అన్నింట్లో ఉన్నట్టే సంగీత వాయిద్యాలలోనూ 'చేతివాటం' ఉంటుంది. ఎడమ చేతి గిటారు ఎక్కువమందికి తెలిసిందే - మామూలుగా గిటారు ప్లక్కరు కుడిచేత్తో పట్టుకుని ఎడమ చేత్తో తీగల ట్యాబ్స్ ప్లే చేస్తారు - ఎడమ చేతి గిటారును ప్లక్కరు ఎడమ చేతిలో ఉంటుంది. అలాగే వయోలిన్ సాధారణముగా ఎడమ వైపు పట్టుకుని ఎడమ చేతివేళ్లతో తీగలపై స్వరాలు మీటుతారు, కుడిచేత్తో బో తిప్పుతూ. ఎడమ చేతి వయోలిన్లో తీగలను రివర్సు చేస్తారు, కుడి చేత్తో మీటుతూ ఎడమ చేతిలో బో తిప్పుతారు.
అయితే ఫూట్ (వేణువు) లో ఇలా కుడి - ఎడమ భేదం ఉండదనుకుంటారు, సింపుల్ వాయిద్యము కదా అని.
కానీ ఫ్లూటు కూడ కుడి చేతివాటం వారు కుడివైపుకి తిప్పి ఊదుతే, ఎడమ చేతివారి సహజ తీరు ఎడమ వైపు తిప్పి. కావాలంటే కృష్ణుడి (వేణుగోపాలుడి) చిత్రాలు, విగ్రహాలలో కుడివైపే పట్టుకున్నట్టు ఉంటాయి. ..చిత్రము 1..
ఒక మిత్రుని సోషల్ మీడియా పోస్టులో ప్రముఖ విద్వాంసులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియాగారి చిత్రము పెట్టినపుడు - ఆయనకీ ఎడమ చేతివాటం వ్యక్తులకీ సంబంధం తెలుసా అని అడిగాను. అదేంటంటే చౌరాసియా గారు కూడా వేణువు ఎడమ వైపు పెట్టుకుని వాయిస్తారు. వారి కౌమార దశలో ముంబయిలో వారి గురువు అన్నపూర్ణదేవి గారిపై గౌరవముతో కుడి నుండి ఎడమ గ్రిప్పుకు మారారు. ఈ విషయముపై కొంత సమాచారం సేకరిద్దామని అంతర్జాలములో వెతుకుతుంటే ఇంకా చాలామంది హిందుస్తానీ వేణువిద్వాంసులు ఇలా ఎడమ చేత్తోనే నేర్చుకుంటున్నారని (గురు పరంపరలో ఇది అలవాటుగా/సంప్రదాయముగా మారినట్టుంది). ..చిత్రము 2.. ఇది ఆసక్తికరముగా ఆశ్చర్యముగా అనిపించింది.
కుడి - ఎడమ ఫ్లూట్లకు చిల్లుల మధ్యన దూరం భిన్నముగా ఉంటుంది. అలాగే కుడి చేతివాటం వారు ఎడమవైపు పట్టుకున్నపుడు చిటికెన వేళ్లతో చివరి చిల్లులను పట్టుకోవడం కష్టంగా ఉండచ్చు.