25, అక్టోబర్ 2026, ఆదివారం

సినిమా - విజువల్ మీడియం - సింగీతం

 విచిత్ర సోదరులు సినిమాను ఒక మూడు రోజులుగా ముక్కలు ముక్కలుగా చూశాను. నిన్న డొరోతీ, పారడైజ్ చూశాను. సినిమా అంటే విజువల్స్ అంటే మహా అయితే మూడు డ్రోన్ షాట్లు ఆరు క్లోజప్లు పెట్టీ కళ్ళు నెప్పుట్టేటట్టు స్నాప్ ఎడిటింగ్ చేసి నిమిషాల కొద్దీ డైలాగులు, పంచ్లు మాత్రమే అనుకుంటున్నట్టున్నారు నేటి దర్శకులు. 

విచిత్ర సోదరులు గుర్తొచ్చింది. 37 ఏళ్ల కిందటే సింగీతం గారు ఎంత బాగా విజువల్ మీడియాను వాడుకున్నారా అనిపించింది. కొన్ని షాట్లు ఆర్జీవి శివ కన్నా ముందే అని తెలిసి ఆశ్చర్యపోయాను.

సింగీతంగారి ఫ్రేమింగు, పర్స్పెక్టివ్ వాడుకుని కెమెరాతో విజువల్ గా చెప్పిన  కొన్ని ఉదాహరణలు -

ముందు ఒక బాతు (గూస్) క్లోజప్ తో సినిమా మొదలవుతుంది. అక్కడి నుండి బాతు గుంపులు నడుచుకుంటూ ఒక గుడిసె పక్కనుండి వెళుతుంటే, ఆ గుడిసె ముందు ఒక అవ్వ ఒక పాపాయిని ఎత్తుకుని తాతతో మాట్లాడి బయటకి పోతుంది. తాత గుడిసెలోకి పోగానే ఒక కారు పాక పైకప్పును చీల్చుకుంటూ ఎగురుతూ పోతుంది. అక్కడనుండి ఆ కారును కమల్ బులెట్ పై చేజ్.



ఇది నేను 1989 లో పిల్లాడిగా విజయవాడ అన్నపూర్ణ లో పెద్ద తెరపై చూసి, చాలా ఏళ్లు మనసులో జ్ఞాపకముగా నిలచిన సీను. మొన్న చూసినపుడు గూస్ బంప్స్ వచ్చాయి.

అంబాసిడరు విండ్ షీల్డ్ లోంచి పెద్ద కమల్ (మానిటరు లేని రోజులు), మారుతీ ఓమ్నీలోపలనుండి రాజా - గౌతమి - డిఫరెంట్ ఫ్రేమింగు!!




ఎత్తులో గుడిసె, కొంత కిందన, కాలువ గట్టున గిన్నెలు కడుగుతున్న మనోరమ - ఆవిడతో మాట్లాడుతున్న రౌడీ - కారులోంచి వారిద్దరినీ చూస్తున్న పెద్ద రౌడీ ... 



డిపోను కాలుస్తున్న రౌడీలు, దూరం నుండి చూస్తున్న మనోరమ - ఒకటే ఫ్రేములో...



చలపతి (పెద్ద కమల్) ను చంపిన నలుగురు విలన్లూ, అస్తమిస్తున్న సూర్యుడు ఒకే ఫ్రేములో ...



కారును కింద నుండి చూపించి కెమెరా పైకి తిప్పడం క్షణక్షణంలో మొదటిసారి అనుకున్నా - గుంట తవ్వి కెమెరా పెట్టారని చెప్పారు - ఇక్కడ ఆల్రడీ చేసేశారు...



సినిమా లో అప్పు కమల్ చాలా సీన్లలో గుంతలో నడిచాడనీ, అతను ఉన్న సీన్లు గ్రౌండు లెవల్ తీశారని ఇపుడు అందరికీ తెలిసిందే - ఆ గుంత దారి కనపడకూడదని. అయితే అతను లేని చాలా సీన్లు కూడా గ్రౌండు లెవల్లో ఉన్నాయి - బహుశా ఇంటెన్షనల్ కావచ్చు - ప్రేక్షకులు కొన్ని సీన్లు పైకి, కొన్ని సీన్లు చూసినట్టు ఫీలవ్వకుండా, కళ్ళకు అలవాటు చేయడానికి.







అదే ఇప్పటి దర్శకులు తీసే సీన్లు సెకనుకు రెండు మూడు మారుతూ ఫ్లాషీగా అనిపిస్తూ కళ్ళకు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది నాకు. 

ఇంత విజువల్ గా తీసిన సినిమాని తమిళోళ్లు మాట్లాడితే క్రెడిట్ అంతా ఉళగనాయగన్ కూ, క్రేజీ మోహన్ కు ఇచ్చేస్తుంటారు. వారి కంట్రీబ్యూషను కాదనను, కానీ వారిది ఎంతో ఇళయరాజా, పీసీశ్రీరామ్ ది అంతే. ముఖ్యమైన కారకుడు కెప్టెన్ దర్శకుడైన సింగీతంగారిదే.

 


12, జులై 2026, ఆదివారం

సింగ్ - గీతం

సింగ్ - గీతం

సింగీతం గారు నా అభిమాన దర్శకులలో ఒకరు. నేను తెలుగు కోరాలో "విలక్షణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారికి రావాల్సిన పేరు రాలేదు. ఎందుకు? ” అనే ప్రశ్నకు వ్రాసిన జవాబు కోరా ఎడ్మిన్ మిత్రులు పవన్ సంతోష్ గారి ద్వారా వారి దాకా చేరింది కూడా.

అయినా 2000లలో విజయం. ముంబయి ఎక్స్ ప్రెస్ చూసిన తరువాత ఆయన పనితనానికి కూడా ఆఖరి రోజుల్లోని జంధ్యాల, బాపు, విశ్వనాథ్ ల్లాగా కొంత ఎక్స్పైైరీ వచ్చిందనిపించింది. 2013లో వచ్చిన వెల్కమ్ ఒబామా రీమేక్ అనేసరికి ఆసక్తి కలగలేదు - టీవీలో చూస్తే మరింత నిరాశ కలిగించింది.

అందుకని సింగ్ గీతం సినిమా ట్రైలర్లు, పాటలూ ఆసక్తి కలిగించినా ధైర్యము కలగలేదు. పోయినేడాది కమల్ నిర్వహించిన అపూర్వ సింగీతం కార్యక్రమంలో స్టేజిపైనే ఎ ఆర్ రహమాన్ కి కూడా ఈ కథలైను చెప్పి ఆయనకే ఆశ్చర్యము, ఆసక్తి కలిగించారు. కానీ తెలుగు నేటివిటికీ దేవిశ్రీనే సరైన నిర్ణయమని పాటలు చూసి నేను అనుకున్నాను.

సరే ఏదైతే అదైందని థియేటరుకు పోదామనుకున్నాను. పిల్లలకు మాల్ ఆశపెట్టి తీసుకుపోయా. ఎక్కడ తిట్టుకుంటారో, ముఖ్యముగా చిన్నోడు అని ఒక భయం.

మొదటి పావుగంట నిదానముగా గడిచినా తర్వాత కొంత వేగం పుంజుకుంది. పిల్లలూ నవ్వడం మొదలుపెట్టారు. ఇంటర్వెల్ బ్రేకులో ఎనిమిదేళ్ల మావాడు మాటలు పాటలుగా పాడడము మొదలెట్టాడు - వీడే కాదు థియేటరులో ఇంకొందరు పిల్లలు.

పదిలోపు ఉన్న పిల్లాడికీ, టీనేజిలో ఉన్న పిల్లకీ, నలబైల్లో ఉన్నా మాకూ నచ్చేటట్టు ఒక 90 ఏళ్ల దర్శకుడు సినిమా తీశాడంటే అది ఆయన పనితనమే.

మొత్తం గీతమంటే రెండో హాఫ్ సాగతీత అవుతుందేమో అనుకున్నా గానీ, బాగానే టైటుగా లాగారు.

క్లైమాక్సు కన్విన్సింగుగా మిదాస్ టచ్ (pun intended) ఇచ్చారు.

ఇవాళ కూడా పిల్లలు ఒటీటీలో ఈ సినిమా పెట్టమని గొడవచేశారు.

సినిమా కథ విషయానికి వస్తే జంబలకిడి పంబ, మాలామాల్ వీక్లీ (భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా) లలాగా ఒక రూరల్ ఫ్యాంటసీ కామెడీ అనుకుని లాజిక్ పక్కనపెట్టి చూడాలి. అలా చూడాలి అంటే స్క్రీన్ ప్లే, డైలాగులూ - అదే ఈ సినిమాలో పాటలకు ట్లూన్లుకూడా సరిగ్గా కుదరాలి. నాకైతే ఎక్కునా తక్కువా కాకుండా సరిపోను ఉన్నాయి అనిపించింది.

అన్ని పాత్రలు ఉన్నప్పుడు కొన్ని పాత్రలు నిర్లక్ష్యం కావడం ఈ మధ్యన చాలా సినిమాలలో చూస్తున్నాము. కానీ ఈ సినిమాలో అన్ని పాత్రలకూ ప్రాధాన్యత ఉన్నదీ, చివరి దాకా మిస్ అవ్వకుండా ఉంటాయి.

కొన్ని కొన్ని లోట్లు ఉన్నా - సమయాభావం, దర్శకుడు - ఎగ్జిక్యూటివ్ దర్శకుడు నాగ్ అశ్విన్ మధ్యన ఆపరేషనల్ కన్స్ట్రయింట్సు వలన దొర్లి ఉండచ్చూ, అంత పట్టించుకోవక్కర్లేదు. ఈ ఏడాది నేను చూసిన పెద్దిలాంటి కొన్ని భారీ బడ్జట్ సినిమాలలోనే బోలెడు తప్పులు ఉన్నాయి.

ఫామ్ లోలేని క్రికేటరు ఆఖరి సిరీసులో మెరిసినట్టు (ఇంగ్లాండు 2011లో ద్రవిడ్) సింగీతం గారు మళ్లీ ఆయన స్థాయికి తగ్గ ఓ సినిమా లాస్ట్ స్వాన్ సాంగులా తీసినందుకు, అందించినందుక నాకైతే సంతృప్తిగా అనిపించింది. ఆయన కల నెరవేర్చిన నాగ్ అశ్విన్ (చాలా మందికి మహానటితో తెలిస్తే నాకు ఎవడే సుబ్రహ్మణ్యం నుండీ ఇతను ఇష్టం) కూడా ధన్యుడు, మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి.



చివరిగా - ఆ చివరికి మిగిలిన చెట్టు, ఎడారిలాంటి ప్రదేశమూ, గనీ - కాంప్లెక్స్, ఆ పిల్లలూ - నాకెందుకో కల్కి వైబ్స్ వచ్చాయి. సింగీతంగారు బహుశా మహాభారతమే కాకుండా మొత్తం కథలో కాంట్రిబ్యూట్ చేశారేమో అనిపిస్తుంది.


5, జులై 2026, ఆదివారం

ఫ్లూటు - ఎడమ చేతివాటం.

 అన్నింట్లో ఉన్నట్టే సంగీత వాయిద్యాలలోనూ 'చేతివాటం' ఉంటుంది. ఎడమ చేతి గిటారు ఎక్కువమందికి తెలిసిందే - మామూలుగా గిటారు ప్లక్కరు కుడిచేత్తో పట్టుకుని ఎడమ చేత్తో తీగల ట్యాబ్స్ ప్లే చేస్తారు - ఎడమ చేతి గిటారును ప్లక్కరు ఎడమ చేతిలో ఉంటుంది. అలాగే వయోలిన్ సాధారణముగా ఎడమ వైపు పట్టుకుని ఎడమ చేతివేళ్లతో తీగలపై స్వరాలు మీటుతారు, కుడిచేత్తో బో తిప్పుతూ. ఎడమ చేతి వయోలిన్లో తీగలను రివర్సు చేస్తారు, కుడి చేత్తో మీటుతూ ఎడమ చేతిలో బో తిప్పుతారు.

అయితే ఫూట్ (వేణువు) లో ఇలా కుడి - ఎడమ భేదం ఉండదనుకుంటారు, సింపుల్ వాయిద్యము కదా అని.

కానీ ఫ్లూటు కూడ కుడి చేతివాటం వారు కుడివైపుకి తిప్పి ఊదుతే, ఎడమ చేతివారి సహజ తీరు ఎడమ వైపు తిప్పి. కావాలంటే కృష్ణుడి (వేణుగోపాలుడి) చిత్రాలు, విగ్రహాలలో కుడివైపే పట్టుకున్నట్టు ఉంటాయి. ..చిత్రము 1..




ఒక మిత్రుని సోషల్ మీడియా పోస్టులో ప్రముఖ విద్వాంసులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియాగారి చిత్రము పెట్టినపుడు - ఆయనకీ ఎడమ చేతివాటం వ్యక్తులకీ సంబంధం తెలుసా అని అడిగాను. అదేంటంటే చౌరాసియా గారు కూడా వేణువు ఎడమ వైపు పెట్టుకుని వాయిస్తారు. వారి కౌమార దశలో ముంబయిలో వారి గురువు అన్నపూర్ణదేవి గారిపై గౌరవముతో కుడి నుండి ఎడమ గ్రిప్పుకు మారారు. ఈ విషయముపై కొంత సమాచారం సేకరిద్దామని అంతర్జాలములో వెతుకుతుంటే ఇంకా చాలామంది హిందుస్తానీ వేణువిద్వాంసులు ఇలా ఎడమ చేత్తోనే నేర్చుకుంటున్నారని (గురు పరంపరలో ఇది అలవాటుగా/సంప్రదాయముగా మారినట్టుంది). ..చిత్రము 2.. ఇది ఆసక్తికరముగా ఆశ్చర్యముగా అనిపించింది.


కుడి - ఎడమ ఫ్లూట్లకు చిల్లుల మధ్యన దూరం భిన్నముగా ఉంటుంది. అలాగే కుడి చేతివాటం వారు ఎడమవైపు పట్టుకున్నపుడు చిటికెన వేళ్లతో చివరి చిల్లులను పట్టుకోవడం కష్టంగా ఉండచ్చు.

8, జూన్ 2025, ఆదివారం

#ఇట్లునీప్రేయసి పుస్తకం

 #ఇట్లునీప్రేయసి పుస్తకం గురించి…

కొన్నేళ్ళ క్రితం పిల్లలకు పుస్తక పఠనము అలవాటు చేయాలి అనుకుని పుస్తక ప్రదర్శనకు, అదే హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషనుకు తీసుకుపోయినపుడు, సిరా అన్న పుస్తకము ఆకర్షించింది. రచయిత, సినిదర్శకులు Raj Madiraju గారి పేరు నాకు అప్పటికే ఫేస్బుక్ లో పరిచయం, వారి పోస్టులు చదువుతుండేవాడిని. చాలా ఏళ్ల తరవాత ఒక తెలుగు పుస్తకము చదువుతున్నా వారి శైలి టకటకా చదివించేలా చేసింది.

ఈ మధ్యన రాజ్ మాదిరాజు గారు ఒక కొత్త రచన చేశాను, బీటా రీడింగు చేసే ఆసక్తి ఉంటే చెప్పమంటే చెయ్యెత్తాను. వారు కేవలం ఫేస్బుక్ పరిచయముతో నాపై నమ్మకముతో పంపించారు.

నేను వ్యక్తిగతముగా, వృత్తిగతముగా, ఇంకా ఫేస్బుక్ తో ఫాలో అయ్యేవారికి తెలుసు, నా మైండు ఆటోమేటిక్ గా రివ్యూ చేసేసి, నేను పట్టి పట్టి చూడకున్నా కొన్ని కనిపిస్తుంటాయి అని.

నేను బీటా రీడింగు ఎపుడూ చేయలేదు. పుస్తక సమీక్షలు కాదు కదా, సినిమా సమీక్షలు కూడా వ్రాయలేదు. ఈ పుస్తకము తీసినపుడుకూడా మా డిజైను డాక్యుమెంట్లు రివ్యూ చేసినట్టు, అప్పుతచ్చులను మార్క్ చేయడము మొదలెట్టాను.

చదవగానే నాకు అనిపించింది రాజ్ గారికి పంపించాను. మెప్పులకన్నా వంకలే ఎక్కవ వ్రాశాను.

వారు హుందాగా తీసుకోవడమేకాదు, పుస్తక ఆవిష్కరణకు పర్సనల్ గా మెసేజి పెట్టి ఆహ్వానించారు.

బీటా రీడరు అని చెప్పి ప్రకటించడమేకాక ఓ రెండు ముక్కలు మాట్లాడే అవకాశము ఇచ్చారు. పుస్తకములో పేరు కూడా ప్రస్తావించారు.

ఇదంతా వారి పెద్ద మనసు.

జెన్ వై, జెడ్ యువతకీ ఇంతే ఆసక్తికరముగా ఈ రచన ఉంటుందా అని కొంత సందేహం ఉండేది. ఇవాళ ఈవెంటులో మాలా 40ల యూతే గాకుండా 20ల యూతుని చూసేసరికి, వారు టకటకా మాట్లాడుతుంటే భలే ముచ్చటేసింది. ఈ పుస్తకము, స్వప్నప్రియ గారి నాలో ఉన్న ప్రేమ పుస్తకము ఇలా ఒక కొత్త తరానికి తెలుగు పుస్తకములను చదివే అలవాటు చేస్తున్నాయి అని తెలిసి తెలుగు పుస్తక భవిష్యత్తుపై ఆశలు కలిపిస్తుంది.

---- పుస్తకము గురించి నా అభిప్రాయము ----

మొదటి రెండు మూడు పేజీలు కొంత తెంగ్లీషు లాగా, కొంత తెలుగు - ఇంగ్లీషు మిశ్రమములాగా, సిరా లాంటి భాషనే మళ్ళీ వాడారా అనిపించింది. ఫ్లాష్బాకులో కొంత భావుకముగా అనిపించి, ఇది పూర్తి రొమాంటిక్ జోనరులాగా ఉన్నదీ - నేను పూర్తిగా చదవలేనేమో అనుకున్నా (నాకు ఆసక్తిలేని జోనరు).

కానీ గోదావరి వరద సంఘటన దగ్గర నుంచీ నాకు నెమ్మదిగా ఎక్కింది. ఆ భాగం చాలా బాగా కళ్లకు కట్టినట్టు వ్రాశారు. నేను భద్రాచలం ఎప్పుడూ వెళ్లలేదు, సిరిసిరిమువ్వ, గోదావరి లాంటి సినిమాల్లో, టీవీ కల్యాణములో చూడడము తప్ప. కానీ నేను ఆ రోజు భద్రాచలంలో ఉన్న ఫీలింగు వచ్చింది, నేను ఆ కథా సమయానికి పుట్టలేదు కూడా.

చదువుతున్న కొద్దీ నెమ్మదిగా తరవాత రాధాశ్యాం జీవితము ఎటు తిరుగుతుంది అన్న కుతూహలం పెరిగింది. రచయిత శైలీ, పదాల కూర్పూ చివరిదాకా చదివించాయి. అచ్చుతప్పులు, లాజిక్కులు పట్టించుకోకుండా చదవ‌డములో మునిగిపోయాను. ఉపమానాలు అన్నీ బాగా అతికాయి, కొన్ని నవ్యముగా ఉన్నాయి.

చాలా చోట్ల కిసుక్కు నవ్వించింది.

ఎడమచేతివాటం గురించి, రాధ తన జీవితములో చూసిన ఎడమ చేతివాటం వ్యక్తుల గురించి ప్రస్తావన రాగానే జిల్ మంటే, కడుపులో పిల్లాడు ఎడమ కాలివాటం అంటే భలే అనిపించింది.

80లలో పుట్టిన మిల్లెనియల్ అయిన నేను 90లలో ఖమ్మం, గోదావరిఖని, రామగుండం కోల్ బెల్టు చాలా సార్లు చుట్టాలింటికి వెళ్లాను. అందుకని కథా వాతావరణము కొంత ఊహకందినది. అలాగే ఖమ్మం - వరంగల్ - మహబూబ్నగర్ - నల్లగొండలలో చాలా మంది చుట్టాలూ, నెలలు గడిపిన అనుభవము ఉండడముతో రాధ ఖమ్మం-కోస్తా యాసలో, శ్యాం తెలంగాణా-కొత్తగూడం యాసలో - ఇలా సంభాషణలు కలిపి ఉన్నా పరిచయము వలన నాకు అంతగా ఇబ్బంది పెట్టలేదు - అర్థం చేసుకోవడములో, ఫ్లోకినీ. 70-80 లవారికి కొంత నొస్టాల్జియా కిక్ ఇవ్వచ్చు.

నోస్టాల్జియా ఉంటేనే ఆసక్తిగా చదువుతారు అనుకునేవాడిని. రచయిత మనల్ని ఆ కాలానికి తీసుకువెళ్ళగలిగితే మనకు పరిచయములేని 19వ శతాబ్దపు లండను షెర్లాక్ సమయమూ స్థలముకూ తీసుకుపోగలవు. ఇలా మన రాష్ట్రములోని కొత్త కొత్త ప్రదేశాలల బ్యాక్ డ్రాపులో రచనలు రావడము కూడా బాగుంది.

పుస్తకము అమెజానులో దొరుకుతుంది -

Itlu.. Nee Preyasi - A Novel

29, సెప్టెంబర్ 2024, ఆదివారం

సుందోపసుందులు - కొట్టులో ఒక సాయంత్రము (మా ప్రాజక్టు రిపోర్టు కష్టాలు)

సగం 2011 లో వ్రాసి, ఇవాళ పూర్తి చేసిన పోస్టు ----

ఐదు నెల్లక్రితం పెద్ద బజారులో ఒక ఫేమస్ కంగన్ హాల్ కొట్టులోకి అడుగుపెట్టాను. ఈ మధ్యన పెళ్ళిళ్ళ పనులతో (నావి కాదు, అన్నయ్యది, మిత్రులవి, కజిన్స్‌వి) ఈ కొట్టుకి తెగ తిరుగుతున్నా. గుంటూరులో పెళ్ళికి కావల్సిన అన్ని వస్తువులు దొరికే పట్నంబజారు-లాలాపేటల్లో ప్రసిద్ధిపొందినది ఈ కొట్టు. ఇప్పుడంటే మాల్స్ వచ్చాయిగానీ, పెళ్ళి వస్తువులేకాదు, పిన్నీసునుండి చాపలుదాకా ఆ కొట్టులో దొరకనిదంటూ లేదు. సరే విషయానికొస్తా.

అలా ఆ కొట్టులో అడుపెట్టగానే అక్కడి సూపర్‌వైజర్ నన్ను చూసి నవ్వాడు. నన్ను గుర్తుపట్టాడా? మనం ఈ కొట్టుకొచ్చి ఎనిమిదేళ్ళైపోయిందికదాని సందేహమొచ్చింది. అంత గుబులు ఎందుకయ్యా అంటే కొన్నేళ్ళు వెనక్కిపోవాలి.

******

అవి ఇంజినీరింగు చివరి సంవత్సరం (2003). మాకేమో హైదరాబాదో, విజయవాడో వెళ్ళి ఏదొక ప్రాజెక్టు కొట్టుకొచ్చి (కొని), అక్కడే రిపోర్ట్లు కొట్టేయించుకు రావడం ఇష్టంలేదు. నాలుగు నెలలు కష్టపడి ప్రాజెక్టు ఏదో చేశాం అనిపించాం. ఇపుడు మా శ్రమని ఒక పుస్తకంగా (ప్రాజక్టు రిపోర్టు) అచ్చేయించి మా హెచ్.ఓ.డీ. (ఆవిడకి అంట సీనులేదు, గానీ ప్రాజెక్టుకోసం పిలవకతప్పదు) మొహాన కొట్టడమనే బృహత్కార్యం మిగిలింది.

మాదే మా కళాశాలలో మొదటి బ్యాచ్ కాబట్టి, అప్పట్లో జిల్లాకి నాలుగైదు కాలేజీలు తప్ప ఇప్పటిలా కుప్పలు తెప్పలు లేవుగాబట్టి మాకు ఈవిషయంలో మార్గదర్శనం చేసేవాళ్ళు కనపడలే. మా లెక్చరర్ల్నడగాలంటే వాళ్ళకి ఈ వివరాలు పెద్దాగా తెలీదని అర్థమైపోయింది. అంతా తమిళనాడు, కర్ణాటకల్లో ఏదోకటి చేసొచ్చినోళ్ళు, లేడా హైదరాబాదులో కొనుక్కొచ్చినవాళ్ళు.

సరేనని గుంటూర్లో ఉన్న నేనూ, విజయ్ (పేరు మార్చాను) స్వయంకృషి మొదలుపెట్టాం. మేమిద్దరం రెండు వేరువేరు ప్రాజక్టు బ్యాచీలకి నాయకులం. నలుగురు విద్యార్థులను ఒక బ్యాచీ చేస్తారు. ఇక రంగంలో దిగి వివరాలు కనుక్కుంటే మొత్తం (టైపు చేయడం, ప్రింటు తీయడం, బట్టర్ పేపరుతో మంచి బైడు చేయించడం) కలిపి టోకున చేసేవాళ్ళు దొరికారుగానీ కొంచెం ఎక్కువడిగారనిపించింది. ఛీఛీ - కంపు.సైన్సు విద్యార్థులమై ఆ మాత్రం చేసుకోలేమానిపించింది.

పక్క ఇంజినీరింగు కాలేజి లైబ్రరీ (గ్రంథాలయం)లోకి ఒక రోజు దూరి అక్కడి పాత బ్యాచోళ్ళ రిపోర్ట్లు చూసి, వాటికి మా సొంత పైత్యం జోడించి రిపోర్టు ఎలా ఉండాలనేది నిర్ణయించాం. అదేంటంటే మేమే కంటెంట్ ప్లానింగు, ఫాంట్ల సెలక్షన్లతో సహా టైపు చేసుకుని, మామూలు పుస్తకంలా బైండు చేయించి, అట్ట పైన ఒక డిజైను పేపరు (శుభలేఖలు అచ్చేసేవిలాంటివి) బంగారు (రంగుమాత్రమే🙂) అక్షరాలతో వేయంచి ఒక కవరు తొడగడం.

మేమీ వెతకడాలు, ప్రాజక్టు పనులన్నీ పూర్తి చేసేసరికి రిపోర్ట్లు కాలేజీలో ఇవ్వలిన గడువుకి రెండు రోజులు మాత్రమే మిగిలింది.

మొదటిరోజు పైఅట్టకి కావల్సిన డిజైన్ కాగితంకోసం ఈ కొట్టుకి పోయాం. దేని కోసమని అడీగాడు. మా దగ్గరున్న పాత రిపోర్టు (బట్టరు పేపరు కవరు) చూపించి మా ప్లాను చెప్పాం.

"అరే, ఇవన్నీ ఎందుకండి, మేమే మొత్తం రిపోర్టు చేసిస్తామండి" అన్నాడు. (గోడౌను కథ – వాళ్ళంతవరకూ చేయలేదు, మేమే మొదట).

"అలా కాదులేండీ, మాకు తెలుసు, మేము చేసుకుంటాము, మీరు డిజైను కాగితం ఇస్తే చాలు" అన్నాము.

అలాక్కాదు, మీకు ఇక్కడ ఎవ్వరూ గోల్డులో ప్రింటు చేయరు, కంప్యూటరు ప్రింటింగులో మీకు ఎంబాసింగు రాదు, మాకు ప్రింటింగు ఉన్నది, మేము చేయిస్తాము అన్నారు. అలాగే మాక్కావలసిన డిజైనులో పేపరు కూడా దొరకలేదు, రేపు రండి ఇస్తాము అన్నారు. మేము బుట్టలో పడ్డాము.

ఒక రోజంతా (రాత్రికూడా) కూర్చొని ఎవరింట్లో వారి రెపోర్ట్లను వాళ్ళము టైపు చేసికొన్నాం.

*** గడువు ముందురోజు ***-

ఒక ఫ్లాపీలొ /* అంటే ఏంటని అడగమాకండి :-) */ ప్రాజక్టు వర్డు డాక్యుమెంటును పెట్టుకొని లాలాపేటలో శుభలేఖలు బల్కు-ప్రింటింగు చేసేవాళ్ళ దగ్గరికి పోయాం.

సాయంత్రము రండి అయిపోతుంది అన్నారు.

సాయంత్రము నాలుగింటికి ప్రెస్సుకు వెళ్లాము. అప్పట్లో మాకు బైకులేమీ లేవు. పనుంది అంటే గుంటూరు అంతా, ఇటు ఆటోనగరు నుండి అటు ఏటీ అగ్రహారము, పైన సంగడిగుంట నుండి కింద గుజ్జనగుండ్ల దాకా సైకిళ్ళపైనే తిరిగేవారము.

తెలిసిందే కదా, మనం పక్కనుంటేగానీ పనిచేయరు. అందులో కాలేజీ కుర్రాళ్ళము, లోకువ. సరే పక్కనుండి, గొడవపెట్టుకుని మొత్తాని ఇంకో గంటలో ప్రింటింగు అయ్యింది. ఆ ప్రింటవుట్లు పట్టుకుని బైండింగు షాపులో ఇచ్చి, కొంగు కొట్టుకు పోయాము.

మీవి ప్రింటింగు అవుతుంది, ఇంకో గంటలో వస్తాయి అన్నాడు. మేము మళ్లీ ఎక్కడికి పోతాము, ఇక్కడే ఉంటాము అన్నాము.

గంటయినా కవరు పేజీలు రావే. షాపువాడేమో మీరిక్కడ అడ్డముగా ఉన్నారు, మా బిజినేసుకు అడ్డము అంటాడు. మేమేమో రేప్పొద్దున ప్రాజక్టు రిపోర్టు సబ్మిటు చేయాలి. మీరిస్తే మేము ఇంకా బైండింగు చేయించుకోవాలి. మాకు వేరే పనేమీలేదు, మీరిస్తే పోతాము అంటాము.

ఈలోపు ఏదో సరుకు వస్తే లోపల పెట్టడానికి సాయం చేశాము.🥴

ఏడున్నరయ్యింది. ఇలాకాదు, మీ ప్రింటింగు ప్రెస్సు ఎక్కడో చెప్పండి, మేము పోతాము అని చెప్పాము. ఈలోపు పొద్దుననగా పోయి ఇంకా ఇంటికి రాలేదు అని వెతుక్కుంటూ బెస్ట్ ఫ్రెండ్ అంజి కొట్టుకి వచ్చాడు (సెల్ఫోన్లు లేని రోజులు).

కాసేపు నసిగాక అడ్రసు చెప్పాడు, ఎక్కడో సంగడిగుంటలో ఏదో లైనులో.

విజయ్ ను షాపులో పెట్టి నేనూ, అంజి ప్రింటింగు ప్రెస్సుకు సైకిళ్ళేసుకుని పోయాము. అప్పట్లో అది ఊరి బయటే. వీథిలైట్లులేని, కుక్కలు తిరుగుతున్న భయానక కాలనీ. వెతుక్కుంటూ, ఆ ప్రెస్సుకు పోయాము. పోయి చూస్తే అప్పటికి మా పని ఇంకా మొదలుపెట్టలేదు. మాకన్నాముందు వేరేవి ఉన్నాయి అంటాడు. ముందు బ్రతిమలాడాము, తర్వాత వాదించాము, ఆ తర్వాత బెదిరించాము. నువ్వు ఇవ్వనిది, నువ్వు కదలవూ, మేము కదలము అన్నాము.

ఇలా కాదని ఆ ప్లెస్సునుండీ షాపు ల్యాండులైనుకి ఫోను చేయించి, మావాడికి విషయం చెప్పాము. వాడు కొట్టు శేటు చేత చెప్పించాడు. చివరికి పని మొదలుపెట్టించి (స్క్రీను ప్రింటింగు పెద్ద పని - ముందు అక్షరాలు స్టెన్సిలుతో వరసపెట్టుకుని, లోగోతో సహా ఒక టెంప్లేటు చేసి, ప్రింటు తీయాలి, అందులో ఒక్కో ప్రింటుపైన ఒక్కో టీంమేటు పేరుండాలి) చేయించేసరికి తొమ్మిది దాటింది.

ఈలోపు కొట్టులో మా విజయికి ఇంకో టైపు అనుభవాలు. ఆ గుమాస్తా మావాడిని ఇంజనీరింగు స్టూడెంటు అని బిల్లింగు దగ్గర టోటల్స్ లెక్క కట్టడానికి కాసేపు వాడుకున్నాడు. ఇంకాసేపు ఫ్యాన్సీ వస్తువులు అమ్మే కౌంటరులో కూర్చోబెట్టి టిఫిను, టీకి పోయాడు.

అలా తొమ్మిదిన్నరకు వచ్చి ప్రింటింగు చేసిన డిజైను కవర్లు చూపించాము. ఆ షాపు ఓనరు ఆశ్చర్యపోయాడు - కళ్లల్లో కొత్త బిజినెసు ఐడియా కనిపించింది - మరి అన్నీ వాళ్ల చేతుల్లో ఉన్నవే - డిజైను పేపరు, ప్రింటింగు, కవర్లు, అన్నీ.

ఆ తొమ్మిదిన్నరకు అవన్నీ పట్టుకుని బైండింగు షాపుకు పోయాము. మావి బైండింగు ఇంకా అవ్వలేదు. అక్కడే పదిదాకా కూర్చుని, అయ్యాక, వాటికి కవరు పేజీలు అంటించి, ఇంటికి తీసుకపోయాము. ఆరబెట్టి, పొద్దున్నే లేచి, వాటిని మళ్ళీ ఇంకో బైండింగు షాపులో కట్ చేయించి, కవర్లు తొడిగి మధ్యాహ్నానికి కాలేజికి పోయి సబ్మిట్ చేశాము.

అలా ఆ షాపువాడికి మేమిద్దరం బాగా నోటు అయ్యామన్నమాట. తిరిగి ప్రస్తుతానికి, అంటే 2011లో పోయినపుడు, ఓనరు గుర్తు పట్టలేదుగానీ, గుమాస్తా బాగా గుర్తుపట్టాడు. దేజావూ...😁😁😁


22, సెప్టెంబర్ 2024, ఆదివారం

డైరీ డే

 నిన్న (సెప్టెంబరు 21) డైరీ (దినచర్య) డే అంట. ఫేస్బుక్ మిత్రుల పోస్టులతో తెలిసింది. ఇంజనీరింగులో (2001) ఒక పది రోజులు వ్రాసినా, పూర్తి అయ్యాక గేట్ కోచింగుకు పోయి ఒంటరిగా రూములో ఉన్న రోజుల్లో (2003) తరచుగా డైరీ వ్రాయడము మొదలుపెట్టా. బ్రహ్మచారిగా ఉన్నన్ని రోజులూ వ్రాశాను.

శనివారం వారాంతము సెలవు కావడముతో గుర్తుకు వచ్చి ఆ పాత డైరీలు అన్నీ తీసి ముందేసుకుని కూర్చున్నా - ఎపుడో 20 ఏళ్ళ కిందటి ఆలోచనలూ, అప్పటి అనుభవాలూ, అప్పటి ఫిలాసఫీలూ ఇప్పుడు నెమరేసుకుంటే భలే అనిపించింది.


గేటు కోచింగు సమయములో పీజీనా, ఉద్యోగమా, ఏదోకటి సాధించాలి - ఇలా కొంత స్ట్రెస్ ఫీలయ్యేవాడిని. జాబులో చేరాక గొడవలు, తమిళ రూమ్ మేట్లతో సమస్యలూ, డెవలప్మెంటు నుండి తీసి డొక్కు మెయింటెనెన్సు ప్రాజక్టులో వేసినపుడు పడ్డ నిరాశలూ, చికాకులూ, అమెరికాలో క్లయింట్ల దగ్గర ఎదురైన ఛాలెంజీలూ… .

అన్నీ నెగటివ్లే కాదు - మొదటి జీతము అందుకున్న రోజూ, పొదుపు చేసుకున్న డబ్బులతో బైకు కొన్న రోజూ (2006), అమెరికా పోయిన రోజూ, మొదటి ప్రమోషను వచ్చిన రోజూ - ఇలా చాలా మధురానుభూతులూ…

15-30 వయసులో ఉండే టీనేజీ, యువకులకు డైరీ వ్రాసుకోమని సలహా. మీ అనుభవాలూ, అనుభూతులనూ రికార్డు చేసుకోండి.

ఇలా డైరీ జ్ఞాపకాలన్నీ చదివి రాత్రికి ఫేస్బుక్ తెరవగానే ఇంకో మిత్రుడు సాఫ్టువేరు ఉద్యోగాలలో స్ట్రెస్ గురించి వ్రాసిన అద్భుతమైన పోస్టు కనిపించింది. 22-27 ఏళ్ళ మధ్యన నా మొదటి ఐదేళ్ళ కెరియరులో నేను అనుభవించిన స్ట్రెస్, చూసిన రాజకీయాలూ, మోసాలూ, ఎలా ఎదుర్కున్నాను, అన్నీ రీలు తిరిగాయి. ఏ రంగమైనా ధైర్యముగా నిలబడితేనే ఎదగకపోయినా, కుంగిపోకుండా ముందుకు పోగలము.


19, ఏప్రిల్ 2024, శుక్రవారం

20 ఇయర్స్ ఇండస్ట్రీ - పార్ట్ 3

 *** 20 ఇయర్స్ ఇండస్ట్రీ - పార్ట్ 3 ***

ఐటీలో ఇరవై ఏళ్లు ఏం చేశాను అంటే స్వదేశ్ షారూఖ్ లాగా పెద్ద నాసా ప్రోగ్రాములు వ్రాయలేదు. కనీసం ప్రజలు వాడే బ్యాంకు యాప్ లాంటివి చేయలేదు. అలాగనీ పదహారు ఏళ్లు  అందరూ బాడీ షాపింగు అని చిన్నచూపు చూసే సర్వీసు కంపెనీలో చేశాను కదాని అన్నీ చిల్లర ప్రాజక్టులు చేయలేదు.

ముందు భాగములో చెప్పినట్టు వైవిధ్యత, నవ్యత ఉన్న పని చేసే అవకాశాలు లభించాయి - అది డొమైన్ అయినాగానీ, టెక్నాలజీ అయినాగానీ -  పేరుకు బ్యాంకింగ్ - ఇన్సూరెన్స్ - లైఫ్ సైన్సెస్ డొమైను అయినా  - మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు, గవర్నెన్స్, రిస్క్, కంప్లయన్స్, లోన్ ట్రాకింగు, స్పెషాలిటి ఇన్సూరెన్స్, బాండ్స్, స్పెషాలిటీ ఫార్మా, ఇన్ఫూజన్ - ఇలా వైవిధ్యమైన కొత్త రకమైన ఏరియాలలో పని చేశాను.

కాలేజీలో (1999-2003) ఉన్న రోజుల్లో మాకు విజువల్ బేసిక్, విజువల్ సీ++ మాత్రమే ఉండేవి. డాట్‌నెట్ 1.0 ఇంకా అంత ప్రాచుర్యం పొందలేదు. ఒక మిత్రుడు హైదరాబాదు నుండి మైక్రోసాఫ్టు ప్రెస్ పుస్తకం తీసుకువస్తే  డాట్‌నెట్ 1.0 (విజువల్ స్టూడియో 2002) కొంత నేర్చుకున్నా.

2004లో ఉద్యోగంలో చేరాక నా మొదటి ప్రాజక్టులో డాట్‌నెట్ 1.0 (విజువల్ స్టూడియో 2002) , డాట్‌నెట్ 1.1 (విజువల్ స్టూడియో 2003) మీద పని చేశా. ఇందులో కంటెంటు మేనేజిమెంటు కూడా ఉంది. ఆ ప్రాజక్టు ఒక అమెరికా టాప్ 1 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీకి వెబ్సైటు. ఊరికి పోయి ఫ్రెండ్సుకి, నాన్నకి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరులో వెబ్సైటు తెరిచి మనం డెవలప్ చేసిన వెబ్‌పేజీలు చూపించడం (2004లో) - ఆ అనుభవం నభూతో నభవిష్యత్. ఈ ప్రాజక్టుకోసం AMFI (Association of Mutual Funds in India ) సర్టిఫికేషను చేశాను.

2005లో డాట్‌నెట్ 2.0 (విజువల్ స్టూడియో 2005)లో ఒక అమెరికా టాప్ 3 బ్రోకరేజి సంస్థకు ఒక పేమెంటు సిస్టం ప్రాజక్టుపని చేశా. ఇక్కడ SQL Server 2000 ఉంది.

2005లోనే లక్ష మంది ఉద్యోగులున్న మా సంస్థలో పెద్ద తలకాయలు (CXO, ఎస్వీపీలు) పోటీదారుల సమాచారాన్ని చూసే ఒక డ్యాష్ బోర్డుకు డిజైన్, ఆర్కిటెక్చరు చేశాను. అపుడు నాకూ, ఇంటర్నల్ అప్లికేషను టీమ్ ఆర్కిటెక్టుకు ఒక డేటాబేస్ టేబుల్ డిజైనుపై తేడాలు వచ్చాయి. జూనియర్ అయిన నా డిజైను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని తీసుకోలేదు. నేను వేరే ప్రాజక్టుకు పోయాను. ఒక రెండు నెలల తరువాత పర్ఫార్మెన్స్ ఇష్యూలు వచ్చి మళ్లీ నా డిజైనుకు మారారు.

2007లో ఒక అమెరికా టాప్ 3 ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు సంస్థకు రెండు మూడు రిపోర్టింగు అప్లికేషన్లు, క్యాలండర్ స్కెడ్యూలర్ తయారు చేశాం. ఇందులో Oracle 10g డేటాబేస్. నేనే ప్రాజక్టు లీడ్, ఆర్కిటెక్ట్ - ఎస్టిమేషన్, ప్రాజక్ట్ మేనేజ్మెంట్ నాదే.

2008లో అదే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు సంస్థకు ఒక డాట్‌నెట్ అప్లికేషన్ (డాట్‌నెట్ 2.0 (విజువల్ స్టూడియో 2005), క్లాసిక్ ఏఎస్‌పీ, సైబేస్) సపోర్టు, ఎన్హాన్స్‌మెంట్లు చేశాము. ఈ అప్లికేషనును ఆ సంస్థ సబ్సిడియరీలు అయిన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు, బ్రోకరేజి, పర్సనల్ ఇన్వెస్టింగు, బిజినెస్ ఇన్వెస్టింగు, ఇంకా చాలామంది వాడేవారు. ఈ అప్లికేషను రిపోర్టులు ఆ సబ్సిడియరీల CxOలు, ప్రెసిడెంట్లు వాడేవారు. దీనికోసం నేను అమెరికా వెళ్ళాను. అప్పుడప్పుడు వారితో మాట్లాడేవాడిని. రెండు మూడు సార్లు వారి ట్రేడింగు ఫ్లోరుకి కూడా వెళ్ళాను రిక్వైరుమెంట్లు తీసుకోవడానికి. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు, ట్రేడింగు గురించి చాలా నేర్చుకున్నా.

ఇదే ట్రేడింగు ఫ్లోరు -

2010-12 ల మధ్యన GRC (Governance, Risk & Compliance) లో ఒక ప్రోడక్టుకు సపోర్టు, కష్టమైజేషన్ చేశా. డాట్‌నెట్ 2.0 (విజువల్ స్టూడియో 2005) డాట్‌నెట్ 3.5 (విజువల్ స్టూడియో 2008), సైబేస్, ఓరకిల్, SQL సర్వరు, డాక్యుమెంటం - ఇలా అన్నీ ఉన్నాయి. ఇందులో రిస్కు ప్రొసీడ్యరు, పాలసీలు, కంప్లయన్సు ఎందుకు, మనీ లాండరింగు (AML), ఇలా చాలా తెలుసుకున్నా. ఆ ప్రాడక్టు సేల్స్ మేనేజరు, మా క్లయింటు వీపీలే నన్ను సీఫుడ్ రెస్టారెంటుకు లంచ్ తీసుకుపోయేవారు.🙂

2013-14 ల మధ్యన ఒక పెద్ద అమెరికా బ్యాంకుకు చెందిన ఒక ఇన్సూరెన్స్ సబ్సిడియరీకి ఒక ఇన్సూరెన్స్ ట్రాకింగు అప్లికేషనుకు టెక్నికల్ మేనేజరుగా చేశా. అమెరికాలో హోం లోను తీసుకునే ప్రతి ఇంటికి బీమా తప్పనిసరి. కానీ చాలా మంది రెండవ సంవత్సరం నుండి బీమా ఎగ్గొడతారు. మా అప్లికేషను రోజూ బ్యాంకులనుండి కొన్ని లక్షల లోను డేటా, బీమా సంస్థలనుండి లక్షల బీమా డేటా తెచ్చి ట్యాలి చేస్తుంది. తేడాలున్నవారికి ఫోన్లు చేయడం, లెటర్లు పంపించడం చేసి బలవంతాన బీమా అంటగడతారు. డాట్‌నెట్ 3.5, 4.x (విజువల్ స్టూడియో 2008, 2010, 2012) వాడేవారం. సపోర్టు, మైనరు ఎన్హాన్సుమెంట్లు, ఫుల్ ఫ్రం స్క్రాచ్ డెవలప్మెంటు ఉండేది. నాకు 45 మంది రిపోర్టు చేసేవారు.

ఆ ప్రాజక్టు మేనేజ్మంటు విసుగుపుట్టిన సమయంలో 2014లో అమెరికాలో టాప్ బీమా సంస్థకి ఆర్కిటక్టుగా ప్రాజక్టు వచ్చింది. ఇది మామూలు వ్యక్తిగత, ఆస్తి (Property & Casualty) బీమా కాదు, వాహన (Auto) బీమా కాదు. స్పెషాలిటీ బీమా - అంటే ఒక కంపెనీ డైరెక్టర్లు, సీఈఓలు కిడ్నాపుకు గురయితే? ఒక వైద్యుడిపై ఎవరన్నా కేసు పెడితే? ఒక ఆర్టిస్టుపై కాపీరైటు కేసు వస్తే? ఐడీ ఫ్రాడు? ఇలాంటివాటికి బీమా ఇస్తుంది మా క్లయింటు. వైవిధ్యమైన టెక్నాలజీలున్న చాలా అప్లికేషన్లున్నాయి. అన్నింటినీ ఎసెస్ చేసి, వాటిని క్లౌడు (PCF, AWS, Azure) , Containerization (Docker) లలోకి మార్చడానికి స్ట్రాటజీ, ఆర్కిటెక్చరు చేశాము. డాట్‌నెట్‌ 4.x, కోర్ (విజువల్ స్టూడియో 2015, 2017, 2019) వాడాను.

2016 నుండి 2020 దాకా ఎమర్జింగ్ టెక్నాలజీ టీమ్లో పని చేశాను. అంటే కొత్త కొత్త టెక్నాలజీలు, ప్రోడక్టులు ట్రై చేసి, పీఒసీలు చేసి బిజినెస్ కు రికమెండ్ చేయాలి. 2016లోనే మైక్రో సర్వీసెస్, క్లౌడ్ చేశాము, 2017లో నోకోడ్ ప్లాట్ఫాములు, 2018లో ఒక కోడ్ అనలైజరు, జెన్కిన్స్ - యూసీడీ - డాకర్ వాడి సీఐ-సీడీ పైప్లైన్, 2019లో ఒక చాట్ బాట్ - ఇలా అన్నీ ఒక స్టెప్ ముందరే.

2020లో ఒక చిన్న సంస్థకి (టైటానిక్ నుంచి లాంచీకి) మారాను. ఇక్కడ 5-6 డొమైన్ల క్లయింట్లకు సంబంధించిన ప్రాజక్టులు సమీక్ష చేశాను, 2-3 క్లయింట్లు ఇచ్చారు.

2021లో ఫార్మాసీలకు ప్రొడక్టు తయారు చేసే ఒక అమెరికా కంపెనీలో చేరాను. హెల్త్‌కేరు, ఫార్మా డొమైను గురించి నేర్చుకుంటున్నా. ఇక్కడ జీసీపీ, పీసీఎఫ్, అజూర్ పై పని చేశాను.

అలా బ్యాంకింగు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు, రిస్కు, గవర్నన్సు, కంప్లయన్సు, బ్రోకరేజి, ఇన్సూరెన్స్ ట్రాకింగు, స్పెషాలిటీ బీమా, ఇన్సూరెన్సు,హెల్త్‌కేరు, ఫార్మా డొమైన్లలో పని చేశాను, నేర్చుకున్నా.

క్లాసిక్ ASP, VB6, .Net 1.0, 1.1, 2.0, 3.5, 4 to .Net 4.x & Core - VS, VS Interdev to VS 2002, 2003, 2005, 2008, 2010, 2013, 2015, 2017, 2019, 2020, 2022, Visual Code, AWS, Azure, PCF, Kubernetes - ఇలా పేరుకు డాట్‌నెట్‌ అయినా 20 ఏళ్ళుగా చాలా వర్షన్లు నేర్చుకోవాలిసి వచ్చింది. అజూర్, ఎడబ్ల్యూ ఎస్, జీసీపీ, పీసీఎఫ్ - అన్ని క్లౌడు నేర్చుకున్నా.

కానీ ప్రోగ్రామింగు, కోడింగు, ఎనాలిసిస్ మారవు. కేవలం సింటాక్సులు, టూల్స్ మారుతాయి.


ఇపుడు ఫుల్ స్టాక్ డెవలపర్లు అని ప్రత్యేకముగా అంటున్నారు గానీ ఆ రోజుల్లో మేమే ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్టు, డాట్ నెట్ కోడ్, స్టోర్డ్ ప్రోసీజర్లు వ్రాశాము. సీఐ/సీడీ లేని రోజుల్లో ప్రోడక్షన్లో కోడ్ డిప్లాయ్ చేశాను.


డెవలపరుగా, లీడ్ గా, ప్రాజక్టు మేనేజరుగా, ఆర్కిటెక్టుగా, ఇండివిడ్యుయల్ కాంట్రిబ్యూటరుగా,  - అన్ని పాత్రలు చేశాను.

డెవలప్మెంట్, ప్రోడక్షన్ సపోర్టు, కన్సల్టింగు, మెయింటేనెన్సు, ప్రోడక్టు డెవలప్మెంట్ - అన్ని రకాల ప్రాజక్టులు చేశాను. 

కాకుంటే చెప్పుకోదగ్గ స్కేలులో ఏమీ చేయలేదు. పెద్ద అవార్డులూ- రివార్డులూ లేవు. ఎందుకో నేనే మొదటి పదేళ్లలో చేసినంత ఫుల్ పొటెన్షియల్‌తో రెండో దశకంలో చేయలేదు అనుకుంటాను.


20 ఇయర్స్ ఇండస్ట్రీ - పార్ట్ 2

*** 20 ఇయర్స్ ఇండస్ట్రీ - పార్ట్ 2 ***

నేటికి నా ఉద్యోగ జీవితం మొదలుపెట్టి 20 సంవత్సరాలు. అపుడే రెండు దశాబ్దాలు అయిపోయినాయా అనిపిస్తుంది. ఇరవయ్యేళ్లు చేశామా, ఇంకెన్నాళ్లు ఈ టెన్షన్లు అని కూడా అనిపిస్తుంది, ఐటీ కెరీరు కదా. 🙂

మరి  ఎందుకు  ఎన్నుకున్నావు? ఐటీ కాకుండా ఇంకేదన్నా ఎందుకు చేసుకోలేదు. ఆ బ్యాంకు జాబ్ చేరి ఉంటే బాగుండేది అనుకున్నావా? 

అంటే నో రిగ్రెట్స్, ప్రోగ్రామింగు జాబ్ కావాలని కోరుకున్నాను, ఇప్పటికీ ఐటీ ఉద్యోగమే ముద్దు. ఎందుకంటే ఇందులో ఓ వైవిధ్యత (వేరీడ్ వర్క్), నవ్యత (నావెల్టీ), ఇంకా చెప్పాలి అంటే ఒక రవితేజ కిక్కులాంటిది ఉంటుంది.

- మూడురోజుల నుండి నలుగురు డెవలపర్లకు అంతు చిక్కని బగ్గును, మీరు పాత్‌లో _ బదులు - పెట్టారు అని పది నిమిషాలలో సాల్వ్ చేస్తే వచ్చే కిక్!

- మూడు నిమిషాలు తీసుకునే సర్వీసును మూడు సెకన్లలో రెస్పాన్స్ తెప్పిస్తే వచ్చే కిక్!

- పది సెకన్లు తీసుకునే ఇరవై టేబుల్స్ జాయిన్ చేసి ఉన్న్ డేటాబేస్ సీక్వెల్ క్వెరీని వంద మిల్లీ సెకన్లకు కుదిస్తే వచ్చే కిక్!

- అమెరికా బోస్టను మెట్రో స్టేషనులో ప్లాట్ఫాంపై ల్యాప్టాప్ తెరచి ఫెయిలవుతున్న రిపోర్టు జాబులను ఫిక్స్ చేస్తే వచ్చే కిక్!

- మూడేళ్ల నుండీ అప్లికేషనులో ఉన్న సమస్యలకు కన్సల్టెంట్ ఆర్కిటెక్టుగా వెళ్లి నెలలో బయటపెట్టి సొల్యూషన్ చెప్తే వచ్చే కిక్!

- ఆదివారం రాత్రి ఆర్టీసి బస్సులో రాజమండ్రి నుండి హైదరాబాదు వస్తూ పాత ప్రాజక్టు మేనేజరు ఏదో బగ్ కోసం ఫోను చేస్తే ఎపుడో ఏడాది కిందట వదిలేసిన ప్రాజక్టులో కోడ్ ఫైల్స్, ఫంక్షను పేర్లతో సహా చెప్పి ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేసినపుడు వచ్చే కిక్!

- డిబగ్గర్, ‌డెవ్ టూల్స్ లేని 19 ఏళ్ల కిందటి రోజులలో ఇంటర్నట్ ఎక్స్ ప్లోరరులో వెబ్ పేజి స్క్రిప్టు బ్రేక్ అయ్యి వస్తున్న ఎర్రర్ ను నోట్ ప్యాడ్లో రెండు వేల లైన్ల క్లాసిక్ ఏఎస్పీ - జావాస్క్రిప్టు మిక్స్ అయిన కోడులో వెతికి పట్టుకుని ఫిక్స్ చేసిన రోజున వచ్చిన కిక్!

- సాయంత్రం ఇంటికి రాగానే, అప్లికేషనులో రిపోర్టులు ఫెయిల్ అయ్యి ఎస్కలేట్ అవుతున్న తరుణంలో ఫోను వస్తే అది ఇంటిజరుగా డిక్లేరు చేసిన ప్రాసెస్ ఐడీ 32768 దాటటం వలన వచ్చిన సమస్య అని ఫోనులో చెప్పి ఫిక్స్ అయితే వచ్చిన కిక్!

ఇలా ప్రతి నెలా కనీసం ఒక కిక్ ఉంటుంది. ఫుట్బాల్ కిక్కులు, నడ్డిమీద పడే కిక్కులు కూడా ఉంటాయనుకోండి. ఈ సందర్భములో అవి వద్దు!

ఐటీలాగా  ఇన్నేళ్లపాటు, ఇలా కన్టిన్యుయస్ గా కిక్ ఇచ్చే కెరీయర్లు తక్కువ!