1, మే 2023, సోమవారం

కార్మిక దినం - లేబర్ వెల్ఫేర్

 గుంటూరులో మా ఇంటికి కూతవేటు దూరంలో ఉన్నది, ఉండేది ఈ లేబర్ వెల్ఫేర్ ఆఫీసు.

ప్రభుత్వ ఆఫీసు కాబట్టి పొద్దున్న పదకొండు అయినా తెరిచేవారు కాదు, సాయంత్రం మూడున్నర, నాలుగుకు ఖాళీ అయిపోయేది. మిగతా సమయం మేము క్రికెట్ ఆడుకునేవారము. కొందరు పెద్దవాళ్ళు కర్రా గిల్లి ఆడేవారు. ఎండా కాలం సెలవులలో ఒకేసారి నాలుగైదు మ్యాచులు జరిగేవి. సోడా బండ్లు, ఐస్క్రీం బండ్లు ఈ కుడివైపు చెట్టు కింద ఉండేవి.

ఏప్రిల్ చివరికి మా పరీక్షలు అయిపోయే సమయానికి ఇక్కడ కార్మికులకు పోటీలు మొదలయ్యేవి. వాలీబాల్, కబడ్డీ, టెన్నికాయిట్ (రింగ్), బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్ - అన్నీ ఖర్చు తక్కువ ఆటలు.

మాచర్ల కేసీపీ సిమెంట్, నెల్లూరు నిప్పో బ్యాటరీలు, గుంటూరు ఐటీసీ - ఇలా మూడు జిల్లాల కార్మికులు వచ్చేవారు. ఇరవై నుండి అరవై దాకా అన్ని వయసుల వారు మంచి కసితో పోటాపోటీగా ఆడేవారు, గుంటూరు ఎండలు మండుతున్నా. మేడే కు బహుమతులు ఇచ్చేవారు.

మాకు మంచి టైంపాస్. పొద్దున్నే ఎనిమిది నుండి సాయంత్రం ఏడున్నర దాకా అక్కడే వేలాడేవారం. వాళ్ళకు చప్పట్లు కొట్టి, బాల్స్ అందించి, తర్వాతి వాలీబాల్ గేమ్ ఆడాల్సినవారు లోపల చెస్ ఆడుతుంటే వెళ్లి చెప్పి పిలుచుకుని రావడం, ఇలా వాళ్ల వెనక తిరిగేవారము. వాళ్ళూ మాతో సరదాగా ఉండేవారు.

ఒక కొత్త సైకిల్ కొన్న ఎండాకాలం నేను తెచ్చాననుకుని, అన్నయ్య, వాడు తెచ్చడానుకుని నేను అక్కడే మర్చిపోయాం. రాత్రికి గేటు తాళం వేసేటపుడు లోపల పెడదామని చూస్తే సైకిల్ లేదు. రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లారగానే పొద్దున ఆరింటికి ఆ ఆఫీసు ఇంచార్జ్ ఇంటికి పరిగెత్తాము, దగ్గరే - పాపం మంచాయన రాత్రి ఆఫీస్ లోపల పెట్టించాడు అట. రోజూ చూసే మొహాలే కాబట్టి తిరిగి ఇచ్చేశాడు. 30ఏళ్ల తర్వాత ఇవాళ పొద్దున కూడా మా వాడిని ముందు కడ్డిపై కూర్చోపెట్టుకుని ఈ సైకిల్ తొక్కుతుంటే పైన వ్రాసినది అంతా గుర్తుకు వచ్చింది.

వెళ్లి చూస్తే ఆఫీస్ ఫోటోలో చూపించినట్లు శిథిలావస్థకు చేరింది. పిచ్చి చెట్లు పెరిగి దారి కూడా లేదు, పిల్లలు ఆడుకునే గ్రౌండ్లా లేదు. ఇక కార్మికుల పోటీలు ఏమీ జరుగుతాయి.

రిక్షా యూనియన్లు, ఆటో యూనియన్లు పొద్దున్నే ఆర్ నారాయణమూర్తి పాటలు పెట్టి వీధి వీధికి జెండాలు ఎగరేసేవారు. ఇపుడు బయట ఏ సందడి లేదు. పొద్దున్నే షాపులు అన్నీ తెరచి ఉన్నాయి.

ఐటీ కూలీలు, వైట్ కాలరు వర్కర్లం ఇంకో లాంగ్ వీకెండ్ తీసుకుని ట్రిప్పులు వేసుకుంటున్నాము. 

#కార్మికదినోత్సవం #mayday #మేడే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in