10, మే 2020, ఆదివారం

గుంటూరు-తిరుపతి-గుంటూరు :ఒక 27 గంటల జర్నీ

గుంటూరు-తిరుపతి-గుంటూరు :ఒక 27 గంటల జర్నీ

ఇది టూర్ (పర్యటన - విహారం) అని అనను, ఒక ప్రయాణం మాత్రమే - ఎందుకంటే సింగడు పోనూ పోయాడు - రానూ వచ్చాడూ అన్నట్లు 30 గంటలలో గుంటూరు నుండి తిరుపతి వెళ్ళడమూ జరిగింది, తిరిగి రావడమూ అయ్యింది - అయినా తిరుపతికి వెళ్ళి తిరుమల వెళ్ళనివాడు, తిరుమల వెళ్ళి దర్శనం చేస్కోకుండా వెనక్కి వచ్చినవాడు ఎవరైనా అంటే, అది నేనే! అది నేను రెండుసార్లు చేశాను
***
అవి నేను ఈ సహస్రం మొదట్లో గుంటూరులో ఇంజనీరింగు వెలగబెడుతున్న రోజులు. మా అన్నయ తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివేవాడు.
ఒకరోజు పొద్దున్నే మా ల్యాండ్లైనుకి ఫోను చేశాడు. అప్పటికి సెల్ఫోన్లు అంత ప్రాచుర్యంలో లేవు - మొత్తం తరగతిలో ఒక్క విద్యార్ఠి దగ్గర ఉండేదేమో.
"నాన్నా! మా కాలేజీ తరపున అంతర్ విశ్వవిద్యాలయ పోటిలకి నన్ను ఎంపిక చేశారు. రేపు పొద్దున్నే 4 గంటలకి రేణిగుంటలో రైలు ఎక్కాలి. నాకు X వేలు డబ్బులు కావాలి. మావాళ్ళని అడిగా. ఎవరు సర్దలేదు. "
ఆయనకి నాన్న ఆ రోజుల్లోనే ఏటియం కార్డు ఇచ్చారు - కానీ అన్న అందులో సరిపోను డబ్బులు మెయింటైన్ చెయ్యట్లేదు.
అవి గూగుల్ పే, ఐఎంపిఎస్ కాదుగదా RTGS, వెస్ట్రన్ యూనియన్ పూర్తిగా రాని రోజులు. నాకు వెంటనే డబ్బులు ఇచ్చి పోస్టాఫీసుకి పంపించారు. వారు ఎక్స్ప్రెస్ మనీ ఆర్డర్ అయినా 24 గంటలు పడుతుంది అని చెప్పారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి నాన్న అప్పటికే బ్యాంకుకుకి వెళ్ళారు. ఆయనకి ఫోను చేసి చెప్పాను. నన్ను వెంటనే తిరుపతికి బయలుదేరమన్నారు. అన్నయకి నువ్వు వస్తున్నావని ఫోను చేస్తానని చెప్పారు.
ఇంకేముంది - ఇంత టిఫిను తిని బస్టాండుకి పోయాను. దాదాపు పదకొండు అయ్యింది అప్పటికి. గన్నవరం-తిరుపతి ఎక్స్ప్రెస్ (అంటే పుష్బ్యాక్ ఉండదు - 3+2) రెడీగా ఉంటె ఎక్కేసాను. ఎక్కడో చివరిలో సీటు ఉంటె వెళ్ళి కూర్చున్నా . తిరుపటిదాకా టిక్కెట్ అంటే ఆ సెకండ్ డ్రైవర్-కం-కండక్టరు తేరిపారా చుశాడు - బహుశా నేను ఇంటిలోంచి పారిపోయిన ఇంటరు స్టూడెంట్ అనుకున్నాడేమో. ఎందుకంటే నా దగ్గర బట్టలు లేవు, బ్యాగు లేదు - జేబులో X వేలు డబ్బులు తప్ప.

ఒంటి గంటకు ఒంగోలు చేరింది బస్సు. లంచ్ చేశా. బస్సు ఆలా వెళుతూ ఉంది. సింగరాయకొండ, కావలి దాటి సాయంత్రం నెల్లూరు చేరింది - కాఫీ తాగాను. బస్సులో ప్రయాణికులు దిగుతున్నారు , ఎక్కుతున్నారు. పొద్దుటునుండి బస్సులో ఒకరెండు కుటుంబాలు కాక నేనే అనుకుంటా ఉంది. నేను నెమ్మదిగా ముందర డ్రైవరు పక్కనుండే సింగిల్ సీటులోకి మారాను (అప్పట్లో ద్వారం ముందరకాక రెండు సీట్ల వెనక ఉండేది).
ఆలా సాగుతూ (మరి మొబైల్ లేని రోజులు), అప్పటికి నేను బస్సు ఎక్కి దాదాపు తొమ్మిది గంటలు అయ్యింది, రాత్రి భోజనానికి నాయుడుపేటలో ఆగింది. నేను నా ముందు సీట్లోకి వచ్చి కూర్చున్నా. తిన్నాక డ్రైవర్లు డ్యూటీ మారారు. నాకు టిక్కెట్ కొట్టిన డ్రైవరు చక్రం వెనక కుర్కన్నాడు. ఆయనకి నాపై అనుమానం ఇంకా తీరలేదు. నాతో కబుర్లు మొదలు పెట్టాడు - బహుశా నా కథేంటో తెలుసుకోడానికి .
ఇంక అక్కడి నుండి బస్సు చెన్నై హైవే నుండి తిరుపతి రాష్ట్ర రహదారి ఎక్కింది. అప్పుడు విస్తరణ పనులు జరుగుతున్నాయి - బాగా డైవర్షన్లు ఉన్నాయి. డ్రైవరుకు తిప్పి తిప్పీ విసుగొస్తుంది. మామూలుకన్నా ప్రయాణం ఎక్కువ సమయం పట్టుతున్నది. అప్పుడు మొదటిసారి నాకు కొంచెం సంశయం మొదలయింది - తిరుపతిలో మా అన్నయ విశ్వవిద్యాలయంకి సిటీబస్సు దొరుకుతుందాని. చిట్టచివరికి తిరుపతి బస్టాండుకి వెళ్లేసరికి రాత్రి పది దాటింది.
బస్సు బస్టాండు వెనక ఎలైటింగ్ పాయింటులో దిగి బస్టాండులోకి నడుచుకుంటూ వస్తున్నా. ధబ్! మరి అప్పటికి 11 గంటలు ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నకదా. చూసుకోలేదు. నా ఎడమ కాలు మురికికాల్వలో పడింది. నా వెనకే ఒక కానిస్టేబులు ఉన్నాడు "తాగడం ,యాడ పడితే అడా పడటం - సూస్కోద్దా అబ్బా" అన్నాడు. లేచి కాలు కడుక్కున్నా. బెణికిన కాలు ఈడ్చుకుంటూ బస్టాండులోకి పోయా - మా అన్న హాస్టలుకి ఫోనుచేశా - ఎవరో ఎత్తారు - "శీనునా - ఏదో రూములో రేపటి పోటీలకి టీ -షర్టులపై పేర్లు రాస్తున్నాడు (మా అన్న బొమ్మలు బాగా వేస్తాడు), సెప్తాలే అన్నారు.
ఇంటికి చేసా - ఇలా బస్టాండులో దిగాను -" అన్నయకి చెప్పారా నేనొస్తున్నాని?" - " వాడు దొరకలేదురా - వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాము". సరిపోయింది.
కాలీడ్చుకుంటూ బయటకి వచ్చాను. నెమ్మదిగా రైల్వే స్టేషనువైపు నడవడం మొదలుపెట్టా - సిటీబస్సులు అక్కడ ఆగుతాయి. (అంతకు ముందు ఒకసారి అమ్మతో కలిసి వచ్చాను - ఊరు కొంత ఐడియా ఉంది ). దారిలో లాడ్జీలముందు  ఇద్దరు ముగ్గురు తగిలారు - "రూము కావాలా ?", "రెండొందలే - ఇక్కడే రూము ", "బాబూ కేసు కావాలా?" - నాకు అప్పటికి అర్థం అయ్యింది - వాళ్లు నాకు ఏమిప్పిస్తామంటున్నారో! వాళ్ళని తప్పించుకుంటా దాదాపు బస్టాపు దాక వెళ్ళాను. ఈలోపే బస్సు నాకళ్ళముందే వెళ్ళిపోయింది - నాబెణికిన కాలుతో అందుకోలేపోయా. అక్కడున్న వాళ్ళని అడిగా - అదే లాస్ట్ బస్సుట.
ఇంకేం చేయాలా - ఆటో మాట్లాడుకోవాలా అని ఆలోచిస్తున్నా . ఇంతలో దేవుడు కన్పించాడు - "జ్యోతీ" అని పిలిచాడు. ఎవరా అని తలెత్తితే - రోడ్డుకి ఆ పక్కన దేవుడిలా ఫ్రెండుతో అతని బైకుపై అన్నయ. నా ఫోను ఎత్తిన పుణ్యాత్ముడు హస్టెల్ అంత వెతికి అన్నయ్యని పట్టుకొని మీ తమ్ముడు ఇలా బస్టాండులో ఉన్నాడని చెప్పాడట. ఫ్రెండ్ బండిపై త్రిపుల్స్ వెళ్ళాం - అన్నయ హాస్టలు కి. అన్నయకి తెచ్చిన డబ్బులు ఇచ్చాను.
వాడి రూమ్మేట్లు అంతా ఆశ్చర్యపోయారు - నా జర్నీవిని, నేను అంత రిస్కు తీస్కొని వచ్చినందుకు.
ఇక్కడితో కథ సుఖాంతం అనుకుంటున్నారా
***ఇంకా ఉంది ***
అప్పటికి రాత్రి 11.30 అయ్యింది. తరువాతిరోజు వాళ్ల యూపీ వెళ్లాల్సిన రైలు రేణిగుంటలో 4 గంటలకి అంటే వీళ్లు తిరుపతిలో 2 ఇంటికి కాలేజీ బస్సులో బయలుదేరుతారు అట. అందుకని నిద్రపోకుండా అటూ ఇటు హడావుడిగా తిరుగుతున్నారు . నన్ను పాడుకోమన్నారుగాని, ఆ హడావుడి గందరగోళంలో ఏం పడుకుంటాం.
అలా 12 గంటల ప్రయాణం తరువాత, బెణికింది కాలుతో , నిద్రలేని అలసిన శరీరంతో నేనూ ఆ రెండు గంటలు మెలకువగానే గడిపాను. తెల్లవారుజామున 2.30కి బస్సు ఎక్కాము. రేణిగుంట స్టేషనుకి వెళ్ళాం. తెనాలికి ఒక టికెట్ ఇవ్వమన్నాను. రైల్వే కౌంటరులో "ఇది (జమ్మూ-తావి ఎక్స్ప్రెస్ ) లాంగ్ డిస్టెన్స్ ట్రైను. మినిమమ్ 600కి.మీ. అంటే వరంగల్ దాక టిక్కెట్ తీసుకోవాలి. " అని చల్లగా చెప్పాడు. పైగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అంటే నేను దాదాపు మూడు రెట్లు డబ్బులు పెట్టాలి. మీరు వెళ్ళండి. నేను తరువాత 5.30 గంటలకి కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కుతా అని చెప్పా . వాళ్ళ ట్రైయిన్ వచ్చింది, వాళ్ళు ఎక్కేశారు .
మరి నా ట్రైన్ కి ఇంకా గంటన్నర ఉందిగా. ఆ నిద్ర కళ్ళతో దోమలు కుట్టించుకుంటూ టైంపాస్ చేసి, 6 ఇంటికి వచ్చిన కృష్ణా ఎక్కాను. ట్రైనులోకి టిఫిన్లు రాలేదు. ఎప్పుడో 11 గంటలకి కొన్ని శనక్కాయల కొనుక్కున్నా.
12. 30కి తెనాలి చేరింది. ఆ పక్క ప్లాట్ఫారంపై మా అన్నయ వాళ్లు కనిపించారు. ఎవరో ఆర్మీవాళ్ళు ఎక్కాలి అని గంటనుండి ఆపారట. చేతులు ఊపాను.
గుంటూరు వెళ్లే నాగార్జున ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అని ఎనౌన్స్ మెంట్ వినపడింది. వెంటనే న బెణికింది కాలుతో కుంటుతూ బ్రిడ్జిలు ఎక్కిదిగీ, ఒకటో ప్లాట్ఫామ్పై టిక్కెట్ కౌంటర్కి వెళ్లి కొనుక్కొని వచ్చి ఆఖరి నిమిషంలో గుంటూరు రైలు పట్టుకున్నా .
***ఇంకా ఉంది ***
అలా ఆకలితో 1:30కి ఇంటికి 26 గంటల జర్నీ తరువాత, కుంటికాలితో చేరేసరికి తాళం వెక్కిరించింది. అమ్మ ఎక్కడికి వెళ్లిందో తెలియదు. ఇలా కాదని, కాళ్ళీడ్చుకుంటూ అక్కడికి కిమీ దూరంలోని మా ఫ్రెండింటికి ఈడ్చుకుంటూ వెళ్ళాను. వాళ్ళ అమ్మగారు, మా అమ్మగారు కలిసి ఎక్కడికో వెళ్లారట. సాయంత్రందాకా రారట. వాడి వదిన, నన్ను కసి జాలిపడి, అన్నం వండి పెట్టింది. సాయంత్రం అమ్మ ఇంటికివచ్చిందని తెలిశాక , మళ్ళీ కలీడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాను.
నా కష్టం ఏదైనా కానిండి, మా అన్నయ వాళ్ళ కాలేజీ వాళ్లతో డెహ్రాడూన్, అగ్ర వగైరా తిరిగి కొన్ని మధురానుభూతులు తెచ్చుకున్నాడు. నేను కొన్ని జీవితానుభవాలు నేర్చుకున్నా.
అదండీ నా తిరుపతి టూరు కథ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in