ఆర్టీసీ డ్రైవర్స్ డే సందర్భముగా
పిల్లలలో ఎక్కువ శాతం మందికి బస్సులు, రైళ్లు అంటే ఒక ఫాసినేషన్ ఉండటం సాధారణమే. నాకు కూడా.
డ్రైవరు గేరు రాడు మారుస్తుంటే, స్టీరింగు తిప్పుతుంటే ఆరాధనగా చూడటం, కండక్టరు చేతిలోనే, ఒక మెటల్ ర్యాక్కో పెట్టుకున్న రంగు రంగుల టికెట్లు పంచు చేసి, లేదా చేతితో చించి ఇస్తే (మిలెనియల్స్కు టిమ్స్ మెషిన్లు తెలుసు) వాటిని దాచిపెట్టుకోవడం - సెలవుల్లో బస్సాట ఆడేటపుడు మడత కుర్చీలో తిరిగి కూర్చుని స్టీరింగులా ఊహించుకుంటూ హవాయి చెప్పులు తిరగదిప్పి బ్రేక్ యాక్సిలరేటరు లాగా తొక్కడము, దాచిపెట్టుకున్నటికెట్లను పెన్నుతో గుచ్చి ఇవ్వడము - అబ్బో అదో నోస్టాల్జియా.
ఉద్యోగములో చేరాక హైదరాబాదు నుండి గుంటూరుకు తరచుగా వెళ్లేవాడిన దాదాపు ప్రతి వారము వెళ్లిన రోజులున్నాయి. శుక్రవారము రాత్రి గుంటూరుకు, ఆదివారము రాత్రికి రిటర్ను.
నాకు ప్రయాణాలలో నిద్ర పట్టదు. అందుకని బస్సు అర్థరాత్రి టీ కోసం ఆపినప్పుడు దిగుతాను. డ్రైవరుతో సంభాషిస్తూ ఉంటాను. వారు చాలా సంతొషిస్తారు. ఎందుకంటే వారు నాలుగైదు రాత్రులు వరసగా డ్రైవింగు చేసి, రెండు రోజులు ఆఫ్ తీసుకుంటారట. హైదరాబాదు వస్తే భెల్ లోనో, కూకట్పల్లిలోనో బస్సు పెట్టి అక్కడే పడుకుంటారు. మియాపూర్ డిపో అయితే మటుకు పడుకోవడానికి మంచాలు ఉంటాయట. విజయవాడ, గుంటూరు బస్టాండులు అయితే డార్మిటరీలు ఉంటాయి. ఆ నాలుగు రోజులు వాళ్లే వండుకుంటారు. మీరు చూస్తే డ్రైవరు వెనక క్యాబినులో వారి బ్యాగు ఉంటుంది. ఆ డ్యూటీ రోజులు వారితో మాట్లాడేవారు కూడా ఉండరు. ఇపుడంటే వాట్సాపులు, అన్లిమిటెడ్ కాలింగు ఉన్నాయి, నేను చెప్పేది ఆరేడేళ్ల కిందటి వరకు. అందుకని మనం పలకరిస్తే ఎక్కువమంది సంతోషిస్తారు. వారు కూడా ఒంటరిగా ఫీలవరు.
ఒకసారి రామోజీ ఫిల్మ సిటీ దాటాక పెద్ద జామ్ అయ్యి అక్కడే రెండు గంటలు ఇరుక్కుపోయాము. నేను ఒక అరగంట తరువాత వెనక సీటు నుండి క్యాబినుకు పోయి డ్రైవరుగారితో ముచ్చట పెట్చాను. మామూలుగయితే రెండు, రెండున్నరకి మిర్యాలగూడ చేరి టీ తాగాలి. కానీ అక్కడే ఫస్టు గేరులో నడపడము వలన డ్రైవరుకి నిద్ర వచ్చేసింది. ట్రాఫిక్ నుండి బయటపడ్డాక నార్కెట్ పల్లిలోనే ఆపేయించి టీ తాపించాను. ఆయన చాలా సంతోషించాడు.
వారికి ఉండే ఇంకో తలనెప్పి డ్రైవింగు చేస్తూనే రిజర్వేషను టిక్ కొట్టుకోవడమూ, ఎస్ఎమ్మెస్లు చూడడము, ట్రాఫిక్ జామ్ అయితే వచ్చే ఫోన్ల వరదను డ్రైవింగు చేస్తూనే ఎత్తి వారిని కన్విన్సు చేయడం, ఎవరన్నా టైముకు రాకపోతే వారికి చేస్తూ, ట్రాఫిక్ పోలీసుతో తిట్లు తింటూ - వెనక సీట్లో కూర్చుని రాని టీవీ గురించి తిట్టుకునేవారికి తెలియదు.
ఇక విజయవాడ – నెల్లూరు లైన్లో తిరిగే కండక్టరు లెస్ సర్వీసులు పెట్టాక డ్రైవర్ల కష్టాలు మామూలు కావు. ఒక చేత్తో స్టీరింగు తిప్పుతూ, ఇచ్చిన ఛార్జీ లెక్కపెట్టాలి, టిమ్స్లో టికెట్ కొట్టాలి, వారధి/బైపాస్ లాంటి చోట్ల ముందే దిగేవారికి చిల్లర లెక్క తీర్చాలి.
అస్సలు ఆర్టీసితో నా అనుబంధం కాలేజి రోజులది.
90ల చివర్లో నేను చేరిన ఇంజనీరింగు కాలేజి గుంటూరుకు నలభై కిమీ దూరములో మద్రాసు హైవేపై ఉండేది. చిలకలూరిపేట ఆర్డినరీ ఎర్ర బస్సులు (ఇపుడు పల్లెవెలుగు) తో పాటు నెల్లూరు, తిరుపతి పోయే ఎక్సప్రెస్లు కూడా ఎక్కేవారము.
ఒక ఆరు నెలల తరువాత కాలేజి బస్సు వేశారు - ఒక రెండు నెలలు పోయాక మళ్లీ ఆర్టీసికి మారిపోయాము. స్టూడెంట్ పాస్ తీసకుని ఎక్కువ శాతం ఎర్ర బస్సుకే పోయేవారం. ఎపుడన్నా అవసరమైతే ఎక్సప్రెస్లు ఎక్కేవారము.
అలా నాలుగేళ్లు తిరగడముతో చిలకలూరిపేట డిపో డ్రైవర్లు, కండక్టర్లు కొందరు బాగా పరిచయమయ్యారు. పలకరించేవారు. ఇంజనీరింగు కెరీరు గురించి అడిగేవారు. చివరి రో సీట్లలో కూర్చుని అంత్యాక్షరి లాంటివి ఆడుతుంటే ఎవరన్నా గొడవని కంప్లయింటు చేస్తే నవ్వి కుర్రాళ్లు కదా వదిలేయండి అనేవారు. మేము కాలేజీ నుండి హైవే పై స్టాపుకు పరిగెట్టడము చూస్తే బస్ ఆపేవారు, స్టాప్ లేకున్నా.
బస్ పాస్ 35 కిమీర్లకే ఇచ్చేవారు. అందుకని మిగతా 6 కిమీలకు ₹4 ల టికెట్ తీసుకునేవారం. నేను రూపాయి తగ్గుతుంది అని క్యాట్ కార్డు కూడా తీసుకున్నా 🙂 అయితే ఈ టికెెట్ కాలేజి దగ్గర ఎక్కగానే ఇవ్వరు - ఆ ఊరి స్టాపు వచ్చినపుడు కండక్టరుకు డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. ఒక్కోసారి బస్సు రష్ ఉన్నప్పుడు, ముందున్న కండక్టరు దగ్గరకు పోవడానికి కుదరదు. అందుకని మధ్యలో వారి ద్వారా ఇచ్చేవారం, లేదా ఎక్కేటపుడే డబ్బులు ఇచ్చేసేవారము, లేదా పంచ్ చేసి వారి దగ్గర పెట్టుకుంటే దిగేటపుడు ఇచ్చేవారం. ఒక్కోసారి మేము నిద్రపోతే, వాళ్ళే వెనక్కి వచ్చి పలకరించి పంచ్ చేసి వెళ్లేవారు.
మా సబ్ - జూనియర్ల నుండి ఎక్కువ కాలేజి బస్సులలోనే వెళ్లేవారు. అందుకని మా బ్యాచే ఎక్కువ అనుబంధం వారికి.
నా దగ్గర నాలుగేళ్ళ టికెట్ కట్ట ఉండేది. చాలా ఏళ్లు దాచాను, ఒక కజిన్ పిల్ల అడిగితే ఇచ్చేశాను. లేకుంటే ఇప్పటి టిమ్స్ రోజుల్లో nostalgic గా ఉండేది.
నేను అమెరికాలో ఆఫీసుకు బస్సులోనే వెళ్లేవాడిని. అక్కడ డ్రైవరుకి బాగా గౌరవము ఇస్తారు. వారు మనం ఎక్కగానే విష్ చేస్తారు. అక్కడా నేను రెగ్యులరుగా ఎక్కే రూట్ డ్రైవర్లతో చక్కటి రిలేషన్ ఉండేది.
పెళ్లయ్యాక మా శ్రీమతి వైపు దగ్గరి చుట్టాలు ఆర్టీసిలో కంట్రోలరు, డ్రైవర్లు. అందుకని ఇంకా ఆర్టీసితో నా అనుబంధం పెరిగింది. వారి కష్టాలు, ఇబ్బందులు ఇంకా దగ్గర నుండి తెలుసుకున్నాను.
అందుకని సాధ్యమైనంతవరకూ నేను ప్రైవేటు బస్సులకన్నా ఆర్టీసిలోనే ప్రయాణిస్తాను వారితో సంభాషించడమూ, సమయాని కన్నా ముందరే నా స్టాపు దగ్గర నించోవడం చేస్తుంటాను. వారి మైండు ప్రశాంతముగా ఉంచితే వారు మనల్ని గమ్యస్థానానికి చేరుస్తారు.
రాత్రంతా నిద్రపోకుండా మనం పదింటికి బస్సు ఎక్కి పడుకుంటే, తెల్లారాసేరికి మన ఊర్లో దించేవారే డ్రైవర్లు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.
ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in