29, సెప్టెంబర్ 2010, బుధవారం

నేనూ, నా కజిన్స్ - తరం తరం అంతరం

నిన్న ఊరికినే కబుర్లాడుకుంటుంటే, రూమ్మేట్ భారతీయుడు పాట హమ్ చేస్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో, బళ్ళో ఉండగ చూశా! పది పన్నెండేళ్ళు అయిపోయింది, అప్పుడే అంకులయిపోయానన్నాడా ఇరవయ్యారేళ్ళ కుర్రాడు.

అది వినగానే నా కన్న 7-8 ఏళ్ళూ వయసులో చిన్నైన కజిన్స్ గుర్తొచ్చారు. నేనిలా అన్నా (అప్పుడు క్లుప్తంగా, ఇప్పుడు విపులంగా).

- నాకు ఏడెనిమిదేళ్ళప్పుడు (2-3 తరగతి) వాళ్ళని ఉయ్యాల్లూపేవాళ్ళం (నేనూ, అన్నయ్య).
- నాకు 12 ఏళ్ళప్పుడు (6-7 తరగతి) వాళ్ళు నాలుగైదేళ్ళ బుడంకాయలు - ఆడించేవాణ్ణి. కాగితంతో పడవలు, రాకెట్లు, ఫాన్లు, ఇంకా చాలా చేసిచ్చేవాళ్ళం.
- నాకు 15 వచ్చేసరికి (ఇంటర్ అంటే పెద్దయినట్లే కద), ఏడెనిమెదేళ్ళ పిల్లకాయలమీద కొంచెం దందా చేసేవాడిని. "ఒరేయ్ మంచినీళ్ళు తీసుకురా!" లాంటివి.
- ఇంజినీరింగ్ (21-22) అయిపోయి మనం ఉద్యోగంలో చేరేసరికి వాళ్ళు పది-ఇంటర్. ఇక మనం ఎప్పుడు ఊరెళ్ళినా, మనల్నేమో "వాడిని/దానిని ఏ కాలేజిలో చేర్చను? ఏ కోర్సు మంచిది"లాంటి డౌట్లు, వాళ్లనేమో "చిన్నా/బుజ్జీ! అన్నాయ్ని/బావని అడిగి అదేదొ తెలుసుకోవచ్చుగా" వంటి సతాయింపులు - ఆహా! మనం రాజులం ఎవరింటికెళ్ళినా.

ఇంతవరకు అందరికీ మాములేలేండి. అసలుది ఇప్పుడు.
- వాళ్ళేమో ఇంజినీరింగ్ అయిపోయి సాఫ్ట్‌‌వేర్ కొలువులకొచ్చేశారు. మనమేమో ఇంకా టీమ్‌‌లీడ్ అయ్యి మూడేళ్ళయిపోయినా, ప్రాజెక్ట్ మేనేజర్ కాలేదు. ఇంకా దగ్గర్లో ఊరిస్తుంది. వాళ్ళకీ మనకీ ఒక్క లెవెలే తేడా. వాళ్ళూ నేనూ ఇంక ఒకటే, మనమింకా యూతే అనిపిస్తుందీ. ఇంకేముందీ, మనమింకా 28 ఏళ్ళ బ్రహ్మచారేగా! ఇంకో పక్కేమో అప్పుడే ఏడేళ్ళ యవ్వనం ఈ ఉద్యోగంలో బూడిదయిపోయిందా అనిపిస్తుంది.

ఏమో! ఇంకా యువకుడినే అనుకుంటున్నా! వాళ్ళని (అదే కళ్ళముందు పెద్దయిన కజిన్స్) చూస్తే మటుకు నేనూ అంకుల్ అయిపోయానిపిస్తుంది. 23 ఏళ్ళకే పెళ్ళిళ్ళయిపోయి ఇప్పుడు మూణ్ణాలుగేళ్ళ పిల్లలున్న మా కాలేజి ఆంటీలు మటుకు అంకులే కరెక్టంటారులేండి.

ఏమో! ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళా!

నా కజిన్స్ ఇప్పటికే తెలుగు-ఇంగ్లీషు బ్లాగులు, ఫేస్‌‌బుక్ మొ॥లలో అన్నిచోట్లా వున్నారు. ఇప్పుడు ఎంతో ధైర్యంతో ఈ వ్యాసం ప్రచురిస్తున్నా. కజిన్స్, మీరెవ్వరైనా ఇది చదివి నన్నేమైనా అనాలనుకుంటే ఇక్కడమాత్రం చేయకండి. నాకు మెయిల్/ఫోన్ చేయండి :)

3 కామెంట్‌లు:

  1. ఇరవై ఎనుమిదికే అలా అనుకుంటే ఎలా JB !! నలభై నాలుగు కే నన్ను మా ఆవిడనీ తాత గారూ అమ్మమ్మ గారూ అని పిల్లలతో పిలిపించే ముప్పై ఏళ్ళ పసి కూనలు ఉన్నారు మా ఫ్లాట్స్ లో... ఎవరితో చెప్పలేక మా ఈడు వాళ్ళమంతా రాత్రి చీకటి లో టెర్రస్ మీదకెళ్ళి భోరు భోరు మని విడి విడిగా ఏడ్చి వస్తున్నాం....తలకి రంగేస్కుంటే చొక్కా కాలర్ పాడవుతుంది (కడుపు చించు కుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది పాత సమేత నాయనా...)

    రిప్లయితొలగించండి
  2. బాగా రాసావు...., అంకుల్.
    అంకుల్,నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావడానికి నువ్వే ప్రేరణ.

    రిప్లయితొలగించండి
  3. @శిశిరగారు, చిన్న స్మైలీ అయినా నాలా బద్ధకించకుండా పెట్టినందుకు థాంక్స్.

    @ఆత్రేయగారు,హహ్హహ. పిల్లలతోనేగానీ వాళ్ళు పిలవట్లేదుగా. హైదరాబాదీ టీనేజిపిల్లలచే అంకుల్ పిలుపు నాకలవాటయినా నేను పెద్దవాడినయిపోయానని ఎప్పుడూ అనుకోలేదండి. మొన్న కూడ ఏదో ఫ్లాష్‌‌బాక్‌‌లకి వెళ్ళడం వలన పైన చేసిన ఆలోచనలు.

    @విశ్వనాథ్: గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్! ఒకసారి పర్లా, మరీ రెండుసార్లా! నేను ప్రేరేపించకపోయినా నేటి ఆంధ్రా మధ్యతరగతి విద్యార్ధి 'డిఫాల్ట్ అల్గారిథమ్' ప్రకారం నువ్వు సాఫ్ట్వేర్‌‌కే వచ్చేవాడివి. థాంక్స్.

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in