30, ఏప్రిల్ 2010, శుక్రవారం

కోడి కెలుకుడు

కోడి కెలుకుడు: ఈ మధ్యనొక రోజు లీజు కొనసాగింపు పత్రాలు నింపి మా అపార్ట్మెంటాఫీసుకి వెళ్ళా. అక్కడి మేనేజరు సారా దాన్ని పైకి-కిందకీ ఒకసారి చూసి, "నా జీవితంలో ఇంత చెత్త రాత ఇంతకుముందు చూడలేద"నొక కుళ్ళు నవ్వుతోటి డైలాగు కొట్టింది. అది పరాచికమో, నిజంగానే నా రాత అలా ఏడ్చిందో కానీ, నాకొళ్ళు మండింది. కానీ, వెంటనే తేరుకుని,ఒక నవ్వు మొఖం పెట్టేసి, "హి హి హీ! యాయ్యా! మనం కీబోర్డులు, లాప్టాపులు తప్ప కాగితం మీద పెన్ను పెట్టి సంతకానికి మించి గీకింది చాల తక్కువ"ని వివరణ ఇచ్చుకున్నా.

ఇంటికి తిరిగి వచ్చాక కూడ ఆ అవమానం చల్లారలెదు! ఒక సారి మళ్ళీ వెనక్కి ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళితే - కొంతవరకు వారసత్వంగా (మా నాన్నగారి దస్తూరి ముత్యల పేరులాగుంటుంది), కొంతవరకు మా 2వ తరగతి సురేఖ టీచెర్ ధర్మమాని నేర్చుకున్న ఇంగ్లీషు కలిపిరాతతో (curly handwriting) ఐదవ తరగతిలో బాలానందం పోటీల్లొ 'గుంటూరు టౌను జూనియరు దస్తూరి విభాగం' లో మొదటి బహుమతి కొట్టా కదా (అది మా ప్రిన్సిపాలుగారు నిర్వాహక కమిటీలొ సభ్యుడవటం వల్ల అని మా అన్నయ్య జోకెసెవాడు, అది వేరే విషయం) !
నాకు వచ్చే మార్కుల్లొ సగం నా దస్తూరికి దిద్దే టీచర్లు పడిపోవడంవల్లనేనని ఇంటరుకు వచ్చేవరకు నా ప్రత్యర్ఠులు కొన్నిసార్లు వెనక, చాలాసార్లు ముందర కుళ్ళుకునేవారు కదా!
హా! ఇంజినీరింగ్కి వచ్చాక, మా యూనివర్శిటీ వాడు కేవలం జవాబు పత్రాల బరువు చుసి మార్కులు వేయడం వలన, మూడు గంటల్లొ ముప్పై పుటలు రాసే ప్రావీణ్యత సంపాదించడంలోపడి నా చేవ్రాతని మార్చుకోవలసి వచ్చింది.

ఇక ఈ సాఫ్ట్వేరు లొకి వచ్చాక గడిచిన ఆరేళ్ళలో మీటింగుల్లో- ట్రయినింగుల్లో నోట్‌పాడ్లో పిచ్చి బొమ్మలు గీకడం తప్పితే, అక్కడిక్కడా సంతకాలు తప్పితే పెన్నెక్కడ పట్టుకున్నాం గనుకా!

హయ్యో! ఒక కాపీబుక్కు కొనుక్కొచ్చుకొవాలి - నా దస్తూరి తిరిగి తెచ్చుకొవాలి .

2 కామెంట్‌లు:

 1. అయ్యో! రాత! ఏం చేస్తాం? 10 వ తరగతిలో మా నాన్న(మా సంస్కృతం మాష్టారు కూడా)నా రాత చూసి నా పేపర్ దిద్దాలంటే నాలుగు సారిడాన్ టాబ్లెట్లు,అర డజను టీ లు కావాలన్నాడు.

  సర్దుకోవాలి,తప్పదు(అంతకు మించి ఏమీ చేయమనుకో సాధారణంగా).

  నీ టపా బాగుంది.

  రిప్లయితొలగించు
 2. హహ్హహ్హా!నుదుటి రాతలు మార్చలేం గానీ, చేతి రాతలు మార్చుకోవచ్చు కదా! అసలు మారిందనేగా నా బాధ!

  కృతజ్ఞతలు విశ్వనాథ్.

  రిప్లయితొలగించు

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in