285822763

ఆయన జ్ఞానాన్ని అందరికీ పంచడానికి మా (అన్నయ, నేను) వంతుగా ఒక వెబ్సైట్ పెట్టాం - దానికి ఇంకా బాలారిష్టాలు తొలగలేదు. ఆసక్తివుంటే - www.knowquest.info

తృష్ణ = దాహం
తృషితుడు - దాహంకలవాడు.

29, సెప్టెంబర్ 2010, బుధవారం

నేనూ, నా కజిన్స్ - తరం తరం అంతరం

నిన్న ఊరికినే కబుర్లాడుకుంటుంటే, రూమ్మేట్ భారతీయుడు పాట హమ్ చేస్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో, బళ్ళో ఉండగ చూశా! పది పన్నెండేళ్ళు అయిపోయింది, అప్పుడే అంకులయిపోయానన్నాడా ఇరవయ్యారేళ్ళ కుర్రాడు.

అది వినగానే నా కన్న 7-8 ఏళ్ళూ వయసులో చిన్నైన కజిన్స్ గుర్తొచ్చారు. నేనిలా అన్నా (అప్పుడు క్లుప్తంగా, ఇప్పుడు విపులంగా).

- నాకు ఏడెనిమిదేళ్ళప్పుడు (2-3 తరగతి) వాళ్ళని ఉయ్యాల్లూపేవాళ్ళం (నేనూ, అన్నయ్య).
- నాకు 12 ఏళ్ళప్పుడు (6-7 తరగతి) వాళ్ళు నాలుగైదేళ్ళ బుడంకాయలు - ఆడించేవాణ్ణి. కాగితంతో పడవలు, రాకెట్లు, ఫాన్లు, ఇంకా చాలా చేసిచ్చేవాళ్ళం.
- నాకు 15 వచ్చేసరికి (ఇంటర్ అంటే పెద్దయినట్లే కద), ఏడెనిమెదేళ్ళ పిల్లకాయలమీద కొంచెం దందా చేసేవాడిని. "ఒరేయ్ మంచినీళ్ళు తీసుకురా!" లాంటివి.
- ఇంజినీరింగ్ (21-22) అయిపోయి మనం ఉద్యోగంలో చేరేసరికి వాళ్ళు పది-ఇంటర్. ఇక మనం ఎప్పుడు ఊరెళ్ళినా, మనల్నేమో "వాడిని/దానిని ఏ కాలేజిలో చేర్చను? ఏ కోర్సు మంచిది"లాంటి డౌట్లు, వాళ్లనేమో "చిన్నా/బుజ్జీ! అన్నాయ్ని/బావని అడిగి అదేదొ తెలుసుకోవచ్చుగా" వంటి సతాయింపులు - ఆహా! మనం రాజులం ఎవరింటికెళ్ళినా.

ఇంతవరకు అందరికీ మాములేలేండి. అసలుది ఇప్పుడు.
- వాళ్ళేమో ఇంజినీరింగ్ అయిపోయి సాఫ్ట్‌‌వేర్ కొలువులకొచ్చేశారు. మనమేమో ఇంకా టీమ్‌‌లీడ్ అయ్యి మూడేళ్ళయిపోయినా, ప్రాజెక్ట్ మేనేజర్ కాలేదు. ఇంకా దగ్గర్లో ఊరిస్తుంది. వాళ్ళకీ మనకీ ఒక్క లెవెలే తేడా. వాళ్ళూ నేనూ ఇంక ఒకటే, మనమింకా యూతే అనిపిస్తుందీ. ఇంకేముందీ, మనమింకా 28 ఏళ్ళ బ్రహ్మచారేగా! ఇంకో పక్కేమో అప్పుడే ఏడేళ్ళ యవ్వనం ఈ ఉద్యోగంలో బూడిదయిపోయిందా అనిపిస్తుంది.

ఏమో! ఇంకా యువకుడినే అనుకుంటున్నా! వాళ్ళని (అదే కళ్ళముందు పెద్దయిన కజిన్స్) చూస్తే మటుకు నేనూ అంకుల్ అయిపోయానిపిస్తుంది. 23 ఏళ్ళకే పెళ్ళిళ్ళయిపోయి ఇప్పుడు మూణ్ణాలుగేళ్ళ పిల్లలున్న మా కాలేజి ఆంటీలు మటుకు అంకులే కరెక్టంటారులేండి.

ఏమో! ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళా!

నా కజిన్స్ ఇప్పటికే తెలుగు-ఇంగ్లీషు బ్లాగులు, ఫేస్‌‌బుక్ మొ॥లలో అన్నిచోట్లా వున్నారు. ఇప్పుడు ఎంతో ధైర్యంతో ఈ వ్యాసం ప్రచురిస్తున్నా. కజిన్స్, మీరెవ్వరైనా ఇది చదివి నన్నేమైనా అనాలనుకుంటే ఇక్కడమాత్రం చేయకండి. నాకు మెయిల్/ఫోన్ చేయండి :)

23, సెప్టెంబర్ 2010, గురువారం

గుంటూరు బాంబు

మొన్నొకరోజు మధ్యాహ్నం ఆకలి చంపడానికి మెక్సికన్ గ్రిల్ లైనులో నించుంటే నా ముందు కొద్దిపాటి పరిచయమున్న ఒక తెలుగావిడ కనిపించింది. నేనుండేది బోస్టన్లోలేండి. వాడమ్మే బర్రీటోలకి మైల్డ్,హాట్, ఎక్స్ట్రాహాట్ అని మూడు రకాల సాస్‌‌లలో ఒకటి అడిగివేయించుకోవచ్చు. ఊహించారుగా! అదే! ఎక్స్ట్రాహాట్ రెండుసార్లు ఎక్స్ట్రా వేయించుకున్నా.వెంటనే "మీది గుంటూరా?" అని అడిగింది.

"అవునండీ" అన్నా.
"మరిది సరిపోతుందా?"ని అడిగింది.
ఒక నవ్వు పడేసి, "అందుకే కదండీ! ఈ కరివేపాకుకారం తెచ్చుకుంది" అని చేతిలో డబ్బా చూపించా.
ఆమె ఆశ్చర్యపోలేదు, తనూ నవ్వింది.
కరివేపాకుకారమేకాదు, నా క్యూబులో ఒక పచ్చడిసీసా (ఆవకాయ/గోంగూర) ఎప్పుడూ వుంటుంది. ఈ విషయంలో నాకూ, నా మిత్రుడికీ మొహమాటం-సిగ్గూల్లాంటివేంలేవు.

ఒకప్పుడు నేను కారం ఎక్కువ తినేవాడినికాదు. నేను ఒట్టిపప్పు (ముద్దపప్పు) పోషకుడిని. కూరనించి పెరుగూమజ్జిగదాకా ప్రతిదాన్లో పప్పు కలిపేవాడిని. నాకోసం మాయింట్లో ఐదారుకిలోల కందిపప్పు కొనేవారు. ఇంకా నయం, నేను ఈ తరంలో పుట్టలేదు. అందుకని, మా ఇంట్లో కారం తక్కువ్వేసేవారు. మా నాన్నగారేమో, ఇక ప్రతిదాన్లో ఆవకాయ కలుపుకునేవారు. మరి అదే వారసత్వంగా వచ్చి, పెద్దయ్యాక కారం తినడం మొదలుపెట్టా! ఇంతకుముందు మా ఇంట్లో వరంగల్ లేదా బళ్ళారి మిరపకాయలతో ఆవకాయ పెట్టేవారు. ఐతే గతకొన్నేళ్ళుగా నేను గొడవ పెట్టి గుంటూరు మిరపకాయలతో పెట్టిస్తున్నా.

ఇక గుంటూరు మిర్చిబజ్జీ, అందులోను డొంకరోడ్డులో వేసేవి - వాటి గురించి నేను కొత్తగా చెప్పేదేముంది. కొన్నాళ్ళుగా ఔట్‌‌లుక్, హిందుస్తాన్‌‌టుడే వంటి జాతీయ పత్రికల్లో వచ్చేస్తుంటే.ఈ మధ్య రీడిఫ్ ప్రకారమైతే, గుంటూరు సన్నం మిర్చికి భౌగోళిక ప్రత్యేక గుర్తింపు (జాగ్రఫిక్ ఇండికేటర్) వచ్చిందట (హైదరాబాద్ హలీం, గద్వాల చీరలు ఆంధ్రనుండి ఈ సంవత్సరం గుర్తించబడిన మిగతావి).

మొదటిసారి, నాకు ఆరేడేళ్ళపుడు మా బాబాయిలు దీని రుచి చూపించారు. ఇంట్లో కూర కారమని గొడవ చేసినా, బయట మిరపకాయ బజ్జీలుమటుకు ఎగబడి తినేవాడిని. ఫ్రెండ్స్ పార్టీలు, క్రికెట్ ఆడాకా సాయంత్రం కాలక్షేపం టిఫిన్లు అన్నీ ఈ బజ్జీలే. ఇప్పుడు ఎవరికైనా పెద్ద హోటల్లో పార్టీ ఇచ్చినా ఆ రోజులానందం రావట్లేదు.

అసలు ఈ మిర్చిబజ్జీలనే కదండీ, చూడాలనివుంది సినిమాలో బ్రహ్మానందం గుంటూరు బాంబులని బెదిరిస్తుంటాడు (అందుకే ఈ వ్యాసం శీర్షిక అదే పెట్టా).

డొంకరోడ్డు బజ్జీ రుచి వేరే ఊర్లేకాదు, గుంటూర్లోనే బ్రాడీపేటలాంటి వేరే చోట్లరాదు. మా ఫ్రెండ్సేకాదు, చాలామంది ఎక్కడెక్కడినించో ఈ ఔట్లుక్‌‌లో చెప్పబడిన శ్రీనివాస బండి దగ్గరకి సాయంత్రం వచ్చేస్తారు.

ఔట్లుక్ నుండి:

You wonder what Guntur would be like without its chillies.

Guntur's chilli trade is second only to Mexico's in the world; a bad season shakes the city to its very hub.

This, though, is but a momentary lapse, as Srinivas Rao will tell you. This Gunturian has been wheeling his cart to Donka Road Crossing punctually at 7 every evening for the last 22 years, dishing out over 5,000 plump, green chillies a day dipped in besan and deep-fried in a kadai the size of a small lotus pond to his enthusiastic clientele. His business, Rao informs us in between skimming the chillies out of the blubbering oil, is booming as never before. No, Guntur can't do without its mirch masala.


హిందుస్తాన్ టుడే నుండి:

Once in Guntur, you cannot give the local favourite a miss. The roadside chilli pakodas (mirchi bhaji) are world famous. Your recipe: Dip green chillies in besan and deep fry them. Roadside stalls sell it for a princely Re 1 per pakoda. By conservative estimates, a streetside cart sells between 2000 and 5000 mirchi pakodas every day. Savour the flavour
ఎప్పుడు గుంటూరు వెళ్తానో, మళ్లీ బజ్జీలు ఎప్పుడు తింటానో :-(

13, సెప్టెంబర్ 2010, సోమవారం

వాడుక తెలుగు కాపాడుదాం - 1 - సమయసూచికలు

నా ముందటి వ్యాసంలో వాడుక తెలుగు కాపాడుటకు ప్రయత్నించాలని చెప్పాను.అందులో భాగంగా కొన్ని సూచనలు. ఇవన్నీ మీలో చాలా మందికి తెలిసినవే. అయినా తెలిసినవారికి గుర్తు చేయడానికి, తెలియనివారికి తెలపటానికి ఈ ప్రయత్నం.

గత దశాబ్దంగా వాడుక తెలుగులో వచ్చిన మార్పుల్లో ముఖ్యమైనది కాలమానాలను ఇంగ్లీషులో సూచించడం. అవి క్షణాలైనా (సెకండ్స్), నిమిషాలైనా (మినిట్స్), గంటలైనా (ఆఁర్స్, అదేనండీ హవర్స్), తేదీలైనా (డేట్స్), వారాలైనా (వీక్స్), సంవత్సరాలైనా (ఇయర్స్) గానీండి.

- మొన్న, నిన్న, నేడు(ఇవాళ,ఇయ్యాల), రేపు, ఎల్లుండి ముద్దు; డేబిఫోర్ యెస్టరడే, యెస్టరడే, టుడే, టుమార్రో, డే యాఫ్టర్ టుమార్రో వద్దు

- ఆదివారం, సోమ,... శనివారాలు ముద్దు; సండే, మండే,... శాటర్‌డే వద్దు

- ఒకటో తేదీ/తారీకు, పదోరోజు ముద్దు; ఫష్టు, టెన్త్‌‌డే వద్దు

- రెండు గంటలు, మూడింటికి, నాలుగున్నర, అయిదుంబావు ముద్దు; టూ అవ్వర్సు, త్రియ్యోక్లాకు, ఫోరుథర్టీ, ఫయవుఫిఫ్టీను వద్దు

- తెల్లవారుజామున, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, పగలు ముద్దు; ఎర్లీ మార్ణింగు, మార్ణింగు, ఆఫ్టర్‌నూను, ఈవెనింగు, నైటు, డే వద్దు.

- ముప్పయ్యేళ్ళు, రెణ్నెల్లు, పంతొమ్మిదివందల ఎనభై, నిరుడు, వచ్చే నెల ముద్దు; థర్టీఇయర్స్, టూ మంత్స్, నైన్టీన్ ఎయ్‌టీ, లాస్టియర్, నెక్స్ట్ మంత్ వద్దు.

- పుట్టినతేదీ, పుట్టినరోజు, వయస్సు ముద్దు; డేట్ ఆఫ్ బర్త్, బర్త్డే, ఏజ్ వద్దు.

అందుకని (సో), ఇకనుండి (నెక్స్టైంనించీ) సమయాన్ని (టైంని) తెలుగులోనే సూచించడానికి ప్రయత్నించండి.


చి.మా.: నేను పైనిచ్చిన తెలుగు మాటలు కృష్ణాగుంటూరుల్లో కొందరు వాడే తెలుగు. మీరు మీ యాస ప్రకారం వాడచ్చు. అది తెలుగైతే చాలు.

23, ఆగస్టు 2010, సోమవారం

వాడుక తెలుగుని కాపాడుదాం!

తెలుగు భాషా పరిరక్షణ, పునరుద్ధరణ అని పెద్ద మాటలు మాట్లాడను, కంప్యూటర్నో బ్లాగునో తెలుగులో ఏమందాము, కొత్త పదాలేం కనిపెట్టి తెలుగుని ఉద్ధరిద్దాం అని కాదు ఈ వ్యాసం. మన వాడుక తెలుగు దుస్థితి, ఎలా మనం కాపాడుకోవచ్చో తెలియజెప్పడానికి చిన్న ప్రయత్నం.

తెలుగుని విస్తృత పరచడానికి కొందరు ఇంటర్నెట్లో చాలా కృషి చేస్తున్నారు. కంప్యూటర్, రోబో, అగ్గ్రెగేటర్, ఇంటర్నెట్ మొదలగు కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలకి తెలుగులో ఏమనాలో ఎప్పటికప్పుడు కనుగొంటున్నారు. సరే, బాగుంది కానీ, దీనికన్న ముందు చేయాలిసినది సామాన్య ప్రజలు వాడే తెలుగు మీద దృష్టి పెట్టాలి. డిక్రిప్షన్ని విగూహం/నిగూహం అనాలా, ఇంకేదో సాంకేతిక/వైజ్ఞానిక పదానికి తెలుగు రూపం ఏంటి అన్నది జనాలకి అంత ముఖ్యం కాదు. ఎందుకంటే, ఇప్పటికే రోడ్డు, ఫోను, సెల్ల్‌ఫోను, ఫొటో, కెమెరా, పాలసీ, బైకు, కారు, లారీ, బస్సు, రైలో, టీవీ, మార్కెట్టు, సర్కారు, ఇంకా ఎన్నెన్నో తెలుగులోకి వచ్చేశాయి. వీటికి తెలుగులో పర్యాయ పదాలున్నా, కొత్తగా కనిపెట్టినా ఎవరూ వాడతారని నేననుకోను.

నా వరకైతే ఏది సౌకర్యంగా ఉంటే, ఏది జనాల్లో ప్రాచుర్యంగా ఉందో అదే వాడతాను. ఈ బ్లాగుల్లో అంతర్జాలం, నెనర్లు, హంసాపదమో ఇంకోటో అని హడావిడి చేసెవారు నిజ జీవితంలో బస్టాండు రైల్వేస్టేషన్ అంటారా లేదా 'చూపులు కలసిన శుభవేళ ' సినిమాలో కోటా శ్రీనివాసరావుగారిలా 'చతుశ్చక్రశకట నిలుపు స్థలం', 'ధూమశకటనిలయం' అంటారా ? థాంక్స్/కృతజ్ఞతలంటారా - నెనర్లంటార? నూటికి తొంభైతొమ్మిది మొదటివే వాడతారు - కాదంటారా?

తెలుగులో కొన్ని పర భాషా (ఇంగ్లీష్/సంస్కృతం/హిందీ/ఉర్దూ/తమిళ్/ఇంకేదైనా) పదాలు వాడటం అంతపెద్ద నేరం కాదు. బ్రౌన్‌గారు 19వ శతాబ్దంలో రాసిన తెలుగు వ్యాకరణం పుస్తకంలోనే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇక 21వ శతాబ్దంలో మనం ట్రాకర్ (tracker)ని 'జాడకం' అనాలా, 'వెదుకరి' అనాలా ,ఇంకోటనాలా అని చర్చించుకోవడం వృధా ప్రయత్నం. అలానే చైనా వారో, జపాను వారో వారి భాషా అంకెలు వాడుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా వాడుకలోనున్న రోమన్ అంకెలు వదిలేసి తెలుగు అంకెలు వాడటం కూడా.

ఐతే గత 10 సంవత్సరాల్లో వచ్చిన మార్పేంటంటే - (1) తెలుగు పదాలున్నా, తెలియకో లేదా డాబు (స్టైల్) కోసమో ఇంగ్లీషు పదాలు వాడటం (2) ప్రాథమిక వాక్యనిర్మాణం తెలుగు-ఇంగ్లీషు సంకరణం చేయడం

(1) ఇంగ్లీషు పదాలెక్కువగా దొర్లుట:
కొన్నిసార్లు తెలుగు పదం తెలియక, లేదా మర్చిపోయో ఎంగ్లిష్ పదానికి 'చేసెన్ ', 'అయ్యెన్ ' మొదలగు క్రియలు కలపడం.

ఉదా|| మార్చావా <=> చేంజ్ చేశావా; రాశావా <=> రైట్ చేశావ, పిలిచావా <=> కాల్ చేశావా, పంపించావా <=> సెండ్ చేశావా, బయలుదెరావా/మొదలుపెట్టావా <=> స్టార్ట్ చేశావా, మూశారా <=> క్లోజ్ చేశారా

నాలాంటివారెవరైనా శుభ్రంగా ప్రయత్నించావా (ట్రై చేసావా), నింపావా (ఫిల్ చేశావా) అంటే ఎదుటివారు ఎగతాళి చేసేటంత దారుణంగా ఈ దురలవాటు ప్రబలిపోయింది. ఇందులో విచిత్రమేమిటంటే పెద్దవారు, కాన్వెంటు చదువులు చదవనివారు కూడా తమకు తెలియకుండానే ఈ ప్రభావానికి లోనవుతున్నారు. గమనించారో లేదో ఎవరింటికైనా వెళ్తే, ఎక్కువ శాతం "వాటర్ ఇవ్వమంటారా/ లంచ్ చేయండి" అని మర్యాదలు ఇస్తారు తప్పితే, "మంచినీళ్ళిమ్మంటారా / భోజనం చేసివెళ్ళండి" అనేవి తక్కువ వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనొకరోజు అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటే "డిజప్పయింట్ అయ్యావా?", "డిన్నర్ చేశావా?" అని రెండు వాక్యాలొచ్చాయి. ఆశ్చర్యమేసింది. మరి తనది తెలుగు మాధ్యమంలో ప్రాథమిక విద్య, పూర్తి గ్రామీణవాతావరణంలో పెరిగింది - మేము, చుట్టలు, కొట్లవాళ్ళు తప్పితే ఎక్కువ మాట్లాడదు కదా - మాకు స్వచ్ఛమైన తెలుగు మాట్లాదటం, మమ్మీ అని కాకుండా, అమ్మా అని నేర్పించినది తనేకదా. బహుశా టీవీ ప్రభావం, లేదా చుట్టుపక్కలవారు (నాతో సహా) పదాలు వాడుతుంటే తెలియకుండానే వాటి ప్రభావం. మారుతున్న పరిస్థుతులకిదే మంచి ఉదాహరణ.

(2) సంకరణ వాక్య నిర్మాణం:

ఇది ఇప్పటి తరానికి కొంత వారి పెంపకం వలన, కొంత డాబు ప్రదర్శించుకోవాలని తెలుగు-ఇంగ్లీష్ కలిపికొట్టేస్తారు.

-> పిల్లలు-యువతనేమో తెలుగులో వ్యక్తపరచలేక/లేదా అలవాటు ప్రకారం ఇంగ్లీషు వాక్యాలు వాడాతారు. కొన్ని బ్లాగుల్లో ఇది గమనించచ్చు.

ఇది రెండు రకాలు మళ్ళీ - ప్రతి వాక్యంలో తెలుగు ముక్కలు-ఇంగ్లీషు ముక్కలు కలిపి కొట్టడం. రెండవది కొన్ని తెలుగు వాక్యాలు, కొన్ని ఇంగ్లీషు వాక్యాలు కలిపి కొట్టడం.
ఉదా 1|| వెళ్తున్నావా <=> గోయింగా, వస్తున్నావా <=> కమ్మింగా, రావట్లేదా <=> నాట్ కమ్మింగా
ఉదా 2|| నేనసలు భరించలేనిది ఇలాంటివాళ్ళని - ముఖ్యంగా "యాక్చువల్లీ" అని మొదలుపెట్టేవారిని: "actually I wanTed to come కానీ you know uncle వాళ్ళ daughterని tomorrow evening fiveకి pickup చేస్కోవాలిరా". ఇంత కష్టపడేబదులు శుభ్రంగా "అరేయ్! రావాలనుందిగానీ రేపు సాయంత్రం ఐదింటికి అంకుల్ వాళ్ళమ్మాయిని తీసుకురావాలిరా (అంకుల్ అన్న పిలుపుకి కొంత మినహాయింపు - మామయ్య/బాబాయి అనొచ్చు కానీ ఆంటీ-అంకుల్-మమ్మీ-డాడీ మన సంస్కృతిలో భాగమైపోయాయి : ఆంటీ-అంకుల్ ఒక్కోసారి మెరుగనిపిస్తాయి - ఎందుకో ఇంకో పోస్ట్లో)" అనొచ్చు కదా.

విచారించదగ విషయమేమిటంటే విదేశాల్లో చదువుకొచ్చిన మన వారసత్వ హీరొలేకాదు, ఇటువంటి భాషా విషయల్లో మనకి మార్గదర్శకులుగా ఉండాల్సిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీ విశ్వనాధ్, శ్రీ జయప్రద వంటివారు కూడా కలగాపులగం భాష మాట్లాడుతున్నారు - పాడుతా తీయగా,జయప్రదం, శుభప్రదం పరిచయ కార్యక్రమాల సాక్షిగా, నాలాంటివారికి ఎక్కడో గుచ్చుకునేటట్లు.

- కొన్ని సార్లు ఇంగ్లీషులో చెప్తేనే తమ పాండిత్యం అవతలి వారికి తెలుస్తుందని, గౌరవిస్తారని రాస్తుంటారు/మాట్లాడుతుంటారు. ఇది వేడిగా చర్చలు జరిగే బ్లాగుల్లో (ఉదా|| నవతరంగం) గమనించచ్చు.
- ఇంక డాబు కోసం: టీవీల్లో సామాన్యులని ప్రశ్నలడిగినప్పుడు చాలా మంది వచ్చీ రానీ ఇంగ్లీషు మాట్లాడతారు తప్పితే, తెలుగులో ఎవరూ చెప్పరు.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, తెలుగు బ్లాగర్లెవరికైనా నిజంగా తెలుగు కాపాడాలనుంటే సాంకేతిక/వైజ్ఞానిక/వైద్య/గణిత పదాలకి విచిత్రమైన తెలుగు పదాలు సృష్టించాలని/అలాంటి పదాలువాడి పాండిత్యం చూపుకోవాలని ఉబలాటపడే బదులు, ఉన్న తెలుగు పదాలు కాపాడటానికి మొదట కృషి చేస్తే బాగుంటుందికదా.

అలాగే అందరు సాధ్యమైనంతవరకు తెలుగు పదమున్నచోట తెలుగు పదమే మాట్లాడటానికి - అలాగే అలాంటి పదాలు పంచడానికి ప్రయత్నించండి. నా వంతుగా మన దైనిక జీవితంలో ఎక్కడెక్కడ మనం తెలుగు వాడాల్సిన చోట మనకు తెలియకుండానే ఇంగ్లీషు వాడుతున్నమో గుర్తించి మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తా. మీకు కూడ అలాంటివేమన్న స్ఫురిస్తే పంచండి.

గమనిక:
- నేను పూర్తి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుటనని బల్ల గుద్ది చెప్పనుగానీ, సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తుంటాను. ముఖ్యంగా నిన్న-నేడు-రేపు (టుమారొ మొ||), వారాలు (సండే మొ||), తేదీలు (ఫస్టుకిస్తా మొ||) లాంటివి.

3, ఆగస్టు 2010, మంగళవారం

క్రియేటివ్ జెన్ ఎక్స్-ఫై2 - సమీక్ష

క్రియేటివ్ జెన్ ఎక్స్-ఫై2 మీడియా ప్లేయర్‌పై ఒక సమీక్ష

క్లుప్తంగా: అద్భుతమైన శబ్దం - నావిగేషన్ సరళతరం చేయాలి

నచ్చినవి: శబ్ద నాణ్యత, ఎక్స్-ఫై, ఈపీ-630 ఇయర్ఫోన్లు, ప్లగ్ ఎన్ ప్లే, ఎస్-వీడియో ఔట్పుట్
నచ్చనివి: నావిగేషన్ మెనూలు, అసున్నితమైన టచ్-స్క్రీన్, వీడియో ప్లేలిస్ట్ సౌలభ్యం లేకపోవుట, ప్రత్యేక శబ్దనియంత్రణా మీట (వాల్యూం కంట్రోల్ బటన్) లేకపోవుట
పూర్తి రేటింగ్: 4/5
శబ్దనాణ్యత: 4.5/5
దృశ్యనాణ్యత: 4/5
టచ్ స్క్రీన్: 3/5
మెనూ నావిగేషన్: 3/5

పూర్తి సమీక్ష:

నేను క్రియేటివ్ జెన్ ఎక్స్-ఫై2 ఒక రెండు నెలలనుండి వాడుతున్నా. రోజుకి కనీసం 1-2 గంటలన్నా ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు, విసుగనిపించినపుడు దాంట్లో పాటలు వింటుంటా.

పాటలు:
కిందటి బ్లాగులో చెప్పినట్లు మార్కెట్లోని అన్ని పర్సనల్ మీడియా ప్లేయర్లు (PMP) కొన్ని నెలల తరబడి గాలించి పరిశీలించిన తర్వాత దీన్ని కొన్నా - నన్ను నిరాశపరచలేదు. నేను వాడిన Sansa Fuze, Apple iPod Nano, Creative Zen, Apple iPhone, iTouch Classic, Sony S-series player, Microsoft Zune, Nokia N-series అన్నిటికన్నా ఇదే కొన్ని రెట్లు మెరుగు, కానీ నా Nokia Ngage 3300 ఫోను కన్నా ఎక్కువ కాదు, బహుశా సమానం. నాణ్యమైన EP-630 ఇయర్ఫోన్లు కూడా ఈ అనుభూతికి ఒక కారణం. ఇక ఎక్స్-ఫై అద్భుతం - తేడ ఇట్లే తెలిసిపోతుంది!

చిత్రములు:
ఈ ప్లేయర్ MP4 చిత్రాలు చూపిస్తుందనిమాన్యువల్లో చెప్పినా, నాకు మటుకు WMV మాత్రమే ఏ ఇబ్బందీ లేకుండా వచ్చాయి. దృశ్య నాణ్యత మటుకు బాగానే ఉంది.ప్లేయర్తో వచ్చిన సాఫ్ట్వేర్ దండగ. నేను రియల్ ప్లేయర్ ఫ్రీ మీడియా కన్వర్టర్ వాడుతున్నా - ఉన్నవాటిల్లో ఇది ఉత్తమమైనదని చెప్పచ్చు. వారు ఉబుంటులోకూడ ఈ సాఫ్ట్వేర్ విడుదల చేస్తే బాగుండును.

టచ్ స్క్రీన్:
టచ్ స్క్రీన్ మొదట్లో కొంచెం కష్టమైనా - క్రియేటివ్‌వారు విడుదల చేసిన ఫరంవేర్ అప్డేట్లతో ఇపుడు చాలా మెరుగైంది. కానీ ఐఫోనుతో పోల్చలేం.

మెనూ నావిగేషన్:
క్రియేటివ్‌వారు అన్నిటికన్నా ముందు మెనూల మీద దృష్టిపెట్టలి.కేవలం సౌండు తగ్గించటానికి లేదా పెంచడానికి ముందు హోం/పవర్ బటన్ కొట్టి, స్క్రీన్ మీది గుర్టుని వేలితో లాగి, పాట పేజీ కానీ, మ్యూజిక్ -> నౌ ప్లేయింగ్ కొట్టి - వాల్యూం గుర్తుపై కొత్తి, వాల్యూంబార్ని పాఇకి-కిందకి లాగాలి. అదే మామూలు జెన్ ప్లేయర్లొ చక్కగా వాల్యూం బటనుందెది.

ఇతరములు:

వీడియో ఔట్: స్పీకర్లకి ఆడియో ఈ ఇబ్బందిలేకుండ పంపించగలిగా కానీ, హెచ్‌డీ టీవీకి వీడియో పంపడం మటుకు ఇంతవరకు చేతకాలేదు.

RSS ఫీడ్: దీనిమీద అసలు ఆశ పెట్టుకోవద్దు. నేను ఈ ప్లేయర్ కొనడానికి RSS ఫీడ్కూడా ఒక కారణం. పొద్దునే లేచి లాప్టాప్‌కి కలిపి నాకిష్టమైన వార్తల, బ్లాగుల (ఇంగ్లీష్) ఫీడ్లు కాపీ చేస్కుని, హాయిగా ట్రైన్లో చదువుకోవచ్చని కలలుగన్నా. ప్చ్! ఏం చేద్దాం. పది పోస్ట్లు కాపీ చేయడానికి గంట పైనే తీస్కుంటుంది! చదువుదామంటే నోట్‌పాడ్లో సాదా టెక్స్ట్ చదివినట్లుంది.

పాటల వరుస: రాండం అల్గారిధం కొంచెం సరిదిద్దాలి - నా ప్లేలిస్ట్లో 800 పైగా పాటలున్నా, అదేంటొ మొదటి 20, చివరి 20, మధ్యలో ఒకట్రెండు తప్ప వినిపించనే వినిపించదు.

అప్లికేషన్లు: నాకిందులో నచ్చినవాటిల్లో ఇదొక్కటి. వారు ఇచ్చిన డెవెలప్మెంట్ కిట్‌వాడి ఉత్సాహవంతులు కొత్తా అప్లికేషన్లు తయారు చెయ్యొచ్చు - ఇఫోనుకి లాగానే. దీనికి Adobe's Photoshop Lightroom and World of Warcraft లలొ వాడిన Lua అనే కంప్యూటర్ భాష వాడారు.

స్వచ్ఛమైన అత్యద్భుతమైన సంగీతం వినాలంటే క్రియేటివ్ జెన్ ఎక్స్-ఫై2ని మించినది లేదు (టచ్ స్క్రీన్, అప్లికేషన్లు, ఆర్ఎస్ఎస్ మినహాయిస్తే). ఈ ఎక్స్-ఫైకి ఎక్కువ పెట్టకర్లేదనుకుంటే దీనికి సగం ధరకి వచ్చే సాదా క్రియేటివ్ జెన్ కొనుక్కోవచ్చు.

6, జూన్ 2010, ఆదివారం

క్రియేటివ్ జెన్ ఎక్స్-ఫై2 : నా సంగీతశ్రవణానందయానంలో కొత్తమలుపు

నా సంగీతశ్రవణానందయానంలో కొత్తమలుపు. క్రియేటివ్ జెన్ ఎక్స్-ఫై2 -మొత్తానికి కొన్నాను, ఆరేడు నెలల వెతుకులాట తర్వాత.

Creative Zen X-Fi2

ఇది నేను వాడుతున్న 4వ మీడియా ప్లేయర్ - ఇంతకుముందు నా దగ్గర Sansa Fuze, Apple iPod Nano , Creative Zen ఉండేవి. ఇవి కాకుండా కొన్ని సార్లు Apple iPhone, iTouch Classic, Sony S-series player, Microsoft Zune, Nokia N-series మొదలగువాటిల్లో పాటలు విన్నా. ఈ అనుభవంతో నేను విన్నవాటిల్లో క్రియేటివ్ జెన్ ఎక్స్-ఫై2 ప్లేయర్కి రెండవ ర్యాంకిస్తాను. రెండనెందుకన్నానంటే, మొదటిది నా Nokia 3300 Ngage ఫోన్‌గనక.

Nokia 3300

ఒకసారి వెనక్కి వెళ్తే నేను మొట్టమొదట విన్న సంగీతం 80ల చివర-90ల మొదట్లో ఫిల్లిప్స్ రేడియోలో అమ్మ వినిపించిన పాత తెలుగూ హిందీ పాటలు. అవి మధురమైన రోజులు; పొద్దునే 5.55 కి వందేమాతరంతో మొదలై, తర్వాత సుశీల గొంతులో ఆరాధన, భక్తిరంజని, ఆ తర్వాత 8.15 నుండి స్కూలికి వెళ్ళేవరకు జనరంజని. అప్పుడే ఘంటసాల, జానకి, బాలు, చిత్ర, ఇళయరాజా, మహదేవన్ వంటి మహనీయులు పరిచయమయ్యారు. రాత్రుళ్ళు నాన్న వినిపించే శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో హిందుస్తానీ-కర్నాటక సంగీత విధానాలు, బిస్మిల్లా ఖాన్, వైద్యనాథన్ మొదలగువారి గొప్పదనం తెలిసాయి.

ఒకాసారి నాన్న తాతగారింటినించి వెస్టన్ ఆడియో టేప్‌రెకార్డర్ బాగుచేయించడానికి తెచ్చినప్పుడు నేనూ అన్నయ్యా అందులో కొన్నాళ్ళు ఏ క్యాసెట్టు కనిపిస్తే అది మోగించేవాళ్ళం. తర్వాత, ఒక ఫిల్లిప్స్ 2-ఇన్-1 కొన్నాం. అప్పుడు నాన్న 50-70 నలుపు-తెలుపు చిత్రాల పాటలు శాస్త్రీయ కర్నాటక సంగీతం కలెక్షను పెంచారు - మేము అదీ ఆనందంగా వినేవారం.

ఎప్పుడన్నా శెలవులకి చుట్టాలింటికి వెళ్ళినపుడు, స్టీరియోల్లో కొత్త పాటలు వినేవారం. మా అన్నయ్యా మామాయ్య ఇళయరాజా రహమాన్ పాటలు చాలా కలెక్ట్ చేసారు. అలా 80-90ల సినిమా సంగీతం తెలిసింది.

అన్నయ డిగ్రీలో చేరినపుడు కొన్న అయివా (AIWA) వాక్‌మనూ వీడియోకాన్ బజూకా (వూఫర్) టీవీ నా సంగీతాభిరుచిని కొత్త మలుపు తిప్పాయి. వాక్‌మన్ నాకు మొదటిసారి ఇయార్ఫోన్లలోనున్న మజానిచింది. అలాగే బజూక బేస్సంటే యేంటో చెప్పింది. నెమ్మదిగా స్ట్రింగ్స్, ఆర్యన్ బ్రదర్స్, కలోనియల్ కజిన్స్ మొదలుగువారి ప్రైవేటు ఆల్బములగురించి ఎంటీవి, ఎటీఎన్, వీ, ఎసెస్ మ్యుజిక్ లాంటి చాన్నెళ్ళల్లో తెలుసుకున్నాను.

ఇంజినీరింగులో నాన కప్యూటరు కొన్నాక సంగీతం వినడంమీద కొంత శ్రద్ధ పెట్టా. ఇళయరాజా రహమాన్ పాటలు సంపాదించి ఒక ఫ్రంటెక్ హెడ్‌ఫోన్ కొని అర్ధరాత్రివరకు వినేవాడిని. వినాంప్(winamp)లో ప్లేలిస్ట్లు, ప్రిసెట్లు తయారు చెసేవాడిని.

ఉద్యోగంలో చేరాక నేను కొన్న మొదటి ఫోను నోకియా 2300 - అది అప్పట్లో ఎఫెం రేడియో స్టీరియోలో వినిపించే ఫోన్లలో (< రూ|| 5000) చవకైనది. అది 2004లో దొంగిలించబడ్డప్పుడు, ఎంపీ3 ఫోను కొందామనుకున్నా - అన్ని మోడల్స్ చూసి రూ|| 8,000లతో నోకియా 3300 ఎంగేజ్ కొన్నా. అది నా కొనుగోలు నిర్ణయాలల్లో అత్యుత్తమమైనది. అది ఇతర నొకియా ఫోన్లలాగా చైనాలోగాక ఫిన్లాండులో తయారుచేయబడ్డది. దీన్ని నేను ఐపాడ్లు, జెన్ల కన్న గొప్పది అంటాను. ఇదింకా నా దగ్గరుంది; అమెరికా వచ్చినా తెచ్చుకున్నా. మొదటిసారి యూఎస్ వచ్చినప్పుడు, చాలా శోధించి చివరికి క్రియేటివ్ జెన్ (మామూలిది) కొన్నా. ఐపాడ్ల గురించి తెల్సుకుందామని ఒక ఏపిల్ నానో కూడ తీసుకున్నా. ఈ రెండిట్లో, శబ్దనాణ్యత పరంగాగానీ, వాడటానికి తేలికనిగానీ జెన్‌కి ఎక్కువ ప్రాధాన్యతిస్తా. ఒక శాన్సా ఫ్యూజ్ కూడ కొన్నా - అదీ వినడానికి బాగుంటుంది. నాకెందుకో ఐపాడ్లు వేలంవెర్రిగా తప్పితే నిజమైన సంగీతప్రియులు కొనరనిపిస్తుంది. ఇంకా ఒక Plantronic Gamecom 777హెడ్‌ఫోన్ $90 పెట్టి కొన్నా - ఇది డాల్బీసౌండు ఇస్తుంది. నా రూమ్మేట్లు షాక్ తిన్నరు. కానీ జీవితంలో ఒక్కసారి కొనేడప్పుడు పెట్టటంలో తప్పులేదనిపించింది - అది పెట్టుకొని లాప్టాపులో పాటలు వింటూ సినిమాలు చూస్తుంటే నా నిర్ణయం తప్పుకాదనిపించింది.

సరే అసలుదానికొస్తే, అదే ఇప్పుడు కొన్న క్రియేటివ్ జెన్ ఎక్స్-ఫై2 - నేను రెండొసారి యూఎస్ వచ్చిన క్రితం సెప్టెంబర్నించి వెల తగ్గుతుందేమోనని వేచివేచి, చివరికి ఆగలేక మొన్న కొనేశా. 16జీబీ ప్లేయర్ $140, ఇంకా ఛార్జర్, కేబుళ్ళు మొదలగునవి కలిపి ఇంకొ 40 అయ్యింది. ఇప్పటివరకైతే పాటలు బాగా వినిపిస్తున్నయి. కానీ వివరమైన సమీక్షకు ఇంకా కొన్నాళ్ళగుతా.

14, మే 2010, శుక్రవారం

రహమాన్ రాగాలకు జానకిగారి స్వరము

గత వారం శ్రీమతి ఎస్. జానకి గారి 73వ పుట్టిన రోజు  సందర్భంగా  దాదాపు అన్ని టీవీ ఛాన్నెల్లల్లో ప్రత్యేక కార్యక్రమాలు వేశారు. కానీ నన్ను బాధించింది ఏమిటంటే  అందరు 1957 లో వచ్చిన"ఎమ్మెల్యే" తో మొదలు పెట్టి 1992 లో వచిన"క్షత్రియ పుత్రుడు" తో ముగించారు. కొందరు మాత్రం 1998 లో విడుదలైన  "అంతఃపురం" లోని "సూరీడు పువ్వా" పాట దాకా వెళ్ళారు. 90'ల్లోఅ దూసుకువచ్చిన సంగీత ప్రభంజనం   ఏ.ఆర్. రహమాన్ కూర్చిన జానకి గారు పాడిన పాటలన్నీ మర్చిపోయారు. అయినా టీవీ వాళ్ళ మీద ఎవరు ఆశలు పెట్టుకుంటారులేండి.

అందుకే నేనే పరిచయం/గుర్తు  చేద్దామని ఉద్దేశ్యంతో ఈ టపా వ్రాస్తున్నా. మేస్ట్రో ఇళయరాజా తర్వాత నాకిష్టమైన సంగీత  దర్శకుడైన  ఏ.ఆర్.రహమాన్‌కి ఆవిడ పాడిన బాణీలు చాలా తక్కువైన దాదాపు అన్నీ కష్టమైనవి, నాకిష్టమైనవి. అవే పాటలని వేరే భాషల్లో లతాజీ, చిత్ర గారు లాంటి వారు పాడినా, జానకిగారి గొంతులోనే నాకు నచ్చాయి. అలాగే ఈ పాటలు ఆవిడ పాత మధురాల స్థాయికి ఏమాత్రం తీసిపోవని నా అభిప్రాయం.

పనిలో పనని అన్ని భాషల్లో ఆవిడ రహమాన్‌కి పాడిన పాటలు సేకరించా - ఈ శోధనలో కొన్ని తమిళ ఆణిముత్యాలు కూడా దొరికాయి.

1. సఖి : సెప్టెంబర్ మాసం -
ఈ పాట తమిళంలో ఆశా భోన్స్లే పాడారు.2. ఒకే ఒక్కడు  : మగధీర మగధీరా-
శంకర్ మహదేవన్ తూగలేకపొయాడు.
3. జోడి:కదిలే కాలమే జీవితం -

 http://www.youtube.com/watch?v=kKevfau8PIM4.ఉయిరే (తమిళ్) : నెంజనిలె -
హిందిలో  జియా జలే (డిల్సె) అని లతగారు పాడినా, తెలుగులో "ఇన్నాళ్ళిలా లేదులే" అని  చిత్రగారు పాడినా నాకు జానకిగారు పాడిందే నచింది.
 http://www.youtube.com/watch?v=sImEWzTkJ3U5. ప్రేమికుడు : ఎర్రాని కుర్రదాన్ని గోపాల -

 http://www.youtube.com/watch?v=3xxsj9DxXtUX6. జెంటిల్మాన్ :కొంటెదాన్ని కట్టుకో -

http://www.youtube.com/watch?v=0OyjVWF2uLU7. పల్నాటి పౌరుషం :బండెనక బండి -
ఈ పాటలో వందేమాతరం శ్రీనివాస్‌గారు కూడా పాడారు.

 http://www.youtube.com/watch?v=zvT9vE-th808.సూపర్ పొలీస్ :  పక్కా జెంటిల్మాన్ని  -

 http://www.youtube.com/watch?v=Irw6X94O4ow9. రంగీలా (తమిళ్) తనియే తనియే  -
హిందీలో "తన్‌హా  తన్‌హా" అని ఆశా భోన్స్లే గారు పాడారు

 http://www.youtube.com/watch?v=kIlvqRwsEAw10.సంగమం (తమిళ్): మార్గళి తింగల్ అల్లవ -
ఇది రహమాన్‌కి పాడిన వాటన్నిటిల్లోకి నాకు నచ్చినది.

http://www.youtube.com/watch?v=kt4DS0U0Ldo11. అల్లి అర్జునా(తమిళ్) -ఎందన్  నెంజిల్ -

 http://video.google.com/videoplay?docid=-4961339622680971991#

12. ఉదయ (తమిళ్): అంజనం  -
ఇందులో నాకు మూడు భాషలు వినిపించాయి.
 http://www.raaga.com/channels/tamil/moviedetail.asp?mid=t0000473

30, ఏప్రిల్ 2010, శుక్రవారం

కోడి కెలుకుడు

కోడి కెలుకుడు: ఈ మధ్యనొక రోజు లీజు కొనసాగింపు పత్రాలు నింపి మా అపార్ట్మెంటాఫీసుకి వెళ్ళా. అక్కడి మేనేజరు సారా దాన్ని పైకి-కిందకీ ఒకసారి చూసి, "నా జీవితంలో ఇంత చెత్త రాత ఇంతకుముందు చూడలేద"నొక కుళ్ళు నవ్వుతోటి డైలాగు కొట్టింది. అది పరాచికమో, నిజంగానే నా రాత అలా ఏడ్చిందో కానీ, నాకొళ్ళు మండింది. కానీ, వెంటనే తేరుకుని,ఒక నవ్వు మొఖం పెట్టేసి, "హి హి హీ! యాయ్యా! మనం కీబోర్డులు, లాప్టాపులు తప్ప కాగితం మీద పెన్ను పెట్టి సంతకానికి మించి గీకింది చాల తక్కువ"ని వివరణ ఇచ్చుకున్నా.

ఇంటికి తిరిగి వచ్చాక కూడ ఆ అవమానం చల్లారలెదు! ఒక సారి మళ్ళీ వెనక్కి ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళితే - కొంతవరకు వారసత్వంగా (మా నాన్నగారి దస్తూరి ముత్యల పేరులాగుంటుంది), కొంతవరకు మా 2వ తరగతి సురేఖ టీచెర్ ధర్మమాని నేర్చుకున్న ఇంగ్లీషు కలిపిరాతతో (curly handwriting) ఐదవ తరగతిలో బాలానందం పోటీల్లొ 'గుంటూరు టౌను జూనియరు దస్తూరి విభాగం' లో మొదటి బహుమతి కొట్టా కదా (అది మా ప్రిన్సిపాలుగారు నిర్వాహక కమిటీలొ సభ్యుడవటం వల్ల అని మా అన్నయ్య జోకెసెవాడు, అది వేరే విషయం) !
నాకు వచ్చే మార్కుల్లొ సగం నా దస్తూరికి దిద్దే టీచర్లు పడిపోవడంవల్లనేనని ఇంటరుకు వచ్చేవరకు నా ప్రత్యర్ఠులు కొన్నిసార్లు వెనక, చాలాసార్లు ముందర కుళ్ళుకునేవారు కదా!
హా! ఇంజినీరింగ్కి వచ్చాక, మా యూనివర్శిటీ వాడు కేవలం జవాబు పత్రాల బరువు చుసి మార్కులు వేయడం వలన, మూడు గంటల్లొ ముప్పై పుటలు రాసే ప్రావీణ్యత సంపాదించడంలోపడి నా చేవ్రాతని మార్చుకోవలసి వచ్చింది.

ఇక ఈ సాఫ్ట్వేరు లొకి వచ్చాక గడిచిన ఆరేళ్ళలో మీటింగుల్లో- ట్రయినింగుల్లో నోట్‌పాడ్లో పిచ్చి బొమ్మలు గీకడం తప్పితే, అక్కడిక్కడా సంతకాలు తప్పితే పెన్నెక్కడ పట్టుకున్నాం గనుకా!

హయ్యో! ఒక కాపీబుక్కు కొనుక్కొచ్చుకొవాలి - నా దస్తూరి తిరిగి తెచ్చుకొవాలి .

17, ఏప్రిల్ 2010, శనివారం

మేమూ పాట పాడాము (పాడామా?) !

నా తెలుగు బ్లాగు ఒక బాల్య జ్ఞాపకంతో మొదలు పెడుతా. మా  అద్భుత గానంతో ఎలా మా స్కూలికి వన్నె తెచ్చామో చదివి (నవ్వొస్తే) నవ్వుకోండి.
***************
స్కూల్లో ఉండగా నేను, అన్నయ్య బృంద గానము, నాటకములు మొదలగు సాంస్కృతిక కార్యక్రమలాలో కొంచెం ఉత్సాహంగానే పాల్గోనేవారం. ఇదంతా మా స్కూలు ప్రిన్సిపాల్ శ్రీ బి.కే.విశ్వేశ్వరరావు గారి చొరవ. ఆయన గుంటూరు బాలానందం కార్యక్రమాల్లో 80-90 లలో ముఖ్య పాత్ర పోషించేవారు. అందుకని ప్రతి సంవత్సరం బాలానంద కేంద్రం లో జరిగే పోటీలకు మమ్మల్ని తీస్కు వెళ్ళేవారు. అలా బాగానే అయిదు, ఆరు, ఏడు తరగతుల్లో నాటకాలు వేశాం, పాటలు పాడాం, బొమ్మలు గీశాం, కోలాటాలు ఆడాం - రెండు మూడు బహుమతులు కొట్టాము కూడా.

ఇక ఎనిమిదవ తరగతిలో ఉండగా మళ్లీ బాలానందం పోటీలకి పిలుపొచ్చింది. అంటే మా ప్రిన్సిపాల్ గారు నిర్వాహకుల్లో ఒకరు కదా.

ఇక్కడ మా స్కూలు గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకోవాలి. మాది కాన్వెంటుకి తక్కువ, ట్యూషను సెంటరుకి ఎక్కువ. ఏ ఏడాది మొత్తం విద్యార్ధుల సంఖ్య వంద దాటలేదు. కాని మరీ వీధిబడి కాదులెండి. మంచి గురువులు ఉండేవారు, మేమూ శ్రద్ధగా చదువుకునేవారం. నా తరగతి లో పది మందికి పైగా విద్యార్ధులు ఎప్పుడూ లేరు. ఇప్పుడర్ధం అయ్యుండాలి నాకు అవకాశాలు ఎలా వచ్చాయో.

సరే విషయానికి వస్తే మా స్కూలి నించి  బృంద గానంకి ఎంట్రీ పంపించాలి. మా ప్రిన్సిపాల్ గారి అమ్మాయి మా సంగీతం-నృత్యం టీచర్. పాపం మాకు ఐదవ తరగతి నించి సరళీస్వరాలూ నేర్పడానికి తెగ ప్రయత్నించేవారు. ఎనిమిదవ, తొమ్మిదవ తరగతుల్లో ఉన్న ఎనిమిది-తొమ్మిది మంది మగ పిల్లలం ఆ టీచర్ దగ్గరకి వెళ్లి మాకు ఒక కొత్త పాట నేర్పించి ఆ పోటీలకి పంపించాలని అడిగాం (అయినా మేమూ తప్ప ఎవరున్నారు స్కూల్లో). కానీ టీచర్ అందరికి న్యాయం చెయ్యాలని, ఉన్న ముగ్గురు ఆడపిల్లలని కూడా జట్టులో కలిపారు. మంచి ఊపున్న ఒక దేశభక్తి గీతం నేర్పించి పోటీలకి పంపారు.

అసలు కామెడీ పోటీల్లో జరిగింది. పోటీల రోజున మా స్కూలు పేరు పిలవగానే వేదికా మీదకి దూసుకుపోయి క్షణం ఆలస్యం లేకుండా ఒక ఉరుములాంటి గర్జనతో పాడడం (అరవడం అనాలేమో?) మొదలు పెట్టాం. రెండో నిమిషం కరెంటు పోయింది. అందరు మేము ఆపుతామేమో అనుకున్నారు. కానీ మా గాన ప్రవాహం రెట్టించిన శబ్దంతో సాగింది. అప్పుడే బాల్య దశ నుండి కౌమారములోకి అడుగిడుతున్న మగ పిల్లల గొంతులు ఎలా ఉంటాయో చెప్పాలా, అదీ ఒకేసారి అట్లాంటి ఎనిమిదిమంది అబ్బాయిలు ఆ గొంతులు వేస్కొని పాడితే ఆ సభా ప్రాంగణం ఊహించుకోండి. మైకులు బద్దలవ్వాల్సిందే! ఏడు నిమిషాల పాటని మూడు నిమిషాలలో ఊదిపారేశాం.

ఎంత వేగంతో వచ్చామో అంతే వేగంగా నిష్క్రమించాం. ఇక చూస్కోండి, ప్రేక్షకుల, ముఖ్యంగా నిర్ణేతల మొహాలు చూడాలి. బాలకృష్ణ సినిమా చుసిన మొహాల్లో కూడా అలాంటి హావ భావాలు చూడలేదు. వెంటనే మా వాడొక్కడికి వెలిగింది మేము ఏం తప్పు చేసామో (పాడడం కాదులెండి, మా మీద మాకు చాలా మంచి అభిప్రాయం). వెంటనే మీకు దగ్గరకి పోయి, "ఇప్పుడు మేము పాడింది 'ఎయ్ దెశో ఎయ్ మటి' అనే ప్రముఖ ఒరియా దేశభక్తి గీతం!" అని ప్రకటించాడు. ఇక చూస్కోండి - ఆడిటోరియం అంతా నవ్వులే నవ్వులు. మేము ఒకసారి ప్రిన్సిపాల్ గారిని, సంగీతం టీచర్ గారిని చూసాం. ఆడిటోరియం చివరి వరుసలలో ఉన్నా మా ఫ్రెండ్స్ దగ్గరికి పరిగెత్తాం. మా ఫ్రెండ్స్, పక్కన కూర్చున్న వాళ్ళంతా "అన్ని గ్రూపుల్లో మీ పాట ఒకటే మాకు వినిపించింది - అర్థం కాలేదు కానీ బాగానే పాడారు మీరు" అని మెచ్చుకున్నారు.

మర్నాడు మా సంగీతం టీచర్ స్కూల్లో - మాకు మామూలుగా పూజ చేసి, తరువాత కళ్ళనీళ్ళు పెట్టుకొని (నిజంగా) - ఇక మా స్కూలు మగ పిల్లలకి సంగీతం పాఠాలు చెప్పను అని ఒక నిర్ణయం తీస్కున్నారు.

ఆ పాట కొంత వరకు గుర్తుంది.

||ప||
ఎయ్ దెశో ఎయ్ మటి
మొమతమొయీ మాటి ||2||

సెబరెతరో జిబానొదెబా ||2||
రొఖిబో తారొనాతి  ||ఎయ్||

||చ||
 జొహి ఝొరనో జొహి జాయే
జొహి కొయిలీ కూహు గాయె

సుజలాం సుఫల సస్యశ్యామలాం
సుజలాం సుఫల సస్యశ్యామలాం
ఆమొయే జొన్మ మాటి. ||ఎయ్||
 
||చ||
 చిరు  మళయొ జారొ పబనో
చిరు తనన జారొ కననో |2||
సగర జొహరో రత్న బొందారొ ||2||
ఆమొయే జొన్మమాటి

ps: తెలుగులో రాయల్సినది ఆలోచించడం తేలిక,  టైపు చేయడం కష్టము - ఇంగ్లీషులో టైపు చేయడం తేలిక గానీ ఆలోచించడం కొంచెం కష్టం.

11, ఏప్రిల్ 2010, ఆదివారం

మరో మలుపు!

ఇది నా బ్లాగు జీవితంలో మరో మలుపు. ఎట్టకేలకు, తెలుగులోనూ ఒక బ్లాగు మొదలు పెట్టేసి మన తెలుగు పాండిత్యం కూడా పరీక్షించుకోవాలని-పరిరక్షించుకోవాలని ఒక నిర్ణయం తీసేస్కున్నా.  తీస్కునేముందు అవసరమా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా! 
ఈ బ్లాగు ఎందుకు మొదలు పెట్టావు?
ఆ మధ్యన "save telugu" అని నా ఇంగ్లీష్ బ్లాగులో నా ఆవేశం వెళ్లగక్కా. సరే మరి జనాలకు చెప్పే ముందు నేను తెలుగు ఎలా మాట్లాడతనో, రాస్తానో నేను చుస్కోవాలి, జనాలకి చెప్పాలిగా - వాళ్ళు అడిగేముందే.

జేబి గారు,..
నేనింకా యువకుడినే కాబట్టి, ఐ టి లో ఉన్న కాబట్టి - పేరు మాత్రమె అలవాటు. అందుకని గారు తగిలించాకుండా, జేబి అని పిలిస్తే చాలండి.


నీ పేరు - "JB - జేబి" ఏంటి?
నా పూర్తి పేరుకి సంక్షిప్త నామమది. ఈ జేబీ అని పిలిపించుకోవాలని నిర్ణయం తెస్కోవడానికి ఒక పెద్ద కధుంది. వేరే టపా రాస్తానులెండి. అది రాసాక నా బాధ అర్థం అవుతుంది కాబట్టి నా పేరు తెలిసిన నష్టమేం ఉండదండి. ( పెద్ద రహస్యమేమి కాదు, నా ఇంగ్లీష్ బ్లాగులో ఉంటుంది, నా ఈ మెయిల్ ఐడి లో ఉంటుంది).

ఈ బ్ల్గాగులో ఏమి రాస్తావు?
బ్లాగు నెత్హి మీద రాసాను చుడండి. నేను తెగ అలోచిస్తానండి. మరి ఆలోచించినపుడు బోల్డు ప్రశ్నలు వస్తాయిగా - ఆ ప్రశ్నలకి సమాధానాలు వెతికినపుడు, మరిన్ని ఆలోచనలు, ప్రశ్నలు ....

చాలు బాబూ - నీ సోది మాకెందుకు?
అంటే... నా అనుభవాల నించి మీరు నేర్చుకోవచు, నా అభిప్రాయాలూ మీకు కొన్ని ప్రశ్నలు రేకేత్తిన్చచ్చు. అయినా నాది ఏ సి బోగీ ప్రయాణం లాగా పాకం కాదండి - జనరల్ బోగీ లాగా సందడి ప్రయాణం - సరదా ముచట్లు, నా  అగచాట్లు కూడా ఉంటాయి - మీకు కాలక్షేపానికి.

ఇది నీ మొదటి టపా కదా - మరి 'మరో మలుపు' అంటావేంటి?
తెలుగు లో మొదటిదే కాని, నా బ్లాగు ప్రయాణం 2005 లోనే మొదలు పెట్టానులెండి. మా సంస్థ అంతర్-బ్లాగుల్లో 200 పైగానే రాసి అక్కడి జనాలని తినేశాను. ఇక నా మిత్రులు కూడా బ్లాగు పేరు ఎత్తితే ... వద్దులెండి. అందుకే ఒక తెలుగు బ్లాగు మొదలెట్టేసి,  కూడలి, జల్లెడ లాంటి చోట్ల పెట్టేసి ...

అంటే కూడలి, జల్లెడ లకు వచ్చే వారందరికి నీ సోది చదవడం తప్పితే పని లేదనా?
అలాగని కాదు - కూడలి, జల్లెడ నాకు ఎప్పటినించో తెలుసు. కొన్ని విషయాలు తెలుగులోనే బాగా రాయగలనని ఈ మధ్యే గ్రహించా. మరి కొన్ని, వాటి పరిధి దృష్ట్యా తెలుగు పాఠకులకే బాగా చేరుతాయి. పైగా Google transliterate మరియు లేఖిని వచ్చాక తెలుగు వ్రాయడం తేలిక అయ్యింది. అసలు విషయం, ఒక నెల రోజులనించి పని తక్కువుండి, కాలక్షేపానికి కూడలి/జల్లెడ లలో ఉన్న అందరి బ్లాగులు చదివేశా - ముఖ్యంగా శ్రీయుతులు  నెమలికన్ను మురళి , మనోనేత్రం సందీప్, జాజిపూలు నేస్తం,  సుజాత, సౌమ్య, నాన్న భాస్కర్, వేణు శ్రీకాంత్, అబ్రకదబ్ర,, మాలతి, జయ గార్ల (ఇంకా చాలా మంది ఉన్నారు) అనుభవాలు, జ్ఞాపకాలు, ముచ్చట్లు నన్ను ఆకట్టుకున్నాయి - నన్ను కూడా 'పుచ్చుకోవడమే'  కాదు, 'ఇచ్చుకోవడం' కూడా చెయ్యాలి అని ప్రేరేపించాయి. ఇంక నా మిగిలిన నిర్నయల్లాగా కాకుండా, క్రమం తప్పకుండ టపాలు రాయడం మిగిలింది.

మరి అన్ని బ్లాగులు చదివినవాడివి ఎక్కడ ఒక్క వ్యాఖ్య కూడా పెట్టలేదెం?
అంటే అవన్నీ ఆఫీసు నించి చదివాను కదండీ. ఇంటి దగ్గర బోలెడు పని ఉండేది - ఐ పి ఎల్ చూడాలి, సినిమాలు చూడాలి, కొన్ని చదువుకోవల్సినవి - కుదరలేదండి. ఇపుడు తీరిక దొరికింది, రాయాలన్న ఆసక్తి పెరిగింది. ఇంక ఇపుడు వ్యాఖ్యలు కూడా రాస్తానులెండి. నాకు తెలుసు, ఒక బ్లాగరికి వ్యాఖ్యలెంత ముఖ్యమో!  ఎవరి బ్లాగులోనన్న మాల్డెన్ అనీ ఊర్నించి ముద్రలు పడితే అది నేనే.