29, సెప్టెంబర్ 2024, ఆదివారం

సుందోపసుందులు - కొట్టులో ఒక సాయంత్రము (మా ప్రాజక్టు రిపోర్టు కష్టాలు)

సగం 2011 లో వ్రాసి, ఇవాళ పూర్తి చేసిన పోస్టు ----

ఐదు నెల్లక్రితం పెద్ద బజారులో ఒక ఫేమస్ కంగన్ హాల్ కొట్టులోకి అడుగుపెట్టాను. ఈ మధ్యన పెళ్ళిళ్ళ పనులతో (నావి కాదు, అన్నయ్యది, మిత్రులవి, కజిన్స్‌వి) ఈ కొట్టుకి తెగ తిరుగుతున్నా. గుంటూరులో పెళ్ళికి కావల్సిన అన్ని వస్తువులు దొరికే పట్నంబజారు-లాలాపేటల్లో ప్రసిద్ధిపొందినది ఈ కొట్టు. ఇప్పుడంటే మాల్స్ వచ్చాయిగానీ, పెళ్ళి వస్తువులేకాదు, పిన్నీసునుండి చాపలుదాకా ఆ కొట్టులో దొరకనిదంటూ లేదు. సరే విషయానికొస్తా.

అలా ఆ కొట్టులో అడుపెట్టగానే అక్కడి సూపర్‌వైజర్ నన్ను చూసి నవ్వాడు. నన్ను గుర్తుపట్టాడా? మనం ఈ కొట్టుకొచ్చి ఎనిమిదేళ్ళైపోయిందికదాని సందేహమొచ్చింది. అం గుబులు ఎందుకయ్యా అంటే కొన్నేళ్ళు వెనక్కిపోవాలి.

******

అవి ఇంజినీరింగు చివరి సంవత్సరం (2003). మాకేమో హైదరాబాదో, విజయవాడో వెళ్ళి ఏదొక ప్రాజెక్టు కొట్టుకొచ్చి (కొని), అక్కడే రిపోర్ట్లు కొట్టేయించుకు రావడం ఇష్టంలేదు. నాలుగు నెలలు కష్టపడి ప్రాజెక్టు ఏదో చేశాం అనిపించాం. ఇపుడు మా శ్రమని ఒక పుస్తకంగా (ప్రాజక్టు రిపోర్టు) అచ్చేయించి మా హెచ్..డీ. (ఆవిడకి అంట సీనులేదు, గానీ ప్రాజెక్టుకోసం పిలవకతప్పదు) మొహాన కొట్టడమనే బృహత్కార్యం మిగిలింది.

మాదే మా కళాశాలలో మొదటి బ్యాచ్ కాబట్టి, అప్పట్లో జిల్లాకి నాలుగైదు కాలేజీలు తప్ప ఇప్పటిలా కుప్పలు తెప్పలు లేవుగాబట్టి మాకు ఈవిషయంలో మార్గదర్శనం చేసేవాళ్ళు కనపడలే. మా లెక్చరర్ల్నడగాలంటే వాళ్ళకి ఈ వివరాలు పెద్దాగా తెలీదని అర్థమైపోయింది. అంతా తమిళనాడు, కర్ణాటకల్లో ఏదోకటి చేసొచ్చినోళ్ళు, లేడా హైదరాబాదులో కొనుక్కొచ్చినవాళ్ళు.

సరేనని గుంటూర్లో ఉన్న నేనూ, విజయ్ (పేరు మార్చాను) స్వయంకృషి మొదలుపెట్టాం. మేమిద్దరం రెండు వేరువేరు ప్రాజక్టు బ్యాచీలకి నాయకులం. నలుగురు విద్యార్థులను ఒక బ్యాచీ చేస్తారు. ఇక రంగంలో దిగి వివరాలు కనుక్కుంటే మొత్తం (టైపు చేయడం, ప్రింటు తీయడం, బట్టర్ పేపరుతో మంచి బైడు చేయించడం) కలిపి టోకున చేసేవాళ్ళు దొరికారుగానీ కొంచెం ఎక్కువడిగారనిపించింది. ఛీఛీ - కంపు.సైన్సు విద్యార్థులమై ఆ మాత్రం చేసుకోలేమానిపించింది.

పక్క ఇంజినీరింగు కాలేజి లైబ్రరీ (గ్రంథాలయం)లోకి ఒక రోజు దూరి అక్కడి పాత బ్యాచోళ్ళ రిపోర్ట్లు చూసి, వాటికి మా సొంత పైత్యం జోడించి రిపోర్టు ఎలా ఉండాలనేది నిర్ణయించాం. అదేంటంటే మేమే కంటెంట్ ప్లానింగు, ఫాంట్ల సెలక్షన్లతో సహా టైపు చేసుకుని, మామూలు పుస్తకంలా బైండు చేయించి, అట్ట పైన ఒక డిజైను పేపరు (శుభలేఖలు అచ్చేసేవిలాంటివి) బంగారు (రంగుమాత్రమే🙂) అక్షరాలతో వేయంచి ఒక కవరు తొడగడం.

మేమీ వెతకడాలు, ప్రాజక్టు పనులన్నీ పూర్తి చేసేసరికి రిపోర్ట్లు కాలేజీలో ఇవ్వలిన గడువుకి రెండు రోజులు మాత్రమే మిగిలింది.

మొదటిరోజు పైఅట్టకి కావల్సిన డిజైన్ కాగితంకోసం కొట్టుకి పోయాం. దేని కోసమని అడీగాడు. మా దగ్గరున్న పాత రిపోర్టు (బట్టరు పేపరు కవరు) చూపించి మా ప్లాను చెప్పాం.

"అరే, ఇవన్నీ ఎందుకండి, మేమే మొత్తం రిపోర్టు చేసిస్తామండి" అన్నాడు. (గోడౌను కథ – వాళ్ళంతవరకూ చేయలేదు, మేమే మొదట).

"అలా కాదులేండీ, మాకు తెలుసు, మేము చేసుకుంటాము, మీరు డిజైను కాగితం ఇస్తే చాలు" అన్నాము.

అలాక్కాదు, మీకు ఇక్కడ ఎవ్వరూ గోల్డులో ప్రింటు చేయరు, కంప్యూటరు ప్రింటింగులో మీకు ఎంబాసింగు రాదు, మాకు ప్రింటింగు ఉన్నది, మేము చేయిస్తాము అన్నారు. అలాగే మాక్కావలసిన డిజైనులో పేపరు కూడా దొరకలేదు, రేపు రండి ఇస్తాము అన్నారు. మేము బుట్టలో పడ్డాము.

ఒక రోజంతా (రాత్రికూడా) కూర్చొని ఎవరింట్లో వారి రెపోర్ట్లను వాళ్ళము టైపు చేసికొన్నాం.

*** గడువు ముందురోజు ***-

ఒక ఫ్లాపీలొ /* అంటే ఏంటని అడగమాకండి :-) */ ప్రాజక్టు వర్డు డాక్యుమెంటును పెట్టుకొని లాలాపేటలో శుభలేఖలు బల్కు-ప్రింటింగు చేసేవాళ్ళ దగ్గరికి పోయాం.

సాయంత్రము రండి అయిపోతుంది అన్నారు.

సాయంత్రము నాలుగింటికి ప్రెస్సుకు వెళ్లాము. అప్పట్లో మాకు బైకులేమీ లేవు. పనుంది అంటే గుంటూరు అంతా, ఇటు ఆటోనగరు నుండి అటు ఏటీ అగ్రహారము, పైన సంగడిగుంట నుండి కింద గుజ్జనగుండ్ల దాకా సైకిళ్ళపైనే తిరిగేవారము.

తెలిసిందే కదా, మనం పక్కనుంటేగానీ పనిచేయరు. అందులో కాలేజీ కుర్రాళ్ళము, లోకువ. సరే పక్కనుండి, గొడవపెట్టుకుని మొత్తాని ఇంకో గంటలో ప్రింటింగు అయ్యింది. ఆ ప్రింటవుట్లు పట్టుకుని బైండింగు షాపులో ఇచ్చి, కొంగు కొట్టుకు పోయాము.

మీవి ప్రింటింగు అవుతుంది, ఇంకో గంటలో వస్తాయి అన్నాడు. మేము మళ్లీ ఎక్కడికి పోతాము, ఇక్కడే ఉంటాము అన్నాము.

గంటయినా కవరు పేజీలు రావే. షాపువాడేమో మీరిక్కడ అడ్డముగా ఉన్నారు, మా బిజినేసుకు అడ్డము అంటాడు. మేమేమో రేప్పొద్దున ప్రాజక్టు రిపోర్టు సబ్మిటు చేయాలి. మీరిస్తే మేము ఇంకా బైండింగు చేయించుకోవాలి. మాకు వేరే పనేమీలేదు, మీరిస్తే పోతాము అంటాము.

ఈలోపు ఏదో సరుకు వస్తే లోపల పెట్టడానికి సాయం చేశాము.🥴

ఏడున్నరయ్యింది. ఇలాకాదు, మీ ప్రింటింగు ప్రెస్సు ఎక్కడో చెప్పండి, మేము పోతాము అని చెప్పాము. ఈలోపు పొద్దుననగా పోయి ఇంకా ఇంటికి రాలేదు అని వెతుక్కుంటూ బెస్ట్ ఫ్రెండ్ అంజి కొట్టుకి వచ్చాడు (సెల్ఫోన్లు లేని రోజులు).

కాసేపు నసిగాక అడ్రసు చెప్పాడు, ఎక్కడో సంగడిగుంటలో ఏదో లైనులో.

విజయ్ ను షాపులో పెట్టి నేనూ, అంజి ప్రింటింగు ప్రెస్సుకు సైకిళ్ళేసుకుని పోయాము. అప్పట్లో అది ఊరి బయటే. వీథిలైట్లులేని, కుక్కలు తిరుగుతున్న భయానక కాలనీ. వెతుక్కుంటూ, ఆ ప్రెస్సుకు పోయాము. పోయి చూస్తే అప్పటికి మా పని ఇంకా మొదలుపెట్టలేదు. మాకన్నాముందు వేరేవి ఉన్నాయి అంటాడు. ముందు బ్రతిమలాడాము, తర్వాత వాదించాము, ఆ తర్వాత బెదిరించాము. నువ్వు ఇవ్వనిది, నువ్వు కదలవూ, మేము కదలము అన్నాము.

ఇలా కాదని ఆ ప్లెస్సునుండీ షాపు ల్యాండులైనుకి ఫోను చేయించి, మావాడికి విషయం చెప్పాము. వాడు కొట్టు శేటు చేత చెప్పించాడు. చివరికి పని మొదలుపెట్టించి (స్క్రీను ప్రింటింగు పెద్ద పని - ముందు అక్షరాలు స్టెన్సిలుతో వరసపెట్టుకుని, లోగోతో సహా ఒక టెంప్లేటు చేసి, ప్రింటు తీయాలి, అందులో ఒక్కో ప్రింటుపైన ఒక్కో టీంమేటు పేరుండాలి) చేయించేసరికి తొమ్మిది దాటింది.

ఈలోపు కొట్టులో మా విజయికి ఇంకో టైపు అనుభవాలు. ఆ గుమాస్తా మావాడిని ఇంజనీరింగు స్టూడెంటు అని బిల్లింగు దగ్గర టోటల్స్ లెక్క కట్టడానికి కాసేపు వాడుకున్నాడు. ఇంకాసేపు ఫ్యాన్సీ వస్తువులు అమ్మే కౌంటరులో కూర్చోబెట్టి టిఫిను, టీకి పోయాడు.

అలా తొమ్మిదిన్నరకు వచ్చి ప్రింటింగు చేసిన డిజైను కవర్లు చూపించాము. ఆ షాపు ఓనరు ఆశ్చర్యపోయాడు - కళ్లల్లో కొత్త బిజినెసు ఐడియా కనిపించింది - మరి అన్నీ వాళ్ల చేతుల్లో ఉన్నవే - డిజైను పేపరు, ప్రింటింగు, కవర్లు, అన్నీ.

ఆ తొమ్మిదిన్నరకు అవన్నీ పట్టుకుని బైండింగు షాపుకు పోయాము. మావి బైండింగు ఇంకా అవ్వలేదు. అక్కడే పదిదాకా కూర్చుని, అయ్యాక, వాటికి కవరు పేజీలు అంటించి, ఇంటికి తీసుకపోయాము. ఆరబెట్టి, పొద్దున్నే లేచి, వాటిని మళ్ళీ ఇంకో బైండింగు షాపులో కట్ చేయించి, కవర్లు తొడిగి మధ్యాహ్నానికి కాలేజికి పోయి సబ్మిట్ చేశాము.

అలా ఆ షాపువాడికి మేమిద్దరం బాగా నోటు అయ్యామన్నమాట. తిరిగి ప్రస్తుతానికి, అంటే 2011లో పోయినపుడు, ఓనరు గుర్తు పట్టలేదుగానీ, గుమాస్తా బాగా గుర్తుపట్టాడు. దేజావూ...😁😁😁


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in