15, అక్టోబర్ 2010, శుక్రవారం

నాన్న - ఒక జ్ఞానతృషితుడు

ఇంజినీరింగు కాలేజీ నుండి క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా డైరెక్ట్ ఐటీజాబ్లోకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యి ఒక రెండు మూడేళ్ళు ఎంజాయ్ చేశాక చాలామందికి ఒకరకమైన అసహనం మొదలవ్వవుతుంది. అదే పాతికేళ్ళకి జనాల్లో పుట్టే క్వార్టర్లీ లైఫ్ క్రైసిస్ (QLC).

"థూ సాఫ్ట్వేర్ జీవితం"; "మనమేం చదివాం, ఏం చేస్తున్నాం, దీనికన్నా ఊరికెళ్ళిపోయి ఆటో తోలుకుంటం నయం";"ట్యూషన్లు చెప్పుకున్నా ప్రశాంతంగా వుంటుంది" అని డైలాగులు కొడతారు. అందరూ కాదులేండి. కొందరు మటుకు వట్టి బీటెక్ ఏంటి, ఒక ఎంబీయేనో, ఎంటెక్కో చేయాలి అని తపిస్తుంటారు. క్యాట్ రాస్తా, జీమాట్ రాస్తా అంటారు.

కారణం ఏదైనా కావచ్చు - జ్ఞానం, డబ్బు, కెరీర్, ఉద్యోగాభివృద్ధి,ఏదైనా.

కానీ ఇలాంటివాళ్ళల్లో చాలామంది మాటలతోనే ఆగిపోతారు. ఏంటయ్యా అంటే బిజీ, టైం లేదు అంటారు. అలాంటివాళ్ళల్లో నేనూ ఒక్కణ్ణి ఒక్కప్పుడు.
అసలు ముఖ్యకారణం మటుకు చిత్తశుద్ధిలోపించడం.

కానీ మా నాన్నకి కొడుకుగా నేనలా అనగూడదు.

ఎందుకంటారా? ఒక్కసారి మా నాన్నగారి నేమ్‌‌ప్లేట్‌‌గానీ, విజిటింగ్ కార్డుగానీ చూడాలి.

వై.భాస్కర్ M.A(History), M.A.(English Lit.), L.L.B, B.Com, D.B.M, D.P.M.,D.I.M, A.D.I.M, C.A.I.I.B

మొన్నామధ్యనే యాబయ్యేదేళ్ళ వయస్సులో ఎంఏ హిస్టరీకి నాగార్జున విశ్వవిద్యాలయంలో గోల్డ్మెడల్ (బంగారు పతకం) సాధించారు. పైవికాకుండ, 1987లోనే పిజిడిసిఏ చేశారు. బ్యాంక్లో వుండగా, ఫాక్స్ప్రో ప్రోగ్రామింగ్, బ్యాంక్ మాస్టర్లలో కమాండ్ సంపాదించారు. బ్యాంకు వుద్యోగంలో చేరెటప్పటికి డిగ్రీలేదు, టైపిస్టుగా చేరారు. తర్వాత సాయంత్రం కళాశాలకి రోజూ 20 కిమీ సైకిల్ తొకక్కుంటూ వెళ్ళి బీకాం చేశారు.

రెండు పీజీలు, లా యాబైల్లోకి వచ్చాకే చేసినవి.

విజువల్ బేసిక్, ఎచ్టీఎమ్ఎల్, జావాస్క్రిప్ట్ లలో మంచి ప్రవేశంవుంది. ఇప్పుడు పిఎచ్పీ, ఎక్స్‌‌ఎమ్‌ఎల్‌‌లతో ప్రయోగాలు చేస్తున్నారు.

ఇక బ్లాగులకి వస్తే ఆయనకి 20 పైనే వున్నాయి. వాటిల్లో ఇంగ్లీషు వ్యాకరణం రామాయణం, మహాభారతం, వివేకానందుకడు, భర్తృహరి సుభాషితాలు, భారత ఆర్ధికం, భారత కరంట్ అఫైర్స్, ఆయుర్వేదం, వంటలు మొదలగునవి ముఖ్యమైనవి. ఏ అంశం అయినా ఆయన దగ్గర సమాచారముంటుంది. లేకపోతే తెలుసుకోవాలనుకుంటారు.

సంస్కృతం నేర్చుకున్నారు - కావ్యాలనీ, వేదాలనీ అధ్యయనం చేయడానికి.

వారనికొకటి అయినా ఆయన వ్యాసం 'వార్త‌' పత్రికలో మూడవపుటలో ప్రచురించబడుతుంది. ఈనాడులో ఇదివరకు వచ్చేవి, ఇప్పుడు పంపించడం ఆపేశారు. నా చిన్నప్పుడు విదేశీమారకద్రవ్యం (ఫారిన్ ఎక్స్ఛేంజి) మీద ఆయన వ్రాసిన వ్యాసాలు హిందూ,ఇండియన్ ఎక్స్‌‌ప్రెస్ పత్రికల్లో వచ్చేవి.

ఇంక సంగీతం: నేను పుట్టకముందు తబ్లా, హార్మోనియం కొంత నేర్చుకొన ప్రయత్నించి బాధ్యతలవలన వదిలేశారు. తరువాత సితార్ (ఇప్పటికీ వుంది), ఇప్పుడు వేణువు (ఫ్లూట్) నేర్చుకొని రోజుకి కనీసం మూణ్ణాలుగు గంటలు వాయిస్తున్నారు.

చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు, కొంచెం గర్వపడేది ఏంటంటే, ఎప్పుడన్నా గుంటూరింటికి వెళ్ళినప్పుడు - ఎవరైనా మాయింటికి వస్తే నేనేమో కింద గదిలో టీవీలో ఏదో చెత్త చూస్తూ, మా నాన్నగారేమో పైన గదిలో ఏదోకటి వ్రాస్తూనో, చదువుతూనో కనిపిస్తాం.

మరి ఏం మాయరోగం - ఏదోకటి చదువడమో, నేర్చుకోవడమో చెయ్యొచ్చుగా అంటారా? సర్లేండి. నేను చాలా బిజీ. ఇప్పుడు (రాత్రి పన్నెండున్నర) ఇండియా టీంకి కాల్ చేయాలి, రేప్పొద్దున్నే ఎనిమిదింటికి క్లైంట్ మీటింగు - మధ్యలో తెలుగు బ్లాగులు, ఇంగ్లీషు బ్లాగులు, ఫేస్బుక్, ట్విట్టర్, క్రికెట్, ఎన్నని. అస్సలు టైంలేదండి బాబూ.

చివర్గా ఒక్క కోరిక - ఎప్పటికైనా నా పిల్లలు (భవిష్యత్తులో పెళ్లై పుట్టినప్పుడు) నన్ను ఒక తండ్రిగాకన్నా, ఒక వ్యక్తిగా నన్ను ఆరాధించాలి - ఎలాగైతే మా నాన్నని చూసి మేమనుకుంటామో.

L.L.B - Law
D.B.M - Diploma in Business Management
D.P.M.- Diploma in Personnel Management
D.I.M.- Diploma in Management
A.D.I.M. - Advanced Diploma in Management
C.A.I.I.B. - Certified Associate of the Indian Institute of Bankers

పి.ఎస్: నాన్నగారి బ్లాగులన్నీ ఆయన ప్రొఫైల్లో వున్నాయి: http://www.blogger.com/profile/13635995478285822763

ఆయన జ్ఞానాన్ని అందరికీ పంచడానికి మా (అన్నయ, నేను) వంతుగా ఒక వెబ్సైట్ పెట్టాం - దానికి ఇంకా బాలారిష్టాలు తొలగలేదు. ఆసక్తివుంటే - www.knowquest.info

తృష్ణ = దాహం
తృషితుడు - దాహంకలవాడు.

5 కామెంట్‌లు:

  1. అపుడెపుడో ఇంగ్లీషు బ్లాగులో రాసినపుడు, చదివి సిగ్గుపడ్డాను నేనుI.A.S చేయాలని కంకణం కట్టుకోవాలనుకున్నాను,ఇపుడు తెలుగు బ్లాగులో చదివి కూడా మళ్ళీ అదే అనుకుంటున్నాను, no improvrmrnt.

    రిప్లయితొలగించండి
  2. చాలా శ్రద్ధ, చేసే పని మీద ఇష్టం ఉండాలండి అన్ని చేయగలగాలంటే. మీ నాన్నగారి ప్రొఫైల్ ఇచ్చి మంచి పని చేశారు. మీ నాన్నగారనే కాక ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. విశ్వనాథ్, ఇంకా కంకణం కట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? ఏది చెయ్యాలన్నా ఇప్పుడే చెయ్యి. ఒక రెండేళ్ళు ఐటిలో వుంటే నాలాగా బ్లాగుల్లో ఆక్రోశించడంకన్నా ఏం చేయలేవు. సెవెన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్.

    శిశిరగారు, వారి గురించి ఇంకా చాలా చెప్పాలి. భవిష్యత్తులో రాస్తాను.

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in