3, జూన్ 2021, గురువారం

పింగళివారి పేకి

 పింగళివారి పేకి

పింగళి సూరన గొప్ప తెలుగు కవి. అష్ట దిగ్గజాలలో ఒకరు.

ఒక రోజు సూరన అడవిలోంచి ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక మణి దొరుకుతుంది. ఇదేదో మెరుస్తుంది కదాని తీసుకుంటాడు. ఇంటికి చేరేసరికి, గుమ్మం ముందర ఒక అమ్మాయి ఎవరికోసమో ఎదురు చూస్తూ నిలబడి కనిపిస్తుంది.

”ఏమమ్మా నీకేం కావాలి?” అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ”నా పేరు పేకి అండి.  నాకు పని కావాలి. ఇంటి పని బాగా చేస్తాను.” అని అడుగుతుంది.

”జీతం ఎంత కావాలి?” అంటే ”జీతం ఏమి వద్దండి. కాకపోతే నాకు 24 గంటల పని ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు నాకు పని ఇవ్వలేరు. అప్పుడు నేను మానేసి వెళ్ళిపోతాను” అంటుంది.

సూరన్న, అతని భార్య కూడా ఒక పని మనిషి కావాలని ఎప్పటినుంచో వెతుకుచున్నారు కాబట్టి సంతోషంగా ఒప్పుకున్నారు.

అయితే ఈ పేకి ఏ పని ఇచ్చినా చిటికెలో చేసేది. ”మళ్లీ పని కావాలి” ”పని ఇవ్వండి ఇవ్వండి”  అని అడిగేది. మొదట్లో సూరన్న, గర్భవతి అయిన అతని భార్యకి సంతోషంగా ఉన్నా ఇంట్లో పనులన్నీ అయిపోతున్నాయి. నెమ్మదిగా విసుగు రాసాగింది. ఏ పని చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఎంత కష్టమైన పని చెప్పినా చేసేది.

ఇంతలో సూరన్న భార్యకి పాప పుట్టింది. పేకి సూరన్న భార్యకి తోడుగా అదే గదిలో పడుకునేది. ఒక రోజు రాత్రి సూరన్న భార్యకు మెలకువ వచ్చింది. నూనె దీపం ఆరిపోతున్నదని (అప్పట్లో కరెంటు లేదు) గమనించి పేకి ని ఒత్తిని కొంచెం పైకి జరపమని చెబుతుంది. అయితే ఆ పేకి బద్దకమై లేవలేక నాలుకని బాగా దీపందాకా జాపి పడుకున్న చోటినుంచే వత్తిని జరుపుతుంది. దెబ్బకు సూరన్న భార్యకు భయమేస్తుంది, ఈ పేకి మనిషి కాదు దయ్యము అని తెలుస్తుంది.

మరుసటి రోజు పొద్దున్నే సూరన్న భార్య భర్తకు ఈ విషయం చెప్పింది. ఎలాగైనా ఈ పైకి నుంచి తప్పించుకోవాలని ఉపాయం పన్నుతాడు. 

ఒకరోజు పేకిని నదికి నీరు తెమ్మని పంపించి సూరన్న కుటుంబంతో సహా ఇల్లు మారి వేరే ఊరు వెళ్ళిపోతాడు. తిరిగొచ్చిన పేకి చూసేసరికి ఇంట్లో ఎవరూ ఉండరు. ఇరుగుపొరుగు వారిని అడిగితే వాళ్ళు ఇలా సూరన్న వాళ్ళు పక్క ఊరికి మారిపోయారని చెబుతారు. అప్పుడు పేకి అక్కడ ఒక రుబ్బు రోలును చూస్తుంది. అయ్యో! నా యజమాని రోలు మర్చిపోయాడే అని ఆ రోలును పట్టుకొని వారు మారిన కొత్త ఇంటికి వెళ్తుంది.

కొత్త ఇంటి దగ్గర అంత పెద్ద రోలును తల మీద పెట్టుకొని అంత దూరం నడిచి వచ్చిన పేకి ని చూసి సూరన్న అతని భార్య ఆశ్చర్యపోతారు. ఇది నిజంగా దయ్యమే మనిషి కాదు అని  ఖాయం చేసుకుంటారు.

”అసలు నువ్వు ఎవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు?” అని అడుగుతారు. నేను నా మణి కోసం వచ్చాను అది ఇస్తే వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు మణిని దానికి ఇచ్చేస్తాడు, పేకి వెళ్ళిపోతుంది.

మా నాన్నగారు ఇందులో రెండో క్లైమాక్స్ కూడా చెప్పేవారు. 

సూరన భార్యకు ఒక ఉపాయం తట్టింది. పేకి ని తన తలని దువ్వమని చెప్తుంది. తల దువ్వి జడ వేశాక కింద పడిన వెంట్రుకలన్నీ చిన్న ఉండ చుట్టిస్తుంది. సూరన భార్య పేకితో ఆ ఉండను తుంగభద్రా నది తీసుకువెళ్లి చింతపండు తోమి, మొత్తం చుట్టలు లేకుండా వంకర తిరక్కుండా సన్న తీగలాగా చేసి తీసుకొని పంపిస్తుంది. టేకి నదికి వెళ్లి ఆ ఉండలోని వెంట్రుకలను చింతపండు తోమి వంకర తీసి తీగలాగా చేయటానికి కొన్ని రోజుల పాటు ప్రయత్నిస్తుంది. ఇది జరిగే పని కాదని తెలుసుకుని, అప్పజెప్పిన పని చేయలేదు కావున మళ్లీ సూరన ఇంటికి తిరిగి రాకుండా వచ్చిన అడవికి వెళ్ళి పోతుంది.

ఈ కథ కావాలి అంటే మీకు ఇంటర్నెట్ లో పింగళి సూరన The Demon's Daughter అని కొడితే దొరుకుతుంది.

ఈ కథకి నా చిన్నప్పుడు మా నాన్నగారు చాలా సార్లు చెప్పారు. నేను ఈ కథ పెట్టాలి అనుకొని పూర్తిగా గుర్తు రావట్లేదే అనుకున్నాను. కాకతాళీయంగా అదే రోజు మా నాన్నగారు తన ఇంగ్లీష్ బ్లాగ్ లో ఇదే కథను పెట్టారు.

Problems & Solutions. సమస్యలూ పరిష్కారాలు. समस्याएँ और समाधान: 922 The Story of 'Pingali vAri pEki' in the context of Demonetization and Remonetization of High value Currency Notes in India (problemsoftelugus.blogspot.com)

Problems & Solutions. సమస్యలూ పరిష్కారాలు. समस्याएँ और समाधान: 1158 Extra-ordinary Telugu Poet Pingali Surana (problemsoftelugus.blogspot.com)




2 కామెంట్‌లు:

  1. కథలో ఎక్కడొ లాజిక్ మిస్ అయినట్టుంది. పేకి "ఎప్పుడైతే మీరు నాకు పని ఇవ్వలేరు. అప్పుడు నేను మానేసి వెళ్ళిపోతాను" అని మొదట్లో అంది కదా. అది ఒక దెయ్యమని తెలిసినపుడు, పని ఇవ్వకుండా ఉంటే సరిపోయేది కదా? వాళ్ళని వదిలి వెళ్ళిపోయేది, పీడా విరగడైపోయేది

    రిప్లయితొలగించండి
  2. నిజమే మీరు చెప్పింది. మా నాన్నగారిని అడిగాను. ”చెప్పిన పనిచేయకపోతే?” అని సూరన అడిగితే ”చేయగలిగినంత పని ఇవ్వకుంటే?” అని పేకి ఎదురు ప్రశ్న వేస్తుంది. ఓడినవారు ఏం చేయాలి అన్నది తరువాత చూద్దాం అని పనిలోకి తీసుకుంటాడు. ఈ లంకెలో కూడ ఉంది చూడండి - https://te.wikisource.org/wiki/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%B3%E0%B0%BF_%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B0%A8

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in