12, ఫిబ్రవరి 2011, శనివారం

వసంతరాయపురం వెటరన్స్

అమెరికా బోస్టనులో అక్కడి కాలమానం ప్రకారం శుక్రవారం పొద్దున 4కి బయలుదేరి న్యూయార్క్,అక్కడినుండి దుబాయిమీదుగా మొత్తం౩౦ గంటల (18 గంటల ప్రయాణం + 12 గంటల ఎదురుచూపులు) తర్వాత హైదరాబాదు భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఎనిమిదింటికి దిగి, కస్టమ్స్ వారిని దాటి ఇంటికిచేరేసరికి పదకొండు. అన్నయ్య నాకోసం విమానాశ్రయానికి వచ్చాడు. మళ్ళీ పన్నెండింటికి బయలుదేరి ఆదివారం పొద్దున పదింటికి గుంటూరు ఇంటికి చేరామిద్దరం.

మధ్యాహ్నం భోజనంచేసి కూర్చోగానే మిత్రులు ప్రసాద్, అంజి వచ్చారు. మనంవచ్చాం కదా, క్రికెట్ ఆడదాం అన్నారు. పదండి అన్నా.అమ్మ తిట్టింది (మరి సంవత్సరన్నర తరవాత కనిపించాగా). అన్నయ్య జెట్లాగ్ (ప్రయాణ బడలిక) లేదా అనడిగాడు. ఇప్పటికెన్నిసార్లు దిగినరోజే ఆఫీసుకెళ్ళలేదూ - అయినా ఎన్నాళ్ళో వేచిన ఈ రోజు ఎలా పోగొట్టుకుంటామన్నా.

మూడయ్యేసరికి మైదానంలో నేనూ, అన్నయ్య, ప్రసాద్, అంజి, ఇంకో నలుగురు చేరాం. వారిలో‌ ఒకరు కొంచెం పెద్దాయన, ముప్పై ఐదు ఉంటాయేమో - మా టీం కాదు, కానీ ప్రసాదువాళ్ళ బాస్ తమ్ముడు, ఆయనా వారం క్రిందటే అమెరికా నించి వచ్చాట్ట. మా అందరికీ గత పదిహేనేళ్ళుగా కెప్టెన్, నిర్వాహకుడు అన్నీ ప్రసాదే. ఒకప్పటి పెప్సీ ప్రకటనలో చెప్పినట్లు క్రికెటే తిండి, క్రికెటే నిద్ర, క్రికెటే జీవితం అన్నమాట. మిగతావన్నీ ఆ తరువాతే. అంటే మేమందరం తక్కువ కాదులేండి,అతను కొంచెం ఎక్కువ.

మాలో మేం సరదాగా తలా ఒక ఓవరు వేసుకుంటూ ఆడుకుంటున్నాం, ఇంకెవరైనా మా వాళ్ళు వస్తారేమోనని. అప్పటికి మూడు నాలుగు నెలలనుండి వర్షాలవల్ల సరిగా ఆడట్లేదట. నేనొచ్చానని ఆ రోజే మళ్ళీ మొదలుపెట్టారట.
పక్క పిచ్`పై పదిహేను-పదహారేళ్ళ కుర్రాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళనాయకుడొచ్చి 'ప్రసాదన్నా, మ్యాచి ఆడదామన్నా!' అన్నారు. ఇంకేం, మావాడికి ఉత్సాహం పెల్లుబుకింది. మమ్మల్ని అడిగాడు.


"వాళ్ళు మనతో ఏం ఆడుతారు. పాపం వదిలేసేయ్"
"మనం మనం అయితే ఇలాఎంతసేపాడతాం. ఎండలో ఎవరు పరిగెడతారు. మ్యాచ్ అయితే పదిహేను ఓవర్లు కూర్చోవచ్చును"
"మనల్ని చూశావా? ఒక్కొక్కళ్ళం బ్యాటు పట్టుకొని నెలలు అయ్యింది. మ్యాచు ఏం ఆడతాం"
"అయినా, వాళ్ళని చూడు, మనల్ని చూడు " (చిన్నా-పెద్దా బొజ్జలు చూపిస్తూ)
"మనం పదకొండుమందిమి లేముగా!"
బాసు తమ్ముడు , "నేను పిలుస్తా, నా ఫ్రెండ్సుని"
"సరే‌పదండి"

పోటీకి సై అన్నాం.
"మ్యాచెంతన్నా?"
"వంద!"
కుర్రాళ్ళు షాక్. "మనిషికి వందన్నా? మేం వెయ్యిలేంది ఆడం"
ఈసారి మేం షాక్.అంటే మాకు ఆటరాదని కాదు, కానీ‌ సరదగా ఆడేదానికి అంత డబ్బు వృధా చేయడం మాలో ఎవ్వరికీ ఇష్టంలేదు.
చివరికి ఐదొందలకి పందెం వేశాం. ప్రసాద్ టాస్ గెలిచాడు.
"హుర్రే! మొదటి బ్యాటింగ్ మనదే. పదిహేను ఓవర్లు కూర్చోవచ్చును".

ఐదు ఓవర్లు అయ్యేసరికి టాప్ ఆర్డరు కూలింది. కేవలం మా గంభీర్ మాత్రమే మిగిలాడు. మా అమెరికా దోస్తుకేసి చూశాం - ముగ్గురు ఫారిన్ ఆటగాళ్ళేరని. ఫోన్‌లు కొట్టగా ఇంకో ఐదు ఓవర్లకి వాళ్ళు దిగారు. తీరా వాళ్ళు ఎవరంటే, వాళ్ళు ప్రొఫెషనల్సుగా ఆడినపుడు మేం బాల్‌బాయిస్మి. కానీ వారు ఇపుడు రిటైరైపోయిన కపిల్‌దేవులు కదా! మా కన్నా ఘోరం , వాళ్ళు మటుకు ఏం చేస్తారు పాపం. ముక్కుతూ మూలుగుతూ పదిహేను ఓవర్లలో‌ 50 దాటించాం. బంగ్లాదేశ్^చేతిలో ఓడుతున్న భారత్‌లాగావుంది మాపరిస్థితి.

ఇంక బౌలింగు మొదలుపెట్టాం. మా వీరోచిత బౌలింగు-ఫీల్డింగులతో కేవలం ఆరు ఓవర్లలో‌వారిని కొట్టనించి, వారిని తృప్తిపరచాం. ఏదోలేండి, పిల్లకాయలు - మాపై గెలిచామన్నది వారికి వారిపై విశ్వాసం కలిగిస్తుందని జాలిపడ్డామన్నమాట! కానీ‌ ఆమాత్రం కృతజ్ఞతన్నాలేకుండ ఆ పిల్లకాయలు మమ్మల్ని చూసి నవ్వడం మొదలు పెట్టారు.

మ్యాచ్ అనంతర విశ్లేషణ:
"అహా!మనం సచిన్‌లాంటివారం. మనం బ్యాటు పట్టుకున్నపుడు వీళ్ళు పుట్టనుకూడ వలేదు. ఇపుడంటే ప్రాక్టీసులేదు, ఫాంలో లేముగానీ మనం మొన్నటిదాకా మంచి ప్లేయర్లమేగా!"
నేను: "కొందరికి పెళ్ళిళ్ళయిపోయినాయి.కొందరం రేపోమాపో చేసుకోబోతులున్నాం. బొజ్జలుకూడవచ్చాయి. ఇంకెన్నాళ్ళాడతాం (ఇలా ఇంకెన్నాళ్ళులే,ఇంకెన్నాళ్ళులే అంటూనే ఐదారేళ్ళనించీ ఆడుతున్నాములేండీ). ఐపీల్‌ జట్లలా మనకీ ఒక పేరుండాలి. ఇకనుండి మనం 'వసంతరాయపురం వెటరన్స్'!" (వసంతరాయపురం మా పేటలేండి.)

"ఛీ మనం వెటరన్స్ ఏంటి, యూతైతే. మనం వసంతరాయపురం వారియర్సుమి."
"అవును కదా!"

6 కామెంట్‌లు:

  1. మీ అభ్యర్ధనను మన్నించి నేను వసంతరాయపురం వెటరన్సకి కోచ్ గాను మేనేజర్ గాను ఉండడానికి అంగీకరిస్తున్నాను. అడగలేదంటారా ఆలస్యం దేనికి వెంటనే అడిగేయండి. నేను ఒప్పుకోవటానికి రెడీ గా ఉన్నాను. ఆలసించిన ఆశాభంగం

    రిప్లయితొలగించండి
  2. @శ్రావ్యగారు, @కృష్ణప్రియగారు: :-)

    @సుబ్రహ్మణ్యంగారు: ప్రసాద్ ఉండగా మాకు వేరే కోచ్-మేనేజరు అక్కరలేదండీ, రానివ్వడండీ :)

    రిప్లయితొలగించండి
  3. జేబీ గారు మీరు కనబడలేదని మీ బ్లాగ్ వైపు చూడలేదు...సడన్ గా రెండు మూడు పోస్టులు చదవనివి కనిపించేసాయి...క్యాచ్ అప్ చేస్తున్నా..చేస్తున్నా...బాఫుందండీ...మీ ఆట..

    రిప్లయితొలగించండి
  4. @Ennela గారు: ఇప్పటికైనా గుర్తుకువచ్చి దర్శించినందుకు ధన్యుడను. నేనూ చాలాబ్లాగులు చదవాలండి.

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in