12, జులై 2026, ఆదివారం

సింగ్ - గీతం

సింగ్ - గీతం

సింగీతం గారు నా అభిమాన దర్శకులలో ఒకరు. నేను తెలుగు కోరాలో "విలక్షణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారికి రావాల్సిన పేరు రాలేదు. ఎందుకు?అనే ప్రశ్నకు వ్రాసిన జవాబు కోరా ఎడ్మిన్ మిత్రులు పవన్ సంతోష్ గారి ద్వారా వారి దాకా చేరింది కూడా.

అయినా 2000లలో విజయం. ముంబయి ఎక్స్ ప్రెస్ చూసిన తరువాత ఆయన పనితనానికి కూడా ఆఖరి రోజుల్లోని జంధ్యాల, బాపు, విశ్వనాథ్ ల్లాగా కొంత ఎక్స్పైైరీ వచ్చిందనిపించింది. 2013లో వచ్చిన వెల్కమ్ ఒబామా రీమేక్ అనేసరికి ఆసక్తి కలగలేదు - టీవీలో చూస్తే మరింత నిరాశ కలిగించింది.

అందుకని సింగ్ గీతం సినిమా ట్రైలర్లు, పాటలూ ఆసక్తి కలిగించినా ధైర్యము కలగలేదు. పోయినేడాది కమల్ నిర్వహించిన అపూర్వ సింగీతం కార్యక్రమంలో స్టేజిపైనే ఎ ఆర్ రహమాన్ కి కూడా ఈ కథలైను చెప్పి ఆయనకే ఆశ్చర్యము, ఆసక్తి కలిగించారు. కానీ తెలుగు నేటివిటికీ దేవిశ్రీనే సరైన నిర్ణయమని పాటలు చూసి నేను అనుకున్నాను.

సరే ఏదైతే అదైందని థియేటరుకు పోదామనుకున్నాను. పిల్లలకు మాల్ ఆశపెట్టి తీసుకుపోయా. ఎక్కడ తిట్టుకుంటారో, ముఖ్యముగా చిన్నోడు అని ఒక భయం.

మొదటి పావుగంట నిదానముగా గడిచినా తర్వాత కొంత వేగం పుంజుకుంది. పిల్లలూ నవ్వడం మొదలుపెట్టారు. ఇంటర్వెల్ బ్రేకులో ఎనిమిదేళ్ల మావాడు మాటలు పాటలుగా పాడడము మొదలెట్టాడు - వీడే కాదు థియేటరులో ఇంకొందరు పిల్లలు.

పదిలోపు ఉన్న పిల్లాడికీ, టీనేజిలో ఉన్న పిల్లకీ, నలబైల్లో ఉన్నా మాకూ నచ్చేటట్టు ఒక 90 ఏళ్ల దర్శకుడు సినిమా తీశాడంటే అది ఆయన పనితనమే.

మొత్తం గీతమంటే రెండో హాఫ్ సాగతీత అవుతుందేమో అనుకున్నా గానీ, బాగానే టైటుగా లాగారు.

క్లైమాక్సు కన్విన్సింగుగా మిదాస్ టచ్ (pun intended) ఇచ్చారు.

ఇవాళ కూడా పిల్లలు ఒటీటీలో ఈ సినిమా పెట్టమని గొడవచేశారు.

సినిమా కథ విషయానికి వస్తే జంబలకిడి పంబ, మాలామాల్ వీక్లీ (భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా) లలాగా ఒక రూరల్ ఫ్యాంటసీ కామెడీ అనుకుని లాజిక్ పక్కనపెట్టి చూడాలి. అలా చూడాలి అంటే స్క్రీన్ ప్లే, డైలాగులూ - అదే ఈ సినిమాలో పాటలకు ట్లూన్లుకూడా సరిగ్గా కుదరాలి. నాకైతే ఎక్కునా తక్కువా కాకుండా సరిపోను ఉన్నాయి అనిపించింది.

అన్ని పాత్రలు ఉన్నప్పుడు కొన్ని పాత్రలు నిర్లక్ష్యం కావడం ఈ మధ్యన చాలా సినిమాలలో చూస్తున్నాము. కానీ ఈ సినిమాలో అన్ని పాత్రలకూ ప్రాధాన్యత ఉన్నదీ, చివరి దాకా మిస్ అవ్వకుండా ఉంటాయి.

కొన్ని కొన్ని లోట్లు ఉన్నా - సమయాభావం, దర్శకుడు - ఎగ్జిక్యూటివ్ దర్శకుడు నాగ్ అశ్విన్ మధ్యన ఆపరేషనల్ కన్స్ట్రయింట్సు వలన దొర్లి ఉండచ్చూ, అంత పట్టించుకోవక్కర్లేదు. ఈ ఏడాది నేను చూసిన పెద్దిలాంటి కొన్ని భారీ బడ్జట్ సినిమాలలోనే బోలెడు తప్పులు ఉన్నాయి.

ఫామ్ లోలేని క్రికేటరు ఆఖరి సిరీసులో మెరిసినట్టు (ఇంగ్లాండు 2011లో ద్రవిడ్) సింగీతం గారు మళ్లీ ఆయన స్థాయికి తగ్గ ఓ సినిమా లాస్ట్ స్వాన్ సాంగులా తీసినందుకు, అందించినందుక నాకైతే సంతృప్తిగా అనిపించింది. ఆయన కల నెరవేర్చిన నాగ్ అశ్విన్ (చాలా మందికి మహానటితో తెలిస్తే నాకు ఎవడే సుబ్రహ్మణ్యం నుండీ ఇతను ఇష్టం) కూడా ధన్యుడు, మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి.



చివరిగా - ఆ చివరికి మిగిలిన చెట్టు, ఎడారిలాంటి ప్రదేశమూ, గనీ - కాంప్లెక్స్, ఆ పిల్లలూ - నాకెందుకో కల్కి వైబ్స్ వచ్చాయి. సింగీతంగారు బహుశా మహాభారతమే కాకుండా మొత్తం కథలో కాంట్రిబ్యూట్ చేశారేమో అనిపిస్తుంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in