13, డిసెంబర్ 2010, సోమవారం

ఒక ఇబ్బందికర జ్ఞాపకం

జీవితంలో ఎదురయ్యే కొన్నికొన్ని సంఘటనలు ఇబ్బందికర పరిస్థితులు కలిపిస్తాయి. నా చిన్నప్పుడు జరిగిన అలాంటి సంఘటనొకటి, శిశిరగారి బ్లాగులో ఈ క్రింది వాక్యాలు చదివినపుడు గుర్తొచ్చింది.


ఉపాధ్యాయులకి ప్రవర్తనా నియమావళి పెడుతున్నారట. అందులో పిల్లలతో అసభ్యంగా వ్యవహరించకూడదనీ, లైంగిక వేధింపులు చేయకూడదనీ, ఉత్తమ గురువులుగా ఉండాలని, తోటి వారితో కలిసి మెలిసి మెలగాలని చెప్తారట. ఏమిటి? ఇవన్నీ ఆచరించడానికేనా? ఆచరించాలా? అని కొందరు గురువులు బెంగపడుతున్నారట. ఒకప్పుడు ఇవన్నీ గురువులు పిల్లలకి చెప్పేవారు. ఇప్పుడు గురువులకే చెప్పాల్సొస్తూంది. ఇప్పటికైనా అర్థమవుతుందో, లేదో నోట్లో వేలు పెట్టినా కొరకలేని కొందరు అమాయక గురువులకి.

తొమ్మిదో తరగతి - మార్చి నెల - ఒంటిపూట బళ్ళు. 8కి బడి అంటే మేము (నేనూ, నా ఆప్తమిత్రుడు అంజి) సాధారణంగా ఇంట్లో హడావిడి చేసి ఏడున్నరకే వెళ్ళిపోతాం. ఆ రోజు ఆలస్యమై 8కి వెళ్ళాం హడావిడిగా. వెళ్ళేసరికి రోజూ జరగాల్సిన ప్రేయర్ అసెంబ్లీ జరగట్లేదు. అంతా గందరగోళంగా, ఉద్రిక్తంగా వుంది. ప్రిన్సిపల్ రూం నిండా ఎవరెవరో వున్నారు. మేం క్లాసుకి వెళ్ళాం. ఆయా లక్ష్మి వచ్చి సుజాత టీచర్ మిమ్మల్నిద్దరినీ ప్రిన్సిపాల్ రూంకి రమ్మన్నారని చెప్పింది. అక్కడికి వెళ్ళేసరికి ప్రిన్సిపాల్ ఒక పక్క సోఫాలో ముభావంగా కూర్చొని వున్నారు. సుజాత టీచరు ప్రిన్సిపాల్ కుర్చీలో వున్నారు. టీచర్లందరూ సీరియస్‌‌గా వున్నారు.
అక్కడేం జరుగుతుందో, మమ్మల్నెందుకు పిలిచారో అర్థంకాలేదు.

సుజాత టీచరు "మీరీరోజు స్కూలుకు ఎన్నింటికొచ్చార?"ని అడిగారు.
"ఇప్పుడేం వచ్చాం మే'మ్".
"నిజం చెప్పండి, రోజూ ముందే వస్తారుగా?"
"నిజం మే'మ్, ఈ రోజు లేటయ్యింది."

*************************
ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. మొదట మా స్కూలు గుంటూరులో వీధికొకటి వుండే బుల్లిబుల్లి కాన్వెంట్లనబడు బళ్ళల్లో ఒకటి. ట్యూషనుకి ఎక్కువ, స్కూలికి తక్కువ. మొత్తం విద్యార్ధుల సంఖ్య 150, మా తరగతిలో ఐదుగురం. టెన్తులో ఒక్కడు, మార్చికాబట్టి పరీక్షలురాయడానికెళ్ళాడు. అంతకుముందు మా అన్నయ్య ఏడు నుండి పదివరకు ఒకేఒక్కడిలా చదివి వెళ్ళిపోయాడు.

రెండవది ఆ స్కూలు బ్యాంకుద్యోగుల పిల్లలకోసం పెట్టినదిగనుక, మా నాన్నగారు బ్యాంకాఫీసరుగనుక మేము అక్కడ చేరాము. ఐతే బ్యాంకువాళ్ళ పిల్లలు తక్కువ, మిగతావారు ఎక్కువ వుండేవారు. మా నాన్నగారు ఆ స్కూలుని పెంచాలని అప్పుడప్పుడు వెళ్ళి సలహాలు ఇచ్చేవారు. ఒక తడవ కార్యదర్శిగా చేశారు.
*************************

సుజాత టీచరు, "సరే! వెళ్ళి అన్ని క్లాసులు మానిటరు చేయండి. మేం ముఖ్యమైన మీటింగులో వున్నాం" అన్నారు.

వెనక్కి వచ్చాం. మిగతా క్లాస్మేట్లు ముగ్గురూ స్కూలుకి రావట్లేదు. వాళ్ళు స్కూలు బయట ట్యూషనుకు వెళ్తున్నారని మా ప్రిన్సిపాల్కి , వాళ్ళ తల్లిదండ్రులకి గొడవయ్యింది.

క్లాసులు మెయింటెయిన్ చేస్తున్నాం. మధ్యమధ్యన ఆఫీసుగదిలోకి తొంగిచూస్తున్నాం. పెద్దగానే వాదించుకుంటున్నారు. ఒకావిడ మా ప్రిన్సిపాలుని, స్కూలుని బూతులు తిడుతుంది. ఆయన ఏదో చేశాడని అర్థం అయ్యింది, ఏమిటన్నది అని తెలియలేదు. ఒక టీచరు బయటకి వచ్చి, "ఇవాల్టికి ఇంక స్కూలు లేదు, అందరినీ జాగ్రత్తగా ఇళ్ళకి పంపించండి" అన్నారు. అటెండరు - రిక్షా అబ్బాయి అయిన తిరుపాల్ వచ్చి ఒక్కొక్క ట్రిప్పువాళ్ళని తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. తిరుపాల్ని అడిగాం "ఏమయ్యింద"ని. చెప్పలేదు. ఆయా లక్ష్మిని అడిగాం, తిడుతుందిగానీ (మమ్మల్నికాదు), ఏం చెప్పదు.

మాకు టెన్షను, అయోమయం, ఆసక్తి అన్నిరకాల ఎమోషన్లు మొదలయ్యాయి.

కాసేపటికి స్కూలు బయట జనం పెరిగారు. ప్రిన్సిపాల్ని ఉతకబాదుడు బాదుతూ రోడ్డుపై తన్నుకుంటూ తీసుకెళ్ళుతున్నారు. సుజాత టీచరుకూడ వెళ్ళారు. ఇంక ఆగలేక మాకు కొంచెం క్లోజైన ఎల్కేజీ టీచరుని అడిగాం. అప్పుడు చెప్పారు, ఎవ్వరికీ చెప్పొద్దంటూ. మా ప్రిన్సిపాల్ ఒక ఎల్కేజీ అమ్మాయిని అత్యాచారయత్నమో, నిజంగా అత్యాచారమో చేశాడట. పోలీసు స్టేషనుకి తీసుకెళ్ళారట.
**********************
అందరినీ ఇళ్ళ దగ్గర దిగబెట్టాం. కానీ ఇప్పుడే ఇంటికి వెళ్ళితే ఏం చెప్పాలి. అందుకే మా క్లాస్మేట్ల (ఇద్దరు అన్నాచెళ్ళెల్లు) ఇంటికి వెళ్ళాం. విషయం చెప్పాం. ఆంటీ పొంగిపోయారు, మమ్మల్ని అన్నందుకు వాడికి తగిన శాస్తి జరిగిందని కాసేపు తిట్టారు. అక్కడ టైంపాస్ చేసి సాయంత్రం ఏమి జరగనట్లు ఇంటికెళ్ళిపోయాం.

**********************
అప్ప్ట్లట్లో మా నాన్నగారు కాలికి ఏక్సిండెంట్ అవ్వటంతో ఇంట్లోనే చాలా రోజుల నుండి విశ్రాంతి తీసుకుంటున్నారు. స్కూల్లో సంఘటన జరిగిన రెండుమూడు రోజులకి మా స్కూలు సెక్రటరీ (ఎవరో ఒక బ్యాంకు ఆఫీసరు వుంటారు కార్యదర్శిగా) నాన్నని పరామర్శించడానికి ఇంటికి వచ్చారు. మాటల సందర్బంలో ఇలా అయ్యింది, ప్రిన్సిపాల్ని అరెస్టు చేసారు, సుజాత టీచరుని ప్రిన్సిపాల్ చేశాం అని చెప్పారు. వెంటనే నాన్న నన్ను పిలిచారు, ఇంత జరిగితే చెప్పనేలేదేంటి అనడిగారు. నాన్న దగ్గర నాకు సాధారణంగా చనువు వుంది - చిన్నప్పటినుంచి ఒక మిత్రుడిలాగే పెంచారు. కానీ ఇలాంటి విషయం ఎలా చెప్తాం - కొంచెం ఇబ్బందిగా (ఎంబరాసింగ్) అనిపించింది.

*********************
తర్వాత, అమ్మో ఆ రోజు మనం స్కూలికి అలవాటుగా తొందరగా వెళ్లుంటే? అని చాన్నాళ్ళు భయంగా అనిపించింది. భయమేందుకంటే, ఆ సంఘటనకి వారం రోజుల ముందు, మా వీధి చివర స్కూల్లో టెన్త్ స్పెషలు క్లాసులని పెట్టి ఒక అమ్మాయికి మత్తుమందిచ్చి ఒక టీచరు (ఆ స్కూలు మహిళా ప్రిన్సిపాల్ కొడుకు), ఇద్దరు విద్యార్ధులు అత్యాచారం చేశారని గొడవయ్యింది. వారంకే మా స్కూల్లో. మమ్మల్నీ అనేవారేమోనని భయం.

కానీ మేమెళ్ళుంటే మేమున్నామనైనా ఆయన ఆ పని చేసేవాడుగాదేమో (నిజంగా చేసుంటే), ఆ అమ్మాయి రక్షించబడేది అని తర్వాత అనిపించేది.

*********************
పీకేసిన ప్రిన్సిపాల్ మాకు మా౨థ్స్, ఫిజిక్స్ చెప్పేవారు. సిలబస్ చాలా మిగిలుంది అప్పటికి. పరీక్షలకి నెలముందే కావడంతో కొత్త టీచరు దొరకలేదు. పబ్లిక్ పరీక్షలకి ఆ రెండు సబ్జెక్టులు మేమిద్దరం సొంతంగా చదువుకొని, ట్యూషను పెట్టించుకొన్న మిగతా ముగ్గురికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాం - అది మాపై మాకు నమ్మకాన్ని పెంచి భవిష్యత్తులో బాగా ఉపయోగించింది.
**********************

ఆ ప్రిన్సిపాల్ ఇల్లు మాకు తెలుసుగనక, పదవ తరగతిలో వుండగా ఒకసారి వెళ్ళి కలిసాం. ఆ పని ఆయన చేయలేదు అని చెప్పారు. ఎలా బయటపడ్డారో తెలియదుగానీ, రైల్వేలో ఉత్తరాంధ్రవైపు అసిస్టెంటు స్టేషనుమాస్టరు ఉద్యోగం వచ్చిందని చెప్పారు. తరువాత ఎప్పుడూ కలవలేదు.

6 కామెంట్‌లు:

 1. jebee gaaru,
  mee writing style chala baagundi..
  ituvanti teachers naaku kondaru telusandee, guruvulu tallithandrulatho samaanamani mallee andaru gurtisteh baagunnu.
  maa shcool lo pedda pillalandarini 'akka , anna ' ani pilipinche vaaru.. chaala happy ga undedi...we were like own siblings... sorry telugulo vraayadaaniki time saripoledu...
  ennela

  రిప్లయితొలగించు
 2. @ఎన్నెలగారు: ధన్యవాదాలు. 'అక్క'-'అన్న' మా స్కూల్లోనూ ఉండేది. అది మంచి అలవాటు.

  రిప్లయితొలగించు
 3. ఇటువంటి వార్తలు ఈ మధ్య చాలా వింటున్నాము. ఒక స్కూలు ప్రిన్సిపాలు LKG స్టూడెంట్ తో అటువంటి పని చేసేడంటే నమ్మశక్యం గాలేదు. విద్యా ప్రమాణాలకన్నా నైతిక విలువలు కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటాను. గురుర్దేవో అన్న విషయం గురువులకి బోధించే పరిస్తితి రావడం చాలా దురదృష్టకరం.

  రిప్లయితొలగించు
 4. హ్మ్.. చాలా బాధనిపిస్తూంది. ఇలాంటివి ఇంచుమించు రోజూ వింటున్నాం. చాలా బాధ్యతాయుతమైన వృత్తండి టీచింగ్ అనేది. మన ఒక్కరి ప్రవర్తనని రోజూ కొన్ని వందల కళ్ళు గమనిస్తూ ఉంటాయి. కొందరు పిల్లల్లు ఆ టీచర్ నచ్చితే తామూ అలాగే ఉండాలని ప్రయత్నిస్తుంటారు. మన ప్రవర్తన ప్రభావం పిల్లల మీద ఎంతగా ఉంటుందో పట్టించుకోవడంలేదు కొంతమంది. పాజిటివ్ అయితే ఫరవాలేదు, అదే నెగటివ్ ఇంపాక్ట్ ఎంతటి దారుణ పరిస్థితులలోకి ఆ పిల్లలని తీసుకెళ్తుందో కదా. నేను రోజూ నా వృత్తి జీవితంలో చూస్తున్న కొందరు దిగజారుడు మనుషుల గురించి చెప్పాలనిపిస్తూంది. హ్మ్.. ఎందుకులెండి, అన్నీ ఒకలాంటి కధలే.

  రిప్లయితొలగించు
 5. @సుబ్రహ్మణ్యంగారు: అవునండీ, మేము అప్పుడు నమ్మలేదు. తర్వాత పరీక్షలూ, ఎండాకాలం శెలవులు రావడంతో ఆ విషయం కొంతవరకు మరుగున పడిపోయింది.

  @వేణూశ్రీకాంత్‌‌గారు: కొన్ని జ్ఞాపకాలు అంతే.

  @శిశిరగారు: సరిగ్గా చెప్పారు. వ్యాసం పెద్దదయిపోయిందని పైన రాయలేదు. ఆయనతో మాకు మంచి అనుబంధం ఉండేది. మాకు ఫుట్బాల్ నేర్పారు; క్రికెట్ ఆడేవారు; ఇంగ్లీషు బాగా మాట్లాడేవారు; స్కూల్లో టాలెంట్ పరీక్ష నిర్వహించి, మాకు చాలా బాధ్యతలు అప్పజెప్పారు. ఇవన్నీ పాజిటివ్. ఆ సంఘటన దుష్ప్రభావాలు చెప్పక్కర్లేదు. కొన్నాళ్ళు ఎక్కడికెళ్ళినా మీ స్కూల్లో ఇలా జరిగిందటకదా అనడిగేవారు. మాదేమో తెలిసీతెలియని వయసు, ఎంత తెలుగు సినిమాలు చూసి పెరిగినా. దానికితోడు పబ్లిక్ పరీక్షల గందరగోళం.

  ఇలాంటి కథలు చెప్పోద్దులేండి - అనవసరంగా పవిత్ర వృత్తికి తగులుతుంది, చేసేవాళ్ళూ చేస్తూనే వుంటారు.

  రిప్లయితొలగించు

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in