క్రిందటి భాగానికి కొనసాగింపు.
... పెళ్ళయిపోయింది, భోజనాలయిపోయాయి, అంటే వచ్చిన పనయిపోయింది. ఇప్పుడేం చేయాలి ఇంతరాత్రి - వెనక్కి పోవాలా? రాత్రికెక్కడుండాలి? అని ఆలోచించుస్తుంటే చల్లని కబురు చెప్పారు - మర్నాడు పొద్దున నాలుగున్నరకి మొదటి రైలుందీ, అయినా లాడ్జిలో రూము బుక్ చేశాము, హ్యాపీగా రాత్రంతా ఎంజాయ్ చేద్దాం అన్నారు. వాళ్ళ సంగతి తెలిసిందే అయినా, సరేనని బయలుదేరాం. మాకు వేరే ఛాయిస్ ఏముందిగనక.
మండపంనుండి బయలుదేరి రాత్రి పదకొండుకి ముచ్చట్లు (అదే సొల్లు) చెప్పుకుంటూ లాడ్జికి చేరాం. అక్కడ రెండు గదులు తీసుకున్నారట. ఒక గదిలో మీరు తాగుతారో, ఏం చేసుకుంటారో (వాళ్ళకి వేరే ఆలోచనలుకూడా వున్నట్లు సందేహమొచ్చింది) మీ ఇష్టంఅని, నేనూ, రాం, కిరణ్, ఇంకా శీను ఒకగదిలో దూరాం. గది చాలా దారుణంగా వున్నా, అలసిపోయున్నాంగా వెంటనే నిద్ర పట్టింది. ఇలా పడుకున్నామోలేదో వెంటనే మావాళ్ళు తలుపులుబాదటం మొదలుపెట్టారు. అరే, లాడ్జివాడు ఖాళీ చేయమంటున్నాడు, పదండిరా అని. అర్థమయిందేంటంటే వాళ్ళు పిచ్చగా తాగి గొడవ చేసిందిచాలక ఇంకో వెధవ పనిక్కూడా ప్రయత్నించారని. ఓనర్కి, వీళ్ళకి మాటామాటా పెరిగి, ఇంక ఊళ్ళో లాడ్జీలేలేవా అని మమ్మల్నీ బయటికి లాక్కొచ్చారు మమ్మల్ని ఓనరుతో మాట్లాడనీకుండా.
ఫుల్లుగా తాగి రోడ్డుపై గట్టిగా మాట్లాడుతూ ముందువాళ్ళు, కొంచెం దూరంలో వెనక మేము నలుగురం. ఏం చేస్తాం, వాళ్ళు లోకల్, మేం ఊరికి కొత్త. వాళ్ళు తిప్పే రోడ్లే అర్థంకావట్ల, ఇంక లాడ్జిలెక్కడో ఏం తెలుసు. ప్రతీ లాడ్జీలో లేదు అనిపించుక్మ్టూ (వీళ్ళని చూసి ఎవరిస్తారు), సగం నిద్రతో హూనమైన ఒళ్ళుతో కాళ్ళీడూస్తూ అలా అర్ఠరాత్రి గంటసేపు తాగుడు బ్యాచితో కాకినాడ ఊరేగాక, ’రక్షక్’లో పోలీసుమామలెదురయ్యారు. మావాళ్ళని కొంచెం గమ్మునుండమని, వారికేదో చెప్పి తప్పించుకున్నాం. ఆ దెబ్బకి ఇక నావల్ల కాదు, దీనికన్నా రైల్వేస్టేషను నయం, హాయిగా వెయిటింగురూములో కూర్చోవచ్చు, నేవెళ్తున్నా ఎవరైనా వస్తారా అనడిగా - రాం, కిరణ్, శీను బయలుదేరారు.
అలా ఒంటిగంటకి కాకినాడ స్టేషనుకి వెళ్ళితే అక్కడ అసలు షాకులు.
స్టేషను బాగుచేస్తున్నారంటా, మొత్తం గుంటలూ, గొట్టాలు. మొత్తం చిమ్మచీకటి. కనీసం రిక్షాలు, ఆటోలు కూడా లేవు. ఎలాగో తారాడుకుంటూ, స్టేషను బిల్డింగుకి చేరితే, బుకింగు కౌంటరు తప్ప అన్ని రూములు బందు రిపేర్లకి. ఓవర్ బ్రిడ్జీకి కంచెలు. సిమెంటు బెంచీలు మళ్ళీ కొత్తగా కట్టడంతో పచ్చిపచ్చిగా. ప్లాట్ఫామంతా సిమెంటూ, ఇసక. పట్టాలు దాటి రెండో ప్లాట్ఫాం చివరదాక నడుచుకుంటూ వెళ్ళితే అక్కడ ఒక్క బెంచీ దొరికింది. హమ్మయ్యా అని దానిపై సెటిలయ్యాం. చలీ, దోమలు తట్టుకుంటూ నెమ్మదిగా నిద్రపట్టుతుంది అనుకుంటుండగానే ఒక గూడ్సు రైలు పేద్ద శబ్దంతో పోర్టు స్టేషన్నిండి వచ్చి రెండో ప్లాట్ఫాంపై వచ్చి ఆగింది.
ఇంక మాకు టెన్షను. మరి ఫుట్‌బ్రిడ్జి మూసుందిగా. దానికింద నుండి దూరదాం అంటే అదెప్పుడు బయలుదేరుతుందో తెలీదు. ఇద్దరేమో దాని కింద నుండి దూరారు. నేనూ, శీను ఫుట్‌బ్రిడ్జీ కంచె దూకి పైకెక్కి మళ్ళీ ఇవతలి ప్లాట్ఫాంకి వచ్చాం. ఈ ఫీటులో శీను కాలికి దెబ్బ తగిలించుకున్నాడు. కిరణ్దగ్గర ఒక దుప్పటి వుందని అప్పుడు గుర్తొస్తే దాన్ని పరిచి ఇద్దరు కూర్చున్నారు. నేను, ఇంకోడూ ప్లాట్ఫాంపై. ఉద్యోగంలో కొచ్చాక మొట్టమొదటిసారి రెండువేలు పెట్టి కొనుక్కున్న పీటర్ ఇంగ్లాండ్ జత - ఒక్కసారే వేసుకున్నా - అలా ప్లాట్ఫాంపై సిమెంటూ-ఇసకలతో. అప్పుడే కాదు, ఇప్పటికీ ఆజత వేసుకున్నపుడల్లా బాధే.
అలా అర్థరాత్రి చిమ్మచీకటిలో, బ్రాండెడ్ దుస్తులతో మేము నలుగురం ఆ కాకినాడ ప్లాట్ఫాంపై పొర్లుతూ దోమలతో కుస్తీ పడుతూ జోగుతుంటే ప్లాట్ఫాంపై కలకలం మొదలయ్యింది. లేచి చూస్తే మూడున్నరయ్యింది. జనాలు వస్తున్నారు. మేం నెమ్మదిగా లేచి టిక్కెట్లు కొనుక్కొచ్చుకున్నాం. మర్చిపోయా, ఈ మధ్యలో, శీను ఈ బాధ భరించలేక బస్టాండుకి వెళ్ళిపోయాడు, హైదరాబాదుకి ఫస్టు బస్సులో పోతాని.
నాలుగున్నరకి రైలంటే నాలుగిరవైకి చూడాలి, ప్లాట్‌ఫాంపై కాలు పెట్టేచోటు కూడాలేదు. పోర్టు స్టేషన్నుండి రావాల్సిన రైలు ఐదయితేగానీ రాలేదు, మమ్మల్ని గంటసేపు నిల్చోబెడుతూ. ఏదో మాకిరణ్ రన్నింగులో రైలెక్కి సీట్లాపాడు కాబట్టి బతికిపోయాం. ఇక చూస్కోండి విజయవాడకి వచ్చేవరకు లేవకూడదని చెప్పి పడుకున్నాం.
అన్నీ అనుకున్నట్లు జరిగితే నేను ఒక టపా ఎందుకు రాస్తాను. ఎనిమిదో, ఎనిమిదిన్నరకో రాజమండ్రిలో స్వామిజీ వేషంలో ఒకాయనెక్కాడు. నేను గోదావరిచూసి పడుకుందాంలే అని లేచా. మేం కూర్చున్న ఐదుసీట్ల చెక్కపై కూర్చున్నాడు. ఎదురుకూర్చున్న ఒకావిడని మీది ఫలాన ఊరు కదా, ఫలానఫలాన కదా అని మొదలుపెట్టాడు. ఆవిడకూడా మొహం వెలిగిపోయింది, భలే చెప్పారండీ, తమరు ఫలానావారింటికి వచ్చారుగదా అని ఆయన్ను గుర్తుపట్టింది. ఇక తన జ్యోతిషవిద్య చూపించడం మొదలుపెట్టాడు. నేను కళ్ళుమూస్తూ తెరుస్తూ గమనిస్తున్నా.
ఈ గురూజీ పక్కన ఒక పల్లెటూరి యువకుడు, పదహారుకన్నా వుండవు కూర్చున్నాడు. ఆ అబ్బాయి కూడా ఇవన్నీ వింటూ, "గురూగారూ, మీరు జరగబోయేవన్నీ చెప్పగలరా? ఐతే నాకు ఏం జరుగుతుందో చెప్పండీ" అనడిగాడు.
ఆ గురూజీ అతన్ని తేరిపారజూసి నేను చెప్పినా నీకు వినగలిగే యోగ్యతలేదు నాయనా అన్నాడు. అతను "ఎందుకండీ? నేను ఇలా పల్లెటూరివాడిలా కనిపిస్తున్నా; మీకు డబ్బులివ్వలేను; ఆవిడయితే బాగా డబ్బులిస్తుందనేగా" అని అడిగాడు. గురూజీకి దబ్బున కోపమొచ్చింది. మాటామాటా పెరిగాయి. వాదించుకోవడం మొదలుపెట్టారు.
ఇక ఆ అబ్బాయికి సపోర్టుగా కొందరూ, ఈయనకి సపోర్టూగా కొందరు, వినోదంచూస్తూ మరికొందరు. మా రాంలా వారి ఊహాలోకాల్లో హాయిగా విహరిస్తూ కొందరు. నాలా, కిరణ్లా, నిద్ర చెడిపోయి తిట్టుకుంటూ అతి తక్కువమంది.
కాసేపట్కి కుర్రాడు ఆవేశంతో ఊగిపోతూ, "మీరన్ని చెప్పగలరు కదా? ఐతే నేనిప్పుడు ఉచ్చపోస్తానా పొయ్యనా చెప్పండి" అని సవాలు విసిరాడు"? ఎదురుకూర్చున్నావిడ ఇక తిట్లు(బూతులతో) మొదలుపెట్టిందీ - సచ్చినోడా! పెద్దాయన్ని పట్టుకుని ఏంటా మాటలు అని. ఆ పిల్లాడిని సపోర్టు చేసేవాళ్ళేమో, "తప్పేంటండీ? ఆయనకి అన్నీ తెలిస్తే చెప్పమనండీ, పోస్తాడో పొయ్యడో". కుర్రోడేమో "మీరు పోస్తావంటే, నేను పొయ్యను - మీరు పొయ్యనంటే నేనిప్పుడే వెళ్ళిపోస్తా" అని. ఆ గురూజీ ఏదో డొంకతిరుగుడు సమాధానాలివ్వడం, వీడు "అవన్నీ ఎందుకండీ? నేను పోస్తానా పొయ్యనా జెప్పండి" సూటిగా చెప్పండని.
ఈ దెబ్బకి మా రాం. బస్సులు ఏక్సిడెంట్లవుతున్నా చలించనివాడు, నిద్రలేచి, "ఏంట్రా, పోస్తానా పొయ్యనా అంటూన్నాడూ. ఏంటిరా ఈ గొడవ" అని ప్రశ్నలు మొదలుపెట్టాడు. వాడికి మొత్తంచెప్పా.
ఈ లెక్కన నూజివీడు దాటేవరకు గొడవజరుగుతూనే వుంది. ఇంక నిద్రెక్కడపోయేది. విజయవాడ స్టేషను బయట సిగ్నల్కోసమో, క్రాసింగుకోసమో గంటపైనే పడేశాడు. ఎదురు పెద్దావిడ చూసిచూసి, "గురువుగారితో గొడవకోసం నువ్వెందుకు ఆపుకుంటావు, వస్తేపోసిరావచ్చుగా" అనింది. నాకువచ్చినప్పుడే నాకు నచ్చినప్పుడే పోసివస్తా? అయినా ఈయన్ని చెప్పమనండీ, నేను నా జాతకం ప్రకారం ఇప్పుడుపోస్తానో, పొయ్యనో అని.
మాకు సహనం నశించీ, ఆకలితో కృశించీ నీరసంతో పడిపోయే దశకి చేరుకున్నాం. ఇంతలో రైల్వేవారు దయతలచి మమ్మల్ని నిజయవాడకి చేర్చగా, ఇంక ప్రయోగాలు చాలని అక్కడి నుండి డైరెక్టు బస్టాండుకి చేరి బస్సుపట్టుకొని మధ్యాహ్నం రెండిటికి గుంటూరులో ఎవరిళ్ళకి వారు చేరుకున్నాం.
ఇలా వుంటాయి మా ఆలోచనలూ-తెలివితేటలూ, వాటితో మా నిర్వాకాలు. అప్పుడప్పుడేలేండి ఏదో ఆవేశంతో, లేకపోతే మేము చాలా ఆర్గనైజ్డ్.
హ హ బాగున్నాయ్. ఎంతైనా యూత్ కదండీ మరి ఇలాంటి కష్టాలన్నీ ఇష్టంగానే భరించేస్తాం :-)
రిప్లయితొలగించండిఅబ్బ! ఇక్కడ పోసేశా. ఇక చెప్పండి.:)
రిప్లయితొలగించండిహి హి హి! భళే భళే.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్‌గారు: అవునండీ, అందుకే అవి మాకు కష్టాల్లాగా అనిపించవు, మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
రిప్లయితొలగించండి@అజ్ఞాత: విజయవాడవరకైతే వాళ్ళ గొడవ తీరలా, వాడు పోయలా; ఆ తర్వాత మరి నాకు తెలియదు :)
@విశ్వనాథ్: చిత్రం బాగుంది. అచ్చు మామయ్యలానే వున్నావు.
Good One!!! First Apologies for the english. Though it is over 5 years you remeber the scenario!!! That's good!!
రిప్లయితొలగించండిహే మనో - నువ్విక్కడ!! ఆశ్చర్యానందాలు. ఇలాంటివి ఐదేళ్ళేంటీ, జీవితాంతం మర్చిపోలేనివి - పూర్తిగా కాకున్నా, లీలగాఅయినా గురుంటాయి, ఈ లీలాతో చేసిన ఘనకార్యాలు.
రిప్లయితొలగించండి