ఇళయరాజా!
నా ముందు, తర్వాతి తరమువారికంటే నేను దాదాపుగా ఇద్దరి కెరీరు పీక్‌లో పాటలు విన్నాను. ఇది కేవలం ఒక శ్రోతగా నా పరిశీలన, అభిప్రాయం. ప్రామాణికమైన వ్యాసంగా భావించి ఎవరి మనోభావాలు గాయపరుచకోవద్దు.
వేరు వేరు తరాలలోని కళాకారులను, ఆటగాళ్ళను సాధారణముగా పోల్చకూడదు. ఎందుకంటే సాంకేతికత అభివృధ్ధి చెందుతుంది. అందులోనూ సినిమాలు, పాటలు అప్పటి ప్రేక్షకుల అభిరుచులకనుగుణముగా రూపొందిస్తున్నప్పుడు ఆ తయారైన ఎండ్ ప్రోడక్టు యొక్క నాణ్యత కాకుండా శైలిని బట్టి, విజయము/ పాపులారిటీ / అవార్డులను బట్టి ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అని తేల్చడము సరి కాదు. పాటలు వ్యక్తిగత అభిరుచి - అలాగే సంగీత దర్శకులు, గాయనీగాయకులు. కొందరికి ఘంటసాల, ఇంకొందరికి బాలు, చిత్ర, మరికొందరికి కెకె, కార్తీక్, వేరొకరికి కిశోర్ కుమార్, రఫీ, లతాజీ.
మరి నా దృష్టిలో ఎందుకని ఇళయరాజా రహమన్ కన్నా ఎందుకని మెరుగైన స్వరకర్త?
ఏ కళనైనా, క్రీడనైనా మనం రేటిఫై చేసేటప్పుడు ముఖ్యముగా రెండు అంశాలు చూస్తాం -
- ఎండ్ ప్రోడక్టు - అరే ఈ బొమ్మ, ఫోటో, శిల్పము, పాట ఎంత బాగుందో/అద్భుతముగా ఉందో? మ్యాచ్ విన్నింగు సెంచరీ, గెలిచిన ట్రోఫీలు, వగైరా - ఇందులో మనం చూసేవి నాణ్యత, వైవిధ్యత, హీట్ / విజయం, తోటివారికన్నా ఎంత పై స్థాయిలో ఉన్నారు, అలాగే క్వాంటిటీ
- వర్కింగు స్టైలు - ఆ కళను ప్రదర్శిస్తున్నప్పుడు, వాడుతున్నప్పుడు - అరే, వాడు షాటు కొడితే కొట్టినట్టే ఉండదు, ఎవరి బొమ్మైనా నిమిషములో గీసేస్తాడు, నిమిషములో బాణీ ఇస్తాడు, వగైరా - ఇందులో మనం చూసేవి శైలి, వేగము, సొగసు, ప్రతిభ / నైపుణ్యము
ముందుగా ఎండ్ ప్రోడక్టు చూద్దాము - ఒక సినిమా పాటలో ఉండేది - బాణీ (ట్యూను), వాయిద్యాలు (ఆర్కెస్ట్రైజేషను).
బాణీలు -
ఇళయరాజా ఇచ్చినన్ని వైవిధ్యమైన బాణీలు, ప్రయోగాలు రహమన్ చేయలేదు. ఎవ్వరూ వాడని రాగాలు వాడడము, విషాదానికి నప్పే రాగాలను శృంగార రసానికి వాడి మెప్పించడం, తమిళ జానపద, గ్రామీణ బాణీలకు పాశ్చాత్య వాయిద్యాలు మేళవించినా న్యాచురుల్గా వినిపించేలా చేయడం, సమకాలీకుల కన్నా ఒక మెట్టు ఎక్కువలో ఉండడము వంటివి ఇళయరాజా చేశాడు. క్రికెట్లో వివ్ రిఛర్డ్సులాగన్నమాట.
రహమన్ పాటలు 90 – 96 వరకు (రోజా - భారతీయుడు) వరకు వైవిధ్యముగా అనిపించేవి. ఆ తర్వాత అదే క్వాలిటీతో కాకున్నా అలాంటి బాణీలు హారిస్ జైరాజ్, సందీప్ చౌతా, మణిశర్మ వంటివారు ఇచ్చారు. కేవలము అర్కేస్ట్రా ఎంపిక, ప్రోగ్రామింగులోనే రహమన్ వైవిధ్యత కనిపించేది.
వాయిద్యాలు (ఆర్కెస్ట్రైజేషను / ప్రోగ్రామింగు) -
ఒక పాటకు బాణీ ఎంత ముఖ్యమో ఆర్కెస్ట్రైజేషను అంత ముఖ్యము. 1960ల వరకు మంచి బాణీలు (ఎక్కువ రాగాధారితము) ఉన్నా ఆర్కెస్ట్రైజేషను మొనాటనసుగా ఉండేది. అవే పియానో, విషాదమైతే వీణ / సితార్, వెనక రిథమ్ కు తబలా లేదా మృదంగం. అందుకే మనం పాటలు బాణీ నచ్చి పాడుకుంటాము, రేడియోలో వింటానికి బాగుంటాయి గానీ, స్టీరియోలో, హెడ్ఫోన్లలో అంత ఆస్వాదించలేము. కెవి మహదేవన్, విశ్వనాధన్లు 70లలో ప్రయోగాలు చేసి కొంత వైవిధ్యత తెచ్చినా సినిమా పాట తీరు మార్చినవాడు ఇళయరాజా. పల్లవి - చరణం - పల్లవి - చరణం ఆర్డరు మార్చాడు - ఒక ప్రీలూడ్ (సాకీకి), మొదటి పల్లవి తరువాత, చరణాల మధ్యన వేరు వేరు ఇంటర్లూడ్లు వాడడం చేశాడు.
ఒకే పాటలో పల్లవికి తబలా రిథమ్ లేదా హార్మోనియం, చరణాలకు గిటారు లేదా వెస్ట్రన్ డ్రమ్స్, జాజ్, వాడడము అప్పటికి (80లు) నభూతో. కరెక్టుగా చెప్పాలంటే ఈ ప్రయోగం నాకు తెలిసీ ఆ తర్వాత రహమన్ కూడ చేయలేదు. అలా చేసి కూడా అదేదో ఫ్యూజనులాగ అనిపించకుండా ఒకే పాటనిపించి సీమ్‌లెస్ గా శ్రోత ఆస్వాదించేలా విజయవంతం అయ్యాడు.
ఉదాహరణలు:
అమావాస్య చంద్రుడు లో కళకే కల ఈ అందము - బాలు గొంతు వెనక తబల/ కాంగో, మధ్యలో ఇంటర్లుడ్స్ వెస్టర్న్. అలాగే ప్రేమించు పెళ్ళాడులో ఈ చైత్ర వీణ, కొంతవరకు అబ్బ నీ తియ్యని దెబ్బ, ప్రేమించు పెళ్లాడులో గోపెమ్మ చేతిలో గోరుముద్ద - వెస్ట్రన్ తో మొదలయ్యి ఇండియన్ రిథమ్ కు వస్తుంది - పల్లవి వెస్ట్రన్, చరణాలు ఇండియన్ . ఛాలెంజ్ లో ఇందువదన కుందరదన, మంత్రిగారి వియ్యంకుడు లో మనసా శిరసా, సూర్య ఐపీఎస్ లో ఓం నమో నమ యవ్వనమా, అమావాస్య చంద్రుడు లో వయొలిన్ కన్సర్ట్
ఒక పాటలో ఎక్కడ ఏ వాయిద్యము ఏ నోటు వాయించాలో ఇళయరాజాకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదని చెప్పవచ్చును. రహమన్ తప్ప ఇతర సంగీత దర్శకులు ఇక్కడే తేలిపోయేవారు. అద్భుతమైన బాణీలు పేలవమైన ఆర్కేస్ట్రాతో పోయేవి - మణిశర్మ, కీరవాణి పాటలలో ఎక్కువ శాతము నాకందుకే నచ్చవు. పాట మధురముగా ఉండాలంటే వాయిద్యాల మధ్యన హార్మనీ ఉండాలి, అపుడే ఆ పాట ఎక్కువమందికి చేరుతుంది. ఈ విషయములో గ్రామీణ పాటలు, విషాద గీతాలలో రహమన్ బాణీలు బాగున్నా ఆర్కెస్ట్రైజేషను తేలిపోతుంది.
అలాగే కౌంటరు పాయింటు ఇళయరాజా చేసినట్లు రహమన్ చేయలేదు.
85 నుండి ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వాయిద్యాలు (కీబోర్డు, ఎలక్ట్రిక్ గిటారు, ఢ్రమ్స్, జాజ్) వినియోగం పెరిగింది. ఇళయరాజా వాయిద్యాలు వాడినా, ప్రోగ్రామింగు ఎక్కువ చేయలేదు, డిఫాల్ట్ లూపులు ఎక్కువగా వాడలేదు. వెస్ట్రన్ సంగీతములో తనకున్న పట్టు వలన తనకు కావల్సిన రిథమ్స్, లూప్స్ ఎక్కువ భాగం తనే తయారుచేసుకునేవాడు. రాజ్- కోటి, కీరవాణి వంటి కొత్త సంగీత దర్శకులు కీబోర్డులో వచ్చిన లూపులు వాడుకున్నారు. 90లో రహమన్ అవే లూపులు వాడినా, ప్రోగ్రామింగు కొత్తగా చేశాడు. మిగతా సంగీత దర్షకులతో పోలిస్తే తన జీనియస్ అక్కడ బయటపడింది. ఏ వాయిద్యము ఎలా మిక్సు చేయాలి అన్నదానిలో అతని బ్రిలియన్స్ ఉన్నది. ఇక్కడే హారిస్ జయరాజ్, దేవిశ్రీ, తమన్ కన్నా రహమన్ ఒక మెట్టు ఎక్కువ.
ఇక వర్కింగు స్టైలు కొద్దాము -
ఇళయరాజా వేగముగా బాణీలు ఇస్తాడు, పూర్తి నోటేషను వాయిద్యకారులకు ఇస్తాడు. సిట్యుయేషనుకు తగ్గట్టు, ప్రాంతానికి తగ్గట్టు, ఒక్కోక్కసారి హీరోకు తగ్గట్టు పాటలు వేగముగా ఇచ్చేశాడు.
అదే రహమన్ సమయం తీసుకుంటాడు. ఒక్కో పాటను చెక్కుతాడు. పది ట్రాకులు పాడించి ప్రతి ట్రాకులోంచి మంచి లైన్లు తీసి కలిపేవాడు. ట్రాకులు ఓవర్లాపు చేసేవాడు (ఉదాహరణకు ప్రేమదేశంలో నను నేను మరచినా నీ తోడు). ఇది నా దృష్టిలో డీఎస్ఎలార్ లో 20 షాట్లు కొట్టి, మ్యాక్లో ఫోటోషాపులోనో లైటురూములోనో ప్రాసెసింగు చేసినట్లు. ఇది తప్పా అంటే కాదు. తీసినవి గొప్ప ఫోటోలు కాకుండా పోతాయా అంటే గొప్పవే, అబ్బురపరచేవే. కానీ పది నిమిషాల్లో ట్యూను కట్టి, ఒకటి రెండు రిహార్సల్సులతో లైవు రికార్డింగు చేసి మెప్పించడమూ, అలాంటి పాటలు రోజుకు పదీ పదిహేను రికార్డు చేయడము, నాలుగు భాషలలో హిట్లు కొట్టడము వేరే లెవెల్.
కాన్వాస్ పై ఆయిల్ పెయింటింగునూ, కంప్యూటరులో డిజిటల్ ట్యాబూ, టూల్సు వాడి గీయడము ఒకటి కాదు కదా.
ఇళయరాజా సంగీతము వలన ఊరు పేరులేని హీరోలు, కొత్త దర్షకులతోనూ (మురళీ, కార్తీక్, మోహన్) తీనిన సినిమాలు హిట్ అయ్యాయి. సినిమాలు ఫ్లాపు అయ్యినా పాటు హిట్ అయ్యినవి చాలా ఉన్నాయి. ఆయన సంగీతము వలన పెద్ద హీరోల సినిమాలు (చిరంజీవి, కమల్, రజినీ) ఇంకోంత సూపర్ హిట్ అవ్వడానికి దోహదం చేశాయి. ఈ విషయములో రహమన్ కొంత వెనకబడ్డాడనే చెప్పచ్చు. ఆడియో హిట్ అయ్యిన సినిమాలు ఎక్కువశాతం మణిరత్నం, శంకర్, వర్మ, సుభాష్ ఘై వంటి పెద్ద దర్శకులతోనే. కేవలం తన ఆడియో వలన సినిమా హిట్ అయ్యినవి తక్కువే.
ఇళయరాజా కంపోజిషను శైలి -
https://www.youtube.com/watch?v=EMTI4FpjZa8&list=WL&index=27రహమన్ కంపోజిషను శైలి -
https://www.youtube.com/watch?v=aL1zz-zGw1A&list=WL&index=28చివరిగా ఈ క్రింది వీడియోలు చూడండి - ఇలాంటివి ఇళయరాజా తప్ప వేరేవరూ చేయలేరు.
విచిత్రసోదరులు సినిమాలో రాజా చెయ్యివేస్తే పాట - ముందు ఒక తమిళ డైలాగులకు డప్పు రిథమ్, ఆ తర్వత పాట మొదలవ్వగానే డ్రమ్స్ రిథమ్ -
https://youtu.be/cwh25b2WG-oవాయిద్యాల హార్మనీ ఎందుకు ముఖ్యము -
https://youtu.be/38grie58lEoఆదిత్య 369లో సురమోదము పాటలో శాస్త్రీయ నృత్యమునుండి రాక్ ఎన్ రోల్ కు సీమ్లెస్గా తీసుకువెళతాడు -
https://www.youtube.com/watch?v=dDOCDj8xbUwకౌంటరు పాయింటు -
https://www.youtube.com/watch?v=iZqWFe1-kqo